కథేంటి?
“అవి యేమిటి?”
“కాక్రోచ్‌లు!”
“రోజురోజుకూ యిలా పెరిగిపోతున్నాయేమిటి?”
“దేశాన్ని చెత్తకుప్పని చేస్తున్నప్పుడు అవి అలాగే పుట్టుకొస్తాయి!”
“హిట్ కొడితే…?”
“హిట్ కాదు, వాటర్ కాదు, టియర్ గ్యాసు కొట్టినా లేదు, రబ్బరు బుల్లెట్లు వేసినా లేదు?!”
“అయినా అవేం చేస్తాయి? పొడుస్తాయా… కరుస్తాయా?”
“ఏమీ చెయ్యకుండా వుంటే భయం వెయ్యదూ?”
“ఎందుకూ?”
“ఏదైనా చేస్తాయేమోనని!”
“ఓహో అందుకేనా… యింత కష్టపడుతున్నారు?!”
“మరి?”
“మీరు బాగా భయపడుతున్నారు…”
“ఔనా?, యింకా మేం కాక్రోచ్‌ల్ని భయపెడుతున్నామని అనుకున్నామే!?”
వీకు కథ!
“ఏదో ఫస్ట్ టైం పేపర్ లీక్ అవుతున్నట్టు అంతా తెగ ఫీలయిపోతున్నారు…”
“కదా?, వొక్కసారి కాదు, యీ పుష్కరకాలంలో 152 సార్లు లీకయింది”
“మరే?, లీకులనేవి కామన్, యిన్నిసార్లు లీకులవుతున్నా యింకా అలవాటు పడలేదు, యేమి పిచ్చి జనాలో యేమో?”
“మొత్తం యేడున్నర కోట్లమంది స్టూడెంట్స్ నష్టపోయారట…”
“మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తూనే వున్నాంగా?”
“అక్కడికేదో మనం కావాలని లీక్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు…”
“మన ఎన్డియ్యే పవర్లో వున్నచోట యింకా యెక్కువే జరిగాయి కదా?, వాళ్ళకి మాత్రమే యేదో లీకు జరిగినట్టు?!”
లీకు కథ!
పేక్ అలా తెచ్చి షాపువాడి ముఖమ్మీద కొట్టింది కస్టమర్.
‘ఏమిటి ప్రాబ్లమ్?’ అన్నట్టు చూశాడు షాపువాడు.
“పది రూపాయల డైపర్, లీకయితే యింక యెందుకు?” అంది కస్టమర్.
“ఎగ్జామ్ పేపర్లు లీకయితేనే దిక్కులేదు, అలాంటిది డైపర్ లీక్…” షాపువాడి మాట పూర్తికాలేదు.
“నేను కన్స్యూమర్ కోర్టుకు వెళతాను, అమ్మినందుకు నీ మీద, తయారుచేసినందుకు ఆ కంపెనీ మీద… కేసు వేస్తాను” గట్టిగా చెప్పింది కస్టమర్.
“సారీ మేడమ్, కొత్త పేక్ యిస్తాను. కేసొద్దు…” తగ్గి అన్నాడు షాపువాడు.
“ఎందుకు కేసు వేయొద్దో చెప్పు” తిరిగి అడిగింది కస్టమర్.
“పేపర్ లీకు కామన్ మేడమ్. అవి లీకయినా యెవరూ భయపడరు. డైపర్ లీకయితే కంపెనీలు భయపడతాయి” అర్థం చేసుకోమన్నట్టు చూశాడు షాపువాడు.
వాపోయి దిగులుగా చూశాడు, పక్కనే వుండి బిల్లు రాస్తున్న అనుభవశాలి. “కన్స్యూమర్‌కు వున్న రైట్స్ స్టూడెంటుకు వుంటే లీకులు యెప్పుడో ఆగిపోయేవి” అని!
కథా సాక్షి!
పార్వతీ పరమేశ్వరులు దేశ సంచారానికి బయలుదేరారు. రాజధాని మీదుగా ఆకాశమార్గాన దాటుతూ వుండగా నేలమీదికి చూసిన పార్వతి వులిక్కిపడి పరమేశ్వరునకు చెయ్యి చూపించింది. ఆమెకు నోట మాట రాలేదు మరి.
చీమలు పుట్టలోంచి చెల్లా చెదురైనట్టుగా జనం పరుగులు తీస్తున్నారు. పెద్దా చిన్నా వున్నా నూనూగు మీసాలవాళ్ళే యెక్కువ. పడుతూ లేస్తూ.
రక్షక భటులు కక్షక భటులై వెంటాడుతున్నారు. కాదు, వేటాడుతున్నారు. లాఠీలతో ఆడామగా చిన్నాపెద్దా తేడాలేకుండా కొడుతున్నారు. లాఠీలకున్న మేకులు వాళ్ళ చర్మాన్ని చీరేస్తున్నాయి. రక్తమోడుతున్నారు పిల్లలు.
బాష్ప వాయువులు ప్రయోగించారు. రాళ్ళూ రబ్బరుతూటాలు విసురుతున్నారు.
పిల్లలు రాలిన పిట్టలైనారు.
ఏడుపులూ పెడబొబ్బలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతోంది. చెంప పండని పిల్లల చెంపల నిండా కన్నీరే. ‘అమ్మా’ అంటుంటే, పార్వతమ్మ కడుపులో పేగు కలుక్కుమంది.
ఏదైనా చెయ్యమని మగనిని అడిగింది పార్వతమ్మ.
ఏం చేయను? అన్నట్టు శివుడు చూశాడు.
“శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారే?” పార్వతమ్మ కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
“ఇది నా ఆజ్ఞ కాదు…” సంజాయిషీ యిచ్చుకున్నాడు శివుడు, అంతకుమించి యేమనాలో అతగాడికీ బోధ పడలే.
“ఒక పని చెయ్…” కళ్ళు పెద్దవి చేస్తూ పార్వతీదేవి.
ఏమిటన్నట్టు ఆసక్తిగా చూశాడు శివుడు.
“ఈ పిల్లల్ని ఆవుల్ని చేసేయ్” అంది ఆశగా పార్వతీదేవి.
నీరుగారి చూసిన శివునితో “బతికిపోతారు” యెంతో ఆశగా అంది మళ్ళీ పార్వతీదేవి.
శివుడు తేరుకోవడానికి చాలా సమయం పట్టినట్టుంది, యీ లోపల జరగకూడనిది అంతా జరిగిపోయింది!
కర్కశ కథ!
పోలీసులు అక్కడున్న అమ్మాయిల్నీ అబ్బాయిల్నీ వెళ్ళిపొమ్మని చెదరగొట్టారు.
ఒకరొకరూ వెళ్ళిపోతున్నారు.
వెళ్తున్న అబ్బాయికి కాళ్ళు అడ్డం పెట్టాడు కుర్ర పోలీసు. దబ్బున నేలమీద పడ్డాడు కుర్రాడు. లేచి దులుపుకొని “యిదేనా మీ డ్యూటీ?” అడిగాడు.
పోలీసులందరూ కలిసి లాఠీలతో బాది “యిదీ మా డ్యూటీ” అన్నారు.
మాట వినకపోతే కదా కొడతారు? వింటే యేమీ అనరు అనుకొని తలవంచుకు తన దారిన తను వెళ్తోందో అమ్మాయి.
అప్పుడు ఆమె వెనుక నుండి జన్మస్థానం కిందిభాగంలో లాఠీ పెట్టి ఆడించాడో నడీడు పోలీసు. గొప్ప పని చేసినట్టు తోటి పోలీసులు కితాబిచ్చి పచ్చిగా నవ్వుకున్నారు.
మరో ఆడపిల్ల తోపులాటలోంచి పక్కకు వెళ్ళిపోతోంది. ఆమె గుండెల మీద చెయ్యి వేసి నలిపేసాడో ముదర పోలీసు. ‘తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రకం’ సామెత గుర్తుచేసుకుంటూ మండుతున్న గుండెలతో తప్పుకు వెళ్ళిపోయిందా పిల్ల.
మరొక ముసిలి పోలీసు యేకంగా యింకో అమ్మాయిని నేలమీదికి తోసి గుండెలమీద చెయ్యి వేసి చొక్కాని పీకుతున్నాడు.
వాళ్ళ భుజాలమీది మూడు సింహాలూ బుద్ధిగా వున్నాయి, వాడు మాత్రం నాలుగో సింహం అయినాడు.
“ఒరేయ్ యెవర్రా మీరంతా?” యెవరో అరిచారు.
“సనాతన సైనికులు” మరెవరో సమాధానం యిచ్చారు!
నకిలీల కథ!
కొందరికి నెత్తిమీద టోపీ లేదు.
మరికొందరికి గుండెమీద నేమ్ బేడ్జీ లేదు.
ఇంకొందరికి వంటిమీద యూనిఫామే లేదు.
పోనీ సివిల్ డ్రెస్ అనుకోవడానికి, కొందరికి చొక్కా కూడా లేదు. మరికొందరికి బూట్లు కూడా లేవు.
“మీ ఐడెంటిటీ చూపించండి” అన్నారు విద్యార్థులు.
వాళ్ళు లాఠీలు చూపించారు! కాదు, విద్యార్థుల వొంటిమీద జళిపించారు!
కథా మూలం!
శానిటరీ నాప్కిన్ యాడ్స్ చాలా వాటిని అర్జెంటుగా బేన్ చేసింది సర్కారు.
ఎప్పుడూ వున్న యాడ్సే. ఇప్పుడు కొత్తగా యెందుకు బేన్ చెయ్యాల్సివచ్చిందో ఆ యా కంపెనీలకి అర్థం కాలేదు. అదే విషయం అడిగితే-
“మీరంతా మీ మీ యాడ్స్ మీరే వోసారి చూసుకోండి… చెక్ చేసుకోండి” అన్నారు అధికారులు.
యాడ్స్ ప్లే చేసి మళ్ళీ మళ్ళీ చూసుకున్నారంతా.
“నో లీక్స్… నో స్టెయిన్స్”
కంపెనీల వాళ్ళు అర్థం చేసుకున్నట్టు నోళ్ళు విప్పలేదు?!
పరదా కథ!
విద్యార్థులంతా గుంపులు గుంపులుగా కూర్చున్నారు.
రోజులతరబడి కూర్చున్నందువల్ల బోర్‌కొట్టకుండా తమ టైమ్‌ని వాల్యుబుల్‌గా మార్చుకోవడానికి ట్రై చేస్తూనేవున్నారు.
విద్యార్థులలో వొకడు లేచి “‘పరదా’ మీద వొక్కొక్కరూ వొక్కో వాక్యం చెప్పాలి” అన్నాడు.
“ట్రంప్ వస్తే మురికి కాల్వల రోడ్డుకు యిరువైపులా కట్టారు పరదా” అన్నదో అమ్మాయి.
“హంగర్ స్ట్రైక్‌లో వున్న సోనం వాంగ్చూక్ యెత్తుకు పోయినప్పుడూ కట్టారు పరదా” అన్నది మరో అమ్మాయి.
“పాపం తమ ముఖాలు చూపించడానికి భయపడి పోలీసులు కట్టుకున్నారు చిన్న పరదా… మాస్క్” నవ్వాడో అబ్బాయి.
“యూనిఫామ్స్ లేకపోయినా పోలీసు వుద్యోగం చేస్తూ ఆరెస్సెస్‌వాళ్ళు తమ ముఖాలకు కట్టుకున్నారు చిన్న పరదా… మాస్క్” నవ్విందో అమ్మాయి.
“టియర్ గ్యాస్ కొడితే, తట్టుకోవడానికి నేనూ ముక్కుకు కట్టుకున్నాను చిన్న పరదా… మాస్క్” మాస్క్ తీసి విసిరేసిందో అమ్మాయి.

హీన కథ!
ఐటి సెల్‌లో అంతా బిజీగా వున్నారు. ఒక్కో సిస్టంలో పదేసి విండోస్ ఓపెన్ చేసి టకటకా ట్రోల్స్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు.
“సోనమ్ వాంగ్చూక్‌ని చంపేస్తారా?, ఆయన ఆసుపత్రి నుండి వచ్చి మళ్ళీ నిరాహార దీక్ష చేయాలా?” అని పోస్ట్ పెట్టాడు.
“సోనమ్ వాంగ్చూక్‌కు యేదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అని వేరెవరో పెట్టిన పోస్ట్ కిందకు వెళ్ళాడు. వెళ్ళి “ప్రభుత్వం తరపున ఆయనేం నిరాహార దీక్ష చేయడం లేదు, స్టూడెంట్స్ తరపున చేస్తున్నప్పుడు స్టూడెంట్స్‌దే బాధ్యత” అని పెట్టాడు.
“జేడీ అగర్వాల్ అలియాస్ ‘జ్ఞాన స్వరూపానంద’ ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ గంగానది శుద్ధి చేయాలని 111 రోజులు నిరాహార దీక్ష చేసి ఎనభైఆరేళ్ళ వయసులో చనిపోయారు” పోస్ట్ కింద కామెంట్ యేమని పెట్టాలో అర్థం కాలేదు. ఆలస్యం అయితే ఇన్కం తగ్గిపోతుందనిపించింది. వెంటనే యిలా పెట్టాడు.
“జేడీ అగర్వాల్ 86 యేళ్ళ వ్యక్తి 111 రోజులు నిరాహారదీక్ష చేశారు. అతనికంటే సోనమ్ వాంగ్చూక్ చాలా చిన్నవాడు, యింకా యెక్కువ రోజులు నిరాహార దీక్ష చెయ్యాలి”
మరో విండోలోంచి వెళ్ళి అదే కామెంటు కింద మరో కామెంటు పెట్టాడు. “జేడీ అగర్వాల్‌గారికి సంతాపం చెప్పినట్టే సోనమ్ వాంగ్చూక్‌గారికీ మన ప్రధానిగారు సంతాపం చెపుతారు. ఆయనకు ఏ రాగద్వేషాలూ వుండవు” అని.
“బొద్దింకల్ని నిరోధించాలంటే హిట్ వొక్కటే చాలదు” అని మరో విండో తెరచి పెట్టాడు.
తరువాత వాష్ రూమ్‌కు వెళ్ళాడు. అద్దంలో ముఖం చూసుకున్నాడు. షాక్ అయ్యాడు. అంతలోనే గర్వంగా ఫీలయి చూశాడు.
ఇప్పుడు బొద్దింకల్ని తినే బల్లిలా తనకు తనే కనిపించాడు!
క్రియేటీవ్ కథ!
కొందరు విద్యార్థులు గుమికూడారు.
వేస్తున్న వీధి నాటకంలో దేశాధినేతకు అర్జీ రాస్తున్నారు.
“అయ్యా” అని వొకడు మొదలు పెట్టగానే, “కొరకరాని కొయ్యా” అని చుట్టూవున్నవాళ్ళు అందుకున్నారు.
“సీరియస్” నవ్వుతున్న వాళ్ళని ఆపిందో అమ్మాయి.
“విశ్వగురూ…” అని అందించాడో అబ్బాయి. రాస్తున్నవాడు ఆ మాట రాయడానికి యిష్టపడలేదు. పెన్ను విసిరేసిపోయాడు.
“పోనీ, దేవుడు పంపిన పుత్రుడా…” యిదెలా వుంది అన్నట్టు చూసింది మరో అమ్మాయి. ‘ఎక్కువయింది’ అన్నట్టు “వోవ్…” అని అరిచి, అంతా అడ్డంగా తలలూపారు.
“గౌరవ ప్రధానమంత్రిగారికి…” చెప్పమన్నట్టు చూశాడు మరొకడు, వచ్చి రాయడానికి సిద్ధమవుతూ.
ఇంతలో వొకడు యేకంగా ప్రధానమంత్రి గెటప్‌తో సీన్లోకి వచ్చేశాడు.
“మీరు నోరు విప్పండి… వొక్కసారి నోరు విప్పండి సార్… ప్లీజ్ సార్” అని గెడ్డం పట్టుకు బతిమాలాడో విద్యార్థి.
ముసిముసి నవ్వులు నవ్వాడే తప్ప నోరు విప్పలేదు.
“అరే… ప్రామ్టింగ్ మిషన్ తెచ్చి పెట్టండ్రా” అన్నారెవరో.
ఇద్దరు కుర్రాళ్ళు క్లాత్‌ను టెలీప్రామ్ట్‌లా అటూ యిటూ పట్టుకున్నారు.
“సార్, టెలీప్రామ్ట్ మధ్యలో ఆగిపోతుంది అని మీకు భయముంటే, ఆ మధ్య ట్రంప్‌గారి పక్కన కూర్చొని స్లిప్ పట్టుకొని మాట్లాడారు కద్సార్? అలాగయినా మాట్లాడండి సార్…” మరో విద్యార్థిని ప్రాధేయపూర్వకంగా బతిమలాడింది.
అవేవీ పట్టించుకోకుండా అచ్చం ప్రధానిలానే బిహేవ్ చేస్తూ జేబులోంచి కాయిన్ తీసి వో విద్యార్థిని బొట్టులేని నుదిటిమీద బొట్టులా పెట్టాడు. తలవెనుక భాగం మీద వొక్కటి కొట్టాడు. కాయిన్ పడింది. తను పెట్టుకున్నాడు. వెనుక నుంచి కొట్టుకున్నాడు. కాయిన్ పడలేదు.
“మీ నోట్లోంచి మాటే కాదు, నుదిటిమీంచి కాయినూ రాలదు…” చూస్తున్న వాళ్ళలోంచి వినిపించింది.
“సార్, తర్వాత ఆడుకుందురు, ముందు నోరిప్పండి సార్” చుట్టూ చేరి చూస్తున్న విద్యార్థులలోంచి వో విద్యార్థి అరిచాడు. చలించలేదని వచ్చి యేకంగా కాళ్ళమీద పడ్డాడు. “మీరు మాకు కూడా ప్రధానే సార్” అని గుర్తు కూడా చేశాడు.
అయినా ఆ గెటప్‌గారు నోరు విప్పలేదు.
