జెంజమైవోర్లు

    గసాలలో నిలబడి  ఓ గవరపెద్దమ్మా, ఓ గవరపెద్దమ్మా  అని యాల కూత లేస్తా పిలస్తా ఉంది మా రమణక్క పెద్దమ్మను. ఈ పొద్దు మావిటాల నెల కంతుకు అప్పులిచ్చేవాళ్లు  వస్తారంట, వాళ్ళు ఐదైదు మందిని వొగ సంగం  చేసి మనిసికి నలబై ఏలు అప్పిస్తారంట. మన సంగంలో ఉండేది నువ్వు, కాంత, కమల, గంగత్త, నేను, మన మైదుమంది ఒగ  సంగం. కమలా  నువ్వు కూడా ఈన్నే ఉండావు వచ్చేటబుడు ఒగరికొగరు చెప్పుకొని రాండి అని నాక్కూడా ఒగ మాట చెప్పి, వొచ్చేటపుడు మీ మొగుల్లను కూడా పిలుసుకుని రండి అనేసి  పాయ రమణక్క .
                          ఆ మావిటేల ఎలుగునే  అందరం  అంతుడకేసుకొని తిని మా ఆదారకారడు, చిన్న పోటోలు రెండు ఎత్తుకొని మా మొగుల్లను తోడుకొని  మాఊరి రామాలయం కాడికి పోతిమి. అప్పులు చేసేది మాకు కొత్తేమీ కాదు.  మా తాతల ముత్తాతల కాన్నుండి కూడా అప్పులు చేసేదే. అవి తీరిసే  దానికి నానా  యాతనా బడేదే. ఇది మాకు మామూలే! కాలం మారంగ మారంగా అప్పు చేసే అవసరాలు, ఇచ్చే మనుసులు మారింటారు.అంతే గాని అప్పులు ఒగబుడు బూసాములుకాడ,పెద్ద పెద్ద సావుకార్లు కాడ పత్రం వాళ్లు రాస్తే మేము ఏలి గుర్తులేసి, ఆ వడ్డీలు, ఆ అప్పులు తీర్చలేక యాలానికి పోయినవి మా బతుకుల్లో చానా ఉన్నాయి !  కానీ ఇబుడు అప్పులు వసూలు చేసే తీరు మారింది. ఒకటి అప్పులు కట్టలేక మన పానాలు మనం తీసుకునేది, లేదా ఎదుటోని పానం  తీసేది. రెండు కుదరకపోతే ముంచేసేది లేదా జామీను మనిసిని జమ కట్టేది. చానా వరకు ఈ మాదిరి జరుగుతా ఉంది.
                           అప్పులిచ్చే తీరూ  మారింది. ముందు మాకు తెలిసినోల్ల  దగ్గర, మా చుట్టుపక్కల్నే  అప్పు చేసే వాల్లం ,కానీ ఇబుడు మాకు అప్పిచ్చే వాల్లెవురో తెలీదు. ఎక్కడో దేశాల నుండి,రాస్టాల నుండి వొచ్చి అప్పులిస్తున్నారు. అసలైన  సొమ్ము దారుడు మగమే చూసే పనేలేదు. మద్యలో పనులు చేసే వాల్లే  అందురూ . మే మైదు మంది, మా మొగుల్లు  మొత్తం పదిమంది పోయి గుండుగా కుసుంటిమి ! ఆడికొచ్చిన సార్లు మా అందరి  మగాల  కల్ల ఎగాదిగా చూసి అందురూ మంచిగా ఇనండి. వొగొగరికి నలబై వేలు  అప్పిస్తాము. మీ అందరికి  బ్యాంకుల్లో అకౌంట్లు ఉండల్ల,  పోతే సర్వీస్చార్జి రెండువేల ఐదువందలు, ఇన్సూరెన్స్ ఇంకో రెండు వేల ఐదువందలు పట్టుకుంటాము.  పొరపాట్న మీకు ఏమైనా జరగరానిది జరిగితే అబుడు మీరు అప్పు కట్టే పనుండదు. ఇవన్నీ పోను మీ చేతికి ముప్పైఐదువేలు వస్తుంది. మీరు నూటికి రూపాయి లెక్కనే వడ్డీ ఏసి కంతుకు రెండు వేల రెండు వందలు చొప్పున ఇరవైనాలుగు నెలలు కడితే మీ అప్పు తీరిపోతుంది. మీలో వొగరు కట్టకపోయినా మిగిలిన నలుగురు వాళ్ల డబ్బు  ఎగేసి కట్టల్ల. లేదంటే మేము మీ ఇండ్ల ముందర్నే  కూసుంటాము. పలానా టైము, పలానా తేదీ అంటే ఆయాలకు మీరంతా డబ్బులు ఎత్తుకొని రెడీగా ఉండల్ల.  మేము చెప్పిన  పద్దతులు  మీరు ఒప్పుకుంటే లోను రాస్తాము. లేదంటే లేదు అని చెప్పిరి. అందురూ సరే మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తామని తలకాయలు వాలేసిరి. అట్లయితే ఇదిగోండి పారాలు, మేమిచ్చే  ఈ పారాల్లో బారియ బర్త ఇద్దరూ  సంతకాలు చేయండి అని ఒక్కొక్కరికి ఆరు పారాలిచ్చిరి.
                              తొలిత గంగ పెద్దమ్మ, ఆయమ్మ మొగుడు కొండప్ప  పెట్టమంటే, వాల్లిద్దరూ మాకు సెవరాలు చేయను చేతకాదు సారూ మేము ఏలు గుర్తులు ఏస్తాము అండ్రి. అదే మాట మా గౌరత్త, ఈరమామ  కూడా మాకు సెవరాలు చేయను రాదండ్రి. ఆ మాటకు వాల్లు  ఒప్పుకోలేదు. ఏలు గుర్తు లేస్తే అప్పులీము. సెవరాలే చేయల్ల, మీరు పేర్లు రాసేది నేర్చుకొని రండి అబుడిస్తామప్పు. మీకు ఒగ  వారం పొద్దు గడువిస్తాము,మల్లొచ్చే మంగలారం మీరు సెవరాలు పెడితేనే లోను, అనేసి మేనేజరు  ఎలిపాయ .
                              మిగిలినోల్లందరమూ   వాల్లను తిడితిమి. మీ వల్లనే మాక్కూడా దుడ్డు  రాకుండా నిల్చిపాయ. ఎవురెవరు అవసరాలు ఎట్లుండాయో ఏమో,  పేరు రాసేది అన్న నేర్చుకోవల్ల కదా అని.  ముందంతా రెయ్యి బల్లు చెప్పిరే ఆడికన్నాపొయి పేరన్న నేర్చుకోకూడదా అనరిచి సరేలే మావిటేల పలక బలపం ఎత్తుకొని నా కాడికి రండి, నేను మీకు పేరు రాసేది నేర్పిస్తా అని చెప్పి వొస్తి. అట్ల పొద్దు గుంకిందో లేదో తొలిత గవరత్త, ఆ యమ్మ మొగుడు కొండప్ప  వొచ్చిరి. వాళ్ళ ఇంటి పేరు ఎస్ అంటే సుండుపల్లి. నేను ఎస్ ఇంగిలీసులో రాసి గౌరమ్మ అని తెలుగులో పలకలో పెద్ద పెద్ద అచ్చిరాలు రాసిచ్చి వాటి పైనే దుద్దమని చెప్తి.  ఆయప్పకు కూడా రాసిస్తే చిన్న పిల్లకాయలు తలకాయి కిందికి  కొట్టుకొని దుద్దతారే, అట్లా ఇద్దురు దుద్దతా ఉండారు.
                                 “ఆ ముండ జెంజమైవోరు కొట్టకుండా  ఉన్నింటే  నేను బాగా చదువుకునేందు . ఆ జంజం నా బట్ట కొట్టి నాకు చదివే లేకుండా చేసి ఈ పొద్దు కండ్లుండి  గుడ్డిదాన్నైతి” అని గవరత్త ఎవరినో తిడతా అచ్చరాలు దుద్దతా ఉంది.
ఎవుర్ని గవరత్తా అట్లా  తిడతా ఉండావు అంటే ఆ మాటకు ” కాదు నాయనా  అగ్రారం మాది పుట్నూరు . ఆ ఊర్లో బడుండేది. ఆ ఊరులో  ముక్కాల బాగం కొముటోల్లు , బాపనోల్లు .  మాదిగి మాల ఆ పల్లికి దిగవనుండేది. అందరికీ కలిపి ఒగే బడుండేది. ఆ బల్లో కూడా మమ్మల్ని  కడాన కుసనబెట్టేది. నేను అబుడు రెండో తరగతి. అయివోరు ఒగటిగా చెప్తే నేను రెండుగా నేర్చుకుందు. ఒగనాడు నేను బల్లో బ్యాగు పెట్టేసి ఆట్లాడుకోను పొయినా. వాలూరు పిల్లది  నా బ్యాగులో బలపాల కట్టెత్తుకునేసింది. మాకు తమలపాకుల తోట ఉండేది మా నాయన దినాము తమలపాకులు కోసి అమ్మేది. నేను నా తోడబుట్టు ఏమి కావాలంటే అవల్లా  తెచ్చి మా నాయన మా కిచ్చేది. అదిగాక మా నాయనకు మా కాడికి ముందు ఐదు మంది బిడ్డలు పుట్టి పురిట్లోనే చచ్చిపోయినారంట! అందుకని నేను నా చెల్లెలు పుట్టే కాడికి మేము బతకల్లని లేని మొక్కుబళ్ళు చేసుకోని, నేలపెడితే మొన్నైతాము, పైన పెడితే పచ్చులెత్తక పోతాయని వొల్లో  పెట్టుకొని చాక్కుంటా ఉండారు.
                          ఆ బాపనోల్లపిల్ల  నా బ్యాగులో బలపాల కట్ట ఎత్తుకోనుండేది  ఏరే పాప నాకు చెప్తే, నేను యాడస్తా అయివోరికి చెప్తే, వాడు నామిందనే కండ్లెర్ర చేసినాడు. అరగాసు మాదిగ దానివి, మా పిల్లోల్ల పైనే దొంగతనం అంటగడతావా, మిమ్మల్ని బల్లోకి  రానిచ్చేదే తప్పు. మీకు చదివే చెప్పకూడదు అని కానగ  బెలగలు పెరక్కచ్చి ఒల్లంతా వాతలొచ్చేడిగా కొట్టేసినాడు. ఆపొద్దే కొండ్ల పొడవాన సలిజొరమొచ్చేసింది. అదే పట్లో మా నాయన పొయ్యి, ఐవోర్ని నీ చదువుకు నా బొచ్చు, నాకు లేక లేక ఇద్దరు బిడ్లు మిగిలితే వాళ్ళను సావబడా కొడతావా? నీ బిడ్డలనైతే  అట్లే కొడతావా అని తిట్టి ఆ పొద్దు నుండి నన్ను బడికే అంపలా. ఆ ఐవోరుకి మన కులపోలు బాగా చదివితే వాని బుద్ది పులుసేది కాదు. మీ అట్లోల్లంతా చదువుకుంటే మేమేమిటికుండేది అనేది చానా సార్లు. అదిగాక మన కులపోల బిడ్డలని వాడు ఏనాడు చేత్తో అంటుకొని బుజంతట్టినోడు కాదు. ఏదైనా చెప్పాలన్నా  బారడు దూరం నిలబడి కట్టితో పొడిచి చెప్పేది. ఒసే,ఒరేయ్  అని నానా  గబ్బు మాటలు మాట్లాడేది. ఆ నాబట్ట కొట్టకుండా ఉన్నింటే   ఈ పొద్దు నేను నాలుగు గీట్లు నేర్చుకుందు. వాని వల్లే నాకు సదువు లేకుండా పాయ” అని తిట్టే గవరత్త.
              నువ్వేల కొండమామా  చదవంది అంటే ఆ మాటకు కొండమామ “నేను రొన్నాళ్లు బడికి పోయినా, మాకు ఒగ  జంగమైవోరొచ్చేది. ఇప్పుడు మాదిరి మాకు అప్పుడు బళ్లో అన్నం పెట్టేది లేదు. బడికి పోవాలంటే నాలుగు మైళ్ళు నడుచుకొని పావల్ల. తెల్లారి ఆరుకే ఇంటికాడ బయలుదేరితే బడి టయానికి పోదుము. వొగనాడు మాయమ్మ సంగటి చేసింది. చారు  చెయలే , రేతిరి చేసిన గొడ్డు తునకల కూర ఉంటే ఆ కూర సంగటి  డబ్బాకు  కట్టుకొని బడికిపొయినా. మద్యానం అదే  తింటా ఉంటే ఏరే పిల్లోడు చూసి సారు ఈడు బడికి తునకల చారు తెచ్చుకున్నాడు అని ఐవోరికి  చెప్పినాడు. ఐవోరు ” నా కొడకా బల్లోకి తునకలసారు తెచ్చుకొని తింటావా.  అది గొడ్డు తునకల్లు తెస్తావా, బడంతా  ఆపిత్రం చేసినావు” అని నన్ను కొట్టి బడంతా  కడిగించి, మీరు క్యారీలు తేస్తే ఇంగ  లోపలికి తేకూడదు, ఆ బడి ముందర మానికి యాలగట్టుకోండి అని మా క్యారీలు మానుకి  యాలగట్టమనేది. పచ్చులు,కోతులు పెరక్కపోయేవి ఆటిని . వాడు ఆపొద్దు కొట్టిన దెబ్బలకు నేను బడితొట్టే  పోలేదు.ఆ ఐవోరి నా కొడుకులే అరదము  మనూరోల్లను కొట్టి కొట్టి మనంతల మనమే బల్లు  మానిపించినారు” అని చెప్పకొచ్చే.
                              మల్లా కాన్చేడికి గంగ పెద్దమ్మ, ఈరపెదనాయన ఒచ్చిరి. వాల్లకు కూడా పలకమింద పేర్లు రాసిస్తే వాల్లు  పలకలో దుద్దుకుంటా అందరిమాటలు ఇంటా ఉండారు గంగ పెద్దమ్మ  “మా ఇంట్లో మా అమ్మకు నా కాడికి చిన్నోళ్ళు ముగ్గురు బిడ్డలు. సంవత్సరానికి ఒక బిడ్డను కనేది మాయమ్మ.నేను ఆ బిడ్డలను పట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసి బడికి పోతే ఆడ అయివోరు చెప్పే చదువు వినకుండా బ్యాగు మిందనే బోల్లపనుకొని నిద్దర పోయేదాన్ని.  నాతోటి పిల్లోలందరూ నేను నిద్రపోతాను అని ఐవోరికి చెప్పేది. ఆ ఐవోరు నా సొవులు ఎర్రగా పిండేది. నా మగాన నీల్లు  కొట్టేది, నన్ను గోడకురిసి  ఏపిచ్చేది. మల్ల మాట్లాడితే కోదండమేయిచ్చేది. ఆ దెబ్బలకు బయపడి నా యెంతట  నేనే మానుకుంటి. ఆ  ఐవోరు కొట్టకుండున్నింటే ఎట్లోగట్ల  చదువు కొనిందు. ఆపొద్దు  నించి నన్ను బిడ్ల కాడ, ఇంటి పనికి ఏసిరి.అందుకే నాయనా నేను  చదువుకి   పోంది” అనే .
                            అబుడబుడు  అట్లా పొద్దు బోకపోతే మనకు కాగలిగిన వాలిండ్లకి బొయి కొంచేడి  మంచి చెడ్డ మాట్లాడుకొని వస్తాము. ఆ రకంగానే ఈ పొద్దు మా ఇంటికి మా నాగన్న వొచ్చి కూసుండె . సదువు కతలు ఇంటా ” నాకు బుద్దొచ్చిన కాడికి మన ఊర్లో కొండ తాత కొడుకు రెడ్డప్ప ఒకడే  రెండు బడులు అంటే కొండకింద బడి, పంచాయతీబడికి పొయి,చదివి టౌనికి  పోయి చదివినోడు. ఆయప్పను ఇబుటికీ మన ఊర్లో ఐవోరు రెడ్డప్ప అంటారు. వాల్లింట్లో నలుగురు కాడికి చిన్నోడు ఆయప్ప. మగములో పొండ్లు తప్ప మనిసి కనబడడు. షాడ నలుపు. ఐవోర్లు కొట్టినా తిట్టినా బడి మానకుండా చదివి ఐవోరు కొలువే తెచ్చుకున్నాడు. ఆయప్పను చూపించి నాఈడు పిల్లలందరినీ మాయమ్మ నాయన వరసగా బడికేసినారు.
                          నేను రెన్నెల్లు  పొయినా, ఆరు నెల్లకే అచ్చరాల వరకు నేర్చుకోనుంటి . మా నాయనఉజ్జోగం చేస్తుండే .  సావులకు, దండోర్లకు, పండగలకు, తిర్నాలకు పలక కొట్ను పోయేది. ఊర్లో  యాడ గొడ్డు చచ్చినా  మాకు అర్థం గొడ్డు వచ్చేది. ఆ  గొడ్డు తునకలు  మాయమ్మ కోసి బండ్ల కేసి ఎండబోసి కడవలకు పోసి పెట్టేది. మా ఇంట్లో ఏ కూర చేసిన వాటిల్లో అన్ని వట్టి తునకలు కలిపి  చేసుకుని తినేది. కూటికి లేకపోయినా కూడా ఉత్త వొట్టి  తునకల్లో కాసింత ఉప్పేసి  ఉడకబెట్టుకొని తిని నీళ్లు తాగి పొద్దుగడిపినోల్లం . నేను దినాము బడికి కూడా తునకలచారు కట్టుకొని పోయేది. నా జతన కూసుండే శీనుగాడు దినాము  ఐవోరికి ఈడు గొడ్డు తునకలు తెచ్చుకొని తింటాడు  అని చెప్పి నన్ను కొట్టించేది. ఒకనాడు
నాక్కోపమొచ్చి చెక్క పలకతో వాని తలకాయి పగలగొట్టేసిన.  వానికి రగతం కారత ఉంటే  నేను బయిపడి పరిగెత్తిబొయి  ఏట్లో జమ్ములో  దాక్కున్న. ఐవోరు పిలకాయలను పంపించి నన్ను దొరక బటక రమ్మన్నాడు. నేను దొరికిండ్ల . అబుడు  నిలిపివేసిన బడి.ఇంకంతే ” అనే
                అరుగుమింద కూసున్న  మా ఎల్లవ్వ మాట్లాడుతా  ” నేను మా యమ్మకు తొలి సంతానం. మా యమ్మ వాల్లమ్మ నన్ను సాకింది. ఆయమ్మ వక్కాకు  బలే నమిలేది. నేను నాలుగు కాల్లతో దోగాడేటబుడు ఆ తమలపాకు తొటేలు తుంచి గోటితో నున్నగా నలిపి నా నోట్లో పెట్టేది. నేను వాటిని చప్పరిస్తా ఉండే దాన్నంట. అట్లే తప్పటడుగులేసేటప్పుడు నాకు ముందర రెండు ముని పండ్లు మొలిసింటే  ఆ తొటేలు తుంచి నోట్లో పెడితే ఆ మునిపండ్లతో కొరుక్కుంటా  ఉండేదాన్నంట . ఆయమ్మ ఎబుడు వక్కాక్కు తిత్తి ముందరేసుకున్న నేను తిత్తి పెరుక్కొని  తొటేలు  కోసం ఏడుస్తూ ఉంటే తోటేలు బాగా అలవాటు చేసింది. సుమారుగా పండ్లు అన్నీ వచ్చేసి తిండి తినేటప్పుడు, చిన్నగా రవ్వంత వక్క, రవంత ఆకు సున్నం    మూడు కలిపి నా నోట్లో పెడితే నేను వాటిని ఎర్రగా నమిల్తే  మా యవ్వ నా చిన్న బిడ్డ మూతి ఎర్రగా దొండపొండే  గతం ముద్దుగా ఉందో అని,ముద్దాడి ముద్దాడి కొసిరి కొసిరి ఆ యమ్మ వక్కాక్కు  వేసినప్పుడల్లా నా నోట్లో వక్కాక్కు  పెట్టేది. నేను సంవత్సరం, రెండేళ్లు బిడ్డ అయినప్పుడే నా అంతల నేను అవ్వ తిత్తిలో వక్కాకు  తీసి నమిలి దుగ్గుపొడి కూడా వేసుకొని పుక్కడ పెట్టేది నేర్చుకున్న. మా యమ్మ నాయన చూస్తే కొట్టేది. మా యవ్వ వాళ్లకు తెలియకుండా మొరుగ్గా నాకు ఇచ్చేది. నేను కూడా అంత చిన్నప్పుడే వక్కాకు కి  అలవాటు పడిపోయిన. ఐదేండ్లకు నన్ను బల్లో ఏసిరి, నేను చిన్నగా వక్కాకు ,దుగ్గు అంతా మూట కట్టుకొని బడికి ఎత్తుకొని పోయి బడి కాడ నమిలి పుక్కడ పెట్టుకునేది. బల్లో పిల్లోల్లు  కనిపెట్టేసినారు. ఐవోరికి  చెప్పినారు. ఈ వయసుకే నువ్వు వక్కాకు  నమలతా ఉండావంటే నిన్ను చూసి మిగతా పిల్లోల్లు కూడా నేర్చుకుంటారు. అని ఎదురు బర్రతో నాపై ఊసగొట్టేసినాడు. ఆపొద్దు మాయవ్వ నావొల్లు  మీద ఉన్న వాతలు చూసి  ఆ  ఐవోరికి నాసాడు, వాడు బిడ్డల కన్నోడు కాదా? వాని చదువుకు నాసాడు అని ఆపొద్దు నుండి నన్ను బడికే అంపలా. మా యవ్వ ముదిగారముతో సదువు లే, బడిలే ” అనే                                   ఈరపెదనాయన ఉండుకొని ” నాయనా నా కత  ఇంగాపెద్దది. నేను చిన్నబుడు బలే బడి దొంగ. బడి అంటే నాకు తలకాయి నొచ్చేది. నేను బడికి పోతానని ఇంట్లో చెప్పి బ్యాగు చెట్లపొదల్లో దాసిపెట్టి గోలీలాట, జిల్లకోడి, బంగరాలు ఆట్లాడతా ఉండేది. ఒకనాడు నన్ను పిల్లోల్లందరూ పట్టుకొని ఐవోరంచుకు ఈడసక పోయి కాల్లకు గొలుసులేసి, నెత్తిన తుండు పెట్టి ఈడ్చుకొని పోయి బల్లో  ఏసి బీగమేసినారు. రెండు దినాలు ఇడిసిండ్ల.  ఆ పొద్దు నుంచి నన్ను తారాడితే టువాకు గుండుకి దొరికేది లేదు. బడంటే ఆ మాదిరి పరిగెత్తేది. ఇంట్లో వాల్లు , బయటోల్లు  ఎంతమంది కొట్నాతిట్నా బడికి పోయేది లేదు. బడికి ఎగనామం పెట్టేస్తి . ఈ పొద్దు చదువు ఇలువు తెలిసింది
                              అయినా ఆ కాలం ఈ బాపనైవోర్లు మనోల్లను, బలే కొట్టేది, తిట్టేది. మనంతట మనమే బల్లు   నిలిపేసేటిగా చేసినారు లేమ్మా,లేదంటే ఆ కాలంలో కొంతానికి కొందరన్నా  చదువుకొనిండ్రా? ఇబుడుమారి  బడుల్లో అన్నాలు పెట్టి,గుడ్డలు బుక్కులిస్తే చదువుకోను మనకేమన్న బింగరమా !”అనే !
*

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి 1981 లో చిత్తూరు జిల్లా, మదనపల్లి లో పుట్టారు . అక్కడే భర్త ముగ్గురు పిల్లలతో ప్రస్తుతం నివాసముంటున్నారు. గత 15 ఏండ్లుగా చిత్తూరుజిల్లా వెలుగు మహిళాసంఘాల పత్రిక 'నవోదయం'లో పనిచేస్తున్నారు. రచనలు : ముప్పై కథలతో 'ఎదారి బతుకులు ' కథా సంకలనం ఈ ఏడాది మార్చి లో విడుదలయ్యింది. లఘుచిత్రాలు : మహిళా సంఘాలకు సంబంధించిన అనేక అంశాలపై లఘు చిత్రాలు తీశారు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంతమంది జెంజమైవోర్లు ఇలా జాతికి చదువులు దక్కకుండా చేశారో కదా! భారతి ఏ కథ చెప్పినా దానిలోని సామాజికాంశాలు చాలా ఆలోచింపజేస్తాయి. కాకపోతే అదేదో సందేశం యిస్తున్నట్టు కాకుండా సహజంగా కూర్చుని మనతో మాట్లాడుతున్నట్టు వుంటుంది.
    నేను భారతి అభిమానిని.

  • అక్షరాలా అక్షరాల దు:ఖం. భారతి గారికి దండాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.