So much of life
is a mystery, my boy.
We know so little of this world.
But you and I
have made a journey
that other men
cannot even imagine.
And this has given understanding
to our hearts.
– Percy Fawcett
1
జేమ్స్ గ్రే దర్శకత్వం వహించిన ది లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ (2016) చిత్రం డేవిడ్ గ్రాన్ రచించిన పుస్తకం The Lost City of Z: A Tale of Deadly Obsession in the Amazon ఆధారంగా రూపొందింది. ఇది సాధారణ సాహసగాథలకు భిన్నంగా, నాగరికత, సామాజిక శ్రేణీకరణ, దురాశ, పాశ్చాత్య ప్రపంచం తనను తాను అర్థం చేసుకోవడంలో ఎదుర్కొనే పరిమితులపై సాగిన గంభీరమైన తాత్విక విచారణ.
ఇది కేవలం ఒక వ్యక్తి సాహసగాథ మాత్రమే కాదు. నాగరికత అంటే ఏమిటి, జ్ఞాన స్వభావం ఏమిటి, సామ్రాజ్యవాదం తన నైతిక దృష్టిని ఎలా కోల్పోయింది అనే అంశాలపై సాగిన ఒక సుదీర్ఘమైన తాత్విక ధ్యానం.
ఈ చిత్రంలోని తాత్విక సారాంశం అమెజాన్ ఆదివాసీ తెగల చిత్రణలో నిక్షిప్తమై ఉంది. వారిని కేవలం విచిత్రమైన నేపథ్యాలుగా గానీ, అన్వేషకులకు ఎదురయ్యే అడ్డంకులుగా గానీ చూపించకుండా, ప్రగతి, ఆదిమత్వం, మానవ సామర్థ్యం గురించి యూరోపియన్లు కలిగి ఉన్న అభిప్రాయాలను సవాలు చేసే సజీవ సాక్ష్యాలుగా ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆదివాసీ తెగలు తమ స్వంత జీవన విధానంలో స్వతంత్రంగా ఉనికిలో ఉండటం ద్వారానే ఈ జ్ఞానవ్యవస్థలోని బలహీనతను బయటపెడతాయి.
కోల్పోయిన నగరం(Lost City) నిజంగా ఉందని నిరూపించడంలో ఈ చిత్రం యొక్క తాత్విక శక్తి లేదు. “అసలు ఆదివాసీలను ఆదిమ మానవులుగా చూడాల్సిన అవసరం పాశ్చాత్య ప్రపంచానికి ఎందుకు ఏర్పడింది?” అనే ప్రశ్నను ప్రేక్షకుడు ఎదుర్కొనేలా చేయడంలోనే దాని అసలైన శక్తి ఉంది.
చార్లీ హన్నమ్ పోషించిన పెర్సీ ఫాసెట్, అప్పటికే వర్గవివక్షత, వంశపారంపర్య అపకీర్తి అనే భారాలను మోస్తున్న ఒక సైనిక అధికారి. మొదట రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ తరఫున భూసర్వే చేయడానికి, ఆ తర్వాత తాను ‘జెడ్’ అని పేరు పెట్టిన ఒక ఊహాత్మక ఉన్నత నాగరికతకు చెందిన ప్రాచీన నగరాన్ని అన్వేషించడానికి అతడు పదేపదే ఒక ఉన్మత్తుడిలా అమెజాన్ అడవుల్లో అన్వేషిస్తుంటాడు.
ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలోని బ్రిటిష్ సమాజం, ఈ చిత్రంలో, మానవ సమూహాలను ఒక క్రమపద్ధతిలో ఉన్నతులుగా, అధములుగా విభజించే మూఢత్వం పై ఆధారపడి ఉంటుంది. రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీలోని పెద్దమనుషులు పటాలు, పతకాల గురించి మాట్లాడినంత నిశ్చయంగా ఆదివాసీలను ‘అనాగరికులు’ అని అభివర్ణించడానికి వెనుకాడరు. ఫాసెట్ కూడా మొదట ఈ ప్రపంచ దృక్పథంలో భాగంగానే ఉన్నాడు. కానీ ప్రత్యక్ష అనుభవాలు, ఆధారాలు అతడిని ఆ దృక్పథాన్ని విడిచిపెట్టేలా చేస్తాయి. కుండ పెంకులు, చెట్లపై చెక్కిన గుర్తులు, వ్యవసాయానికి అనుకూలంగా మార్చిన అటవీ ప్రాంతాలు, పెద్ద నదులకు దూరంగా కూడా అభివృద్ధి చెందిన ప్రజా సమూహాల ఉనికి – ఇవన్నీ ఒకప్పుడు అమెజాన్ ప్రాంతంలో సంక్లిష్టమైన నాగరిక సమాజాలు విలసిల్లాయని, కొన్ని ప్రాంతాల్లో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని వాదించడానికి అతడికి ఆధారాలుగా కనిపించాయి.
రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ముందు అతడు చేసిన ప్రసంగాలు కేవలం ఉదారవాద ఆదర్శాల ప్రకటనలు కావు; అవి జ్ఞానాన్ని అర్థం చేసుకునే పద్ధతులపైనే తిరుగుబాటు చేస్తాయి. ఆదివాసీ తెగలు పాశ్చాత్య జ్ఞాన సిద్ధాంతానికి ఒక తాత్విక ప్రతివాదంగా నిలుస్తాయి. ఎడ్వర్డియన్ ఇంగ్లండ్ ‘అనాగరికులు’గా కొట్టిపారేసిన అమెజాన్ ఆదివాసీ తెగలకు సాంస్కృతికంగా, మేధోపరంగా, నైతికంగా ఒక విశిష్టమైన గొప్పతనం ఉంది. తమను తాము నాగరికులుగా భావించుకున్న పాశ్చాత్య ప్రపంచం, తన నిర్మాణాత్మక పరిమితుల కారణంగా ఆ గొప్పతనాన్ని గుర్తించలేకపోయింది అని అతడు బల్లగుద్ది చెబుతాడు.
ఈ చిత్రానికి కేంద్రంగా ఉన్న ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదనగా అమెజాన్ ప్రాంతంలో ఒక సంక్లిష్టమైన నాగరికత ఉనికిలో ఉండి ఉండవచ్చని ఫాసెట్ సూచించినప్పుడు, అతడు ఎగతాళికి గురవుతాడు. ఆధారాలు లేనందువల్ల కాదు; ‘నాగరికత’ అనే భావనలో అడవుల్లో నివసించే నల్లని చర్మం కలిగిన ప్రజలకు స్థానం కల్పించాలనే ఉద్దేశమే ఆ వ్యవస్థకు లేనందువల్ల.
రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఒక మూసివేసిన జ్ఞానవ్యవస్థలో పనిచేస్తుంది. దాని దృష్టిలో నాగరికత అంటే లిఖిత ఆధారాలు, అధికార శ్రేణులు, యూరోపియన్ చరిత్రకు సంబంధించిన కంటికి కనిపించే స్మారక నిర్మాణాలు.
యూరోపేతర ప్రజలు పాశ్చాత్య నగరాలకంటే పురాతనమైన, కొన్ని అంశాల్లో వాటికంటే సంక్లిష్టమైన నగరాలను నిర్మించగలిగారని అంగీకరించడం అంటే, సామ్రాజ్యవాదానికి నైతిక, చారిత్రక సమర్థనగా ఉపయోగించిన పునాదులనే కూల్చివేయడం. అవి ఆదివాసీ తెగల గొప్పతనాన్ని కొలిచే మరో ప్రమాణాన్ని మన ముందుంచుతాయి.
యూరోపియన్ నాగరికత తన గొప్పతనాన్ని ఇనుము, లిఖిత పత్రాలు, సంస్థాగత అధికార శ్రేణుల ద్వారా కొలుస్తుంది. కానీ ఈ చిత్రం అమెజాన్ ప్రజల జీవనాన్ని ప్రకృతితో సన్నిహిత పరిచయం, పరస్పర సహకారం, ఆచారాల నిరంతరత, తమ పరిసరాలను అర్థం చేసుకోవడంలో సాధించిన ఆచరణాత్మక నైపుణ్యం వంటి అంశాల ఆధారంగా ఆవిష్కరిస్తుంది. బయటి నుంచి వచ్చినవారిని పదేపదే ఓడించే అడవి వాతావరణంలో వారు తమ జీవితాలను సమర్థంగా నిర్వహిస్తారు.
ఒక సన్నివేశంలో నరమాంస భక్షణను ఆచరించే ఒక తెగను చూపిస్తూనే, వారు అడవిని నైపుణ్యంతో సాగు చేస్తూ, క్రమబద్ధమైన నివాస ప్రాంతాల్లో జీవిస్తున్నారని కూడా దర్శకుడు చూపిస్తారు. గ్రే హింసను ఆదర్శవంతం చేయడు; ప్రమాదాన్ని కూడా దాచిపెట్టడు. బాణాలు దూసుకొస్తాయి, శత్రుత్వం వాస్తవమే. అయినప్పటికీ, ఆ వాస్తవాల ఆధారంగా వారిని ఊరికే ‘అనాగరికులు’ అనే ఒక వర్గంలోకి నెట్టివేయడానికి మాత్రం చిత్రం నిరాకరిస్తుంది.
శత్రువుల మాంసాన్ని తినే లేదా తమ భూభాగాన్ని ప్రాణాంతకమైన దృఢత్వంతో రక్షించే అదే వ్యక్తులు వ్యవసాయ జ్ఞానాన్ని, సామాజిక సమన్వయాన్ని కూడా ప్రదర్శిస్తారు. మరోవైపు, ఆకలి, వ్యాధులతో క్షీణించిన అన్వేషకులు తమ ప్రాథమిక మనుగడ అవసరాలను కూడా తీర్చుకోలేకపోతారు.
దర్శకుడు జేమ్స్ గ్రే స్పష్టంగా, ఆదివాసీ ప్రజలను “శ్వేతజాతీయుడి ప్రమేయంతో సంబంధం లేని, పూర్తిగా స్వతంత్రులైన ప్రజలుగా” చిత్రీకరించాడు. తద్వారా వలసవాద కథనాల్లో తరచుగా కనిపించే రెండు సౌకర్యవంతమైన మూసలను – ప్రకృతికి దగ్గరగా ఉండే అమాయక ఆదిమ మానవుడనే భావనను, లేదా యూరోపియన్ల గుర్తింపు మీద ఆధారపడే ప్రజలనే భావనను – ఆయన తిరస్కరిస్తాడు.
వారి గొప్పతనానికి పునాది ఈ అస్తిత్వ స్వతంత్రతే. ఫాసెట్ వచ్చి వారిని ‘కనుగొనాల్సిన’ అవసరం లేకుండానే వారు వాస్తవంగా ఉనికిలో ఉన్నారు.
పాశ్చాత్య దృష్టి సాధారణంగా గుర్తించలేని నిర్దిష్టమైన ఆధారాల ద్వారా ఈ చిత్రం ఆదివాసీ తెగల గొప్పతనాన్ని చూపిస్తుంది.‘ఆదిమ అడవి మనుషులు’ అని పిలవబడిన ప్రజలకు “తమ స్వంత రహదారులు, వ్యవసాయ వ్యవస్థలు, మత విశ్వాసాలతో కూడిన సంక్లిష్టమైన నాగరికత” ఉండేదని ఫాసెట్ ఆధారాలను కనుగొంటాడు.
ఇవి ప్రకృతితో పోరాడుతూ మనుగడ సాగించడానికి ప్రయత్నిస్తున్న ఒక తక్కువ స్థాయి సంస్కృతికి సంబంధించిన అలంకారాలు కావు. యూరోపియన్లు రాకముందే తమ పర్యావరణాన్ని లోతుగా అర్థం చేసుకుని, దానిని సమర్థంగా వినియోగించుకున్న ప్రజల చారిత్రక సంతకాలు.
అడవి అంటే స్వాధీనం చేసుకోవడానికి ఎదురుచూస్తున్న ఖాళీ భూభాగం కాదు. అది ఇప్పటికే ప్రజలతో నిండిన, వారి జీవన విధానాల ద్వారా రూపుదిద్దుకున్న ప్రపంచం. యూరోపియన్లు అడవిని కేవలం ముప్పుగా భావిస్తే, స్థానిక తెగలు అందులో ప్రయాణిస్తాయి, వ్యవసాయం చేస్తాయి, వైద్యం చేసుకుంటాయి, తమ జీవితాలను కొనసాగిస్తాయి.
ఆదివాసీ ప్రజలు “ఔషధ విజ్ఞానంలో నిష్ణాతులు; తమ అవసరాలకు అనుగుణంగా పర్యావరణాన్ని మలచుకోవడంలో నేర్పరులు.” అడవిలోని ఏ పదార్థాలు వ్యాధులను నయం చేయగలవో, ఏవి ప్రాణాంతకమైనవో వారికి సన్నిహితమైన పరిజ్ఞానం ఉంది. అన్వేషకుల బృందానికి ప్రాణాలు నిలుపుకోవడానికి అత్యవసరంగా అవసరమయ్యే జ్ఞానం అదే. ఈ జ్ఞానం కేవలం ఆసక్తికరమైన విషయం మాత్రమే కాదు. వేల సంవత్సరాల అనుభవం ద్వారా అభివృద్ధి చెందిన ఒక శాస్త్రీయ పరిజ్ఞానం. అది అన్వేషకులను సజీవంగా ఉంచగలదు.
స్థానిక ప్రజలు సహజమైన నైపుణ్యంతో నిర్వహించే సాధారణ పనుల్లోనే ఫాసెట్ బృందం పదేపదే విఫలమవుతుంది. ఇది ‘ప్రకృతికి దగ్గరగా జీవించే ఆదిమ మానవుడే ఉత్తముడు’ అనే రొమాంటిక్ భావన కాదు. సాంకేతిక సంక్లిష్టతే ఉన్నతమైన జీవనానికి ఏకైక ప్రమాణం కాదనే వాస్తవాన్ని చూపించే పరిశీలన.
ఒక పర్యావరణాన్ని సమర్థంగా అర్థం చేసుకుని, దానితో సహజీవనం చేయగలగడం కూడా మానవ మేధస్సుకు, నాగరికతకు ముఖ్యమైన ప్రమాణమే.
రోడ్లు, బహిరంగ ప్రాంగణాలు, కుండల తయారీ సంప్రదాయాలు, పెద్ద జనాభాల ఉనికికి సంబంధించిన ఆధారాలు – ఇవన్నీ యూరోపియన్లు ‘అభివృద్ధి’గా గుర్తించే అధికార యంత్రాంగాలు లేదా పారిశ్రామిక వ్యవస్థలు లేకుండానే పెద్ద స్థాయి సామాజిక వ్యవస్థలను నిర్మించగలిగిన సమాజాల ఉనికిని సూచిస్తాయి.
ఇక్కడి భావన నిజ జీవితంలో తరువాత వెలుగులోకి వచ్చిన, ముఖ్యంగా జింగూ ప్రాంతంలోని కొలంబస్కు పూర్వపు నివాస సముదాయాలపై జరిగిన పురావస్తు పరిశోధనలను కూడా గుర్తుకు తెస్తుంది.
గొప్పతనం తప్పనిసరిగా లండన్‌లా లేదా రోమ్లా కనిపించాల్సిన అవసరం లేదని ఈ చిత్రం సూచిస్తుంది. తరతరాలుగా సంక్రమించే ఆచార జ్ఞానం, పరస్పరం అనుసంధానమైన గ్రామాలు, వాటిని కలిపే మార్గాల ద్వారా కూడా గొప్ప సామాజిక వ్యవస్థలు ఏర్పడవచ్చు.
ఒక సమాజం ఎంత గొప్పదో నిర్ణయించేది దాని భవనాల ఎత్తు లేదా అధికార వ్యవస్థల సంక్లిష్టత మాత్రమే కాదు; అది తన ప్రజల జీవితాలను ఎంత సమర్థంగా నిర్వహిస్తోంది, తన జ్ఞానాన్ని ఎంత సమర్థంగా తరువాతి తరాలకు అందిస్తోంది అన్నది కూడా.
(సశేషం)








Add comment