“సార్, మన్ కీ బాత్-లో పరీక్షలకు యెలా చదవాలి? ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలా పరీక్షలు రాయాలి?- అని చెప్పారు కదా సార్…” అభ్యర్థించడం పూర్తికాలేదు. “సారు మామిడిపళ్ళు యెలా తినాలి?” అనేదానిమీద కూడా మాట్లాడారు కద్సార్” మధ్యలో మరో విద్యార్థి. వాడిని మరో యిద్దరు పక్కకు లాగేశారు.
“పరీక్షలకి ప్రిపేరవడం, చదివింది గుర్తుపెట్టుకోవడం, పరీక్షలు రాయడం వరకూ అన్నీ చెప్పారు, పరీక్షా పేపర్లు లీకుకాకుండా యెలాగో చెప్పండి సార్…”
“మాకు చెప్పకపోతే చెప్పకపోయారు, మీ మినిస్టరు ధర్మేంద్ర ప్రాధాన్‌కయినా చెప్పండి సార్…”
ప్రధానిగారు వినిపించుకోకుండా మరొకడి వీపుని విమానం చేసుకొని అక్కడినుండి తుర్రున వెళ్ళిపోయారు!
సీజేపీ కథ!
“ఒరేయ్… మనకు బుర్రుందా రా?”
“ఏం?”
“సెటైర్‌గా పెట్టిన పార్టీని మనమే సీరియస్‌గా పార్టీగా మార్చేస్తున్నాం కదరా?!”
కథ కాదు!
అతను డ్యూటీ ముగించుకొని యింటికి వచ్చాడు. లాఠీని వో మూలాన పెట్టాడు.
అతని పిల్లలు లాఠీ చుట్టూ చేరి యెన్నడూ చూడనట్టు చూస్తున్నారు.
లాఠీ నిండా రక్తం మరకలు.
లాఠీ కూడా ఆ నునులేత పిల్లలవంక చూసింది. పిల్లలయితే నోటిమీద వేలే లేదుగాని బుద్ధిగానే వున్నారు. లాఠీ కదిలింది. అకారణంగా పిల్లల్ని బాదింది. అలవాటుగా పిల్లల్ని చితక్కొట్టింది.
రక్తాలు కారాయి, పిల్లల దేహాల నిండా!
‘అమ్మా’ అని యేడుస్తూ యెక్కడి నుండో దూరంగా యెవరో పిల్లలే కోరస్ యిచ్చారు!
బత్తాయి కథ!
“మరక మంచిదే లాగ, లీకు మంచిదే!”
“ఎలా?”
“పరీక్ష బాగా రాయని వారికి మళ్ళీ గొప్ప అవకాశం యిచ్చినట్టు కదా?”
“మరి పరీక్ష బాగా రాసిన వారికి?”
“రాసిన వాళ్ళు యెప్పుడైనా బాగా రాస్తారు…”
“ఇరవైమంది సూసైడ్ చేసుకున్నారు…”
“నెగటివ్ వైపు చూడొద్దు, పాజిటీవ్ వైపు చూడండి…”
“ఏమిటా పాజిటీవ్?”
“నేను మళ్ళీ రాస్తే నా మార్కులు పెరిగాయి, మా బ్రదర్ అయితే నీట్ రాసి ఐఐటిలో సీటు కొట్టాడు!”
తిరగబడ్డ కథ!
“అన్నా, మన లీడర్లు అక్కడ ఢిల్లీలో యేం పీకుతున్నారో తెలీదు”
“అదేంట్రా… ఏమైంది?”
“ఏమైందో తరువాత చెపుతాను, ముందు ఇంటర్నెట్ ఆఫ్ చెయ్యమను, పవర్ తీసెయ్యమను…”
“ఆల్రెడీ యిక్కడ ఇంటర్నెట్టూ లేదు, పవరూ లేదు, వాటరూ లేదు, మెయిన్ మీడియా కూడా లేదు”
“బొక్క, అక్కడ జంతర్ మంతర్లో కాదురా, నీ యబ్బ…”
“మరి?”
“దేశమంతా ఇంటర్నెట్టూ పవరూ ఆఫ్ చెయ్యమని చెప్పు…”
“ఎందుకూ?”
“ముందు ఆఫ్ చెయ్యమని చెప్పు!”
“అప్పడు మనదేశం బంగ్లాదేశం అయిపోతుందేమో?”
“ఇప్పుడు మాత్రం కాలేదా?”
“ఏమయిందిరా, పాయింటుకు రా…”
“మొత్తం దొబ్బింది, మన కుర్రాళ్ళంతా కండువాలు విసిరేసి పోతున్నారు…”
“దేవుడూ దేశమూ వదిలి యెక్కడికి పోతార్రా?”
“అది కూడా చెప్పాలా?, యిక్కడంతా ఖాళీ అయిపోతోందిరా…?!”
కథా చర్యలు!
టీవీలో డిబేట్ జరుగుతోంది.
“విద్యార్థుల భవిష్యత్తు విషయంలో మీరు యెలాంటి చర్యలు తీసుకున్నారు?”
“ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు, చూడ్లేదా?”
“ఎక్స్‌లో వైలో తప్ప- ట్వీట్‌లు తప్ప- మాట్లాడరా?”
“మంకీబాత్‌లో మాట్లాడుతున్నారు కదా?”
“మీడియా మీదే కదా? కనీసం మీ గోదీ మీడియాతోనైనా మాట్లాడొచ్చు కదా?”
“మీకు పనులు కావాలా? మాటలు కావాలా? మా ప్రధాని మాటల ప్రధాని కాదు, చేతల ప్రధాని!”
“ఆ చేతలేమిటో చెప్పండి?”
“ఏం మీకు కనిపించడం లేదా చెప్పండి?”
“కనిపిస్తోంది… ఇంటర్నెట్, పవర్, వాటర్ అన్నీ ఆపేశారు”
“ఉద్రిక్తతలు విస్తరించకుండా చేయడం ప్రభుత్వ బాధ్యత, రైతులు వుద్యమించినా అదే చేశాం, యే ప్రభుత్వమైనా అదే చేస్తుంది”
“స్టూడెంట్స్ ఆందోళనలని ఆపడానికి ప్రభుత్వం నుండి చర్యలేవి?”
“ఎందుకు లేవు? మెట్రో స్టేషన్స్ మూసేశాం. నగరంలోకి రాకుండా చేశాం. ఢిల్లీకి వచ్చే అన్ని రైళ్ళూ ఆలస్యం చేశాం. స్టూడెంట్స్‌ని గుర్తించి యెక్కడికక్కడ పోలీసు వేనుల్లో యెక్కించి సిటీ బయటకు తీసుకెళ్ళి వదిలేశాం”
“అయినా జనం వచ్చారు కదా?”
“మా పోలీసులు చాలా కష్టపడుతున్నారు. గాయపడుతున్నారు…”
“విద్యార్థులు కదా దెబ్బలు తిన్నది?”
“యువతని అదుపు చెయ్యాలంటే ఆమాత్రం లాఠీ వాడాల్సివుంటుంది, తప్పదు. లేకపోతే పరిస్థితి కంట్రోల్లోకి రాదు”
“ట్రక్కుతో రాళ్ళు తెప్పించారు. మీ పోలీసులే రాళ్ళు విసిరి రెచ్చగొట్టారు…”
“లేదు, వాళ్ళు మా పోలీసులు కాదు…”
“విద్యార్థులు కూడా అదే అంటున్నారు, వాళ్ళు పోలీసులు కాదు- అని!”
“సంఘవిద్రోహక శక్తులు ప్రవేశించాయనే మేమూ అంటున్నాం…”
“మ్యానెకిన్‌లకు పోలీసు డ్రెస్సులు తొడిగి చలా ప్లాన్ చేసినట్టున్నారు…”
“అలాంటిదేం లేదు…”
“వీడియోలు వున్నాయి, చూస్తారా?”
“అవసరం లేదు”
“విద్యార్థుల వుద్యమం విజయవంతమైంది అని విద్యార్థులు చెపుతున్నారు”
“పోలీసులు చాలా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు, అంతా ప్రశాంతంగా వుంది”
“ఇంతకీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారా? లేదా?”
“లేదు, ఆ అవసరమే లేదు”
“విద్యాశాఖా మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని విద్యార్థులు అంటున్నారు”
“లేదు, లేదు… ఆయనకే అర్హత వుంది, ఆయన విద్యార్థిగా వున్నప్పుడు లీకులమీద పోరాడి లాఠీదెబ్బలు తిని నాయకుడై వచ్చాడు!”
“?…..?…..?…..?”
“ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం!”
సంఘీల కథ!
“నాకిదేమీ నచ్చలేదు”
“ఏమయింది రా?”
“మనం కష్టపడితే వీళ్ళెవర్రా… పోలీసుల్లో గూండాలూ రౌడీలూ చేరారని అంటారు?”
“అనుకోనీలే, మనం అనుకున్నది చేశాం కదా?”
“అది కాదురా, మనల్ని మన నాయకులు గుర్తించారు. సర్కారు గుర్తించింది. పక్కనున్న పోలీసులు గుర్తించారు, వాళ్ళకంటే బాగా మనమే చేశాం…”
“నిజమే, మనకి గవర్నమెంటు ఎక్సుపీరియన్స్ సర్టిఫికేట్ యివ్వాలి!”
“రేపు తీసే పోలీసు జాబుల్లో మనకే ప్రయారిటీ యివ్వాలి!”
“మనం అడిగితే కాదనరులే!!”
ఇదెక్కడి కత?!
“ఏటి? నువ్వింటికి పెద్దవేనేటి? నీకేటి పట్టడం లేదేటి?” ముసిలమ్మ యింటికొచ్చిన ముసిలోడిని అడిగింది.
ముసిలోడు యేమీ మాట్లాడలేదు.
‘సూదీ దబ్బలం పెట్టి కుట్టీసుకున్నట్టుగా నోరిప్పవేటి?’ అని మళ్ళీ అడిగింది ముసల్ది.
ఎప్పటిలాగే ముసిలోడు నోరు విప్పలేదు.
“పెపంచకమంతా పళ్ళికిలించి తిరిగీసి, యింటికొచ్చీసరికి నీకేటి కూడిపోతాదో… పెద్దసిరమ్మ” అన్నాది ముసల్ది.
ముసిలోడు కళ్ళు తెరిసి నిద్రపోయినట్టుగ చూసాడు.
“ఇంట్ల యేటవతందోనీకు తెలుసునా?” ముసల్ది ముసిలోడి కళ్ళలో కళ్ళుపెట్టి చూసింది.
ముసిలోడు వునుగులనలేదు, జునుగులనలేదు.
“ఏటి నాటకాలు ఆడతన్నావేటి, ఆ…? వూరుకున్నోలితోటి వూరందరు సాల్లేరు అనుకుంతన్నావా? పల్లకున్నోలితోటి పదిమంది సాల్లేరు అనుకుంతన్నావా?” ముసల్ది మొగుడ్ని తిట్టి మొగసాల కెక్కలేదు. కోర్టు కెక్కింది. తనెక్కలేదు. పోలీసులు యెక్కించారు.
“నాకు తెలకడుగుతాను బాబూ, నా మొగుడ్ని నాను తిట్టుకుంటే… యీ పోలీసులకి నొప్పేటి?” ముసల్ది అడిగింది.
జడ్జిగారికి న్యాయం తెలుసు. అన్యాయం తెలుసు. లోకం యెలగుందో యింక బాగా తెలుసు. రేపు రిటైరు అయ్యాక యెవరెవరు యెలా బాగుపడ్డారో అంతకన్నా బాగా తెలుసు.
అంచేత దేశభద్రతా చట్టం కింద అరెస్టయిన ముసిలమ్మకి బెయిల్ కూడా రాలేదు!
దేశి కథ!
“ఐ డోంట్ హేవ్ టైం టు వాచ్ దోజ్ వీడియోస్. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ యిన్ వాచింగ్ దోజ్ వీడియోస్. డోంట్ వేస్ట్ అవర్ టైం…” పోలీస్ బ్రుటాలిటీమీద వేసిన ఎమర్జెన్సీ పిటీషన్ రిజెక్ట్ చేస్తూ సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌గారి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారెవరో.
దానికింద కామెంట్లు యీ విధంగా వున్నాయి.
“ప్రైమ్ మినిస్టర్‌కూ టైం లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్‌కూ టైం లేదు. సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టిస్‌కూ టైం లేదు”
“ముగ్గురూ ఒకే పార్టీ బాస్”
“చీఫ్ జస్టిస్ మీద కామెంట్ చెయ్యకూడదు బాస్”
“కామెంట్ చేస్తే తప్పు. రిటైర్ అయ్యాక బెనిఫిట్‌గా ఏ రాజ్యసభ సీటో తీసుకుంటే తప్పు కాదు!”
“దూలతీరింది, యాంటీ నేషన్ ఎదవలకి”
“హిందూ మతం ప్రమాదంలో వుందని న్యాయమూర్తికి గారికి తెలుసు, అందుకే రిజెక్ట్ చేసారు”
“నోటితీట కాకపోతే, కాక్రోచ్‌లు గుడ్లు పెట్టడానికి కారణమే ఈయనగారు. ఇప్పుడు ఈ మాటలతో మళ్ళీ ఏమి జరుగుతుందో?”
“ఎవరొచ్చినా వెంట్రుక పీకలేరు. ధర్మేంద్ర ప్రధాన్‌చేత రాజీనామా చేయించలేరు. మోడీకీ జై”
“ఫెవికోల్ రాసుకొని కుర్చీలో కూర్చున్నాడు పాపం… సీటు దిగొస్త లేదు”
“పాపం చీఫ్ జస్టిస్ గారి మీద యెంత ప్రెజర్ వుందో… అర్ధం చేసుకోరూ?”
“అయితే ఇప్పుడు పోలీసుల్ని జైల్లో వెయ్యాలా?”
“మోడీగారి స్థితప్రజ్ఞతని యెవరూ పూచిక పుల్లంత కూడా కదపలేరు”
“కదపాలంటే, రెండువేల యిరవైతొమ్మిది వరకూ ఆగాలి!”
“అప్పుడు కూడా గెలుపు మాదే, SIR పెట్టి వున్న వోట్లు తీసేస్తాం, తరువాత ఈవియం మిషన్లు తగలబెట్టేస్తాం, వోట్లు వెయ్యకుండానే గెలిచి చూపిస్తాం!”
“మరి ఈ యూత్ వోట్లని ఏంచేస్తారు?”
“ఏంటీ నేషన్స్‌కు వోటు వెయ్యకుండా చట్టం తెస్తాం. అయినా పాకిస్తాన్ టెర్రరిస్ట్‌లకు యిక్కడ వోట్లేందుకు?”
“భారతదేశం హిందూ దేశంగా వుండాలంటే మోడీ అధికారంలో వుండాలి!”
“ఔను, దేశం సంకనాకినా హిందూ దేశంగానే సంకనాకాలి!”
(మనవి: కామెంట్ల వరదని స్థలాభావంవల్ల నిలిపేస్తున్నాం)
ప్రేమ కథ!
“ఏమండీ పరవాలేదు కదా?”
“దేని గురించి?”
“పిల్లల దెబ్బలకు కుట్లువేసి, కట్లు కట్టిన డాక్టర్లనే పోలీసులు వదల్లేదు, దారుణంగా కొట్టారు”
“అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టొద్దా?”
“లేదు, లేదు ఫుడ్ ఆర్డర్ పెట్టండి, రెండు కాదు నాలుగు”
“ఏమిటి నీ ధైర్యం?”
“ఏం చేస్తారట. చెయ్యనీ. ఈ వయసులో జంతర్ మంతర్‌కు వెళ్ళలేం, కాని అక్కడ మనం వున్నట్టే… ఆ…”
“ఉన్నట్టు కాదు, దగ్గరుండి వడ్డించినట్టు!”
చిట్టి కథ!
“నువ్వెవరు?”
“నేను చిట్టి బొద్దింకని!”
“ఎందుకొచ్చావ్?”
“లీకయి మురుగు చేరితే నేను వస్తాను!”
“మిమ్మల్ని వెళ్ళిపొమ్మని కాళ్ళూ చేతులూ విరిచేస్తున్నారు, తెలీదా?”
“తెలుసు, నాకు ఆరు కాళ్ళు”
“నీకు భయం లేదా?”
“లేదు, బొద్దింకలు అంటే కొందరికి భయం భయం!”
“నిజమే…”
“బొద్దింకలు అంటే కొందరికి ప్రియం ప్రియం!”
“ఎందుకూ?”
“నేను పట్టుదలకు ప్రతినిధిని. తలతెగినా పదిరోజులు బతుకుతాను!”
*








Good
అద్భుతం..ఒక్కరిని కూడా వదలలేదు గా మీరూ.. మొత్తానికి మనం కూడా అన్ని రకాలుగా కాక్రోచస్ లమే
ఊపిరి ఆగి తిరిగి వచ్చింది. బజరా గారు హ్యాట్సాఫ్.
1).పేపర్ లీక్ కామన్ మేడం. అవి లీక్ అయినా ఎవరు భయపడరు. డైపర్ లీక్ అయితే నే…..
2) ఈ పిల్లల్ని ఆవుల్ని చేసేయ్….
3)జేడి అగర్వాల్ గారికి సంతాపం చెప్పినట్టే, సోనం వంగచూరు గారికి సంతాపమ్ చెప్తారు మనప్రదాని…..)
4)కథ కాదు బాగుంది…
5)పిల్లలే కోరస్ 😭
వర్తమాన రాజకీయాలపై కథలు రాయడంలో మీకు మీరే సాటి.
జంతర్ మంతర్ లో జరిగిన యువతీ యువకుల, విద్యాశాఖ మంత్రి చేసిన తప్పుడు ప్రవేశ పరీక్షల లో తప్పులవల్ల ఆ మంత్రిగారి ని మంత్రివర్గం నుంచి తొలగించాలని చేసిన పోరాటం వల్ల ఇవ్వాళ అమంత్రి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ పోరాటాన్ని దృష్టి లో పెట్టుకొని బాజారా గారు తనదైన శైలిలో బాగా రాశారు
చిన్నప్పుడు
‘బాణోచ్ఛిష్టం జగత్ సర్వమ్’
అని చదువుకున్నాను.
ఇప్పుడు
‘బజరా స్పృష్టం’
కథా జగత్ సర్వమ్
అనాలి.
చీకటిని ట్రాన్స్పరెంట్ చేశారు బజరా!