మురారిగోడు రెండో క్లాసు.
ఇస్కోల్లో సారోల్లందురూ మురారిగోడు బాగా సదవతాడని మెచ్చుకుంటా ఉంటే వాడికి భలే సంతోషంగా ఉంటాది.
కాణిపాకం గుళ్ళో అయ్యోర్లు గూడా మురారిగోన్ని కేకలేసి సరదాగా చందా లెక్కలు సదవమని అడిగి, లెక్కలు బాగా అప్పజేప్తే గుళ్ళో మిగిలిన పంచామృతం రెండు గలాసులు ఇచ్చి పంపేటోళ్ళు.
వీడికి పంచామృతం అంటే చానా ఇష్టం, గుళ్ళో ఎన్ని ప్రసాదాలున్నా పంచామృతమే గొప్ప అంటాడు.
ఆరోజు ఉస్కోలుకి లీవు ఇచ్చినారు.
మురారిగోనికి ఉస్కోలుకి ఎల్లడమంటేనే ఎక్కువిష్టం. అట్టా ఎందుకురా అని అడిగితే వోడు జెప్పే మాటలు భలే తమాసుగా ఉంటాయి.
“యోవ్. ఇంటికాడ ఉంటే ఏదో ఒక తింగరి పని జేస్తా, అమ్మా నాయినా ఏదో ఒకటి అంటారు. ఇంక ఆ రోజంతా మొకం మాడ్చుకొని కూర్చోవల్ల. తర్వాత నాయిన పది పైసాలు ఇస్తాడనుకో అమ్మకి దెలియకుండా, అది ఏరే ఇషయం. అదే ఉస్కోల్లో అయితే దోస్తుగాల్లంతా ఉంటారు. బాగా సదివితే సారోల్లు పొగడతారు. తప్పట్లు కొడతారు, దోస్తుగాల్లతో, ముఖ్యంగా రాంబాబుగోనితో ఆడుకోవచ్చు. పది పైసలు ఎక్కువా, ఉస్కోలు ఎక్కువా జెప్పు?” అని ఎదురు ప్రశ్నేస్తాడు.
కానీ ఆరోజు లీవు ఇచ్చినారు, ఇంగ వాడు మాత్రం ఏం జేస్తాడు?
వోల్ల సారు అంతకు ముందు దినం హోమర్కు కింద యాదైనా బొమ్మ గీస్కోని రమ్మన్నాడు.
మురారిగోనికి అది గుర్తకొచ్చి బొమ్మ గీద్దాం అని నోట్సులో జంట పేపరు చింపి, పెన్సిలు కోసరం బ్యాగులో ఎతికినాడు.
ఉహూ, బ్యాగులో నటరాజు పెన్సిలు అగుపడ్లా.
ఇంట్లో యాడైనా పారేస్కున్నాడేమో అని ఇల్లంతా ఎతికి జూసినాడు.
అహా, యాడా కనబడ్లా.
ఎవునికైనా ఇచ్చినామేమో అనుకోని ఆలోచిస్తా కూర్చున్నాడు.
అప్పుడు గ్యాపకం వొచ్చింది. నిన్న ఉస్కోల్లో సర్పంచి కొడుకు రాంబాబు గోడు మురారి గోడి పెన్సిలు దీస్కున్నాడు. తిరిగి ఇయ్యలా.
పాపం రాంబాబు మర్చిపోయుంటాడు అనుకోని మురారిగోడు ఆ పెన్సిలు తీసుకోనొచ్చుకుందాం అని బయటకు నడిచినాడు. ఎలాబారబోతా ఆగి, ఎందుకన్నా మంచిదని అమ్మకి జెప్పేసి పోదాం అని లోపలికొచ్చి అన్నేడు, “మోవ్, నేను రాంబాబుగోని దగ్గరకు బోయి నా పెన్సిలు దీసుకొచ్చుకుంటా,”
ఆ మాటలకి వోల్లమ్మ “సరే, బిన్నేగా ఒచ్చేయ్, వర్షమొచ్చేలా వుండాది,” అనింది.
“వచ్చేస్తాలేమా,” అనేసి పరిగెట్టుకుంటా బయటకు పోయినాడు మురారిగోడు.
వోల్లమ్మ బోకులు కడగతా ఉండిపోయింది.
ఇంతలో పక్క వీధి పిల్లకాయలు మురారిగోడ్ని ఎతుక్కుంటా వొచ్చినారు.
“మ్మోవ్! మురారి లేడా?” అన్నేరందరూ.
