చెనిక్కాయ

మెత్తగా రెండు వేళ్ళ మధ్య నలిగి సుతిమెత్తటి ఇత్తనాలు ఇచ్చి చటుక్కున రెండుగా యిడిపోయింది రాములమ్మ చేతిలోని చెనిక్కాయ.

“రైలు ఎక్కియక్కంగానే ఎవరైనా అమ్ముకోటానికి బుట్ట పట్టుకుని వస్తారా! లేదా?”  అని మెడ సాగ తీసుకుంటావెందిమే,   వేరే పని పాట ఏం లేదా నీకు?    ఎంతసేపటికి నీకు తిండియావే. పడుకుంటే లేవవు, లేస్తే పడుకోవు, తినడం మొదలుపెడితే ఎవడికి ఒక్క కాయ కూడా ఇవ్వకుండా తింటావు,   పనిలో పడితే కూడు, నిద్ర లేకుండా చేస్తానే ఉంటావు.   ఎట్టాగమే నీతో చచ్చేది. నీ పని వాటం చూసి ఆ కృష్ణకెనాలోళ్లు కోరి కోరి వాళ్ళ సీతి గాడికి నిన్ను ఇమ్మని వెంబడి పడతా ఉన్నారమ్మే.    పిల్ల ఇంకా పెద్దమనిషి కాలేదు రా నాయనా అన్నా వినిపించుకోవటం లేదు. ఏం చేయాలి రా నాయనా అని నా తలకాయ చిటచిటలాడుతా ఉంటే      నువ్వేంది చెనిక్కాయలు తినడంలో మునిగి మురిసిపోతా ఉన్నావు”.

రైలు కిటికీలోంచి బయటకు విసిరేసిన చెనక్కాయ తొక్కలాగ గాలికి రెపరెపలాడుతూ,  గొనుక్కుంటూ ఎదురు సీట్లో కూలబడింది రాములమ్మ తల్లి. ఇంతకు వీళ్ళిద్దరినీ తీసుకొని పోతావుంది ఎవరో మీకు చెప్పలేదు కదా!, అతడు ఆనందయ్య. ఆనందయ్యకు ఇవాళ ఈ రైలు ప్రయాణం తప్పనిసరి అయింది.

ఆడపిల్ల తండ్రిగా ఈ నేల పుట్టిన కాడనించి ఎవరెవరు ఎన్ని తిప్పలు పడ్డారో,  కథలు కథలుగా ఇనిళ్ళా!?,    ఆడపిల్లలను కన్నతల్లిదండ్రులు, నానా తంటాలుపడి మంచి పోరగాన్ని పట్టుకొని పిల్లని ఇయ్యాలనే తపనే కదా!, అందుగ్గాదా ఆ జనకమారాజు కొంపలో దాపెట్టుకున్న తాతలనాటి బాణం తెచ్చి, ఎక్కుపెడితే చాలు, పిల్లని ఇస్తాననింది. బతకడం చేత కావాలంటే ఎక్కుపెట్టడమూ, ఏటాడ్డమూ రెండూ తెలవాలని గదా ఆ పన్జేసింది?.

కథలకేం కానీ,  ఆనందయ్య భార్య, కూతురితో కలిసి ఇజీవాడ రైలు ఎక్కి ఎక్కింది మాత్రం కిష్నా కెనాలు టేషన్ కాడ రైల్వే కళాసి ఓబులయ్య కొడుకు సీతి గాడిని చూసి రావడానికి.

రైలు గుంటూరు బీ కాబిను దాటేతలికే గాలి దుమారం తో పాటు,  సన్నటి జల్లు తగులుకుంది.  బయటే జల్లు కురస్తా ఉంది కానీ లోన పిల్ల అమ్మా, అబ్బ ఇద్దరి మనసుల్లో ఒకటే ముసురు మొదలైంది.  “సజ్జలు పండే రాళ్ల పొలంలో కూలీలుగా బతికే తమకు కాస్తో, కూస్తో కూడిన సంబంధం,  అందునా అయిన సంబంధం అనుకునేతట్టే, కలిసిన కుటుంబం నుంచి ఇట్టాటి పిలుపు రావడం మంచిదా? కాదా?  పిల్ల రైస్రాలు  కాకముందే పెళ్లి చేసిన పనికిమాలినోళ్లు అని లోకం తిట్టిపోస్తదా!?,  ఇప్పుడే లగ్గం చేసేస్తే,  ఆనక వచ్చే ఖర్చుల నుంచి బయటపడ్డా, పసిపిల్ల ఉసురు తగిలిద్దా!, అయినా మన పిల్ల పనివాటంలో, వంచిన నడుము ఎత్తకుండా నాలుగు సాల్ల సద్ద కంకులు కోసిద్ది కదా,  ఇంకా దిగులు ఎందుకులే      చేసేస్తే, ఒక బరువు గుండెలు మీంచి దిగిపోద్ది కదా”  అని రకరకాలుగా ఆలోచనల ముసురులో మునిగి తేలుతూనే సాగుతున్నారు.

*

         నెమ్మదిగా రైలు మంగళగిరి స్టేషన్ దాటి కిష్ణా కెనాల్ స్టేషన్ చేరింది. జీవితం లాగానే విశాలంగా ఉంది.  ఐదారు లైన్లతో చూడటానికి కళ్ళు ఇప్పార్చి చూడాల్సినంత  ఉంది కిశ్నా కెనాల్ స్టేషన్. పాతవి, కొత్తవి పట్టాలు, కట్టలుకట్టలుగా పడున్నాయి,  ఒకపక్క పట్టాల కింది సిమెంటుదిమ్మెలు నిలబెట్టి  చేసిన ప్రహరీ వెనక పెద్ద మర్రిచెట్టు చల్లగా పిలుస్తున్నట్టు ఉంది. దానికందే నిలబెట్టిఉన్నాడు గూడురిక్షాని ఓబులయ్య.  పక్కనే సైడ్ స్టాండేసి నిలబెట్టి ఉన్నాడు తన పాత లూనా బండిని.  అంత దూరం నుంచి ఆనందయ్య కుటుంబాన్ని తేరిపార చూశాడు, పరవాలేదు పిల్ల పిక్కబలం కలిగిందే,  నాలుగు గొడ్లకు గడ్డి కోసుకొని నెత్తికెత్తుకొని రాగలిగిన జబ్బ సొత్తువ ఉన్నపిల్లే!,  అనుకుంటూ భవిష్యత్తును కొలతేస్తున్నాడు.  ఈ ప్రపంచంలో ఎవరి లెక్కలు వాళ్ళవి. ఆడపిల్ల బరువు అని ఒకరు అనుకుంటే, ఇంటికి వచ్చే పిల్ల ఎంత బరువు మోయగలదనే అంచనా ఒకరిది.

          ఓబులయ్యకి రైలు కట్ట పక్కనే కృష్ణ కెనాల్ దాటంగానే అరసెంటు కనకాంబరాల తోట ఉంది. ఎటు తిరిగీ క్వార్టర్స్ లోనే ఉండే కుటుంబం కావడంతో, స్టేషనుకు ఎడంపక్క రావి చెట్టు కింద రెండు గేదలను కట్టేసుకుని, పాడి చేసుకుందామని భార్య ని వొప్పించాడు.  తన కళాసి జీతం ఖర్చులకు సరిపోతే, కష్టం చేసుకొని అయినా పాడి మింద సొమ్ము కూడేసి, అయ్య రాసి ఇచ్చిన సెంటున్నర స్థలంలో రేకుల షెడ్డు అయినా వేసుకోవాలని ఆలోచన. అందుకోసమే  వయసు పెరుగుతున్న భార్యకు తోడుగా కోడల్నితెచ్చుకొంటటే,  ఆ యమ్మి వొయసులో వుంటదిగాబట్టీ!  ఎంతచాకిరీ అయినా చేసిద్దిగాబట్టీ!,  కోడల్తో పాటు ఇంకో రెండు గేదెలను తోలుకొద్దామని ప్లాను.

అందుకే సీతిగాడికి పెదకాలవలో ఈత కొట్టడం,  చాపలు పట్టడం, గాలి గత్తరగాళ్లతో తిరగటం, దొంగతనంగా బీడీలు కాల్చడం తప్ప ఇంకేమీ చేత గాకపోయినా తొందరగా పెళ్లి చేసేయాలని ఆలోచన చేశాడు. అతడికి మనుషులూ గొడ్లూ సమానమే, ఎదగాలంటే  గొడ్డు మాదిరి పని చెయ్యాల అందులోనూ ఆడోల్లంటే పని కోసమే పుట్టిన్రని తాతల కాన్నించి నమ్మే నేలమింద తిరిగే వోడైపాయే, ఎట్టా ఎదిగామన్నది పట్టదు.

గొడ్డులా పనిచేస్తాడు కాబట్టి, పై ఆఫీసర్లకు ఇతడు ఇష్టమైన వాడే, అందుకే ఎవరు ఆ స్టేషన్ కి మాస్టర్ గా వచ్చినా ఇతడే కళాసి.  అందులోనూ అబాండెడ్ అని రాసిన క్వార్టర్స్ లో కుటుంబ సమేతంగా బతగ్గలిగిన మనిషి కావడంతో    కూత వేటు లోనే దొరికే చేతి కింద మనిషిగా పేరు సంపాదించుకున్నాడు. అది మంచి పేరని అతను అనుకుంటాడు,      పనికిమాలిన తనం అని భార్య అనుకుంటుంది, ఆఫీసర్ గారు సగంలో ఆర్పేసిన సిగరెట్టుపీకెల అదృష్టం అనుకుంటాడు యాష్ట్రే శుభ్రం చేస్తూ సీతిగాడు. ఎవరి లెక్కలు వాళ్ళవి.

*

ఏ లెక్కలూ తెలియని రాములమ్మ మాత్రం నింపాదిగా నడుస్తోంది తల్లి వెనక. స్టేషన్ నుంచి రెండు సిమెంట్ రోడ్లు దాటిన తర్వాత పగిలి పెచ్చులు లేచిన తారురోడ్లోకి వచ్చి ఇనుప బద్దలు దడిగట్టిన ఇంటి ముందు ఆగింది రిక్షా .  నెమ్మదిగా దిగారు రాములమ్మ, తల్లి. ఆ వెనకనే బండి దిగారు ఓబులయ్య అనందయ్యా, వాకిట్లోనే రైల్వే కొళాయి నీళ్లతో కాళ్లు కడుక్కుని ఇంట్లో ప్రవేశించారు .  వాకిట్లో అల్లుకున్న బచ్చలి తీగకు ఉన్న నీలం రంగు కాయలను చూసి జాన పళ్ళు గుర్తొచ్చి,  రాములమ్మ కళ్ళు మెరిశాయి.  వాటిని కోసుకోవాలనే కోరికను ఉరిమిన అమ్మ కళ్ళ వెనక దాచేస్తూ లోపలికి వెళ్ళింది.

నిలువెత్తు చాకిరికి పాత రైల్వే క్వార్టర్ పొందికగా సర్దుబడి ఉంది. బహుశా ఇల్లాలి కి పని తప్ప మరో వ్యాపకమే లేనట్టుంది.  మొహమాటపడుతూనే కుర్చీలో ఆనందయ్య, చాప మీద రాములమ్మ, వాళ్ళ అమ్మ,   సర్దుకుని కూర్చున్నారు.   మాట కలపాలి అన్నట్టుగా “ఏందో బావగారు మీరు మొగపిలగాడి తరఫున మా ఇంటికి రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మన్నారు,  మీ బలవంతం మీద రాక తప్పలేదు మాకు” అన్నాడు  ఆనందయ్య. “పర్వాలేదు బావగారు మేం కదలాలంటే గేదలు,  పాలు, పూలు, గడ్డి,  గాధం ఇంకా చాలా పన్లు తెముల్చుచుకొని రావాల.  మీరైతే పొలంపనే కాబట్టి ఒహ పూట మానేయాలన్నా ఎవరికి అప్పజెప్పాల్సిన పని ఉండదు కదా!”,  అన్నాడు ఓబులయ్య నవ్వుతూ.

తల్లికి మాత్రమే పిల్ల బతుకు కళ్ళకు కడుతుంది అన్నట్లు,  ఓబులయ్య మాటలు రాములమ్మ చేయబోయే గొడ్డుచాకిరికి నకలుగా కనబడి లోలోపలే గుబులు పడింది రాములమ్మ తల్లి.  అయినా!, ఇప్పుడు కాదంటే పెళ్లి చేయగలమో లేదో! అనే గుంజాటన లో కూరుకుపోయి నిస్సత్తుగా నవ్వింది.  భయము, బాధ, నిస్సహాయత, దిగులు తీరుతుందనే తెంపరితనం నోటిని చేదుగా చేస్తున్నా, తప్పదన్నట్టు  తెచ్చి పెట్టిన మైసూర్పాకు, బూందీ తినటం అయిందనిపించారు. ఎంతకీ తెమలని కాలాన్ని ఏదో రకంగా కదల్చాలి అన్నట్లు “పెరట్లో కాస్త చెత్త కాలిస్తే,  పొగకు దోమలు బయటికి పోతాయి కదా! వదినా,”  అంటూ మాట కలిపింది రాములమ్మ తల్లి.

ఆడోళ్లకు పేర్లతో పనేముంది?, వరుసలు, బంధుత్వాలు, కలిస్తే చాలు అన్నట్లు, “ వదినా!,” అంటూ మాటల్లోపడింది రాములమ్మ తల్లి.  డబ్బు, దస్కం అన్నీ మగాళ్ళ పనే అనే ఆలోచన, అలవాటు జీర్ణించుకున్న ఆనందయ్య, ఓబులయ్య ను  నెమ్మదిగా మాటల్లోకి దించుతూ

“అది సరే బావా!  ఇంతకీ కట్నం సంగతి, పెట్టిపోతల సంగతి అనుకోనే లేదు” అంటూ సన్నగా ఇనపడీ  ఇనపడనట్టుగా అడిగి, తలను నెమ్మదిగా దించేసుకున్నాడు. లేని తనంలో కూరకపోయే మనుషులకి పెళ్లి, మొగుడు, పెళ్ళాం, పిల్లలు,     ఇట్లాంటి మాటలు అసలు సరిపడనివి అని ఎన్నిసార్లు తిట్టుకున్నాడో,!? లెక్కేలేదు. అయినా పచ్చడి జాడీలో ఈగలు పడ్డట్టు పడతానే ఉంటం అని లోపల్లోపల నవ్వుకోని క్షణమూ లేదు.

ఆనందయ్య మాటలకు పెద్దగా నవ్వుతూ కాలుస్తున్న బీడీ చివరను కొరికి తుపుక్కు మని ఉమ్మేస్తూ “బావా మొన్న సైదయ్య బాబాయ్ కూతురు పెళ్లిలో మీ పిల్లని చూసినప్పటి నుండి మీ చెల్లెలికి ఇపరీతంగా నచ్చి, మా సీతి గాడికి మీ పిల్లనే చేయాలని ఒకటే పోరు మొదలుపెట్టింది, సమయం రానీ, అన్నా కూడా ఇనిపించుకుంటేనా,!   పొద్దుగూకానీదు తెల్లారానీదు. అదేయావ. ఇహ తప్పదని మీ కుటుంబం పరిస్థితి మొత్తం తెలుసుకొన్నాకే కబురంపాను. మీరు ఒక్కరూపాయి గూడ ఈబల్లేదులే, పెళ్లి కూడా ఈడనే చేస్తాం మీరు పిల్లా జల్ల వచ్చి పెళ్లి జరిపించి, భోజనాలు చేసిపోండి చాలు”  అన్నాడు ఓబులయ్య. ఆ మాటలకు బిత్తర పోయిన ఆనందయ్యకి ఇరగ పండిన సజ్జ చేను నడి మధ్యన నిలబడి ఉన్నట్టు   అనిపించింది.

“పుసిక్కన తేల్చుపార్నూకితివే   బావా ,   అయినా మేము ఒట్టి చేతులతో పంపిస్తావా ఏంది,!? పిల్లకు పుస్తెలు, మెట్టెలు, పట్టీలు, అబ్బాయికి ఎచ్చెంటీ వాచ్చీ, మూడు జతల బట్టలు, బాటా చెప్పులు”,   ఇంకా లిస్టు పెంచబోతున్న ఆనందయ్య డొక్కలో చిన్నగా మోచేత్తో పొడిచి ఇంక చాల్లే సంబడం అన్నట్టు చూసింది పెళ్ళాం.

ఎట్టాగైతేనే మాటలు ముగించి బయలుదేరడానికి సిద్ధపడుతూ ఇంతకీ అబ్బాయి కానరాలేదే అని ప్రశ్నార్థకంగా చూశారు“ వాడు కాలవ కాడ చేపలు పడతా ఉంటాడులే,  పోతా పోతా చూసి పోదాం పదండి” అంటూ బయలుదేర   తీసాడు ఓబులయ్య మనుషుల తలకాయల్లోని బరువు కాళ్ళ మీద పడుద్దన్నట్టు భారంగా ముగ్గురు తేలిగ్గా ఒకరు నడుస్తున్నారు.

దూరం నుంచి తండ్రి వెంబడి నడుస్తున్న ముగ్గురుని చూస్తూ కాలుతున్న బీడీని, చప్పరిస్తున్న పచ్చడాకునూ, కల్లు   సిసానూ, పొదలచాటుకు ఇసిరేస్తూ గేలం కర్రతో లేచినిలబడ్డాడు సీతయ్య.  మొగోడు అంటే బీడీలు తాగడం, చేపలు పట్టడం, కాలవ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈతెయ్యడమే లక్షణాలు అన్నట్టు గర్వంగా చూపించాడు ఓబులయ్య,.

“ పిల్లగాడికేం  బ్రహ్మాండంగా ఉన్నాడు,” అంటూ  భార్యకు, పిల్లకు చూసే టైం కూడా ఇవ్వకుండా “మాచర్ల ప్యాసింజరొచ్చే టైం అయింది పోదాం పదండి  లేట్ అయితే బస్సు కి మనిషికి ముప్పై పెట్టాలా    పదండి పదండి”

అంటూ తొందర చేసేసాడు ఆనందయ్య.  అతడి తొందర అతడిది, కాళ్ళ కాడికి వచ్చిన అవకాశం ఏ కారణం చేతనో కాలికి తగిలిన కుండ మాదిరి బద్దలై పోద్దనే భయం అతడి చేత పరుగులు పెట్టిస్తోంది.

*

తంతు తమాషా అనిపించినా , ఏదో జరగబోతుందని తాను పరాయిదాన్ని అవుతున్నాననే  ఆలోచన రాములమ్మకు కలగడం మొదలైంది. అప్పగింతల్లో అమ్మానాన్న ఎందుకు ఏడుస్తున్నరో పెద్దగా అర్థం కాకపోయినా  దిగులు మేఘంఎదో కమ్ముకున్నట్టు  మనిషి మబ్బుగా అయింది.  ఆ కాస్త తంతూ అయిపొయ్యి కీసర బాసరగా తిరిగిన బంధువులంతా బయలుదేరాగానే పిల్ల పెద్దమనిషి అయినాక పంపిస్తాంగా అని చెప్పి తమతో పాటు తీసుకొని వచ్చేసారు..   అనందయ్య దంపతులు.

అంతకు ముందుకూ, అప్పటికీ తేడా ఒకటే బాగా అర్థమైంది రాములమ్మకు.  మెడలో పిచ్చి పూసల దండ బదులు బంగారు బిళ్ళలు కట్టిన పసుపు తాడు వచ్చింది.  కాళ్ళకు కొత్తగా మెట్టెలు, కొత్త పట్టీలు. అంతే.  ఈ మాత్రం దానికి అమ్మ ఎందుకు అంత కన్నీళ్లయిందో అర్థమే కాలా!  ఏళ్ళదేముంది ఇటు చూసి అటు తిరిగేలోపు    రావూ! పెళ్లయిన పిల్ల కదా!  అనీ,  అత్తారింటికి పోతే  తప్పదు కదా! అనీ, పిల్లను అస్తారు బత్తెంగా చూసుకోవడంతో కాస్త ఒళ్ళు చేసింది ఆ క్షణాలు రానే వచ్చాయి.  వీధిలో ఉన్న అమ్మలక్కలని పేరంటానికి పిలిచి తాంబూలాలు ఇచ్చి పంపించింది రాములమ్మ తల్లి. ఉన్నంతలో కొత్త గుడ్డలు,  నువ్వు చలిమిడి,  కొబ్బరి గిన్నెలు పెట్టి  పేరంటం చేయించి, ఓబులయ్యకు పిల్లను తీసుకుపొమ్మని  కబురు పెట్టి , గుండె రాయి చేసుకోవడం మొదలుపెట్టారు ఇద్దరు.

*

              ఏదైనా ఆపగలవేమో గాని కాలాన్ని ఆపలేంకదా . కాలంతో పాటు వయసు పెరుగుతూనే ఉంటది కదా! నెమ్మదిగా అత్తారింటికి, చాకిరికి అలవాటు పడ సాగింది రాములమ్మ. పుట్టినింటి నుంచి వచ్చిన చాకిరి అలవాటు,  శారీరకంగా మానసికంగా సిద్ధమవకుండానే పెళ్లి కావడం, భార్యాభర్తల మధ్య  ప్రేమ, అనుబంధం వంటి మాటలే అర్థం కాని వయసు కావడంతో గొడ్డులా పనిచేయడం, పొద్దస్తమానం తిరిగితిరిగి వచ్చి చీకటి పడ్డట్టు మీదబడే భర్త తాకిడీ,  జీవితాన్ని యంత్రంలా మార్చేశాయి. ఏది యెట్టున్నా, పనిచేసుకుపోయే అలవాటు రాములమ్మకి ఒక నిర్లిప్తతను, అపరిమిత ధైర్యాన్ని,   అలవాటు చేసింది. తెల్లారిన కాన్నించి పొద్దు గూకే దాక   చీకటి కోసం ఎదురు చూస్తా పనిచేసుకోవడం తప్ప, మరో యవారమే తెలియనట్టు,  కాలం గడుపుతా ఉంది.

ఇప్పుడు రాములమ్మకు రేత్తిరి అంటే అమ్మపాత చీరలతో కుట్టిపిచ్చి ఇచ్చిన  బొంత. ఎల్తురంటే  కాళ్ళకు, చేతులకు పదును పెట్టి పనికి సిద్ధం చేసే సాన చక్రం.  పెళ్ళైతే  ప్రేమ పుట్టిద్దో లేదో తెలవదుగాని, ఆడామగా ఊకెనే, మూన్నిముషాలు కలిసినా పిల్లలు మాత్రం పుట్టేస్తారు. పనికీ చాకిరికీ అలవాటైన కాయవాటు శరీరం కావటంతో చిన్న వయసులోనే వరుసగా ముగ్గురిని కన్నా తేలిగ్గానే కాన్పులు అయ్యాయి. పనికిమాలిన అలవాట్లు, ఒళ్ళు గుల్లజేసే తాగుడు సీతయ్యను పెందదలాడే మాయం చేసాయి.

*

             ఇప్పుడు రాములమ్మ ముగ్గురు బిడ్డలు ఉన్న ఒంటరి.  సొంతంగా బతకడం అలవాటు అయిన తను.  ఇక అక్కడ ఉంటానికి ఇష్టపడక గుంటూరుకు మకాం మార్చింది,  ముప్పై లోపే ముగ్గురు పిల్లలతో పట్టాభిపురం చేరిన రాములమ్మ,  గజయీతగాడి మాదిరే బతుకు సముద్రాన్ని ఈదటం ప్రారంభించింది. సహజంగానే ఎదురీతా, ఎల్లీతా చేతనైన మనిషి కావడంతో చుట్టూ ఉన్న మగ,  ఆడ ఎన్ని చూపులు, మాటలు గుచ్చినా బతుకుదారిలో ఎన్ని పల్లేర్లు  పరిచినా, అన్నింటిని నలగ తొక్కుకుంటా  నడిచింది.  పిల్లలను చదివించాలని ప్రయత్నించింది.  అబ్బినోల్లకు అబ్బింది, లేనోళ్ళకి లేదు. తన బతుకు మాదిరి కాకూడదని    ఆడపిల్లకు మాత్తరం ఆచితూచి మంచి కుటుంబంలో సంబంధం చూసి  చేసింది .
ఇహ మొగనాబట్టలంటవా బతుకులోని ఉప్పదనం వాళ్ళు చిన్నప్పుడే చూశారు. తీయగా మార్చుకునే విద్య తల్లిని చూసి నేర్చుకున్నారు. పెద్దోడు బిల్డర్ దగ్గర లెక్కలు చూసే పని కుదురుకున్నాడు. చిన్నోడు చదువబ్బక బేల్దారి పనుల్లో మేస్తిరిగా నిలదొక్కుకున్నాడు. అప్పటిదాకా బతుకును సులభంగా ఎదురులేకుండా నడిపిన రాములమ్మకు యాభై ఏళ్లు వచ్చేసరికి మొదలైంది అప్పటిదాకా ఎదురుగాని సమస్య

“వాడు దాచిపెట్టిన డబ్బులను తగలేస్తే,     మేము నిన్ను మోయ్యాల్నా?,ఎవరిని అడిగి స్థలాల మీద పెట్టుబడి పెట్టాడు?  ఎవర్నడిగి చేసాడు ఈ శిలానదుల్లో యేలుబెట్టే పన్లు?. మా వల్ల కాదుమా, వాడిని పోగొట్టిన డబ్బులు తిరిగి తీస్కరమ్మను, లేదా నీదారి  వాడి దారి మీ ఇష్టం.” రెండు గొంతులు ఒక్కటైన చిన్నోడి గొంతు ప్రశ్నించింది.   ఏమీ తెలియనట్లు తలుపు వెనకాల చిన్న కోడలు.

బతుకును కాటా లో యేసినట్టు  అప్పటిదాకా లాగిన రాములమ్మ స్థిరచిత్తం కాసేపు కలవరపడింది.

“నా పిల్లలు నా బతుకు నుంచి నేర్చుకున్నారు అనుకున్నానే! ఏం జరిగింది? పెద్దోడు అనాలోచితంగా దుందుడుకంగా డబ్బు పోగొట్టాడు తప్పే,  కానీ లాభాలొచ్చి ఉంటే!?, సరే చిన్నోడు మాట్లాడింది అయినా తప్పేం లేదే!   వాడి మటుకు వాడూ రైటే సొంతంగా ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకోవాలని వాడికి మాత్రం ఉండదా ఏంది?  ఉన్న కాసిని రూకలు  గాల్లో దీపం చేస్తుంటే వాడు మాత్రం ఏం చేస్తాడు?”  ఒహటే తెగిరాని ఆలోచనల్లో పడింది.  అలాగని వీడి దగ్గర, వాడి దగ్గర పడి ఉండాలనే తత్వం తనది  కాదు .

కొడుకూకోడళ్ళని  పిలిపిచ్చింది . ఆ పూట చేతనైనవన్నీ వండి పెట్టింది తెల్లారుఝామునే లేచింది, తనకంటూ మిగిలిన ట్రంకు పెట్టే,  బట్టలు సర్దుకుంది నిదర  మొఖాన్నే కొడుకుల్ని లేపింది.

“అరేయ్ చిన్నా!  నేను ఏటి అగ్రహారంలో ఒక గది చూసుకున్న, ఆడనే ఉంటా,  తెలిసిన నాలుగిళ్లలో పని చేసుకుంటా  నా బతుకు నాదే,   నేను పుటకలతోనే పనికి పారాణి పూసిందాన్ని రా! నాకు ఎవడి  అవసరమో లే!

ఇదిగో ఇదే చెప్తున్నా నా కాడ మిగిలిన నాలుగు లక్షల్లో చెరో  ఒకటిన్నర ఇస్తా, ఒకటి నాకాడే బ్యాంకులో ఉంటాయి.  వాటి వడ్డీ నేను సంపాదించే కూలి నా బతుకు సరిపోతాయ, గోర్మెంటు ఇచ్చిన సెంటు స్థలము నాతోనే ఉంటది. సివరాకర్న ఎవడు నన్ను కడతేరిస్తే వాడికే ఆ స్థలము, డబ్బు.  పరువుగా బతకడం అలవాటైన దాన్ని కదా. ఒకడికి బరువుగా బతకలేను. పండక్కి పబ్బానికి నాకు తోచింది నేను చేస్తా.  మీరు నాకేం చేయబల్లే!”    అంటూ     రిక్షా ఎక్కింది

నలుగురూ వారించే ప్రయత్నం చేశారు కానీ   “ యుద్ధం చేయడం అలవాటైన బతుక్కి ఒకని కాడ లొంగి బతకడమంటే కుదరని పనే” పనిచెయ్యడమూ,  పంచడమూ మాత్రమే  తెలిసిన రాములమ్మ ఎక్కిన రిక్షా వేగంగా కదిలింది.

అలవాటుగా పుటుక్కుమన్నది చెనిక్కాయ,  రెండు ఇత్తులూ మిగిల్నాయ్ చేతిలో.  అదాటున రిక్షా కు చెరో పక్కనా పడ్డాయి చెనిగచెక్కులు రెండూ.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

రవికుమార్ కోసూరి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.