గడచిన ఏడాదిలో మరచిపోలేని కావ్యాలు

చైతన్యం ఏమిటో అన్ని ప్రక్రియల్లో కంటే కవిత్వంలో ఎక్కువగా ప్రతిఫలించే అవకాశాలున్నాయి.

‘మౌనంలో సమాధి కావడం బాధాకరమే కాని అత్యంత ప్రమాదకరం ఏమీ కాదు, మృత్యు నిశ్శబ్దంలో మునిగిపోవడం అత్యంత ప్రమాదకరం

అన్యాయం పట్ల  ఏ వేదనా చెందకపోవడం అన్నీ భరించడం ,

ఇంటి నుంచి ఆఫీసుకూ, ఆఫీసు నుంచి ఇంటికీ వెళ్లే యాంత్రిక జీవనంలో చిక్కుకుపోవడం అత్యంత ప్రమాదకరం, నీ ముంజేతికున్న గడియారం నీవు చూసినప్పుడల్లా ఆగిపోవడం అత్యంత ప్రమాదకరం, అన్నీ చూస్తూ గడ్డకట్టిపోయినట్లుగా మారిన కళ్లు అత్యంత ప్రమాదకరం, ప్రపంచాన్ని ప్రేమగా చూడడం మరిచిపోయిన కళ్లు అత్యంత ప్రమాదకరం, నీ చెవుల్ని చేరడానికి పాట విషాదకరం కావడం అత్యంత ప్రమాదరం, జీవించే ఆత్మల ఆకాశాన్ని కప్పిపుచ్చే రాత్రి అత్యంత ప్రమాదకరం,  అత్యంత ప్రమాదకరమైన ప్రమాదం మన కలలు మరణించడం…. ‘. అని రాస్తూ పోయారు పంజాబీ కవి అవతార్ సింగ్ పాష్

ఇవాళ మన జీవితం అత్యంత ప్రమాదకరమైన ఘట్టాల్ని అనుభవిస్తోందా? మన కళ్లూ, ఆత్మ గడ్డక్టటిపోయాయా? పాష్ కవిత్వం రాసిన రోజుల కంటే నేటి రోజులు మరింత రక్తసిక్తమయ్యాయా?  ‘మీ గుండెలు కుతకుత ఉడుకెత్తాలి, ఉడుకెత్తిన గుండెల్లో కొత్త రక్తం పుట్టాలి…ఒంటరిగానైనా నగ్నంగా నిలబడి మీలోకి చూసుకోవాలి.’  అని ఇటీవల మరణించిన  భైరవయ్య దిగంబర కవిత్వం రాసిన రోజులు ఇవాళ మరింత దట్టంగా, దుర్మార్గంగా తయారయయ్యాయా? ఆయన రాసినట్లు గీతం మరీమరీ చెరచబడుతోందా?

కాలానికి అద్దం పట్టకపోతే అది కవిత్వం కాదా అన్న చర్చ చాలా కాలం నుంచి జరుగుతోంది. కాని కవిత్వ ప్రయోజనాల్లో ప్రధానమైనది సమకాలీన వాస్తవికత ను అది ప్రతిబింబించడం. సమకాలీన వాస్తవికతకూ, సామాజిక వాస్తవికతకూ పెద్ద తేడా లేదు. సమాజంలోని సంక్రిష్టతల్నీ, వైరుధ్యాల్నీ, పరిణామాల్నీ ఒక వ్యక్తిగా కవి అనుభవించి, పలవరించి కవిత్వంలో అంతర్లీనంగా వ్యక్తీకరించినప్పుడు అది సమకాలీన వాస్తవికత, సామాజిక వాస్తవికత ఏక కాలంలో అవుతుంది. ఇవాళ మనం పయనిస్తున్న కాలం పై నడుస్తున్నప్పుడు కాలికి నెత్తురు అంటకుండా తప్పించుకోలేం.

కవిత్వం సాహిత్యంలో అన్నిటికంటే చైతన్యవంతమంతమైన ప్రక్రియ. నీ చైతన్యం ఏమిటో అన్ని ప్రక్రియల్లో కంటే కవిత్వంలో ఎక్కువగా ప్రతిఫలించే అవకాశాలున్నాయి. సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల వ్యక్తిగా ఒక కవి ఏ రకంగా స్పందిస్తున్నాడో, తన వ్యక్తిగత జీవితాన్ని సామాజిక జీవితంలో భాగంగా ఏ విధంగా స్వీకరిస్తున్నాడో, తన ఉక్రోశాల్నీ, తన ఆక్రోశాల్నీ, తన ప్రశ్నల్నీ, తన జవాబుల్నీ ఏ విధంగా చిత్రిస్తున్నాడో అతడి కవిత్వం ద్వారానే అర్థమవుతోంది. కవిత్వంలోని గాఢత అతడి అవహగానకు చిహ్నం. కవిత్వంలోని మార్మికత అతడిలోని తాత్వికతకు చిహ్నం. కవిత్వంలోని ప్రతీకలు అతడి మానసిక ఆర్ధ్రతకు, సున్నితత్వానికీ చిహ్నం. ఇవన్నీ కలిస్తే అతడి చైతన్యానికి చిహ్నం.

అక్టోబర్ లో వెలువడిన మిత్రుడు యాకూబ్ కవితా సంకలనం ‘తీగల చింత’ చదివితే అతడు ఎంత ప్రగాఢమైన కవో అర్థమవుతుంది. మూడు దశాబ్దాల పైనుంచి కవిత్వం రాస్తున్న యాకూబ్ ఈ మూడు దశాబ్దాల సామాజిక చరిత్రలో భాగమయ్యాడు. సహజంగానే మూడు దశాబ్దాల్లో జరిగిన సామాజిక పరిణామాలు, వ్యక్తిగత అనుభవాలు, తన అధ్యయనం ఆయనలో ఒక పరిణతికి, పరిపక్వతకూ దారితీస్తాయి. అందువల్లే ‘తీగల చింత’ లో  ఒక ప్రగాఢమైన చింతన కనిపిస్తుంది.

‘ఇన్ని కవితల మధ్య నిల్చొని నేనొక కవితలా మారిపోయాను’.. అంటాడు యాకూబ్ తొలి కవితలోనే. మన కళ్లముందు జరుగుతున్న, జరిగిన పరిణామాల మధ్య మనం రాసిన కవితల కాగితాలు గాలికి ఎగిరిపోయి మన చుట్టూ ఎగురుతూ ఉంటే వాటి మధ్య మనం ఒక కవితలా ఎగిరిపోతూ ఉండడమనేది ఒక గొప్ప అనుభవం. ‘ప్రతి పేజీ తిప్పుతున్నప్పుడు వేలి చివరల మీంచి అంటుకునే కాగితపు స్పర్శలా నేనుంటాను.’. అన్న యాకూబ్ తన పుస్తకం తెరవగానే మనలో ఆ స్పర్శానుభూతిని కలిగిస్తాడు.

యాకూబ్ కవితల్లో ఒక ధార ఉంటుంది. అదొక కాల ప్రవాహం. ఈ కవితల్లో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఈ ప్రవాహంలో కొట్టుకుపోక తప్పదు. ‘బతకాలి, ఇంకెవరో జీవించరు దీన్ని..’ అని యాకూబ్ అన్నాడంటే ‘ఎందుకు బతకాలి..’ అని ప్రశ్నించుకున్నాడన్నమాటే.ఇదొక గాఢమైన ప్రశ్న. మన కళ్లముందే సమాజం దగ్ధమవుతుంటే, మనుషులు గాలికి కొట్టుకుపోతుంటే, మానవ విలువలు ప్రశ్నార్థమవుతుంటే, సిద్దాంతాలు చెత్తకాగితాలవుతుంటే, విప్లవకారులు విగ్రహాలవుతుంటే,  జీవితం వెనక్కి నడుస్తుంటే ఒక యాంత్రికమైన బతుకు బతకాల్సి వచ్చినప్పుడు సమాజం పట్ల ఆలోచించే ప్రతి కవికీ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న తలెత్తుతుంది.  ఇది మరణించాలన్న భావన కాదు. ‘నేను మరణించుచున్నాను.. ఇట నాకొకరు చెమ్మగిలు నయనమ్ము లేదు..’ అని కృష్ణ శాస్త్రి లాంటి కవి నిర్వేదనతో ప్రకటించిన వ్యక్తిగత భావుకత ఇందులో లేదు. యాకూబ్ ది సామాజిక భావుకత. ‘ఎందుకు బతకాలి’ అన్నది ఒక దుర్భరమైన ఫీలింగ్. ‘తీగల చింత’లో చాలా కవితల్లో ఈ ఫీలింగ్ వాక్యాల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపిస్తుంది. ‘పైనుంచి పడే కత్తివేటుపై వేచి చూడ్డం మరణం కంటే ఎంతో భయంకరం’ అన్నది నేటి సామాజిక స్థితిని సూచిస్తుంది. ‘ఇంకా ఎక్కడిదాకా? ఎప్పటిదాకా? నడిచివచ్చిన దికంటే నడవాల్సిన దారి దుర్భరమవుతుంది.. జీవితం పరాయిదయింది..’ అన్న ప్రశ్న ఈ సామాజిక స్థితిలో అతడు ఎదుర్కొంటున్న జీవితాన్ని తెలుపుతుది. ‘కల చెదిరింది’ అన్న కవితలో ‘ఇక ఇప్పటికీ తెల్లారదా’ అన్న ప్రశ్న వేసుకున్నా, బతకడం ఏమీ కొత్త కాదు.. బతుకుతున్నది బతుకేనా అని అంతర్మధనం చెందినప్పుడు, పలకరింపుల్లోకి జీవితం ఒలికినట్లు కనిపించకుండా వాడిన పూరేకుల్లా అనిపించినప్పుడు, కాలానికి రెక్కలు తొడగాలని ప్రయత్నిస్తూ దేహం ఒంటరిదైపోయి ఎప్పటిలాగే కళ్ల వెనుక దాక్కుని నిద్రను నటించినప్పుడు, రోడ్డుమీద అడుగు పెట్టాక నేల పరాయిదై వెక్కిరించినప్పుడు, ఉండీ లేకపోవడంలా మారే విషాదాన్ని అనుభవిస్తూ, బతకడమే ఒక అపురూపమైన అంశమై, మృత్యువే పరమ సత్యమైందని భావించినప్పుడు, జీవితం ఒడువని తొవ్వలా సాగుతున్నప్పుడు యాకూబ్ ఒక నిస్తేజమైన, నిస్తబ్దమైన దారుణ జీవన సత్యాన్ని కవిత్వంలో పలికిస్తాడు. ఏదో కోల్పోతున్న అనుభూతి, ఒక పెనుగులాట, ఒక వెతుకులాట, ఉన్నట్లుండి గుండెలోంచి పెల్లుబుకే దుఃఖం అతడి కవిత్వంలో పరుచుకుంటుంది.

అయినా ‘నవ్వులోని విషాదం గతపు రంగు.. చిక్కని మాయ ఇవాల్ఠి పరిమళం, ఉదయపు వాగునీటి ఉరవడి మీంచి ఎగిసిన గాలిస్పర్శ  వర్తమాన ప్రతీక’ అని యాకూబ్ అన్నప్పుడు అతడికి జీవనోద్యమం మీద నమ్మకం సడలలేదని అనిపించి హత్తుకోవాలనిపిస్తుంది.

యాకూబ్ ది వ్యక్తిగత అస్తిత్వ వేదన కాదు. సామూహిక అస్తిత్వ వేదన. ఇది కేవలం అస్తిత్వ వేదనే కాదు, సమాజంలో ప్రజలకు ఒక దుర్మార్గ వ్యవస్థ కల్పించిన అభద్రతా భావన. నిన్ను నీవు నీవు పుట్టిన నేలలో పరాయిగా భావించుకోవాల్సిన పరిస్థితి, నీ ఇంట్లో నీవు కాందిశీకుడుగా మారే పరిస్థితి, స్వంత నేలపై కాలు మోపే స్థలం కావాలనుకుంటే  రిజిస్టర్ పేజీల్లో ముడుచుకుని సర్దుకోవాల్సిన పరిస్థితి, మనిషి నంబరుగా మారే పరిస్థితి కలగడం అంటే భారత దేశం తన అస్తిత్వాన్ని తాను ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడడమే..

ఈ దేశంలో లక్షలాది మంది ప్రజలు పడుతున్న సామూహిక అస్తిత్వ వేదన యాకూబ్ కవితల్లో ప్రతిధ్వనిస్తుంది.  కాశ్మీరం గురించి యాకూబ్ రాసిన కవిత లో ‘ఇక్కడ వైధవ్యం కూడా ఒకేసారి దక్కదు.’.అన్న ఒకే ఒక వాక్యం కొన్ని వేల  వేల భయానక దృశ్యాల్ని మన కళ్లముందు తచ్చాడేలా చేస్తుంది. కాశ్మీరంలోని ప్రజలతోనే కాదు, పాలస్తీనా ప్రజల వేదనతోనూ యాకూబ్ మమేకమవుతాడు.

యాకూబ్ వర్తమానంలో జీవిస్తున్న యథార్థ జీవిత వ్యథార్థ కవి. యధార్థం ఎప్పుడూ యథార్థమే, కల్పితం ఎప్పుడూ కల్పితమే.

ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన కవుల్లో అఫ్సర్ ఒక విలక్షణమైన, విశ్వజనీనమైన కవిగా మిగిలిపోతే, యాకూబ్ తనదంటూ  ఒక అస్తిత్వాన్ని ఏర్పర్చుకుని, నేలపై ఎగురుతూ దిగుతూ గింజల్ని ఏరుకునే కవిలా,  కవిత్వంలో జీవితాన్నీ, జీవితంలో కవిత్వాన్నీ శ్వాసిస్తూ జీవిస్తున్న కవి అని చెప్పడానికి వెనుకాడనక్కర్లేదు. తన తీగల చింతలో పడితే ఆ తీగలన్నీ మనను చుట్టుకుని ఒక పాశంలా బంధించక తప్పదు.

…   ….   ….   …….     …….. …..

2019లో కవిత్వ పేజీలు తిరగేస్తుంటే మన కళ్లనూ, వ్రేళ్లనూ నిలిపివేసి, మన దేహాన్ని, శ్వాసనూ బురద మట్టిలో పొర్లించిన కవి తగుళ్ల గోపాల్.

తగుళ్ల గోపాల్ ఒక సామాజిక పరిణామంలో పుట్టిన కవి. పట్టణాల్లో సంచరిస్తూ, సంచరిస్తూ,  అక్కడి నుంచి పల్లెల్ని చూసి బాధపడుతూ, వీధుల్లో ఎగిరె జెండాల్ని చూసి సంబరపడుతూ, హాళ్లలో జరిగే సభలకు వెళ్లి ఉత్తేజపడుతూ, కాఫీ హోటళ్లలో కవిత్వాలు విని చప్పట్లు కొడుతూ, తానూ సంచిలోంచి కాగితాలు తీసి ఏవో గిలికి, ఎవరికో చూపించి మురిసిపోయే కవి కాదు ఆయన.

గడచిన దశాబ్దం మట్టిని కవిత్వం చేసింది. మట్టిలోని విత్తనాలను కవిత్వం చేసింది. విత్తనాలలోంచి మొలకెత్తిన మొక్కలను కవిత్వం చేసింది. మట్టిలో దిగిన కాళ్లను కవిత్వం చేసింది. మట్టి పిసిన చేతుల్ని కవిత్వం చేసింది ఆ చేతులకు వేసుకున్న దండకడియాల్నీ కవిత్వం చేసింది. ఆ దండకడియం తగుళ్ల గోపాల్. ఆయన వెలువరించిన తాజా కవితా సంకలనం ‘దండ కడియం’ పుస్తకం చదువుతుంటే అది కడియంలా మారి మన దండకు కరుచుకున్నట్లు అనిపిస్తుంది.

అతడి కవిత్వం చదవడానికి అతడి జీవితం చదవనక్కర్లేదు. మా నాన్న ఎక్కడికి వెళ్లినా ఆయన భుజంపై ఒక గొడ్డలి ఉండేది అంటాడు ఆయన. ఉన్నట్లుండి ఆయన తండ్రి భుజం, ఆ భుజానికి అంటుకున్న గొడ్డలి మన కళ్లముందు ఆడుతుంది. అదే కవిత్వం. ఏ గొడ్డలి బతుకు పోరాటం చేయడం నేర్పిందో, అదే గొడ్డలి నాన్న కోసం పాడె కట్టెలు కొట్టుకొచ్చిందట. ‘కడుపు నిండా నీవు మేపుకొచ్చిన మేక నీ జ్ఞాపకాలను ఇంటిముందు నెమరు వేసుకువస్తుంది’ అని రాయడం ఒక నగర కవికి ఆసాధ్యం.

మన పట్ల కోళ్లూ, పశువులూ, కుక్కలూ చూపించే దయ తల్లి పట్ల కన్న పిల్లలు కూడా చూపరని, అమ్మ దీపాన్ని గాలికి వదిలేసి వెళతారని ఆయన తన ‘దండ కడియం’లోని తొలి కవితలోనే మనకు చెప్పడం జీవితంలోని దుర్భర వాస్తవికతను మనకు తెలియజేస్తుంది. ఇది అన్ని మానవ సంబంధాలనూ, కుటుంబ సంబంధాలను, జీవన సంబంధాలనూ మృగ్యం చేసిన సమాజపు దుస్థితికి అద్దం పడుతుంది.

మనుషులందర్నీ తన ఆకాశం క్రింద చేర్చుకుని ఒక అనాథ వృద్దురాలినీ అక్కున చేర్చుకోవాలనుకునే తడి నిండిన కవి తగుళ్ల గోపాల్. ‘ఎంతైనా ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్లం. ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్లం’ అంటాడు. ఈ విశ్వబంధుత్వం పల్లె కవికి తప్ప మరెవరికి సాధ్యం?

కొన్ని అంశాలపై కవిత్వం రాయాలంటే వాటితో బతుకు పంచుకోవాలి. గంజి విలువతెలిసిన వాళ్లకే గంజిపై కవిత్వం రాయడం సాధ్యం.  ‘అమ్మా, బతుకు మీద ఆశ చస్తుంది. వెచ్చటి గంజి పోసి ఇంత దొడ్డుప్పు కలిపి నన్ను బతికించవే’ అంటాడు ఆయన. నిత్యం ఛస్తున్న చావు నుంచి తప్పించుకుని బతుకు పోరులో బతకాలంటే మళ్లీ అమ్మ దగ్గరికి వెళ్లాలి. ఆమె కాచే గంజి లో ఉప్పుకలుపుకుని తాగాలి.

కుతకుత ఉడికే గంజి, ఎర్రమన్ను తట్టలో కూసుని నిమ్మలంగా నవ్వేతంగెడు పూవు పల్లె, దూపగొన్న మేక, దుంకుడు బతుకమ్మలు, కాయలు కాచిన వడ్డెరోళ్ల చేతులు, సద్దిమూట,జొన్నరొట్టె కమ్మదనం,గుంతగిన్నె,పచ్చి ఈత బరిగెల మోపు, కాల్చిన పుంటికూర రుచి, లబ్బరి చెప్పులు, గల్ల గురిగి,అమ్మ అల్లే ఈతసాప,నోటికాడి బుక్క, పెయ్యిమీద గడ్డి పూలు, మట్టి ఊయల ఇవన్నీ ఆయన కవితల్లో మనను పలకరిస్తాయి.  పట్టణ శిథిలాల మధ్య యాంత్రిక కరచాలనాల మధ్య, ఆకాశం కోల్పోయిన పక్షుల మధ్య బతుకుతున్న మనకి ఆయన కవితలు స్వచ్చమైన గాలిని అందిస్తాయి.

తగుళ్ల గోపాల్ కు నాయన భుజాలే అక్షరాల తొవ్వకు దారి చూపినవి. అమ్మే వాక్యాలకు మట్టి పూత పూసింది. తల్చుకున్నప్పుడల్లా కంటి బావి నిండా నీళ్లను నింపే అక్క జ్ఞాపకమే పదాల మధ్య ప్రవహిస్తున్న తడి. పెద్దబడి సార్ల ప్రేమే అక్షరాలపై చల్లిన అచ్చింతలు. వీటన్నింటి మధ్యా ఆయన దుఃఖపు నది దాటుకుంటూ వచ్చి నునుపుదేలిన అక్షరం.

ఆయన చెమట నది మధ్య పెరిగిన కవి. ‘ఆకలిని కూడా ఉరితీయండి.’. అని ఈ రాజ్యాన్ని ధైర్యంగా అడగగల మట్టి మనిషి. ‘కెప్పుడైనా రైతు ఊపిరి చెట్లకొమ్మలకు వ్రేళ్లాడితే, తోలు చెప్పుల సప్పుడే దేశమంతా జాతీయ గీతమై మారుమ్రోగుతుంది‘ అని హెచ్చరించగల సాహసికుడు.

కవిత్వ నిర్వచనాన్నే కాదు. కవి నిర్వచనాన్ని కూడా మార్చేసిన మట్టి కవి తగుళ్ల గోపాల్.

……..   ……….     ………..     ………..

బాల సుధాకర్ మౌళి కవిత్వం చదివితే కవిత్వం పట్ల ఆశ కలుగుతుంది. పదాల పట్ల ప్రేమ కలుగుతుంది. వాక్యం పట్ల విశ్వాసం ఏర్పడుతుంది. అక్షరాలు మనకు తోడైతే దేన్నైనా ప్రశ్నించగలం కదా అనిపిస్తుంది.

2019లో కళ్లు తప్పించుకోలేని అక్షరం బాల సుధాకర్ మౌళి. అతడికి సందర్భం తెలుసు. ఆ సందర్భానికి తగ్గట్లు ప్రశ్నించడం తెలుసు. తన ఆలోచనలకు తగ్గట్లుగా అక్షరాలను మలుచుకోవడం తెలుసు. భగ్గుమని మండే భావాల మధ్య అతడి వ్రేళ్లు అలసట తెలియని కవిత్వాన్ని రాయగలవు. నగిషీలు చెక్కిన పాత ప్రతీకలు కొత్తగా ముందుకు రాగలవు. అందుకే ఆయన కవిత్వం మరో సారి భూమి పెదాలపై పేరుతో మన ముందుకు వచ్చింది.

బాల సుధాకర్ మౌళికి దేవుళ్ల కన్నా మనుషులపై విశ్వాసం ఎక్కువ. తరతరాలు మనిషి సృష్టించుకున్న ‘నేలపై దేవుడి ఆగడాలను అడవి లేత ఆకుపచ్చని కళ్లతో చూస్తుంది’ అంటాడు ఆయన. దేవుడి అహంకారానికి నిప్పుపెట్టే ధైర్యం ఉన్న కవి అంటే ఆయనకు ఇష్టం. ‘ఒకానొక రోజు భూమి పెదాలపై కురిసే చిరునవ్వే నీవు రాసిన భవిష్యత్ చిత్రపటం’.. అనడంతో మన కళ్ల ముందు జైలు పాలైన కవి, ఆ కవి పెదాలపై సుపరిచితమైన చిరునవ్వు మనకు దృగ్గోచరమవుతుంది.

ఈ కవికి అడవి మరణిస్తున్న దుఃఖం తెలుసు. కుంకుమ పూల దుఃఖమూ అర్థమవుతుంది.ఆజాదీ హృదయ ఘోషలో తన్ను తాను ముడివేసుకోవడం ఎలాగో తెలుసు.

బాల్యం మౌళి కవిత్వం చుట్టూ తిరుగుతుంది మౌళి పసిపిల్లల చుట్టూ తిరుగుతాడు. లోకంలోని పిల్లలంతా అతనిలోనే నిద్రలేస్తుంటారు. ఇంటి ప్రక్క సందులో ఆడుకుంటున్న పిల్లలు భూమ్మీంచి ఆకాశం మీదికి ఎగురుతుంచే చూస్తుంటాడు.

బాల సుధాకర్ మౌళి కవిత్వం చదవడం కన్నా చెవి వొగ్గి వినాలి. అందులో నల్లమల అడవి తెగింపు స్వరం వినపడుతుంది. రాలిన పిడికిళ్ల నిశ్శబ్దం వినిపిస్తుంది. ఆకాశమున్నంతవరకూ సాగే గుడ్డెవ్వ పాట వినిపిస్తుంది. తుఫాను ఘోష వినిపిస్తుంది.

బాల సుధాకర్ మౌళి నిత్య నూతన కవి.

2019లో వచ్చిన ఈ కవితా సంపుటాలు చదివాక జీవితంపై అనురక్తి మరింత పెరుగుతోంది.

(యాకూబ్ ‘తీగల చింత’, తగుళ్ల గోపాల్ ‘దండకడియం’, బాల సుధాకర్ మౌళి ‘భూమి పెదాలపై’ చదివిన తర్వాత)

 

 

కృష్ణుడు

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నమస్కారం సార్ .మీ వాక్యాలు తడితడిగా గుండెల్ని తాకి మళ్ళి మళ్ళీ చదువుకునేలా చేశాయి.ఎన్ని ధన్యవాదాలు చెబితే నా ప్రేమను అవి మోసుకెళ్తాయి సార్ ?నా మీద నాకు ,నా కవిత్వం మీద నాకు ఒక భయం కలుగుతుంటే మీ వాక్యాలు నన్ను మట్టికవిగా పిలవడం నిజంగ నాకు జీవమే కదా.మీ గొప్ప స్పందనకు నమస్కరిస్తున్న సార్ .

  • కృష్ణుడు మంచి కవితా సంకలనాల పై మంచి విశ్లేషణ అద్భుతంగా ఉంది

  • ఐతే మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ఇండియా లో, తెలుగు సమాజం లో వస్తున్న అనేకానేక మార్పులు, విచ్ఛిన్నమై బలహీన పడిన అనేకానేక ప్రజా ఉద్యమాలూ, ప్రజాస్వామిక శక్తులూ, సమాజం మొత్తంగా ఒక ‘సమ్మతి’ని సృష్టించి బలపడిపోయిన ఫాసిస్టు శక్తులు, జడలు విప్పుతున్న విద్వేష జాతీయవాదం, పీడిత ప్రజలపై తీవ్రమైన దాడి చేస్తున్న పాలకవర్గాలూ, వారికండదండగా ఉండే క్రూరమైన రాజ్యం నేపథ్యం లో, మరో సారి విరసం ఒక విశాలమైన నూతన ప్రజాస్వామిక సాంస్కృతిక శక్తుల ఐక్యసంఘటనగా ఏర్పడాల్సిన చారిత్రిక అవసరం మన ముందున్నది. బ్రాహ్మణీయ మనువాద, మతోన్మాద, విద్వేష జాతీయవాద ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా సాహితీ సాంస్కృతిక ఉద్యమాన్ని విశాల ప్రాతిపదికమీద నిర్మించాల్సిన బాధ్యత ప్రస్తుత సామాజిక సాంస్కృతిక పరిస్తితి దృష్ట్యా , ఈ 50 యేండ్ల సందర్భంగా విరసం మీద ఉన్నది.
    చాలా వివరంగా రాసావు గురూ , పైన చెప్పినట్లు ఇప్పుడింకా విరసం అవసరముంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు