కవిత్వం ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కవిత్వం సుత ప్రేమ లాంటిదే. తొలుసూరు కవితకు ఊహ బలమైన ఊపిరిని ఊదుతది. అట్ల, ఇట్ల అని పోలికలు జెప్పుతది. ‘శిమాంట ‘వస్తువు’ నీకైనా, నాకైనా, ఎవరికైనా దాదాపుగా ‘అమ్మ’ నే అయి వుంటది. బాల్యపు జ్ఞాపకాలకు, అసలు సిసలు బాల్యానికి నమ్మకమైన దోస్తు ‘అమ్మ’ మాత్రమే. ఇడిపస్ కాంప్లెక్స్ ప్రకారం అబ్బాయిలకు తల్లిపై ప్రేమ అమితంగా వుండి తండ్రిపై ద్వేషం పెంచుకోవడం, మానసికం గా పరిపక్వ దశకు చేరుకుంటున్న తరుణంలో తండ్రిని అనుకరించడం జరుగుతది. ఎలక్ట్రా కాంప్లెక్స్ తద్విరుద్ధం గా అమ్మాయిలకు తండ్రిపై గల ప్రేమను తెలియజేస్తది. మానసికపరమైన మెచ్యూరిటీ తల్లిని ఆదర్శంగా తీసుకునేలా ప్రేరేపిస్తది. ఇది సాధారణం.
ఇప్పుడిప్పుడే బాల్యం నుండి టీనేజ్ లోకి ప్రవేశిస్తున్న అమ్మాయి కవిత్వం పట్ల ఆకర్షి తురాలై రాసే తొలి ప్రభుత్వ వస్తువు ఏమై ఉంటది? ఈతరం ‘బాలకవులు’ ముందుతరాల కంటే వేగమైన ఆలోచనా స్రవంతిలో ఊహించని ఎత్తుల్లో నిలబడుతున్నరు. బాలల దినోత్సవం -2025 సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన కవితల పోటీల్లో మొదటి బహుమతిని అందుకున్న కవిత ‘దారిదీపం’. రాసిన ‘బాలకవి ‘భాసబోయిన ఈక్షిత’. ZPHS దాట్ల, దంతాలపల్లి మండలం, మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10వతరగతి చదువుతుంది. ప్రేరకులు ఎవరైనా – రేపటి కవిత్వానికి ఏ ఢోకా లేదని తన కవిత్వం ద్వారా వాగ్ధానం చేస్తుంది. ఈక్షిత రాసిన కవిత్వ వస్తువు ‘అమ్మ’. అమ్మను దారిదీపంగా, ఆరోప్రాణంగా, సర్వం తానేనని ఈజన్మ అమ్మకే అంకితమని ‘ఈక్షిత’ చెప్పిన విధానం ఆకట్టుకుంటది. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ‘ఇడిపస్ కాంప్లెక్స్’ కు దగ్గరగా వుండి ‘అబ్బాయి’ని రీప్లేస్ చేస్తది. 1913 లో కార్ల్ జంగ్ ప్రతిపాదించిన ‘ఎలెక్ట్రా కాంప్లెక్స్’ను సవాల్ చేస్తది. సాధారణంగా ఈ దశలోని అమ్మాయి తన తల్లిపట్ల అసూయ, కోపం పెంచుకుని, తండ్రి ప్రేమను పొందాలనుకుంటది. ఈక్షిత ‘ఎలక్ట్రా కాంప్లెక్స్’ దశను దాటిన ఆలోచనలకు, ఉన్నత విలువలకు ప్రాధాన్యతనిస్తూ; వ్యక్తి సమాజ వికాసానికి కృషి చేసే ‘ఆదర్శవాదం’ వైపు పయ నిస్తుందని గ్రహించవచ్చు.
లోకానికి వెలుగునిచ్చే సూర్యుడితో అమ్మను సమానంగా సూత్తది. దిగులు తలుపులు తెరిచి, ఆశల వెలుగులు నింపి, నవ్వుల వెన్నెలై కురుస్తుందని, మంచి చెడుల మర్మం చెప్పి సన్మార్గం చూపుతుందని అమ్మను కొనియాడుతది. దిగులు తలుపులు, ఆశలు వెలుగులు, నవ్వుల వెన్నెలలు వంటి ప్రతీకల్ని ఔచిత్యవంతంగా ఈక్షిత’ ఊహించగల్లుతుంది. ముందుతరం కవులు వాడినప్పటికీ ‘అనుకరణ’ ద్వారానే ‘అభ్యాసం’ మొదలవుతుందనే ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించిన సామాజిక అభ్యాస సిద్ధాంతం (Social learning theory) ను మర్చిపోకూడదు. సమన్వయాన్ని సాధించడంలోని శ్రద్ధ గమనించదగినది.
“Bandura highlighted the retention process in imitation, where individuals symbolically store a model’s behaviour in their minds. For successful imitation, observers must save these behaviors in symbolic forms, actively organizing them into easily recalled templetes (Bandura 1972) Simply Psychology, Reviewed by Olivia-Evans (Albert Bandura’s Social Learning Theory)
పరీక్ష ఫెయిలై ఏడుస్తున్న సందర్భంలో ఓదార్పునిచ్చే స్థితిని; నాన్న కొప్పడుతున్నప్పుడు రక్షణకవచమై నిలబడుతున్న సందర్భాన్ని కవిత్వంలోకి తీసుకొస్తున్నప్పుడు ‘అమ్మ’ పాత్రను స్వీకరించిన విధానం అమ్మాయిలో కల్గించిన ప్రవర్తనలోని మార్పును స్పష్టంగా ప్రతిబింబిస్తది. కన్నీటివాగుకు అడ్డుకట్టవడంలో, చంద్రున్ని దాచిన మేఘమవటంలో “అమ్మ’ రక్షణతంత్రమవటాన్ని (defene mechanism) గుర్తించడం వల్ల ‘నాన్న’ కంటే ‘అమ్మ’ను ఓన్ చేసుకోవడానికి బాగా సహకరించిందని చెప్పవచ్చు. కవిత్వంలో కొనసాగటం ద్వారా మంచి భవిష్యత్తు వుంటుందని ఆశిస్తూ చిన్నారి ‘ఈక్షిత’ కు అభినందనలు.

దారిదీపం
~
పరీక్ష తప్పి కన్నీటి వాగైతే
అమ్మ చేతులు అడ్డుకట్టలైతయి
నాన్న కోప తాపానికి బలికాకుండా
చంద్రున్ని దాచిన మేఘంలా
అమ్మ తన చాటున నన్ను దాస్తుంది
మంచి చెడుల మర్మం చెప్పి
సన్మార్గం చూపుతుంది
దిగులు తలుపులు తెరచి
ఆశల వెలుగు నింపుతుంది
నవ్వుల వెన్నెలై కురుస్తుంది
లోకానికి వెలుగు సూర్యుడైతే
మా ఇంటి వెలుగు అమ్మ
నా దారి దీపం అమ్మ
నా ఆరోప్రాణం అమ్మ
నాకన్నీ మా అమ్మే
మా అమ్మకే అంకితం ఈ జన్మ..
*








కొత్తగా రాసే పిల్లలకు మీ సమీక్ష చాలా ప్రేరణ ఇస్తుంది వాళ్లలో ఉత్సాహాన్ని నింపి ఇంకా గొప్పగా రాసేలా ప్రోత్సహిస్తుంది. బాల కవయిత్రి ఈక్షిత కు సమీక్షకులు బండారి రాజ్ కుమార్ కు అభినందనలు
మీరు కవిత్వాన్ని విశ్లేషించిన తీరు అద్భుతం. మీ కవిత విశ్లేషన్ల చదివిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. కొత్త కొత్త విషయాలను తెలియజేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్.