1
నల్లమద్ది బొగ్గుల మీద నిప్పు కణికలు ఎర్రగా నవ్వుతున్నాయి.
నిప్పు సెగకు ఎండిపోయి పగిలిపోకుండా విప్ప నూనె పట్టించిన జంట దుప్పి తోలు తిత్తుల వెదురు కర్రలను సోమమ్మ రెండు చేతులతో లయబద్ధంగా ఆడిస్తోంది. వెదురు గొట్టాల గుండా దూసుకొచ్చిన గాలి, కొలిమి గుంటకు అడ్డుగా మెత్తిన ఎర్రమట్టి తూము రంధ్రంలోంచి ‘బుస్సు.. బుస్సు..’న నిప్పుల్లోకి తన్నుకొస్తోంది. ఆ గాలి తాకిడికి కొలిమిలో మంట తాండవం చేస్తోంది. కింద వారపు సంతలో పాత ఇనుప కొట్టు దగ్గర తూకానికి కొనుక్కొచ్చిన పాత లారీ కమాన్ పట్టా ముక్క ఆ మంటలో కరుగుతూ ఎర్రటి బూరుగు పువ్వులా మారింది.
యాభై ఐదేళ్ల సింగన్న ఓజ తన ఎడమ చేతి కారుతో ఆ ఎర్రని ఉక్కు ముక్కను ఒడుపుగా పట్టుకుని, భూమిలో మూడడుగుల లోతున పాతిన చింత మొద్దు పైన దిగగొట్టిన తాతల నాటి ఇనుప ‘డాకలి’ మీద పెట్టాడు. ఇనుము డాకలి మీదికి రాగానే సోమమ్మ తిత్తి కర్రలను వదిలేసి, కొంగు నడుముకు గట్టిగా బిగించి ఎదురుగా నిలబడింది. సింగన్న తన కుడి చేతిలోని చిరుసమ్మెటతో ఎక్కడ కొట్టాలో దారి చూపిస్తూ ‘టింగు’ అని తాళం వేస్తుంటే, సోమమ్మ ఐదు కిలోల బరువైన పెద్ద సమ్మెటను రెండు చేతులతో గాలిలోకి లేపి ‘ఖంగు.. ఖంగు..’న బాదుతోంది. ఇద్దరి ఊపిరి ఒకే లయలో కొట్టుకుంటోంది. సమ్మెట పోటు పడినప్పుడల్లా ఎగిరే చిట్టెం నిప్పు రవ్వలు చీకటి గుడిసె నిండా మిణుగురు పురుగుల్లా చెదురుతున్నాయి.
నలభై ఏళ్లుగా ఆ కొలిమి సెగలో కూర్చుని కూర్చుని సింగన్న కనుబొమ్మల వెంట్రుకలు ఎప్పుడో మాడిపోయాయి. ఎర్రని నిప్పు వంక గంటల తరబడి తదేకంగా చూడటం వల్ల అతని ఎడమ కంటి నల్లగుడ్డు మీద తెల్లటి ‘కొలిమి పొర’ కమ్మింది. మోకాళ్ల కింద కాళ్ల నిండా నిప్పు రవ్వలు కాల్చిన తెల్లటి పుండ్ల మచ్చలు, చెవుల్లో ఎప్పుడూ ఆగని సమ్మెట గంగు అతని యాభై ఐదేళ్ల వయసును డెబ్బై ఏళ్ల ముసలివాడిలా చూపిస్తున్నాయి. అయినా సరే, కంటి మీద తెల్లటి పొర కమ్మినా సింగన్న చేతి ఉలి చల్లారిన కొడవలి మీద పడితే, రంపపు పళ్లలా అంగుళానికి ఇరవై కక్కులు ఒకే వరుసలో పడతాయి.
తూర్పు కనుమల్లోని ఆ చిట్టచివరి గూడెంలో సింగన్న కొలిమి ఆరిపోతే అడవిలో వేట ఆగిపోతుంది. పోడు కొండల్లో నాగలి కర్రు మొద్దుబారిపోతుంది.
“ఓజా! సింగన్నోజా! సమ్మెట కింద పెట్టు!” అంటూ గుడిసె బయట నుంచి గూడెం పెద్ద కొండదొర మల్లన్న కేక గట్టిగా వినబడింది.
సింగన్న చిరుసమ్మెట ఆపి, బొగ్గు పొగ పీల్చిన గొంతుతో చిన్నగా దగ్గుతూ, నుదుటి మీద కారుతున్న చెమటను మసిబారిన ముంజేతితో తుడుచుకున్నాడు. కాగిన ఇనుప కర్రును పక్కనే ఉన్న మట్టి తొట్టిలోని ఎర్రమట్టి, చింతపండు కలిపిన పాత నీళ్లలో ముంచి ‘నీటు’ పెట్టగానే, ‘చుయ్య్..’ మంటూ కమ్మటి ఇనుప వాసనతో కూడిన తెల్లటి ఆవిరి గుడిసె కప్పు దాకా లేచింది.
గుడిసె తడికె తోసుకుంటూ సింగన్న కొడుకు అరుణ్ రొప్పుతూ లోపలికి వచ్చాడు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ట్రైనింగ్ సెంటర్ కంప్యూటర్లో సీటు అలాట్మెంట్ కాగితం ప్రింట్ తీసుకుని, ఆఖరి బస్సు తప్పిపోతే పది మైళ్ల చీకటి కొండ దారిలో పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి వెనకాలే మల్లన్న, మరికొందరు గూడెం రైతులు లోపలికి అడుగుపెట్టారు. అరుణ్ చేతిలో ఉన్న తెల్లటి కాగితం వాడి గుండె వేగానికి రెపరెపలాడుతోంది.
“అయ్యా.. సీటొచ్చింది! నాకు పెద్ద డాక్టరు చదువుకి సీటొచ్చింది అయ్యా!” అరుణ్ గొంతులో ఆయాసం కంటే వణుకు ఎక్కువగా ఉంది. వాడు ముందుకు వంగి తండ్రి పాదాలను పట్టుకోబోయాడు.
సింగన్న ఉలిక్కిపడి రెండడుగులు వెనక్కి వేశాడు. “ఒరేయ్.. వెర్రి మొహమా! కాళ్ల దగ్గర నిప్పు రవ్వలున్నాయి, చేతులు కాలుతాయి.. లెగు!” అన్నాడు కరకుగా. కానీ ఆ కరకుదనంలో కరిగిపోతున్న ఇనుము లాంటి వాత్సల్యం ఉంది.
సోమమ్మ సమ్మెటను డాకలి పక్కన నల్లరాతి పీట మీద ఆనించి, కొంగుతో మొహం తుడుచుకుంటూ కొడుకు దగ్గరికి వచ్చింది. అరుణ్ చేతిలోని ఆ తెల్ల కాగితాన్ని పట్టుకోవడానికి సింగన్న భయపడ్డాడు…తన వేళ్లకున్న బొగ్గు మసి, విప్ప నూనె జిడ్డు ఎక్కడ ఆ చదువుల కాగితానికి అంటుకుంటాయోనని! మణికట్టు మడిచి, మోచేతితో కొడుకు కన్నీళ్లు తుడిచాడు. సింగన్నకు ఆ కాగితంలో ఉన్న ఇంగ్లీషు అక్షరాలు అర్థం కాలేదు కానీ, పదేళ్లుగా ఆశ్రమ బడిలో, కాలేజీలో చదువుతున్న కొడుకు కళ్లల్లోని వెలుగు అర్థమైంది. సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడల్లా తనతో పాటు సమ్మెట పట్టి కాయలు కాచిన కొడుకు చేతులు, ఇకపై ఊరి జనానికి నాడి పట్టుకుంటాయని ఆ తండ్రి గుండెకు తెలిసింది.
“మల్లన్నా.. నిజమేనా? మన సిన్నోడు ఊరి డాక్టరు అవుతాడా?” సింగన్న గొంతు గరగరలాడింది.
“నిజమే ఓజా! మన ఏడు గూడేలలో ఇంత పెద్ద చదువు చదివినోడు లేడు. చైత్ర పురబ్ నాడు సంకుదేవుడు కరుణించినాడు. ఇక మన గూడెంలో ఎవరికి జ్వరమొచ్చినా డోలీ కట్టుకుని కొండ దిగే పని తప్పింది!” అన్నాడు మల్లన్న భుజం మీద కండువా సవరించుకుంటూ.
ఆ రాత్రి సింగన్న కొలిమి ముందు చిన్నపాటి పండుగ జరిగింది. గూడెంలోని కొండదొరలు, బగతలు పాత ‘మేర’ లెక్కన తలా ఒక తవ్వెడు చోళ్లు, గంటి, ఎండు కొమ్ము శనగలు పట్టుకొచ్చి సింగన్న గుడిసె ముందు పోశారు. సోమమ్మ కుండలో చోడి తోప కాచి అందరికీ పోసింది. గుడిసె మూలన తుప్పు పట్టిన ఇనుప కుంచం పక్కన, అరుణ్ తెచ్చిన ఆ తెల్ల కాగితం లాంతరు వెలుతురులో మెరుస్తూనే ఉంది.
2
మరుసటి రోజు వేకువజామునే సింగన్న, అరుణ్ కొండ దిగి మండల కేంద్రానికి బయలుదేరారు. సోమమ్మ ఇద్దరికీ విస్తరాకులో చల్లని చోడి తోప ముద్దలు, ఉప్పు మిరపకాయ కట్టి ఇచ్చింది. కాలేజీలో చేరడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది.
అరుణ్ ఐదో తరగతిలో ఆశ్రమ బడిలో చేరేటప్పుడు అప్పటి తహసీల్దార్ చేతిరాతతో సంతకం చేసి ఇచ్చిన పాత అట్ట ముక్క సర్టిఫికెట్ పనికొచ్చింది. దాని ఆధారంగానే ఇంటర్మీడియట్, నీట్ పరీక్ష దరఖాస్తు నడిచిపోయాయి. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీలో చేరాలంటే యూనివర్సిటీ నిబంధనల ప్రకారం బార్కోడ్ ఉన్న ‘మీ-సేవ డిజిటల్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్’ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. నాలుగు రోజుల కిందట మీ-సేవలో ఆధార్, పాత ఫ్యామిలీ రికార్డులు లింక్ చేసి దరఖాస్తు పెట్టినప్పుడు…ముప్పై ఏళ్ల కిందట రేషన్ రికార్డులో ఎవరో గుమస్తా రాసిన కులం పేరు కంప్యూటర్లో అడ్డం పడి దరఖాస్తు తిరస్కరణకు గురైంది.
తాసిల్దార్ ఆఫీసు ఆవరణంతా జనం, దళారులతో కిటకిటలాడుతోంది. లోపల తిరిగే ఫ్యాన్ కింద కూర్చున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్.ఐ) టేబుల్ దగ్గరికి వెళ్లారు తండ్రీకొడుకులు.
ఆర్.ఐ. ఒక చేత్తో టీ కప్పు పట్టుకుని, మరో చేత్తో ఫోన్లో వాట్సాప్ మెసేజ్‌లు చూసుకుంటూ అరుణ్ ఫైలును కనీసం తలెత్తి చూడకుండానే పక్కకు నెట్టేశాడు.
“అవ్వదబ్బాయ్.. వి.ఆర్.ఓ. ఆల్రెడీ కొర్రీ వేశాడు. మీ నాన్న పాత రేషన్ కార్డులో, ఓటరు జాబితాలో కులం పేరు ‘కమ్మరి’ అని ఉంది. కమ్మరి అంటే విశ్వబ్రాహ్మణులు.. బీసీ కిందకి వస్తారు. నువ్వేమో ఎస్టీ కోటాలో ‘కొండ కమ్మర’ సర్టిఫికెట్ కోసం పెట్టావు. ఆన్లైన్లో రిజెక్ట్ చేశాం, వెళ్లండి” అన్నాడు చాలా మామూలుగా.
అరుణ్ గొంతు ఎండిపోయింది. “సార్.. మేము దిగువ ఊళ్లల్లో ఉండే కమ్మరులం కాదు సార్. మేము ఆదివాసీ ‘కొండ కమ్మర’ తెగ వాళ్లం. మా గూడానికి వి.ఆర్.ఓ. సారు ఎప్పుడూ రాలేదు, కింద సంతలో కూర్చునే రిపోర్టు రాశారు. ముప్పై ఏళ్ల కిందట మా గూడానికి వచ్చిన మైదాన ప్రాంతం పంతులు, మేము ఇనుప పని చేస్తామని ‘కమ్మర’ అని రాయబోయి చివర ‘రి’ అని రాసేశారు. ఒక్కసారి మా కొలిమి దగ్గరికి వచ్చి చూస్తే మేము కొండ కమ్మరోళ్లమో కాదో తెలుస్తుంది కదా సార్!” అన్నాడు అరుణ్ వేడుకుంటూ.
“ఏజెన్సీలో నలభై గూడేలున్నాయి, ప్రతి గూడానికి కొండెక్కి రావడానికి మాకేమైనా రెక్కలున్నాయా? కాగితం మాట్లాడుతుంది, మేము వింటాం” అన్నాడు ఆర్.ఐ. విసుగ్గా.
అతను ఫైలు విసురుగా ముందుకు తోసినప్పుడు, చెవుల్లో సమ్మెట గంగు ఉన్న సింగన్నకు ఏం జరిగిందో పూర్తిగా వినబడలేదు. కొడుకు మొహం పాలిపోవడం చూసి అడిగాడు… “ఏమన్నాడ్రా అయ్యోరు?”
అరుణ్ వణుకుతున్న వేలితో పాత రేషన్ రికార్డు జిరాక్స్ మీద ఉన్న అక్షరాన్ని చూపించాడు. “అయ్యా.. ఇక్కడ మన కులం పేరు చివర ‘ర’ తల మీద ఈ చిన్న వంపు గీత చూశావా? ఆనాడు గుమస్తా ‘కమ్మర’ అని రాయబోయి, ఈ గుడి చుట్టేశాడు. దానివల్ల మనం కొండోళ్లం కాదంట, మైదానంలో బంగారం, ఇనుము చేసే కమ్మరోళ్లమంట!”
సింగన్న తన పొర కమ్మిన కంటిని చిట్లించి ఆ కాగితం మీద ఉన్న చిన్న వంపు గీతను చూశాడు. అది అక్షరంలా లేదు, అడవిలో కుందేళ్లను పట్టడానికి పెట్టే ఉచ్చులా కనిపించింది ఆ ముసలి కళ్లకు.
“బాబూ.. అయ్యోరూ!” సింగన్న టేబుల్ కోడు పట్టుకుని ముందుకు వంగాడు. “ఆ కాగితంలో గీత ఎవరు గీసినారో మాకేం ఎరుక సామీ? మేము కారు-సమ్మెట బట్టిన కొండోళ్లం బాబూ. అడవిలో గాలివానకు పడిపోయిన నల్లమద్ది మొద్దులను ఏరుకొచ్చి, ఫారెస్టోళ్ల కంట పడకుండా రాత్రిపూట కుంపటి పెట్టి బొగ్గు కాల్చుకునేటోళ్లం. చైత్రం వస్తే గంగాలమ్మ తల్లికి ఎర్ర కోడిని కోసి, ఆ రక్తంలో కర్రులు ముంచి పోడు దున్నేటోళ్లం. మాకు మంత్రాలు రావు, బంగారం తూకం తెలీదు. మా తాత బొంద, మా అయ్య బొంద ఆ రాచకొండ కిందే ఉన్నాయే! ఆ ఒక్క గీత నా బిడ్డ గొంతు కోస్తాదా సామీ?” అన్నాడు బొంగురు పోయిన గొంతుతో.
ఆర్.ఐ. ఫోన్ స్క్రీన్ మీది నుంచి కళ్లు తిప్పకుండానే… “పెద్దాయనా, నీ కథలు నాకు చెప్పకు. ఇప్పుడు ఎస్టీ సర్టిఫికెట్ల మీద విజిలెన్స్ నిఘా ఎక్కువగా ఉంది. రికార్డులో ‘రి’ అని పెట్టుకుని నేను ‘ర’ అని డిజిటల్ ఆమోదం కొడితే నా ఉద్యోగం ఊడుతుంది. తాసిల్దార్ గారిని కలవండి పోండి” అన్నాడు.
3
మధ్యాహ్నం ఒంటిగంట ఎండకు తాసిల్దార్ ఆఫీసు రేకుల వరండా మండిపోతోంది. ఉదయం నుంచి నిలబడి ఉండటంతో సింగన్న కడుపులో పేగులు చురుక్కుమన్నాయి. సోమమ్మ విస్తరాకులో కట్టిచ్చిన చోడి తోప ముద్దను తాసిల్దార్ గది బయట జనం మధ్య తినడానికి సిగ్గుపడి, ఆఫీసు వెనకాల ఉన్న తుప్పు పట్టిన బోరు పంపు దగ్గరికి వెళ్లి నాలుగు గుక్కల చన్నీళ్లు తాగి మసి గుడ్డతో నోరు తుడుచుకున్నాడు.
వరండాలో అరుణ్ మాటిమాటికీ తన చేతిలోని పగిలిన స్క్రీన్ ఉన్న ఫోన్ చూసుకుంటున్నాడు. యూనివర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్ నుంచి మెసేజ్ వచ్చింది…రేపు మధ్యాహ్నం రెండు గంటల లోపు ఒరిజినల్ డిజిటల్ కమ్యూనిటీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయకపోతే సీటు రద్దయి తదుపరి ర్యాంకు వారికి వెళ్లిపోతుందని!
సరిగ్గా అప్పుడే తాసిల్దార్ గది తలుపు తీసుకుని టౌన్ ఐరన్ హార్డ్‌వేర్ షాపు ఓనరు, అతని కొడుకు నవ్వుకుంటూ బయటికి వచ్చారు. ఆ కుర్రాడి చేతిలో అప్పుడే ప్రింట్ తీసిన బార్కోడ్ సర్టిఫికెట్ ఉంది. అరుణ్ ఆ కుర్రాడిని చూడగానే గుర్తుపట్టాడు…వాడు తనతో పాటే ఎంట్రన్స్ కోచింగ్ తీసుకున్న మైదాన ప్రాంతపు వ్యాపారి కొడుకు.
సర్టిఫికెట్ అందుకుంటున్న ఆ కుర్రాడి చేతి వేళ్లను చూశాడు సింగన్న. ఆ వేళ్లు తెల్లగా, మెత్తగా, అప్పుడే ఒలిచిన కొండ అరటిపండులా ఉన్నాయి. సింగన్నకు అప్రయత్నంగా అరుణ్ కుడి చేతి చూపుడు వేలి మీద చిన్నప్పుడు ఎర్రని కారు జారి పడిన కాలిన మచ్చ, సమ్మెట దెబ్బకు బొటనవేలి గోరు ఊడిపోయినప్పుడు నల్లమద్ది బొగ్గు పొడి అద్ది కట్టు కట్టుకున్న గాయం గుర్తొచ్చాయి.
వరండాలో పాన్ నములుతూ తిరుగుతున్న దళారి సింగన్న దగ్గరికి వచ్చి గొంతు తగ్గించి అన్నాడు… “ఏం తాతాయ్.. నీ కాగితంలో ‘కమ్మరి’ అని ఉందని ఆపేశారా? అదిగో, ఇప్పుడే బయటికొచ్చిన హార్డ్‌వేర్ షాపు ఓనరు కొడుకు కాగితంలో కూడా ‘కమ్మరి’ అనే ఉంది. కానీ వాళ్ల నాన్న ముప్పై వేలు గుమ్మరించగానే, మన సరిహద్దు ఏజెన్సీ మండలంలో పుట్టినట్టు పంచనామా రాసి, ఆ ‘రి’ మీద ఉన్న గుడిని క్లరికల్ తప్పు కింద తుడిచేసి ‘కొండ కమ్మర’ చేసేశారు! డబ్బుంటే ‘రి’ కాస్తా ‘ర’ అవుతుంది, లేకపోతే ‘ర’ కాస్తా ఉరి అవుతుంది!”
సింగన్న గుండెలో ఎవరో ఐదు కిలోల సమ్మెటతో కొట్టినట్టయింది.
రెండు గంటలకు తాసిల్దార్ గదిలోకి పిలుపు వచ్చింది. గదిలో ఏసీ చల్లగా వీస్తున్నా సింగన్న ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. తాసిల్దార్ అరుణ్ మార్కుల జాబితాను, నీట్ ర్యాంకు కార్డును చూసి నిట్టూర్చారు. ఆయన గొంతులో కోపం లేదు, కానీ మంచు ముక్కలాంటి చల్లని నిర్లిప్తత ఉంది.
*








Add comment