చీర కొంగు చీకటి 

నువ్వు సముద్రమంత లోతును ఇచ్చావు..
కానీ నేను చూస్తున్నది ఎంత ఖాళీతనమో!
నువ్వు వదిలేసిన శూన్యాన్ని కౌగిలించుకున్నాను.
నా ఊపిరిని గాలికి అప్పగించాను..
శూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు..
నువ్వు లేకపోవడమే..
రాత్రంతా నక్షత్రాలు లెక్కపెట్టాను.
తెల్లారి లెక్క తేలింది నా కన్నీళ్ళే..
ఇప్పుడు నా మౌనం
నీ గుమ్మం ముందు మోకరిల్లి కూర్చుంది..
నిశ్శబ్దాన్నీ తడిమే చీకటి,
నీ చీర కొంగులా
రాత్రంతా నా వెంటే నడుస్తోంది.
ఈ రహస్యపు నడక అసలైన తీర్థయాత్ర..
ఈ నిశ్శబ్దం అసలైన మంత్రం.
నా గాయాల మీద వెన్నెల లేపనం పూస్తావా!
ఈ ఒక్క రాత్రి నన్ను నేను మర్చిపోతాను.
ఒక కలలా నన్ను దాటిపోవద్దు..
ఇది అలసిపోయిన ఆత్మ వేడుకునే ఆఖరి వరం.
*

అహ్మద్ వలి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.