1
సారంగ ఈ వారంతో పధ్నాలుగో ఏట అడుగుపెడుతోంది. ఈ పదమూడేళ్ళల్లో ఎందరో పాఠకులతో, రచయితలతో సారంగకి ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది. సారంగలో మాత్రమే తమ రచనలు చూసుకోవాలన్న ఒక ప్రత్యేకమైన అభిమానమూ, గౌరవమూ ఇప్పుడు ఈ వెబ్ పత్రిక సంపాదించుకుంది. ఇది మాకూ మీకూ గర్వకారణమే కాదు, గౌరవం కూడా! డిజిటల్ యుగంలో పుస్తకం హస్తభూషణంగా మిగలడం కూడా కష్టమైన ఈ కాలంలో సారంగ కి మీరందిస్తున్న ఈ ప్రేమ మా మటుకు మాకు అపూర్వం. ప్రతి సంచికనీ నిండు వెలుగులతో నింపుతున్న మీ రచనలూ, మీ వ్యాఖ్యలే దీనికి సాక్ష్యం.
ఇప్పటిదాకా సాధించిందేమైనా వుంటే కొంత బేరీజు వేసుకొని, ఇక ముందు ఎటు అడుగు పడాలన్న శోధనకి సారంగ ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది. అలాగే, తనతో కలిసి ప్రయాణిస్తున్న పాఠకులూ, రచయితల అభిప్రాయాల్ని కూడా సారంగ శిరసా వహిస్తుంది. ఇన్నేళ్ల ఈ ప్రయాణంలో సారంగతో వున్న మీ అనుబంధాన్ని చెప్పడమే కాకుండా, కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న ఈ సందర్భంలో సారంగ ఏం చేస్తే బాగుంటుందో కూడా చెప్పండి. ఇక్కడే మీ అభిప్రాయాలూ, విమర్శలూ, సూచనలూ నిర్మొహమాటంగా రాయండి.
2
పోయిన ఏడాది సారంగ టీనేజ్ లోకి అడుగుపెట్టినప్పుడు ఇలా అనుకున్నాం:
ఈ టీనేజ్ వయసులో కష్టాలూ వుంటాయి, సంతోషాలూ వుంటాయి. అలాగే, ఇంకేమిటో అర్థం కాని అనుభవాలూ వుంటాయి. కానీ, ఒక నిలకడ ఏదో తెలుస్తూ వుంటుంది.
ఈ పదమూడేళ్లలో సారంగ సగర్వంగా చెప్పుకోవాల్సింది ఈ నిలకడ గురించే- ఎప్పుడూ ఎలాంటి స్థితిలోనూ అడుగు తడబడని ప్రయాణం ఇది. ఈ అడుగు సైద్ధాంతికంగా అయినా, సృజనాత్మకంగా అయినా, రచయితల పట్ల గౌరవంతో అయినా- ఇది మేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి పక్షం గడువు తప్పకుండా మీ ముందుకు వస్తున్న ప్రతి సంచికా దీనికి ప్రత్యక్ష దర్పణం.
ఇక ఈ పధ్నాలుగో పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాదిగా సారంగ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయాలు మాత్రం కొన్ని తప్పకుండా వున్నాయి. ఇందులో కొన్ని అనుకూలమూ, మరికొన్ని ప్రతికూలమూ!
ముఖ్యంగా కథాసాహిత్యంలో 2025 మాకు విశేషమే. అరిపిరాల సత్య ప్రసాద్ “కథాంజలి” విశ్లేషణ శీర్షికతో పాటు కథలకు సంబంధించిన కాలమ్స్ అన్నీ దాదాపు విజయవంతమయ్యాయి. కొన్ని పుస్తకరూపంలోకి వచ్చి, ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. సారంగలో ప్రచురితమైన కథలు ఈ ఏడాదిలో ప్రచురితమైన కథా సంకలనాల్లో చోటు సంపాదించుకున్నాయి. ఇవి కాకుండా, మొదటిసారిగా మొదలు పెట్టిన “మొదటి కథ కబుర్లు” వివిధ సందర్భాల్లో కథకులతో తక్షణమే చేసిన ఇంటర్వ్యూలు ఎక్కువమందిని ఆకట్టుకున్నాయి.
కథకి సంబంధించి ఏ శీర్షిక ప్రవేశపెట్టినా, వెంటనే అది అందరినీ చేరుకుంటోంది. రచయితలు ఆ శీర్షికని అక్కున చేర్చుకొని, తామే శ్రద్ధ తీసుకొని మిగిలిన కథకుల్ని కూడా ఉత్సాహపరచి, రాయిస్తున్నారు. ఇక “కథలపొద్దు” శీర్షిక ఇప్పటికీ కొత్త కథకులకు స్ఫూర్తినిస్తోంది. ఈ శీర్షిక ఎంతోమంది నవయువ కథకులని పరిచయం చేస్తోంది. కథ ప్రచురించడమే కాకుండా, సాయి వంశీ ఆ రచయితలతో చేస్తున్న ముఖాముఖి గురించి ఎంతైనా రాయవచ్చు. ఈ కాలమ్ నిర్వహణలో సాయి పెడుతున్న శ్రద్ధా, ఆసక్తీ మాకు ఉత్సాహాన్నిస్తోంది.
ఇక కవిత్వమూ, ఇతర శీర్షికల విజయాలు తక్కువేమీ కాదు. అయితే, ఫేస్ బుక్ లాంటి చోట కవిత్వాన్ని ఎప్పటికప్పుడు అచ్చేసుకునే సౌకర్యం వచ్చాక, కవిత్వం అంతగా పత్రికల దాకా చేరుకోవడం లేదన్నది నిజం. అయినా, ఇప్పటికీ సారంగ కి సగటున రోజూ పాతిక కవితలు వస్తూనే వున్నాయి. ఒక్కో సంచికలో మూడు కవితలు తప్ప ప్రచురించలేము కనుక చాలా సందర్భాల్లో ఎంపిక కష్టమవుతూ వుంది. కొత్త తరం కవుల కవిత్వానికి కొంత ఎడిటింగ్ సాయం అవసరం అని భావించి, ఎప్పటికప్పుడు వారికి సూచనలూ సలహాలూ అందిస్తోంది సారంగ.
అంతేకాకుండా, “ఏరువాక” శీర్షిక ప్రయోగాత్మకంగా featured poet సిరీస్ కి నాంది పలికింది. కవిత్వ విశ్లేషణ వ్యాసాలు ఈ ఏడాది ఎక్కువే ప్రచురించాం. మేం క్రమంగా ప్రచురించే కాలమ్స్ పరిధిలోకి రాని కవిత్వ విమర్శ, సమీక్ష వ్యాసాలని విడిగా ప్రచురిస్తున్నాం. కవిత్వ విమర్శలో ఒక తరం ఆగిపోయి, మరో తరం ముందుకొస్తున్న సన్నివేశం కూడా కనిపిస్తోంది. కొత్త సాధనాలతో కవిత్వ విమర్శ కొనసాగాల్సిన అవసరాన్ని ఈ తరం గుర్తిస్తోంది.
స్థానికతకి పెద్ద పీట వేయాలన్నది మొదటి నించీ సారంగ ప్రయత్నం. ఈ దిశగా మొదలుపెట్టిన కెంగార మోహన్ కాలమ్ “మన సీమ” కేవలం విమర్శకే పరిమితం కాకుండా, రాయలసీమ సాహిత్యం మీద పరిశోధనాత్మక చూపుని ప్రసరిస్తోంది. మిగిలిన ప్రాంతాల ప్రాతినిధ్యం కూడా పెరగాలన్నది సారంగ ఆకాంక్ష. ముఖ్యంగా, ఉత్తరాంధ్ర నుంచి తగినన్ని సృజనాత్మక రచనలూ, విశ్లేషణలూ వస్తే, వాటికి హృదయకపూర్వక ఆహ్వానం.
అలాగే, యాత్రా కథనాలు వంటి ఇతర వచన ప్రక్రియలు ఈమధ్య ప్రాచుర్యాన్ని అందుకున్నాయి.తొలినాళ్లలో వాటిని ప్రచురించింది సారంగే. అదే విధంగా, మ్యూజింగ్స్ లాంటి ప్రక్రియల మీద సారంగ కి ఆసక్తి వుంది. వాటిని కొనసాగించే రచయితలకు ఎప్పుడూ ఆహ్వానమే. సారంగ ఛానెల్ మొదటి నించీ వున్నప్పటికీ ఈమధ్య అదీ క్రమం తప్పక వెలువడుతోంది. ఇది ఇంకా బహుముఖాలుగా విస్తరించాల్సి వుంది.
రచయితలకు సూచనలు
ఇన్ని అనుకూలమైన విషయాల మధ్య కొన్ని సమస్యల్ని కూడా ప్రస్తావించక తప్పడం లేదు. ఈ విషయాలు గతంలోనూ చెప్పాం, ఇప్పుడూ పునరుక్తి చేయకతప్పడం లేదు.
రచయితలూ కవులు తుదిప్రతి పంపించడంలో తగినంత శ్రద్ధ చూపించకపోవడం! రచన అనేది చిత్రరచన లాంటిదే. లేదా, అందరిముందూ సంగీత కచేరీ లాంటిదే. ఈ రెండీటీకి చాలా శిక్షణ కావాలి. చిత్రకారులు చివరి రేఖా రూపం పదునుగా చిత్రిక పట్టి కానీ లోకానికి చూపించరు. అలాగే, ఎంతో రిహార్సల్ చేసి గాని, అందరి ముందుకీ రారు. రచన విషయంలో కూడా అంతే రూపశ్రద్ధ, సాధన అవసరం.
కొంతమంది సారంగ కి పంపించే తుదిప్రతులు చాలా సందర్భాల్లో చిత్తుప్రతుల కన్నా అన్యాయంగా వుంటున్నాయి. రచయితలు తమ రచన పట్ల తామే ఇంత నిర్లక్ష్యంగా వుండడం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏమాత్రం మెరుపు కనిపించినా, ఆ రచనని ప్రోత్సహించాలన్న తపన మాది. అట్లా అని నాణ్యతలేని, వాక్యం తీరు సరిగా లేని రచనల్ని ఒప్పుకోలేం కదా! రచన తుదిప్రతి ఎలా వుండాలన్న విషయంలో సారంగ కి పట్టింపు వుంది. తనదైన శైలీ విధానం వుంది. సారంగ హోం పేజీలోకి వెళ్ళి చూస్తే రచయితలకు సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ రచన పంపించే ముందు దయచేసి వాటిని చదవండి. రచన తప్పకుండా సారంగ ఈమెయిల్ కి మాత్రమే పంపించండి. మీ వీలునిబట్టి msword document లో పంపించండి. లేకపోతే, ఈమెయిల్ లోనే రెండు మూడు సార్లు చదువుకొని, సరిచూసుకొని పంపించండి.
ఈ మధ్య ఈ విషయంలో మేం కొంచెం కఠినంగా వుండడం వల్ల నిజానికి కొన్ని మంచి రచనలు కూడా పరిశీలనకి తీసుకోలేకపోతున్నామన్నది వాస్తవం. అయినా సరే, ఈ విషయంలో కఠినంగా, పద్ధతిగా వుండక తప్పడం లేదు. రచయితలకు మరోసారి మా మనవి ఏమిటంటే- రచన తుదిప్రతి మాత్రమే పంపించండి. తుదిప్రతి అంటే మీరు ఎంతో శ్రద్ధతో, జాగరూకతతో ఎడిట్ చేసిన ప్రతి. అచ్చుతప్పుల్లేని ప్రతి. స్పేసులూ, పేరాగ్రాఫులూ సరిగా వుండే ప్రతి.
కొత్త ఆలోచనలకూ, కొత్త శీర్షికలకూ సారంగ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది. మీ ఆలోచనలు మాతో పంచుకోండి. మరిన్ని కొత్త శీర్షికలకు మీ తోడ్పాటు అందించండి.సారంగ చదువుతూనే వుండండి. సారంగకి రాస్తూనే వుండండి.
సారంగ మాత్రమే కాదు, మంచి సాహిత్యం కోసం ఏ కొద్దిపాటి ప్రయత్నం జరిగినా దాన్ని ప్రోత్సహిద్దాం. నలుగురితోనూ పంచుకుందాం.








ప్రసిద్ధ రచయిత్రి పి. సత్యవతి గారి సందేశం
సారంగ టీన్సు లోకి అడుగుపెట్టిన సందర్భం.తెలుగు సాహిత్యాన్ని గురించి అనేక సానుకూల ప్రతికూల చర్చలు జరుగుతున్న సందర్భం.సమాజం లో వచ్చే మార్పులే సాహిత్యంలో ప్రతిఫలిస్తాయని అందరికీ తెలుసు.సమాజంలో పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఆకాంక్షలు సమాంతరంగా నడుస్తూ వుంటాయి. ఆశావహులు ,కార్యశూరులు తమ బాటేదో ఏర్పరచుకుని నడుస్తూ వుంటారు. ఇవాళ పత్రికలకు కొలతలు , కళ్ళజోళ్ళు వచ్చాయి.వాటికి సరిపోయే కథలైనా విమర్శలైనా వాళ్ళు ప్రచురిస్తారు. ఆచట్రంలో ఇమడలేని రచయితలకు సారంగ వంటి వెబ్ పత్రికలు వరంలా అనిపిస్తాయి.ఒక కాలమ్ నిర్వహించుకోడానికి ,వరుసకధలు రాసుకోడానికి సారంగ స్వాగతం పలుకుతుంది • అలా సారంగ లో వస్తున్న మంచి కాలమ్ కథలపొద్దు . ఎందరో కొత్త రచయితలను తెలుసుకోగలిగాము. మంచి కథలు చదవగలిగాము. ఒకప్పుడు వార మాస పత్రికలు పాఠకుల సాహిత్యాభిరుచి కి దోహదం చేశాయి.ఇప్పుడు ఆపరిస్థితి లేదు .ముందు ముందు కూడా వుండే సూచన లేదు .ఇప్పుడు మనకు ఈ వేగపు బ్రతుకులో వెబ్ పత్రికలు ఒక సౌకర్యం సౌలభ్యం కూడా. సారంగ వంటి ఒక చక్కటి పత్రిక ను మనం పదమూడు ఏళ్లుగా చదువుతున్నాం అంటే మన అభిరుచి నిలిచి వుంది అని అర్ధం, ఈ పత్రికను ఆరోగ్యంగా పెంచి పోషించి కౌమారం లోకి అడుగుపెట్టించిన సంపాదకులకు ,వృత్తి ఉద్యోగాలలో వుండి కూడా కష్ట నష్టాలకు ఓర్చి ప్రేమతో కొనసాగించిన సారంగ బృందానికి నా ప్రేమ.
సారంగ తన పదమూడేళ్ళ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకప హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎడిటర్స్ కి హృదయపూర్వక అభినందనలు. మొదటి సంచికలో సాహిత్య వ్యాసం రాయటం గుర్తుంది.నా కథలను ప్రచురించి ప్రోత్సహించిన విషయం చాలా గుర్తుంది. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 🙏💐🎉
సారంగ కు
శుభాకాంక్షలు
సారంగ సారధులకు జేజేలు.
సారంగ సుదీర్ఘ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నా ..
15 అక్టోబరు 2021 సంచికలో “మొగలాయి అంగట్రాజమ్మ” కథతో “సారంగతో మొదలైన నా సాహచర్యం కొనసాగుతోంది. నేను ఆ కథ సారంగకు పంపి రెండుమూడు రెండుమూడు నెలలైన తర్వాత ప్రచురణకు నోచుకోవడంతో ఆ విషయం నాకు తెలియనేలేదు. తర్వాతెప్పుడో నా వృత్తి, సాహిత్య గురువులు, అంతకుమించి ఆత్మీయులు ఆర్.ఎం.ఉమమహేశ్వరావు ఫోన్ చేసి చెబితేనే తెలిసింది. అచ్చులో నా మొదటి కథ చూసుకుని ఎంత మురిసిపోయానో. “పాటల్ని అతుక్కోవాల్సింది నేను కదా” రచనతో కవిత్వమయ్యే ధైర్యం కూడా నాకు సారంగే ఇచ్చింది. ఇక వ్యాసం కావడం మాత్రం మిగిలింది. అప్పుడే ప్రారంభమైన లేలేత రచయితలకు కూడా సారంగ ఇచ్చే ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రోత్సాహమే లేకపోతే నాలోని రచయిత నిశ్చయంగా చచ్చిపోయేవాడు… అందులో సందేహం లేనేలేదు. పదునాలుగేళ్ల టీనేజీ సారంగకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
సారంగ యుక్త వయస్సులోకి అడుగుపెడుతున్నందుకు శుభాకాంక్షలు. ఈ పత్రికని ఇక్కడిదాక తీసుకొచ్చి సృజనాత్మక కళాకారుల అభిమానాన్ని సంపాదించడం సారంగకి పెద్ద విజయం. ఎన్నో వైవిధ్యమైన రచనలని ప్రతి పక్షం అందించడం బాధ్యతతో కూడుకొన్న పని. నాకు ఎంతో నచ్చిన విషయం ప్రతి 1, 15 వ తేదీలకే మీ పత్రికని టంచన్ గా పోస్ట్ చేయడం మీకే చెల్లు. ఒక్క రోజు అటు ఇటు కాకుండా సారంగ లో వచ్చే సాహిత్య సరుకు చూస్తే ఎంతో ఆనందం. మీ రచయితలకి సూచనలు ఒక ఆదర్శ నమొనాగా పని చేస్తాయి. ముఖ్యంగా ఎపిలెప్సిస్ గురించి ఎంతో చక్కగా వివరించారు. రెండు, మూడు, నాలుగు చుక్కలు ఇతర పత్రికల్లో అర్థంలేకుండా కనబడుతుంటాయి. యత్ర కథనాలకి ఎన్ని ఫోటోలు పంపాలో తెలపండి. ఈ వ్యాసాలకి ఫోటోలు ప్రధానం. మరోసారి శుభాకాంక్షలతో…
సంతోషం, సంపత్ గారూ! ఫోటోలు నాలుగు సరిపోతాయి!