పాములను తరిమిన చీమలు

తెలంగాణ ఆత్మను, పోరాట స్వభావాన్ని, తెలంగాణ జీవితపు సహజత్వాన్ని పట్టుకున్న కథ” పాములను తరిమిన చీమలు.”

శతాబ్దాలుగా తెలంగాణ నేల మీద పర్చుకున్న దోపిడీని,  ఒక కౌమారం దాటని పేదింటి పిల్లను కనీసం బొడ్డెమ్మను, బతుకమ్మను కూడా ఆడుకోనీయకుండా ఆమె స్వేచ్ఛను హరించిన సమాజ నైచ్యాన్ని, మూకుమ్మడిగా తిరుగుబాటు చేసి దోపిడీని నిలువరించాలనే ఒక విప్లవ పాఠాన్ని బోధించే కథ నందిని సిధారెడ్డి రాసిన

.  ఈ కథ 1991 లో ‘భూమిక’ కథా సంకలనంలో ప్రచురింపబడింది.  నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ ప్రసిద్ధులైన నందిని సిధారెడ్డి ఇప్పటి తరానికి కథకులుగా అంతగా పరిచయం లేనివారు.  ఒక రకంగా విస్మృతికి గురైన కథకులు.  1976 నుండి 2002 దాకా సమాజంతో పాటు ప్రయాణిస్తూ సుమారు 17 కథలు రాసినా సిధారెడ్డి కథల మీద  ఈ పాతికేళ్లలో ఎక్కడా చర్చ జరగకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది.  2016లో ‘చిత్రకన్ను’ పేర సంకలనంగా వచ్చే దాకా ఆయన కథకులుగా నేటి తరానికి తెలియదు.  ఇట్లాంటి నివురుగప్పిన నిప్పులు తెలంగాణ నేలమాళిగల్లో చాలా మందే ఉన్నారు.  తవ్వుతూ పోతే మట్టిలో మాణిక్యాలు చాలానే దొరుకుతాయి.

అదొక గ్రామం.  ఆ గ్రామాన్ని ఆనుకొని అడవిలాంటి అడవి ఒకటి.  ఆ అడవి మీద ప్రభుత్వపు కన్ను పడేసరికి అది రోజుకు కొంత క్షీణించుకుంటూ వస్తోంది.  ఫారెస్ట్ ఆఫీసర్లతో చేతులు కలిపిన కొంత మంది ఘరానా మనుషులు ఆ అడవిలోని కలపను అక్రమ రవాణా చేస్తుంటారు.  అట్లా ఆ అడవి చితికిపోయి బక్కపలుచగా మిగిలిపోయింది.

పన్నెండేండ్ల బీరవ్వ వొజాలు కూతురు.  ఆమెకు ఆ అడవిలో పొద్దు గడపడమంటే చాలా ఇష్టం.  వొజాలుకు నలభై గొర్లు, పదిహేను మేకలూ ఉన్నాయి. వొ జాలు పటేండ్ల భూమి పాలుకు వ్యవసాయం చేస్తాడు.  వ్యవసాయం పని ఉన్నప్పుడల్లా గొర్ల మందను అడవికి మేతకు తీసుకుపోవడం బీరవ్వ మెడకే పడుతుంటది.  ఇదే ఆమె మనసుకు చాలా కష్టంగా తోస్తుంటది.  ఓ రోజు మల్లు మామ, కొమురు తాత, తన ఈడు వాడైన రాజిగాడు, మరో నలుగురైదుగురు కుర్మోల్లు అందరూ కలసి మందలను తోలుకొని అడవికి పోతారు.  గొర్లు సిరికాంచే ఆకు మేస్తుంటాయి.  బీరవ్వ ఒక బండ మీద కట్ల పూలు పోసుకొని దండ అల్లుకుంటూ ఉంటుంది.  అప్పుడే బొడ్డెమ్మల పండుగ అయిపోయింది.  తను ఒక్క రోజే ఆడుకుంది.

