నెగడు

ట్లా

ఎట్లా వచ్చావో తెలియదు

అదాటుగా తలుపు తీసిన

తుంటరి గాలి లాగా

నువ్వు వచ్చాక

కొత్త భాష

పరిచయం చేశావ్

 

ఎలాంటి అనుమతి లేకుండా

ఆత్మలోకి సరాసరి

ఓ చిన్న సీతాకోకలా వాలి

గొప్ప సందడి చేస్తున్నావ్

నేను ఇప్పుడు

అడ్డుకోలేని తనం లో ఉన్నాను

 

నా

పరీవాహక ప్రాంతం

సారవంతం చేశావ్

అక్కడ ఇప్పుడు

నదులు పుడుతున్నాయ్

 

నడుస్తున్న పాదాల కు

పులకరింతల పూలు పూస్తున్నాయ్

 

దోసెడు నీటిలో

నీ నవ్వు  వికసిస్తూ ఉంది

సరాగాల ఊరేగింపు

ఎడతెగని వాన లాగా పాడుతున్నావ్

పాట

మీగడ కట్టిన పాట

మార్మిక స్వరంలో

మిటుతున్న పాట

తేనేజల్లు లా

తడుపుతున్న పాట

అన్ని కాలాల్లో

చుట్టుకున్న పాట

అరణ్యాన్ని

ఉద్యాన వనం చేసిన పాట

 

నిర్మించు

నిర్మించు

లోన ఇల్లోకటి నిర్మించు

గుమ్మానికి ఆనుకొని

చీకటిని చేరిపేసి

వెలుగుబొమ్మను

చెక్కుదాం

అసలు

ఒక్క ఉత్తరం కూడా

రాయకుండానే వచ్చావ్ కదా

నాపాటికి నేను

వాక్యాలు ఏరుకుంటూ

బతుకుతుంటే

నెగడు రాజేసి

ఏమి తెలియనట్టు

పసిపాపలా  నవ్వేసి

దేహాన్ని చుట్టుకున్నావ్

 

నువ్వు నాకు

 

ఏమి అవుతావు

 

నేను

నీకు

ఏమి అవుతాను?!

*

 

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు