బీడులో కురిసిన చిరునగవులు

విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మీదుగా కృష్ణదేవిపేట దాటాక, కొండల మధ్యకు చేరగానే సెల్‌ఫోన్ సిగ్నల్ మాయమైంది. పట్టరాని సంతోషంతో చేతిలోని ‘మాటల మాయావి’ని బ్యాగులో పడేసి, ఘాట్‌రోడ్డు మలుపుల్ని ఆస్వాదించడం ఆరంభించాను. లోయల్లోంచి కొండలపైకి పెరిగిన వృక్షాలు, వాటిపై కోతులు, కొండముచ్చుల విన్యాసాలు, రివ్వున శూన్యంలోకి దూసుకుపోయి అంతే వేగంతో యూటర్న్ తీసుకుంటున్న పక్షులు, కొండల మీంచి కిందికి దూకుతున్న జలపాతాలు… ప్రాకృతిక సౌందర్యాన్ని కళ్లల్లోకి పిండుకుంటూ ఘాట్ దాటాం. గుంతల రహదారి మొదలైంది. దానికి రెండువైపులా భారీ జీడిమామిడి వృక్షాలు.

కొయ్యూరు చేరుకున్నాం. అదో మండల కేంద్రం. ఆదివాసీలు అధికంగా నివసించే ప్రాంతం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘నాబార్డు’ 75 శాతం ఆర్థిక సహకారంతో, 25 శాతం రామ్‌కీ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో 500 ఎకరాల్లో పండ్లతోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన సందర్భం అది. అక్కడి ఆదివాసీలకు ప్రభుత్వం అసైన్డ్ భూమిని కేటాయించింది గానీ, ఆ భూమిలో 70 శాతం తుప్పలు, రాళ్లూ రప్పలతో ఉండటంతో రైతులు కనీసం దున్నే సాహసం చేయలేదు.

ఇప్పుడీ ప్రాజెక్టు కారణంగా 500 మంది రైతులు ఆ పనికి పూనుకున్నారు. ఆ నేలలో బాగా పండే మామిడి, జీడిమామిడి మొక్కల పెంపకం మొదలైంది. మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఆ 500 ఎకరాలను సిద్ధం చేసుకోవడానికి ఆ రైతులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. మొక్కలు నాటాక, జంతువుల బారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి మొక్క చుట్టూ ట్రీ గార్డులు ఏర్పాటు చేసుకున్నారు. పొలం చుట్టూ సంప్రదాయ రక్షణ వలయం నిర్మించుకున్నారు.

సమయానికి వానలు కురవనప్పుడు దూరంగా ఉన్న కుంటలు, చెరువుల నుంచి నీటిని మోసుకొచ్చి మొక్కల దాహం తీర్చారు. అడ్డదిడ్డంగా పెరిగిపోతున్న కలుపును, పిచ్చిమొక్కల్ని అదుపులో ఉంచడానికి శ్రమించారు. వీలైనంతవరకూ విషరసాయనాలు వాడకుండా జీవామృతం, వేపకషాయం వంటి ద్రవాలతో చీడపీడల్ని అరికట్టేందుకు చెమటోడ్చారు. ప్రాజెక్టు ప్రణాళికలో భాగంగా వేసిన బోర్లు, తవ్విన కుంటలు, పొలాల్లో వెలిసిన విద్యుత్ స్తంభాలు వారికి అండగా నిలిచాయి.

మూడేళ్లు గడిచాయి. మొక్కలు చెట్లయ్యాయి. జీడిమామిడి, మామిడి కాయలు కనువిందు చేశాయి. కోతలు మొదలయ్యాయి. గిరిజన రైతులే సభ్యులుగా ఏర్పాటు చేసుకున్న ‘ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ’ ద్వారా గిట్టుబాటు ధరకు ఫలాలను అమ్ముకున్నారు. ఆ భూమిపుత్రుల వదనాల్లో సంతోషం చూడటం ఓ అదృష్టం.

ఈ ప్రాజెక్టు పనులు మొదలైన మరుసటేడు మరో 500 ఎకరాలు, ఆ పైయేడు ఇంకో 500 ఎకరాలు… 1500 ఆదివాసీ కుటుంబాలు… 1500 ఎకరాల్లో ఫలాలు! ఇదంతా కేవలం సంస్థలు మాత్రమే సాధించిన విజయం ముమ్మాటికీ కాదు. ఇప్పుడా ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ ‘క్యాషూ ప్రాసెసింగ్ యూనిట్’ ఏర్పాటు చేసుకోవడానికి రైతులు కసరత్తు చేస్తున్నారు.

ప్రాథమికంగా ఆదివాసీలు ప్రకృతి ప్రేమికులు. మట్టికీ, మొక్కకీ ఉండే అవినాభావ సంబంధంలోని రహస్యాన్ని పసిగట్టిన మనుషులు. సహజ వనరుల్ని సంరక్షించుకోవడమే దేశభక్తిగా భావించే భారతీయులు.

పదహారేళ్ల క్రితం తొలిసారి కర్నూలు జిల్లాలో ఇదే తరహా ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు మొదటి దశలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చైతన్య శిబిరాలు నిర్వహించడానికి వెళ్లిన మా సిబ్బందిని విల్లంబులతో బెదిరించారు. తమ భూముల్లో పండ్ల మొక్కలు నాటడానికి వీల్లేదన్నారు. ఒకటికి నాలుగుసార్లు కలిసి, కార్యక్రమం వివరాలు తెలియజెప్పాక ఒప్పుకున్నారు. అక్కడ వెయ్యి ఎకరాలతో ఈ యజ్ఞం మొదలైంది.

ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని మూడు జిల్లాల్లో మూడు ప్రాజెక్టుల పరిధిలో మరో వెయ్యిన్నర ఎకరాల్లో పండ్ల తోటలు వెలిశాయి. తెలంగాణలోని వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లోనూ ప్రకృతి ప్రేమికులు ఈ యజ్ఞంలో స్వేదం చిందించారు.

మొత్తంగా, మూడు రాష్ట్రాల్లో వందకు పైగా గ్రామాల పరిధిలో సుమారు 5000 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి జరిగిందీ అంటే… అది కేవలం ఆదివాసీ రైతుల శ్రమఫలితమే. వారి అకుంఠిత దీక్షాఫలమే. ప్రకృతిని పచ్చని తోరణాలతో అలంకరించడంతో పాటు, మట్టిని మౌలిక పదార్థంగా మార్చడం, భూమిని సారవంతమైన సంపదగా సంరక్షించడం, అంతిమంగా పర్యావరణానికి నిరంతరం పహారా కాసే పోలీసుల్లా శ్రమించడం వారి తత్వం.

నగరాల్లో గాలి చొరబడని పిచ్చుకగూళ్లలా కాకుండా… కొండజనం విశాలమైన స్థలంలో ఓ మూల చిన్న ఇంటిని నిర్మించుకుని, పెరటితోటలతో కాపురం సాగిస్తుంటారు. సెలవుల్లో సేదదీరడానికి నగరవాసులు పనిగట్టుకుని మరీ వెళ్లే ఫామ్‌హౌసులు ఈ ప్రాంతాలన్నిటా ఉచితంగా దర్శనమిస్తాయి.

తరతరాల వారసత్వంగా వస్తున్న సాంస్కృతిక చైతన్యం, కష్టపడే తత్వం, అంకితభావంతో కూడిన కట్టుబాటు, సాధించాలన్న తపన… ఇవన్నీ ఆదివాసీల ఆస్తులు. అందుకే, వాళ్లు ఎప్పుడూ సంతృప్తి అనే ఐశ్వర్యంతో తులతూగుతుంటారు.

*

ఎమ్వీ రామిరెడ్డి

పూర్తి పేరు మువ్వా వెంకటరామిరెడ్డి. పుట్టిందీ పెరిగిందీ గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామం (ప్రస్తుతం అమరావతిలో భాగం). రామ్‌కీ ఫౌండేషన్ అధ్యక్షుడిగా విధి నిర్వహణ. బిందువు, మనిషి జాడ, అజరామరం, అనిర్వచనం కవితాసంపుటాలు; వెన్నలో లావా, వెంట వచ్చునది, స్పర్శవేది కథాసంపుటాలు; విస్తార, ప్రస్తార వ్యాససంపుటాల ప్రచురణ. ఈ పుస్తకాలకు వివిధ సంస్థల నుంచి పాతికపైగా అవార్డులు.
తండ్రి స్మారకార్థం ‘మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్’ స్థాపించి; పెద్దల కోసం వృద్ధాలయం, నిరుద్యోగ యువతకోసం స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. పెద్దలు, పిల్లల సౌకర్యార్థం ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు. అడపాదడపా సాహిత్య కార్యక్రమాల నిర్వహణ. ట్రస్టు తరఫున ఇప్పటిదాకా 16 పుస్తకాల ప్రచురణ.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.