ఇవాళ ఎంగిలి పూల అమాస. త ను బతుకమ్మ ఆడుకోవాలని, గొర్లు మేపడానికి పోనని మంకు పట్టు పడుతుంది.  కానీ కొత్త లంగా, జాకెట్ కుట్టిస్తానని ఆశ చెప్పి బీరవ్వను మంద కాయడానికి పంపిస్తాడు తండ్రి వొజాలు.  బతుకమ్మ పాట మైకంలో పడి తన చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయింది బీరవ్వ.  గొర్లన్ని బెదిరిపోతున్నాయి.  రెండు మరకలూ, ఓ బోడ మేక, కుంటి  గొర్రె, నడిమింటి గొర్రె అన్నీ మాయమైతాయి.  ఎక్కడ వెతికినా కనిపించవు.  ఏడుపొస్తుంది.  కొమురు తాతను వెతుక్కుంటూ పోతే, కొమురు తాత అడవి పోలీసోళ్ళ (ఫారెస్ట్ ఆఫీసర్లు) కాళ్ల మీద పడి బతిమిలాడుతూ కనిపిస్తాడు.  పక్కనే ఉన్న జీపులో కొన్ని జీవాలు కనిపిస్తున్నాయి.

“దొరా నీ బాంచెన్ మా అయ్యదిడుతడు.  జీవాల్నిడిసిపెట్టు.  నీ పుణ్యముంటది.” అని బతిమిలాడుతూ బీరవ్వ కూడా వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది. కానీ వాళ్ళ మనసు కరగదు. బూటు కాలుతో కొమురు తాతను, బీరవ్వను తోసేస్తారు.  “ఎవ్వని సొమ్మని మేపుకుంటర్రా? రకం గట్టుమంటే నకరాలు జేస్తన్నార్రా? మేక పుల్లర (పన్ను- Tax)  గట్టాల్నని తెలువదిరా, ఇన్ని రోజుల్నించి గట్టలేదారా? తోలు పలుగాలే ముండకొడుకులాల.  మీకు తెలివి పెరిగిపోయిందిరా. ఆ రాస్కెల్స్, ఆ దొంగ నా కొడుకులొచ్చి చెబితే మీరు రకం గట్టమంటరు లేరా? చూసుకుందాం రా.  మీ సంగతీ, వాళ్ళ సంగతీ చెబుతాం రా” అని బండ బూతులు తిడుతారు. “ గొర్రెకు నాలుగు రూపాయలైతే కడతామంటిమి గదా దొరా?”  పన్నెండు రూపాయలంటే ఎక్కడి నుండి తెస్తాం? మీ జాలి, దయ మా మీద ఉండాలే అని మొరపెట్టుకుంటారు అక్కడ జమైన కుర్మలు.  రోజు రోజుకు ధర పెరుగుతుందా? తగ్గుతుందా? మీకు బలుపు ఎక్కువైందిరా అని తిట్టి పది మేకలు, ఎనిమిది గొర్రెలు జీపులో వేసుకొని అడవి ఆవలి పక్కనున్న ఊళ్ళకు వెళ్లిపోతాయి జీపులు. గొల్లోళ్లందరికి కడుపంత మసలుతుంది. ఇట్లా ఊకుంటే ఎట్లా? అని తర్కించుకొని పక్కూర్ల నుంచి కొంత మందిని పిలుచుకొచ్చి మొత్తానికి గంటలో యాభై మంది గొల్ల కుర్మోల్లు జమైతారు.  పోలీసోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న దోపిడీని వివరిస్తాడు బీరన్న.

మన దగ్గర పన్నెండు రూపాయలు వసూల్ చేసి అందులో రెండు సర్కారుకు కట్టి  మిగిలిన పది రూపాయలు పోలీసోళ్లే మింగుతున్నారని, ఈ అడవిని మనమే పెంచుకున్నాం.  దీని మీద మనకే హక్కు ఉంటుందని వివరిస్తాడు.  జీవాల్ని తీసుకొని పోయిన జీపులు తిరిగి వచ్చేటపుడు దారికి అడ్డంగా రాళ్ళు వేసి తమ జీవాల్ని తాము తీసుకోవాలని నిర్ణయించుకుని అలాగే చేస్తారు.  “రశీదులియ్యమంటే రశీదులియ్యరు.  రకం రకమని మా మీద పడుతారు.  పన్నెండు దొబ్బి రొండు సర్కారుకిస్తరు.  ఇదేందంటే మా జీవాలు దంచుకపోతరు.  సాగొచ్చిన పనులు గదా సారు మియ్యి.  ఎప్పటికీ ఒక తీరుగనే ఉండది  సారు.  మంచి చెడ్డ మేం గూడా తెలుసుకుంటున్నం.  లోకం తీరే అంత.  మెత్తగుంటే మొత్తబుద్ధయితది.  మాకు సుత ఎర్కైతయి సంగతులు.  మేం తల్సుకుంటే మీ బతుకులేమైతయి సారు? కొలువులున్నోళ్ళు మీరు.  మీక్కొలువొస్తది. సర్కారు జీతం దినుడు బరాబరే.  మా మీద పడి దోచుకునుడూ బరాబరే. ఏం దోపిడి సారూ ఇది.  ఎన్రోజులు మేం నోర్మూసుకుంటం? ఇగ ఊకోం” అని సంఘటితంగా అడవి పోలీసులను ఎదుర్కుంటారు.  నిలదీస్తారు.  వాళ్ళు భయంతో వణికిపోయి తమ తప్పు ఒప్పుకుంటారు.  చివరికి జీపులున్న జీవాలను దించుకొని ఊళ్ళెకు తోలుకుపోతారు.  బీరవ్వ, రాజిగాడు ఈ ముచ్చట అందరికీ చెప్పుదామని సంబురంగా ఊళ్ళెకు ఉరుకుతుంటారు.

ఇంత గంభీరమైన విషయాన్ని రచయిత ఒక పన్నెండేండ్ల అమ్మాయి కోణం  నుంచి నడిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కథ ఎత్తుగడలోనే కథకుడు భవిష్యత్ కథా సూచన చేస్తాడు.  “వానా కాలం ఉరికురికి పొంగే పుష్పాల వాగు అప్పటికే ఎండిపోయింది.  వరదకు కొట్టుకొచ్చిన ఇసుక మేట ఎండకు మెరుస్తుంది. ఎ వరో తెచ్చి పోసినట్లు పలుగు రాళ్లూ, కుక్కమూతి రాళ్లూ అక్కడక్కడా చిన్న చిన్న కుప్పలుగా పడి వున్నయి…” ఇట్లా ప్రారంభమవుతుందీ కథ.

రాళ్ళు కుప్పలుగా పడి ఉన్నాయని చెప్పడంలో ముందు ముందు కథలో గొల్ల కుర్మలు ‘సంగం’గా ఏర్పడి పోరాడుతారనే సూచన ఉన్నట్లు అనిపిస్తుంది.  ఏండ్ల నుంచి కొనసాగుతున్న ప్రజల అమాయకత్వం, అడవీ అధికారుల అవినీతిని చిత్రిస్తూనే సగటు తెలంగాణ అమ్మాయిల మానసిక ప్రపంచాన్ని ఆవిష్కరించిందీ కథ.  ఇక్కడి ఆడపిల్లల ఆట పాటలు, ఇష్టాయిష్టాలు బతుకమ్మ పండగ చుట్టూ, తెలంగాణ సంస్కృతి చుట్టూ ఎలా అల్లుకొని ఉంటాయో చాలా లాఘవంగా చెప్తాడు కథకుడు.  అంతే కాదు కొడుకైనా, కూతురైనా బాల్యం నుండే కుటుంబానికి ఎలా ఆసరాగా నిలబడుతారో, ఎంత బాధ్యతగా మెదులుతారో కూడా కనిపిస్తుంది కథలో.  పోరాటాన్ని కూడా చిన్నప్పటి నుండే నేర్పుతారు తెలంగాణలో.  దీనికి చక్కని ఉదాహరణ ఈ కథ.  తమ కళ్ల ముందే ఒక తిరుగుబాటు, ఒక పోరాటం, ఒక విజయం ప్రాప్తించినపుడు పిల్లలు ఎంత సంతోషపడుతారో కూడా కథలో కనిపిస్తుంది.  బీరవ్వ పాత్రను మలిచిన తీరే మనల్ని ఆకట్టుకుంటుంది.  కథలో అలవోకగా అడుగు పెట్టిన ఈ పాత్ర ఒక గొప్ప విజయానికి, సాహసానికి సాక్షిగా నిలుస్తుంది.   తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం (1946-1951) లో ఏర్పడ్డ ‘గుత్పల సంగం’ అలాగే నడిచి వచ్చి ఈ కథలో కనిపిస్తుంది.  అస్సలు కథంతా వొజాలుది. కానీ ఎక్కడ ఆ పాత్ర తెర మీదికి రాదు.

శిల్ప పరంగా ఒక నూత్న ప్రయోగమీ కథ.  ఎత్తుగడ, మలుపు, ముగింపు అన్నీ చాలా అద్భుతంగా సరిపోయిన కథ.  కథలో ఒక్క వాక్యం కూడా అదనంగా కనిపించదు.  పైగా ఎన్నో నిఘంటువులకు ఎక్కని పదాలు కనిపిస్తాయి.  అగ్నిపర్వతం లాంటి విషయాన్ని కథకుడు చాలా సంయమనంగా, నిబ్బరంగా చెప్పడం అబ్బురపరుస్తుంది.  కొన్ని శతాబ్దాల తెలంగాణ సమాజానికి ప్రతిబింబమీ కథ.  దోపిడీని నిర్మాణాత్మకంగా, వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని సూచించే కథ.  ఒక మార్పుని కోరే కథ.

అడవిని, మందను కాపాడుకోవాలంటే మంద బలం కావాలని చెప్పే కథ.  ఒక సామాన్య గొల్ల కుర్మోళ్ళకు ఇంతటి చైతన్యం ఉంటుందా అనే అనుమానం వస్తుంది  కానీ కథకుడు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాడు కాబట్టి బహుశా ఎక్కడైనా జరిగిన సంఘటనే కథకుడిని కథ రాయడానికి  పురికొల్పిందేమోననిపిస్తుంది.  ఇలాంటి చైతన్యపు సారూప్యతే  భూపాల్ రాసిన “అంబల్ల బండ” (1991) కథలో కూడా కనిపిస్తుంది.

తెలంగాణ కథా ప్రయాణంలో ఈ కథ ఎక్కడ నిలబడుతుంది అని యోచించినపుడు తప్పకుండా పాఠకుల హృదయంలోనే నిలుస్తుందని చెప్పొచ్చు.  ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మను, పోరాట స్వభావాన్ని, తెలంగాణ జీవితపు సహజత్వాన్ని పట్టుకున్న కథ.  రచయిత మిగతా కథల పక్కన ఈ కథను నిలబెట్టి చూసినపుడు ఇది కొంచెం ఎత్తులోనే కనిపిస్తుంది.  ఆ ఎత్తు కేవలం దానిలోని జీవత్వం వల్ల వచ్చిందే.  ఈ కథ చదివితే తెలంగాణ బీసీల ప్రపంచంలోకి అడుగు పెడుతాం.  ఒక ఉప్పొంగే చైతన్యాన్ని మన దేహంలోకి సన్నని  కాలువ రూపంలో ఆహ్వానిస్తాం.  ఇదొక చరిత్ర శకలం.  విప్లవ కెరటం.

*

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి కథా విశ్లేషణ శ్రీధర్ వెల్దండి సార్

  • సిధారెడ్డి కథలకు నేను కూడా ప్రత్యక్ష సాక్షినే. విశ్లేషణ అర్థవంతం .abhinanandanalu

  • చాలా బాగా విష్లెషించారు . ధన్య వాదములు !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు