ఝుల్ కాన్వాసు 

ఊబంతి కొండల నడుంవంచి   గాల్లోకి ఎగరక ముందే

ఝుబడి కళ్ళు కప్పి  మమ్మల్ని ధోతి బట్టలో చుట్టి

షికారుకి పోతది మా నాయనమ్మ

 

షికారు నుండి వస్తూవస్తూ

కాల్చిన జీడికాయలు, సీతాఫలాలు

రంగురంగుల పూసలు, ఊలు దారాల ఉండలు

దోసిళ్ళ  నిండా అద్దాలతో

నులకమంచం పైన  తెల్లని నెమలిలా వాలిపోతది

 

రాత్రి కిరసనాయిలు దీపం నీడలో కూర్చుని

ఐదడుగుల  ఝుల్  కాన్వాసు పరుచుకుంటది

తను కప్పుకున్న  ఝుల్ ని

మా కలలకి పైకప్పు గా  కప్పి

రంగుల పూసల్లో నిశ్శబ్దాన్ని కలిపి

సూది కుంచె గొంతు సొరంగాల

నుండి ఊలు దారాలతో సర్కస్ ఫీట్లు చేయిస్తది

కాన్వాసు దేహాన్ని కుడుతూ కాలానికి జోల పడుతది

 

4.

ఆటలాడదు పాట పాడదు కథలు చెప్పదు

ఝుబడిలోనే గ్రహణ దీపమై ఝుల్ ని కుడుతుంటది

కొన్నికొన్నిసార్లు

తను కుట్టే అద్దాల నుండి కిరణాలు నింగికెగిరి మేఘాల్ని  చీల్చి మంచు పొడిగా నేలకు చల్లుతాయి

రంగుల పూసలు నక్షత్రాల్ని మిణుగురులు గా మారుస్తాయి

 

అక్క చెబుతుంటుంది

గుడిసెకి ఆకలేసి నాయనమ్మని మింగింది

నేల రోజులు ఆ గుమ్మం మౌనం వహిస్తుంది

నెలరోజులు చీకట్లు నాయనమ్మ కొప్పులో వెంట్రుకలుగా  అల్లుకుంటాయి

వెలుతురులు

తన చేతివేళ్ళ ఉంగరాల బిళ్ళల పై పూతగా మారుతాయి

ఝుల్ కాన్వాసు పైన కుట్టిన అద్దాల్లో  నదులు పొంగి పొర్లుతుంటాయి

పూసల్లో ఆవులు మేస్తుంటాయి

పూసలకు బయిట జింకలు గెంతుతుంటాయి

ఎంబ్రాయిడరి గీతల్లో అమ్మలందరూ నర్తిస్తుంటారు

నాయనమ్మ  కుట్టిన ఝుల్లో  మా జాతి చరిత్ర నిక్షిప్తమయ్యిందని అక్క చెప్పింది.

*

పెయింటింగ్: సత్యా బిరుద రాజు 

Avatar

రమేష్ కార్తిక్ నాయక్

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాయనమ్మ కాన్వాస్ …ని చాలా బాగా చెప్పినవ్ కార్తీక్… సత్య ఆర్్ట చాలా బాగుంది.

  • వహ్వా! ఒక జాతి చరిత్రను ఒక వ్యక్తి జీవనయానంలోంచి చూపించారు… టెలిస్కోపు లోనించి అంతరిక్ష దర్శనం లా… చాలబాగుందండీ… నాయనమ్మ కుట్టిన ఝల్ ఇక నా మేనిపై ఎపుడూ ఉంటుంది… వెచ్చని ఆప్యాయతతో….

  • ఎంత బావుందండీ….మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన కవిత.

  • రంగు రంగుల పూసల్లో మిణుగురు నక్షత్రాలు…అద్దాలసముద్రాలూ మంచు జల్లే కిరణాలు.నాయనమ్మ ని మింగేసిన గుడిసె.ఝల్ అంటే ..‌.ఒక జీవితపు కేన్వాస్.

  • ఘల్‌ఘల్‌మనే చిరుమువ్వల మోతలా వుంది నాయనమ్మ ఝల్ కాన్వాసు కవిత. భలే!

  • రంగుల పూసలు నక్షత్రాల్ని మిణుగురులు గా మారుస్తాయి…..చాలా బావుంది కార్తీక్ గారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు