ప్రశ్నల బోనులో నిలబెట్టే కథ!

ఏప్రిల్ పదిహేను! చిలుకూరి దేవపుత్ర పుట్టిన రోజు.  యెంతో అవగాహన , ఇంకెంతో రాయగలిగిన చేవ ఉన్న దేవపుత్ర అంత తొందరపడి వెళ్లిపోతాడని ఎవరూ వూహించలేదు. 

 తెలుగులో చాలా  కథలు  వస్తువును  విశదీకరించే  విధిలో  శిల్పాన్ని  మరుగుపరుచుకోవడం  కన్పిస్తుంది.  నేరుగా  గంభీరంగా  విషయాన్ని  చెప్పేయడమే  కొన్ని కథల  శిల్పవైవిధ్యం.  అదైనా యెప్పుడు  రాణిస్తుందంటే, ఆ కథ  పాఠకుల్ని  ఆలోచింపజేసినప్పుడే.

కథ  ప్రారంభానికి  ముగింపునకూ  తేడా  ప్రగతిశీలమా, తిరోగమనమా  అన్నది కూడా  కథని  ప్రభావితం  చేస్తుంది. నేరుగానే  కథ చెబుతూ కథారంభంలో  వున్న  ప్రధాన పాత్ర  ఆలోచనలు  కథాఖరికి  బలీయమైన  మార్పుకు  గురికావడం  గుర్తించాల్సిన  వైవిధ్యం.  అట్లా  ఒక కథ  నిష్టుర సత్యం  వద్ద  ముగింపు  తీసుకుని, వాస్తవపరిస్థితిని  చిత్రించే క్రమంలో  ప్రగతిశీలమైన  విషయాన్ని  ప్రశ్నల బోనులో  నిలబెడితే  ఆ  రచయితను  తిరోగమన వాదిగా  యెవరైనా  అనగలరా? ఇట్లా  కథా స్థితి  కేవలం కాల్పనిక  స్థితిగానే  మిగలక, కఠిన వాస్తవం ముందు కొన్ని కథలు పాఠకులను  నిలబెడతాయి. అట్లాంటిదే  చిలుకూరి దేవపుత్ర  ‘బందీ‘ కథ.

హేతువాది, నాస్తికుడూ, సమసమాజ కాంక్షాపరుడైన  వ్యక్తి  జీవితంలోకి తన  భావజాల పరిధిలో  యిమడని  సంఘటన  యెదురై  ప్రతిక్రియ  కోరితే, ఆ  విధికోసం  తన  విశ్వాసాల కుదురు  కదిలే  పరిస్థితి  యెదురైతే  ఆ వ్యక్తి కి  దిక్కెవరు?  తన  విశ్వాసాల  పరిధి  బయట, అంతకాలం  తాను  విమర్శించే  చట్రంలోకే  అనివార్యంగా  వెళ్లాల్సిరావడం  ఎంత  కఠిన పరీక్ష?  తను  అంతకాలం  దూరంగా వుండి, దాని పొడగిట్టని  వ్యవస్థనే  బతిమలాడుకొని  అందులోకి  వెళ్లడం ఎంత శిక్ష? ఈ ఆవేదనను చిత్రించినదే బందీ కథ.

కరుణాకర్ కు  ఒక  అర్ధరాత్రి  తండ్రి  మరణించడంతో , అతని  అంత్యక్రియలు  యెలా జరపాలనే  వుపద్రవం  మీద పడుతుంది.  వాళ్ల కుటుంబానికి  స్థానిక  చర్చిలో  సభ్యత్వమైతే వుందిగానీ, చర్చికి  వెళ్లే అలవాటైతే  లేదు. ఇక  కరుణాకర్ హేతువాదిగా, నాస్తికుడిగా సమసమాజభావనలున్న ఆదర్శవంతుడు.  ఉద్యోగం రీత్యా  వేరే వూరిలో  వుండి, తండ్రి అంత్యక్రియలుకు  వూరకొచ్చినప్పుడు  శ్మశానంలో కి  తండ్రి శవం  వెళ్లాలంటే  చర్చిఫాదర్  అనుమతి  రూపంలో  వాస్తవిక ప్రపంచపు తలుపుల ముందు నిలబడాల్సి వస్తుంది. అవి అంత  సులభంగా  తెరుచుకోవనీ  తెలుస్తుంది.

మొదట  తన కుటుంబానికి  సభ్యత్వమున్న చర్చి ఫాదర్  యింటికి  వెళితే  అతను  ఆసుపత్రిలో చికిత్సకు  చేరినాడని  చర్చి  వాచ్మెన్ భార్య  చెబుతూ, కరుణాకర్ తో , అసలు మీరెప్పుడూ  చర్చికే  వచ్చినట్లు  లేదు గదా, అయినా  మీకు అనుమతి యివ్వడానికి  ఫాదర్  మిమ్మల్ని  గుర్తు యెట్లాపడతాడని  అనుమానం వ్యక్తం  చేస్తుంది.  చర్చిఫాదర్ల  అనుమతి ( శవానికి గుంత  తవ్వుకోవడానికి  అనుమతీ, సమాధి ప్రార్థనా) కోసం  బతిమలాట  ప్రారంభమౌతుంది. ఒక  ఫాదర్ ” అన్యసభ్యులకు అనుమతి యివ్వనూ, యిచ్చి మా సభ్యుల, సంఘం పెద్దలతో  తప్పుపట్టించుకోనూ” అని ముఖం మీదనే  తలుపులు మూస్తాడు.

కరుణాకర్  స్వంత మేనమామే  ఒక  చర్చి  నిర్వహిస్తూ  ఉంటారు. అతన్ని  బతిమలాడితే, ‘యిప్పుడు తెలిసిందా , పిల్లకాకీ వుండేలుదెబ్బ అంటే.  ఏం  కష్టమూ  రానంత కాలం  దేవుడు లేడు, గీవుడు లేడు, చర్చి లేదు, గిర్చి లేదూ, అదేందో  మనిషే దేవుడంటివీ, మానవత్వమే మతమంటివే, పైగా  మతం మత్తుమందు  అని యెద్దేవా చేస్తుండేవాడివిగా, యిప్పుడు కనబడిందా’ అని వెటకారంగా అంటాడు. కరుణాకర్ తండ్రి  కూడా  తన చర్చిలో  సభ్యత్వం తీసుకోలేదనే  కోపమూ  ఆ మేనమామకు వుంటుంది. కరుణాకర్ వెంట  యీ కష్టంలో  చేదోడు గా  వున్న  మాధవ్ అనే మిత్రుడు , కరుణాకర్ కష్టానికి  స్పందిస్తూ, ‘పులిపోయి గిలి అంటుకుంది  మనకి, పోనీ  నువ్వు  యిష్టపడే  నాస్తికులకీ, హేతువాదులకీ, కమ్యూనిస్టులకీ శ్మశానాలున్నాయా అంటే, ఊహు! ఎంత సేపూ  స్టేజిలెక్కి  వుపన్యాసాలివ్వడమే! తీరా  యిట్లా  సమస్యలు  వస్తే  యెవరి మతం  వాళ్లది, యెవరి ఆచారం  వాళ్లది , అంటూ  నిష్కర్షగా  చెప్తాడు.

ఈ కథ , యీలాంటి  పరిస్థితి  క్రైస్తవ అనుయాయుల్లోని పురోగామి వ్యక్తులకే , హిందూ పురోగామి వ్యక్తులకు  శ్మశానంలోకి  వెళ్లడానికి  అనుమతి  అవసరంలేని  విషయాన్ని కూడా  సూచిస్తుంది. అయితే  హిందూ పురోగామి వ్యక్తులకైనా  శ్మశానంలోకి  ప్రవేశించాక  మతాచారం, కులాచారం  వాళ్లమీద  ఆధిపత్యం చేయకమానవు . కథలో  చెప్పిన  సమస్య సంక్లిష్టత రీత్యా, ఏ ప్రాంతానికైనా , ఏ మతావిలంబికైనా  వర్తిస్తుంది.  వ్యవస్థ మనిషిని నియంత్రించే అతి సున్నితమైన  దాని  పనివిధానాన్ని  చిత్రించిన  కథ యిది.

మరి కథలోని  సమస్య  యెట్లా  పరిష్కారమైంది, అంటే, కరుణాకర్  నమ్మే  మానవుడే  దేవుడు,  మానవత్వమే మతం  అనే  సూత్రం వల్లనే.  బాలరాజనే  మానవత్వమున్న  మనిషి, కరుణాకర్  సమస్యను  మాధవ్  ద్వారా  విని, తనకున్న  పరపతిని  వుపయోగించి  ఒక  చర్చి ఫాదర్ ను  ఒప్పించి, అంత్యక్రియలు  సజావుగా  జరిగేలా  చేస్తాడు. అతను  కరుణాకర్ కు  చిన్న హితబోధ  చేస్తాడు. ‘యెవరైనా  దేవుడికి భయపడరు, సంఘానికే  భయపడేది. దేవుడు  లేకపోయినా  సంఘమంటూ  ఒకటుందిగదయ్యా, నాస్తికత్వం, హేతువాదం, సమసమాజం అంటూ  తిరిగేవాడివి. ఇప్పుడు కూడా అవన్నీ నిన్ను  వదులుకోమనడం లేదు. నిన్నూ  నీ  కుటుంబాన్నీ గుర్తించే  సంఘం , శుభాలకీ, అశుభాలకీ  ఆదుకునే  సంఘం ఒకటుందని  నువ్వు  గుర్తుంచుకో, నిన్ను  కష్టాల్లో  దేవుడు  ఆదుకుంటాడో  లేదో కానీ,  మంచికీ, చెడ్డకీ, పెళ్లీ, చావులకీ  ఆదుకునేది  నీ  సంఘమే, నీకు  ముగ్గురు చెళ్ళెళ్లు  వున్నారు’ అని  వాస్తవికతను గుర్తు చేస్తాడు.

శ్మశానంలో  సమాధి ఆరాధన  ముగుస్తుంది.  వచ్చిన వారు  యెవరి  దారిన వారు  వెళ్లిపోతారు.  కరుణాకర్  కూడా  మాధవ్ తో పాటు  వెళ్తూ, దారిలో ఫోటో ఫ్రేం షాప్  వద్ద ఆగి, ఆకాశం వైపు  దీనంగా  చూస్తున్న ఏసు పటాన్ని  యింటికి  తీసుకుపోతాడు.

ప్రగతిశీలమైన భావాలున్న  ప్రొటాగనిష్టు  తన వైయక్తిక, సామాజిక  అవసరాల  రీత్యా కొంత  వెసులుబాటు కు గురవడం కథ.  దీన్నొకవేళ  లొంగుబాటు  అనుకుంటే, అది  కరుణాకర్  అనే  వ్యక్తిదా? ఇన్నేళ్ల  ఆచరణలో  యే ప్రత్యామ్నాయ  సంస్కృతి నీ  నిర్మించలేకపోయిన  హేతువాద, నాస్తిక, కమ్యూనిస్టు శిబిరానిదా? అనే బలమైన ప్రశ్న మన  మెదుళ్లను  తాకి  విరిగిపడే  కెరటం, యీ  కథ.  ఆ కెరటం  పదే పదే  మన  ముఖాలను బాదుతూనే  వుంటుంది ఆ సోకాల్డ్ శక్తులు  మేల్కొనే దాకా.

*

వెంకట కృష్ణ

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆలోచనను రేకెత్తించగల కథ. తాను నమ్మిన విశ్వాసాల పరిధిలోంచి బయటికొచ్చి అంతవరకు విమర్శించిన చట్రంలోకి వెళ్లాల్సి రావడం కేవలం శిక్ష కాదు.. నిరంతర మరణం. Thank you for this article sir..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు