నలుపు తెలుపుల జీవన దృశ్యకావ్యం ‘‘రోమా’’

సినిమా నిండా అంతర్లీనంగా 1971 నాటి మెక్సికో సమాజమూ, చరిత్రా, సంఘటనలూ ప్రతి ఫ్రేమ్ లో ప్రతి దృశ్యంలో కనబడతాయి. మనల్ని వెంటాడుతాయి.

“ఇంటి ముందున్న నలుపు తెలుపుల గళ్ళ డ్రైవ్ వే. వెనుకకు ముందుకూ పారుతూ దాన్ని కడుగుతున్న నీళ్ళు.  ఆ నీళ్ళలో ఇంటి పైనున్న సన్ రూఫ్ ప్రతిబింబం. ఆ సన్ రూఫ్ ప్రతిబింబం లో పైన ఆకాశం లో ఎగుర్తున్న విమానం…. అంతా నలుపు తెలుపుల్లోనే ….”

ఇదీ ప్రముఖ దర్శకుడు అల్ఫాన్సో కువెరాన్ ఇటీవలి చిత్రం ‘రోమా’ లోని ప్రారంభ దృశ్యం.  పూర్తిగా  నలుపు తెలుపుల్లోనే,  లార్జ్ ఫార్మాట్ లో  అల్ఫాన్సో కువెరాన్ తానే స్వయంగాఛాయా దర్శకత్వం వహించి,  చిత్రీకరించిన  సినిమా ‘రోమా’. కువెరాన్ దీనికంటే ముందు ‘గ్రావిటీ’ అనే హాలీవుడ్ సినిమా కు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాకు ‘రోమా’ కు పోలిక లేదు. వంద మిలియన్ల  డాలర్ల కు పైగా బడ్జెట్ తో గ్రావిటీ తీస్తే దానిలో పదో వంతు కన్నా తక్కువ ఖర్చుతో ‘రోమా’ తీశాడు. ఖర్చులోనే కాదు ఇంకా దేనిలోనూ హాలీవుడ్ సినిమాకు ‘రోమా’కు పోలిక లేదు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే లో. హాలీవుడ్ సినిమా ల్లో కనబడే మూడు అంకాల స్క్రీన్  ప్లే ‘రోమా’ లో  లేదు. పేరున్న నటీ నటులూ లేరు. క్షణక్షణం ఉత్కంఠ కలిగించే విధంగా సినిమా పరుగు ఉండదు. ఐనా తాను ఇంతకు ముందు తీసిన సినిమాలకు భిన్నంగా ‘రోమా’ ను తీసి ఒక గొప్ప కళాఖండంగా మలిచాడు. ‘రోమా’  2018 ఆగస్టు 30 న వెనిస్ చలనచిత్రోత్సవం లో ప్రదర్శించబడి బంగారు సింహం గెలుచుకున్నది.

‘రోమా’ ఒక రకంగా కువెరాన్ ఆత్మ కథాత్మక సినిమా. కువెరాన్ చిన్నతనం లో తన కుటుంబం తో మెక్సికో లో ‘రోమా’ అనే ఒక సంపన్నమైన ప్రాంతం లో గడిపాడు. అమ్మ సోఫీ, నాన్న డాక్టర్ ఆంటోనియో,  అమ్మమ్మ  టెరేసా,  తాము  నలుగురు పిల్లలూ ఒక పెద్ద ఇంట్లో ఉండేవారు. ఆ ఇంట్లో ఇద్దరు పనిమనుషులు క్లియో అదేలాలు. వాళ్ళతో పాటు బర్రోస్ అనే కుక్కా. కథ అంతా వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ జీవితాల్లో వచ్చే ఎగుడు దిగుళ్లూ, ప్రేమలూ, సంతోషాలూ, కష్టాలూ, కన్నీళ్లూ, వాళ్ళు నిలదొక్కుకునే తీరూ – ఆబ్జెక్టివ్ కెమెరాతో, నింపాదిగా,  చాలా వివరంగా, చాలా నిశితంగా పరిశీలించి చిత్రించాడు కువెరాన్.

దాదాపు మొదటి పది నిమిషాలు ఆ ఇంట్లో జరిగే రోజువారీ దినచర్యను అతి నిశితంగా,  అతి వివరంగా చూపిస్తాడు. ఎందుకబ్బా ఇంత విసుగు పుట్టించేటట్టు వీళ్ళ దినచర్యను చూపిస్తున్నాడు అని అనిపించినా దానికో ముఖ్యమైన  ఉద్దేశ్యం ఉంది. ఆ ఇంట్లో యే పనైనా, యెవరి పనైనా, యే రోజువారీ కార్యక్రమమైనా ఆ ఇద్దరు పనిమనుషులు,  ఆదెలా , క్లియోలు లేకుండా జరగవు. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే దాకా ఆ ఇద్దరే అన్నీ పనులూ,  అందరి పనులూ చూసి చేసినతర్వాతే , అందరి అవసరాలు తీర్చిన తర్వాతే నిద్ర పోతారు. నిద్ర పోయే ముందు ఒక సారి విశ్రాంతిగా కాళ్ళు జాపుకుని అప్పుడు మాత్రమే తమవైన క్షణాలు అనుభవిస్తారు. వీళ్లలో ప్రధానంగా క్లియో చుట్టూ కెమెరా తిరుగుతుంది. ఆమెనే ప్రధాన పాత్ర, దర్శకుడు కువెరాన్ కు ఆయా. అట్లా అని క్లియో మీద కానీ,  ఆదేలా మీద కానీ ప్రత్యక్షంగా ఆధిపత్యం ఉంటుందా అంటే ఉండదు. ఎవరూ వాళ్ళను కించపరిచి చూడరు. దాసీలుగా చూడరు. తిట్టరు, అరవరు. గౌరవంగానే చూస్తారు. ఐతే కుక్క బర్రోస్ మలమూత్రాలు కడిగేది క్లియోనే. కుటుంబమంతా కూర్చుని టీ వీ చూస్తుంటే అల్ఫాన్సో పక్కన,  కింద కూర్చున్న క్లియోను   డాక్టర్ గారికి టీ తీసుకురావాల్సిందిగా సోఫీ  పురమాయిస్తే బలవంతంగా వెళ్ళాల్సిందీ ఆమెనే. సినిమాలో ఎక్కడా ఆధిపత్య సంబంధాలను చూపించాలి కాబట్టి,  కృత్రిమంగా చూపించడు కువెరాన్. అవి వాళ్ళ దినచర్యల్లో భాగంగానే, సహజంగా మనకు అర్థమై పోతుంటాయి.

ఆ ఇంటి నాలుగు గోడలకే తనా జీవితం లో ఎక్కువభాగం గడిపే క్లియో కలల్ని చూపించడానికేమో ఆమె బర్రోస్ మలాన్ని కడుగుతున్నప్పుడు , ఆ ఇంటి గచ్చు పై నీళ్ళలో ప్రతిబింబించే ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూపిస్తాడు.

క్లియో కు ఫెర్మిన్ అనే వాడితో పరిచయం ఏర్పడుతుంది. ఆ క్రమంలో గర్భవతి అవుతుంది. అదే విషయం సినిమా హాల్లో ఫెర్మిన్ కు చెప్తే ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ కనబడకుండా పోతాడు ఫెర్మిన్. తాను తన వృత్తి రీత్యా క్యూబెక్ కు వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిన ఆంటోనియో కూడా చాలా రోజులదాకా రాడు. వచ్చినా సోఫీ తో ఉండడం ఇష్టం లేదని వేరే ఆమె తో కలిసి ఉంటూ విడాకులు తీసుకుంటాడు. సోఫీ కి నలుగురు పిల్లలు, క్లియో గర్భవతి. వర్గ విభేదాలున్నా, సామాజిక అంతరాలున్నా క్లియో కూ,  సోఫీ కూ  ఉన్న సామ్యం చూపిస్తాడు కువెరాన్.

క్లియో, అదేలాలు ఇద్దరూ మెక్సికో కు చెందిన ఆదివాసీ స్త్రీలు (ప్రధాన పాత్ర క్లియో కోసం యలిత్జా అపరిసియో అనే ఆదివాసీ స్త్రీని ఎంచుకున్నాడు కువెరాన్). మెక్సికో లో అతి పేద గ్రామీణ ప్రాంటానికి చెందిన వారు. గర్భవతై ఫెర్మిన్ ను వెతుకుతూ తన ప్రాంతానికి క్లియో వెళ్లినప్పుడు ఆ ప్రాంత పేదరికం, మురికివాడలు, బురదనేలలు, అభివృద్ధి చేస్తామంటూ మైకుల్లో వాగ్దానలను ఊదరగొట్టే రాజకీయ నాయకులూ – అన్నీ,  అతి వివరంగా,  అతి నిశితంగా వస్తుగతమైన దృష్టితో నింపాదిగా నడిచే కెమెరాతో పరిశీలిస్తాడు కువెరాన్.

క్లియో లోని ఆదివాసీ అమాయకత్వమూ, నిర్మలత్వమూ, వేదనా, కష్టాల్ని తట్టుకొని నిలవగలిగే స్థైర్యం, ప్రపంచాన్ని పెద్దగా అర్థం చేసుకోలేక పోయినా, తన కష్టాలకూ ప్రపంచానికీ సంబంధం తెలియకపోయినా, ఆమె కళ్లలోని నీటిపొరల వెనక దాగిఉన్న అనంత దుఃఖమూ, ఆమె చిరునవ్వులో తెరలు తెరలుగా కనబడే జీవితం పై ఆశా – కువెరాన్ నలుపు తెలుపు కెమెరా దృష్టిని దాటిపోవు – మనల్ని కట్టిపడేస్తాయి.

పిల్లలమీద క్లియో చూపించే కపటం లేని ప్రేమాభిమానాలు, పనిమనిషైనా కుటుంబం పట్ల ఆమె బాధ్యత, భర్త విడాకులిచ్చిన యజమానురాలు సోఫీ వేదనను మౌనంగా  పంచుకునే ఆమె మానవత్వపు పరిమళాలు అన్నీ మనల్ని అబ్బురపరుస్తాయి.

సినిమాలో కీలకమైన సన్నివేశాలు, అద్భుతమైన దృశ్యాలు చాలా ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి నాలుగు.

మొదటిది – క్లియో తనను గర్భవతి చేసి పారిపోయిన ఫెర్మిన్ ను వెతుక్కుంటూ వాని అడ్రసు కనుక్కుని వెళ్తుంది. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్న ఒక సమూహం లో ఉన్న ఫెర్మిన్ ను పిలిచి విషయం చెప్తే వాడు ప్రవర్తించిన తీరు,  ఆమెను దూషించిన తీరు, కర్ర సాము చేస్తూ,  ఆమెను భయపెడుతూ వదిలి వెళ్ళిపోయిన పద్దతి అప్పటిదాకా ఆబ్జెక్టివ్ గా ఉన్న కెమెరా మనతో మాట్లాడుతుంది. క్లియో స్థానం లో మనల్ని నిలబెడుతుంది.

రెండోది – సోఫీ అమ్మ టెరీసా క్లియో కు పుట్టబోయే పాప కోసం తొట్లె (క్రిబ్) కోసం ఒక దుకాణం లోకి తీసుకెళ్తుంది. అదే సమయం లో వీధిలో పెద్ద ఎత్తున విద్యార్థి యువజనుల నిరసనా ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. వాళ్ళు తొట్లెలను చూస్తున్న సమయానికి వీధి నుండి పెద్ద ఎత్తున అల్లర్లు వినబడే సరికి అందరూ దుకాణం కిటికీ వైపుకు పరిగెత్తుతారు. దుకాణం రెండవ అంతస్తు కిటికీ నుండి బయట రోడ్డు మీద చెల్లా చెదురుగా పరిగెత్తుతున్న యువతను, కోలాహలాన్ని, గలభాను చూస్తారు. ఈ లోపున కొంత మంది దుకాణం లోకి పరిగెత్తుకొస్తారు. వారి వెనుక మరి కొందరు. వాళ్ళ చేతుల్లో తుపాకీలు. వాళ్ళు కాల్పులు జరుపుతారు. ముందు పరిగెత్తుకొచ్చిన వాళ్ళలో ఒకరిద్దరు కాల్పులకు నేలకూలుతారు. అప్పుడు చూస్తుంది తీవ్రమైన భయోత్పాతానికి గురైన క్లియో, తన ముందు తుపాకీ పట్టుకుని నిలబడ్డ ఫెర్మిన్ ను. వాడూ ఆమెను చూస్తాడు. భయం తో కొయ్యబారిపోయిన ఆమెను చూస్తూ తిరస్కారంగా వెళ్ళిపోతాడు. క్లియోకు గర్భసంచి నీరు పగిలిపోతుంది. పరిస్తితి చూసి టెరీసా క్లియో ను హాస్పిటల్ కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. బయట కల్లోలాల కారణంగా పెద్ద ట్రాఫిక్ జామ్. అందులో ఇరుక్కుపోతారిద్దరూ.

మూడోది – హాస్పిటల్ లో క్లియో ప్రసవం అయ్యే దృశ్యం. దీని గురించి ఎంత రాసినా తక్కువే. మాటల్లో చెప్పలేము  కూడా. అంత అద్భుతంగా,  గుండెల్ని పిండేసేలా చిత్రీకరించాడు కువెరాన్. ఆ దృశ్యం అయిపోయాక కళ్ళనిండా నీళ్ళు నిండకుండా ఉండడం అసాధ్యం. అంత కోలాహాలాన్నీ,  గలభాలో చనిపోయిన తన ప్రియున్ని ఒడిలో పెట్టుకుని ఒక అమ్మాయి విలపించే దృశ్యాన్ని కూడా ఎంతో ఆబ్జెక్టివ్ గా చూపించిన కువెరాన్ ఈ హాస్పిటల్ దృశ్యాన్ని మాత్రం (అప్పటికీ క్లోస్-అప్ షాట్స్ వాడకుండానే ) క్లియో దృష్టి నుండి ఎంతో గొప్పగా చిత్రీకరించాడు.

నాలుగు – సముద్రం లో ఈతకు పోయి మునిగిపోతున్న పిల్లలను కాపాడ్డానికి ఈత రాకున్నా ఎంతో ధైర్యంగా బాధ్యతగా నీళ్ళలోకి దిగి సముద్రంలో లోతు దాకా కూడా ప్రాణాల్ని లెక్క చేయకుండా క్లియో వెళ్ళే దృశ్యమూ , పిల్లల్ని కాపాడినంక ఒడ్డున అందరూ కలిసి కౌగలించుకునే దృశ్యమూ – అద్బుతంగా   తెరకెక్కించాడు. నిజానికి క్లియో సముద్రం లోనికి లోతుగా వెళ్ళే దృశ్యాన్ని, ఒక  సమాంతర దృశ్యంగా కెమెరా ను కూడా ఆమెతో పాటే తీసికెళ్లి చిత్రీకరించాడు. అందుకోసం సముద్రం లో చాలా దూరం వరకు చెక్క తో ప్లాట్ ఫారం నిర్మించి దానిపై కెమెరాను తీసికెళ్లి డాలీ షాట్ లా చిత్రీకరించాడు.

బహుశా కెమెరాను ఇంత అద్భుతంగా ఆబ్జెక్టివ్ గా వాడుతూనే, ఇటాలియన్ నియో రియలిజం పద్దతుల్లో ఉన్నట్టున్నా దానికి భిన్నంగా తానే ఒక కొత్త పద్దతిని కనుక్కుని అతి వివరంగా, అతి నిశితంగా ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించిన తీరు ఇటీవలి కాలం లో యే సినిమా లో చూడలేదు. ఒక వైపు ఆర్ట్ సినిమానా అన్నట్టు ఉన్నా, బలమైన కథ లేకున్నా, హాలీవుడ్ పద్దతిలో మూడంకాల స్క్రీన్ ప్లే లేకపోయినా ప్రతి ఫ్రేమ్, ప్రతి దృశ్యం, ప్రతి షాట్ అద్భుతంగా ఉన్న సినిమా ‘రోమా’. దీనికి కువెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు కూడా వహించాడు. సినిమాలో కొట్టేచ్చేటట్టు సంగీతాన్ని చాలా తక్కువగా వాడుకున్నాడు.

కువెరాన్ సినిమాలో ముఖ్యంగా చేసిన పనులు రెండు – ఒకటి వ్యక్తిగతం రాజకీయమే (personal is political) అని చెప్పడం. ఈ విషయాన్ని  క్లియో పాత్ర ద్వారా ప్రత్యక్షంగా,  సోఫీ ద్వారా పరోక్షంగా అద్భుతంగా చెప్పాడు. రెండోది పొరల పొరల ఆధిపత్యాలను చెప్పడం. అనేక దృశ్యాల్లో ఈ విషయాన్ని చాలా గొప్పగా చిత్రీకరించాడు. పనిమనిషిగా క్లియో పై ఆధిపత్యం, సోఫీ పై ఆధిపత్యం – ఇంకా సమాజం లోని అనేక పొరల్లో కనబడే ఆధిపత్యం చాలా వివరంగా చూపించాడు. సమాజం లో చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల, సంఘటనల పట్ల  ఈ పాత్రలు ఎందుకు స్పందిచడం లేదా అని మనమనుకుంటాం కానీ నిజానికి వారి వ్యక్తిగతమే ఆ సంఘటనలు అయినవనీ, వారి వ్యక్తిగతమైన విషయాలే అసలైన రాజకీయాలనీ స్పష్టంగా చెప్తాడు.

అన్నింటికన్నా మనల్ని సినిమా నిండా అంతర్లీనంగా 1971 నాటి మెక్సికో సమాజమూ, చరిత్రా, సంఘటనలూ ప్రతి ఫ్రేమ్ లో ప్రతి దృశ్యం లో సబ్ టెక్స్ట్ లా కనబడతాయి. మనల్ని వెంటాడుతాయి.

ఇటీవలి కాలం లో వచ్చిన గొప్ప దృశ్యకావ్యం ‘రోమా’. సినిమా చూసిన తర్వాత కొన్ని రోజుల పాటు వెంటాడి వేటాడే అద్భుత దృశ్యకావ్యం.  మార్కెట్ నియమ నిబంధనలను ధిక్కరించి ఇంత గొప్ప సినిమాను అందించిన కువెరాన్ ఈ కాలపు మేటి దర్శకుల్లో ఒకరు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

*

లోగో: రాజశేఖర్ చంద్రం

నారాయణ స్వామి వెంకట యోగి

నారాయణ స్వామి వెంకట యోగి

27 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఓహ్.. సినిమాల మీద మీరు మొదలుపెట్టడం – నా ఒకానొక ఎదురుచూపే. నేను ఆకలితో అటుఇటూ చూస్తుంటే నోటి కాడికి ముద్ద తెచ్చి పెడతున్నారయితే.

  • చాలా సంతోషం సుధాకర్ నీకు నచ్చినందుకు – సినిమాల గురించి నీవు ఎదిరిచూసే విషయాల గురించి రాయగలనేమో … ప్రయత్నిస్తాను

 • ఓహ్.. సినిమాల మీద మీరు మొదలుపెట్టడం – నా ఒకానొక ఎదురుచూపే. నేను ఆకలితో అటుఇటూ చూస్తుంటే నోటి కాడికి ముద్ద తెచ్చి పెడతున్నారయితే.

  • మీకు నచ్చినందుకు చాలా సంతోషం గురూజీ

 • చాలా మంది సినిమా రివ్యూయర్స్ ఇది చూస్తే బాగుంటుంది. అంత బాగుంది విశ్లేషణ. వెంటనే సినిమా చూసేయాలి అన్నంత ఉద్వేగం కలిగింది. నేను గ్రావిటీ సినిమా రెండు సార్లు చూశాను. అసలా సినిమా ఆకాశం ఒక మిధ్యా భూమొక వాస్తవం అని చూపింది. ఆ లెక్కన అది సాధారణ హాలివుడ్ సినిమా పధ్ధతులకు భిన్నమైందే. రోమాతో కూడా ఆ దర్శకుడు దాన్ని కొనసాగించడం గొప్ప విషయం.

  • మహమూద్ అన్నా – మీకు నచ్చినందుకు చాలా సంతోషం. నెనర్లు మీకు.

 • గొప్ప సినిమాను గొప్పగా పరిచయం చేసిన స్వామికి అభినందనలు

  • అన్నా మీకు నచ్చినందుకు బోలెడన్ని నెనర్లు

 • Very nice review. I know, thanks to your memoirs-column, you are a cine buff and a discerning at that. Keep writing more.

 • Roma, సినిమా, చూసినట్టు. అనిపించింది. Sir, బాగుంది, mee, విశ్లేషణ . Sir. థాంక్యూ !

 • ఇంగ్లిష్ సినిమాలు అంతగా చూడను. కానీ మీ విశ్లేషణతో చూడాలన్నా కాంక్ష పెరిగింది.

  • మీకు నచ్చినందుకు బోలెడన్ని నెనర్లు.. తప్పకుండా చూడండి – ఇది స్ప్యానిష్ భాషలో ఉంటుండి. నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

 • సమాజం లో చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల, సంఘటనల పట్ల ఈ పాత్రలు ఎందుకు స్పందిచడం లేదా అని మనమనుకుంటాం కానీ నిజానికి వారి వ్యక్తిగతమే ఆ సంఘటనలు అయినవనీ, వారి వ్యక్తిగతమైన విషయాలే అసలైన రాజకీయాలనీ స్పష్టంగా చెప్తాడు. చాలా బాగా రాశారు నారాయణ స్వామి గారూ. నియో realist cinema ఛాయలున్నా మరేదో కొత్తదనం కూడా వుంది దీనిలో. ముఖ్యంగా ఆ ఇల్లు ఒక character. సోఫీ తన భర్త వాడిన పెద్ద కార్ ను ఇంట్లోకి సరిగ్గా తెలేక పోవటం. దాన్ని వదిలి పెట్టి చిన్న కార్ తో సుఖంగా లోపలికి రావటం ఆమె బాధా విముక్తికి మరో symbol.. ఇలాంటి మరిన్ని సహజమైన షాట్స్ తో రోమా ఒక సంపూర్ణమైన cinema.

  • లలిత గారూ – మీకు నచ్చినందుకు నెనర్లు. నిజానికి సినిమాలో చాలా ఇమేజెస్ వాడుకున్నాడు దర్శకుడు. మీరు చెప్పినట్టు కారు ఇరుకు సందులో రాలేకపోవడం – ఆంటోనియో ను పరిచయం చేసిన షాట్ లో తర్వాత సోఫీ కారు ను డ్రైవ్ వే లోకి తెచ్చే షాట్ లో మనకు తేడాలు చూపించడం – ఇంకా అట్లా చాలా సబ్ టెక్స్ట్ గా వాడుకున్నాడు. నిజానికి ఒక సినిమా ను పుస్తకం లా చదవాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి. అప్పుడే అనేక పొరలు, అనేక చిత్రాలు, అనేక అర్థాలు – అట్లా మళ్ళీ మళ్ళీ చదవాల్సిన సినిమా రోమా.

 • గొప్పగా తీసిన సినిమా గురించి అంతే గొప్పగా వివరించారు.
  తప్పక చూడాలనిపించేలా.

  • నెనర్లు నిత్య గారూ. వీలైతే Netflix లో సినిమా చూడండి. మీ స్పందన పంచుకోండి.

 • స్వామి గారూ, “రోమో” గురించి మంచి విశ్లేషణ చేశారు. వెంటనే చూడాలనిపించేటంత. రోమో గురించి మీరు మాకు చెప్పడంలో ఆ సినిమా పై మీకున్న ప్రేమ వ్యక్తమౌతొంది. మీరు చూసిన మంచి మంచి సినిమాలను ఇలాగే అప్పుడప్పుడూ “తెర” చాపలో పరిచయం చేయండి.

  • మీకు నచ్చినందుకు నెనర్లు జగదీష్ గారూ. మీరు సూచించినట్టు మంచి సినిమాలు పరిచయం చేస్తాను…

 • ఎంత బావుందో ఈ సినిమా , ఇవాళే చూస్తాను నెట్ ఫిక్స్ లో , థాంక్యూ స్వామి , చక్కటి రివ్యూ ఇచ్చినందుకు

 • #Roma may seem slow (that’s how I like my dramas) but it sure is building momentum though at snails pace, a visually stunning movie. How #AlfonsoCuaron takes the mundane & brings out the characters even though they don’t speak much. You can hear the storm(s) brewing in their silent (in)actions.

  For almost the first half I was feeling that (Draining) water was the motif but by the end it felt like ‘cleansing’ was the right one.

  The movie starts with a small wave, Cleaning the driveway (not to miss the flying planes ✈️), bookending the movie with bigger waves cleansing (of their emotional burdens) & bringing the family even closer.

  It may not be Alfonso’s objective but to me the still born baby seemed like a reflection of failed revolutions in Latin America.

  • Good observations and well articulated points.. subtleties, nuances, layered approach make a piece of art great.
   I am not sure about the failed Latin American Revolutions but I am in line with your other observations. We need to revisit this movie and reread it… to discover more…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు