‘జొరేసావు కత’ చెప్పిన సుందర్రాజు!

సుందర్రాజు ఏ కథ చదివినా ఇంతే! బోడెద్దు కత, గుండేలక్క కత … నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద వరకు. ఆయన కథ ఏది కనిపించినా ఒదలకండి.

వినండహో!

ఇందుమూలంగా, యావన్మందికీ తెలియచేయడమేమనగా!

(ఇది నాగప్పగారి సుందర్రాజు ‘ఆత్మ’ ఘోష)

‘‘కులం సర్వస్వం అయినచోట, కులం తప్ప నిజం లేని చోట, కులం ఒక ఆయుధం అయిన చోట .. భారతావనిలో కులం నిజం కాదు .. పచ్చి వాస్తవం! కులం చాలా స్పష్టంగా కనిపించే దృశ్యం. కులాన్ని కొలమానంలో కొలవచ్చు. కులాన్ని తూకం వేయవచ్చు. కులాన్ని పదునుచేసి విత్తుచేసి పంట తీయవచ్చు. కులానికి ప్రాణం ఉంది. కులం మాట్లాడుతుంది. కులం వింటుంది. కులం చూస్తుంది. కులం చేయని పని లేదు. కులం ఏదైనా చేయగలదు.. పశువులను పూజించే నేలలో, పందిని దశావతారాల్లో చేర్చిన పుణ్యభూమిలో, చెప్పులకు పట్టాభిషేకం చేసిన ఈ పవిత్ర దేశంలో .. మనుషులను అంటరానివారుగా నిర్ణయించి కులసరిహద్దులు గీసిన ఈ సమాజంలో .. ఒక దళితుడిగా పుట్టడం వెనక ఎంత నరకం దాగుందో …’’

‘నాగప్పగారి సుందర్రాజు’ అక్షరాలతో కొట్టిన ఈ నిజాల నిప్పుల తప్పెట మోత వింటే కొంత అర్థం అవుతుందేమో!

అందుకే, ఆయన రాసిన ‘జొరేసావు కత’తో మీ ముందుకు వచ్చాను. ఇప్పటికీ ఈ కథను పదే పదే చదువుతుంటాను! ఎప్పుడు చదివినా సుందర్రాజు శిల్ప చాతుర్యం ఒక పులకరింత. ఉవ్వెత్తున ఎగసిపడే ఆనందలహరి. మనసు గంతులు వేయడంతో పాటు, ఆ అక్షరాల వెనక దాగిన విషాదం మనోవేదనకు గురిచేస్తుంది. ఏక కాలంలో భిన్న పార్శ్వాలు జమిలిగా నన్నూపిరాడనివ్వవు.

కర్నూలు జిల్లా, ఆదోని; ఆలూరు మండలాల పరిసర ప్రాంతీయభాషలో రాయబడ్డ ‘మాదిగోడు’ దళిత కథల్లోని సుందర్రాజు భాషకి ఫిదా అయిపోతాను. వీటిని ఎన్నిసార్లు చదివినా అదే మధురం, గుప్పిట నిండా మైనం.. జాలువారే తేనె చుక్కల ధార! ఆ జీవ భాషలో ఫిడేలు, షెహనాయ్‌, సారంగి, వీణ, తబలా, తప్పెట .. సర్వ వాద్యాలు! అవి పలకని రాగం లేదు. సప్తస్వరాలు వినిపిస్తాయి. అంత అందమైన జీవభాష!

ఇక అసలు కథా విషయానికి వస్తే ..

సుందర్రాజు నాలుగో తరగతి చదివినప్పటి సంగతి ఇది. ఐదో తరగతి చదివే తన అక్కతో పాటు జడ వేసుకుని బడికి బయల్దేరాడు. స్కూల్లో పిల్లలు లేరు. దూరంగా చింతచెట్టు చుట్టూ గుమిగూడారు. చింతచెట్టు కొమ్మలకు వేలాడుతోంది జొరేసావు శవం! జొరేసావు బలవంతపు చావుకుగల అసలు కారణాన్ని ఆయన కోడలు పోలీసుల ముందు చెప్పినా .. అది మనుషులకు అర్థమవుతుందే కాని, కావరంతో బలిసిన కులానికి అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా కానట్టే!

కథలో ఆ చావు ఒక ఘట్టం మాత్రమే. కాని, ఆ కుర్రాడు బడికి బయల్దేరి, సాయంత్రం ఇంటికి వచ్చేవరకు జరిగిన సంఘటనల్ని ఒక డాక్యుమెంటరీలా, కెమెరా కన్నుతో దృశ్యమానం చేస్తాడు సుందర్రాజు.

మాదిగల్ని ముట్టుకోనివ్వని ఆ ఊరి మంచినీళ్ల బావిలో కసికొద్దీ ఉమ్మేయడం, క్లాసులో మాస్టారు తంతే సుందర్రాజు వెళ్లి ‘అగ్ర’కులం పిల్లలమీద పడిపోవడం.. వాళ్లంతా ఆ శీతాకాలం సాయంత్రం ‘మాదిగోడు’ ముట్టిన పాపానికి వీధిలో చన్నీళ్ల స్నానం చేయడం ..

సుందర్రాజు మాటల్లో మీరే చదవండి!

‘‘కర్నుము అయివారు తంతే తన్నేడు కాని ఈరారెడ్డి మనుమురాలు వుమాదేవి మింద నేను పడితే జంగమయ్య ఈరుబద్రుసామి కొడుకుతాకి నా ‘ముట్టు’ సేరిడిసేద.. కరెంటు సాకులక్క. యట్లాగయితేనేమి ఈ పొద్దు యంతమందికి బజార్లో నిలబడి సన్నీళ్లు పోసుకునే పని బెట్టిడెసెన. ఇపుడసులే సలికాలము. బజార్లో నిలబడి యేడుసుకుంట నీళ్లు పోసుకునల్లంటే యేమన్న సిన్నపనా. యెవురన్నా సూసినోళ్లు యేమయ్యేద్నాని అడిగితే ఈ పొద్దు బళ్లో మాదిగ రంగన్న కొడుకు ముట్టుకునేన్నంటాని సెప్పల్ల. పెదివి దాటితే పెన్నేరు దాటినట్లంట. ఆ పొద్దల్లా వూరంతా నా పేరే సెప్పుకుంటారంటాని లోపుల సొంతోసుము అయితాంటే సంకరప్ప అయివారు తన్నింది మరిసిపొయ్యి వుమాదేవి మిందినుంచి పెయికిలేసి దుమ్ము ఇదిరిచ్చుకుని కిందబడిన నా బుక్కులు తీసుకుంటూ వొగసారి వుమక్క మగములోకి సూసి లటుక్కున కన్నుగొట్టి పారిపొయ్యి యేమి యరుగునట్లు యెనిక్కి కుసునేన.’’

సుందర్రాజు అక్షరాలు కితకితలు పెడతాయి. గిలిగింతలు కలిగిస్తాయి. అతడి భాషా సౌందర్యం మత్తెక్కిస్తుంది. మరులు గొలుపుతుంది. మోహం పుట్టిస్తుంది. ఒకవైపు కుల వివక్ష ఒక్కో కణాన్ని రాజేస్తుంటే, మరోవైపు జీవితాన్ని ఇంత హాస్య చతురతతో, కుశాలుగా ఎలా చెప్పగలుగుతున్నాడని అచ్చెరువొందుతాం! అక్షరాల్లో అంతఃస్రవంతిగా సాగే ఆర్తి, ఆవేదన మనషన్నవాడ్ని కుదేల్ని చేస్తుంది.

సుందర్రాజు ఏ కథ చదివినా ఇంతే! బోడెద్దు కత, గుండేలక్క కత, సొట్టకాళ్ల సద్దుగుణుము కత, సెలివోడి కత … నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద వరకు. ఆయన కథ ఏది కనిపించినా ఒదలకండి. కతలే కాదు, ‘చండాల చాటింపు’ కవిత్వం కూడా దాటేయకండి. అవి మనల్ని నిలదీస్తాయి! ప్రశ్నిస్తాయి! మనుషుల్లా మార్చే ప్రయత్నం చేస్తాయి!!

ఇక కథలోకి వెళ్లండి!

జొరేసావు కత

*

గొరుసు

గొరుసు

కథల ఆనుపానులన్నీ తెలిసి, కలం మాత్రం విప్పని పిసినిగొట్టు గొరుసు. తెలుగు కథా సాహిత్యానికి walking encyclopedia.

22 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అలవోకగా కథలోకి లాక్కుపోయి, సినిమా హాల్లోని సీట్లో కులేసినట్లు, మన భుజం మీద చెయ్యేసి ఏమి తెల్వనట్లు కథలోకి గుంజుకపోయి ఆ నాల్గో తరగతి పోరనికి జతజేసి ఇడిసిపెట్టి పోయిండు గొరుసు.
  అద్భుతమైన అనుభవాన్నిచ్ఛే, ఆలోచన రగిల్చే కథ ని అందించినందుకు….
  Thank you.

  • స్పందిస్తావనుకోలెదు కొట్టం 🙂 మెదడుతో కాకుండా మనసుతో చదువుతారు మీరు . అందుకే మీ కథలు సైతం తడిగా ఉంటాయి. ధన్యవాదాలు.

 • సుందర్రాజు మనల్నీ తననూ మోసం చేసి వెళ్ళిపోవడమే బాధాకరం

  • ధన్యవాదాలు సార్. అవును. సుందర్రాజు ఉండి ఉంటే మరెంత గొప్ప సాహిత్యం వచ్చేదో! ఆయన కేవలం రచయిత మాత్రమే కాదు కులం కుంపటి పెట్టిన వాళ్ళ గుండెల్లో పిరంగి కూడా!

 • భారతీయ కులవ్యవస్థలో అట్టడుగున కొట్టుమిట్టాడుతున్న మాల, మాదిగల వేదనాభరిత జీవితాలను ఒకపక్క చిత్రిస్తూనే, అలాగని విషయాన్ని మరీ గంభీరంగా చెప్పకుండా, ఒక నాలుగో తరగతి పిల్లాడి కోణం నుంచి చెప్పడం ‘జొరేసావు కత’లోని గమ్మత్తు. అది నాకు బాగా నచ్చింది. ఈ కథాకాలం దాదాపు అయిదారు దశాబ్దాల క్రితం అని నాకు అన్పించింది. నేను చదువుకునే రోజుల్లో సమస్య ఇంత తీవ్రంగా లేదు. అందుకని కుల సమస్య పూర్తిగా రూపుమాసిపోకపోయినా, కనీసం దాని తీవ్రత చాలా వరకూ తగ్గిందనుకున్నాను. కానీ ఈ మధ్యే ఉత్తర భారతదేశంలోని ఏదో ప్రాంతంలో దళితుడు తన పెళ్లికి బ్యాండ్ మేళం పెట్టించుకున్నాడని ఆగ్రహించిన అగ్రకులస్తులు, ఆ దళితుల తాలూకు బావిలో కిరోసిన్ కలిపారని మీడియాలో వార్త వచ్చింది. ఎంత దారుణం, ఇంకా ఏ కాలంలో ఉన్నాం మనం… అని చాలా బాధపడ్డాను. అంటే ఈ సమాజానికి కనువిప్పు కలిగించే ఇలాంటి కథలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకత ఉంది.
  ఇక భాష విషయానికొస్తే… ముందుగా సాహిత్యాన్ని ‘వ్యవహారిక భాష’లోకి తీసుకు రావాలన్న ఆలోచన వచ్చిన వారికి వేవేల నెనెర్లు. అదే ఈ కథను ప్రామాణిక భాషలో చదివితే, మనపై అంత ప్రభావం చూపుతుందా? వ్యవహారికంలో రాయబట్టే అప్పటి వాతావరణాన్ని కళ్లముందుంచగలిగారు రచయిత. కథ కాలక్షేపానికి కాదు, దానికి ప్రయోజనం ఉండాలి అని బలంగా నమ్మే గొరుసు గారు కథని పరిచయం చేస్తేనే అదెంత మంచి కథో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే షరా మామూలుగా కథా రచయితకు, గొరుసు గారికి ప్రత్యేక క‌ృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

  • ధన్యవాదాలు మురళీ . కథను రాయడం సరే, దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం ఉత్తమాభిరుచికి దర్పణం. నా చిన్నతనంలో ఒకసారి మా ఇంటికి అడుక్కోవడానికి వచ్చిన మాదిగ అతడి గొంగళి నాకు తగిలిందని మా అమ్మ బిందెడు నీళ్ళు నా తల మీద కుమ్మరించ్చింది . ఆ పదేళ్ళ వయసులో ఆ వివక్ష అర్థం అయ్యేది కాదు . నిజం మురళీ .. సాహిత్యం ఒక గొప్ప సంస్కారం నేర్పింది . లేకపోతే ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉండేది. నీ స్పందనకు మరోసారి కృతజ్ఞతలు .

  • మీరు వినలేదేమో. పెళ్లి చేసుకుని గుర్రం.మీద ఊరేగితే దళితులు కూడా ఇలా ఊరే గటం సహించలేక వారిపై దాడి చేశారు అంబేడ్కర్ పై పాట ringtone గా పెట్టుకుంటే దాడి చేశారు.వార్ పెళ్ళిళ్ళలో నెయ్యి వడ్డిస్తే నిప్పులు కక్కారు.ఇంకా ఇలా ఎన్నో ఈనాటికీ.

   • అవును రవి గారూ…వింటేనే ఇంత బాధ కలుగుతుంది కదా.. ఆ వివక్ష ను ఎదురుకున్న వారు మరెంత రంపపు కోతకు గురై ఉంటారో ఊహించలేం 😥

   • అవును రవి గారూ, నిజం చెప్పాలంటే మళ్లీ ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.

 • అత్యంతసహజంగా రచయిత వాడినఈ కథలోని భాష, శైలి గొప్పగా ఉంది.కులం తాలూకు ప్రభావాన్ని చిన్ని మెదడులో నిక్షిప్తం చేసుకున్న విషాదభరితసందర్భాన్ని అక్షరీకరించిన తీరు కదిలించింది.నాటినుండి నేటివరకు కులంచేస్తున్న గాయాలు పచ్చి పుండ్లే. కథ ఆత్మను అంతే సహజంగా ఆవిష్కరించిన గొరుసు గారికి ధన్యవాదాలు అని చెప్పడం చిన్నమాటే అవుతుంది.ఇలాంటి అత్యుత్తమ కథల్ని అత్యున్నతస్థాయి లో ఇష్టంగా పరిచయం చేయటం వల్ల గొరుసు గారు కథల్ని రాయటం ఆపేసినలోటు కొంత తీరుతున్నట్లే

   • రమణా .. నాకు తోచిన, మంచి అనిపించిన కథలు పరిచయం చేయడంలో ఒక ఆననదం ఉంది. సభ్య సమాజం నుండి శిక్షణ పొందినా రాని సంస్కారం, తోటి మనిషి పట్ల చూపించే ప్రేమ – ఒక్క మంచి కథ చదవడం వల్ల సాధ్యం కావచ్చు అనుకుంటా . ఇదే నాకు తెలిసిన సమాజ సేవ కూడా 🙂 అందుకే కొద్దిగా కష్టమైనా వెతికి పరిచయం చేయాలనుకుంటున్నాను. మీ స్పందనలు నన్ను మరింత పుటం పెడతాయని నమ్ముతూ , ధన్యవాదాలతో …

 • మాదిగోడు కథల సంపుటిని నాలుగైదు సార్లు అటు ఇటు తిరగేసి చదివిన రోజులు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో సుందర్రాజు మా సీనియర్‌ అని తెలిసి ఆనందించిన రోజులు. కథలోవస్తువు,శిల్పం,భాష..ఇలా అన్నింటిని గమిస్తూ.. అబ్బా అన్న ఏం రాశాడు.. అని వాస్తవికత వెనక కన్నీళ్లను, వెటకారంలోని హాస్యాన్ని మనసుకు పట్టించుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయ్‌ గొరుసుగారు… మీకు ధన్యవాదాలు…

  • అవును రవీంద్రా.. ఆ వాస్తవికత వెనక కన్నీళ్ళనీ, వెటకారం వెనకున్న హాస్యాన్ని ఆస్వాదించడానికి గొప్ప మనసుండాలి. అది మీలో ఉంది . అందుకే స్పందించారు. మరొకరికి పట్టుబడని భాష సుందర్రాజుది. అక్షరాల్లో జీవితాన్ని నిజాయితీగా ఆవిష్కరించిన గొప్ప రచయిత ఆయన. మీ స్పందనకు మీకు ధన్యవాదాలు .

 • ఇది కథ కాదు. మా బతుకు. కథ రాయడానికి పుస్తకాల్లోకి కాదు జీవితంలోకి చూడాలి అన్న ఎరుక కలిగిన కథ ఇది. ఈ కథ చదువుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. కథలోని భాష, జీవితం అన్నీ సరిగా కుదిరిన మహాకావ్యం ఇది.
  ఇక మా గొరుసన్న ప్రేమ కథలోని సజీవత్వాన్ని అద్భుతంగా పరిచయం చేసింది. నేనెప్పుడూ చెప్తుంటాను…మనం ఏ కులంలోనైనా పుట్టి ఉండవచ్చు.కానీ, ఎట్లా బతికామన్నదే ముఖ్యం. అట్లా దళితుల పట్ల వారి ఆర్తి పట్ల ఒక కన్సర్న్ ఉన్న గొప్ప వ్యక్తిత్వం గొరుసు అన్నది. నిజానికి ఇటీవల సుందర్రాజన్న ను సాహిత్యంలోకి కొంత పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆయన ఛాండాల చాటింపును ఈ మధ్యే పునర్ముద్రించారు. ఈ సమయంలో సుందర్రాజన్న గొప్ప సాహిత్యాన్ని పరిచయం చేస్తూ గుండెతడితో గొరుసన్న పలికిన మాటలు మమ్మల్ని కదిలించాయి.

  నిజమే గౌతమ బుద్ధుడు చెప్పినట్టు…
  మనుషుల మానసిక పరివర్తన వల్లనే సంఘ పరివర్తన సాధ్యమవుతుంది. ఆ పనిని సాహిత్యం కూడా చేస్తుందని నమ్మినం కాబట్టే ఈ దారిలో ముందుకు సాగుతున్నాము. కథ తప్పకుండా ఆలోచింపజేస్తుంది. ఇలాంటి మంచి కథ అయితే మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తూ వెంటాడుతూనే ఉంటుంది. సుందర్రాజన్న సాహిత్యంలోనే కాదు, ఆయన జీవితంలోనూ ధిక్కారం ఉన్న విషయం ఈ కథ ద్వారా మరోసారి నిరూపితమైంది. సుందర్రాజన్నలో ఒక గొప్ప వ్యంగ్య తాత్వికుడు ఉన్నాడు. విషాదాలను కూడా నవ్వుతూ చెప్పగలిగే మహా కళాకారుడు దాగి ఉన్నాడు. వివక్షల కింద నలిగిపోతున్న బతుకును చాలా ఒడుపుగా పట్టుకున్నాడు. అందుకే నేను నా అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథల సంపుటి అంకితంలో ఆయనను భాగం చేయకుండా ఉండలేకపోయాను.

  సుందర్రాజన్న లేకపోవడం ఇవాళ మా దళితులకే కాదు తెలుగు సాహిత్యానికి కూడా తీరని నష్టం. ఆయన ఉండి ఉంటే ఇవాళ్టి కుల విపరీత పోకడలను కూడా ఏకరువు పెట్టేవాడు. మంచి కథను మనసుతో పరిచయం చేసిన గొరుసన్నకు మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రచురించిన సారంగకు, అఫ్సర్ సార్ కు షుక్రియా…
  -పసునూరి రవీందర్

  • రవిందర్,
   నువ్వన్నది నిజమే, సుందర్రాజులో విషాదాలను సైతం నవ్వుతూ చెప్పగలిగే గొప్ప కళాకారుడు ఉన్నాడు. వివక్షల కింద నలిగిన బతుకుల్ని చాలా ఒడుపుగా పట్టుకుని , అక్షర తూటాలుగా మార్చి కులం గుండెలో విస్ఫోటనం సృష్టించగలరు.
   నీ స్పందనకు ధన్యవాదాలు.

 • గొప్ప కథకి గొప్ప పరిచయం. గొరుసు పరిచయ వాక్యాలు మనల్ని కట్టేసి కథలో పడేస్తాయి. జగదీశ్వర్ మీకు కోటి దండాలు

  • ప్రసాదమూర్తి గారూ .. కోటి దండాలా!! చాలా ఎక్కువండీ 🙂
   అవన్నీ సుందర్రాజు గారికే చెందుతాయి.
   స్పందించినందుకు నమస్కారాలు మీకు.

 • కథ చాలా బాగుంది. బాగుంది అనలేను; చాలా బాధేసింది, ఒక రకంగా అనిపించింది. మాయావిడైతె ఏడ్చేసింది. అసలు ఒక మనిషికి ఏం హక్కుంది ఇంకో మనిషి ఎలా బ్రతకాలో, ఏం చేయాలో అని చెప్పేటానికి. దిక్కుమాలిన కులం. కుల/ మత గజ్జి అనేది ఇప్పుడప్పుడే మానదు. కానీ ఇలాంటి కథలు చదవటం వలన నెమ్మదిగానైనా మార్పొస్తొందని కోరిక.

  మనం ఎంతో మందిని కలుస్తూంటాము. డిగ్రీలు చదివేసి, దేశాలు తిరిగేస్తారు కానీ పరిచయం అవుతూనే వాళ్ళు ముందుగా తెలుసుకో దలిచేది మన కులమేంటని. ఈ కాలంలో ఎలా పనికొస్తుంది నీకది. కులానికీ అలవాట్లకి, వృత్తికి, ఆహార వ్యవహారాలకీ మధ్య సంబంధం తెగిపోయింది. నీ కళ్ళముందున్న మనిషితో మాట్లాడి, మెలిగితే తెలుసుకోలేనిది కులం వల్ల ఏం తెలుసుకుంటావు. మన-పర అని ఏర్పర్చుకో కానీ అది ఆలోచనల, లక్షణాల, ప్రవర్తన, ఇష్టాల వలన ఏర్పడాలి కానీ ఏ ఇంట్లో పుట్టావో అన్న దాని బట్టి ఉండకూడదు కదా.

  కరెక్టే, నాకేం హక్కుంది ఇంకోళ్ళని జడ్జి చేయటానికి, ఎవరెలా బ్రతకాలో చెప్పటానికి. అయినా నేను చెప్పదలచానంటే నేను సమాజం ఎలా బ్రతకాలి అని చెబుతుందో ఆ సిద్ధాంతాల పరంగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నాను గనక. కొంత మంది లాగా నా కుటుంబానికో రూలు, సమజానికి ఇంకో రూలు అని ఉండలేక.

  కథలోని యాస ఎంత బాగుందో. తెలుగులో ఇన్ని తీర్లు, వన్నెలుండటం మన అదృష్టం. మంచి కథలని పరిచయం చేస్తున్నందుకు ఎన్నో కృతజ్ఞతలు గొరుసు గారు.

  • ధన్యవాదాలు శిరీష్ ఆదిత్య గారు.
   శిరీష (దిరిసెన) కుసుమం మాదిరే మీ హృదయం కూడా కోమలమని మీ కామెంట్ చదివాకా అర్థమయ్యింది. మీరన్నది నిజమే. మనం ఎవరం ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడానికి !
   మనకు పుట్టిన పిల్లలను సైతం మనం కొట్టడానికి మనకు హక్కు లేదు ( తల్లిదండ్రులుగా మంచి చెడు చెప్పడం వరకే మన బాధ్యత ) . అలాంటిది ఎదుటి మనిషిని కులం పేరుతో శాసించే హక్కు మనకు ఎక్కడిది ?
   మీ స్పందన నాకు మరింత సంతోషం కలిగించింది – నమస్కారాలతో …

 • గొరుసూ.. సుందర్రాజు కథతో మళ్లీ నీ మార్క్‌ విశ్లేషణని పండించావు. ఇప్పుడు కూడా ఈ కథ నాకు అంతే పచ్చిగా మనసుకి హత్తుకుంది. అది ఆ కథకుడి గొప్పతనం. ఆ కథకోసం తాను ఎంచుకున్న భాష గొప్పతనం. తన ప్రాంత పలుకుబడిపై ఎంతో పట్టు ఉండటం వల్లే సుందర్రాజు ఆ కథని అలవోకగా నడిపించగలిగాడు. ఇక కథా వస్తువు విషయానికి వస్తే.. అది అనుభవం నుంచి పిండిన కషాయం. చదువరిలో ప్రకంపనలు సృష్టించే జీవనచిత్రం. గొరుసూ నీకు మరోసారి అభినందనలు. నీ మరో కథా పరిచయం కోసం ఎదురుచూస్తాను.

  • థాంక్యూ ఒమ్మీ…
   అవును. అది సుందర్రాజు అనుభవం నుంచి పిండిన కషాయమే.
   కానీ ఆ భాష దాన్ని అమృతంగా మార్చేసింది.
   పైన ఆదిత్య అన్నట్టు తెలుగు భాషలో ఎన్ని వన్నెలో కదా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు