1
నోత్రే – డామ్ బాసిలిక చర్చ్
రాతితో కట్టిన గుడి కాదది
కాలం చెక్కిన ప్రార్థనా శిల్పం
నోత్రే-డామ్
నీలాకాశాన్ని తాకే గోతిక్ శిఖరాలు
చర్చ్ గోడలపై శతాబ్దాల నిశ్శబ్దం
రంగు అద్దాల గుండా జారే కాంతి
ప్రతి అడుగులో ఒక చరిత్ర
మనల్ని మౌనంగా పలకరిస్తుంది.
లోపల చీకటి సంగీతమై
కుడ్య విన్యాసాలు చేస్తుంది.
ఒక్కసారిగా వెలిగే
రంగుల కిరణాలు
పురా జ్ఞాపకాల్ని తాకుతాయి;
విశ్వాసపు కథలను
కళ్లముందు కదిలిస్తాయి.
శిలువ నీడలో
వెలుగుల ప్రవాహం పారుతుంటే
అంతరంగపు దీపాన్ని
వెలిగించినట్లవుతుంది
శతాబ్దాల చీకటిని చీల్చుకుంటూ
ఒక కొవ్వొత్తి కాంతిరేఖ
ముందుకు సాగుతుంది
*

2
టొరంటో డౌన్‌టౌన్
ఆకాశాన్ని తాకే గాజు భవనాల మధ్య
ప్రతి అడుగూ
తన గమ్యాన్ని వెతుక్కుంటూ నడుస్తుంది
వీధులపై ట్రామ్ గంటలు,
సిగ్నల్ వెలుగుల మధ్య కార్ల ప్రవాహం
నగరంతో పాటు జీవితమూ పరిగెత్తుతూ ఉంటుంది
చేతుల్లో కాఫీ కప్పులూ, ల్యాప్‌టాప్‌లూ
భుజాన బ్యాగులూ
ఎవరి ప్రపంచం వారిదే,
CN టవర్ నీడలో
ఎత్తైన భవనాలు
మేఘాలతో సంభాషిస్తుంటే,
ఫుట్‌పాత్‌పైవేలాది కథలు
నిశ్శబ్దంగా దొర్లిపోతుంటాయి
గాజు గోడలలో వెలిగే దీపాలు
ఆకాశంలో చుక్కలై
నగరానికి వెలుగులై నిలుస్తాయి.
టొరంటో డౌన్‌టౌన్
వేగం నేర్పిన నగరం
జనసందోహం మధ్య
ప్రతి మనిషీ
తనకంటూ ఒక ఏకాంతాన్ని మోసుకెళ్లే నగరం.
*








Add comment