మట్టి వాసనల మనిషి కవిత్వం

“బిందెలో నీళ్లు నిండుగా ఉంటే తొణకవు, వెలితి ఉంటే నీళ్ళు ఖాళీ జాగాల్లోకి పరుచుకొని తుళ్లుతూ నీ ఒంటిని తడిపేస్తాయి, ఎలా అంటే జ్ఞానంతో నిండుగా ఉన్న మనిషి మాట ఎలా అయితే పరిపూర్ణంగా, సౌమ్యంగా, స్థిరంగా ఉంటుందో” అలా, అని చెప్పేది అమ్మమ్మ. అలాంటి నిండు కుండలాంటి కవి అంతరంగంలో వచ్చిన కవిత్వం అస్సలు తొణకదు. పాఠకుల్ని మాత్రం తొలిగా తొణికిసలాడేలా చేస్తుంది. కిందామీదా పడేలా చేస్తుంది. దేన్ని మర్చిపోతున్నామో దాన్ని గుర్తుచేస్తుంది, చివరకు నీటికుండలాంటి నిండు మనిషిని చేస్తుంది. అదే – డా. సుంకర గోపాలయ్య గారు వెలువరించిన రెండవ కవితా సంపుటి ‘నీటికుండలాంటి  మనిషి’.
గోపాలయ్య గారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఒకవేళ చెప్పవలసి వస్తే నా సాహిత్య అనుభవం ఎంతమాత్రం సరిపోదు. గోపాలయ్య గారిని ప్రత్యక్ష్యంగా కలిసింది రెండుమార్లే. అయితేనేం, అతని సాహిత్య ప్రయాణం తెలుసుకున్న నేను అబ్బురపడుతూనే ఉన్నాను. భావాల్ని వ్యక్త పరచడానికి భాషాడంబరత అక్కర్లేదని అతని కవిత్వం చదివిన, అతని ఉపన్యాసాలు విన్న ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అలాగే అలతి పదాలలోనే నిగూఢతను తెలియచెప్పే కవులలో గోపాలయ్య ముందంజలో ఉంటారు. గోపాలయ్య కవిత్వం నిండా కమ్మని మట్టివాసన గుబాళిస్తుంది.
మనిషన్న వానికి ప్రకృతిపట్ల ప్రేమ ఉంటుంది. సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. సాటి మనుషుల పట్ల కనీసం జాలి ఉంటుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో అవన్నీ బహుశా చాలావరకు కనుమరుగయ్యాయనే చెప్పొచ్చు. దానికి ఉదాహరణలు ఎన్నని ఇవ్వగలను? అటువంటి సమాజంలో ఉన్న మనకు కనీసపు ఎరుక కలగాలని కోరుకునే కవి అంతర్మథనం ఈ సంపుటిలోని ప్రతి పుటలోనూ కనిపిస్తుంది.
యాంత్రికమైన జీవనం అనేకన్నా యాంత్రికతను కొనితెచ్చుకున్న మన జీవితాల్లో అందమైన, స్వచ్ఛమైన కల కనడం అనేది బహుశా అతిదుర్లభమే. అలాంటి మరమనుషులకు మరమ్మత్తు చేయాలని “అప్పుడు” గాథాసప్తశతి నాటి స్వచ్ఛమైన అమ్మాయిని, ప్రకృతిలోని ఆణువణువూ ఎలా అలౌకిక పరవశం పొందేవో కలగన్నాను నేను అంటారు కవి.
నిస్వార్థతకు పుట్టినిల్లు ప్రకృతి అయితే, ఆ ప్రకృతిని అమ్మతో పోలుస్తూ “అమ్మ – అడవి” లాంటి గొప్పది అంటారు. ఋతువులన్నీ ఆ అమ్మలలాంటి అడవుల మీద నుండే వెళ్ళివస్తాయి అంటారు. ఋతువులన్నీ తన రక్తసంబంధీకులు అనడం కవికి ప్రకృతి పట్ల, ముఖ్యంగా మనకు జీవనాన్ని అందించే అడవులపట్ల ఉన్న అవ్యాజమైన ప్రేమను వ్యక్తం చేస్తుంది. అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుంది. ఈ సంపుటిలోని ఎక్కువ కవితలు చెట్టుతో మనిషి ఒకప్పుడు అల్లుకున్న, ఇప్పుడు పెనవేసుకోవాల్సిన అనుబంధాన్ని సగం వాసంతంలా పచ్చగా ఉండి, సగం శిశిరంలా వడిలిపోయిన గడపకు కట్టిన తోరణాలలా కనిపించి మన మనసుల్ని తట్టి లేపుతాయి.
మనిషి అంటే మనసున్న వాడు అని అర్థం. మరి ఆ మనసే లోపిస్తే, అందులో ఉండాల్సిన అతి సున్నితమైన స్పందనలు కరువై అహం, అసూయ అనే జాడ్యాలు ఆక్రమిస్తే కోల్పోయిన అనుబంధాలను, జారిపోయిన అందమైన క్షణాలను  “ఆ మిత్రులేరి ” అని వెతకమంటారు. అంతేకాదు మనిషి జన్మ దేనికోసమో “రాలిన పూల పాఠం” గుర్తుచేస్తుంటే “మన లోపలి తోటల్లోకి” ఓసారి వెళ్లి రమ్మంటుంది. అక్కడ సమాధి చేయబడ్డ ఎన్నో పురాజ్ఞాపకాలను తవ్వి తీయమంటుంది. “నువ్వే ఒక పాలపుంత” అయి కంటితో చూడలేని, చేతితో తాకలేని, మనసుతో మాత్రమే స్పర్శించగలిగే ఎన్నో అనుభూతులను ఒడిసిపట్టుకోమంటుంది.
ప్రకృతిని ప్రేమించే మనిషి సమాజాన్ని కూడా ప్రేమిస్తాడు. సమాజం అంటే సాటి మనుషుల గుంపే కదా! అదిగో ఆ గుంపు పడే బాధల్ని తనవిగా చేసుకున్న కవి ఆవేదనను “బడ్జెట్ కు ముందు” వాక్యాల గుట్టలై, హెచ్చరికల బోర్డులై ఎదురుపడతాయి. “ముగింపు” బాణాలై ఆదివాసీ చేతిలో విల్లుగా మారి….’మతపు రాళ్లకు/ శిథిలమయ్యే అడవి బతుకుల్లో / రాజ్యవ్యతిరేక పదాల్ని పోగుచేయాలి / మతాన్ని సాగుచేసే / సింహాసనాల కాళ్ళు విరగ్గొట్టాలి’ అంటూ విప్లవ జ్యోతిగా వెలుగుతుంది.
కల్మషం లేని మనిషి ఎలా ఉంటాడో “నీటికుండలాంటి మనిషి” అద్దంలా మన నిజ ప్రతిబింబాన్ని చూపించి మార్పు తెచ్చుకోవాలో లేదో మనకి మనమే అంతరంగ న్యాయస్థానంలో నిలబడి తీర్పు ఇచ్చుకోమంటుంది. ఇలా ఒక్కో కవిత ఒక్కో కోణాన్ని చూపిస్తుంది. వెరసి గోపాలయ్య కవిత్వం మట్టి కవిత్వం, చెట్టు కవిత్వం, మనిషి కవిత్వమై పాఠకుల మనసులను హలాన్ని పట్టి దున్నుతుంది. ఇహ నాణ్యమైన మార్పువిత్తనాలను నాటుకొని, మొలకలు వచ్చేలా, అమ్మలాంటి వనాలుగా మారేలా మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలంటే అలాంటి కవితారైతు సాగుచేసిన పుస్తకాన్ని చదివితీరాలి.
*

రాధకృష్ణ కర్రి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాధాకృష్ణ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.