మనసు చంచలమే, ఆలోచన సుస్థిరం!

     కవిత్వం అనేది ఒక అద్భుతమైన సృజనాత్మక ప్రక్రియ. అందులోని ప్రతి పదం ఒక సరికొత్త ఆలోచనకు ద్వారం తెరుస్తుంది. అలా నా మనసు వాకిలి తెరిచి, భావోద్వేగాల లోతులను తట్టిలేపిన కవిత ‘మేలిమి చింత’. సమకాలీన వచన కవిత్వంలో తనదైన ముద్ర వేస్తున్న ఆవంచ ప్రమోద్ కుమార్ కలం నుండి జాలువారిన కవిత ఇది.

2019 నుండి నిరంతర సాధన చేస్తూ, 300కు పైగా కవితలు రాసిన ప్రమోద్ కుమార్ ‘గుండె చప్పుళ్ళు’ (2021), ‘మేలిమి చింత’ (2024) అనే రెండు కవితా సంపుటాలు ప్రచురించారు. పూర్వాశ్రమంలో ‘పొద్దు’, ‘కృష్ణా పత్రిక’, ‘ఉదయం’లలో పాత్రికేయుడిగా పనిచేసిన అనుభవం ప్రమోద్ శైలికి వస్తు స్పష్టతను ఇస్తే, ‘కవి సంగమం’ వేదిక కవితా నడకకు నిశితమైన సాన పెట్టింది. ప్రేమతత్త్వం నిండిన వైయక్తిక అనుభవాలను సార్వజనీనం చేసే ప్రమోద్ కుమార్ ‘మేలిమి చింత’ కవితపై విశ్లేషణ సారంగ పాఠకుల కోసం…

మేలిమి చింత

 

వెండి ఒలకబోసినట్లు వెన్నెల కురిసింది. 

మై జారు కొంగు తడిచింది. 

అందాలు, రవికె గుండెల్లో బందీలయ్యాయి 

ఆరబెట్టుకుంటున్న గాలి శబ్దం 

లబ్ డబ్ కొట్టుకుంటుంది

 

కురుల అడవి తాజాగా ప్రకటించింది. 

హృదయానికి కాపలా కాస్తున్నాననీ! 

మబ్బు సందులోనుంచి తొంగిచూసింది 

వెన్నెల… చలనం చంచలమై, 

గమ్యం ఊగిసలాడింది.

 

మొదలయ్యాయి కదలాడే 

రసాయన ప్రక్రియలు 

గుండె స్పందనలో ఒక విస్ఫోటనం 

చిత్తడైన నడక పసి అడుగులు వేసింది

 

అనుభవాలన్నీ వ్యర్థమయ్యాయి 

వెలుగు మనసు చీకట్లో తచ్చాడింది 

వెన్నెల అడుగులకు ఆక్షేపణలు 

అడ్డు పడుతున్నాయి

 

మైకమైన ప్రపంచం 

మబ్బు పొరల్లో దాచుకుంది 

ఒక మేలిమి చింత 

హృదయపు చెంత కొట్టుకుంటుంది.

— ఆవంచ ప్రమోద్ కుమార్

    ‘మేలిమి చింత’ అనే పదబంధంలోనే ఒక తాత్విక స్పర్శ ఉంది. ‘మేలిమి’ అంటే స్వచ్ఛమైన, ఉత్తమమైన స్థితి; ‘చింత’ అంటే కేవలం దిగులు మాత్రమే కాదు, అంతర్మథనంతో కూడిన లోతైన ఆలోచన. బాహ్య సౌందర్య వర్ణనతో మొదలై, అంతర్గత మానసిక సంఘర్షణల మీదుగా సాగి, చివరకు ఒక ఉన్నతమైన తాత్విక అనుభూతిగా పరిణమించే అంతర్ముఖ ప్రయాణం ఈ కవిత. ఐదు ఆవృతాలుగా సాగిన ఈ కవితా ప్రయాణంలో భావాల క్రమపరిణామం అత్యంత సహజంగా, రమణీయంగా సాగింది.

     మొదటి ఆవృతంలోనే దృశ్య ప్రధానమైన రొమాంటిక్ ఇమేజరీతో పాఠకుడిని ఆవహిస్తుంది. ‘వెండి ఒలకబోసినట్లు వెన్నెల కురిసింది’ అనడంలో చంద్రకాంతి ద్రవరూపమై ఒంటిని తాకుతున్న అనుభూతి వ్యక్తమవుతుంది. అయితే ఇది కేవలం ప్రకృతి వర్ణనకే పరిమితం కాలేదు.

‘మై జారు కొంగు తడిచింది

అందాలు, రవికె గుండెల్లో బందీలయ్యాయి’

అంటూ భౌతిక, ఇంద్రియ స్పర్శల మేళవింపును కవి తీసుకువచ్చారు. వెన్నెలలో తడిసిన కొంగును ఆరబెట్టుకుంటున్న గాలి శబ్దమే గుండెలో ‘లబ్ డబ్’ మనే స్పందనగా మారడం ఇక్కడి అద్భుతమైన మానవీకరణ. బాహ్య ప్రపంచంలోని చప్పుడు అంతరంగాన్ని కదిలించిన అద్భుత క్షణమిది.

     పైవిధంగా గుండెల్లో మొగ్గతొడిగిన అనురాగ ప్రకంపనలకు రక్షణగా రెండవ చరణంలో మనసు సంసిద్ధమవుతుంది.

‘కురుల అడవి తాజాగా ప్రకటించింది

హృదయానికి కాపలా కాస్తున్నాననీ!’

అనడంలో మనసు పొరపాట్లు చేయకుండా బాహ్య కవచం అడ్డుపడుతున్న సూచన కనిపిస్తుంది. కానీ భావోద్వేగాల సహజ ధర్మాన్ని ఏ కవచాలూ నిలువరించలేవు కదా!. అందుకే ‘మబ్బు సందులోనుంచి తొంగిచూసింది వెన్నెల’. ఆ వెలుగు ప్రవేశించగానే స్థిరంగా ఉండాల్సిన ‘చలనం చంచలమై, గమ్యం ఊగిసలాడింది’. భద్రమైన రక్షణ వలయాన్ని చీల్చుకుని వెన్నెల ప్రవేశించినప్పుడు కలిగే అనిశ్చితి, అయోమయ స్థితిని కవి ఇక్కడ సహజంగా ఆవిష్కరించారు.

     ఈ చంచలత్వపు కొనసాగింపే మూడవ చరణం అంతర్గత మార్పులకు దారితీసింది. ‘మొదలయ్యాయి కదలాడే రసాయన ప్రక్రియలు’ అంటూ ప్రేమ లేదా మోహపు తాలూకు శరీర-మానసిక రసాయనిక స్పందనలను ఆధునిక పరిభాషలో చిత్రించారు. ఆ ప్రక్రియలు సాధారణంగా సాగలేదు; ‘గుండె స్పందనలో ఒక విస్ఫోటనం’ సృష్టించాయి. ఆ భావోద్వేగ తీవ్రతకు గురైన మనసు పాత పద్ధతులను వదిలేసి, ‘చిత్తడైన నడక పసి అడుగులు వేసింది’. నిశ్చయమైన స్థిరమైన నడక కాస్తా తడి నేలపై పసిపాప వేసే మొదటి అడుగులా తడబడుతూ, కొత్త అనుభూతి వైపు సాగడం ఇక్కడి భావోన్నతి.

     అలా వేసిన పసి అడుగులు ఎదుర్కొన్న వైరుధ్యాలే నాలుగవ ఆవృతంలో వ్యక్తమవుతాయి. కొత్త ఉద్వేగం ముందు ‘అనుభవాలన్నీ వ్యర్థమయ్యాయి’. గతం నేర్పిన పాఠాలేవీ ఈ తాజా అనుభూతిని వ్యాఖ్యానించలేకపోయాయి. ఫలితంగా ‘వెలుగు మనసు చీకట్లో తచ్చాడింది’. స్పష్టత ఉండాల్సిన మనసు గందరగోళంలో పడింది. ఒకవైపు ప్రేమ తాలూకు ఉరవడి, మరోవైపు సాంప్రదాయ, లౌకిక పరిమితులు. అందుకే ‘వెన్నెల అడుగులకు ఆక్షేపణలు అడ్డు పడుతున్నాయి’. ముందుకు సాగాలన్న వెన్నెల వంటి స్వచ్ఛమైన కోరికకు మనసులోని భయాలు, లోకపు నిబంధనలు ఆటంకాలుగా మారాయి.

     ఈ అంతర్గత, బహిర్గత ఘర్షణల పరాకాష్టే ముగింపు చరణం. అలజడి సృష్టించిన ‘మైకమైన ప్రపంచం మబ్బు పొరల్లో దాచుకుంది’. బాహ్యమైన ఆకర్షణలు, శరీరపు ఉద్వేగాలు నెమ్మదించి మబ్బుల మాటున దాగిపోయాయి. చివరకు నిలిచింది భౌతిక వ్యామోహం కాదు; ‘ఒక మేలిమి చింత హృదయపు చెంత కొట్టుకుంటుంది’. ప్రేమలోని ఆరాటం ఒక స్వచ్ఛమైన, ఉన్నతమైన జీవన చింతనగా, ఆర్తిగా హృదయంలో స్థిరపడింది. కవిత బాహ్యమైన మోహంతో మొదలై, అంతర్గత సంఘర్షణలను దాటుకుని, చివరకు పవిత్రమైన ‘మేలిమి చింత’గా పరిణతి చెందడం ఈ రచనలోని శిల్ప సౌందర్యం.

     ప్రమోద్ కుమార్ ఈ కవితలో వాడిన బింబాలు అత్యంత సజీవమైనవి. ‘కురుల అడవి’, ‘వెండి ఒలకబోసిన వెన్నెల’, ‘మబ్బు పొరల్లో దాచుకున్న మైకమైన ప్రపంచం’ వంటి భావచిత్రాలు  కవితకు దృశ్యరూపాన్ని ఇచ్చాయి. అదే సమయంలో ‘గాలి లబ్ డబ్ మని కొట్టుకోవడం’, ‘కురుల అడవి కాపలా కాయడం’, ‘వెన్నెల అడుగులు’ వంటి మానవీకరణలు (Personification) అచేతన వస్తువులకు ప్రాణప్రతిష్ట చేశాయి. ఆధునిక శాస్త్రీయ పదబంధమైన ‘రసాయన ప్రక్రియలు’ను సంప్రదాయ ‘వెన్నెల’ ప్రతీకతో ముడివేసిన నేర్పు ప్రశంసనీయం.

మొత్తంగా, ‘మేలిమి చింత’ అనేది శారీరక అనుభూతుల నుండి తాత్విక స్పృహ వైపు సాగే ఒక సున్నితమైన ప్రయాణం. ఆధునిక వచన కవితా శిల్పానికి, అనుభూతి సాంద్రతకు ఈ కవిత చక్కని నిదర్శనంగా నిలుస్తుంది. అనుభూతిని అనుభవంగా, అనుభవాన్ని ఆలోచనగా మలిచిన ప్రమోద్ కుమార్ అభినందనీయుడు.

*

విల్సన్ రావు కొమ్మవరపు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.