నిజమైన ఉర్దూ వాది- మెహక్‌ హైదరాబాది!

“నాకు నేనే ఉర్దూ మాహోల్ (వాతావరణం) సృష్టించుకున్నాను. కొన్ని నెలలపాటు తెలుగు, ఇంగ్లిషు పేపర్లు బంద్ చేసి ఉర్దూ పత్రిక మాత్రమే చదివేవాడిని. “

కలం పేరు: మెహక్‌ హైదరాబాది. అసలు పేరు: పదుళ్ళపర్తి వెంకట సూర్యనారాయణ మూర్తి. పి.వి.ఎస్‌.మూర్తిగా పాత్రికేయరంగంలో సుపరిచితులైన ఈయన తెలుగు సాహిత్యలోకంలోకి నిశ్శబ్దంగా అడుగుపెట్టారు. తనదైన రీతిలో కృషిచేస్తున్నారు. ప్రసిద్ధ ఉర్దూ సాహితీవేత్త జీలానీ బానూగారి కథలను తెలుగులోకి అనువదించారు. ఉర్దూ నుంచి తెలుగులోకి నేరుగా తర్జుమా చేయడం వల్ల ఆ కథలు పాఠకాదరణ పొందాయి కూడా! ఇప్పటివరకూ మెహక్‌ హైదరాబాది అనువదించిన జీలానీ బానూగారి కథలు రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. అందులో ఒకటైన “గుప్పిట జారే ఇసుక” సంపుటికి 2017 సంవత్సరానికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది. అనువాద ప్రక్రియలో భాగంగా మెహక్‌ హైదరాబాదీ పొందిన ఈ పురస్కారం ఆయన కృషికి తగిన గుర్తింపు, గౌరవంగా పరిగణించవచ్చు! వృత్తి విషయానికి వచ్చేసరికి.. పి.వి.ఎస్‌.మూర్తి సీనియర్‌ పాత్రికేయులు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాద్‌ ఎడిషన్‌లో డిప్యూటీ న్యూస్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ తెలుగు పాత్రికేయుడు ఉర్దూ నేర్చుకుని అనువాదకుడిగా మారడం వెనుక ఆసక్తికరమైన కోణాలున్నాయి. ఆ సంగతులను నేరుగా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

ప్రశ్న: మీది పశ్చిమగోదావరి జిల్లా. ప్రామాణిక తెలుగుకి పేరెన్నికగన్న ప్రాంతం.  అక్కడ పుట్టిన మీకు ఉర్దూపై ఎందుకు ప్రేమ కలిగింది?

జవాబు: మాది పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరం గ్రామం. నా చదువు కొంత మా ఊళ్ళో, తర్వాత హైదరాబాద్‌లో సాగింది. మా ప్రాంతంలో ముస్లింలు కూడా స్వచ్ఛమైన, మంచి తెలుగు మాట్లాడతారు. ఉర్దూతో ఎలాంటి ప్రభావం లేని ప్రాంతంలో పుట్టిపెరిగిన నాకు ఆ భాష పూర్తిగా కొత్తదే. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగం కోసం దరఖాస్తు చేశాను. దానికి ఉర్దూలో విధిగా మంచి ప్రావీణ్యం ఉండాలి. ఉర్దూ రాకపోయినా నేను దరఖాస్తు  పెట్టాను. ఈలోగా ఉర్దూ నేర్చుకునే పనిలో పడ్డాను. తొలుత నాకు ఉర్దూపై ప్రేమ  కన్నా.. నాటి పరిస్థితులు, జీవితంలో మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్న లక్ష్యం, కొత్త భాష నేర్చుకోవాల్సిన అవసరం దానివేపు నడిపించాయి.

ప్రశ్న: ఉర్దూ నేర్చుకోవడంలో మీ అనుభవాలు చెప్పండి?

