చెన్నై Pub! ఒక రౌండప్

ఇంత డబ్బులు చెల్లించి, కాళ్ళా వేళ్ళాపడి బతిమలాడి లోపలికెళ్తే, స్మోకింగ్ ఏరియాలో దోమలు రక్తం పీల్చేస్తుంటాయి.

అనువాదం: అవినేని భాస్కర్

బార్(Bar) అంటే మననాళ్ళకి తెలుసు. పబ్ అన్నది అందరికీ పరిచయమైనది కాదు. చెన్నైలో పబ్ కల్చర్  పాతికేళ్ళుగా ఉన్నా గత కొన్నేళ్ళుగానే ఎక్కువ పాపులర్ అయింది. పబ్ అన్న మాట అందరికీ తెలిసినా, అది ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది అన్నవి తెలీని కారణంగా, అదేదో భూతల స్వర్గంలా ఉంటుందనుకుంటుంటారు.

అక్కడ దేవతలు చాలీచాలని బట్టలేసుకుని డాన్స్ చేస్తుంటారనుకుంటారు, మనం వెళ్ళగానే మన రాక కోసమే కాచుకున్నారనీ, మనల్ని వాటేసుకుని డాన్స్ చేస్తారనీ, పబ్బుకెళ్ళని మగవాళ్ళ భావన. దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని, పెళ్ళి చూపులకు వెళ్ళేంత పకడ్బందీగా పబ్ చూడటానికి తొలిసారిగా కొంత ఆదుర్దాతో, ఎన్నో ఆశలతో వెళ్ళి అక్కడి పరిస్థితి చూసి ముఖాన ఒక టన్ను పేడ కుమ్మరించినట్టు ఓ మూల స్టూల్ మీద కూలబడి, 300 రూపాయలకు మందు కొట్టి ఫ్లాటవ్వకుండా, 3000 చెల్లించినందుకు చింతిస్తూ ఇంటికొచ్చి కప్పుకేసి చూస్తూ “జీవితం అంటే ఏంటి?” అనుకుంటూ, నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి తానే అన్నట్టు తత్వ విచారణలో పడిపోతుంటారు. ఇలా నిరాశకు లోనైన అనుభవాన్ని బయటకు చెప్పేందుకు భయపడుతుంటారు.

పాపం తెలుసుకుంటార్లే అని చెప్పే ప్రయత్నం చేసినా, “పబ్బలుకు అప్పడప్పుడు వెళ్తుండాలి మాఁవా… అప్పుడే అమ్మాయిలు సెట్ అవుతారు…” అని పాఠాలు చెప్తుంటాడు సీనియర్ పబ్ సిటిజెన్! అతని చరిత్ర తవ్వి చూస్తే… గత ఐదేళ్ళుగా పబ్బులో అమ్మాయిల అన్వేషణలో విఫలమవుతూకూడా ఘజిని మహ్మద్కు బిగ్ బ్రదర్లా ప్రయత్నం విరమించకుండా, అక్కడే ఈపాటికి సుమారు ఆరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేసుంటాడు.

మగవాళ్ళకు ఇందులో ఉన్న సమస్యేంటంటే ఇంతవరకు ఒక అమ్మాయి కూడా పబ్బులో సెట్ అవ్వలేదని చెప్తే, తనని పనికిరానివాడికింద జమ కట్టేస్తారేమో అన్న భయంతో, “ఆ పబ్ బాగుంటుంది..”, “ఈ పబ్బుకు కాలేజ్ అమ్మాయిలు ఎక్కువగా వస్తారు…”, “ఆ పబ్బుకు ఎలీట్ క్రౌడ్ వస్తారు…” అని ప్రగల్బాలు పలుకుతుంటారు.

ఇంకా కాస్త మసాలా దట్టించి కొందరు, ఒకమ్మాయి తో మాట్లాడి నంబర్ తీసుకున్నట్టు చెప్తుంటారు. ఒక అమ్మయిని కిస్ చేసినట్టు కూడా కన్ను కొట్టి గొప్పలు పోతుంటారు. ఒకమ్మాయి తప్పతాగి పడిపోయిందనీ, తానే ఆమెను తీసుకెళ్ళి రూమ్ లో వదిలి పెట్టాననీ చెప్పుకుంటుంటారు! “తర్వాత ఏమైందిరా?” అని అమాయకంగా అడిగితే నర్మగర్భంగా నవ్వుతూ సిగ్గుపడిపోతుంటారు.

పబ్ చూడని అబ్బాయిలు ఇలాంటివి విని అతీతమైన కల్పనా శక్తితో భావావేశానికి లోనైపోతారు. “నన్నుకూడా తీసుకెళ్ళు మాఁవా..” అని బ్రతిమలాడుతూ, వాడే తన మార్గదర్శకుడని ఫీలైపోతుంటారు. ఎప్పటికో దయ తలచి తీసుకెళ్తాడు ఆ సీనియర్ పబ్ సిటిజన్. అక్కడ ద్వారపాలకుడిలా నిల్చునుండే బౌన్సర్ సెల్యూట్ చేస్తే సీనియర్ గొప్పగా కనుబొమ్మెగరేసి చూశావా నా తడాఖా అన్నట్టు కొత్త పబ్ సిటిజెన్ కేసి చూస్తాడు.

ఇది రోజూ రెండుమూడొందలు బౌన్సర్లకు టిప్స్ ఇచ్చి పుచ్చుకుంటున్న సెల్యూట్ అని కొత్త పోరగాళ్ళకి తెలియదు. బేరర్ తనకి సెల్యూట్ చెయ్యడాన్నే ఐక్యరాజ్యసభ ఆమోదంతో వచ్చిన గౌరవం అన్నట్టు భావించేవారెందరో ఉన్నారు.

మగవాళ్ళిలా ఉన్నారంటే, ఇక ఆడవాళ్ళ పరిస్థితి మరో రకం.

మిడిల్ క్లాస్ లెవల్లో ఉన్న అమ్మాయిలందరికీ పబ్బుని ఒక సారైనా చూడాలన్న ఆశ బక్కెట్ లిస్టులో ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం, అక్కడ జనాలు డాన్స్ చెయ్యడాన్ని చూడాలి, డాన్స్ ఫ్లోర్లో ఎవరైనా అడ్వాన్స్ అవుతుంటే ఆ సీన్లు దర్శించుకోవాలి అన్నట్టే ఉంటుంది. మరి కొందరికి, అక్కడ ఏ రాజకుమారుడో తన దగ్గరకొచ్చి తన గురించీ, తన అందచందాల గురించీ పొగుడుతాడన్న ఆశకూడ ఉంటుంది.

నిజానికి పబ్ అంటే ఏంటి? చెన్నైలో పబ్బులు ఎలా ఉన్నాయి?

పబ్ అంటే సాదా మందు కాకుండా నిపుణులచేత కలపబడ్డ ఖరీదైన టాప్ బ్రాండ్ మందు సర్వ్ చెయ్యాలి. ఆ మందుని ఆస్వాదిస్తూ సేవించడానికి మంచి సీటింగ్ అరేంజ్మంట్తో కూడిన వాతావరణం ఉండాలి. వాతావరణాన్ని ఇంకా హైలైట్ చేసే విధంగా మ్యుజిక్ ప్లే అవుతుండాలి. జాజ్, రాక్, మెటల్, పాప్ లేదా హిప్ హాప్ – ఏదో ఒకటి సరైన ఆర్డర్ లో ప్లే చెయ్యడం శ్రేష్టం.

ఒక థీమ్ ఎంచుకుని మ్యూజిక్ ప్లే చెయ్యాలి. డీజే లేదా లైవ్ బ్యాండ్ అంటు అకేషన్ కు తగ్గట్టు ఏర్పాటు చేస్తుంటారు. డాన్స్ చేయ్యడానికి డాన్స్ ఫ్లోర్ తప్పకుండ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా పబ్బుల్లో సైడ్ డిష్ అనబడే ఐటెం ఎక్కడా ఇవ్వరు. ఒట్టి మందు మాత్రమే. మన దేశంలో అలాంటి రూల్స్ పెట్టలేరు కాబట్టి, ‘క్విక్ బైట్’ అనబడే ఐటెమ్స్ ని కొంచం మోతాదులో ఇవ్వొచ్చు.

అయితే అక్కడ జరిగేదేంటి?

మన దేశంలో సిటీ నడిబొడ్డున ఉన్న ఫైవ్ స్టార్ పబ్బులు కూడా జస్ట్ ఏ.సి వేయబడిన కాస్ట్లీ సారాయి కొట్లు లేదా బార్లు. అంతే.

ఇంకా బెటర్ గా వివరించాలంటే సిటీ నుండి బయటూళ్ళకు పోయే రైల్వే స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్లు చూసుంటారు కదా? అలా ఉంటాయి. నిల్చోడానికి చోటుండదు. డాన్స్ చేస్తే జారి పడటం ఖాయం. ఎందుకంటే ఎవరో అరటికాయ బజ్జీలు ఆర్డర్ చేసి నేలమీద పడేసుంటారు. మీరు దాన్ని మీద కాలేసి జారి పడతారు.

పొద్దున ఐదింటిదాక నడుపుతుంటారు. తెల్లవార్జామున మూడింటికి వెళ్ళి చూసినా అబ్బాయిల గుంపు బయట నిల్చుని ‘అన్నా అన్నా.. ప్లీజన్నా.. లోపలకి వదలన్నా..’ అంటూ బవున్సర్లని బతిమలాడుతుంటారు. ఎందుకు బతిమలాడుతుంటారా?

కొన్ని పబ్బులకి జంటగా మాత్రమే రావాలన్న నియమాలు ఉంటాయి. అలా జంటలేని అబ్బాయిలు బయట నిల్చుని బౌన్సర్‌తో బావులాడుతుంటారు. పబ్బు లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ చార్జుంటుంది. రెండువేల నుండి ఐదువేల దాకా ఉంటుంది. ఇందులో ‘కవర్ చార్జస్’ అని కొంచం కేటాయించుంటారు. అంటే మూడువేల ఎంట్రీ చార్జిలో రెండువేలు కవర్ చార్జస్ అనుంటుంది. ఆ రెండువేలుకు మందో, ఫుడ్డో తీసుకోవచ్చు.

నిజానికి ఆ రెండువేల రూపాయలుకు వాడు 200 రూపాయల విలువున్న మందే ఇస్తారు. కొన్ని చోట్ల నిర్ణయించబడిన ఎంట్రీ చార్జంటూ ఏముండదు. తెలిసినోడుంటే ఫ్రీగా కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు. బౌన్సర్ మూడుకు తగ్గట్టు 2000, 3000, 4000 అని తోచినట్టు తీసుకుంటారు.

జోడి లేదంటే ఎంట్రీ ఇవ్వరు. ఒక్కో సారి లోపలికి పంపుతారు. కర్ర పట్టినోడే కాపరి అన్నట్టు ఓ సర్వాధికారిలా తనకు తోచినట్టు చేస్తుంటాడు. ప్రజల చేత ఎన్నకోబడిన నాయకుడు అలా చేస్తే మనం ఓర్చుకుని చూసీ చూడనట్టు ఉంటాం. బవున్సర్ ఉద్యోగానికి నియోగించబడ్డ ఓ వ్యక్తి  ప్రజలు ఎన్నకున్న నాయకుడిలా ఇష్టారాజ్యంగా ఎలా ప్రవర్తించగలడు? దాన్ని చూసి మనోళ్ళెలా ఊరుకుంటున్నారు? అన్నది అర్థం కాలేదు.

ఇంత డబ్బులు చెల్లించి, కాళ్ళా వేళ్ళాపడి బతిమలాడి లోపలికెళ్తే, స్మోకింగ్ ఏరియాలో దోమలు రక్తం పీల్చేస్తుంటాయి. పబ్బులోపల అసలు ఏం జరుగుతుందీ? ఏం మ్యూజిక్ ప్లే చేస్తారు? ఎలాంటి డాన్సులు చేస్తారు? జనం ఎలా ఉంటారు? ఆడవాళ్ళకు సేఫేనా? లోపలకు వెళ్తే జంటలేని వాళ్ళకు పార్ట్నర్ దొరుకుతారా..?

వచ్చే శీర్షికలో చూద్దాం!

 

మూలం:కుంకుమమ్’ అనే అరవ వార పత్రకలో సీరీస్ గా వస్తున్న వ్యాసం. తేదీ: 19 జూలై 2019.

 

మూల రచయిత గురించి:

పాండిచ్చేరిలో పుట్టిన ఆర్.శ్రీనివాసన్, తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చదువుకున్నారు. అరాత్తు అన్న పేరుతో 2010 నుండి సోషల్ మీడియాలలో నేటితరం జీవితానికి అద్దం పట్టే విషయాలను తీసుకుని ప్రయోగాత్మకమైన మైక్రో కథలు, కవితలు రాయడం ధ్వారా గుర్తింపు పొందారు. ప్రముఖ అరవ రచయితలు చారునివేదితా, జయమోహన్, మనుష్య పుత్రన్‌ల మెప్పుపొందారు. ఇప్పటివరకు మూడు నవలలు, మూడు కథల సంపుటాలు, ఒక బాలల కథల సంపుటి, వాహనాలకు సంబంధించిన వ్యాస సంపుటి, ఒక కవితా సంపుటి ప్రచురించారు. క్లుప్తంగా, సటైరికల్‌గా రాయడం ఈయన శైలీ. ఇతని కథలన్ని ఆధునిక యువత జీవితవిధానాల చుట్టూనే తిరుగుతాయి.

కుముదం, వికటన్ వంటి జనరంజక పత్రికలకూ ఇంటర్నెట్ మేగజిన్‌లకూ రాస్తుంటారు. సొంతంగా ఒక ఐటి కంపనీ నడుపుతున్నారు.

కొన్ని తమిళ సినిమాలకు కథా చర్చల్లో భాగస్వామ్యం వహించారు. తమిళ టీవీ చానళ్ళ చర్చా కార్యక్రమాలలో తరచూ పాల్గొంటారు.

కథా సంపుటాలు:

తఱ్కలై కుఱుంగదైగళ్ (ఆత్మహత్య మైక్రో కథలు)

సైనైడ్ కుఱుంగదైగళ్ (సైనైడ్ మైక్రో కథలు)

బ్రేకప్ కుఱుంగదైగళ్ (ఆత్మహత్య మైక్రో కథలు)

నవలలు:

ఉయిర్-మెయ్ (1 & 2) (ప్రాణం-తనువు)

పొండాట్టి (పెళ్ళాం)

బాలలసాహిత్యం:

కాట్టుప్పళ్ళి – అడవిపల్లె

ఆళి టైమ్స్ – సాగర్ టైమ్స్

 

Avatar

అరాత్తు

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బావుంది…రచనా మీ అనువాదమూ. రచయిత గురించి మీరిచ్చిన వివరాలకు thanks.

  • చాలా బాగుంది.. ఎక్కడా ఆపకుండా ఏకబిగిన చదివించే శైలి..❤️🙏🙏

  • మన క్లాసుమేటు, నేపాలీ అందగాడు పాషా యార్క్ యూనివర్సిటీ నుండి టాటా ఇన్స్టిట్యూట్ లో ఏదో పనిమీద బెంగళూరు వచ్చాడు … రేత్రికి ఎంజీ రోడ్డు బార్లో కలుద్దాం రారా అని మా మద్రాసు తమిళ తంబి పి.ఆర్ సుబ్రహ్మణ్యం నన్ను పిలసకెళితే ( ఉడిపి హోటల్లో ఫిల్టర్ కాపీ తాగి కిక్కు తెచ్చుకునే నేను ) ఆ బార్ లో నీళ్ల బాటిల్ కూడా ముట్టుకోలేదు ఏటీ నిలువు దోపిడి అని ఉక్కురోసం తెచ్చుకుంటూ. వేల రూపాయల్లో వచ్చిన ఆ బిల్లు షేర్ చేసుకోవడానికి నా వాటాగా ఓ వందకాయితం లాంటిది బయటికి తీస్తే మా క్లాసుమేటు ఫ్రెండ్స్ అందరూ నవ్వేసి … దశాబ్దాలు గడిచినా వీడు తన దశదిశ మార్చుకోలేదురా అని నవ్వుకుంటూ … నువ్వు మా గెస్ట్ వి నువ్వివ్వకూడదు అని అన్నారు. )

    పెద్ద పెద్ద సదువులు సదూకుని, ఎమెన్సీ, పారిన్ కంపెనీల ఉద్యోగాల్లో జేరి రెండుచేతులా సంపాదించుకుంటున్న నేటి మీ తరం యువతరాన్ని సాహిత్య సేవ చెయ్యమని, చిన్నపాటి కరుసుతో కలకాలం దాచుకోవాల్సిన బుక్కులు కొనుక్కుని ( సెకండ్ హాండ్ బుక్కులైనా సరే కొనుక్కుని ) ఇంట్లో ఓ గ్రంధాలయం అమర్చుకోమని ( తెనుగు, సెందమిళ్, కస్తూరి కన్నడ, హిందీ, వింగ్లీష్ బాసల్లో ) సందేశం ఇచ్చి వాళ్లను ఓ దారికి తీసుకు రాకూడదా అన్నమయ్య సంకీర్తనల అభిమాని అవినేని భాస్కర్ గారూ! బాంచెన్ నీ కాల్మొక్కుతా.

  • LATEST.. HYDERBAD PUBS LO 👊👊BOUNCERS 👊👊YOUTH NI CHITTAKOTTARU…VAALLU POLICE COMPLAINT ICCHARU….SAME AS U SAID…BOUNCERS BEHAVIOUR..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు