మీరా ..ఇప్పుడొక సామూహిక శక్తి!

మీరా సంఘమిత్ర గా ఎలా సగర్వంగా నిలబడిందో  తెలుసుకోవాలంటే…ఇప్పుడు మనల్ని మనం కొత్తగా సిద్ధం చేసుకుని ఆమె జీవిత కథలోకి వెళ్లాల్సి వుంటుంది.

మీరా సంఘమిత్ర. జాతీయ ప్రజా ఉద్యమాల సమన్వయ వేదిక (National Allaince of Peoples Movements-NAPM) కు వున్న పదిహేను మంది నేషనల్‌ కన్వీనర్ల లో ఒకరు. 2019 జనవరి 23కి ముఫ్పైనాలుగు సంవత్సరాలు నిండాయి. యాక్టివిస్టుగా పన్నెండేళ్ల అనుభవం. హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. ఇక్కడే చదువుకుంది. ఇక్కడే తన వ్యక్తిత్వానికి పదును పెట్టుకుంది. ఇక్కడే తన భవిష్యత్తుకు ఒక సంకల్పాన్ని దిక్సూచిగా మలుచుకుంది. తనలో అంతర్లీనంగా వున్న సామాజిక స్ప్రుహ  ప్రేరణతో హక్కుల ఉద్యమాల వైపు అడుగు వేసింది. నర్మదా డామ్‌ నిర్వాసితుల కోసం పనిచేయడానికి వెళ్లింది.

ఇదొక్కటే మీరా ప్రత్యేకత కాదు. తనలోపలి అంతరంగం కల్లోలభరితం. వ్యక్తిగత అస్థిత్వమే సంఘర్షణాపూరితం. చిన్నప్పటి నుంచి మనసును మెలిపెట్టే ఎన్నో రకాల అవమానాలు. ఒంటరితనం వెంటాడిన క్షణాలు. దిగులు  కమ్మేసిన ఆలోచనలు. తెలిసీ తెలియని వయసునుంచే వెంటాడుతూ వచ్చిన ‘నాకే ఎందుకిలా’ అనే సమాధానం లేని ప్రశ్న!  ఆర్థిక సామాజిక స్థితిగతులు బాగున్నప్పటికీ ఇష్టమయిన అన్నిటినీ వదులుకోవాల్సివచ్చిన బాల్యం. కాదు కాదు అసలు బాల్యమే కరువైపోయిన అస్తిత్వం. ఒంటరితనపు వేదనను ఎక్కడా వ్యక్తీకరించటానికి వీల్లేని పరిస్థితులు.

ఎందుకంటే, మీరా ఒక ట్రాన్స్ జండర్‌ మహిళ. ఇరవైఎనిమిది సంవత్సరాలపాటు తన మనసు అంగీకరించని జండర్‌ చట్రంలో బతుకుతూ మానసికంగా, శారీరకంగా ఎంతో చిత్రవధను అనుభవించింది. అలా వుండటం అనేది తనను ఎంత మానసిక సంక్షోభానికి గురిచేస్తోందో గుర్తించి తాను చిన్నప్పటినుంచీ తనను తాను విశ్వసిస్తున్న, అలా వ్యక్తీకరించుకోవటానికి పోరాటం చేస్తున్న స్త్రీత్వంలోకి ఆత్మవిశ్వాసంతో ప్రయాణించటం మొదలుపెట్టింది. తన ఈ మొత్తం ప్రయాణాన్ని వ్యక్తిగతంగా కాకుండా, తాను ఏ ఉద్యమంలో పనిచేస్తోందో, ఆ ఉద్యమ సహచరులందరూ కూడా తన భావాలను, మన:స్థితిని అర్థం చేసుకొనేలా ఒక చర్చను పెట్టి ఆ ప్రయాణాన్ని ఒక సమూహపు అంశంగా మార్చగలిగింది. ఆ రకంగా తనతోపాటు అందరినీ దానిలో భాగస్వాములుగా చేయగలగటం ద్వారా ఒక సామాజిక మార్పుకు తోవను ఏర్పరచింది.

తనలోని ఆమెని ప్రొజెక్ట్‌ చేసుకోవడానికి, మీరా సంఘమిత్రగా గుర్తింపు తెచ్చుకోడానికి, దానినొక హక్కుగా ప్రకటించుకోడానికి ఆమె చేసిన యుద్ధం మాటల్లో చెప్పలేనిది. ఈ దశలో ఆమె తన కుటుంబంలో, సమాజంలో బాల్యం నుంచి యుక్తవయస్సు వరకూ ఎదుర్కొన్న సమస్యలు, బాధలు, అవమానాలు, హింస, ప్రశ్నలు   అసంఖ్యాకం. వాటినుంచి బయటపడి తను మీరా సంఘమిత్ర గా ఎలా సగర్వంగా నిలబడిందో  తెలుసుకోవాలంటే…ఇప్పుడు మనల్ని మనం కొత్తగా సిద్ధం చేసుకుని ఆమె జీవిత కథలోకి వెళ్లాల్సి వుంటుంది. ట్రాన్స్ జెండర్ వ్యక్తులను వారి పూర్వ అస్తిత్వానికి ఇచ్చిన పేరుతో గుర్తించకూడదు. ఆ పేరుతో పిలవకూడదు. తనను తాను ట్రాన్స్ మహిళగా ప్రకటించుకుంటూ పెట్టుకున్న పేరే మీరా సంఘమిత్ర. “మీరా అనే పేరుకు చరిత్రలో ఒక ప్రత్యేకస్థానం వుంది. అది న్యాయం కోసం, మార్పు కోసం పట్టుదలగా చేసిన పోరాటం. సంఘమిత్ర అశోక చక్రవర్తి కూతురు. రక్తపుటేరులు పారిన యుద్ధభూమిలో నిలబడి దేశాల మధ్య శాంతి కోసం ముందడుగు వేసిన మొదటి మహిళ. సంఘమిత్ర అంటే సమాజానికి స్నేహితులు. వీటి స్పూర్తితో తన పేరుని ఎంచుకుంది.

మీరా తనకు ఊహ తెలిసిన తర్వాత తనను తాను ఎప్పుడూ అబ్బాయిగా అనుకోలేదు. ఆ అస్తిత్వం తనకు సమాజం అంటగట్టిన ఒక మూసచట్రంగానే భావించింది. దానిని తను ఎప్పుడూ అంగీకరించలేదని చెబుతూ, అనుక్షణం తాను అమ్మాయిననే భావిస్తూ పెరిగానని, దానివలన ఎన్నో రకాల ఉద్వేగాలు, అవమానాలు ఎదురయ్యాయని, నిరంతర ఒంటరితనం వెంటాడిందని, అసలు బాల్యమే లేకుండా పోయిందని ఒక దు:ఖపూరిత కంఠంతో ఆమె చెప్తుంటే ఆ భావాల కు అక్షరరూపం ఇవ్వటం చాలాకష్టం.

నిజానికి ట్రాన్స్ జండర్‌ వ్యక్తుల ఆంతరంగిక వేదనను తెలిపే సాహిత్యం మనకు చాలా తక్కువ. ఈ మధ్యనే తమిళ రచయిత రేవతి ‘నేను హిజ్రాను’ అని రాసిన పుస్తకం తెలుగులో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు ద్వారా వెలువడింది. ట్రాన్స్ జండర్‌ వ్యక్తుల పట్ల సామాజిక వివక్ష ఎంత తీవ్ర స్థాయిలో వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యం కాదు. ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన వేదనానుభవం. ఇళ్లు అద్దెకు దొరకవు. మొహం మీదే చెప్పేస్తారు మీలాంటి వాళ్లకు ఇళ్లు ఇవ్వమని. ట్రాన్స్ జండర్‌ వ్యక్తులంటేనే ఏ రకమైన ముద్రైనా వేసేయొచ్చు అనుకుంటారు. లోకల్‌ ట్రైన్లలో, బస్సుల్లో వెళ్తున్నపుడు చాలామంది పక్కన కూర్చోవటానికి ఇష్టపడరు. అల్లరి చేస్తున్న తమ పిల్లలను బెదిరించటానికి ‘వాళ్లు నిన్ను ఎత్తుకుపోతారు అని మొహం మీద వేలుపెట్టి మరీ చూపిస్తారు’ కొంతమంది. నేరస్థులుగా చూస్తారు. రోడ్డుమీదకు వస్తే ప్రకృతి అవసరాలు తీర్చుకోవటం అనేది అత్యంత గగనం. లైంగిక హింసకు గురవటం సర్వసాధారణం. దీనిగురించి ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోదు. అసలు మనుషులుగానే గుర్తించరు. ఇంత వివక్షాపూరిత సమాజం మనచుట్టూనే, మనలోనే వుందంటే సిగ్గుపడాలి.

మీరా పుట్టింది విద్యావంతుల కుటుంబంలోనే. తల్లి స్కూల్లో టీచరు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబం. చిన్నవయసులో మీరా తనను తాను అమ్మాయిగా వ్యక్తీకరించుకుంటున్నపుడు దానిని సహించలేని తండ్రి ‘పొట్టై (కొజ్జా)’ అని తిట్టేవారు. తండ్రి నుంచి ఆ రకమైన ఈసడింపు ఎదురవ్వగానే భయం భయంగా తనలోతానే ముడుచుకుపోవటం, గుండెలో దు:ఖాన్ని పేర్చుకోవటం తప్ప దానికి తిరిగి సమాధానం కూడా చెప్పలేని చిన్నవయసు. అసలు ఆ పదం అనటమే చాలా అవమానపర్చేది అని తెలుస్తూ వుంటుంది కానీ, అర్ధమేమిటో  తెలియదు.

బంధువుల ఒత్తిడి, చుట్టుపక్కవాళ్ల ఎగతాళి చూపులు. స్కూల్లో టీచర్లు కూడా తనకు సమాజం ఇచ్చిన ‘మగ’ జండర్‌ అస్థిత్వానికి సంబంధించిన ఆటలే ఆడాలని చెప్పడం, చదువు కూడా ఆ వైపుగానే వుండాలని ఒత్తిడి పెట్టటం, మగపిల్ల వాడివి మగపిల్లవాడిగా వుండలేవా అని హూంకరించటం, మాట, నడక, స్వభావం అన్నిటినీ ఎగతాళి చేసి హింసించే తోటిపిల్లలు. వీటన్నిటి మధ్యలో తల్లి ఒక్కటే తన మనసులో వున్న బాధను అర్థం చేసుకునే ఓదార్పు. తన బిడ్డ మీద ఆమె ఏనాడూ ఆంక్షలు పెట్టలేదు. తల్లంటే విపరీతమైన ప్రేమ మీరాకు. తల్లిలాగే వుండాలని, తల్లి చేసే పనులన్నిటికీ తన చిట్టిచేతుల్ని తోడుగా కలిపేది. ఇంట్లో అమ్మ చేసే పనులన్నీ కూడా ఒక సామాజిక వ్యవస్థీకృత భావజాల చట్రంలో తయారయ్యాయన్న స్ప్రుహ అంత చిన్నవయసులో మీరాకు అర్థమవటం సాధ్యం అయ్యే విషయం కాదు.

తల్లి కూడా తన బిడ్డ అభివ్యక్తీకరణ సాంప్రదాయ విరుద్ధంగా వున్నప్పటికీ ఏనాడూ పరుష పదజాలంతో అవమానించ లేదు. అమ్మలోని ఆ ప్రేమ, అర్థం చేసుకునే మనస్థత్వమే ఇరవై ఎనిమిదేళ్లకయినా సరే తనను తాను ధైర్యంగా ఒక ట్రాన్స్ జండర్‌ మహిళగా ఆవిష్కరించుకోవటానికి ధైర్యమిచ్చిందంటుంది మీరా! ఎన్ని ప్రతికూల పరిస్థితులు వున్నప్పటికీ ఆ ప్రేమే చిన్నవయసులో తాను కుటుంబం నుంచి పారిపోకుండా నిలబెట్టిందని, లేకపోతే చాలామంది ట్రాన్స్ జండర్‌ వ్యక్తుల్లాగా కుటుంబాల్లో వుండే నిర్భంధాన్ని, బయట సామాజిక అవహేళనల్ని తట్టుకోలేక ఇంటినుంచి పారిపోయే పరిస్థితి వచ్చేదేమో అని మీరా అంటుంది! కుటుంబ సహకారం లేకపోవటం వల్లనే ఎంతోమంది ట్రాన్స్ జండర్‌ వ్యక్తుల జీవితాలు దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాయనేది కూడా మనకంటి ముందువున్న వాస్తవం.

చిన్నతనం నుంచీ కూడా తనచుట్టూ వుండే సామాజిక పరిస్థితులకు, చలించే స్వభావం వున్న మీరా పేదప్రజలతో పనిచేయటం లా కాలేజీలో చదువుకునేటప్పుడే ప్రారంభమయింది. అదే ఆమెలోవున్న యాక్టివిస్టుకి మొదటిమెట్టు. అక్కడ మొదయిన ఆమె ప్రస్థానం దాదాపు తొమ్మిదేళ్లపాటు తన పూర్తి సమయాన్ని నర్మదా డామ్‌ నిర్వాసితుల కోసం వెచ్చించింది. ఈ క్రమంలో కొండప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు, మత్స్యకార కుటుంబాలు, దళిత శ్రామికులు ఇలా అనేకమందితో మమేకమయ్యి పనిచేసింది. వారంతా కూడా ఆమెని ప్రేమగా ‘మీరా దీదీ’ అని పిలుచుకుంటారు. నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలు మేథాపాట్కర్‌ తో మీరా అత్యంత సన్నిహితంగా కలిసి పనిచేసింది. ఇప్పుడు ప్రజాఉద్యమాల జాతీయ సమన్వయ వేదిక తరఫు నుంచి అనేక ప్రజా ఉద్యమాలతో కలిసి పనిచేస్తోంది. అలాగే ట్రాన్స్ జండర్ సమూహాలకు సంబంధించిన హక్కుల పోరాటంలో, జెండర్ సమన్యాయ పోరాటాలలో అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది.

మీరా గురించి యాక్టివిస్ట్ డైరీలో రాయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు మేథాపాట్కర్‌ స్పందిస్తూ ‘‘మీరా గురించి చెప్పాలంటే ముందు తన నిబద్ధత గురించి చెప్పాలి. ఈ వయసు యువతరంలో చూస్తే, తనకు సామాజిక, ప్రజాఉద్యమాలపై వున్న కమిట్‌మెంట్‌ ఎంతో శక్తివంతమైనది. తన ప్రవృత్తిలోనే యాక్టివిజం వుంది. సమభావం, సమన్యాయం ఈ రెండు అంశాల దిశగా తన పని, ఆలోచనా, సంఫీుభావం నిరంతరం వుంటాయి. ఇంత చిన్న వయసులో వివిధ భాషల మీద మీరా కున్న పట్టు నాకెప్పుడూ ఆశ్యర్యం అనిపిస్తుంది! తను చదివిన న్యాయశాస్త్ర విద్య ద్వారా, ఇతర కార్యాచరణల ద్వారా దళిత, ఆదివాసీ, కార్మిక హక్కుల  కోసమే కాకుండా జండర్‌ సమన్యాయ దిశగా విశాలపోరాటంలో తన గళాన్ని ఎక్కుపెట్టటం, వాటిని సమన్వయం చేయటం తనకు మాత్రమే సాధ్యమవుతున్న విషయం.

తను ఎంత మంచి నిర్వాహకురాలంటే, ప్రతిఒక్కరిని కార్యక్రమాల్లోకి సమీకరిస్తుంది. అణిచివేయబడుతున్న సమూహాలను చైతన్యపరచటంలో తన సృజనాత్మకతను గుర్తించాలి. ఒక విశాల లక్ష్యంతో అందరినీ ఒకతాటిమీదకు తీసుకురాగలిగిన సహనం, ఓర్పు, శక్తి తనలో ఎక్కువ. సామాజిక, రాజకీయ సైద్ధాంతిక అంశాల మీద తనకు స్పష్టమైన అవగాహన వుంది. వివిధ అంశాల మీద తను రాసే ప్రకటనల్లోనూ, తీసుకునే కార్యక్రమాల్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది.

యాక్టివిస్టుగా మీరా తొలిదినాల్లో మానవహక్కుల వేదిక నాయకులు బాలగోపాల్‌, జీవన్‌కుమార్‌లతో కలిసి కొన్నిఅంశాల మీద పనిచేస్తున్నపుడే నాకు హైదరాబాద్ లో పరిచయమైంది. ఆ తర్వాత నర్మదా బచావో ఆందోళన్‌ లో (నర్మదా ఉద్యమం) మాతో జతకలిపి ప్రయాణం ప్రారంభించి మా అందరిలోనూ విడదీయరాని భాగమైంది. కేవలం న్యాయపరమైన అంశాల్లోనే కాకుండా, ప్రజాకార్యాచరణలో కూడా ప్రత్యక్షంగా పాల్గొంది. ప్రస్తుతం NAPM ద్వారా వివిధ ప్రజాఉద్యమాల తో కలిసి పనిచేస్తూ, సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా సమన్యాయం కోసం, ప్రజాస్వామ్యయుతంగా వ్యవస్థలో మార్పుకోసం పనిచేస్తూ, విభిన్న ప్రజాసమూహాల హక్కుల సాధనకై పోరాడుతోంది’’ అని ఎంతో అభిమానంగా చెప్పారు.

ఇంక, ఇదీ నా కథ అంటున్న మీరా మాటల్లోకి వెళదాం:

‘‘ఎన్నో సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇంట్లో తమిళమే మాట్లాడతాం. నాకు చదవటం, రాయటం రాదు కానీ, అమ్మకు బాగా వచ్చు. అమ్మే నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్‌ ఫ్రెండ్‌. తను మా ఫామిలీ గురించి బాగా సఫర్‌ అయిందని నాకు ఎప్పుడూ అనిపిస్తూవుంటుంది. తన సమయం, శక్తి దీనిలో చాలా పెట్టేసింది. మా నాన్నతో తనది సమానమైన బంధం కాదు. ఆయన బాగా తాగేవారు. కుటుంబం పట్ల బాధ్యతగా వుండేవారు కాదు. వేరే రిలేషన్‌ కూడా వుండేదట! నాన్నతో పోలిస్తే, అమ్మ బాగా చదువుకుంది. ఎంతో ఓర్పు, సహనం వున్నాయి. టాలెంటెడ్‌, సెన్సిబుల్‌ కూడా. మా రెండు వైపుల కుటుంబాలు కూడా బాగా కన్సర్వేటివ్‌ కుటుంబాలు.

నాకు ఒక అన్నయ్య. మేమిద్దరమే. తను, నేను చిన్నప్పటినుంచీ చాలా డిఫరెంట్‌. నాది చిన్నప్పటినుంచీ కూడా బాగా ప్రశ్నించేతత్వం. అన్నయ్యేమో ప్రవాహంతోపాటు వెళ్లేవాడు. నేను అలాకాదు. అయితే తను కూడా చాలా విషయాల్లో స్ట్రగుల్‌ అయ్యాడు. ముఖ్యంగా తన పెళ్లి విషయంలో. వదిన వేరే కాస్ట్‌ అమ్మాయి. అమ్మ ఏమీ వ్యతిరేకించలేదు కానీ, నాన్న ఒప్పుకోలేదు. అమ్మే పూనుకుని దగ్గరుండి వాళ్ల పెళ్లి చేయించింది. వదినకి అమ్మంటే చాలా గౌరవం. నా విషయంలో నాన్న నన్ను తిట్టినాగానీ, అమ్మ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే వుండేది. తను నాకోసం ఎంతో నిలబడింది. నాన్నతో వున్న బంధంలో అమ్మ బాగా హింసని ఎదుర్కొంది. సెక్సువల్‌ ఎబ్యూజ్‌!  రెగ్యులర్‌గా మారిటల్‌ రేప్‌…ఇది పెద్దయిన తర్వాత తెలిసిన పదమే!(కన్నీళ్లతో కూడిన మౌనం)…అమ్మ స్కూల్లో పనిచేసేది. తనకి పీరియడ్స్‌ టైమ్‌లో హెవీ బ్లీడింగ్‌ అయ్యేది. స్కూల్లో పాఠాలు చెప్పటానికి ఎక్కువసేపు నిలబడాలి. చాలా పెయిన్‌ ఫీలయ్యేది. తనకి వంట్లో బాలేదని తెలిసేది కానీ ఎందుకో నాకు చిన్నప్పుడు అర్థం కాకపోయేది.

ఒకరకంగా తనకి ఈ ఫామిలీ అనేది జైలే. అందరం ఒక్కోవిధంగా జైల్లో వుంటామనిపిస్తుంది. ఆ జైలు సంకెళ్లని తెంపుకుని బయటకు రావటానికి ఒక లైఫ్‌ టైమ్‌ పడుతుంది. ఒక్కోసారి బయటపడటం కూడా అసాధ్యమే. తను ఆర్థికంగా మంచిగా సంపాదిస్తున్నాగానీ కుటుంబం అనే జైలు నుంచి బయటపడటానికి జీవితకాల పోరాటం చేసింది. ఇప్పటికీ చేస్తూనే వుంది.ఈ స్థితి ఒక సామాజిక చట్రం. కుటుంబం అంటే భర్త తరఫు నుంచి మాత్రమే అని సమాజం నిర్వచిస్తుంది. భర్త, పిల్లలు ఇది తప్ప ఇంకో ప్రపంచం వుంటుందని అనుకోనివ్వని సామాజిక స్థితి! మాకోసం, ముఖ్యంగా నాకోసం చాలా హింసను భరించిందని అనిపిస్తుంది. నాన్నకు వున్న ఇంకో రిలేషన్‌ విషయంలో అమ్మ చాలా బాధపడేది. ఆ బాధకి నేను మౌన శ్రోతని, ప్రేక్షకురాలిని. ఆ రకంగా మా ఇద్దరికీ చాలా అనుబంధం వుంది. అమ్మ ఇపుడు నాన్నతో విడిపోయి స్వతంత్రంగా బతుకుతోంది.

నాకు ఊహ తెలిసిన నాలుగు సంవత్సరాల నుంచే నేను అమ్మాయిననే అనుకునేది. నన్ను నేను అబ్బాయిగా ఎప్పుడూ అనుకోలేదు. ఆరేళ్ల వయసులో అనుకుంటాను, నాకు చీరకట్టించి ఫొటో తీయించమని చాలా ఏడ్చాను. గొడవ పడ్డాను. అమ్మే నాకు చీర కట్టింది. అమ్మానాన్న ఇద్దరూ ఫొటోస్టూడియోకి తీసుకెళ్లి ఫొటో తీయించారు. అలా వుండటం నా డిసైర్‌. ఇంట్లో అమ్మతో వున్నప్పుడు మాత్రమే నాకు ఏ టెన్షన్‌ వుండేది కాదు. ఇంటి ముందు ముగ్గు వేయటం, ఇంటిపనులు  చేయటం, అమ్మాయిలాగా డ్రస్‌ చేసుకోవటం ఇలా అన్నీ చేసేది. నాన్న మాత్రం ఈ పనులన్నిటినీ చేయకుండా కట్టడి చేస్తూనే వుండేవారు. నాలుగేళ్ల నుంచీ ఎనిమిదేళ్ళు వచ్చేవరకూ అలానే వుండేది. బహుశా నేను ఏ కొంచమయినా హాపీగా వుంది అప్పటివరకే. ఆ తర్వాత సమస్య తీవ్రత నలువైపుల నుంచీ మొదయింది. నాన్నకి నామీద ప్రేమ వుండేది కానీ, బంధువులు వచ్చినప్పుడల్లా ‘అలా ఎందుకున్నాడు, సరైన దారిలో పెట్టాలి ఇప్పుడే’ అంటూ నా గురించి ఏదోఒకటి చెబుతూనే వుండేవారు. అవి విని తట్టుకోలేక నా మీద కట్టడిని మరింత ఎక్కువ చేసారు నాన్న. నేను వినకపోతే కోపంతో ‘పొట్టై’ అని తిట్టేసేవారు. అంటే తమిళంలో ‘కొజ్జా’. అలా అన్నప్పుడు చాలా భయం అనిపించేది. ‘నన్నెందుకలా తిట్టాలి, నన్నే ఎందుకలా అనాలి’ అని లోలోపల  బాగా దు:ఖం అనిపించేది.(మౌనం)…పదే పదే అలా అనిపించుకోవటం కూడా అలవాటయిపోయింది. అది చాలా డిరగేటరీ వర్డ్‌ అని తెలుసుకానీ, ఎలా తిరిగి సమాధానమివ్వాలో తెలిసేది కాదు.(మౌనం)…ఒకసారి ఇంక తట్టుకోలేక ‘అవును నేను పొట్టైదాన్నే, అయితే ఏంటి’ అని పిచ్చిపిచ్చిగా అరిచేశాను. అంత చిన్నవయసులో అలా నన్ను నేను అనుకోవటం కూడా లోలోపల ఎంతో అవమానపడిన నిస్సహాయత కదా!(కన్నీళ్లతో కూడిన మౌనం)…

చీరకట్టినా, ముగ్గులేసినా, నిజానికి వాటికి జండర్‌ ఎందుకుండాలి? చీర అనేది ఒక డ్రస్‌. ముగ్గు అనేది ఒక కళ. అమ్మలాగా డ్రస్‌ చేసుకోవటం, టివీల్లో కనిపించే డ్రస్సుల్లాంటివి వేసుకోవటం నాకు ఇష్టంగా అనిపించేవి. అవి నేను ఇప్పటికీ చేస్తాను. అయితే సమాజం వాటిని కేవలం ఒక జండర్‌కి మాత్రమే సంబంధించిన విషయంగా నమ్మిస్తూ వచ్చింది. అలా మనల్ని ఒక చట్రంలో కూర్చోబెట్టేసింది. ఆ పనులకు ఒక జండర్‌ రోల్‌ పెట్టి చూడటం అల వాటయిపోయింది కాబట్టే, అవి ప్రతిఒక్కరూ చేయగలిగిన పనులనే విషయాన్ని మర్చిపోతున్నాం. బంధువుల వైపు నుంచీ చాలా ఒత్తిడి వుండేది. ‘అలా ఎందుకు నడుస్తున్నావు, ఇలా ఎందుకున్నావు, అలా మాట్లాడొచ్చా’ అని పదేపదే చెప్పటం మొదలుపెట్టారు. దీనివల్ల అందరితో కలవాలంటే భయం వేసేది. అలా ఎంతకాలమని వుండగలుగుతాం. అదే ఇంట్లో వుండాలి, అదే బంధువుల చుట్టూ వుండాలి, అదే వీథిలో తిరగాలి, అదే స్కూల్లో చదవాలి, అదే మనుషుల మధ్య వుండాలి. దానితో, నేను నాలోపల అమ్మాయినే, కానీ నేను బయటకు అబ్బాయిలాగా నటించటం మొదలుపెట్టాను. కానీ, నాలో అబ్బాయి అనే అంశమే లేదు. నేను అలాగ అస్సలు నటించలేకపోయాను. వెరీ బ్యాడ్‌ యాక్టర్‌ని నేను. ఎప్పుడూ ఫెయిలవుతూనే వున్నాను. ఇప్పుడు ఆలోచిస్తే, నా సామాజిక అవగాహన పెరుగుతున్న కొద్దీ అలా ఫెయిల్ అవడం అనేది ఒక రాజకీయ బలం, గుర్తింపు అనే స్పృహ పెరిగింది. ఇది చాలా ముఖ్యమైనది కూడా!

(కొనసాగింపు వచ్చే సంచికలో)

సజయ. కె

సజయ. కె

20 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా మంచి పరిచయం సజయ గారూ . “నిజానికి ట్రాన్స్ జండర్‌ వ్యక్తుల ఆంతరంగిక వేదనను తెలిపే సాహిత్యం మనకు చాలా తక్కువ. ఈ మధ్యనే తమిళ రచయిత రేవతి ‘నేను హిజ్రాను’ అని రాసిన పుస్తకం తెలుగులో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు ద్వారా వెలువడింది. ట్రాన్స్ జండర్‌ వ్యక్తుల పట్ల సామాజిక వివక్ష ఎంత తీవ్ర స్థాయిలో వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యం కాదు. ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన వేదనానుభవం”. నిజమే , నేను ఆ పుస్తకం చదివాను. 2004 లో హెచ్‌ఐ‌వి వారి ఆర్ధిక పరిస్తితి కోసం ఒక సర్వే లో పాల్గొని, అప్పటి ఆంధ్ర, కర్నాటక,నాగాలాండ్ లలో ప్రత్యక్షంగా వారితో మాట్లాడే అవకాశం వొచ్చింది.

  అయితే మ ఘనత వహించిన ఏకైక మార్క్సిస్ట్ రంగనాయకమ్మ గారు ఆ పుస్తకాన్ని విమర్శిస్తూ , వాళ్ళని హీనంగా తాను వీక్షణ లో రాసిన వ్యాసాల్లో చిత్రీకరించినప్పుడు ఒక్క వసంత కన్నాభిరన్ తప్ప ఎవ్వరూ విమర్శించక పోవడం చాలా విచారమనిపించింది.

  మీ రెండో భాగం కోసం ఎదురుచూస్తుంటాను .

  • అవును, అది అవమానించటం అని రంగనాయకమ్మ భావించడం లేదు. ఆవిడ అనేక విషయాల్లో ఈ ధోరణినే కనబరుస్తున్నారు. దురదృష్టకరం . ట్రాన్స్ జండర్ ఫ్రెండ్స్ అన్నదేమంటే ఇప్పటివరకూ మేము మామూలు సమాజం నుంచి చాలా అవమానాలను ఎదుర్కొన్నాం, ఇప్పుడు అభ్యుదయ రచయితలు కూడా దానిలో చేరారు అని.

   • నిజమే వాళ్ళు చాలా అవమానాలు భరిస్తారు పాపం. ఢిల్లీ లో ఉన్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రేపోర్టరి వారు ట్రాన్స్ జెండర్ వారి జీవితం మీద “జానేమన్” అని కదిలించే నాటక చేశారు.

 • మీరా సంఘమిత్ర నా ప్రియ స్నేహతురాలు, ఆమె గురించి ఇంకా తెలియని విషయాలు తెలియ చేస్తున్నందుకు, ఒక గొప్ప త్యాగశీలిని లోకానికి పరిచయం చేస్తున్నందున, నాలాంటి ఎంతో మంది ట్రాన్స్ పురుషులకు సైతం ఒక కొత్త స్ఫూర్తి అందిస్తున్నందుకు సజయ గారు మీకు మనః పూర్వక ధన్వాదములు.
  మీరా గారికి నా హృదయపూర్వక అభనందనలు.
  వచ్చే సంచిక కోసం ఎదురు చూస్తాను.

 • మీరా, మనందరి స్నేహితురాలు. Suresh ediga తనతో చేసిన రేడియో ఇంటర్వ్యూ విన్నాను. ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకున్నాను. థాంక్స్ సజయక్క. Love you meera.

 • చక్కటి పరిచయం, సజయ గారూ. జర్నలిజం వల్ల నాకు దొరికిన ఫ్రెండ్. టఫ్ ఇండివిడ్యువల్. ఒక్క పురుషస్వామ్యం మీద మాత్రమే కాదు, అన్ని రకాల ఆధిపత్యం మీద, అణచివేత మీద – – ముఖ్యంగా right-wing ఆగడాలు మీద ధైర్యంగా మాట్లాడుతూ, రాస్తూ నిలబడ్డది.

 • చక్కటి పరిచయం, సజయ గారూ. జర్నలిజం వల్ల నాకు దొరికిన ఫ్రెండ్. టఫ్ ఇండివిడ్యువల్. ఒక్క పురుషస్వామ్యం మీద మాత్రమే కాదు, అన్ని రకాల ఆధిపత్యం మీద, అణచివేత మీద – – ముఖ్యంగా right-wing ఆగడాలు మీద ధైర్యంగా మాట్లాడుతూ, రాస్తూ నిలబడ్డ ది. More power to her.

 • బావుంది సజయ గారు. మంచి పరిచయం.. More power to meera .

 • ఇవాళే స్కూలు బస్సు దగ్గర మా అమ్మాయిని పికప్ చేసుకున్నప్పుడు అడిగింది. “డాడీ..మా స్కూల్లో నాతోటి వారికి చాలామందికి LGBTQల మీద సరైన అవగాహనే లేదు. నా ఫ్రెండు ఒకామె వాళ్ళకు చట్టరక్షణ అవసరం లేదంటుంది. మనం ఇండియా వెళ్ళినపుడు అక్కడి LGBTQల సమస్యలు తెలుసుకోవడానికి మనం ఎవర్నైనా కలవచ్చా!” అని!
  “ఒక హిజ్రా ఆత్మకథ” చదివాను. వాళ్ళ గురించి అవగాహన తెచ్చుకునే ఆస్కారాలేవీ సమాజం వుంచదు. ఇప్పుడిప్పుడే ఇలా పుస్తకాలు రావడం వల్లే ఆ కొణం నుండీ కొంతైనా తెలుస్తోంది.

  • థాంక్స్ ప్రసాద్ గారు. మీ పాప కి చెప్పండి ఇక్కడ హైదరాబాద్ లో మంచి స్నేహితులున్నారని. పరిచయం చేస్తాను.

 • చాలా అవసరమైన ,ఉపయోగ కరమైన వ్యాసం.ట్రాన్స్ జెండర్ సమస్యని సామాజిక,ఆర్థిక,లైంగిక రాజకీయాల కోణం నించే కాకుండా మానసిక, కోణం లో కూడా విశ్లేషించడం అవసరం.నా దగ్గరికి ట్రాన్స్ జెండర్ పేషెంట్స్ కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు.సైకలాజికల్ గా ఎంత తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారో చెప్పలేను.
  కన్న తల్లిదండ్రుల వెలివేతల తో…చుట్టూ వెలివేసే సమాజంతో..దేహానికి ,మనసుకు పొంతన కుదరక ఒత్తిడికి గురి అవుతుంటారు.మరో పక్క తమ మీద జరిగే లైంగిక అత్యాచారాలు.. సరైన అవగాహన గైడెన్స్ లేక అంటుకొని.వేధించే sexually transmitted deseases తో నరకం అనుభవిస్తుంటారు.వీరిని సైంటిఫిక్ గా ,హక్కుల దిశలో తమ పరిస్థితిని అధిగమించే కౌన్సిలింగ్ సెంటర్స్ పెరగాల్సి ఉంది.
  మీరు చాలా మంచి పని చేస్తున్నారు సజయ గారూ… అభినందనలు.

 • అబ్బా ఏమి జీవితమండి బాబు. ప్రత్యక్ష నరకం. ఇలాంటి వారి గురించి చదివినపుడు మన మీద మనకే అసహ్యమేస్తుంది. ఈ సమాజాన్ని ఇంకా రిపేర్ చేయనందుకు.

 • సజయ గారూ ! సామాజిక స్ప్రుహ, ప్రేరణతో హక్కుల ఉద్యమాల వైపు అడుగు వేసిన మీరా సంఘమిత్ర ట్రాన్స్ జండర్‌ మహిళ మాత్రమే కాదు ఓ ఆదర్శ వ్యక్తి. ఈ సందర్భంలో సామాజిక కార్యకర్త, ప్రముఖ ట్రాన్స్-జెండర్ యాక్టివిస్ట్ అక్కై పద్మశాలి గుర్తొస్తున్నారు.

  సామాజిక కార్యకర్త, ప్రముఖ ట్రాన్స్-జెండర్ యాక్టివిస్ట్, దేశంలో తొలిసారిగా ఇండియన్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ ( ఐవీయూపీ ) సంస్థ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న తొలి ట్రాన్స్‌జెండర్ అక్కై పద్మశాలి. బెంగళూరులో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పద్మశాలి తనకు 16వ సంవత్సరం వచ్చే వరకు అబ్బాయిగా ఉన్నాడు. అనంతరం అమ్మాయిగా మారాడు. కొద్ది కాలం పాటు సెక్స్ వర్కర్‌గా పని చేశాక ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి తనలాంటి ట్రాన్స్‌జెండర్లకు సేవలందిస్తున్నారు.

  Obama answers Akkai Padmashali’s question on how to fight Section 377 of Indian Penal Code ( She felt that the draconian law of Section 377 of Indian Penal Code should be abolished )

  Transgender activist Akkai Padmashali was selected to ask Barrack Obama a question on behalf of India’s LGBT community about reversing section 377 at the New Delhi town hall December 1st.

  “I’m a criminal before the section 377 which criminalizes because you are a transgender lesbian gay bisexual and how do I raise my voice against this?” asked Akkai Padmashali.

  Barrack answered her question affirmatively saying “What you just did. To find your voice and to articulate your views and your experiences and tell your story.”

  “And that’s true of any group that’s marginalized and stigmatized.” Obama continued. “Finding that voice and being able to tell a story so that the perceptions that somehow you are different are broken down because people start recognizing their own experiences in you. They see your humanity.

  Young Indians like you aren’t just going to define to define the future of this Nation, you are going to shape the world.

 • గొప్ప వ్యాసం. రెండొ భాగం కోసం చూస్తున్నా.

 • మంచి పరిచయం. చదువుతున్నంతసేపు స్పూర్తి కలిగించేలా ఉంది. రెండవ సగం కోసం ఎదురు చూస్తున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు