చదువు చూపించిన వెలుగు దారిలో….

ఈ రోజు నేను కూర్చున్న కుర్చీని చూసినప్పుడు నాకు నా ఒక్కరి ప్రయాణం మాత్రమే గుర్తుకు రావడం లేదు. విద్యను అందుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న గిరిజన బాలికలు గుర్తుకొస్తున్నారు.

ప్రియమైన సువర్ణ,

ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నీతో మనసు విప్పి మాట్లాడి. జీవిత ప్రయాణంలో ఎన్నో మజిలీలు దాటాం. ఎన్నో కొత్త పరిచయాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నో విజయాలు మనల్ని పరామర్శించాయి. కానీ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, తన మనసు మూలాల్లో పదిలంగా ఉండిపోయే కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదా! నా విషయంలో అవి మన చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ రోజులు, మనం కన్న కలలు, మన జీవితాల గురించి మనకు మనమే చెప్పుకున్న ఆశలు ఇవన్నీ మనకు తెలియకుండానే గడిచిపోయాయి.

నేను కాన్గి బడిలో చదివిన విషయం నీకు తెలిసిందే. మా తండా నుండి 5, 6 కిలో మీటర్లు సరైన దారిలేక మడికట్ల మీదుగా నడిచి వెళ్ళడం ఎంతకష్టమో నీకు తెలుసు. ఆ కష్టమంతా చదువు మీద ఇష్టంతో నే. ఆ చదువే నా జీవితంలో గొప్ప మలుపు తెచ్చింది.

నా జీవితంలో నాకు లభించిన ఒక గొప్ప అవకాశం, బాధ్యత ప్రతిష్టాత్మకమైన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించడం. వాయిస్ ఛాన్సలర్ గా రెండు సంవత్సరాల కాలం దిగ్విజయంగా పూర్తిచేసిన సందర్భంలో, నా మనసు గతంలోకి ప్రయాణిస్తోంది. ఒక మారుమూల గిరిజన కుటుంబంలో పుట్టి, ఎన్నో పరిమితుల మధ్య పెరిగి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని తొలి మహిళా విశ్వవిద్యాలయానికి, తొలి వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించే స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్ని అనుభవాలు ఉన్నాయో నీతో పంచుకోవాలనిపిస్తోంది.

సువర్ణ! ఈ రోజు నాకు లభించిన హోదాను చూసి చాలామంది ఆశ్చర్యపోవచ్చు. మరికొందరు నా విజయాన్ని ఒక గొప్ప ఘనతగా అభివర్ణించవచ్చు. కానీ ఆ హోదా వెనుక ఉన్న ప్రయాణం నాకు మాత్రమే తెలుసు. ఆ ప్రయాణంలో ఎదురైన కష్టనష్టాలు, సుఖదుఃఖాలు మనసులోనే మౌనంగా దాచుకున్న కన్నీళ్లు, నన్ను నేను ఓదార్చుకున్న క్షణాలు, ఓటమి అంచుల నుంచి మళ్లీ లేచి నిలబడిన సందర్భాలు, ఇవన్నీ నా జీవితంలోని నిశ్శబ్ద అధ్యాయాలు.

నీకు తెలుసు కదా! నేను అత్యంత వెనుకబడిన మారుమూల గిరిజన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన బిడ్డననీ. మా సామాజిక కట్టుబాట్లు, ఆర్థిక పరిస్థితులు నాకు జీవితాన్ని సులభంగా పరిచయం చేయలేదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు ఎన్నో హద్దులను విధిస్తుంది. మనం ఎక్కడ పుట్టాం? మన కుటుంబం ఏమిటి? మన సామాజిక నేపథ్యం ఏమిటి ? అనే ప్రశ్నలే కొన్నిసార్లు మన సామర్థ్యాలను అంచనా వేసే కొలమానాలుగా మారుతాయి. అయితే, నా జీవితంలో విద్య అనేది కేవలం చదువుకోవడానికి ఉన్న మార్గం మాత్రమే కాదు. నా చుట్టూ ఉన్న పరిమితులను అధిగమించడానికి, నన్ను నేను నిరూపించుకోవడానికి, నా సమాజానికి ఒక కొత్త దారిని చూపించడానికి లభించిన అవకాశం.

చదువు నా జీవితానికి వెలుగైంది. ఆ వెలుగే నా ప్రయాణానికి దిశానిర్దేశం చేసింది. మొదటి తరం విద్యార్థినిగా ఉన్న నాకు ఉన్నత విద్య అనేది ఒక వ్యక్తిగత లక్ష్యం మాత్రమే కాదు. అది నా కుటుంబానికి, నా సమాజానికి, నా తరువాతి తరాలకు సంబంధించిన ఒక ఆశ. ఒక ఆశయం కూడా. ఒక మెట్టు ఎక్కిన ప్రతిసారీ నా వెనుక ఇంకా ఎంతో మంది ఆ మెట్టును చేరుకోలేక నిలిచిపోయారనే ఆలోచన నన్ను వెంటాడేది. నేను ఎలాగైనా ముందుకు సాగాలి. నా ప్రయాణం మరొకరికి మార్గం కావాలి అనే భావన నా మనసులో బలంగా నాటుకుపోయింది.

అయితే నాకు చదువు మీద ఉన్న ఆసక్తి, భాష పట్ల ప్రేమ, సాహిత్యం పై ఉన్న అనురక్తి నన్ను తెలుగు సాహిత్యం వైపు నడిపించాయి. ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. అవమానాలను భరించాను. అయినా కూడా నా లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. కసితో చదివాను. పరిశోధన చేశాను. కొత్త విషయాలను నేర్చుకున్నాను. నా జ్ఞానాన్ని మరింత విస్తరించుకోవడానికి నిరంతరం ప్రయత్నించాను.

ఇంటర్ రోజుల్లో….

పెళ్లి కారణంగా చదువు కొన్నాళ్లు ఆగిపోయినా మళ్లీ చదువు కొనసాగించి నిరంతరాయంగా బి.ఎ., ఎం.ఏ., ఎం.ఫిల్., పీహెచ్‌.డి. వంటి విద్యార్హతలను సాధించడం నా జీవితంలో ముఖ్యమైన పరిణామం. కానీ నాకు చదువు అంటే డిగ్రీలను సంపాదించడం మాత్రమే కాదు. మనిషిని మనిషిగా అర్థం చేసుకోవడం, సమాజంలోని అసమానతలను ప్రశ్నించడం, అణగారిన వర్గాల అనుభవాలను అక్షరాల్లో నమోదు చేయడం కూడా విద్యలో భాగమేనని నేను నమ్మాను.

 

1999లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నా వృత్తి జీవితం ప్రారంభమైంది. అధ్యాపకురాలిగా నా ప్రయాణం మొదలైంది. ఆ రోజు నా చేతిలో ఉన్నది ఒక ఉద్యోగావకాశం మాత్రమే కాదు. నా జీవితానికి నేను నిర్మించుకున్న భవిష్యత్తును ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేయడం నాకు ఎన్నో అవకాశాలను అందించింది. అదే సమయంలో, నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. విద్యార్థులకు బోధించడం, పరిశోధన చేయడం, సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, కొత్త ఆలోచనలకు రూపమివ్వడం, ఇవన్నీ నా జీవితంలో విడదీయలేని భాగాలయ్యాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రారంభమైన నా ఉద్యోగజీవితంలో అంచెలంచెలుగా అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, సీనియర్ ప్రొఫెసర్ గా ఎదిగాను. పరిశోధన, బోధనతోపాటు తెలుగు శాఖాధిపతిగా, మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్ పర్సన్ గా, ఇతర విద్యా పరిపాలనా బాధ్యతల్లో పనిచేసే అవకాశం లభించింది. ఈ పదవులన్నీ నాకు ఒక విషయాన్ని నేర్పించాయి. బాధ్యత అనేది హోదాతో పెరగకూడదు. మన ఆలోచనలతో, మన పని పట్ల నిబద్ధతతో పెరగాలి. నాయకత్వం అనేది ఇతరులను నడిపించడం మాత్రమే కాదు. వారి ఎదుగుదలకు అవసరమైన అవకాశాలను సృష్టించడం కూడా. అయితే, నా జీవితంలో నాకు అత్యంత ఆత్మీయమైన స్థానం కలిగిన రంగం సాహిత్యం. ముఖ్యంగా బంజారా జీవితం, వారి భాష, సంస్కృతి, జానపద సంపద, వారి అనుభవాలు నా అధ్యయనంలో ముఖ్యమైన అంశాలు గా నిలిచాయి.

మన సమాజాల చరిత్రల్లో, జానపద కథల్లో, పాటల్లో, ఆచారాల్లో ఎన్నో తరాల అనుభవాలు దాగి ఉంటాయి. కానీ వాటిని నమోదు చేయకపోతే, వాటిని అధ్యయనం చేయకపోతే, భవిష్యత్తు తరాలకు అందించకపోతే, అవి క్రమంగా మరుగునపడిపోయే ప్రమాదం ఉంది. అందుకే బంజారా సాహిత్యంపై పరిశోధన చేయడం నాకు ఒక అకడమిక్ బాధ్యత మాత్రమే కాదు. నా సాంస్కృతిక మూలాలతో నాకు ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరించే మార్గం కూడా. పరిశోధనలు, పుస్తకాలు, వ్యాసాలు, సదస్సులు, ఇవన్నీ నా వృత్తి జీవితంలో భాగమయ్యాయి. నా పరిశోధనల ద్వారా, నా రచనల ద్వారా, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించడం ద్వారా సమాజానికి ఉపయోగపడగలిగితే, అదే నా కృషికి నిజమైన సార్థకత అని భావించాను.

నా జీవితంలో అనేక సార్లు గుర్తింపు పొందిన సందర్భాలు ఉన్నాయి. అనేక పురస్కారాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరూ నా పనిని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే నాకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చేది నా ప్రయాణం మరొకరికి ప్రేరణగా నిలుస్తుందనే ఆలోచన.

పదో తరగతిలో….

సువర్ణా! ఒక గిరిజన కుటుంబంలో పుట్టిన అమ్మాయి విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా ఎదగడం ఒక వ్యక్తిగత విజయం కావచ్చు. అదే అమ్మాయి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌గా, విద్యా పరిపాలకురాలిగా ఎదగడం మరో మజిలీ కావచ్చు. కానీ అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఒక మహిళ రాష్ట్రంలోని తొలి మహిళా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించడం మాత్రం నాకు ఒక వ్యక్తిగత ఘనతకంటే ఎక్కువ. అది ఒక సమాజానికి సంబంధించిన ఆశయం. ఒక ఆడ బిడ్డకు లభించిన విద్యావకాశం ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదో చెప్పే ఉదాహరణ. ఒక మహిళ తన సామర్థ్యాన్ని నమ్ముకుని, నిరంతరం కృషి చేస్తే ఎలాంటి బాధ్యతలను నిర్వర్తించగలదో చూపించే అవకాశం.

ఈ రోజు నేను కూర్చున్న కుర్చీని చూసినప్పుడు నాకు నా ఒక్కరి ప్రయాణం మాత్రమే గుర్తుకు రావడం లేదు. విద్యను అందుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న గిరిజన బాలికలు గుర్తుకొస్తున్నారు. కుటుంబ పరిస్థితుల వల్ల తమ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిన అమ్మాయిలు గుర్తుకొస్తున్నారు. ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లభించక వెనుకబడిపోయిన విద్యార్థినులు గుర్తుకొస్తున్నారు. వారందరి కోసం ఈ విశ్వవిద్యాలయం ఒక ఆశాకిరణంగా నిలవాలి. ఇక్కడ చదివే ప్రతి అమ్మాయి తన కుటుంబ నేపథ్యం గురించి సంకోచించకుండా, తన కలల గురించి భయపడకుండా, తన భవిష్యత్తు గురించి ఆత్మవిశ్వాసంతో ఆలోచించగలగాలి. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా, గిరిజన కుటుంబానికి చెందినా, ఆర్థికంగా వెనుకబడినా, సామాజికంగా అణచివేతను ఎదుర్కొన్నా, ఆమె ప్రతిభకు ఎదగడానికి తగిన అవకాశాలు లభించాలి. విద్యార్థినులకు పాఠ్యపుస్తకాల జ్ఞానం అందించడం మాత్రమే విశ్వవిద్యాలయం లక్ష్యం కాకూడదు. వారిలో ప్రశ్నించే తత్వం, స్వతంత్ర ఆలోచన, పరిశోధనా దృక్పథం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి. విద్యను ఉద్యోగానికి వెళ్లే మార్గంగా మాత్రమే కాకుండా, జీవితాన్ని అర్థం చేసుకునే సాధనంగా, సమాజాన్ని మార్చే శక్తిగా మలచాలి.

వైస్ ఛాన్సలర్‌గా నాకు అప్పగించిన బాధ్యతను నేను ఈ దృక్పథంతోనే చూస్తున్నాను. విశ్వవిద్యాలయ అభివృద్ధి అంటే భవనాలు నిర్మించడం, కోర్సులను ప్రారంభించడం, పరీక్షలను నిర్వహించడం మాత్రమే కాదు. ఇక్కడ చదివే విద్యార్థినుల జీవితాల్లో సానుకూలమైన మార్పు తీసుకురావడం కూడా. వారి కలలకు బలాన్నివ్వడం, వారి ప్రతిభను వెలికితీయడం, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడం కూడా.

ఈ బాధ్యతలు స్వీకరించిన తరువాత నా ప్రయాణం ముగిసిందని నేను అనుకోవడం లేదు.

నిజానికి, ఇది మరో కొత్త ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. ఇప్పటివరకు నా ఎదుగుదల కోసం నేను కృషి చేశాను. ఇకపై నా బాధ్యత పరిధిలో ఉన్న వేలాది మంది విద్యార్థినుల ఎదుగుదలకు నా వంతు కృషి చేయాలి. వారికి మెరుగైన విద్యావాతావరణాన్ని కల్పించాలి. పరిశోధనకు, నూతన ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మహిళలు విద్యావంతులుగా మాత్రమే కాకుండా, ఆత్మవిశ్వాసం కలిగిన నాయకులుగా ఎదగడానికి దోహదపడాలి. నాకు తెలుసు. ఈ మార్గం కూడా సవాళ్లతోనే ఉంటుంది. ఏ కొత్త బాధ్యతా సవాళ్లు లేకుండా రాదు. కానీ జీవితంలో ఇప్పటివరకు నేర్చుకున్న గొప్ప పాఠం ఒక్కటే సువర్ణా. సవాళ్లను చూసి వెనక్కి తగ్గకూడదు. వాటిని అర్థం చేసుకోవాలి. వాటి నుంచి నేర్చుకోవాలి. సాధ్యమైన పరిష్కారాల కోసం నిరంతరం ప్రయత్నించాలి.

నిజానికి సువర్ణా,  నేను ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. మనిషి పుట్టిన పరిస్థితులు అతని జీవితానికి ప్రారంభ బిందువు మాత్రమే!అవే అతని అంతిమ గమ్యాన్ని నిర్ణయించవు. కష్టాలు మన ప్రయాణాన్ని నెమ్మదింపజేయవచ్చు. అవకాశాల లేమి మన దారిని కఠినతరం చేయవచ్చు. సమాజంలోని అసమానతలు మన ముందుకు అడ్డంకులు తీసుకురావచ్చు. కానీ విద్య, పట్టుదల, నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం మనకు కొత్త మార్గాలను తెరవగలవు.

నా జీవితాన్ని నేను ఒక విజయగాథగా మాత్రమే చూడను. అది అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది పిల్లల కథ కూడా. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మన విద్యావ్యవస్థ మరింత సమానత్వంతో, మరింత మానవీయ దృక్పథంతో ముందుకు సాగాలని కోరుకుంటాను.

ఈ రోజు నాకు లభించిన గౌరవం నా వ్యక్తిగత ఆనందానికి కారణమే కావచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా నా వంటి నేపథ్యం నుంచి వచ్చే పిల్లలకు ఒక సందేశాన్ని అందించే అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. “మీరు ఎక్కడ పుట్టారన్నది మీ తప్పు కాదు. కానీ మీకు లభించిన అవకాశాలను ఎంతగా ఉపయోగించుకుంటారు, మీ జీవితాన్ని ఏ దిశగా మలచుకుంటారు అన్నది మీ ప్రయాణంలో కీలకమైనది. మీ కలలను చిన్నవిగా చేసుకోకండి .మీ పరిస్థితులనే మీ భవిష్యత్తుకు హద్దులుగా భావించకండి. నేను ఎదగడానికి అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్నాను. మీరు కూడా అక్షరాన్నే ఆయుధంగా చేసుకోండి అని గట్టిగా చెప్తాను. పట్టుదలను తోడుగా చేసుకోండంటాను .మీ ప్రయాణం మీ ఒక్కరి కోసమే కాకుండా, మీ తరువాతి తరాలకు కూడా దారి చూపేలా జీవించండి” నా జీవితానికి నేను ఇవ్వదలచుకున్న అర్థం ఇదే.

ఇంతకాలం సాగిన నా ప్రయాణంలో నన్ను ప్రభావితం చేసిన ప్రతి గురువుకూ, నాకు మార్గనిర్దేశం చేసిన ప్రతి వ్యక్తికీ, నా కృషిని గుర్తించిన ప్రతి సంస్థకూ, నా ఎదుగుదలను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఏ ఎదుగుదల కూడా పూర్తిగా ఒంటరిగా సాధ్యమయ్యేది కాదు. మన కృషి మనదే అయినా, మనకు బలాన్నిచ్చిన అనుభవాలు, వ్యక్తులు, అవకాశాలు కూడా మన జీవిత నిర్మాణంలో భాగమవుతాయి.

ఈ ప్రయాణంలో మన చిన్ననాటి జ్ఞాపకాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో మనకు తెలియదు కదా! కాలం మనల్ని ఎక్కడికి తీసుకెళుతుందో, మన కలలు ఎలాంటి రూపం దాలుస్తాయో! కానీ ఈ రోజు వెనక్కి చూసినప్పుడు, మన జీవితాల్లోని ప్రతి చిన్న అనుభవం మనల్ని ఏదో ఒక విధంగా తీర్చిదిద్దిందని అనిపిస్తుంది.

సువర్ణా! నా జీవితంలో ఈ మజిలీని నీతో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే విజయాల గురించి మాట్లాడేటప్పుడు మనం సాధించిన స్థానాన్ని మాత్రమే చెప్పడం సరిపోదు. ఆ స్థానానికి చేరుకోవడానికి మనం నడిచిన దారిని కూడా గుర్తుచేసుకోవాలి. మనల్ని మనం ఎలా అధిగమించామో, మన కలలను ఎలా కాపాడుకున్నామో, మనకు లభించిన అవకాశాలను ఎలా బాధ్యతలుగా మలచుకున్నామో కూడా చెప్పుకోవాలి.

నా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముందున్న బాధ్యతలు పెద్దవి. ఆశయాలు విస్తృతమైనవి. చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రయాణంలో నా మూలాలను మరచిపోకుండా, నా సమాజంతో నాకున్న అనుబంధాన్ని నిలబెట్టుకుంటూ, మహిళా విద్య అభివృద్ధికి నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను.

ఒక మారుమూల గిరిజన కుటుంబంలో మొదలైన నా జీవన ప్రయాణం, ఈ రోజు ఒక విశ్వవిద్యాలయ బాధ్యతల వరకు చేరింది. ఈ ఎదుగుదల నా ఒక్కరి కథగా మిగిలిపోకూడదు. నాలాంటి నేపథ్యాల నుంచి వచ్చే మరెందరో పిల్లలు తమ తమ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇది స్ఫూర్తినివ్వాలి. అదే నా విజయానికి నిజమైన అర్థం. అదే నా జీవితానికి నేను కోరుకునే సార్థకత.

ఇక ఉంటాను మరి! ఎప్పుడైనా మనం మళ్లీ కలుసుకున్నప్పుడు, మన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, మనం కన్న కలల గురించి మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో మనకు కనిపించని ఎన్నో అవకాశాలు ఈ రోజు మన ముందున్నాయి. భవిష్యత్తు తరాలకు మనం అందించగలిగే అత్యంత విలువైన కానుక, ఆశ, ఆత్మవిశ్వాసం, విద్య పట్ల నమ్మకం.

నీ ఆత్మీయ స్నేహితురాలు,

డా. సూర్యాధనంజయ్

వైస్ ఛాన్సలర్

వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.

సూర్యా ధనుంజయ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ ప్రయాణం ఒక చరిత్ర…
    ఈ ప్రయాణం ఒక సందేశం…
    ఈ ప్రయాణం ఒక ప్రేరణ…
    ఈ ప్రయాణం ఒక కొత్త దారిని నిర్మించిన ఆదర్శం..
    ఈ ప్రయాణం ఒక నూతన అధ్యాయాల లిఖింపు…
    ఈ ప్రయాణం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ముందడుగు …. యాడి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.