“ఎవుడో రాంబాబు అంట, వోనిదగ్గర పెన్సిలు ఉండిపోయినాది అని తీస్కరావడానికి బోయినాడు,” అనిందామె.
“ఓ.., సర్పంచి కొడుకు కాడికి బోయినాడా, ఎంతైనా వోల్లు ఒక జట్టు,” అనేసి ఎల్లిపోయారు.
మురారిగోని అమ్మ ఒక్కసారిగా అదిరిపడినాది.
“అంటే ఇప్పుడు ఈడు సర్పంచోళ్ళ ఇంటికి బోతా వుండాడా, ఆడికి ఎల్లకూడదు గదా, అయ్యో, నేనే గమనించుకోలా, ఈడు అక్కడ ఏం వాగుతాడో ఏమో,” అనుకోని బోకులు అక్కడే పడేసి పరిగెత్తినాది.
మురారిగోడు గంతులేస్తా సర్పంచోల్లింటికి బోతా వుండాడు.
దార్లో జాఫర్ తాత అగుపించాడు. ఆయన మురారిగోన్ని ఆపి “యాడికిరా మనమడా ఎగురుకుంటా బోతా వుండావ్?” అని అడిగినాడు.
“రాంబాబు గోని దగ్గర నా నట్రాజు పెన్సిలు ఉండిపోయినాది, తీస్కోద్దాం అని పోతా వుండా,” అన్నేడు మురారి.
“రాంబాబా, వోడు ఎవడ్రా..? నాకు దెలియకుండా?”
“సర్పంచోళ్ళ కొడుకు తాతా,”
ఆ మాటకి జాఫర్ తాత అదిరిపడినాడు.
“ఆల్ల ఇంటికి పోతావా? ఆడికి నువ్వెందుకురా? అయినా వోల్లు నదికాడ యావో పూజలు జేస్తా వుండారు, ఇంట్లో వోల్లంతా ఆడనే వుండారు. నువ్వట్టంతా పోమాక,” కచ్చితంగా అన్నేడు జాఫర్ తాత.
మురారిగోడు తాత మాటలు ఇనీ ఇనిపించనట్టు “తొందరగా వచ్చేస్తాలే,” అనేసి బాహుదా నది వైపు పరిగెత్తినాడు.
కొంత దూరం పరిగెత్తినాక, ఇసక దోవ దాక చేరుకున్నాడు.
దూరంగా రాంబాబు, వోల్ల నాయిన, అదే.., సర్పంచూ, అందురూ అగుపడ్నేరు.
ఇసకలో పరిగెత్తడం చానా కష్టం. కాళ్ళు కూరుకొనిబోతాయి. అదీగాక ఆ ఇసక చానా నున్నగా ఉంటాది.
ఇవంతా మురారిగోనికి తెలీదు గదా, వాడు పరిగెత్తడం మొదులుపెట్నాడు.
అట్టా రెండడుగులు ఏసినాడో లేదో, భోరుమంటా గాలి తగులుకున్నాది.
చెట్లూ, పుట్టలూ, అన్నీ ఊగిపోయేలా తుఫానుగాలి దుమ్ము రేపతా వుండాది.
మురారిగోడు ఎల్లే కుశాలులో ఈ గాలినీ, ఆ ఇసుకనీ అస్సలు పట్టించుకోలా. రెండడుగులు ఏసినంక గాలి ఇంకా జాస్తిగా అయ్యి ఇసక మట్టి మొహానికి కొట్టినాది.
మురారిగోడు రెండు చేతులూ మొహం మీద దాచుకొని, కళ్ళని రుద్దతా అడుగులో అడుగెయ్యడం మొదలెట్నాడు.
కింద ఇసకలో రాళ్లుండాయా, రప్పలుండాయా, ఇవేమీ పట్టించుకోకుండా అన్నింటినీ తొక్కుకుంటా పోతా వుండాడు మురారి.
చెప్పులు గూడా ఏస్కోని రాకుండా వొచ్చినాడు. అన్నింటినీ తొక్కతా దేన్ని తొక్కతా వుండామో లేదో చూసుకోకుండా ముందుకు సాగిపోతా వుండాడు.
అట్టా ఓ అయిదు నిమిషాలు గాలి నానా హంగామా చేసి ఉన్నట్టుండి ఆగిపోయినాది.
మురారిగోడు రాంబాబుగోనికి దగ్గరగా బోయేసరికి పూజారి సర్పంచికి యాందో జెప్తా ఉన్నేడు.
“అయ్యా, ఇంక దోషం బోయినట్టే, పిండ్లోనికి ఏ గండమూ లేనట్టే, మీరు ధైర్యంగా ఇంటికి బొండి,” అన్నాడా పూజారి.
సర్పంచి పూజారికి నమస్కారం జేసి పక్కకు తిరిగేసరికి ఎదురుగా మురారిగోడు ఉన్నేడు.
అప్పుడే మురారిని జూసిన రాంబాబు “హేయ్ మురారి, ఈడేం జేస్తా వుండావ్?” అన్నేడు.
మురారిగోడు “అదీ, నిన్న నట్రాజు పెన్సిలు,” అని ఏదో అనబోయాడు.
రాంబాబు గోనికి ఏదో గుర్తొచ్చినట్టు “ఆ, నట్రాజు పెన్సిలు గదా, నిన్న మర్చిపోయి తీసకొచ్చేస్నా. ఇంట్లో వుండాది. ఇస్తా పదా,” అన్నేడు.
పక్కనే ఉన్న రాంబాబు వోల్ల అమ్మ రాంబాబు వంక జూసి “వోని దగ్గర నువ్వు దీసుకోవడం ఏందిరా. వోడు ఎవుని కొడుకో దెలుసా?” అనింది.
పాపం చిన్న-పెద్ద, ఎవురు-ఏంది అనే తేడాలు పెన్సిలుకు ఏం తెలుస్తాది? స్నేహానికి ఏం తెలుస్తాది?
సర్పంచి మురారిని ఎగాదిగా జూసి “ఎవుని కొడుకువిరా నువ్వు? మీ నాయన పేరేంది?” అనడిగాడు.
“వాసన్న కొడుకు ఈ పిండ్లోడు. బాగా సదవతాడు గూడా,” అన్నేడు పూజారి.
“ఎవురు? ఆ జీవాలు కాసే వాసన్నా?” అనుమానంగా అడిగాడు సర్పంచు.
“ఆ..ఆని కొడుకే,” బదులిచ్చినాడు పూజారి.
కొద్దిసేపు మురారిగోడ్ని అట్టే జూసి “సరే పదండి,” అనగానే అందరూ ఆడనుంచి కదిలినారు.
ఇంటిదగ్గరకు పోయినాక “నువ్వీడనే ఉండరా,” అని మురారిగోడ్ని ఇంటి బయటే నిలబెట్టి, “ఆ పెన్సిలు దీస్కరాబో,” అని కొడుకుని ఇంటిలోపలికి పంపించాడు సర్పంచు.
రాంబాబుగోడు వచ్చే దారిలో తుంచుకున్న ఆకుని బయటకు దీసినాడు. దాన్ని ఉండలాగా చుట్టినాడు. మెల్లగా ఊదినాడు.
“పీ…” అని ఆ పీక నుండి సన్నాయి శబ్దమొచ్చినాది.
“అర్రే..భల్లే ఊదతా వుండావే,” అన్నేడు సర్పంచి. మురారిగోడు ఆపేశ్నాడు.
“ఎందుకు ఆపేశ్నావ్?” గట్టిగా అడిగినాడు సర్పంచి.
“మీ నాయన ఆవులకాడుంటే నువ్వు ఇట్టా పీకలూదతా వుండావా?”
మురారిగోడు ఏమీ చెప్పలేదు. ఇంతలో రాంబాబు గోడు పెన్సిలు తెచ్చి మురారికి ఇచ్చినాడు.
“సరే.., ఇంక నువ్వెళ్ళు,” అనేసి మురారిగోడ్ని ఆడ నుంచి పంపేసినాడు సర్పంచు.
మురారిగోడు పెన్సిలు తీసుకొని సంతోషంగా ముందుకు నడిచినాడు.
సర్పంచి మురారిగోడు ఎల్లిపోయినంక కొడుకువైపు తిరిగి “ఆవులు కాసేవాని కొడుకుతో నీకు జతేందిరా?” అని కోపంగా అడిగాడు.
రాంబాబుకి అసలు ఆ ప్రశ్నే అర్థంగాలా.
“అసలే నీకు నాగదోషం వుండాది,” కొనసాగించాడు నాన్న. “ఇట్టా బయట ఎక్కువగా తిరిగే వోల్ల పిల్లకాయలతో జత కట్టమాక,” అన్నేడు.
“సరే నాయినా” అనేసి రాంబాబుగోడు ఇంటి లోపలికి బోయినాడు.
“గుళ్ళో ఏంది? హరికధా?” అడిగాడు సర్పంచి.
“ఆ, బృందావన ఘట్టం జెప్తా వుండారు,” అన్నేడు పూజారి.
“రాతిరికి అందరం వస్తాం లే,” అనేసి లోపలి బోయినాడు.
మురారిగోని ఎనకాలే పరిగెత్తిన వోల్లమ్మ గాలికి ముందుకెళ్ళలేక ఆగిపోయినాది.
గాలి తగ్గినంక సర్పంచి ఇంటివైపు బోతాంటే ఎదురుగా నటరాజు పెన్సిలుతో మురారిగోడు ఎగురుకుంటా వస్తా కనబడ్నాడు.
అమ్మకి మురారిగోన్ని చూడగానే కోపం వొచ్చినాది.
“ఒరేయ్, సర్పంచోల్ల ఇంటికి బోతన్నా అని నాకు చెప్పొద్దూ?” వాన్ని గద్దించి అడిగినాది.
“రాంబాబు దగ్గిరికి అని జెప్పినాను గదమ్మా!”
“వోడు సర్పంచ్ కొడుకని నాకు తెలియాల్సిన పనిలేదా? సరేలే, రానిచ్చినారా వోల్లు ఇంటికి?” అనుమానంగా అడిగినాది.
“లేదుమా, బయటే ఉంచి మాట్లాడినారు. ఎందుకట్లా?” ఎదురుప్రశ్న వేసాడు మురారి.
ఆ మాటకి బదులేమియ్యాలో వోల్ల అమ్మకి తెలియలేదు. లోకం దెలియని పసోడు మురారి. లోకం తీరు ఇట్టా అని ఎట్టా జెప్పేది?
“అదంతేలే… గాలి చూడు ఎట్టా వొచ్చిబోయిందో, తలనిండా ఇసకే,” అనేసి అక్కడ మట్టిలో ఏదో పడుంటే చూసింది.
ముందు తాడనుకునింది కానీ దగ్గరకెళ్ళి చూసేసరికి ఎరుపు రంగు పులుముకున్న పాము దర్శనమిచ్చింది.
పాము అని తెలియగానే అమ్మ బెదిరిపూడ్సింది.
మురారిగోని చెయ్యి లాక్కొని “ ఇట్టా దూరంగా రా,” అనేసి పక్కకు తీసుకెళ్ళిపోయింది.
“ఏమైనాది మా, ఏముంది ఆడ,” అడిగినాడు మురారి.
“ఎవురో పాముని సంపి ఆడే మట్టిలోనే ఏసేసినారు. ఎవురో తొక్కినట్టు, కర్రతో నెత్తిమీద బాదినట్టు వుండారు. తల బజ్జలైపోయినాది,” అనింది.
మురారిగోడు భయపడి అమ్మ కొంగుచాటుగా బోయాడు.
తొంగి తొంగి చూడటానికి అట్టా ముందుకొచ్చాడు గానీ “అవంతా నువ్వు చూడకూడదు. భయపడ్తావ్,” అని మురారిగోన్ని కొంగుచాటున దాచేస్తా అనింది.
ఇద్దరూ ఇంటికాడికి బోయినారు.
మురారిగోడు ఇంటికి ఎల్లినంక కాళ్ళని జూస్కున్నాడు. ఎర్రగా కాలికి ఏదో అంటినాది.
వోల్లమ్మ “ఏం తొక్కేసి వొచ్చినావ్ రా, కాళ్ళకి ఏందా రంగు?” అడిగినాది.
“తెలీదు మా, రాంబాబు వోల్లు ఏందో పూజ జేసినారు. ఆడ కుంకమ తొక్కినట్టు వుండా,” అన్నేడు.
వైతరణికి, ఎర్రనీరు పారే వాగుకీ తేడా తెలియని పసి వయసు కదా అది!
గుళ్ళో హరికథ చెప్తానే వుండారింకా. కృష్ణుడు కాళీయ సర్పముపై నృత్యం చేసే ఘట్టాన్ని వర్ణిస్తా వుండారు.
“నటరాజు వోలె నర్తించెనా హరి…” మెల్లగా వినబడతాంది.
పాముని తొక్కి చంపి నాగదోషాన్ని నివారించేసిన మురారి గోని అమాయకత్వానికి,
ఇంట్లోకి రానివ్వకుండా కృష్ణున్ని బయటే నిలబెట్టి మాట్లాడిన సర్పంచు అహంకారానికి
దగ్గరిదాకా ఒచ్చిన దేవుడ్ని కాదనుకొని ఎక్కడో ఎవరో చెప్పిన దేవుని కథ ఇనడానికి సిద్దపడిన అదే సర్పంచు అజ్ఞానానికి సాక్ష్యంలా,
నట్రాజు పెన్సిలు మిగిలినాది.
***
( బాహుదా బతుకు కథలు )








[…] View all posts నట్రాజు పెన్సిలు […]
సుదర్శన్ బుదూరి కథ చాలా బాగుంది…
థాంక్స్ అండి
కృష్ణుడి కాళీయమర్ధనాన్ని ఈ కథకు ప్రతీకను చేసిన తీరు బావుంది. ఈ కథలో ముఖ్యపాత్ర పేరు “మురారి”, కృష్ణుడిలానే బాలుడు. పాలు, పెరుగు, వెన్నలు ఇష్టమైన కృష్ణుడిలానే మురారికీ పంచామృతం అంటే ఇష్టం. కృష్ణుడు పశువుల కాపరి. ఈ కథలో మురారి కూడా పశువుల కాపరి కొడుకు. మురారి తండ్రి వాసన్న, కృష్ణుడి తండ్రి వసుదేవుడు. యమునా నదిలోని పామును చంపి దాని బారినుండి కృష్ణుడు ప్రజలని రక్షిస్తే, ఈ కథలో తనకు తెలియకుండానే మురారి బహుదా నది ఒడ్డున పామును తొక్కి చంపి మిత్రుడి నాగదోషాన్ని తప్పించాడు. కృష్ణుడు వేణువు వూదినట్టు, మురారి ఆకును చుట్టి పీకను వూదినాడు.
అంటే కథకుడి ద్వారా మురారే సజీవ దైవము, కృష్ణుడు. ఎదురుగా వున్న దేవున్ని చూడలేక, చూసే జ్ఞానము లేక సర్పంచ్ అతన్ని ఇంటిబయటే నిలబెట్టి అవమానిస్తాడు, పూజారి ఎదుటనున్న కృష్ణున్ని కాదని పురాణ కృష్ణుడి హరికథాగానం వినడానికి వెళ్ళిపోయాడు.
అయితే ఈ ప్రతీకలు పాఠకుడికి అర్థం కావేమోనని రచయిత భయపడ్డాడేమో చివర్లో “మురారే కృష్ణుడు” అని చెప్పేశాడు. ఇలా చెప్పకపోయివుంటే కథ యొక్క గాఢత పెరిగేది. పాఠకుడే స్వయంగా ఆ లంకె కనుగొన్నప్పుడు పొందే హాయిని రచయిత స్వయంగా పాఠకులకు దూరం చేశాడు.
“పాపం చిన్న-పెద్ద, ఎవురు-ఏంది అనే తేడాలు పెన్సిలుకు ఏం తెలుస్తాది? స్నేహానికి ఏం తెలుస్తాది?” కథ మధ్యలో కథకుడి ఈ వ్యాఖ్యానం అవసరం లేదు. కథే చెబుతోంది కదా.. ఇక ఇదెందుకు.
ఇంకో చిన్న పొరబాటు వుంది. “రాంబాబుగోడు వచ్చే దారిలో తుంచుకున్న ఆకుని బయటకు దీసినాడు. దాన్ని ఉండలాగా చుట్టినాడు. మెల్లగా ఊదినాడు.” ఈ వాక్యంలో వూదింది రాంబాబు అనే అర్థం వస్తావుంది. కానీ ఆ తర్వాత వచ్చే ““అర్రే..భల్లే ఊదతా వుండావే, అన్నేడు సర్పంచి. మురారిగోడు ఆపేశ్నాడు.” చదివాకనే వూదింది మురారి అని తెలుస్తుంది.
మురారి అనే పేరు పల్లెల్లో అంత ప్రాచుర్యం వున్నది కాదు, ఎలాగూ పోలుస్తున్నది కృష్ణుడితోనే గనక “కిట్టిగాడు” అంటే ఇంకా బాగా కుదిరేది. చివరలో మురారే కృష్ణుడు అని చెప్పాలన్న ఆతృతలో ప్రధాన పాత్ర పేరును “మురారిగోడు” అని పెట్టినట్టుంది.
మొత్తం కథకూ సూత్రంగా నిలిచింది నటరాజ్ పెన్సిల్, అంటే సమస్తాన్నీ సమదృష్టితో చూసే నటరాజు, శివుడు.
ఈ చిన్న చిన్న విషయాలను వదిలేస్తే మంచి ప్రతీకలతో నడిచిన మంచి కథ.