దుబాయ్ చద్దర్

ఎక్కువ సమయం అక్కడ ఉండలేకపోయాను.వెళ్ళేటప్పుడు దారిలో నేను మూగబోయాను. ఈ సారి అమ్మ మాట్లాడుతూనే ఉంది. అమ్మమ్మ అలా ఎందుకైందో చెబుతూ ఉంది.

డిసెంబర్ 2025.

వాట్సాప్ లో నా కఫిల్(యజమాని)  పంపిన ఫ్లైట్ టికెట్ పిడిఎఫ్ మళ్ళీ ఓపెన్ చేసి, ఫ్లైట్ డీటెయిల్స్, డేట్, టైం అన్నీ మరోసారి చెక్ చేసుకున్నాను. రూంలో ఉన్న సగం ప్యాక్ అయిన లగేజి బ్యాగ్ వైపు చూసాను. ఒక్కసారిగా సన్నని కరంట్ షాక్ లాంటి జల్లు ఒళ్లంతా పాకింది. ఎదో అర్థం కానీ ఫీలింగ్, మరికొన్ని రోజుల్లో ఇంటికి వెళుతున్నాను.

ఐదేళ్ల తరువాత ఇంటికి వెళుతున్నాననే సంతోషం కన్నా – ఈ ఐదేళ్లలో ఏమి సాధించాను? ఏమి కోల్పోయాను? అనే ప్రశ్నలు నన్ను పురుగుల్లా తొలిచేస్తున్నాయి. అసలు ఈ ప్రశ్నలకు సమాధానం ఉంటుందా?- కరోనా టైములో అమ్మకి సీరియస్ అయితే వెళ్లలేక పోయాను. ఇక్కడ నుంచి నేను గుండె రాయి చేసుకుని, ఓవర్ టైం డ్యూటీలు చేసి పంపిన పైసలతోనే అమ్మకు ట్రీట్మెంట్ చేయించగలిగాను. ఎంతో మంది దగ్గరి వాళ్ల ఆఖరి చూపులు వీడియో కాల్స్‌లోనే చూసాను. ఎన్ని పండుగలు, ఎన్ని పెళ్లిళ్లు… ఎన్నో మిస్ అయ్యాను.

ఈ ఐదేళ్లలో చేతికి దొరికిన పని చేశాను, ఎన్నో కష్టాలు పడ్డాను. పెట్రోల్ బంకుల్లో పనిచేశాను, ఫుడ్ డెలివరీ రైడర్ గా తిరిగాను, ఈ ఎడారి ఎండలో మాడిపోయాను. ఇప్పుడు ఐదేళ్ల ఈ గల్ఫ్ జీవితాన్ని మళ్ళీ ముప్పై కేజీల లగేజీ బ్యాగులో సర్దుకుంటున్నాను. ఎందుకో భయంగా ఉంది. మొన్నటి దాకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని తహతహలాడిన మనస్సు, ఇప్పుడెందుకో  భయం భయంగా అదిరిపడుతోంది.ఒక వైపు సంతోషం, మరో వైపు భయం – ఇదేనేమో వలస బతుకుల తిరుగు ప్రయాణపు నిర్వచనం.

ఐదేళ్లలో ఊరు ఎంతలా మారిపోయి ఉంటుందో? నన్ను ఇంతకు ముందటి చందూలానే చూస్తారా? వెళ్లి ఏం పని చెయ్యాలి? అసలు పని దొరుకుతుందా?.. అలా ఆలోచనలలో మునిగి ఉన్న నేను, ఫోను రింగవ్వడంతో ఈ లోకంలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాను.

“మీ బిల్డింగ్ కింద ఉన్నాను తొందరగా రా – ఇప్పటికే లేట్ అయ్యింది” అవతలి నుండి నా స్నేహితుడు రవి.

“వస్తున్నాను…”

ఇంటికి తీసుకువెళ్ళడానికి కావలసిన వస్తువులు షాపింగ్ చేయడానికి, నా దోస్తు రవితో కలిసి దుబాయ్ మార్కెట్ కు బయలుదేరాను.

“అరేయ్.. ఇంకెన్ని షాపులు తిప్పుతావ్ రా, కాళ్ళు నొస్తున్నాయి. నీ చద్దర్ నా ప్రాణానికి వచ్చింది… నీ యవ్వ!”

“మామ – అలా అనకు రా!, ముందు రెండు షాపుల్లో చూద్దాం, దొరుకుతుందిలే…”

అప్పటికే గంటకు పైగా షాపుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడా నాకు కావాల్సిన చద్దర్ దొరకట్లేదు. ఇంతలో నా దోస్తు రవి గాడు మళ్ళీ అందుకున్నాడు.

“అయినా, ఈ చద్దర్ గోల ఏందిరా? మన దేశంలో అన్నీ దొరుకుతూనే ఉన్నాయ్ కదా… అమెజానో, ఫ్లిప్‌కార్టో చూసి ఆర్డర్ పెట్టొచ్చుగా?”

“హే, లేదు రా… దుబాయ్ చద్దర్.. దుబాయ్ చద్దరే.. మనకాడ దొరకదు .”

“బేకార్ గా వచ్చిన నీతో – నా లడ్డులోది, రూంలో పండినా బావుండు…” రవి విసుక్కున్నాడు.

“బిర్యానీ తినిపిస్త  – మామ” అంటూ నచ్చచెప్పాను.

అలా మాట్లాడుకుంటూ ఇద్దరం ఒక షాపు ముందుకు చేరుకున్నాం. ఆ షాపు బయట రంగు రంగుల ఇరానీ రగ్గులు, టర్కీ కార్పెట్లు, ఊలు బట్టలు వేలాడుతున్నాయి. నాకెందుకో ఈ షాపులో నాకు కావలిసిన చద్దర్ దొరికేలా ఉందనిపించింది. షాపు లోపలికి నడిచాము.

కొనే బేరం కాదనుకున్నాడో ఏమో, షాప్ ఓనర్ అరబ్బు మమ్మల్ని గమనించి కూడా, ఫోన్లో రీల్స్ చూస్తూనే ఉన్నాడు. షాపులో ఉన్న దుప్పట్లను చూస్తూ, ఒక మూలాన పడున్న చద్దర్ల కుప్ప మీద నా చూపు పడింది. ఆ కుప్పలో అడుగున, తెల్లగా మెరుస్తూ ఒక చద్దర్ కనిపించింది. ఆశగా అటువైపు నడిచి, ఆ కుప్పలోంచి ఒక్కో చద్దర్ లాగి పక్కకు వేస్తూ, ఆ చద్దర్ దగ్గర ఆగిపోయాను.

తెల్లని రంగు, సుతి మెత్తని మఖ్మల్ ఊలు, గులాబీ రంగులో పెద్ద పెద్ద పువ్వుల డిజైన్. నా కళ్ళు ఆశ్చర్యం, సంతోషంతో పెద్దవయ్యాయి… ఎంత బాగుందో ఆ చద్దర్! చిన్నప్పుడు అమ్మమ్మ చెబుతుంటే అర్థం కాలేదు కానీ, ఇప్పుడు కళ్ళతో చూస్తుంటే అర్థం అవుతోంది, ఈ దుబాయ్ చద్దర్ అందం.

అరబ్బీలో అయినకాడికి బేరమాడి ఎలాగోలా కొన్నాను.

“ఒరేయ్ – ఈ చద్దరే నీ లగేజి బ్యాగు నిండా వస్తది రా, నువ్వు మిగతా సామాను ఎలా తీసుకెళ్తావ్? ఉన్నది ముప్పై కేజీలే కదా…” ఆ చద్దర్ ప్యాకింగ్ చూసి నా దోస్తు రవి గాడు అన్న మాట విని నేను కూడా కాసేపు ఆలోచించాను. ఆ చద్దర్ మడత పెట్టి, ప్యాక్ చేస్తే చిన్న పాటి లగేజ్ బ్యాగ్ లా ఉంది.

“ఏదోకటి చేద్దాం లేరా! చద్దర్ మాత్రం తీస్కెళ్ళాల్సిందే.”

ఇద్దరం కలిసి ఇంకొంచెం షాపింగ్ చేసుకుని, బిర్యానీ తినడానికి హారా వెళ్లే బస్సు ఎక్కి కూర్చున్నాం.

“ఒరేయ్ చందూ… తిరిగి తిరిగి కాళ్ళు నొస్తున్నాయి కానీ, దీనమ్మ ఈ చద్దర్ కథ ఏందో చెప్పురా అసలు. ఎట్లాగో హరా పోవడానికి గంట పట్టుద్ది.”

“ఈ చద్దర్ కథ చెప్పాలంటే… నీకు మా అమ్మమ్మ కథ చెప్పాలి.”

చిన్నప్పుడు నేను పదవ తరగతి వరకు మా అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకున్నాను. మా ఊరి నుంచి నేను చదివే హై స్కూల్ దూరమని అక్కడ ఉండేవాడిని. అమ్మమ్మ ఒక్కతే ఉండేది, నేను తనతో పాటు అక్కడే పెరిగాను.

ఒక ఆదివారం రోజు ఉదయాన్నే నేను అమ్మమ్మ చేసిన రొట్టెల్లో పంచదార వేసుకుని తింటూ వసారాలో కూర్చొని ఉన్నాను. ఆ రెండు రొట్టెలు తిని క్రికెట్టుకి పోవాలన్నది నా ప్లాన్.

“ఉష్ – ఉష్ -ఉష్” అంటూ శబ్దం చేస్తూ, గాబు (నీళ్ల తొట్టి) దగ్గర అమ్మమ్మ చెక్క పీట మీద కూర్చొని బట్టలు ఉతుకుతోంది.ఇంతలో పక్కింటి కొమురమ్మ ఇంటిముందు నుండి నడిచిపోవడం చూసిన అమ్మమ్మ, బట్టలకు కాస్త రెస్ట్ ఇచ్చి-

“ఏమే! కొమురం – ఎక్కడికి బయలుదేరావ్ పొద్దున్నే?”

“మన బడ్డీ కొట్టు బడేసా పెద్ద కొడుకు దుబాయ్ నుంచి చుట్టి (సెలవు)కి వచ్చిండట – దుబాయ్ చద్దర్ తెచ్చిండు.. చానా బాగుందట, చూసొద్దామని పోతున్నా. నువ్వు వస్తావా ?”

సబ్బు నురగ అంటి ఉన్న తన చేతులని బకెట్లో ముంచి తీసి, లేచి నిలబడి, నడుముకు తోపుకుని ఉన్న చీరను కిందకి దించి, చేతులు తుడుచుకుంటూ…

“ఒరేయ్ చందూ! ఎటూ పోమాకా, ఇంటిముందే కూర్చొని ఉండు – కాసేపట్లో వస్తా!” అని చెప్పి, కొమురమ్మతో నడిచి వెళ్ళిపోయింది.

ఆ వెళ్లడం రెండు గంటల తరువాత వచ్చింది. క్రికెట్టుకి వెళ్లడం కుదరలేదన్న కోపంలో నేను వసారాలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను. అమ్మమ్మను చూడగానే –

“ఇప్పుడే వస్తాను అని చెప్పి, ఇంతసేపు చేసావేంటే? అసలే ఇవాళ పక్క ఊరి వాళ్లతో బెట్టు మ్యాచు… నీవల్ల మిస్ అయ్యింది.”

“అబ్బో – నువ్వో గవాస్కరు మరి! ఈ రోజు ఆడకపోతే ఏం కాదులే.”

“అసలు ఎక్కడికెళ్ళావ్ పొద్దున్నే? ఆ చద్దర్ గోల ఏంటి ఇప్పుడు?”

“మన బడ్డీ కొట్టు బడేసా కొడుకు దుబాయ్ నుంచి వచ్చాడు రా, దుబాయ్ చద్దర్ తెచ్చాడు. అది చూడటానికే పోయినం. ఎంత అందంగా ఉందొరా! ఆ చద్దర్! మెత్తని మఖమల్ ఊలు, గులాబీ రంగులో పెద్ద పెద్ద పూలతో డిజైన్, ఎంత ముచ్చ్చటగా ఉందో!” అమ్మమ్మ కళ్ళు ఆశ్చర్యంతో మెరుస్తున్నాయి.

“అదేంటే చద్దరే గా, మనింట్లో కూడా ఉన్నాయ్ గా.”

“పిచ్చోడా ! నీకు తెలీదు లే రా ! – అది దుబాయ్ చద్దర్ రా ! మన దగ్గర దొరకదు. దుబాయ్ కెళ్ళి వచ్చిన వాళ్లే తెస్తారు. మన ఊర్లో దుబాయ్ వెళ్లి వచ్చిన వాళ్ళు తప్పకుండా కొన్ని వస్తువులు తెస్తూ ఉంటారు. దుబాయ్ చద్దర్, టార్చి లైటు, సెంటు… నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఎంత బాగుంటాయో అవి.”

“మరి తాత కూడా గల్ఫ్ పోయొచ్చిండు కదా, నీకోసం తేలేదా?” కుక్కి మంచం మీద ఎగురుతూ అడిగాను.

అమ్మమ్మ మొహం మీద ఒక చిన్న నీలినీడ కదిలింది. మళ్ళీ బట్టలు ఉతకడానికి కూర్చుంది.

“మీ తాత నాకేం తక్కువ చెయ్యలేదురా చందూ. పెళ్లి అయినా రెండో ఏడాదే మీ పెద్దమ్మను, పెద్ద మామయ్యను నా చేతిలో పెట్టి, పెట్రోల్ బావుల్లో పనిచేయడానికి దుబాయ్ పోయాడు. ఆయన అక్కడ కష్ట పడుతూ, డబ్బులు పంపుతుంటేనే ఇక్కడ నేను పిల్లలను పెంచి, పెద్ద చేశాను. ఆ ఐదేళ్లు నేను ఒంటరిగా పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

గల్ఫ్ లో ఐదేళ్లు పనిచేసి వచ్చిన ఆర్నెల్లకే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు. ఆ పెట్రోల్ బావుల్లో తన శరీరాన్ని హూనం చేసుకుని కష్టపడిన ఆ మనిషి గుండె, ఈ కాస్త సుఖాన్ని సహించలేక పోయింది… ఆగిపోయింది.

మీ తాత కూడా వచ్చేటప్పుడు నా కోసం దుబాయ్ చద్దర్ తీస్కున్నడట. కానీ దుబాయ్ ఎయిర్పోర్టులో లగేజీ బరువెక్కువైంది, డబ్బులన్నా కట్టాలి, లేదా కొంచెం సామానన్నా తీసెయ్యాలి – లేదంటే విమానం ఎక్కనివ్వం అని అంటే… ఎం చెయ్యాలో తెలియక మీ తాత నాకోసం తీసుకున్న దుబాయ్ చద్దర్‌ను ఆ ఎయిర్పోర్ట్ లోనే వదిలేసి వచ్చాడు.

అదొక్కటే చిన్న లోటు రా నాకు ! మీ తాత ఎలాగూ దుబాయ్ చద్దర్ తీసుకురాలేదు… నువ్వన్న నాకోసం దుబాయ్ పొయ్యి ఆ చద్దర్ తీసుకురారా చందూ…”

అంటూ పెద్దగా నవ్వుకుంటూ మళ్ళీ బట్టలు ఉతకడంలో మునిగిపోయింది.

“ఉష్ – ఉష్ -ఉష్…”

నేను దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన పదిహేను రోజుల తరువాత, అమ్మమ్మను చూడటానికి అమ్మను తీసుకుని బైక్ మీద బయలుదేరాను. అమ్మమ్మకు ఆరోగ్యం బాగుండట్లేదని ఈ మధ్య అమ్మ చెప్తుంది కానీ, ఏమైందో వివరంగా ఎప్పుడూ చెప్పలేదు, నేనూ  అడగలేదు. వెళ్ళేటపుడు దుబాయ్ నుంచి తెచ్చిన దుబాయ్ చద్దర్, కొన్ని ఖర్జూరాలు తీసుకుని బైక్ మీద బయలుదేరాము. దారిలో ఎప్పుడూ బైక్ మీద నా వెనక కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే అమ్మ, ఎందుకో డల్ గా, ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంది. నేను మాట్లాడుతుంటే, కనీసం జవాబు కూడా ఇవ్వట్లేదు.

అరగంటలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చేరుకున్నాం. బయట నుంచి చూస్తుంటే ఆ ఇల్లు మా అమ్మమ్మ ఇల్లులా లేదు, ఎవరో పరాయి మనిషి ఆ ఇంట్లో ఉన్నట్లు ఉంది. ఇంటిబయట ముగ్గులేదు, ఎప్పుడూ నీటుగా ఊడ్చి, శుభ్రంగా ఉండే ఇంటి వసారా బోసిపోయి ఉంది. ఇంటి చుట్టూ పిచ్చి గడ్డి ఏపుగా పెరిగి ఉంది. ఎవరో ముసలావిడ తలుపు గడప మీద చిన్న గుడ్డని తలగడలా పెట్టుకుని పడుకుని ఉంది.

“ఎవరూ వచ్చింది?” లేచి కూర్చుంటూ అడిగింది ఆ మనిషి.

“ఆయమ్మా !  నేను – ” అమ్మ మాట పూర్తవకుండానే అందుకుంది ఆయమ్మ.

“నువ్వా చిన్నమ్మాయ్ – ఎప్పుడొచ్చావ్ – రా ! లోపలికి  రా.!”

అమ్మ మౌనంగా లోపలి నడిచింది, నాకేమి అర్థం కావట్లేదు. రూంలో ఉన్న రెండు తెల్ల నీల్ కమల్ ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నాం. గాలిలో డెట్టాల్, మందులు, మూత్రం కలిసి ఘాటైన ముక్కి వాసన.

“ఎలా ఉంది అమ్మ?” అమ్మ అడిగింది.

“ఎం చెప్పను చిన్నమ్మాయ్! ఈ మధ్య బాగా చిరాకు పడుతోంది. రెండు నిముషాలు నేను కనపడకపోతే ఏడుస్తుంది. ఇందాక కొట్టుకు వెళ్లి వచ్చేలోపు, దొడ్డికి పొయ్యి, గలీజ్ చేసుకుంది. డైపర్ మార్చి, శుభ్రం చేసి, స్నానం చేయించాను. ఇప్పుడే కొంచెం జావ తాగి పడుకుంది.”

అమ్మ మంచం మీద కూర్చొని, అమ్మమ్మ తల మీద చెయ్యి పెట్టి…

“అమ్మా, అమ్మా – చూడు ఎవరొచ్చారో. దుబాయ్ నుంచి చందు వచ్చాడు.”

అమ్మమ్మ కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసింది. ఆయమ్మా వచ్చి మెల్లగా లేపి పట్టుకుని  కూర్చోపెట్టింది. అమ్మమ్మ మంచం కోడును పట్టుకుని కూర్చొని నా వైపు చూసింది.

ఐదేళ్ల క్రితం దుబాయ్ పోతున్న నాకు ఇంటికి దావత్ కి పిలిచి, ఎంతో ప్రేమతో నాకోసం బగారాన్నం, చికెన్ కూర వండి, తినిపించిన ఆ అమ్మమ్మ కళ్లలో మెదిలింది.అస్సలు పోల్చుకోలేకపోయాను.

ఇప్పుడేమో… నడుము వంగిపోయి, బక్క చిక్కి పోయి ఉంది. పలుచని నైటీలో భుజాల మీద ఎముకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నన్ను చూసి నవ్వింది. మొహం పీక్కునిపోయి ఉంది. తల మీద తెల్లని జుట్టు చెల్లా చెదురుగా ఉంది.

నేను కుర్చీలోంచి లేచి మంచం మీద కూర్చున్నాను. అమ్మమ్మ నా చెయ్యి పట్టుకుని, ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. మాట సరిగా రావట్లేదు.అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు .

నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను.నా  కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాట్లాడలేకపోయాను.నాకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మను ఆ పరిస్థితుల్లో చూడలేక పోయాను.

నా పరిస్థితి అమ్మ గమనించింది. వెంటనే అయమ్మతో

“ అమ్మ కి బీపీ పెరిగినట్లు ఉంది, పడుకోబెడదాం ఆయమ్మ” అంటూ అమ్మమ్మని పడుకోబెట్టారు.

ఎక్కువ సమయం అక్కడ ఉండలేకపోయాను.వెళ్ళేటప్పుడు దారిలో నేను మూగబోయాను. ఈ సారి అమ్మ మాట్లాడుతూనే ఉంది. అమ్మమ్మ అలా ఎందుకైందో చెబుతూ ఉంది.

“ఆర్నెల్ల క్రితం, ఒక రోజు రాత్రి అమ్మమ్మ  బాత్రూం లో జారిపడింది. తొంటి ఎముక విరిగింది. తిరిగి నడవాలంటే ఆపరేషన్ చెయ్యాలి. ఈ వయస్సులో ఆపరేషన్ అంటే కష్టం, ఆపరేషన్ చేసినా నడుస్తుందో లేదో చెప్పలేం అన్నారు డాక్టర్లు. సిమెంట్ కట్టు వేసి ఇంటికి పంపించారు.పెద్ద మామయ్య హైద్రాబాదులో ఉంటాడు, అద్దె ఇల్లు. చిన్న మామయ్య ఖమ్మంలో ఉంటాడు, అతనిదీ అద్దె ఇల్లే. ఇంట్లో పెట్టుకుని చూసుకునే పరిస్థితి లేదన్నారు. అన్ని కుటుంబాల్లో జరిగేదే మన కుటుంబంలో కూడా జరిగింది. ఈ ఆర్నెల్లలో ఎన్నో గొడవలు, పంచాయితీలు జరిగాయి . చివరికి అమ్మమ్మకు ఉన్న ఆ అర ఎకరం పొలం అమ్మి చెరో సగం పంచుకుని, అమ్మమ్మను ఇక్కడ ఊర్లో ఉంచి, ఒక ఆయమ్మను పెట్టి  నెలకు ముప్పైవేలు ఇచ్చి నడిపిస్తున్నారు.”

ఇంటికి చేరుకున్నాక , బండి స్టాండ్ వేస్తుంటే వెనుక తగిలించి ఉన్నకవర్ కనిపించింది.

“అరె! అమ్మమ్మకి ఈ ఖర్జురాలు, చద్దెర ఇవ్వనే లేదు కదా అమ్మా !”

“హ్మ్మ్ – చూసావ్ కదరా అమ్మమ్మని ! ఈ చద్దెర కప్పుకునే , ఖర్జురాలు తినే స్థితిలో లేదులే రా! ”అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది.  ఇది జరిగిన ఒక రెండు నెలల తరువాత, అమ్మమ్మకు సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది.

నేను అమ్మను తీసుకుని అమ్మమ్మ ఇంటికి చేరేసరికి మామయ్యలు, అత్తలు, కొంతమంది బంధువులు అప్పటికే వచ్చేసి ఉన్నారు. చిన్న టెంట్ వేశారు, కుర్చీలు కూడా తెప్పించారు. నాకు వెంటనే కోపం, ఆ తరువాత నవ్వు వచ్చాయి. తొందర… జీవితాంతం ప్రతి చోట, ప్రతి దాంట్లో తొందర. చివరికి చావు దగ్గర కూడా! అది కూడా తమది కాదు, మరెవరిదో.

రెండు గదుల ఆ ఇంట్లోని ఒక గదిలో ఫ్లోరోసెంట్ లైట్ మిణుకు మిణుకు మంటోంది. నవారు మంచం మీద అమ్మమ్మ మూలుగులు బయటకు వినిపిస్తున్నాయి. “గుర్ .. గుర్” అంటూ పిల్లి కూతల్లాంటి వింత శబ్దంతో గురక వస్తోంది. అమ్మ వెళ్లి అత్తయ్య పక్కన ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చుంది.

నేను గోడకు జారబడి నిలబడ్డాను. ఆ గదిలో నిశ్శబ్దం, అమ్మమ్మ మూలుగులు నా చెవుల్లో సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. గదంతా ఫినాయిల్, డెటాల్, మలమూత్రాల వాసన ఘాటుగా కొడుతోంది. మంచం పక్కన కూర్చుని ఉన్న ఆడవాళ్లు ముక్కుకు అడ్డుగా పైటకొంగు పట్టుకుని కూర్చొని ఉన్నారు. అమ్మమ్మ గొంతులోంచి ఆ శబ్దం వచ్చిన ప్రతిసారీ, పక్కనే ఉన్న మా అత్త చిన్న చెంచాతో నీళ్లు తీస్కుని ఆమె గొంతులో పోస్తోంది.

ఇంటి బయట కుర్చీలు వేసుకుని కొంతమంది బంధువులు కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ సూర్యోదయంతో పాటు, ఆ ఇంట్లో ఉన్న మా అమ్మమ్మ అస్తమయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు.సమయం భారంగా గడుస్తోంది. అప్పటికే అర్థరాత్రి దాటింది. నేను కాస్త గాలి పీల్చుకుందామని బయటకు నడిచాను.

“హైదరాబాదులో చదువుతున్న చిన్న మనవరాలు వచ్చి నీళ్లు పోస్తే గాని, ప్రాణం విడిచేలా లేదు. ఎక్కడిదాకా వచ్చిందట చిన్నూ?”

“ఇందాకే ఫోన్ చేశాను. ఖమ్మం దాటిందట, మరో గంటలో వచ్చేస్తుంది.”

బయట కూర్చొని ఉన్న మామయ్యలు మాట్లాడుకుంటున్నారు. నేను కాస్త దూరంగా, ఒంటరిగా కూర్చున్నాను. మనసంతా దిగులుగా ఉంది, అమ్మమ్మతో నా జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. అమ్మమ్మకు నేనేం చెయ్యలేదా  , చెయ్యగలిగి కూడా చెయ్యలేకపోయానా ?

గంట తరువాత ఒక కారు ఇంటి ముందు వచ్చి ఆగింది. మా అమ్మమ్మకు ఇష్టమైన మనవరాలు వచ్చింది. వచ్చి రాగానే ఆమెను లోపలికి తీసుకెళ్లాడు పెద్ద మామయ్య.

“అమ్మా, చూడు నీ ముద్దుల మనవరాలు వచ్చిందే – నీళ్లు తాగిస్తోంది…”

“నానమ్మ, నానమ్మ – నేను చిన్నూని” అంటూ ఆమె కన్నీళ్ళతో మాట్లాడుతోంది. ఒక్కసారిగా వాతావరణం ఉద్విగ్నంగా మారింది, అందరి మొహాల్లో తెలియని బాధ.

చిన్నూ అమ్మమ్మ గొంతులో నీళ్లు పోసి, అప్పటికే గంట దాటింది. ప్రాణం పోలేదు. బంధువుల్లో మెల్లగా అసహనం మొదలైంది . కాసేపటికి అమ్మమ్మ గురకలు ఎక్కువయ్యాయి. ఆమె చివరి క్షణాల్లో ఉంది. ప్రాణం గిలగిలలాడుతోంది, కానీ ఆ శరీరాన్ని వదలలేకపోతోంది. ఏదో తెలియని లోటు, వెలితి ఆమెను ఆపుతున్నట్లుంది.

“ఇంకేం కావాలె, ఎనభై ఏళ్ళు బతికినవ్ – కొడుకులు, కూతుళ్లు , మనవళ్ళతో  సంతోషంగా బతికినవ్… ఇంకేం తక్కువైంది నీకు? ఎందుకు ఇలా కష్ట పడ్తున్నావ్, హాయిగా వెళ్ళిరా …” ఆ మాట పూర్తవ్వకముందే మామయ్య గొంతు పూడుకుపోయింది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా వెనక్కు తిరిగి, గోడమీద చెయ్యి పెట్టి చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు . అప్పటిదాకా ధైర్యంగా, గంభీరంగా ఉన్న పెద్ద మామయ్య అలా  ఏడవడంతో అక్కడ ఉన్న వాళ్లందరికీ ఏడుపొచ్చింది .

నాకు మనసులో ఏదో తెలియని బరువు. బతికున్నంత కాలం ఆ ఇంటి కోసం, బిడ్డల కోసం అలుపు లేకుండా పనిచేసిన అమ్మమ్మ . మంచం పట్టగానే… లెక్కలు మారిపోయాయి. ఉన్న అర ఎకరం పొలం అమ్మి, పంపకాలు చేసుకున్నాక… అమ్మమ్మ ఆరోగ్యం కూడా చకచకా క్షీణించిపోయింది. అప్పుడు ఆస్తుల కోసం గొడవ పడ్డ మనుషులే, ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే… అసలు ఈ బంధాలంటే ఏంటి? ఈ ప్రేమలు, ఆప్యాయతలు కూడా అవసరాల చుట్టూనే తిరుగుతాయా? అనిపించింది. ఆ గదిలో ఉండలేకపోయాను.

బయటకు వెళ్లి వస్తాను అని చెప్పి, బైక్ స్టార్ట్ చేసుకుని రోడ్డెక్కాను. తెల్లవారబోతోంది. ఆ చల్ల గాలిలో ఒక మూడు కిలోమీటర్లకు పైనే వెళ్ళాను. కాస్త తేలికపడ్డాను .  అలా బైక్ మీద పోతూ ఉంటె ఒక్కసారిగా నా మైండ్లో ఎదో తట్టింది. వెంటనే బైక్ స్పీడ్ పెంచి, మా ఇంటికి చేరుకున్నాను. ఇంట్లో సిమెంటు బీరువా కింద అరల్లో, నేను అమ్మమ్మ కోసం తెచ్చి , మర్చిపోయిన  ‘దుబాయ్ చద్దెర’ను బయటకు తీశాను. దాన్ని దులిపి, బండి మీద పెట్టుకుని వాయువేగంతో అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాను.

లోపలి వెళ్లి,దుబాయ్ చద్దెర మడత విప్పి ఆమె మీద కప్పాను. “అమ్మమ్మా… నేను చందూని ! నీకోసం నేను దుబాయ్ నుంచి చద్దర్ తెచ్చాను.  నువ్వు చిన్నప్పుడు నాకు చెప్పేదానివి కదా అచ్చం అలాంటిదే! తెల్లని రంగు, సుతి మెత్తని మఖ్మల్ ఊలు, గులాబీ రంగులో పెద్ద పెద్ద పువ్వుల డిజైన్ -” అంటూ తన ఎముకల్లాంటి  చేతిని నా చేతిలోకి తీసుకుని ఆ చద్దర్ మీద అలా నిమురుతూ

“ బాగా చలిగా ఉంది కదా, ఇప్పుడు వెచ్చగా ఉంటుంది… హాయిగా పడుకో. నేను ఇక్కడే ఉన్నాను…” అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని మంచం మీదే కూర్చున్నాను.

ఆమె శరీరంలో ఒక చిన్న కదలిక. మొహంలో ఒక తెలియని ప్రశాంతత. పదిహేను నిమిషాల తరువాత గురకలు ఆగిపోయాయి. అమ్మమ్మ వెళ్ళిపోయింది. ఆ దుబాయ్ చద్దెర వెచ్చదనంలో ఒదిగిపోయి… శాశ్వత నిద్రలోకి జారుకుంది.

*

సంజయ్ ఖాన్

నా పేరు సంజయ్ ఖాన్. ప్రస్తుతం రియాద్, సౌదీ అరేబియా లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఖాజీపురం గ్రామం.

చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , కథలు , కవిత్వం ఇష్టంగా చదువుతున్నాను, ఇవి నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎప్పుడు కథలు చవడమే గాని రాయాలని అనుకోలేదు . అనుకున్న నేను రాయలేను ,లేదా రాసేంత సాహిత్య జ్ఞానం నాకు లేదులే అని తప్పించే వాడిని. కానీ గల్ఫ్ దేశాల్లో నేను చూసిన , మాట్లాడి తెలుసుకున్న మన తెలుగు వాళ్ళ వ్యధలు, కథలు నన్ను కదిలించి ఈ కథలు రాయడానికి నన్ను ప్రేరేపించాయి. పుస్తక పఠనంతో పాటు ట్రావెలింగ్, రన్నింగ్ నా హాబీస్.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Story chala bagundi, you are addressing different aspects of life thorough your stories, each story has diff type of perspective, pain. Ee story lo manishi ki unde chinna chinna desires and their importance , typical family relations ni baga describe chesav sanjay . Waiting for more and more stories from you..

  • సంజయ్ గారు..
    నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఎప్పటి లాగానే ఇ కథ కూడా కళ్ళకు కట్టినట్లు వివరించారు.. మా అమ్మమ్మ గారు గుర్తొచ్చారు.. అందరికీ అమ్మమ్మ కోరిక తీర్చాలి అని ఉంటుంది.. కానీ అందరికీ ఆ అవకాశం దొరకదు.. చందు తపన చాలా బాగా వివరించారు.. మరిన్ని కథల కోసం ఎదురు చూస్తున్నాం . ధన్యవాదాలు..

  • ఈ కథ చదివి మనసు ద్రవించింది. అమ్మమ్మ దుబాయ్ చద్దర్ కప్పుకొని ప్రాణాలు వదలడం కన్నీళ్ళు తెప్పించింది. మెత్తని మఖ్మల్ ఉన్ని దుబాయ్ చద్దర్లు మా ఇంట్లోనూ ఉన్నాయి. మా బామ్మర్దులు తెచ్చిన ఆ చెద్దర్లు చాలా ప్రత్యేకమైనవి. ఈ చలికాలంలో బాగా వెచ్చన. వాటిని తీసుకురావడానికి దుబాయ్ లో పడే పాట్లను చదువుతుంటే మా బామ్మర్దులే కనిపించారు. ఎప్పుడొస్తే అప్పుడు చద్దర్లు తెస్తుంటారు. అలాంటివి కాపీ పేస్ట్ చద్దర్లు ఇక్కడా దొరికినా దుబాయ్ చద్దర్లకు సాటి రావు. దుబాయ్ చద్దర్ ను అమ్మమ్మ చుట్టూ కథ అల్లి మెప్పించిన సంజయ్ ఖాన్ కు అభినందనలు .

  • Another amazing story from sanjay khan…..very emotional and beautiful ………very beautifully written and narrated…, reading your stories nothing less than an emotional roller coaster ride…..the way every character of the story connects to reader is truly amazing…..keep up your inspiring work…… already waiting for your next story…..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు