ఈ మధ్య కాకినాడ అద్దేపల్లి ఫౌండేషన్ వారు ప్రచురించిన ‘ఆధునిక కవిత్వ విమర్శ పరిణామ చరిత్ర’ పుస్తకాన్ని చదివాను. ఈ పుస్తకం కవిత్వ విమర్శ పట్ల అనేక విషయాల్ని ఒక చోట చేర్చిన గొప్ప ప్రయత్నం. అద్దేపల్లి ఈ పుస్తకానికి పరిణామ చరిత్ర అన్న పదం వాడారు. పరిణామం, చరిత్ర వాటికవే భిన్నమైనవిగా అనిపించలేదు. కానీ చరిత్ర అనేసరికి కాల నిర్ణయం, యుగ విభజన, అధ్యయన ప్రాతిపదిక మొదలైన సాంకేతిక విషయాలు మదిలో మెదులుతాయి. అద్దేపల్లి వ్యక్తుల్ని (విమర్శకుల్ని) ఆధారం చేసుకుని ఈ పుస్తకం మొత్తం రాశారు. విషయ విభజన పింగళి లక్ష్మీకాంతం వంటివారి నన్నయ యుగం, తిక్కన యుగం, శివకవి యుగం వలెనే తోచింది నాకు.
కవిత్వ విమర్శనే కాదు ఏ సృజనాత్మక ప్రక్రియనైనా వ్యక్తులే మొదట కళాత్మకంగా ఆవిష్కరిస్తారు. అయితే సామాజిక ఆర్ధిక రాజకీయ మార్పులతో నిర్మితమయ్యేదే రచనకు మూలం అనుకున్నప్పుడు వ్యక్తులు నిమిత్త మాత్రులవుతారు కదా ?
ప్రక్రియా నేపథ్యంగా పాపుపర్ అయిన విమర్శకుల రచనా విధానాల్ని చరిత్రగా మలిచిన దర్శనం ఇందులో కనిపిస్తుంది. జీవీయస్ సాహిత్య చరిత్ర విభజనలో పాటించిన అంతర్గత సూత్రాన్ని అద్దేపల్లి సమర్థిస్తారు. మంచిదే. అలాంటప్పుడు భావకవితా విమర్శ, అభ్యుదయ విమర్శ, విప్లవ విమర్శ అని పేర్లు పెట్టినప్పటికీ వ్యక్తుల నేపథ్యంలోంచే పరిణామ చరిత్రను వివరించే పనికి పూనుకోవడం ఆశ్చర్యపరిచే విషయమే.
ఈ విభజన కన్నా త్రిపురనేని మధుసూధన రావు వంటివారి ‘నిర్మాణ పద్ధతి (systems approach) అధ్యయనం చేస్తే ప్రక్రియలో ఆంతరంగిక నిర్మాణంలోని మార్పులను’ మరింత నిరూపించవచ్చును. లేదూ సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి వారు తన తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం అన్న పుస్తకంలో ఆధునిక కవిత్వాన్ని ప్రజాస్వామిక యుగం (2 దశలు) నవ్య కవిత్వం మరియూ భావకవిత్వం అని అటుతర్వాతివి మరికొన్ని సంధి దశలుగా విభజన చేశారు. కవిత్వ దశల్ని – దాని విమర్శ దశల్ని విడదీయనక్కరలేదని నా భావన. అద్దేపల్లి శీర్షికల్ని తీర్చిదిద్దినంతగా అందులోని సారాంశాన్ని వ్యక్తులకి పరిమితం చేయడం వలన ఎక్కువ ఖాళీలకు ఆస్కారమిచ్చారు. ఈ క్రమంలో ఎందరో విమర్శకుల ప్రస్తావన చేయలేకపోయాడు. ఇది విషయ లోపానికి దారితీసింది.
ఎప్పుడో భారతిలో కవిత్వ సమీక్షలు చేసిన కొంపెల్లను తీసుకుని ఉండవచ్చు. ఆరుద్ర, కృష్ణశాస్త్రి, వడలి మందేశ్వరరావు, యు ఏ నరసింహ మూర్తి, కడియాల రామ్మోహనరాయ్, వెల్చేరు నారాయణరావు వంటివారి కృషిని తలచవచ్చు. వీరి ప్రతిపాదనలన్నీ ఆధునిక కవిత్వ విమర్శలో అద్దేపల్లి దర్శించలేకపోయారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిత్వమూ కథ నవలతో బాటు విమర్శకు కూడా కందుకూరి ఆద్యుడని అద్దేపల్లి ఉటంకిస్తారు. నేను ఇక్కడ కావ్య అవతారికలు, పీఠికలు, టిప్పనీలు,లక్షణ గ్రంథాల జోలికి పోకుండా కావలి రామస్వామి, సీపీ బ్రౌన్, జూలూరి అప్పయ్య శాస్త్రి వంటివారి పేర్లను అద్దేపల్లి తీసుకుని ఉండవచ్చునని భావిస్తాను. కావలి వారి దక్కను కవుల చరిత్ర(1829)లో విమర్శక లక్షణం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది తెలుగులో లేదు కనుక మినహాయింపుకు గురి అయివుండవచ్చు. కానీ ఇది తెలుగు కవిత్వ విమర్శలో భాగంగానే తీసుకోవచ్చు. అద్దేపల్లి కందుకూరి విషయంలో ‘విగ్రహ తంత్ర విమర్శనము’ (1876) ఉటంకింపదగినదిగా ఎందుకు భావించలేదో తెలియదు. కట్టమంచి ప్రస్తావనలు విలువైనవి. కనుక రాళ్ళపల్లి, కేతవరపు రామకోటిశాస్త్రి, పల్లా దుర్గయ్య వంటి వారిని ఉటంకించవచ్చును.
అద్దేపల్లి శ్రీశ్రీ కవితా ప్రస్థానం పై రారా విమర్శ అందరికీ తెలిసిన విషయమే. అయితే ‘కొన్ని కారణాల వల్ల ఏర్పడిన అసహనంతో రారా తన సమీక్షల్లో ఎంతోమంది రచయితల్లో మంచిని చూడకుండా ప్రతీకారాల తీవ్ర ధోరణిలో రాసారు’ అంటారు అద్దేపల్లి. ఇది తప్పు. ఇక్కడ అద్దేపల్లి ఏం మంచిని చూసినట్టు ?
ఇలా భావించడం వల్ల అద్దేపల్లి శ్రీశ్రీపై తన విమర్శను సమర్థించుకోజూసినట్టు అవుతుంది. ఈ పుస్తకంలో చాలా చోట్ల తన అభిప్రాయాల్ని తానే ప్రశంసించుకుంటూ అవి కవిత్వ విమర్శలో అద్భుతమైన మలుపులవలే తనకుతాను వీరతాళ్లు వేసుకుంటారు. ఉదాహరణకు మినీ కవిత్వ విమర్శ. అలాగే మహాప్రస్థానంలోని శిల్పానికి సంబంధించిన కోణాలెన్నింటినో మొదటిసారి అద్దేపల్లి విశ్లేషించాడు (పు 76) అంటారు. నిజమే కావచ్చు కానీ ఇవన్నీ అనవసరమైనవి. ఆయన గౌరవాన్ని పెంచేవి కావు. అద్దేపల్లి చేసిన కృషి అద్దేపల్లే చెప్పుకోవాల్సిన అగత్యం లేదు.
ఈ పుస్తకం అద్దేపల్లి విమర్శ దృక్పథాన్ని అంచనా వేయడానికి దోహదం చేస్తుంది. జీవీ సుబ్రహ్మణ్యం, సంపత్కుమార, ఆర్ ఎస్ సుదర్శనం వంటివారి గురించి ప్రస్తావించిన సందర్భాల్లో అద్దేపల్లి నిర్థారణలు ఆసక్తిని రేపుతాయి. అలాగే కేవీఆర్, సోమసుందర్ వంటివారి విమర్శల గురించి కూడా వారందరూ అనుభూతిని, గతంలో ఉన్న మంచిని (సంప్రదాయాన్ని) తిరస్కరించలేదని చెబుతారు. నాకొక విషయం అర్థమయింది. అద్దేపల్లికి శిల్పం ముఖ్యం. దాన్ని తీర్చిదిద్దే అనుభూతి, కాల్పనిక ఆవేశం, ముఖ్యం. ఈ విషయంలో ఆయన విశ్వనాథ శిష్యుడా కాదా అనే దురుసు వ్యాఖ్యానం చేయను కానీ, అద్దేపల్లి కవిత్వంలో నూటికి నూరుపాళ్ళూ శిల్పం వైపునే నిలబడ్డారు. హృదయవాది. ప్రారంభం నుండి ఉపసంహారం వరకూ ఈ గమనింపు ఇందులో ప్రస్పుటంగా ఉన్నది. శేషేంద్ర పట్ల, అతని సంస్కృతాలంకార ఉదాహరణలను సానుకూలంగా చూస్తారు.
ఇక్కడే నాకు మరొక సందేహం కలుగుతుంది. ఒకే ఊళ్ళో ఉన్న ఇస్మాయిల్ గురించి మరింత చర్చించవచ్చును కదా. ఆయన కవిత్వంలో నిశ్శబ్దం, కరుణ ముఖ్యం, వంటి పుస్తకాలు కవిత్వ విమర్శలో చాలా చర్చలను లేవదీశాయి. అలాగే విప్లవ కవిత్వ విమర్శలో టీ ఏం ఎస్ గురించి ‘అనుభూతి వైవిధ్యాన్ని, శిల్ప ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే అతని అసమగ్రత అవగాహనకి వస్తుంది’ అని ముక్తాయిస్తారు. అద్దేపల్లి ఇక్కడ అనుభూతివాద సమర్ధకులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మను గురించి మాట్లాడుండవచ్చు. కానీ ఆ పని చేయలేదు. అక్కిరాజు ఉమాకాంతం ‘నేటి కాలపు కవిత్వం’ పుస్తకం గురించి కూడా విలువైన నిర్ధారణలు చేసి ఉండవచ్చు. ఇవన్నీ కవిత్వ విమర్శలో భాగమే కదా?
కొకు గురించిన ప్రస్తావనలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి. ఆయన నినాదప్రాయతను ఆమోదించారని చెబుతాడు. ఆయన కొనసాగింపు విప్లవ విమర్శలో ఎక్కువ కనబడదని చెప్పడం ఆలోచింపజేస్తుంది. కవిత్వ విమర్శలో కొకు ప్రస్తావన ఏ మేరకు లాభదాయకమో చెప్పి ఉండవచ్చు. ఆ పని చేయలేదు. ఇక్కడ వీవీని, బాలగోపాల్, ఎన్ వేణుగోపాల్, చలసాని వంటివారిని తీసుకుని ఉండవచ్చు. విప్లవ వాస్తవికత, కాల్పనికత వంటివి ప్రధాన చర్చనీయాంశాలు. జీవీ కృష్ణారావు వంటి వారి కావ్య జగత్తును పరిశీలించి ఉండవచ్చు. మార్క్సిస్టు సాహిత్య విమర్శ విభాగం అత్యంత అసమగ్రంగా ఉంది. మద్దుకూరి ప్రస్తావనలు చాలా పరిమితంగా ఉంటాయి. మద్దుకూరి వ్యాసంపై అభ్యుదయ పత్రికలో సుందరయ్య వ్యాసాన్ని ఎంతైనా చర్చించవచ్చు.
అద్దేపల్లి ప్రగతిశీలవాదిగా, మార్క్సిస్టుగా స్థిరపడలేకపోయిన వాస్తవం దాగేది కాదు. అదేం అద్దేపల్లి కి లోపం కాదు. ఆయన కీర్తికి మచ్చ తెచ్చేది కాదు. అస్తిత్వ వాదాల విమర్శ విభాగం చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి.
అద్దేపల్లి దళిత కవిత్వంలో భాష, వస్తువు పై చర్చ చేయడం బాగుంటుంది. స్త్రీవాదాన్ని బలపరుస్తారు. ప్రాంతీయ అస్తిత్వ, బహుజన, మైనారిటీ వర్గ చర్చల్లోకి అస్సలు పోలేదు. శిఖామణి, గుంటూరు లక్ష్మి నరసయ్యకు పరిమితమయ్యాడు తప్ప దళితవాద వివాదాల్ని ప్రస్తావించలేదు. ఎస్వీ సత్యనారాయణ, హెచ్చార్కె, సతీష్ చందర్, శివసాగర్ వంటివారిని తీసుకుని ఉండవచ్చు.
ఇంకా కొలకలూరి ఇనాక్, యువక, కత్తి పద్మారావులు ఎందుకు అద్దేపల్లికి కనబడ లేదో తెలియదు. స్త్రీవాద విమర్శ చర్చలో ఓల్గా, కాత్యాయని విద్మహే ని, చేరాని ప్రస్తావించిన అద్దేపల్లి నీలిమేఘాలు, గురి చూసి పాడే పాట నేపథ్యంలో వచ్చిన విమర్శను తీసుకుని ఉంటే బాగుండేది. స్త్రీవాదాన్ని నీలి కవిత్వం అన్న జ్వాలాముఖిని విమర్శకు పెట్టి ఉండవచ్చు.
వెంటాడే కలాలు పేరిట వచ్చిన బహుజన కవిత్వ పుస్తకం – కవిత్వ విమర్శకు పెద్ద చేర్పు. మైనారిటీ వాదంలో ఖాదర్, అఫ్సర్, సుంకిరెడ్డి లను ప్రస్తావించి ఉండవచ్చు. ఇక్కడ కేకే రంగనాథాచార్యుల వంటివారి కృషి మరువలేనిది. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు కచ్చితంగా ఇందులో చేర్చవలసిన విషయం. ఆధునిక కవిత్వ విమర్శలో బీ తిరుపతిరావు, సీతారాం వంటి వారి ప్రతిపాదనలు విలువైనవి. ద్వానా శాస్త్రీని, చందు సుబ్బారావును ఉటంకించిన అద్దేపల్లి జీ నాగయ్య, వెలమల సిమ్మన్న వంటివారిని పరిగణలోకి తీసుకుని ఉండవచ్చు. సమకాలీన విమర్శ లో అద్దేపల్లి విభాగించిన భావదారలు లోప భూయిష్టమైనవి.
చరిత్రలో అనేక ఆసక్తికర ఘటనలకు కవిత్వ విమర్శ సాక్ష్యంగా ఉంది. కవిత్వ విమర్శ పూల బాట కాదు, అందుకే ఇవన్నీ ఆలోచిస్తే ఇది కేవలం ‘పాపులర్’ సాహిత్య విమర్శకు మాత్రమే అద్దం పట్టిన పుస్తకంగా భావిస్తాను తప్ప కూలంకషమైన కవిత్వ విమర్శకు సంబంధించిన పుస్తకం కాదు. ఇది కవిత్వ విమర్శలో ఉన్న ప్రధాన విశాల పరిధుల్ని తెలియజేసింది. ఒక చారిత్రక నిర్మాణ రూపాన్ని ఊహించగలిగింది. ముఖ్యమైన తాత్విక విషయాలను లీలామాత్రంగా తడిమింది. కవిత్వ విమర్శకు సంబంధించి ఒక స్థూలమైన అవగాహనకు రావడానికి వీలు కల్పిస్తుంది. ఇలాంటి పుస్తకాలు రాయడానికి పూనుకోవడమంటే కత్తి అంచులపై నడవడమే. ఆ పని అద్దేపల్లి జీవితకాలం చేస్తూనే ఉన్నారు.
అద్దేపల్లి మరణానంతరం ఆయన పిల్లలు ఈ పుస్తకం తేవడం మెచ్చుకోదగ్గ విషయం. ఎంత మంచి పిల్లలు. ఆయన పేరిట ఒక విమర్శా పురస్కారం కూడా ఇస్తున్నారు. అసందర్భోచితమైనప్పటికీ ఇక్కడ ఒక మాట చెప్పాలి. వారి ఇటీవలి ఎంపికల్లో లక్ష్యం మసక బారుతున్న ప్రమాదమే ఎక్కువ కనిపిస్తోందని అంటే నొచ్చుకోరనుకుంటాను.
ఆధునిక కవిత్వ విమర్శ పరిణామ చరిత్ర – అద్దేపల్లి రామ్మోహన్ రావు – 211 పేజీలు, ధర 250, ప్రతులకు – 9949174059








ఈ పుస్తకం అద్దేపల్లి ఎప్పుడూ రాశారో శ్రీరాం పుప్పాల ప్రస్తావించకపోవం ఆశ్చర్యంగా ఉంది