పొడుపు కథల వ్యూహంలో కవిత రాయచ్చా?!

ఒక జవాబు రాబట్టిన తర్వాత, దానిని దృష్టి లో వుంచుకుని ‘కవిత’ను మరోమారు చదివితే ఖాళీలను పూరించుకుంటూ వెళ్లవచ్చు.

విగా, పాటల రచయితగా, పరిశోధకుడిగా తనకంటూ ఒక గుర్తింపును సాధించిన యువకెరటం తిరునగరి  శరత్ చంద్ర. నిర్మాణ పరంగా తను రాసిన కవిత ‘అది’ ఎలా వుందో తెలుసుకుందాం.
*
అది
~
అకస్మాత్తుగా
ఆవేశాన్ని అక్కున చేర్చుకుని
అర్రులు సాచే
ఆకాశంలాంటిదది
అర్థమయ్యే
ప్రశ్నలకు కూడా
అనర్థాల ముసుగులు వేసి
వెంట తీసుకెళ్తుందది
రాలిపడిన జ్ఞాపకాలను
కాసేపు
నిటారుగా నిలబెట్టి
వాటికి నీడవుతుంది
అందలమెక్కిన
అవకాశాలను
నోట కరుచుకుని వెళ్ళి
నిర్లక్ష్యపు అలల కింద
పాతిపెడుతుంది
కాసేపు పూలు పూస్తుంది
మరి కాసేపు మోడైపోతుంది
ఇదీ నేనంటే
అనేలా చేస్తుందది
ఏదీ తెలియనిదది
అన్నీ తెలిసినదీ అదే
కోపం ఒళ్ళెక్కి
గాయాలు చేస్తున్నప్పుడు
కట్లు తెంచుకొచ్చే
మాటల ప్రవాహానికి
మౌనాన్ని అడ్డుకట్టగా వేస్తుంది
కొన్ని ఏళ్ళ నుండి
నీలో పేరుకుపోయిన
చెత్తను
క్షణాల్లో కడిగి పారేస్తుంది
నిన్ను నీకు
కొత్తగా చూపించే
సరికొత్త అద్దమది
ఒక దృశ్యాన్ని
కళ్ళకు చూపిస్తుంది.
మరో దృశ్యాన్ని
తాను చూస్తుంది.
అది –
గదులు లేని ఇల్లు
వింత రంగుల హరివిల్లు
గాలిని గోళ్ళతో రక్కి
తన గొప్పతనాన్ని
చాటుకుంటూ ఉంటుంది
యుద్ధాల్ని, నిశ్శబ్దాల్ని
పిడికిలిలో దాచుకున్న
అదృశ్యలోకాల సమూహమది.
*
వులు ఎలాగైనా కవితను ప్రారంభించవచ్చు. స్థిరమైన నియమాలు ఏవీ లేవు. కవి తీసుకునే ‘వస్తువు’ యిలా నిర్వచించాలనే షరతులు కూడా లేవు. జానపదులు నిత్య వ్యవహారికంలో పొడుపు కథల్ని వాడుతుంటరు. మేధో మథనానికి, కుతూహలానికి అవకాశం యివ్వటం వాటి లక్ష్యం. ఇదే టెక్నిక్ను కవిత్వ నిర్మాణానికి అన్వయిస్తే ‘అది’ కవిత తయారైంది. ప్రతి స్టాంజాలో కొంత సమాచారం, కొన్ని ‘క్లూ’ లు వుంటయి. వాటి ద్వారా ఆధారసహితంగా కవి ఏమి చెప్తున్నాడు? నిశితంగా పరిశీలన చేస్తూ, ఏమై వుంటుందనే అన్వేషణలోకి జారుకునేటట్లు కవిత్వ రచన కొనసాగుతది.
విచిత్రంగా కవి ఎక్కడ కూడా సమాధానం చెప్పడు. పాఠకుల ఊహకు వదిలేస్తడు. అంతర్లీనంగా పాఠకలకు ఏమి స్ఫురిస్తుందో అదే జవాబు. అన్ని సందర్భాల్లోనూ ‘పాఠకులు’ కవి ఊహించిన సమాధానాన్ని మాత్రమే గాకుండా ఇంకేదైనా వేరే సమాధానాన్ని కూడా చెప్పవచ్చు. అంటే ఈ నిర్మాణ వ్యూహం సంక్లిష్టతకు, సందిగ్ధత కు కూడా దారితీసే అవకాశాన్ని కల్పిస్తదనే విషయం అర్ధమైతది. కవి నిర్థిష్టమైన, స్పష్టమైన అంశాల్ని పొందుపరిచే వ్యక్తీకరణల్ని మాత్రమే కవిత్వ రచనకు ఎంచుకోగలిగితే కవి లక్ష్యం నెరవేరుతది.
కవితను ప్రశ్నల ద్వారా విశ్లేషించుకుంటూ వెళ్తే ఏదో ఒక స్థానంలో జవాబు దొరకబట్టుకోవచ్చు. ఇక్కడ
1. ఆవేశాన్ని అకస్మాత్తుగా అక్కున చేర్చుకునేది ఏమిటి?
2. అర్థమయ్యే ప్రశ్నలకు అనర్థాల ముసుగు వేసేది ఏమై వుంటది?
3. కట్లు తెంచుకొచ్చే మాటల ప్రవాహానికి మౌనాన్ని అడ్డకట్టగా వేసేది ఏమిటి?
4. నిన్ను నీకు కొత్తగా చూపించే సరికొత్త అద్దం ఏమై వుంటది?
వంటి ప్రశ్నల్ని వేసుకుంటూ ముందుకు సాగాల్సి వుంటది.
రకరకాల ప్రశ్నలు సంధించడం ద్వారా ఒక విషయం నిర్ధారణకు వస్తది. ఊహించే ‘వస్తువు’ గుణగణాలు తెలిసిపోతయి. ఈ కవితలో జవాబు ‘అస్థిరమైనది, ఎప్పుడు ఎలాంటి ప్రవర్తనకు దారి తీస్తదో తెలియనిది’ అనే అర్ధం వచ్చేలా వుంది. అంటే చంచలమైన స్వభావం కలది – సరియైన సమాధానం అయి వుంటది. అప్పుడు శీర్షిక ‘మనసు’ను ప్రతిబింబజేస్తది.
ఒక జవాబు రాబట్టిన తర్వాత, దానిని దృష్టి లో వుంచుకుని ‘కవిత’ను మరోమారు చదివితే ఖాళీలను పూరించుకుంటూ వెళ్లవచ్చు. ఇప్పుడు కవిత మరింత స్పష్టంగా అర్ధమైతది. కవి ‘మనస్సును గదులు లేని ఇల్లుగా, వింత రంగుల హరివిల్లుగా, గాలిని గోళ్ళతో రక్కి గొప్పతనాన్ని చాటుకుంటుందని; యుద్ధాన్ని, నిశ్శబ్దాల్ని పిడికిలిలో దాచుకున్న అదృశ్యలోకాల సమూహంగా నిర్వచించటం ద్వారా తన ఊహాశాలిత్వాన్ని, ‘వస్తువును కవిత్వం చేసే పదునైన భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని, భాషమీద వున్న పట్టును అంచనా వేయవచ్చు. ఆగామి కాలంలో అనితర సాధ్యుడనిపించుకోగలడని విశ్వసిస్తూ యువకవికి అభినందనలు.
*

బండారి రాజ్ కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.