మంటల్లో ఇల్లు కాలుతుంటే
పొగను చూస్తూ నిర్వికారంగా నిలబడిపోవడమే
మాట్లాడాల్సివచ్చినప్పుడు మాట్లాడకపోవడం.
మంటలు ముందుగా ఇంటిని కాల్చవు.
అవి నిఘంటువులోని మౌనం అనేముఖ వస్త్రాన్ని కాలుస్తాయి.
తర్వాత ఇల్లు అనే పదమే
బూడిదకు పర్యాయపదమైపోతుంది—
ప్రశ్నల మంటలకు ఇంధనమై.
తుపాకీ గురిపెడితే మాటలు రావు.
అది వార్త కాదు.
తుపాకీ వెళ్లిపోయాక కూడా
గాయాల మాతృభాషగా
మౌనం శాశ్వత నివాసం ఏర్పరచుకోవడమే చరిత్ర.
కాల్చివేతలకు
మౌనమే అధికార భాష కావడమే
మాట్లాడాల్సివచ్చినప్పుడు మాట్లాడకపోవడం.
మాట్లాడాలంటే
మూడో నేత్రం తెరిచి అద్భుతాలు చూడడం కాదు.
కనిపిస్తున్నదాన్ని
మొదటిసారి చూసినట్టుగా చూడడం.
వినాలంటే
జ్ఞానరాత్రిలో నిశ్శబ్ద గుడ్లగూబ కావాలి.
చీకటిని చూడడానికి కాదు—
చీకటి ఎవరిని చూస్తుందో వినడానికి.
ఎవరూ మాట్లాడని గదిలో
చీమ చిటుక్కుమంటే
అది శబ్దం కాదు.
అది ఒక గొప్ప సంభాషణ.
ప్రజాస్వామ్యం
తన హాజరు పత్రంపై సంతకం పెట్టినట్టుంటుంది.
చీమలను వెతకాలి.
వెదుకులాట అడవిలో కాదు.
వ్యాఖ్యల మధ్య,
డిలీట్ చేసిన పోస్టుల మధ్య,
డ్రాఫ్టుల్లో మిగిలిపోయిన వాక్యాల మధ్య,
గొంతు దిగమింగుకున్న మనుషుల మధ్య.
పొదల గుసగుసలకు
స్వేచ్ఛానువాదం అవసరం లేదు.
మన భయాలే
వాటికి సబ్‌టైటిల్స్ రాస్తుంటాయి.
మాట్లాడాలంటే
మాట్లాడే వాక్యమై
మాటల్లోనే కనీసం వెయ్యి మైళ్లు ప్రయాణించాలి.
మాట్లాడితే అన్ని వేదికలూ
ఒక జంతర్ మంతర్‌గా మారిపోయేలా మాట్లాడాలి.
మాట్లాడడం అంటే
ఒక వాక్యం రాయడం కాదు.
ఒక మనిషి నుంచి మరో మనిషికి
భయాన్ని దాటించే వంతెన కావడం.
అన్ని వేదికలు
ఒకరోజు లమాకాన్ కాకపోవచ్చు.
కానీ ఒక మనిషి గొంతు
మరో మనిషి గొంతును గుర్తుపట్టిన క్షణం—
అదే సభ.
అదే మాటల మానవహారం.
కాబట్టి
మాట్లాడుతూనే ఉండు.
(ప్రశ్న రావణ్‌కు సంఘీభావంగా)
చిత్రం: రాజశేఖర్ చంద్రం








Add comment