నేలపైన నిల్చుని నింగిని తాకగలరా?

మరి స్థల కాలాలు సరిగ్గానే ఉన్నా, రచయిత అవి తెలిసేలా జాగ్రత్తగా వాటిని పొందుపరచినా, మనకి కథ నచ్చకపోవటానికి కారణాలు ఏమున్నాయి?

“కాలాతీతమైన, ప్రాంతాతీతమైన భావోద్వేగ చిత్రణ, తాత్విక చింతన – ఈ రెండూ కథకి ఆయుష్షు పోస్తాయి.”

“ఈ కథలోని సంఘటనలు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో జరుగుతాయి. ఆ ప్రదేశం పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మిగిలిన అన్ని ప్రదేశాలలాగే ఉంటుంది.”

బోతయానా ఎల్ఈస్సా అనే అరబిక్ రచయిత రాసిన ద బుక్ సెన్సార్స్ లైబ్రరీ అనే పుస్తకం మొదటి పేజీలో ఉండే వాక్యమిది. ఆమె ఇక్కడ చెప్పదల్చుకున్నదేమిటో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.

ఇప్పటికి స్థలకాలాల గురించి రెండు భాగాలుగా చర్చించాము. ఈ రోజు మూడో భాగం, పై సంచికలో నాలుగోభాగంతో ఈ అంశాన్ని ముగిస్తాను. చివర్లో పైన చెప్పిన అరబిక్ రచయిత్రిని మళ్లీ పలకరిద్దాం.

గత రెండు భాగాలలో మనం చెప్పుకున్న రెండు విషయాలు ఇవి – ప్రతి కథ ఒక నిర్దుష్టమైన స్థల కాలాలో జరుగుతుంది. ఆ స్థలమేదో, ఆ కాలమేమిటో వాచ్యంగా చెప్పకుండా పాఠకులు అర్థం చేసుకునేలా రాయటం అభ్యసించాలి. కథ జరుగుతున్న స్థలానికి, కాలానికి సంబంధం లేకుండా ఉండే అంశాలు కథలోకి రాకుండా జాగ్రత్తపడాలి. ఆ కథా కాలంలో, ఆ స్థలంలో రికార్డ్ చెయ్యవలసినంత ముఖ్యమైన సంఘటన జరుగుతుంటే దానిని రికార్డ్ చెయ్యవలిసిన భాధ్యత రచయితకి ఉందని గుర్తెరిగి ఉండాలి. చివరిగా గత భాగం చివర్లో ఈ రోజు జ్ఞానాన్ని గతించిన కథలోని పాత్రల పైన తీర్పు చెప్పడానికి వాడకూడదు అని చెప్పుకున్నాం. ఇక ఈ రోజు వ్యాసంలోకి వెళ్దాం.

ఒక అద్భుతమైన కథ ఒకేసారి రెండు పనులు చేస్తుంది. మొదటి పని ఆ కథ ఏ స్థలకాలాలలో జరుగుతోందో ఆ స్థల కాలాల సామాజిక ఆర్థిక సందర్భాన్ని ప్రామాణికంగా చూపించడం. ఇది మనం గత రెండు రెండు వ్యాసాలలో తెలుసుకున్నాం. రెండొవది – ఆ కథ ఆ కాలానికి, ఆ స్థలానికి పరిమితం కాకుండా ఏ కాలంలో అయినా, ఏ సందర్భంలో అయినా ఇలాంటిది జరగచ్చు అని పాఠకులకి అనిపిస్తుంది. పాఠకులు పుట్టని కాలం, చూడని భవిష్యత్తు, ఎప్పుడూ వినని ఒక ఊహజనితమైన ప్రపంచం లాంటి స్థలకాలాలలో కథ నడిచినా, ఆ కథలో ఉన్న భావోద్వేగం, సత్యం, సంఘర్షణ లాంటివి ఆ పాఠకులు అర్థం చేసుకునేలా, అనుభూతి చెందేలా చేస్తుంది. పరస్పరం విరుద్ధమైనవిలా కనిపించే ఈ రెండింటిని ఒకేసారి సాధించడమే గొప్ప కథలు చేసిన అద్భుతం.

మాల్గుడీ డేస్ (ఆర్కే  నారాయణన్) ఎప్పుడు చదివినా మీ బాల్యం మీకు గుర్తుకువస్తుంది. మర్చెంట్ ఆఫ్ వెనీస్ (షేక్స్‌పియర్) ఎప్పుడు చదివినా షైలాక్ డబ్బుకోసం ఆంటోనియో గుండే కోసి తీసుకుంటాడేమో అని మన గుండె కొట్టుకుంటుంది. ది కైట్ రన్నర్ (ఖాలిద్ హొస్సేయినీ) ఆఫ్గనిస్తాన్‌లో జరిగే కథైనా ప్రపంచం మొత్తం అర్థం చేసుకోగలిగింది. హరిశ్చంద్రలో (బలిజేపల్లి లక్ష్మీకాంతం, గుర్రం జాషువా) కాటి సీను ఇప్పటికీ ఏడిపిస్తుంది. ఇవన్నీ సమయానుగుణంగా నడిచిన కథల్లా కనిపించినా అవి కాలాతీతమైన ఏదో అంశాన్ని ఆధారం చేసుకున్నాయి కాబట్టే ఈ నాటికీ నిలిచి ఉన్నాయి. అదేమిటో తెలుసుకోడానికి ఈ కథా భాగాన్ని చదవండి. వివరంగా మాట్లాడుకుందాం.

***

సారొచ్చారు

కృష్ణా తీరంలో రెపల్లె దగ్గర ఉన్న ఆ మారు మూల పల్లెటూరికి రోజుకి రెండుసార్లు వచ్చే ఆర్టీసీ బస్సు తప్ప పెద్దగా వాహనాలు రావు. ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రిగారు వస్తున్నారు అని తెలిసిన దగ్గర్నుంచి ఊరంతా ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.  ఉదయం నుంచే సందడి మొదలైంది. ముగ్గులేశారు, వాటికి రంగులేశారు, స్వాగతాలు రాశారు. గోడల మీద కొత్తగా ఏవేవో పోస్టరు వెలిశాయి. గుడ్డ బ్యానర్ల మీద ముఖ్యమంత్రికి స్వాగతం అని రాసి ఊరంతా తోరణాల్లా కట్టారు. పంచాయతీ గుమస్తా, వెంకట్రావు, ఫైళ్లు పట్టుకుని అటూ ఇతూ పరుగెడుతున్నాడు. స్థానిక RDO అసిస్టెంట్ సభ కోసం వేసిన పందిరి పక్కన తాగునీటి డ్రమ్ములు ఎక్కడ పెట్టాలో అరిచి మరీ చెప్తున్నాడు. ఆఫీసర్లు అంబాసిడర్ కార్లలో వస్తారా లేక జీపుల్లో వస్తారా అని గ్రంధాలయంలో గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

ఈ సందడి మధ్య, పద్మ తన తండ్రి టీ కొట్టు దగ్గర నిలబడి, తన జడలో మల్లెపూలు తురుముకుంటోంది. మాటి మాటికీ జీపులు వస్తున్నాయేమోనని ఆమె రోడ్డు వైపు చూస్తూ ఉంది. ఇటువంటి సంఘటన చూడటం ఆమెకి ఇదే మొదటిసారి. ఆమె తండ్రి, అప్పారావు, కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాడు. అవకాశం ఉంటే సీయంగారు వచ్చి అతని షాపులో కూర్చుని టీ తాగుతారు అని ఎవరో ఆఫీసర్ వచ్చి చెప్పి వెళ్లాడు. “గ్లాసులు శుభ్రంగా ఉండాలి. టీ వేడిగా ఉండాలి.” అని వంద సూచనలు చేసి మరీ వెళ్లాడు. గ్లాసులు కడగమని రెండుసార్లు చెప్పినా మాట విననట్లే ఉన్న కూతురిని చూసి తల కొట్టుకుంటూ ఆ పని అతనే చెయ్యడం మొదలుపెట్టాడు.

మొత్తానికి సీయంగారు రానే వచ్చారు. దుమ్ము రేపుకుంటూ ఏడో ఎనిమిదో కార్లు, నాలుగైదు జీపులు. సీయం కారు దిగగానే సినిమాలో మొదటిసారి హీరో కనిపించినప్పుడు అభిమానులు గోల చేసినట్లు అందరూ అరుపులు, కేకలతో స్వాగతం చెప్పారు. పద్మ కూడా అందరితో కలిసి చప్పట్లు కొట్టింది. అధికారులను చూస్తుంటే ఆమెకి గర్వంగా అనిపించింది. ముఖ్యమంత్రి కన్నా, ఆయన చుట్టూ సఫారీ సూట్లలో, నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న వాళ్లు భలే ఉన్నారనుకుంది. ముఖ్యంగా ఎర్రగా, దట్టమైన మీసాలతో, గంజి పెట్టి ఇస్త్రీ చేసిన బట్టలా ఉన్న కుర్రాడు బాగున్నాడనిపించింది. పక్కనే ఉన్న స్నేహితురాలితో అతని గురించే మాట్లాడింది.  “ఆయన్ని చూశావా? చాలా ముఖ్యమైన వ్యక్తి అనుకుంటా. ఆయన బూట్లు చూడా ఎలా మెరిసిపోతున్నాయో. వాటి రేటు మన సైకిల్ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది తెలుసా.” అంది.

ముఖ్యమంత్రి కారు దిగి అందరినీ పలకరించుకుంటూ ముందుకు నడిచాడు. దారి పొడవునా ఆయనకు దండలు వేశారు. పెద్ద ఊరేగింపులా ఆయన వెనుక జనం నడిచారు. కొత్త పంచాయితీ ఆఫీస్ కట్టాలనుకుంటున్న చోటుకి నడిచే వెళ్లాడాయన. చక చకా పనులు మొదలయ్యాయి. పది పదిహేను నిముషాలలో శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ అయిపోయాయి. ఆయంతో సహా వచ్చినవాళ్లంతా కొబ్బరికాయలు కొట్టారు. ఈనాడు ఫోటోగ్రాఫర్ టక టక మని ఫోటోలు తీశాడు. ఆయన నేరుగా ఓర్లోకి వచ్చి పద్మ వాళ్ల టీ బంకు దగ్గరే వేసి ఉన్న బల్లల మీద కూర్చున్నాడు. పద్మ టీ అందిస్తే తీసుకుని “ఏం చదువుతున్నావమ్మాయ్?” అని అడిగారు. “డిగ్రీ సార్” అంటే “బాగా చదువుకో” అన్నాడాయన. ఆ తరువాత ఊరి జనాన్ని చాలా ప్రశ్నలు వేశారు. అదంతా పద్మ ఆసక్తిగా చూసింది. ఆమెకు వటిలో చాలా విషయాలు అర్థం కూడా కాలేదు, కానీ ఒక ముఖ్యమత్రి ఎలా పనిచేస్తాడ్ చూడటం ఆమెను ఉత్తేజపరిచింది. అరగంట తరువాత ఆయన వెళ్లిపోయాడు.

మధ్యాహ్నానికి, జన కూడా వెళ్లిపోవడం మొదలుపెట్టారు. పద్మకి అలసిపోయినట్లు ఉన్నా సంతృప్తిగా ఇంటికి చేరుకుంది. “ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు.” అనుకుంది.

చదివారు కదా? ఈ కథలో ఏమైనా లోపం కనిపిస్తోందా?

ఇప్పటిదా నడిచినదాంట్లో అసలు కథే లేదు. ఒక పల్లెటూరిలో ఒక సామాన్య కుటుంబంలో ఒక అమ్మాయి – పద్మ. ఆమె ఉండే ఊరికి ముఖ్యమంత్రి రావటం, ఆయంతో సంభాషించే అవకాశం ఆమెకి రావటం – ఇప్పటి వరకు జరిగింది ఇంతే. ఇది ఇలాగే కొనసాగితే, అందులో కథ ఉంటుందని నేను అనుకోవటం లేదు. కానీ ఇందులో స్థలము, కాలము ఉన్నాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక పల్లెటూరు. బహుశా 80వ దశకం చివర్లోనో, 90వ దశకం మొదట్లో జరిగినట్లుంది. నిజానికి, ఈ కథ స్థలకాలాలు చెప్పడంలో పటిష్టంగానే కనిపిస్తుంది. ఆ కాలంలో ప్రభుత్వ అధికారులు, గ్రామీణ జీవితం ఈ రెండింటి చుట్టూ ఉండే సాంస్కృతిక, రాజకీయ వాతావరణాన్ని ఈ కథ ప్రతిబింబిస్తోంది.

మరి స్థల కాలాలు సరిగ్గానే ఉన్నా, రచయిత అవి తెలిసేలా జాగ్రత్తగా వాటిని పొందుపరచినా, మనకి కథ నచ్చకపోవటానికి కారణాలు ఏమున్నాయి?

ఈ కథ ఉపరితలం మీదే నడుస్తోంది. పైపైన అంతా సరిగ్గా ఉన్నప్పటికీ, ఈ కథలో వాస్తవిక చిత్రణ అనే అంశాన్ని దాటి పాఠకుల ఆకట్టుకోలేకపోతోంది. ఎందుకంటే ఈ కథ ఆ సందర్భానికి మాత్రమే పరిమితమై ఉంది. ఇతర కాలాలలో ఉండే పాఠకులకు, ఇతర ప్రాంతాలలో ఉండే పాఠకులకు ఇవ్వగలిగిన భావోద్వేగాన్ని కానీ, తాత్విక చింతనని కానీ అందించడం లేదు కాబట్టి.

కాలాతీతమైన, ప్రాంతాతీతమైన భావోద్వేగ చిత్రణ, తాత్విక చింతన – ఈ రెండూ కథకి ఆయుష్షు పోస్తాయి. ఇందులో అలాంటి సార్వత్రిక భావోద్వేగం లేకపోవడం ముఖ్యమైన లోపం. కథానాయిక పద్మ ప్రభుత్వ అధికారుల వస్తున్నారనే ఉత్సాహం, వచ్చాక కొంత ఆనందం అనుభవిస్తుంది. ఆ భావోద్వేగం పెరగదు, మారదు. ఆమెను ముందుకు నడిపించే బలమైన ఉత్ప్రేరకం లేదు. ఇదే కథలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే స్థలం వాళ్లు తరతరాలుగా సేద్యం చేసుకుంటున్న భూమి అయితే కథ ఎలా ఉండేది. ఉన్నట్టుండి ఆమె భాధ మనకి దగ్గరౌతుంది. అదే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి ఆమె తండ్రి టీ కొట్టులో కాఫీ తాగడం అనే సన్నివేశం ఆమెతో పాటు మనకి కోపాన్ని, నిస్సహాయతని కల్పిస్తుంది. అలా వచ్చిన ముఖ్యమంత్రిని ఆ టీ కొట్టు దగ్గరే చంపేయాలని ఆమె అనుకున్నది అని కథ మొదట్లో చెప్తే కథ నిప్పులా రాజుకునేది.

కథని మార్చమని నేను చెప్పడంలేదు. కథలో అలాంటి కాలాన్ని, స్థలాన్ని దాటే భావోద్వేగం, తాత్విక చింతన ఉన్నాయా లేదా అని ఒక సారి మీ కథలోకి చూసుకోమని సూచిస్తున్నాను. ఒక రచయిత కథలో సెట్టింగ్ పైన అవసరమైన దానికన్నా ఎక్కువ దృష్టి పెట్టి కేవలం ఆ సందర్భానికి సాధికారికత తీసుకురావాలని ప్రయత్నిస్తే ఆ కథ ఒక డాక్యుమెంటరీ లాగానో లేక చారిత్ర రికార్డుగానో మారుతుంది. అదే విధంగా రచయిత ఆ కథని సార్వత్రికం చెయ్యాలని బలవంతంగా ప్రయత్నిస్తే ఆ కథ కథ అస్పష్టంగా, చాలా చప్పగా “గాలిలో తేలుతున్నట్లు” తయారౌతుంది. మొదటి రకం కథకి ఆ సంస్కృతి బయట ఉండే పాఠకులు కనెక్ట్ అవ్వడానికి కష్టపడితే, రెండో రకం కథనంలో పాత్రలు తమ అస్థిత్వాన్ని కోల్పోతాయి. కథా రచన ఈ రెండింటి మధ్యలో ఒక దారి వేసుకుని నడవాల్సి ఉంటుంది. స్థిరంగా వేళ్లూనుకుని నేలపై నిలబడాలి (సందర్భం), అదే సమయంలో చేతులు చాచి ఆకాశాన్ని అందుకోవాలి (సార్వత్రికత)

ఇది నిజంగా కత్తి మీద సాము లాంటిదే. ఒక సందర్భానికి కట్టుబడి ఉంటూనే సార్వత్రికతను ఎలా సాధించాలి? అందుకు ఐదు మార్గాలు సూచిస్తాను.

  1. కాలంతోపాటు మారని భావోద్వేగాలను పట్టుకోండి

కాలాలు మారతాయి కానీ మానవ స్పందనలు మారవు. భావోద్వేగాలు మారవు. ఏదైనా కథలో స్థల కాలాల వల్ల ఒక సందర్భం ఏర్పడుతుంది. సందర్భంలో నుంచి పాత్రల ప్రవర్తన వస్తుంది. ఆ ప్రవర్తన నుంచి ఒక భావోద్వేగం పుడుతుంది. ఆ భావోద్వేగమే కథను నడుపుతుంది. అలాంటి ఒక భావోద్వేగాన్ని పట్టుకోండి. కోపం, అసూయ, భయం, ప్రేమ, వాంఛ, విధేయత, ద్రోహం, ఆశయం, అభద్రత — ఇవి ఏ కాలంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా అలాగే ఉంటాయి. పురాతన ఆదిమానవుల కాలం నుంచి ముందు ముందు కొన్ని శతాబ్దాల వరకు ఇవన్నీ ఉనికిలో ఉన్నాయి/ఉంటాయి.

తన బిడ్డను రక్షించుకునేందుకు పోరాటం చేసే తల్లి రుద్రమదేవి అయినా అంతఃపురం సినిమాలో సౌందర్య అయినా మన స్పందన మారదు. స్పందన స్థాయి గురించి నేను చెప్పటం లేదు. బాధ అనేది ఒక స్పందన అయితే ఒక కథలో ఏడ్చేంత బాధ కలిగితే మరో దాంట్లో అయ్యో అని జాలిపడేంత మాత్రమే బాధ కలగచ్చు. కానీ బాధ అనే ఎమోషన్ ఒకటే. 1930లలో అమెరికాలో బానిసత్వం పోవాలని కోరుకున్న నల్ల జాతి యువకుడైనా, ఈ రోజు కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి ఊరెళ్లిపోవాలనుకునే యువకుడైనా – వాళ్లిద్దరి స్వతంత్రేచ్ఛ ఒకటే. అది చదివితే కలిగే ఉత్తేజం ఒకటే. పాకిస్తాన్ విభజన కారణంగా విడిపోయిన జంట, కులప్రతిష్ట కోసం తల్లిదండ్రులు విడదీసిన ప్రేమ జంటా ఒకే కథ చెప్తారు. కృష్ణార్జున యుద్ధం, దావూద్ ఇబ్రహీం-చోటారాజన్ మధ్య వైరం ఒకటే ఎమోషన్ మీద నడపచ్చు. సైన్యాన్ని కోల్పోయిన రావణుడు మనసులో జరిగే అంతర్గత అపరాధ భావనని, స్టార్టప్ సంస్థని మూసేసి వంద మంది ఉద్యోగాలు పొగొట్టిన ఎంటర్‌ప్రెన్యూర్ మానసిక క్షోభతో సరిపోల్చవచ్చు. అందుకని కథలో సెట్టింగ్‌నో, సందర్భాన్నీ, సన్నివేశాన్నో కాకుండా భావోద్వేగాన్ని నమ్మి కథని నడపండి. అది ఎక్కువ పాఠకులను, ఎక్కువ కాలంపాటు చేరుతుంది.

  1. ఏ పాత్రైనా మొదట ఒక మనిషి అని గుర్తుపెట్టుకోండి.

మీరు ఏ కథ రాసినా అందులో పాత్రలు ముందు మనుషులు ఆ తరువాత ఆ పాత్రలు. “అలా కాదండీ నేను రాసే కథలో పాత్రలన్నీ ఏలియన్లు (గ్రహాంతవాసులు)” అని వాదిస్తారా? అయినా సరే ఆ ఏలియన్లు కూడా మనుషులే అనుకోండి. ఎందుకంటే మీరు పాత్రలుగా వేరే జీవాన్ని తీసుకోవచ్చు కానీ మీరు చెప్పాలనుకున్న కథ మాత్రం ఒక మానవ భావోద్వేగమే అయ్యుంటుంది. అవతార్ సినిమా చూశారా? అందులో ఎలాంటి భావోద్వేగాలు ఉన్నాయో చెప్పగలరా? ప్రేమ, భయం, కోపం, నిస్సహాయత అన్నింటికన్నా ముఖ్యంగా సామాజిక అనుబంధం – ఇవే కదా? ఇవి ఆ గ్రహాంతరవాసులకి మాత్రమే పరిమితమైన ఎమోషన్స్ అని చెప్పగలరా? ఇవి మానవ భావోద్వేగాలు కాదా? ఇలా చూడటం మొదలుపెడితే ఏ స్థల కాలాలలో కథ నడిపినా అందులో ఉన్న పాత్రలు మానవ సహజమైన భావోద్వేగానికి గురౌతారని అర్థమౌతుంది.

అప్పుడు పైన మొదటి పాయింట్‌లో చెప్పినట్లు ఆ ఎమోషన్ మీద కథ నడిపే ప్రయత్నం చెయ్యాలి. కూతురి పెళ్లి గురించి ఆందోళన చెందుతున్న తండ్రి, ఆశయానికి కుటుంబానికి మధ్య నలిగిపోతున్న యువకుడు, తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న స్త్రీ, వర్గ భేదాల కారణంగా దూరమైన స్నేహితులు – ఇలాంటి కథలు ఎక్కడైనా జరగచ్చు. ఇలంటి పాత్రలు ఎప్పుడైనా ఉండచ్చు. స్థల కాలాల వల్ల ఫ్లేవర్ మారుతుందంతే – 1950లలో ఒక తండ్రి కులం కారణంగా ఒక పెళ్ళిని అడ్డుకోవచ్చు, ఈ రోజు ఇద్దరి కెరియర్ దెబ్బ తింటుందని వద్దనచ్చు. ఇలా సందర్భోచిత సత్యాలను ఉంచుతూనే ఒకే భావోద్వేగాన్ని ఎంచుకున్న సందర్భానికి అనుగుణంగా వ్యక్తీకరిస్తూ, సార్వత్రిక అనుసంధానం చెయ్యడం అభ్యసించాలి.

  1. సంఘటనలు స్థానికం – ఇతివృత్తం సార్వత్రికం

మీ కథ నిర్దిష్టంగా ఒక చారిత్రక లేదా భౌగోళిక సందర్భంలో నిలబడి ఉండచ్చు. కానీ ఆ కథలో ఉండే భావోద్వేగం ఆ ఇతివృత్తాన్ని దాటాలి. ఒక రచయిత స్థానికమైన సంఘటనలను సార్వత్రిక మానవ భావోద్వేగానికి ముడిపెట్టినప్పుడు, కథ ఆ స్థలానికి, ఆ సమయానికి పరిమితం కాకుండా విస్తృతమై, కాలస్థలాతీతంగా పాఠకులతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు, తెలంగాణ ఉద్యమం సమయంలో సెట్ చేయబడిన ఒక కథ రాజకీయ నిరసనలు, ప్రాంతీయ ఆత్మగౌరవం చుట్టూ తిరగచ్చు, కానీ దాని అంతరంగంలో ఆ కథ అస్థిత్వం అనే అంశాన్ని అన్వేషించవచ్చు — మనం ఎవరు? మనం మూలాలు ఎక్కడున్నాయి? చరిత్ర మనల్ని ఎలా గుర్తించింది? అనే ప్రశ్నలను సంధించవచ్చు. 1947లో ఒక శరణార్థి శిబిరంలో నడిచే కథ అక్కడి పాత్రలు కోల్పోయిన మనుషులను, వస్తువులను, వారి నష్టాన్ని నమోదు చెయ్యచ్చు, కానీ ఆ ఇతివృత్తంలోకి లోతుగా వెళ్తే కోల్పోయిన జ్ఞాపకాలు ఉండచ్చు. ప్రాంతీయ అస్తిత్వం  మరో సబ్జెక్ట్ కావచ్చు. నాగరికతకు చిహ్నమైన ఇల్లు, ఇంటి ఇరుగు పొరుగు కథ అసలు పరమార్థం కావచ్చు. 2090 అంతరిక్ష కాలనీలో నడిచే కథ సాంకేతికంగా మనం ఉండే ప్రపంచానికి చాలా దూరంగా అనిపించవచ్చు.

కానీ ఆ కథ ప్రధాన భావోద్వేగం ఒంటరితనం అయితే? ఒంటరితనం అనుభవించిన ఎవరికైనా ఇది అనుభవమైన విషయమే కాబట్టి కథ నిలబడుతుంది. మత్స్యకారుల గ్రామంలో కథ ప్రకృతిని ఎదిరిస్తూనే అందులో మమేకమయ్యే మనుషుల మనుగడను చూపిస్తుంది. కోవిడ్ కాలం కథ అనిశ్చితి, కనపడని ప్రమాదపు భయాన్ని ప్రతిబింబించవచ్చు. ఇలా రచయితలు స్థానిక పరిస్థితులలో నడిచే కథలను కాలాతీతమైనా మానవ భావోద్వేగాలతో అనుసంధానించినప్పుడు, సంఘటనలు కేవలం చారిత్రక సంఘటనలు మిగిలిపోకుండా వర్తమాన భవిష్యత్ కాలాలలోతో బాటు భిన్న సంస్కృతులలో కూడా ప్రతిధ్వనిస్తాయి.

మరో రెండు  వారాల తరువాత…

అరిపిరాల సత్యప్రసాద్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొత్త కథకులతో పాటు… కథలు రాసే అందరూ చదవాల్సిన కాలమ్ ఇది. మంచి కృషి చేస్తున్నారు సత్యప్రసాద్ గారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు