మతం మనుషులకోసం అనే తత్వం తిరుమలకు భూమిక. కాబట్టి తిరుమల అనేక మార్పులను ఆహ్వానించింది. శ్రీవేంకటేశ్వరుడు ఏకధృవమూర్తి. ఆయన వెంట మరే దేవేరీ అవతరించలేదు. కాలానుగుణంగా ఇతర దేవతలు వచ్చారు.
తిరుమలను వరాహక్షేత్రంగా సంకల్పము, పురాణాలు పేర్కొన్నప్పటికీ ఇక్కడి శ్రీవరాహస్వామి ఆలయ ప్రస్తావన క్రీ.శ. 1380లో మాత్రమే కనిపిస్తుంది. దండయాత్రల సందర్భంగా అన్యమతస్థులు తిరుమల పట్ల విముఖంగా ఉండాలని వరాహ ఆలయం నిర్మించారని మౌఖిక కథనం!
శ్రీవేంకటేశ్వరుని దేవేరులుగా మరికొన్ని పేర్లు విన్పిస్తాయి. అలమేలుమంగ, పద్మావతి, ఆండాళ్, గోదాదేవి, బీబీనాంచారి… ఈ పేర్లు సాధారణ భక్తులకు ఒకింత అయోమయం కల్గిస్తాయి. అలమేలుమంగ అనే తమిళ పదానికి అర్థం పద్మావతి. అలాగే ఆండాళ్, గోదాదేవి ఒక్కరే. శ్రీదేవి హరి అంతరంగ కాగా- భూదేవి భక్తులకు వ్యక్తరూపం. బీబీ నాంచారమ్మ!?
బీబీ ఉర్దూ పదం. నాంచారి తమిళం. రెండూ భార్య అనే అర్థాన్ని ఇస్తాయి. బీబీ నాంచారి ఎలా అస్తిత్వంలోకి వచ్చింది? ఉత్తరాన పులికాట్ సరస్సునుంచి దక్షిణాన పాండిచ్చేరి వరకు చెలరేగిన హైదర్ అలీ 1782లో తిరుమలకు చూపు దూరంలోని చంద్రగిరిని పట్టుకున్నాడు. ఎన్నో ఆలయాల సొత్తును ఖజానాకు తరలించిన హైదరాలీ తిరుమలకొండ మాత్రం ఎక్కలేదు. సైనికులను ఆ వైపు కన్నెత్తి చూడనివ్వలేదు. కారణం? కథ ఉంది. చంద్రగిరి విడిదినుంచి తిరుమలను చూస్తున్న హైదర్ అలీకి తల వెంట్రుకలు, గడ్డాలు, మీసాలు పెంచుకొని స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు బోడులై తిరిగి రావడం కన్పించింది. ఏమిటి విశేషం అని స్థానిక పూజారులను అడిగారు. కొండపై వెలసిన దేవుడు బీబీ నాంచారి అనే ముస్లిం కన్యను పెళ్లాడాడు. వెళ్లేటప్పుడు భక్తులు కొండలయ్య ప్రీత్యర్థం జుట్టు పెంచుకొని, వచ్చేటప్పుడు బీబీ నాంచారి గౌరవార్థం తలనీలాలు ఇచ్చి వస్తారని చెప్పారు. కొండపై దాడికి ఉపక్రమించిన హైదర్ అలీ బీబీ నాంచారిపై గౌరవంతో మనసు మార్చుకున్నాడని అంటారు.
తమ ఆడపడుచుపై గౌరవంతో అనేక మంది ముస్లింలు తిరుమలలో తమ బావగారిని సందర్శించుకుంటున్నారు. తాళ్ళపాక నుంచి తిరుమల వరకు గల అన్ని క్షేత్రాలను, ఆచారాలను తన కీర్తనలలో ప్రస్తావించిన 15వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య, తలనీలాలు ఇవ్వడం గురించి, బీబీ నాంచారి గురించి ఎక్కడా ఉదహరించక పోవడం గమనార్హం.
శ్రీరంగంలోని శ్రీరంగనాధుని ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాను తీసుకుపోగా అతని కుమార్తె తుళుక్కనాచియార్ రంగనాధుని మనోహర రూపానికి మనసునిచ్చిందని మరొక కథనం. శ్రీరంగంలోని రంగనాధుని ఆలయంలో తుళుక్కనాచియార్ కు ఓ ఆలయం ఉంది. తనకిష్టమైన వెన్న – రొట్టెలను ఇప్పటికీ శ్రీరంగనాధునికి పంపుతుంది. వైష్ణవానికి రాజధాని అయిన శ్రీరంగం నుంచి శ్రీవైష్ణవ క్షేత్రమైన తిరుమలకు ఎగుమతి అయిన దేవతలలో బహుశ : బీబీనాంచారి ఒకరు. బీబీ నాంచారి మత సామరస్యానికి ప్రతీక!
*
తిరుమలకొండ పదచిత్రాలు (2002)








interesting, చెప్పింది ఎంత ఉందో చెప్పకుండా చెప్పింది అంత ఉంది.