జవాబు: ఉర్దూ నేర్చుకోవడానికి నేను చాలా తిప్పలు పడ్డాను. మొదట ఆ  ఉద్యోగానికి ఇంటర్వ్యూ వస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. అందుకే ఒక ఉర్దూ  మాస్టారు కోసం వెతకడం మొదలుపెట్టాను. చాలా మందిని అడిగినా ఫలితం  లేకపోయింది. ప్రతి వ్యక్తీ ఉర్దూ ఎంతో తీయని భాష అని చెప్పేవారే గానీ,  నేర్పేవారు దొరకలేదు. ఒకరిద్దరు ఉర్దూ ఉపాధ్యాయులు కూడా నిరాకరించారు.  అయినా పట్టు వదల్లేదు. రైల్వే స్టేషన్లో “30 రోజుల్లో ఉర్దూ భాష” పుస్తకం  కొన్నాను. దాని ద్వారా వర్ణమాల మాత్రమే తెలిసింది. ఒకరోజు లక్డీకాపుల్‌లోని  అయోధ్య హోటల్ వద్ద ఒక మసీదుకి వెళ్లాను. అక్కడ నమాజు అయ్యాక ఒక  పెద్దాయన్ని అడిగాను. ఆయన సియాసత్ దినపత్రిక ఆఫీసుకి వెళ్లమని నాకు  సలహా ఇచ్చారు. ఆ పత్రిక సిబ్బంది నాకు మూడు ఉర్దూ ప్రాథమిక  పుస్తకాలిచ్చారు. అవి చదవలేని పరిస్థితి. ఇంతలో నాకు ఇంటర్వ్యూ రానే వచ్చింది.  దానికి ఒక నెల వ్యవధి ఉంది. అదే సమయంలో మా కాలనీలో ఉండే రిటైర్డు డీఎస్పీ ఎం.ఏ. మాల్వేగారు (మోహన్‌జీ అంబాజీ మాల్వే) పరిచయమయ్యారు. ఆయన కూడా తొలుత ఉర్దూ నేర్పడానికి సంశయించారు. మర్నాడు వర్ణమాల రాసి తీసుకువెళ్లి చూపించేసరికి అంగీకరించారు. ఆయన దగ్గర రెండేళ్లు ట్యూషన్ ద్వారా ఆ భాష నేర్చుకున్నాను. హైదరాబాద్‌లోని ఇదారే అదబియాత్ ఉర్దూ సంస్థ ద్వారా మూడు ఉర్దూ పరీక్షలు పాసయ్యాను. పత్రికలకు ఉత్తరాలతో మొదలుపెట్టి చిన్నచిన్న వ్యాసాలు రాయడం ప్రారంభించాను. బాబరీ మసీదు ధ్వంసం నేపథ్యంలో 1997లో ఏఐసీసీ కోల్‌కతా మహాసభల్లో ఒక తీర్మానం చేస్తే.. దానిపై  స్పందనగా నేను రాసిన ఒక ఉత్తరాన్ని సియాసత్ పత్రిక ప్రచురించలేదు. ఒక హిందువు పేరుతో వచ్చిన ఆ లేఖను ఒక ఆకతాయి పనిగా భావించి పక్కన పడేశారు. తర్వాత మున్సిఫ్ పత్రిక అదే ఉత్తరాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అది వేరే సంగతి.

ప్రశ్న:  ఉర్దూ భావ పరిపుష్టి కలిగిన భాష అంటారు కదా! దేశభాషల్లో తెలుగు లెస్స అన్నారు మన భాషని. మరి ఈ రెండు భాషలకి మధ్య పోలికలు, వ్యత్యాసాలు ఏమున్నాయి?

జవాబు: తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అయితే, ఉర్దూ ఎల్లలు లేని తీయని  భాష. గొప్ప భావవ్యక్తీకరణ, అభివ్యక్తి ఉర్దూలో పుష్కలంగా ఉన్నాయి. గతంలో  ముస్లిం పాలకుల వల్ల ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ, ప్రజల్లో అనేక ఉర్దూ పదాలు  తెలుగులోకి రూపాంతరం చెంది వచ్చిచేరాయి. వాటిని విరివిగా వాడుతున్నారు.  ఒకప్పుడు నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా   ఉర్దూ పదాలు వచ్చిచేరాయి. కోస్తా ప్రజలు తమకు తెలియకుండానే ఉర్దూ  పదాలను విస్తారంగా వాడుతుంటారు. ఉర్దూని పాకిస్థాన్ తన జాతీయభాషగా  ప్రకటించుకోవడం, అదే సమయంలో భారత్‌లో దాన్ని ఒక వర్గానికి చెందిన భాషగా ముద్రవేయడంతో ఉర్దూ బాగా నిరాదరణకు గురయ్యింది. ప్రజల నాల్కలమీద కదలాడే జీవభాషగా, అనేక షాయిరీ ప్రక్రియలకు వన్నెలద్దే కావ్యభాషగా నిలిచినప్పటికీ పాలకుల నిర్లక్ష్యంతో ఉర్దూ ఒక పరాయిభాష అన్న అపప్రథ మోస్తోంది. తెలుగు పరిస్థితి అంతకన్నా భిన్నంగా ఏమీలేదు.

ప్రశ్న: ఒక భాషని నేర్చుకోవడం వేరు. అనువాదం చేసే స్థాయిలో దానిపై పట్టు  సాధించడం వేరు. ఈ క్రమంలో మీరు చేసిన సాధన ఎటువంటిది?

జవాబు: ఉర్దూ ఓనమాలు నేర్చుకున్న రోజునుంచి గత పాతికేళ్లుగా నేనెంతో  దూరం ప్రయాణించాను. తొలుత ప్రభుత్వ ఉద్యోగం కోసమే ఉర్దూ  నేర్చుకున్నప్పటికీ సర్కారీ కొలువు నాకు రాలేదు. అయినా నిరాశపడలేదు. ఉర్దూ నేర్చుకోవడం ఆపలేదు. బహుళవర్గాలతో నిండిన సమాజం, మిశ్రమ సంస్కృతి పుష్కలంగా ఉన్న హైదరాబాద్ లాంటి చారిత్రక నగరంలో ఉర్దూ ప్రాధాన్యాన్ని  ఆనాడే గుర్తించాను. గత పాతికేళ్లుగా క్రమం తప్పకుండా నిత్యం ఉర్దూ  దినపత్రికలు చదువుతూనే ఉన్నాను. ఇంట‌ర్నెట్‌లో పాకిస్థాన్‌లోని ఉర్దూ పత్రికలు  చదువుతాను. హైదరాబాద్‌లో జరిగే ముషాయిరాలు, ఉర్దూ సదస్సులు, ఇతర  కార్యక్రమాలకు వెళ్లేవాడిని. వార్త రిపోర్టరుగా అనేక ముషాయిరాలు కవర్ చేశాను. హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ వివిధ రంగాలకు చెందిన పలువురు ఉర్దూ ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేశాను. ముస్లింల సమస్యలపై అనేక కథనాలు రాశాను. ఈ  క్రమంలో నాకు అనేకమంది షాయర్లు, సాహితీవేత్తలు, జర్నలిస్టులతో పరిచయాలయ్యాయి. నాకు నేనే ఉర్దూ మాహోల్ (వాతావరణం) సృష్టించుకున్నాను. కొన్ని నెలలపాటు తెలుగు, ఇంగ్లిషు పేపర్లు బంద్ చేసి ఉర్దూ పత్రిక మాత్రమే అర్థమైనంత మేర చదివేవాడిని. పాకిస్థాన్ టీవీ (పీటీవీ), ఈటీవీ చూడడం, ఆకాశవాణిలో ఉర్దూ ప్రాంతీయ వార్తలు, నైరంగ్ ఉర్దూ ప్రోగామ్ వినడం అలవాటు చేసుకున్నాను. సెలవురోజు వస్తే బైక్ మీద హైదరాబాద్ పాతబస్తీ అంతా కలయతిరుగుతూ ఉర్దూ హోర్డింగులు, గోడలు, మసీదులపై ప్రకటనలు, రాతలు చదువుతుండేవాడిని. సియాసత్, మున్సిఫ్, రెహ్ నుమాయే దక్కన్ దినపత్రికలకు వెళ్లి, అక్కడ వారు పనిచేసే తీరుని పరిశీలించేవాడిని. రెండేళ్లు ఉర్దూయే లోకంగా బతికాను. హిందీ కూడా క్షుణ్ణంగా నేర్చుకోవడంతో ఆరేడు  హిందీ బెల్టు రాష్ట్రాల్లో ఒక రిపోర్టరుగా ఎన్నికల కవరేజీ చేయడానికి ఎంతగానో ఉపకరించింది.

ప్రశ్న: జీలానీబానూ గారి ఉర్దూ కథలను మీరు తెలుగులోకి అనువదించారు. ఆమె  కథలనే ఎంపిక చేసుకోవడానికి  కారణమేంటి ?

జవాబు: 2001లో జీలానీ బానూగారికి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు తొలిసారిగా  ఆమెను కలిసి ఇంటర్వ్యూ చేశాను. నిజాయితీగా చెప్పాలంటే ఆప్పటికి ఆమె కథలేమీ చదవలేదు. 2002 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో మతకలహాలు జరిగిన నేపథ్యంలో సియాసత్ పత్రిక జీలానీ బానూ పాతకథ `ముజ్రిమ్`ను పునర్ముద్రించింది. ఆ కథను నేను తెలుగులోకి అనువదించగా, వార్త సండే మ్యాగజిన్‌లో ప్రచురితమయ్యింది. ఆ తర్వాత అనేకమంది ప్రముఖుల వ్యాసాలు తెలుగులోకి అనువదించాను. చాలా విరామం తర్వాత బానూగారి నాలుగు కథలను `సాక్షి`, `విపుల`, `పాలపిట్ట`కు అనువాదం చేశాను. తర్వాత ఆమె  మరిన్ని కథలను కూడా అనువదించాను. ఆ కథలను `గుప్పిట జారే ఇసుక`, `అంతా నిజమే చెప్తా` శీర్షికలతో చెరో 21 కథలతో కూడిన రెండు సంపుటాలను నవచేతన పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించింది. జీలానీ బానూగారు సమాజంలోని యథార్థ సంఘటనలకు కొంత కాల్పనికత, సృజనాత్మకత జోడించి అద్భుతంగా రాస్తారు. ఆమె సృష్టించిన పాత్రలన్నీ మన చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటాయి. మనతో మాట్లాడతాయి. మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి. మధ్యతరగతి, నిరుపేదలు, కార్మికులు, రైతుల జీవితాల్లోని వివిధ పార్శ్వాలను ఆమె స్పృశిస్తారు. మానవుని కష్టాలను, దుఃఖాన్ని ఆమె అక్షరీకరిస్తారు. పోలీసు యాక్షన్‌కు ముందూ, ఆ తర్వాత తెలంగాణ జనజీవితాన్ని ఆమె చిత్రించిన తీరు అనితరసాధ్యం. జీలానీ బానూగారి రచనలు రావాల్సినంతగా ఆమె నివసిస్తున్న తెలుగు ప్రాంతంలోని పాఠకులకు అందుబాటులోకి రాలేదు. అందుకే ఆమె కథలను తెలుగులోకి తేవాలని సంకల్పించాను.

ప్రశ్న: జీలానీ బానూగారి కథలు అనువదించే క్రమంలో మీకు కలిగిన అనుభూతి  గురించి చెప్పండి?

జవాబు: జీలానీ బానూగారి కథలు మొదలుపెడితే విడిచిపెట్టకుండా ఏకబిగిన  చదివిస్తాయి. అవి చదువుతుంటే తెలంగాణ పల్లెల్లో లేదా హైదరాబాద్ నగరంలో  విహరిస్తున్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె తెలంగాణ దక్కనీ మాండలికాన్ని  పుణికిపుచ్చుకున్నారు. సంభాషణల్లో ఆ ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ  తరహాలో తెలంగాణ సమాజాన్ని అక్షరబద్ధం చేసిన ఉర్దూ రచయిత ఎవరూ లేరంటే ఆశ్చర్యంలేదు. కథ ఎత్తుగడ, పాత్ర చిత్రణ, ముగింపులో ఆమెది భిన్నమైన శైలి. అది ఎలాంటి పాఠకుడినైనా ఆలోచింపచేస్తుంది. ఒక్క వాక్యంలో కథా సారాంశాన్ని చెప్పగల నైపుణ్యం ఆమె సొంతం.

ప్రశ్న: జీలానీ బానూగారి కథలలో ఎలాంటి సాహిత్య దృక్పథం మీకు   గోచరించింది?

జవాబు:  బానూగారు రాసినదంతా అభ్యదయ సాహిత్యమే. తరక్కీ పసంద్ అదబీ తెహ్రీక్ (అభ్యుదయ రచయితల ఉద్యమం)లో ఆమె క్రియాశీలక పాత్ర  పోషించారు. కానీ, ఆ సంస్థలో సభ్యత్వం తీసుకోలేదు. మార్క్సిస్టు దృక్పథంతో  రైతులు, కార్మికుల సమస్యలపై కథలు రాశారు. కానీ, మార్క్సిస్టు రచయిత కారు. భ్రూణహత్యలు, మహిళల పరాధీనత, స్త్రీలపై వివక్ష, వారిపై లైంగిక దాడులు తదితర అంశాలపై రచనలు చేశారు. కానీ, ఫెమినిస్టు రైటర్ అంటే ఒప్పుకోరు. బానూగారు ఏ ఇజానికీ కట్టుబడని స్వతంత్ర రచయిత్రి. ఆమె ఏ సాహిత్యచట్రంలో ఇమడని రచయిత్రి. ఆమెది స్వతంత్ర పంథా. అయితే, జీలానీ బానూగారిపై మగ్దూం మొహియుద్దీన్, కథ, నవలా రచయితలు కిషన్ చందర్, రాజేందర్ సింగ్ బేదీ, సాదత్ హసన్ మంటోల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె రచనల్లో రాజకీయనేతలు, మంత్రులు, జడ్జిలు, లాయర్లు, ఎడిటర్లు, ఉలేమాలు, పూజారులు.. ఇలా అన్ని వర్గాలపై విసుర్లు కనిపిస్తాయి. ప్రజలను అణచివేసే జమిందారీ, జాగీర్దారీ వ్యవస్థ, వెట్టిచాకిరీ, పురుషాధిక్య సమాజం, పురుషుడు చేసిన తప్పుకు మహిళను శిక్షించే సమాజం, గృహహింస, అమాయక రైతుల దోపిడీ,  కుహనా మేధావులు, రచయితల్లో ఆత్మవంచన, డబ్బుతో ముడిపడిన మానవ సంబంధాలు, మానని మతకలహాల గాయాలు, ప్రేమికులను విడదీసే ఆర్థిక అసమానతలు, మతచిచ్చు, హిందూ ముస్లింల మధ్య అపోహలు, ఘర్షణ వాతావరణం, భారత విభజన, అణుబాంబు దుష్ఫలితాలు, అమెరికా  యద్ధోన్మాదం, వ్యాపారంగా మారిన భక్తి, తాయెత్తులిచ్చే మోసకారి భూతవైద్యులు.. ఇలా అనేక ఇతివృత్తాలతో చైతన్యవంతమైన కథలు, నవలలు,  నాటికలు ఆమె రాశారు. చిక్కటి వచనం రాస్తూనే కవితాత్మక ధోరణిలోకి జారుకోవడం చాలాచోట్ల కనిపిస్తుంది.

ప్రశ్న: కథనం, శైలి, శిల్పం పరంగా జీలానీ బానూగారి రచనలలో ఇంకా  ప్రత్యేకతలేంటి?

జవాబు: చారిత్రక సంఘటనలను, సమకాలీన ఉదంతాలను వర్తమాన   సమాజానికి అన్వయించి కథ అల్లడంలో ఆమెకొక విలక్షణత ఉంది. ఈ కోణంలో `అబ్బాస్ నే కహా`(అబ్బాస్ ఆన), `సచ్ కే సివా(అంతా నిజమే చెప్తా), `సూఖీ  రేత్`(గుప్పిట జారే ఇసుక), `పత్తర్ కా షెహజాదా`(రాతి రాకుమారుడు) వంటి కథలు ప్రధానమైనవి. కథా గమనంలో కూడా పాఠకుల్ని కదిలించే అనేక విరుపులు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని….

 1. ఉల్లిగడ్డలో ఎన్ని రేకలుంటాయో అంతకన్నా ఎక్కువబాధలే పడింది అమీనా. (గవాక్ష న్యాయం)
 2. సితార కోపంతో ఊగిపోతోంది. సలసల కాగుతున్న నూనెలో వేగుతున్నపూరీలా ఉంది ఆమె పరిస్థితి. (బంతాట)
 3. నిజం చెప్పడానికి అరిచి గీ పెట్టనక్కర్లేదు. సత్యమెప్పుడూ కషాయంలాఉంటుంది. అది ఓ పట్టాన గొంతు దిగదు. (షూటింగ్ స్క్రిప్టు)
 4. ఆ ఇంట్లో ఆమె ఓ వంట`పాత్ర` మాత్రమే! (అనగనగా ఓ మమ్మీ)
 5. బతుకంతా తనకు బాధలు తప్పవని ఆమె ఆనాడే రాజీపడిపోయింది.మరుగుతున్న నూనెలో మునగడానికి సైతం సిద్ధపడింది. (అనగనగా ఓ మమ్మీ)
 6. మమ్మీ చేతిలో రేఖలెన్ని ఉన్నాయో, అన్ని గాయాలూ ఉన్నాయ్! (అనగనగాఓ మమ్మీ)
 7. పాడైన ఆ ఇంటి మిద్దె పెళ్లలు, జలజల కారే అమ్మ కన్నీటి బిందువుల్లావిరిగిపడుతుండేవి. చిరిగిపోయిన సురయ్యా చీరల్లా, గోడలన్నీ రంగు వెలిసిమురికిపట్టిపోయాయి! (నేను చనిపోయా!)
 8. మేం గరీబోల్లం. గడీ చూస్కొని చేసేడ్ది ఏముంటది? మంచి దినాలెన్న డ్రావ్మాకి`(నర్సయ్య బావి)
 9. నా ఉద్దేశంలో ఇన్ని ఐటెమ్స్ వడ్డిస్తే ఇండియాలో ఆకలితో నకనకలాడే ఓకుటుంబానికి రోజు గడిచిపోతుంది`(గుప్పిట జారే ఇసుక)
 10. న్యాయం దొరికేతానికి పొయ్యేందుకు గిప్పుడు తొవ్వేలేదు. ఈ రోడ్డులోఎవర్నీ వెళ్లనీయడం లేదమ్మా` (ఈ దారి ఎక్కడికి)

ప్రశ్న:  జీలానీ బానూగారి కథలను ఇతర రచయితలు కూడా అనువదించారు.  అలాంటివి మీరేమైనా చదివారా? అవి ఎలా ఉన్నాయి?

జవాబు: 40 ఏళ్లక్రితం దాశరథి రంగాచార్యగారు అనువదించి, విశాలాంధ్ర   పబ్లికేషన్స్ ప్రచురించిన కొన్ని జీలానీ బానూ కథలను చదివాను. అద్భుతంగా  ఉన్నాయి. తర్వాత అడపాదడపా వచ్చిన ఒకటి రెండు అనువాదాలన్నీ ఇంగ్లిషు,  హిందీ నుంచి తర్జూమ చేసినవే.

ప్రశ్న: ఒక భాష నుంచి మరో భాషలోకి అనువదించేటప్పుడు రచయిత   తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

జవాబు: అనువాదకుడికి మూలభాషలోనూ, తర్జూమ చేయబోయే   లక్ష్యభాషలోనూ గట్టి పట్టు ఉండాలి. మూల రచయిత శైలి, శిల్పం, కథనం  స్థాయిని అందుకోవడం చాలా ముఖ్యం. అనువాదంలో తగిన  స్వేచ్ఛ  తీసుకుంటూనే మూల రచనకు నూటికి నూరుపాళ్లూ కట్టుబడి ఉండాలి.  అనువాదం చేసేటప్పుడు ఆ కథ స్థలకాలాదులు, సామాజిక, సాంస్కృతిక  వాతావరణం, పాత్రల స్వభావానికి, నాటి చారిత్రక నేపథ్యానికి తగ్గట్లుగా  సంభాషణలు ఉండాలి. ఒక్కో భాషలో ఒక్కో తీరులో వ్యవహారిక పలకరింపులు, సామెతలు, లోకోక్తులు, ఛలోక్తులు, భాషా ప్రయోగాలు ఉంటాయి. వీటికి లక్ష్యభాషలోకి సమానార్థకాలు వెతకడం కష్టమే. అయితే మూల రచయిత ఆత్మను పట్టుకుని, తెలుగు నుడికారంతో వ్యవహారిక భాషలో తర్జుమా చేయగలిగితే అది మంచి అనువాదమవుతంది. అనువాద కథను చదివే పాఠకుడికి అది సిసలైన రచనగా అనిపిస్తే కచ్చితంగా అది ఉత్తమ అనువాదమవుతుంది.

ప్రశ్న: ఉర్దూ సాహిత్యంలో మీకు ఇష్టమైన కవులూ, రచయితలు ఎవరు?

జవాబు: ఉర్దూ షాయర్లలో మునవ్వర్ రాణా, రాహత్ ఇందోరీ, వసీం బరేల్వీ అంటే ఇష్టం. అరబిక్, ఫార్సీ బంధనాల నుంచి గజల్‌ను బయటకు తీసుకువచ్చి చాలా సరళంగా హిందుస్థానీ భాషలో కవిత చెప్పి మెప్పించిన వాడు మునవ్వర్. ఆయన తన గజల్ ద్వారా ప్రేక్షకుల గుండె తీగలను మెలితిప్పుతాడు. రాహత్ గజల్ చెప్పి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాడు. వసీం బరేల్వీ ఎంతో సున్నితంగా సంక్లిష్ట జీవితాన్ని ఆవిష్కరిస్తాడు. షాయ‌రీలో నాకు రెహ్మాన్ జామీసాబ్ (హైద‌రాబాద్‌) గురువు. ఆయ‌న‌ నాకు గ‌జ‌ల్ ఛంద‌స్సు నేర్పారు. నేను రాసిన పాతిక‌దాకా గ‌జ‌ళ్లు మున్సిఫ్‌, సియాస‌త్‌, ఎతెమాద్ దిన‌ప‌త్రిక‌ల్లో ప్రచురిత‌మ‌య్యాయి. తెలంగాణ మ‌లిద‌శ ఉద్యమం స‌హా అనేక స‌మ‌కాలీన అంశాల‌పై గ‌జ‌ళ్లు రాశాను.

*

 

ఒమ్మి రమేష్ బాబు

ఒమ్మి రమేష్ బాబు

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • By reading the interview I could know how difficult it is to translate a popular work, than writing originally. The efforts made and struggles faced by the writer in learning a new language and attempting to translate popular works of Jilaani Bhanu are praiseworthy. I wish all success to Mehak Hyderabadi in all future endeavors.

 • Murty,
  A practise u did is nothing but transmitting a soul to another soul.
  One language to another language
  One culture to another culture
  One religion to another religion.
  Individual will have one soul to transmit other soul as per mythology
  But as a literate n translator u got many souls.
  Regards
  Bhanu

 • మూర్తిగారిని ఇలా సారంగ‌లో చూడ‌టం నాకు ఆనందం క‌లిగింది.
  ఎందుకంటే మా ఇద్ద‌రికీ కంప్యూట‌ర్ బంధం. అంటే.. ఆంధ్ర‌జ్యోతిలో(2014 సెప్టెంబ‌రు) జాయిన్ అయిన‌పుడు ఓ ఏడాది పాటు ఓ కంప్యూట‌ర్ ను వాడేవాణ్ని. తొలిరోజు ఆ కంప్యూట‌ర్ వెతికితే.. ఉర్దూ నాకు ట‌చ్ అయింది. రెండోరోజు.. ఓ విష‌యం తెల్సింది. మూర్తిగార‌నే సీనియ‌ర్ పాత్రికేయుడి సిస్ట‌మ్‌ను నేను వాడుకుంటున్నాన‌ని. వాస్త‌వానికి జెన‌ర‌ల్ డెస్క్‌లో ప‌నిచేసే వాళ్లు సాయంత్రం అయిదుకు ఆఫీసుకు వ‌స్తారు. ఫీచ‌ర్స్‌లో ప‌నిచేసే మేం ఉద‌యం ప‌దినుంచి సాయంత్రం అయిదు వ‌ర‌కూ వాళ్ల సిస్ట‌మ్స్‌ను వాడుకోవాల‌న్న‌మాట‌. అలా.. అనుకోకుండా మూర్తిగారి కంప్యూట‌ర్‌ను వాడే అవ‌కాశం వ‌చ్చింది. నాలుగురోజుల త‌ర్వాత అనుకుంటా.. ఓ సాయంత్రం.. మూర్తిగారితో మాట్లాడే అవ‌కాశం వ‌చ్చింది. ఓ చిన్న‌పిల్లాడిలా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఎక్క‌డ‌నుంచి వ‌చ్చావు, ఏంటీ.. అని శ్ర‌ద్ధ‌గా, నిర్మ‌లంగా అడిగేవారు. కెరీర్ గురించి మాట్లాడేవారు. అప్పుడ‌ప్పుడూ ఉర్దూమీద ప్రేమ నాకు క‌నిపించేది. ఉర్దూలోని కొన్ని ట్రాన్స్‌లేష‌న్స్ చేసి ఎడిట‌ర్‌. కె.శ్రీనివాస్‌గారికి చూపించేవారు. శ్రీనివాస్ గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లారంటే ఒక‌రు క‌వి అయి అయినా ఉండాలి. లేదా చిత్ర‌కారుడ‌యినా అయి ఉండాలి. ఆ ఇద్ద‌రికీ ఆయ‌న ఇచ్చే విలువ గొప్ప‌ది. మొత్తానికి అట్లా కొన్ని సాంయ‌త్రాలు మాట్లాడుతూనే అనుకోకుండా ఈనాడుకు రావాల్సి వ‌చ్చింది. ఈనాడుకు వెళ్తున్నా సార్ అని చెప్పొచ్చా. ఆ త‌ర్వాత పుస్త‌కావిష్క‌ర‌ణ‌కు కాల్ చేసి మ‌రీ పిలిచారు. నేను హాజ‌రుకాలేక‌పో్యా. ఉర్దూ మింద ఇంత ప్రేమ‌తో పుస్త‌కాన్ని రాయ‌టం ఓ గొప్ప విష‌యంగా భావిస్తాను. ఉర్దూ నేర్చుకోవ‌టానికి మ‌సీదుకి వెళ్లి చేత‌కాక వెన‌క్కొచ్చిన నాకు మూర్తిగారి ప‌ట్టుద‌ల చూసి సిగ్గుప‌డిపోయా. భాష నేర్చుకోవ‌టానికి వ‌య‌సూ, ప‌రిస్థితులు అడ్డురావనే విష‌యం ఆయ‌న్ని చూస్తే అర్థ‌మ‌య్యింది. ఏదేమైనా ఉర్దూలోని *గుప్పిట జారే ఇసుక* (జీలానీ బానూగారి కథలు) ను తెలుగులోకి తీసుకురావ‌టం మంచి విష‌యం. మూర్తిగారి గురించి నాకు కొంచెమే తెలుసు. ఈ మెహ‌క్ హైద‌రాబాదీ గురించి ఎన్నో విష‌యాలు సారంగ సాహిత్య ప‌త్రిక ద్వారా తెలుసుకోవ‌టం గ్రేట్ అనిపించింది. ఇంట‌ర్వ్యూ చేసిన ఒమ్మి ర‌మేష్‌బాబుగారికి ధ‌న్య‌వాదాలు.
  – రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

  • Nenu present Andhra Jyothilo Murthy gari pakkaney kurchuney adrustanni pondhanu. Prati roju ayana cheppey aneka vishayalanu telsukuntu, nerchukuntunna. He is a guide and helps anyone who seeks information from him. Yentha thavvina tharagani oka jnana bhandagaram. Na okkadike kadu, office lo yevaru ye doubt adigina, yenni sarlu adigina ayanaku visugu radu. He is a true rolemodel for energy and dedication. Inspite of the difficulties he faced to learn Urdu, he finally achieved it. Thats what makes this story all inspiring and motivating. Murthy garu.. Meetho journey ilage konasagalani, miru marenno milestones andukuntu, mee sahitya jeevitanni atyunnatha sthayiki teeskellalani korukuntuna.

   – mee sishyudu

 • మెహక్ హైద్రాబాదీ కొత్త భాషలు నేర్చుకోవాలనే సంకల్పం కలిగిన వారికి స్ఫూర్తి దాయకులు. అభినందనలు.
  ***** పున్నా కృష్ణమూర్తి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు