దౌలత్ బీ కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇదేంటి ఇలా జరిగింది. ఇప్పుడేం చేయాలి. ఎవరికైనా చెపితే ఏమంటారో?
సాయం చేస్తారా? చేయరా? వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఎవరితో పంచుకోవాలో అర్థంకాక వాళ్ళ ఆయన అబ్బాస్ మియాను
నిద్రలేపి జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. తనూ ఓ నిముషం కంగారు పడి తేరుకుని నువ్వు భయపడకు నేను మౌల్వీ సాబ్ తో మాట్లాడతాను. అందాకా పిల్లలను నిద్ర లేపి వాళ్లను కంగారు పెట్టకుండా వివరంగా చెప్పు అని బయటకెళ్ళిపోయాడు.
ఇప్పుడు దుఃఖం కంటే పెద్ద ప్రశ్న వాళ్లిద్దరి ముందుంది.
………..
ముందు రోజు సాయంత్రం ఐదు గంటలప్పుడు ” అమ్మా దౌలత్ బీ ఉన్నావా ” అన్న కేక విని దౌలత్ బీ బయటకు వచ్చి చూస్తే నారాయణమ్మ అత్తయ్య వస్తూ కనపడింది.
” ఓ అత్తయ్యా మీరా !! రండి రండి ఇంట్లోకి ఇప్పుడేనా రావడం ” అంటూ చెయ్యి పట్టి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి ” మా చెల్లె రంజాన్ బీ, పిల్లలు బాగానే ఉన్నారు కదా ” అని అడిగింది . అంతా బానే ఉన్నారన్నట్టుగా తల ఊపి ఏదో గుర్తుకు వచ్చిన దానిలా ” అందరూ బాగానే ఉన్నారు గానీ, ఏందమ్మా రోడ్డు మీద జనం అంతలా గొడవ పడుతున్నారు. “ఏం జరిగింది ” అడిగింది నారాయణమ్మ.
” అదా… ఓ ముస్లింల అమ్మాయి , ఓ బాపనోళ్ళ పిల్లగాడు ప్రేమ పెళ్లి చేసుకున్నారట అదే గొడవ, వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు పొద్దుట్నించి పంచాయతీ “
” దానికి గొడవెందుకు, ఇద్దర్నీ కూచోబెట్టి మంచిగా బతకండని చెప్పాలి లేదా వాళ్లు మంచిగా బతకడానికి అవసరమైన సాయం అందరూ కలిసి చేయాలిగానీ” గొణిగింది నారాయణమ్మ.
” అది నిజమే అత్తయ్యా, సరే గానీ ఎప్పుడు బయలుదేరారో ఏమో టీ పట్టుకొస్తా ” వంట గదిలోకి వెళ్ళిపోయింది దౌలత్ బీ. నారాయణమ్మ చూపు సారిస్తే చేదబావి గట్టుమీద కూర్చున్న దౌలత్ బీ చిన్న కూతురు హనీఫా కనపడింది. పశ్చిమాన సూర్యుడు కిందకు జారిపోతున్నాడు. సూర్యుడిని తదేకంగా చూస్తున్న హనీఫాను వినపడి వినపడని సన్నని గొంతుతో ” ఓ పిల్ల, ఏం చేస్తున్నావ్ అక్కడ, రా ఇక్కడికి ” అని పిలిచింది నారాయణమ్మ కిందికి జారుతున్న చత్వారపు కళ్ళజోడును పైకి లాక్కుంటూ, ఈ అమ్మాయి ఏంది ఆ కరివేపాకు చెట్టు సందులో నుంచి ఏం చూస్తుంది అని అనుకుంటూ.
హనీఫా అక్కడి నుంచి కదిలేట్టు లేదు. ఒకవేళ నారాయణమ్మ పిలుపు వినిపించినా నిజంగానే ఈ సమయంలో అక్కడి నుంచి రాలేని పరిస్థితిలోనే ఉంది. రంజాన్ నెలవంకను ముందుగా చూడాలని ప్రతి ఒక్కరికి ఉండే కోరికే. హనీఫా కూడా ఆ నెలవంక కోసం చూస్తోంది. కనుక కదల్లేని పరిస్తితే.
సరేలే ఆ అమ్మాయే వస్తుందిలే అని దౌలత్ బీ తెచ్చిన టీ తాగి నవారు మంచమ్మీద నడుం వాల్చింది నారాయణమ్మ.
ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. తల్లో నెలవంక పువ్వు పెట్టుకొన్నట్టు అందంగా ఉంది ఎర్రటి ఆకాశం. అట్లా నెలవంక కనిపించిందో లేదో హనీఫా ” చాంద్ దిక్తా హై సబ్ లోగ్ ఆజావ్ ” అని కేక వేసింది.
హనీఫా పిలుపు కోసం ఎప్పటినుంచో ఎదురుచూసే వాళ్ళు పనులు వదిలేసి క్షణాల్లో పెరటి బావిగట్టు పైనుంచి కరివేపాకు చెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఆకాశానికి అంటించినట్టున్న సన్నటి బంగారు తీగను ఆకుల సందుల్లోంచి చూపించింది హనీఫా అందరికీ. అందరూ ఎంతో సంతోషంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ముబారక్ చెప్పుకుని మళ్లీ తమ తమ పనుల్లోకి మునిగిపోయారు .
…….
దౌలత్ బీకి పేరులోనే దౌలత్. అరకొర మధ్యతరగతి కుటుంబం. ఆమె భర్త మొహమ్మద్ అబ్బాస్ రైల్వేలోగ్యాంగ్ మెన్ గా ముఖద్దంతో రిటైర్ అయ్యాడు. వచ్చిన ఆ పైసలతోనే దౌలత్ బీ కుటుంబాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ వస్తుంది.
మంచిమనసున్న మనిషి . ఇంటినిండా పిల్లలు మనవళ్ళు కొడుకులు కోడళ్ళు వాళ్ల పిల్లలు ఇల్లు ఎప్పుడు చూసినా చుట్టాలతో కళకళలాడుతూ ఏదో శుభకార్యం జరుగుతున్న ఫంక్షన్ హాలులా సందడి సందడిగా ఉంటుంది . దౌలత్ బీ అంటే చుట్టు పక్కల వాళ్ళకీ చుట్ట పక్కాలందరికీ గౌరవం. ఎక్కడలేని ప్రేమ. ఆమె ఏం చెప్పినా చిన్న పెద్ద ఎవరైనా కాదనరు. కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టడమే కాకుండా అందరి అభిప్రాయాలను గౌరవిస్తుంది. ఎందుకంటే ఆమె కొడుకులు కూతుళ్లు కోడళ్ళ మీద ఆమెకు అంత నమ్మకం వాళ్ళ మాట ఆమె తీసివేయదు, వాళ్లూ అంతే.
దౌలత్ బీ వాళ్ళ ఖాలా పెద్ద బిడ్డ రంజాన్ బీ సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఇద్దరు పిల్లలు, వాళ్ళ ఆయన అఫ్జల్ మియాతో కలిసి మందమర్రి బొగ్గు బావిలో టిమ్మర్ మెన్ గా పనిచేస్తున్న పెద్ద కొడుకు జానీమియాను చూడాలనిపించినప్పుడు స్టేషన్ కారేపల్లికో, డోర్నకల్ కో వెళ్ళాల్సి వచ్చేది. ఎంత పొద్దున ముచ్చర్ల నుంచి బయలుదేరినా డోర్నకల్ వైపు వెళ్లడానికి బస్సులు ఉండేవి కావు ఒకవేళ బస్సులు దొరికినా రైలు మిస్ అయ్యేది. డోర్నకల్ పెద్ద ఊరేం కాదు అట్లని పట్నం కూడాకాదు. కాకపోతే చుట్టూ తండాలు ఎక్కువ. వరంగల్ జిల్లాలోని ఓ రైల్వే జంక్షన్. వచ్చిపోయే రైళ్ళు అక్కడ ఆగుతాయి. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి దాకా వెళ్లాల్సిన పాస్ట్ ప్యాసింజర్ అక్కడ ఆగుతుంది. ఒకరోజు ముందుగానే సాయంత్రం డోర్నకల్ వెళ్లి రంజాన్ బి అక్క దౌలత్ బీ వాళ్ళింట్లో ఉండి వెళ్ళిపోయే వాళ్ళు. పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళైనా దౌలత్ బీ ఖాలా ఇంటికి పోవాలని మారం చేసేవాళ్ళు. ఖాలా ఇంట్లో పచ్చిపులుసుతో తిన్నా పరమాన్నంలా ఉంటుందనే వాళ్ళు. అక్కలు, అన్నలు, వదినెలు అందరూ ఎంతగానో ఆదరించేవారు. చుట్టపక్కాలతో ఎట్లా ఉండాలో కూడా అక్కడే నేర్చుకోవాలి. తన మన అనే భేదం లేకుండా బయట వాళ్ళని కూడా అంతే ప్రేమగా, ఆప్యాయంగానే అరుసుకుంటారు.
దౌలత్ బీ అసర్ నమాజ్ పూర్తిచేసుకుని నారాయణమ్మ దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంది.
” ఏం లేదు అత్తయ్యా రేపటి నుంచి నెల రోజులు రంజాన్ ఉపవాసాలు ఉండాలి కదా , అందుకే ఇల్లంతా హడావిడిగా ఉంది అంతే ” నవ్వుతూ చెప్పింది దౌలత్ బీ.
అదా సంగతంటూ ఓ పక్క సంతోష పడుతూ … ” అట్లయితే ఈ సమయంలో నేను మీతో ఉంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా కోసం వండి పెట్టడం ఇబ్బందేమో నేను రేపు మా ఊరు వెళ్ళిపోతాను” అంది నారాయణమ్మ.
” ఉద్యోగానికి వెళ్లే వాళ్లకు ఉపవాసం ఉండడానికి కుదరదు. అందరు అన్ని ఉపవాసాలు ఉండలేరు అయినా ఇంత మంది ఇంట్లో ఉన్నాం, మీరు ఒక్కరు వుండటానికి మాకేం కష్టం, మీరు ఉండడానికి ఏ ఇబ్బందేమిలేదు. ఈ నెల అంతా మాతోనే ఉండాలి సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఎప్పుడో ఒకసారి ఇలా వస్తారు. మీరొచ్చింది ఇప్పుడే కాదా ! ఇప్పుడొచ్చి రేపే అంటే ఎట్లా!? ఎప్పుడొచ్చినా వారం పది రోజులు ఉంటారు అట్లాంటిది ఈసారి పండుగ టైంకి వచ్చారు కాబట్టి ఈ పండుగ మాతోనే ఉండి జరుపుకోవాలి ” అంది దౌలత్ బీ నారాయణమ్మ కళ్ళలోకి చూస్తూ.
” నువ్వంటే నన్ను సొంత మనిషిలా చూసుకుంటావు గాని వాళ్లందరికీ ఇబ్బందిగా ఉంటుందేమో నేను రేపు వెళ్తాలే ” అంది నారాయణమ్మ .
” అట్లాంటిదేం లేదత్తయ్యా మీరంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే మా అత్తయ్యని అయితే పంపిస్తామా లేదు లేదు ఉండాల్సిందే. మా చిన్నమ్మ బిడ్డ రంజాన్ బీ కుటుంబాన్ని మీరు ఎంతో మంచిగా చూసుకుంటున్నారని మాకు తెలియదా మా చెల్లి ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటుంది. మా మరిది అఫ్జల్ మియాను మీ కొడుకు తీర్గ చూసుకుంటారని ఎన్నోసార్లు చెప్పింది”
నారాయణమ్మకు కళ్ళలో నీళ్ళు తిరిగినయ్. రంజాన్ బీ అఫ్జల్ మియా గుర్తుకొచ్చిన్రేమో వాళ్లు నన్ను ఇక్కడ వీళ్లకు పరిచయం చేయకపోతే సొంత వాళ్ళలా నన్ను ఇక్కడ ఇంత బాగా ఎవరు చూసుకుంటారు అని వచ్చే కన్నీళ్లను కొంగుతో అద్దుకుంది.
తూము నారాయణమ్మ అంటే ఆషామాషీ కాదు ముచెర్ల-జాస్తిపల్లిలో పెద్ద వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లోనే లక్షాధికారులు. చిన్న కొడుకు తూము యాలాద్రి కోడలు లక్ష్మి, తన సొంత అక్క చింతకానిలో చనిపోతే అక్క కొడుకు తల్లి లేని కొడుకులాగా ఎదగకూడదని తనే తల్లిగా పెద్ద కొడుకు బండి ఎంకయ్యను పెంచుకొని పెళ్లి చేసి తన ఆస్తిపాస్తుల్ని చేతుల్లో పెట్టి కాపాడుకుంది.
చిన్న చిన్న రోగాలు వస్తే పెద్దగా పట్టించుకునేదేంగాదు నారాయణమ్మ. మోకాళ్లనొప్పి మాత్రం ఇబ్బంది పెడుతోంది. చేను చెలక పనిచేసిన మనిషి ఆరడుగుల ఎత్తు, తెల్లటి రింగుల జుట్టు, నల్ల బంగారంలా మెరిసే చర్మం. వయసు మీద పడ్డాక కొడుకులు ఇచ్చే భరణం మీద తన సుట్టు గుడిసెలో తాను సుఖంగా బతుకుతూ దగ్గర దగ్గరగా ఎనబై అయిదు సంవత్సరాలు జీవితాన్ని గుంజుకొచ్చింది గానీ ఖమ్మంలో డా. జే. ఆర్ ప్రసాద్, డా. పాటిబండ్ల ప్రమీల, డా. హరీష్ లాంటి పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నప్పటికీ ముచ్చర్ల నుంచి కొత్త లింగాల దాకా కర్ర సాయంతో నడిచి అటెంక ఏదో బస్సు ఎక్కి డోర్నకల్ రైల్వే స్టేషన్ వెనకాల డా. జానయ్య ఆసుపత్రికి వెళ్లేది. భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లే చుట్టూ పక్కలుండే ఊళ్ళు, తండాల నుంచి వందల మంది పేషెంట్లు వచ్చే వాళ్ళు. వాళ్ళంటే ఎంతో మందికి నమ్మకం ఉండేది. ఈ క్రమంలో వస్తున్న నారాయణమ్మకు పెరుగుతున్న వయసుతోపాటు మోకాళ్ళ నొప్పి రోజు రోజుకు ఎక్కువ అవుతున్న కొద్దీ ఇబ్బందులు పడుతూ దౌలత్ బీ ఇంటికి వచ్చి ఉంటూ వుండేది.
తొందరగా నిద్రపోయి ఏ రెండింటికో నిద్ర లేవకపోతే ఉపవాసం ఉండటానికి వీలుపడదు అందరిని నిద్ర లేపాలి ఎంతో కొంత తినిపించి ఉపవాసం మొదలు పెట్టించాలని దౌలత్ బీ కొడుకు భార్య కరీమున్నీసా త్వరత్వరగా వంట చేసి వాళ్ళ అందరితోపాటు నారాయణమ్మ కూడా భోజనం పెట్టింది. అట్లా భోజనం అయిందో లేదో పెద్ద కొడుకు రజాలీ ఇంట్లోకి వచ్చాడు.
పంచాయతీ ఎట్లా జరిగిందని దౌలత్ బీ కొడుకు ‘రజాలిని’ అడిగింది.
రెండు కుటుంబాలు అయిందేదో అయింది. ఇక నుంచి వాళ్లను వాళ్ళుగా బతకనివ్వాలి. అమ్మాయి మీద అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి మీద అమ్మాయి తల్లిదండ్రులు జులుం చేయడానికి వీలు లేదు. ఎవరికి నచ్చిన మతాచారాలను వాళ్ళు పాటిస్తూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవితాన్ని గడపాలని, రెండు కుటుంబాల మధ్య ఏ గొడవలు రాకుండా సఖ్యతను పాటించాలని పోలీసుల సమక్షంలో కుల మత పెద్దలు తీర్మానించుకున్నారని రజాలి చెప్పాడు. ఏ నది పారినా ఆఖరికి సముద్రంలోనేగా కలిసేది. అట్లనే ఈ మనుషులు ఇక్కడున్నన్ని రోజులే ఈ కులాలు మతాలని గొడవలు. ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు గానీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా బతుకులు గడుస్తాయా? ఒకరితో ఒకరికి అవసరాలు పడవా ? అందరం మనుషులుగానే పుట్టాం. ఆఖరికి ఇదే మట్టిలో కలిసిపోవాల్సిందేనంది దౌలత్ బీ. కావాలని ఫలాన కులంలో, మతంలో పుట్టాలని ఎవరు పుట్టరయ్యా. ఈ భూమ్మీద అందరు సమానమే. ఈ మనుషులే అడ్డగీతలు గీసుకున్నారు గానీ అందరి పుట్టుక ఒకటి కాదా అయ్యా. ఈ మనుషుల జీవితాలు నీటి మీద బుడగలయ్యా. వచ్చేటప్పుడు తీసుకొచ్చింది లేదు పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు. మనుషుల మధ్య మనుషులు పెట్టుకునే చిచ్చు అయ్యా” గొణుక్కుంటున్నట్టు పైకే అని నడం వాల్చింది నారాయణమ్మ.
ఎంత తొందరగా పడుకున్నారో అంతే తొందరగా నిద్ర లేవాల్సి వచ్చింది. ఇంట్లో గిన్నెలు చప్పుడు అవుతుంటే నారాయణమ్మ కూడా నిద్ర లేచింది. నిద్ర లేచిన నారాయణమ్మను చూసిన కరీమున్నీసా. అమ్మమ్మ మీరు హాయిగా పడుకోండి మీకంత తొందరేమొచ్చింది అంటుండగానే దౌలత్ బీ వచ్చి అత్తయ్యా నేను మిమ్మల్ని నిద్ర లేపుతాను మీరు పడుకోండి అంది.
ఆ సమయంలో ఏం ఆకలేస్తుంది అదీనూ తెల్లవారుజామున మూడింటికి ,ఏదో తిన్నట్టు చేసారు. ఉపవాసం ఆరంభమైంది .దాని తర్వాత నమాజ్ చదువుకొని ఎక్కడి వాళ్ళక్కడ నిద్రపోయారు. దౌలత్ బీ ఒక్కతే తస్బీ తిప్పుకుంటూ ఆ అల్లా పేర్లు జపిస్తూ మేల్కొనే ఉంది.
పల్లెటూరి నారాయణమ్మకు అందరికంటే ముందు నిద్ర లేవడం అలవాటు. ఇంకా లేవని నారాయణమ్మను దౌలత్ బీ అత్తయ్యా అత్తయ్యా తెల్లవారింది అని మూడు నాలుగు సార్లు లేవండి లేవండి అని పిలిచింది.
నారాయణమ్మ నుంచి ఏ జవాబు లేదు, కప్పుకున్న చెద్దరు తొలగించి చూస్తే ఉలుకు పలుకు లేదు. రాత్రి రెండు గంటల వరకు బాగానే ఉన్న నారాయణమ్మ కదలలేదు. దౌలత్ బీ ఏదో శంకించింది. శ్వాస పరీక్షించగానే దౌలత్ బీ కి కాళ్లు చేతులు ఆడడం మానేసాయి. నారాయణమ్మ ఊపిరి ఆగిపోయి పడివుంది. ఒక్కసారిగా దౌలత్ బీ కి గుండె ఆగినంత పని అయింది.
అయ్యో ఇలా అయిందేంటి, మోకాళ్ల నొప్పులు మినహా ఆరోగ్యంగానే ఉంది కదా. అయినా వయసయిపోవచ్చిందిలే. అనుకుంటూ కళ్లలో నీళ్లు కుక్కుకుంది.
దుఖ్కం ఒక వైపు రోజా మాసంలో ఒక హిందూ ముస్లిం ఇంట్లో మరణించడం అనేది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని భయం కూడా మొదలైంది. మన కులం కాదు, మన మతం కాదు ఇలా జరిగింది ఏమిటి !? ముస్లింల ఇంట్లో చనిపోయిందని, ఏం చేసి చంపారోనని అంటారనీ, ముస్లిం సమాజానికి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళ కుటుంబానికి ఏ సమాధానం చెప్పాలో ననీ అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోయింది దౌలత్ బీ. ఏదైనా కాని అయిందేదో అయింది ఇప్పుడు మాత్రం చేసేదేముందనుకొని ముందు తన భర్త అబ్బాస్ మియాను, కొడుకులను, కోడళ్ళను చిన్నపిల్లలను అందర్నీ
నిద్రలేపింది. సరిగ్గా ఎవరు నిద్ర పోయినట్లులేదు అందరి ముఖాల మీద నెత్తుటి చుక్క లేదు. ఇంట్లో సొంత మనిషి పోయినంత దుఃఖం. ఈద్ వేళ ఆ ఇంటిని దుఖ్కం ఆవరించింది. ఒక హిందువు, ముస్లిం ఇంట్లో మరణించింది.
అదీ రంజాన్ మాసంలో.
వార్త ఊరంతా గుప్పుమంది. కొందరు వచ్చి గుసగుసలాడారు.
“ఇప్పుడు ఏం చేస్తారు?”
“హిందూ అంత్యక్రియలు ముస్లిం ఇంట్లో చేయడం సరైందేనా?”
“రంజాన్ నెలలో ఇలాంటి కార్యక్రమాలా?”
మాటలు పెరిగాయి. సందేహాలు పెరిగాయి.చర్చలు వాదోపవాదాలు అయాయి.
అనుకోని విషయాలు జరగడమే జీవితం కదా. అదేదో ఇప్పుడే జరిగిపోయింది బాధపడి చేసేదేముంది !? ముందు విషయాన్ని ఎట్లైనా బంధువులందరికీ చేరవేయడం ముఖ్యం అనుకుంది దౌలత్ బీ.
ఎవరో కబురు పెట్టినట్టున్నారు మసీదు ఇమామ్ వచ్చారు. అప్పటికే గ్రామ ఆలయ పూజారి కూడా అక్కడికి చేరుకున్నారు. అందరి మాటలు విని ఇద్దరూ దాదాపుగా ఒకే సారి ” జీవించి ఉన్నప్పుడు ఆమె ఏ మతానికి చెందినవారో, మరణించిన తర్వాత కూడా అదే గౌరవం ఇవ్వాలి,” అన్నారు.
“మృతురాలి ఆచారం హిందూ సంప్రదాయమే. అలాగే జరగాలి. కానీ ఆమె చివరి శ్వాస తీసుకున్న ఇంటికి కూడా గౌరవం ఉండాలి,” అన్నారు.
ఆ మాటలు విన్నవాళ్లు మౌనంగానే ఉండిపోయారు.
మెల మెల్లగా దగ్గరలో ఉన్న నారాయణమ్మ బంధువులు కూడా దౌలత్ బీ ఇంటికి చేరుకుంటున్నారు.
నవారు మంచంలో తన సొంత ఇంట్లో సేద తీరుతున్నట్టు నిద్రపోయింది నారాయణమ్మ. పెద్ద కొడుకు తో పాటు వెళ్లిన వాళ్ళందరూ భౌతిక కాయాన్ని చూశారు. అందులో ఒకరిద్దరూ ఆమె చావు మీద అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాం మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తామని ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అఫ్జల్ మియా రంజాన్ బీ తన వాళ్ళ కుటుంబం మీద వాళ్లు మాట్లాడే మాటలు విని ఓ పక్క బాధపడుతుంటే దౌలత్ బీ వాళ్ళలా ఆవేశపడలేదు. వచ్చిన వాళ్ళందరిని కూర్చోబెట్టి ” ఈ విషయం లో మీకు ఏ విధమైన అభ్యంతరం ఉన్నా పోస్టుమార్టం చేయించుకోండి ఆ రిపోర్టు కనుగుణంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము బాధ్యత వహిస్తావ ” అని కుండబద్దలు కొట్టింది దౌలత్ బీ.
” అదేంటక్క మీరేమిటో మాకు తెలియదా ఏంది ? ఇక్కడికి వచ్చినప్పుడల్లా రెండు మూడు వారాలు మీరెంత బాగా చూసుకుంటేనే మా అత్తయ్య ఇక్కడ ఉండేది. మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దక్కా” అని లక్ష్మి దౌలత్ బీ తో చెప్పింది.
కాటికి కళ్ళు సాపిన వయసులో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయాని పెద్ద కొడుకు వెంకయ్య తనకంటే పెద్దవాడైన అబ్బాస్ మియా దగ్గరకెళ్లి ఆయన చేతుల్ని తన చేతిలో తీసుకున్నాడు.
అఫ్జల్ మియా పెదనాన్న పెద్దమ్మ రంజాన్ బీ అంటే మా కుటుంబాల్లో ఒకరితో సమానమే ఇప్పుడు మేము మిమ్మల్ని బాధ పెడితే వాళ్ళను కూడా మేం బాధ పెట్టిన వాళ్లమవుతాం ఇప్పటికే ఆలస్యమైంది మా ఊరు తీసుకెళ్తాం అని మనవడు బాబు అన్నాడు.
దౌలత్ బీ ఓ క్షణం ఆలోచించి ఈ సంవత్సరం ఉపవాస దినాల్లో మొదటి రోజే ఇలా జరగటం మాకు ఎంతో బాధగా ఉందిగానీ మీ ఆచారం ప్రకారం జరిపించే ఆ ఆఖరి స్నానమేదో ఇక్కడే చేపిస్తే బాగుంటుందేమో ఈ పరిస్థితుల్లో మేము ఇప్పుడు అక్కడికి రాలేం అదేదో మేమూ మా కళ్ళతో చూస్తాం కాదనకండని వేడుకుంది.
అది ఇక్కడెట్లా జరిపిస్తామని ఆ జనంలో ఎవరో అన్నారు
ఎప్పటినుంచో విషయాన్ని వింటున్న మౌల్వీ సాబ్ కల్పించుకొని …
తప్పేముందండి !? మనుషులంతా ఒక్కటి కాదా. ఆమె ఆఖరి మజిలీ ఇక్కడే ముగించాలని ఆ ఈశ్వరుడికి చెప్పొచ్చిందేమో! అట్లా అనుకొని మనం ఆమెను గౌరవిద్దాం. నా మాట మీద మీరందరూ ఏకీభవిస్తే మీ పద్దతుల్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం అన్నాడు.
ఆమె తల్లిగారి తరపున అన్నదమ్ములు బట్టలు తీసుకొచ్చే ఆచారం ఉంది వాళ్ళూ వచ్చారు. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందామని వెంకయ్య అన్నాడు. అనగానే నారాయణమ్మ తమ్ముడు సరే అక్కయ్య చివరి ఘడియలు ఇక్కడే గడిచాయి కాబట్టి ఈ ఇంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అలాగే జరిపిద్దాం” అన్నాడు.
అప్పటిదాకా మౌనంగా కూర్చున్న దౌలత్ బీ వాళ్ళ ఆయన అబ్బాస్ మియా “ఈ చివరి తంతుకు సంబంధించిన ఖర్చంతా మా కుటుంబం భరిస్తుంది. మాకు అవకాశం ఇవ్వండి”
అక్కడున్న వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మా కుటుంబానికి కూడా మీ దేవతల ఆశీస్సులు కావాలని దౌలత్ బీ రెండవ కొడుకు వజీర్ మియా అన్నాడు. అందుకేనేమో ఎప్పుడొచ్చినా వారాలు వారాలు ఉండేది అనుకున్నారు నారాయణమ్మ బంధువులు. వీళ్ళని చూస్తే ఇంత మంచి వాళ్ళ మధ్యన మరణించడం కూడా గొప్ప అదృష్టమని ఎంతైనా నారాయణమ్మ అదృష్టవంతురాలని అందరూ
అనుకున్నారు.
అప్పటికప్పుడే రైల్వే స్టేషన్ బజారి వెళ్లి కొదుమూరి వెంకటాద్రి బట్టలు దుకాణం లోంచి కావలసిన చీరె, తెల్లబట్ట మిగతా వస్తువులన్నీ అక్కడి దుకాణాల్లోంచి తెప్పించుకున్నారు. నారాయణమ్మ సన్నిహితులు బంధువులతో పాటు దౌలత్ బీ కోడళ్ళు కూతుళ్లు కలిసి చివరి కార్యక్రమానికి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్థివదేహాన్ని ఇంటి ఆవరణలో ఉంచారు.ఇరుగు పొరుగు ముస్లిం పెద్దలు పందిరి వేశారు. యువకులు కట్టెలు తెచ్చారు. మహిళలు వచ్చిన వారికి నీళ్లు ఇచ్చారు.
ఆ సన్నివేశంలో ఎవరు హిందువులో, ఎవరు ముస్లింలో తెలియడం లేదు. పూజారి మంత్రాలు చదువుతుండగా నారాయణమ్మ చివరి స్నానం అయింది. నారాయణమ్మను తెల్లటి వస్త్రంలో అంతిమయాత్రకు సిద్ధం చేస్తుంటే నల్లగా మెరుస్తున్న ఆమే స్వర్గానికి వెళ్ళిపోతున్న దేవతలా అనిపించింది. ఎవరెక్కడ పుడతారో తెలియదు, ఎక్కడ పోతారో, ఎట్లా పోతారో ఎవరికి తెలియదు గానీ ఈ మధ్యలో గడిపిందే జీవితం. ఈ కులాలు మతాలు వెంట రావని గుమికూడిన జనం మాట్లాడుకుంటూ నీరాజనాలు పలికారు.
నారాయణమ్మను భౌతిక కాయాన్ని ట్రాక్టర్ ఎక్కిస్తుంటే దౌలత్ బీ కొడుకులు, బండి వెంకయ్య, మనవడు బాబు, సయ్యద్ కరీం ఊరు నుంచి వచ్చిన వాళ్ళు మనిషికో చెయ్యేసి గోవిందా గోవిందా అని ఒకపక్కమరోపక్క లాఇలాహ ఇలల్లా అంటూ భౌతిక కాయాన్ని ట్రాక్టర్ ఎక్కించారు. అంత్యక్రియలు పూర్తయేసరికి సూర్యాస్తమయం అయింది.
మసీదు నుంచి అజాన్ వినిపించింది. రహీమ్ ఇఫ్తార్ కోసం ఖర్జూరం తీసుకున్నాడు. పక్కనే నిలబడ్డ పూజారికి ఒకటి అందించాడు. పూజారి చిరునవ్వుతో స్వీకరించాడు.
ఆ దృశ్యాన్ని చూసిన గ్రామ పెద్ద నెమ్మదిగా అన్నాడు:
“ఈరోజు నారాయణమ్మ వెళ్లిపోతూ మనందరికీ ఒక పాఠం చెప్పి వెళ్లింది.”
“ఏ పాఠం?” అని ఓ యువకుడు అడిగాడు.
పెద్దాయన ఆకాశం వైపు చూస్తూ చెప్పాడు.
“మనిషి కన్నా గొప్ప మతం లేదు.”
ఆ సాయంత్రం గ్రామంలో రెండు ప్రార్థనలు జరిగాయి.
ఒకటి ఆలయంలో.
మరొకటి మసీదులో.
కానీ దేవుడి దగ్గరకు చేరిన సందేశం మాత్రం ఒక్కటే “మతాలు మనిషిని గుర్తిస్తాయి. మానవత్వం మనిషిని కలుపుతుంది.”
*








ఇప్పటి పరిస్థితుల్లో దేశానికి అవసరమైన కథ. మతోన్మాద శక్తుల కళ్ల గంతలు విప్పిన కథ. మిత్రుడు ఇబ్రహీం కు అభినందనలు. తొలి కథతో ఆగకుండా ఇలాగే ముందుకు సాగాలి.
Kapila Ram Kumar
కథ బాగుంది అండి. కథలో లాగా ఇంత సామరస్యంగా మనుషులుంటే ఇక ద్వేషాలు భయం తో పారిపోతాయి. జగతిన సర్వత్రా ప్రేమమయం అవుతుంది. అభినందనలు ఇబ్రహీం నిర్గున్ గారు