కర్ర

అప్పుడు చేతులంటే ఇప్పుడు తన ఒంటిమీద నాట్యం చేసే భర్త చేతికర్ర అంటే కళావతికి మహా భయం.

”నీ కోసం, పిల్లల కోసం రక్తం ధారపోసా, దేశం కాని దేశంలో ఏ పని అంటే ఆ పని చేసా. లేబరు పనులు కూడా చివరాఖరుకు కక్కూసులు కూడా కడిగా. ఆరోగ్యం పాడు చేస్కుని సర్వనాశనం అయ్యా. ఇదిగో ఇలాగ మిగిలా కడాఖరుకు. కనికరం లేదు కదా నీకు ముండా ఎవరిని మరిగావే రా ఇటు… దగ్గర్కి రమ్మన్నానా,” రామనాథం కుడిచేత్తో కర్రపిడి పట్టుకుని నేలమీద బలం పెట్టి ఒత్తుతూ మంచంపై నుంచి లేచే ప్రయత్నం చేస్తూ ఆయాసడుతున్నాడు. చచ్చుబడ్డ ఎడం చెయ్యి బలం చాలక అతని పొట్టని ఒత్తేస్తున్నది. చాతకాక మంచం మీద కూలబడిపోయి కోపంతో ఝార్ణిల్లాడు, వింతగా అరిచాడు. ఆ అరుపులో భార్య కళావతిని అన్న బూతుమాట అతని గొంతులోంచి ఫెళఫెళలాడుతున్న గాలిని ఛీల్చుతున్నట్లుగా సయ్స్‌మని ఆమె చెవులకి చేరి, ఆమె మెదడు నరాలలో తుఫాను రేపింది.

అతని చేతిలోంచి నేలమీదికి జారిపడ్డ కర్ర ఠన్న్‌మని శబ్దం చేసింది. కళావతి గుండె ఝల్లుమంది. అచ్చం చిన్నపుడు నాన్న కాలి చెప్పుల్ని చూసినా, గోడ మీద వేలాడే నల్లని రంగులో తళతళ మెరిసే కాల నాగులాంటి బెల్ట్‌ను చూసినా ఎలాగ వెన్నును వణికించే భయం కలిగేదో ఇపుడు సరిగ్గా అలాంటి భయమే కలుగుతుంది. నాన్న ఇంట్లో ఉన్నాడనడానికి సాక్ష్యం ముందు గదిలో వామనుడి పాదాల్లాంటి నాన్న పెద్ద చెప్పులు. చెప్పులకి గడ్డీ మట్టీ ఉండేవి. తమ పచ్చని అరెకరం చెలక గుర్తొచ్చి అప్పుడందంగా కన్పించినా, ఆ చెప్పులు అమ్మ మీదకో తమ్ముడి మీదకో నాన్న విసిరినప్పుడల్లా పరమ కిరాతకంగా కన్పించేవి. పాములాంటి బెల్టు తమ దేహాల మీద బుస కొట్టినప్పుడల్లా… తర్వాత కూడా గోడమీద నాన్న ప్యాంటుకు చుట్టుకున్న బెల్టు, తమను కాటేయ్యడానికి నాన్న నడుములో దాక్కున్న పాములా కన్పించి భయపెట్టేది. ఇప్పుడు తన భర్త చేతికర్ర, దానికంటే ముందు తనను ఒడిసి పట్టుకునే.. తన మీద, పొడవాటి వేళ్ళదాకా పాకి గుమ్మడాకంత పెద్ద అరచేతుల అచ్చులు పడేలా కొట్టే ఇనుపకడ్డీలాంటి చేతులు అంటే చచ్చేంత భయం.

చేతులు బలహీనం అయ్యాక దాని స్థానం ఆక్రమించిన ఆ కర్ర బలవంతం అయ్యింది. అప్పుడు చేతులంటే ఇప్పుడు తన ఒంటిమీద నాట్యం చేసే భర్త చేతికర్ర అంటే కళావతికి మహా భయం.

కళావతి ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉంది. సిగ్గుతో చితికి పోతూ ఇరుగుపొరుగు ఇళ్ళవైపు ఖంగారుగా చూస్తోంది. రాత్రి పన్నెండు దాటింది. వాకిట్లో గూళ్ళల్లో కోడిపిల్లలూ, ఇరుగు పొరుగిళ్ళల్లో మనుషులూ నిద్రపోతున్నారు. గచ్చుమీద తన పెంపుడు క్కు ఛోటు గురక పెడుతున్నది. భర్త అరుపులకి ఇరుగుపొరుగు వాళ్ళు లేచి అరుస్తారేమో అని భయపడుతున్నది కళావతి. ఎవరూ లేవలేదు.

కళావతి మెల్లగా నిట్టూరుస్తూ గోడకి ఒరిగింది. ఆకాశం నిశ్చలంగా చంద్రుడు, చుక్కల్ని వెలిగిస్తుంటే చూస్తున్నది.

తన జీవితంలోని కాంతినంతా లాక్కుని వెలుగుతున్నాయా ఈ నక్షత్రాలు అన్నట్లుగా ఆమె చూపులు ఆకాశంలో నక్షత్రాల్ని గుచ్చసాగాయి. చంద్రుని వెన్నల ఆమెను కాల్చసాగింది. కళ్ళలోంచి వెచ్చని కన్నీళ్ళు ఆమె చంపల మీదుగా కొండల మీద ఏటవాలు రాళ్ళ మీద పడ్డ వాన చినుకులు జారి నేల మీద పడుతున్నట్లుగా, ఆమె ఛాతీ మీదకి పడుతున్నాయి మండిపోతున్న హృదయాన్ని చల్లబరచాలన్నట్లుగా. లోపల నుంచి రామనాధం కలవరిస్తున్నట్లుగా ఇంకోసారి అరిచాడు. చోటు విసుక్కుంటున్నట్లు గునిసి నిద్ర లేచి పక్కనే ఉన్న కళావతిని చూసి సంతోషంగా తోకూపుతూ వచ్చి ఆమె తొడల కానుకుని ముడుక్కొంది. కళ్ళు మూస్కొని వెచ్చని కన్నీటి స్పర్శను అనుభవిస్తున్న కళావతికి చోటు వెచ్చని స్పర్శ ఎంతో ఆత్మీయంగా అన్పించింది. ఒంటరి రాత్రి తనకు తోడుగా భరోసా ఇస్తున్న చోటుని మెల్లగా నిమిరింది. ఛోటు ఎప్పుడూ ఇంతే.. రామనాధం అరుస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు తను కూడా రామనాధం మీద అరుస్తూ, గెంతుతూ… కర్రని నోటితో గట్టిగా పట్టుకుంటూ ఆపుతూ ఉంటుంది. రామనాధం తనను కొట్టటాన్ని అస్సలు సహించదు సరికదా రామనాధంతో ఎన్నోసార్లు అదే కర్రలో దెబ్బలు తిన్నది – మూల్గినిది – ఏడ్చింది కానీ తనను రామనాధం నుంచి కాపాడ్డం మాత్రం ఆపలేదు. కళావతి ఛోటును మరింత దగ్గరగా జొనుపకుంది.

ఇంతలో రామనాధం గాలిలోకి విసిరిన బూతుమాట ఆమె చెవులకి చేరింది. పక్కింటి కిటికీ కిర్రుమని తెర్చుకుంది. అందులోంచి వెంకటేశం మొఖం కనపడింది. ఆ మొఖం కిటికీలోంచి ”థూ నీయమ్మ ఎప్పుడూ గొడవలే కుక్కలు నయ్యం” అంటూ తుపుక్కున వుమ్మింది. కళావతికి బతకాలన్పించలేదు ఎప్పటి లాగే. వెంఠనే పెరట్లో ఉన్న బావిలో దుంకి చచ్చిపోవాలనిపించింది. సస్తే పోలా అనుకుంది. చరచరా బావి దగ్గరికి చేరింది. దడదడలాడే గుండెతో బావిలోకి తొంగి చూసింది. బావిలోని నీళ్ళు మృత్యువుని తాగినట్లు తళా తళా మెరుస్తా ఉన్నాయ్‌. నీటి అద్దం మీద చందమామ కళావతి చేయబోయే పని చూసి ఒద్దొద్దని ఒణికాడు.. చందమామ పక్కనే తన ముఖం చూసింది కళావతి. తన మొఖం పక్కనే తన బిడ్డ మాధురి, నిఖిల్‌ మొఖాలు కనపడ్డాయి కళావతికి… ఛోటుకి ఏం అర్థమయ్యిందో కుఁయి కుఁయి మంటూ కళావతి చీర పళ్ళ మధ్య ఇరికించుకుని లాగసాగింది. కళావతి ఒక్కసారి స్పృహలోకి వచ్చింది. నీరసంగా తిరిగొచ్చి గచ్చు మీద కూర్చుంది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఛోటు ఖంగారుగా తన మొఖాన్ని కళావతి మొఖం మీద కప్పుకున్న  చేతుల మీద గుచ్చసాగింది. కొద్దిసేపు దుఃఖం చాక మెల్లగా కళ్ళు తుడ్చుకుంది. మోర ఎత్తి ఆకాశాన్ని చూసింది. చంద్రుడు కళావతి బావిలో దుంకనందుకు సంతోషిస్తున్నట్లు చిరునవ్వు నవ్వాడు. కళావతికి మళ్ళీ తన పిల్లలు గుర్తుకొచ్చారు. ఇద్దరూ టవునులో పెద్ద చదువులు చదువుతున్నారు. పిల్ల పెళ్ళి చెయ్యాల రెండేళ్ళైతే. తను పోతే పిల్లలకెవరూ దిక్కు మరి? కళావతి ఎప్పటిలాగే దుఃఖాన్ని గుక్కిళ్ళలో మింగింది. ఛోటుని ‘చ్చూచ్చూ… ఛోటూ నిద్రపో ఇంకా” అంటూ నిమిరింది. మెల్లగా లేచి ఇంట్లోకి నడిచింది. భర్త మంచం వైపు చూసింది. అసహనంగా అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఇందాక కర్ర నేలమీద బడి అతని మూత్రపు డబ్బాని తన్నిందేమో… అతని మంచం కిందంతా మూత్రం చిమ్మి ఉంది. కళావతికి కడుపులో తిప్పింది. ఇప్పుడు తనే అదంతా శుభ్రం చేయాలి. చెయ్యాలంటే అతని దగ్గరికి వెళ్ళాలి. వెళితే ఇంకేమన్నా ఉందా? మళ్ళీ బూతు పురాణం మొదలుపెడతాడు. దగ్గరకు రమ్మంటాడు. తనమీద తుపుక్కున ఊస్తాడు ఊహఁ.., కళావతి మెల్లిగా పిల్లిలా నడుస్తూ వంటింటి దగ్గరున్న తన పక్క మీదకు చేరింది.

– – –

నను లేపడానికి వచ్చిన కళావతి మీద కర్రతో స్వైరవిహారం చేసాడు రామనాధం. ఆమె చెయ్యి అందిస్తే లేచి కూచున్నాడు, కుడి చేత్తో పిడి గుద్దులు గుద్దాడు ఎడాపెడా… పని చేస్తున్న కాలితో తన్నాడు. ”కర్ర ఇటియ్యి” అని గద్దించి మరీ కర్రందుకున్నాడు. కర్రా కుడిచేయి ఒకటేగా చేస్కుని కళావతి ఒంటి మీద ఆడించసాగాడు. కళావతి రెండు చేతులతో కర్ర పట్కోని ఆపుతూ.. అతని బూతులను, నోటి నించి తన మొఖం మీద పడే తుంపర్లనూ, దెబ్బలనూ, తనమీద థూ అని ఊస్తున్న ఉమ్ములనూ అలవాటున్న దానిలాగా భరిస్తూ… అతన్ని బాత్రూంకి తీసుకు పోయింది. బాత్రూంలో నీళ్ళు పెట్టటం, బ్రష్‌ మీద పేస్టు వేసి ఇవ్వడం నోరు కడుక్కోడానిక నీళ్ళు పొయ్యడం, స్నానానికి నీళ్ళు అందించడం అతని ఒంటి మీద పుండ్లకు అంటకుండా సబ్బు రుద్దడం, స్నానమయ్యాక ఒళ్ళు తుడవడం చేసింది. చేస్తున్నంత సేపూ రామనాధం పళ్ళు పటపటలాడిస్తూ ఏదో ఒకటి వాగుతూనే ఉన్నాడు. కళావతిని కోపంగా చూస్తూనే ఉన్నాడు. కళావతి ఆ క్షణాల్లో అతని చూడకుండా వినకుండా ఒకసారే గుడ్డిదీ, చెవిటిదీ, మూగదీ అయి పోయింది. రోజూ అవుతుంది కూడా… లేకపోతే ఏమీ చెయ్యలేదు. ఒక్కోసారి భరించలేక బాత్రూంలోంచి బయటకు వెళ్ళబోతే ”ముండా పూర్తి కాకుండా ఎటు పోతున్నావే రా… నీళ్ళు పొయ్యి” అంటూ తన చేతులని గోళ్ళు గుచ్చేలా పట్టుకుని ఆపుతాడు. అరుస్తాడు. ఇల్లు బజారు చేసేస్తాడు. అతనికి స్నానం చేయించేపుడు కళావతి గుడ్డి, చెవిటి, మూగదే కాదు రాతి ముఖందిగా మారిపోతుంది. క్రోధం, అసయ్యం, బాధ, దుఃఖం ఏదీ కన్పించకూడదు మరి రామనాధానికి. అతడి స్నానం పూర్తయ్యాక బట్టలు వేసి… తల దువ్వడానికి అతని ముందు అద్దం పట్టుకుని నిల్చుంది. అలా నిలబడ్డప్పుడు వింతగా అన్పిస్తుంది కళావతికి. అతని వికృతమైన కౄరమైన ముఖాన్ని తను అద్దంలో చూపిస్తున్నా గుర్తు పట్టడేం ఇతను అన్పిస్తుంది. పోనీ కనీసం అద్దం ఆవల ఉన్న తన వాడిన మొఖాన్ని గుర్తు పడ్తాడా అనిపిస్తుంది. తల దువ్వుకుంటాడు. బట్టలు వెయ్యడానికి ముందే పౌడరు చల్లి అతని పుండ్లకు మందు రాస్తుంది నిర్లిప్తంగా. ”గ్లౌవుసెందుకు వేస్కుంటావే… మందు రాయడానికీ తియ్యవి ముందు” అని గద్దిస్తాడు. తన వినదు… చెవిటిది కదా అతని సమక్షంలో. చాలా సార్లు తనలా చెవిటిదీ మూగదీ గుడ్డిదీ అయి పోవాలని లేకపోతే బతకజాలదనీ తీర్మానించుకున్నది కళావతి. ఆ చేత్తో తను అన్నం తినద్దూ? ఊహూఁ తన అసహ్యాన్ని ప్రదర్శించద్దు. దొడ్డికెళ్ళిన అతని బట్టలు, మూత్రంలో నానిన పక్కబట్టలు తీసేప్పుడూ, తనను తిట్టుకుంటూ ఎడాపెడా ఉమ్ములూసిన అతని మంచం చుట్టూ తుడుస్తున్నప్పుడూ గ్లౌవుసులు వేస్కొంటుంది. తుడిచేప్పుడు తన ముఖంలో ఏవైనా అసహ్యం కనిపిస్తుందేమోనని గుచ్చి గుచ్చి చూస్తాడు. అంటే అసియ్యం కనపడద్దన్న మాట తను వదిలిన కంపునంతా మల్లె పూలు ఎత్తుతున్నట్లే ప్రసన్నంగా ఎత్తాలి వీడికి. ఖర్మ… అవన్నీ చేసేప్పటికీ తన ఒళ్ళంతా కుళ్ళిపోయి దుర్గంధం వేస్తుంటుంది. వెంఠనే గంటసేపు స్నానం చేస్తే కానీ ఆ దుర్గంధం పోదు. మెల్లగా రామనాధంను నడిపించుకుంటూ ఇంటి ముందరి  అరుగు మీద కూర్చోబెట్టింది. రోజూ ఇలాగే తెల్లారడం కళావతికి.

వేడి వేడి టీ తెచ్చి భర్త చేతికి ఇచ్చింది. భర్త పక్కమీదా కిందా చేసిన కంపంతా ఫినాయిల్‌ పోసి కడిగి, ఉచ్చలో తడిసిన అతని పక్క బట్టలు వేణ్ణీళ్ళూ, డెట్టాలూ పోసి ఉతికి స్నానానికి వెళ్ళిపోయింది. తనకు టీ చేస్కుని వంటింటి గుమ్మానికి చేరబడి తాగసాగింది అలసటగా.

ఇంకా ముక్కుల్లో అతని మల మూత్రాల వాసన వస్తున్నట్లే ఉంది కళావతికి కళ్ళ నీళ్ళొచ్చాయి. అతని మంచంవైపు చూసింది. ఫినాయిల్‌ వాసనతో నిండిపోయింది గది. రోజూ పొద్దున్నే ఇంట్లోపల చీవురు, రేకులు పట్టి బాత్రూమూ కక్కూసుదొడ్డిని కడుగుతున్నట్లే ఉంటుంది కళావతికి. ఇతని మీద ఉన్న కొద్దిపాటి మెతకతనం తగ్గిపోసాగింది కళావతికి… ఒక నిర్లిప్తత… కోపం నిండి పోసాగాయి. ముక్కు, కళ్ళూ మూస్కొని… చర్మాన్ని మొద్దు బార్చుకుని ఈ కంపు కొట్టే పని క్షణాల్లో పూర్తి చేసి వాంతొస్తే పక్కకి పోయి బొళుక్కుని వాంతి చేస్కోవచ్చు. కానీ పక్కలోకి రానందుకు  తన్నులు – బూతులు ఎవరితో అంటే వాళ్ళతో అక్రమ సంబంధాలు అంటెయ్యటాలూ ఎలా బరించడం… ఈ ఖంపును… ఎంత కాలమింక ఇలాగు బతకడం? ”ఒదిలెయ్యి అక్కా ఎల్లిపో టవునులో రూము తీస్కుని ఆడపిల్లల కన్నా వండి పెట్టు ఆల్ల ఆరోగ్యం అన్నా బాగుంటది నువ్వూ నిమ్మలంగా ఉండచ్చు అక్కా” అంటాడు తమ్ముడు సురేష్‌… అమ్మా అంతే… ”ఎల్లిపో తల్లీ వాడి బాధ వాడు పడ్తాడు. వాడి అక్కుందిగా అది చూస్కుంటది లే… అప్పటికి కానీ బుద్ది రాదు ఆనికి” అని. ఊహూ అలా ఎలా చేస్తాం… అయినా బతుకు గడవద్దూ. పిల్లల చదువులూ, ఇతని ఇన్సులిన్‌ ఇంజెక్షనులు, బీపీ మందులు ఖర్చు ఎవరు పెడతారు తనిక్కడ ఉద్యోగం చేయాల్సిందే. భర్తకు దూరాన తల్లి దగ్గరో పిల్లల దగ్గరో ఉంటేనే ఇతను ప్రచారం చేస్తుంటే నిజవని ఊరి జనాలు నమ్మరూ…?

కళావతి లేచి గబగబా వంటలో మునిగిపోయింది. కొంచెం ఆలశ్యమయినా బట్టలషాపు ఓనరు ఊర్కోడు. వాడు కూడా మొగుడులాగే బూతు పురాణం విప్పుతాడు. పిల్లిమీదా ఎలక మీద పెడుతూ అందర్నీ తిడతా ఉంటాడు.

”చెప్పరా మరి, మీ అక్క నాతో ఎందుకు పడుకోవట్లా? నేను దుబయ్‌ పోయినప్పుడు ఎవడన్నా వచ్చిపోయాడా… ఎవడైనా రంకు మొగుడు ఉన్నాడా మీ అక్కకి?” భర్త గట్టిగా అంటున్న మాటలు కళావతి చెవుల బడ్డాయి. తమ్ముడు వచ్చినట్లున్నాడు. ఈ దరిద్రుడు మొదలెట్టాడు. ”ఊరుకో బావా ఎన్నిసార్లు చెప్పాలి అక్కనలా అనొద్దని” సురేష్‌ బాధగా అంటున్నాడు. ”మరి చెప్పవెందుకురా, నా డబ్బులతో చదువుకున్నావు మర్చిపోకోరేయ్‌. మీ అక్కకి కాపలా ఉండమంటే ఊరి మగాళ్ళతో పంపిస్తావురా లమ్డీ కొడకా” రామనాధం మాటలకు హద్దూ అదుపూ లేకుండా అయిపోతున్నది. ”చాలు బావా ఆపు సిగ్గనిపించడం లేదా నీకు. పోస్టుమాన్‌తో, కిరాణా కొట్టువాడితో, పాలవాడితో కూడా చెబుతున్నావట కదా నా పెళ్ళాం నాతో పడుకోటం లేదని? నీ మెదడు పుచ్చిపోయింది ఛీ” అన్నాడు సురేష్‌.

తమ్ముడు కన్పిస్తే చాలు ఇవే ప్రశ్నలు. అక్క గురించి ఒక తమ్ముడితో మాట్లాడకూడని మాటలు. భరించలేని తమ్ముడు అరుస్తాడు. ప్రాధేయపడ్తాడు. ఏడుస్తాడు. చివరకు భరించలేక ఛీత్కరిస్తాడు తంతా అంటాడు. అయినా రామనాధం మారడు, మాటా మార్చడు. ‘నా పెళ్ళాం నాతో పడుకోదు” అన్న మాటతోనే అతనికి తెల్లార్తుంది… దినం గడుస్తుంది… రాత్రి అవుతుంది నిద్రలో కూడా అవే కలవరింతలు. ఇంటికెవరొచ్చినా లోకాభిరామాయణం పూర్తి అయ్యాక రామనాధం ”అవునూ ఒక మాటడుగుతాను ఏఁవనుకోవు కదా! నీకు నీ సంసార సుఖం ఇంకా కొనసాగుతోందా. ఉందీ? అయితే అదృష్టవంతుడివి స్మీ… హుఁ నేనే పెద్ద దురదృష్టవంతుణ్ణి జీవితంలో ఇంత కష్టపడ్డా నా? ఎడారి మంటలు బరించానా అయిన వాళ్ళకంతా దూరాన ఉండి డబ్బు కోసం ఇంత ఊడిగం చేసానా… ఎవరి కోసం వీళ్ళకోసమే కాదూ… పోనీ ఈ వయసులో జీవితంలో ఏం మిగిలిందనీ… వంట సుఖం, ఒంటి సుఖమేగా కోరుకునేదీ… మగాడన్నాకా? వంట సుఖం ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఒంటి సుఖం ఉండద్దూ? నా భార్య నాతో పడుకోదు తెలుసా… ఎంత బాధ చెప్పు? ఎవరికి చెప్పుకోను… పడుకోవడం నాకు చేతకాపోతే నేను డాక్టరు దగ్గరకైనా పోదును. దానికే ఇష్టం లేదు… దాన్ని ఎవరి దగ్గరికి తీసుకుపోవాలి కొంచెం చెప్పవోయ్‌… నరకం అనుభవిస్తున్నా అనుకో… ఎవరికీ ఈ కష్టం రావద్దు…” ఇలా చెప్పుకుంటూ పోతూంటాడు… ఊరంతా ఇదే చర్చ. యాభై ఏళ్ళ రామనాధం ఇరవై ఐదేళ్ళ యువుకుడు దాంపత్య సుఖాన్ని కోల్పోయినట్లుగా వాపోతున్నాడు. రోడ్డుమీద పోతుంటే ఎవరైనా నలుగురు కూడి మాట్లాడుతుంటే తన వైపు వింతగా తల తిప్పి మరీ చూస్తారు. తను తన మొగుడితోనేగా పడుకోనిదీ? వేరే మొగాడితో పోవట్లేదుగా… ఓహోఁ… మొగుడితో సంసారం చెయ్యక పోతే ఇంకెవడిపైనో మనసైనట్లుగా వీళ్ళే నిర్ధారిస్తారు. తన భర్తా అదే ప్రచారం చేస్తున్నాడు. తన సావాసగాళ్ళతో కూడా ఫోన్లో ఇదే మాట్టాడుతుంటాడు. సలహాలు అడుగుతుంటాడు ”ఎన్ని విధాలుగా చెప్పినా లొంగట్లేదురా అదీ” అని పళ్ళు నూరుతుంటాడు.

– – –

సురేషూ ఇలా రా… కళావతి తమ్ముణ్ణి లోపలికి పిలిచింది. ”ఇంటికెందుకొచ్చావురా షాపుకే రమ్మన్నాగా” అంది కోపంగా. ”అమ్మ నీకిమ్మంది” బుట్టలో కూరగాయలు వంటింటి గచ్చు మీద బోర్లేస్తూ అన్నాడు సురేష్‌ చిన్నబోయిన మొకంతో. ”ఈ రోజు డూటీకి పోలా” అంది కళావతి తమ్ముడి ధ్యాస మార్చడానికి ”పోవాలక్కా టైమైంది అమ్మ రమ్మంది పోతా” అంటూ అక్క మొఖం వైపు చూసాడు సురేష్‌. తమ్ముడెక్కడ బాధ పడ్తాడోనని చిరునవ్వు నవ్వే ప్రయత్నం చేస్తున్నది కళావతి. కానీ అప్పటిదాకా కన్నీటిలో స్నానం చేసినట్లు కలిసిపోయి ఉన్న కనురెప్పల వెంట్రుకల తడిని ఎల్లా దాచగలదు? సురేష్‌ పరిగెత్తినట్లుగానే వెళ్ళిపోయాడు. ”ర్రేయ్‌ బామ్మర్దీ ఇలా రా మీ అక్క…” అంటూ అరుస్తున్న రామనాధంను పట్టించుకోకుండా గేటు దాటాడు. ”విశ్వాసం లేని కుక్క” రామనాధం ఖాండ్రించి తుపుక్కున ఉమ్మాడు.

– – –

ర్తకి ఇంసులిన్‌ ఇంజెక్షనూ, మందులు ఇచ్చి భోజనం అతని మంచం పక్కని స్టూలుపై పెట్టి, తను బాక్సు కట్టుకొని గేటు తీస్కుని గబగబా నడవసాగింది కళావతి. మనసు చేదెక్కింది తమ్ముడి చిన్నబోయిన మొఖం గుర్తుకొచ్చి. ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఇతని బాధ తప్పుతుందీ? ఎప్పటిలాగా పెసర, కంది, శనగపప్పు పంట వెయ్యమంటే విన్నాడా? ఊరిలో మూడు ఎకరాల భూమిలో వేసిన పత్తిపంట, మిరప పంటలు నిండా ముంచాక అప్పిచ్చిన షావుకారికి అదే భూమి అప్పచెప్పి మిగిలిన డబ్బుతో దుబాయికి వెళ్ళిపోయాడు భర్త రామనాధం. దుబాయ్‌లోనే బీపీ, షుగరు మొదలయినాయి. ఒకసారి కరెంటు పని చేస్తున్నా అంటాడు. మరోసారి లేబరు పని చేస్తున్నా అంటాడు, ఇంకోసారి కంపెనీలో అంటాడు. రెండేళ్ళకోసారి వచ్చి వెళ్ళేవాడు అలా నాలుగు దఫాలుగా దుబయ్‌ వెళ్ళొచ్చాడు.

వచ్చిన ప్రతీసారి నెలా రెన్నెళ్ళు ఉండేవాడు. ఒంటి మీద, తొడల మధ్యలో ఏవో మచ్చలు… ‘అక్కడ ఎండ, ఎడారి కదా నీళ్ళు దొరకవు కదా, పడలేదు దద్దుర్లు గోకీ గోకీ… ఏం ఫర్వాలేదులే డాక్టరుకి చూపిచ్చుకున్నా తగ్గిపోద్దిలే దా” అని దగ్గరికి తీస్కునేవాడు. ”చూడు నే లేనని చెప్పి వాళ్ళెంట వీళ్ళెంట పోయావనుకో ఊర్కోను నరికేస్తా అడ్డంగా… ఊర్లో ఒకణ్ణి పెట్టి వెళతా. వాడు ఇంటి దగ్గరా, షాపు దగ్గరా కాపలా కాస్తూంటాడు. నా కన్నీ చేరవేస్తుంటాడులే వాణ్ణి డబ్బిచ్చి మరీ పెట్టుకున్నాను తెలుసా… ఇంటి దగ్గర తలొంచితే షాపు దగ్గరే తలెత్తాలి తెల్సిందా?” మరి షాపులో షాపు ఓనరూ… వచ్చే పోయే మగ కస్టమర్లూ, పాలు పోసే రంగయ్య, కిరాణా షాపు రమణా, పిల్లల హాస్టలు మొగ వార్డెనూ… అందర్కీ పెట్టాడా గూఢచారినీ?

”చూడూ దుబాయ్‌లో నేనెంత పవిత్రంగా ఉంటానో నువ్వట్లా ఇక్కడ పవిత్రంగా ఉండాలి సరేనా…” ఇవే మాటలు ఉద్యోగం చెయ్యాలి మళ్ళీ… తన దుబాయి ఉద్యోగం మీద నమ్మకం లేదు అతగాడికి. కానీ తలొంచుకు పోవాలి, తలొంచుకు రావాలి.

మళ్లీ దుబయ్‌ విమానం ఎక్కేదాకా.. ”ఒరే బామ్మర్తి మీ అక్క జాగ్రత్తొరేయ్‌ ఒక కంట కనిపెట్టుకుని ఉండు” తమ్ముడికి అప్పగింతలు. ”ఎవడితో లేచిపోద్దనీ నా కూతురు చెత్త మాటలు మాట్లాడబాకు అల్లుడూ నువ్వు నీత్తప్పుతావేమో గానీ నా బిడ్డ తప్పదు. దేశం కాని దేశంలో నువ్వే గుడిశెంగాలు ఆడుతున్నావో ఎవరికి తెలుస్తుందీ ఇంక పో… దొబ్బేయ్‌!” అని కళావతి తల్లి మంగళ అరిచేది. కూతుర్ని అల్లుడట్టా అంటున్నందుకు మంగళ కుతకుతా ఉడికిపోయేది కోపంతో. ఆమె కూడా మొగుడితో ఇన్ని కష్టాలూ దెబ్బలు తిని ఉన్నదే.

పిల్లలు అలాగే పెద్దైపోయారు. ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకొంటున్నారు. తనూ ఖాళీగా ఏం లేదు. బట్టల షాపులో సేల్స్‌ ఉమెన్‌గా పని చేస్తుంది. షాపు పెద్దదే. తమది అటు ఊరూ కాదు, టవునూ కాదూ… మధ్యస్థంగా ఉంటుంది. ఏళ్ళ తరబడి అదే షాపులో పని చేస్తుంది. అమ్మ తమ్ముడు పెద్ద ఆసరా. ఇద్దరూ ఎప్పుడూ ఏదో ఒకటి పప్పులనో, బియ్యమనో, కూరగాయలనో చేర వేస్తూనే ఉంటారు. పిల్లల చదువులు దాదాపు అమ్మనే చూస్కుంటుంటుంది.

ఒకరోజు ఉన్నట్లుండి ఇంటి ముందుకి వాన్‌ వచ్చింది. భర్త రామనాధంను స్ట్రెచర్‌ మీద తీస్కొచ్చి మంచంపైన వేసారు. ”డ్యూటీలో ఉండగా పక్షవాతం వచ్చిందమ్మా ఇంక డ్యూటీ చెయ్యలేడు మీకు ఫోన్లు చేస్తానే ఉన్నాం కదా… బాగవుతాడనుకొన్నాం… ఇంక డాక్టర్లు ఇంతకంటే చాతకాదనేసారు. ఖర్చు కంపెనీ పెట్టుకొంది. ఇదిగో మిగిలిన డబ్బులు” అంటూ లక్షన్నర రూపాయలు చేతిలో పెట్టి, అతని సర్టిఫికేట్లు ఫైలు ఇచ్చి వెళ్ళిపోయారు. గుండెలు పగిలేలా ఏడ్చింది. పిచ్చి చూపులు చూస్తూ ఏడుస్తున్న రామనాధంను చూస్తూ…

ఒక్క పక్షవాతమేనా? ఒంటి మీద రసి కారుతున్న పుండ్లు గోకే కొద్దీ కారే నీటి పుండ్లు, రాలే పొట్టు… మనిషి నించి ఒక రకమైన జబ్బు వాసన… అతని మీద కోపం అంతా ఎగిరిపోయింది కాదూ? ఎంత ఆర్తితో, ప్రేమతో సేవ చేసిందనీ? లక్షన్నర రూపాయలు హైద్రాబాదులో మంచి డాక్టరుకు చూపించడానికే ఖర్చు అయిపోయాయి. ఆ వైద్యానికే ఈ మాత్రం కాళ్ళూ చేతులూ ఆడుతున్నాయి. అప్పటికి ఎడమ చెయ్యి కాలూ చచ్చుబడిపోయినట్లే. ఒంటికీ, రెంటికీ మంచం మీదే చేస్కునేవాడు. డాక్టరు చెప్పినట్టల్లా చేసి ఎంత కష్టపడి బాగు చేస్కుంది కాబట్టే కొద్దిగా కర్రట్టుకుని అన్నా నడవగలుగుతున్నాడు. మూన్నెల్లు తమకు తిండీ నిద్రా సరిగా లేదు. ఎర్రగా కనిపిస్తా రసి కారే పుండ్లకి రెండూ పూట్లా మందు రాసేది. చంటి పిల్లాడికి తిన్పించినట్లు అన్నం తిన్పించేది. బలానికి పండ్లూ, టానిక్కులు బలం పౌడరు పాలూ, మటనూ, చికెనూ, చేపలు ఖర్కుకు వెనకాడకుండా చేసింది. తమ్ముడూ అమ్మా ఎంతో ఖర్చు పెట్టారు. ఇంత చేస్తే… మనిషింత మాత్రం బలం తెచ్చుకున్నాడు. పుంజుకొని ఏం బలం తెచ్చుకునేసేసి ఏం చేస్తున్నాడు. తనని తన్నేస్తున్నాడు. ఇదంతా ఎప్పట్నించి మొదలయ్యి ఇప్పటి దాకా అంటే రెండున్నర సంవత్సరాల నుంచీ నడుస్తూనే ఉంది… ఇదంతా ఇంతే అయితే బాగుణ్ణు. భర్తే కదా తను కాకపోతే ఇంకెవరు చేస్తారనుకొంది.

కానీ తన భర్త దృష్టి వేరు. ఒక రోజు రాత్రి మంచం మీద పడుకోబెడుతున్న తనను మీదకు లాక్కున్నాడు. తన మీదకు కుడి చేతి బలంతో ఒరుగుతున్న భర్త నోటి నుంచి కార్తున్న చొంగ… అతని బట్టల్లో, దుప్పట్లలో, మంచంలో చుట్టూ గాలిలో నిండిన ఫీనాయిల్‌ వాసన, అతని ఒంటి మీది పుండ్ల నుంచి కారుతున్న రసి  తనకు అంటుకుంటుంటే భరించలేక బలమంతా కూడేసి తోసేసి లేచింది.

”ఏం ఏమైంది ఎందుకు ఒద్దు? నాకు ఒక కాలు చెయ్యి పడిపోయినాయి కానీ మగతనం పోలేదు రా… చేత కాదనుకున్నావా, డాక్టరు చెప్పాడు నేను సంసారానికి పనికి వస్తాననీ ఏ ఫరవాలేదన్నాడు మొదలు పెట్టుకోవచ్చన్నాడు” అంటూ మళ్ళీ గుంజాడు.

”ఒదులు… ఒదులు.. నాకు ఒద్దు…” అంది తను తన చెయ్యి గుంజుకుంటూ. ”ఏం… ఎందుకు ఒద్దు? ఎవడైనా ఉన్నాడా నేను కాకుండా?” కోపంతో ఊగిపోతూ కుడిచేత్తో మంచం కోడును తపతపా కొడుతూ రామనాధం పిచ్చెక్కినట్లు అరిచాడు. ”సంపాదన లేదనే కదూ” పళ్ళు నూరుతూ స్టూలుని తన్నేశాడు.

ఇక అప్పట్నించీ మొదలయ్యింది. ఆ తరువాత, ఇదుగో రోజూ ఇదే తంతు… రామనాధం పులి… తను జింక… రోజూ ఇదే వేట. అతని పనులకి తప్ప దగ్గరికి పోని తనను చూపులతోనే బెదిరిస్తూ రమ్మని సైగ చేస్తూ కర్రతో నేలను మంచం కోరుని కసిగా కొడుతూ, పోకపోతే బుసకొడుతూ ఉంటాడు. తను తిరస్కరిస్తూ ఉండే కొద్దీ రామనాధంలో కసి, కోపం పెరిగి పోసాగాయి. దాదాపు పిచ్చి ఎక్కింది. అనుమానం పెరిగి పోయింది. పక్కింటి వెంకటేశ్‌తో, షాపు ఓనరుతో పోస్ట్‌మాన్‌, కిరాణకొట్టు రమణతో సంబంధాలు అంట కట్టేసాడు. ఊర్లో ఉన్న ప్రతీ మొగాడితో తను పోతుందట అంతే కాదు ఫోనులో తన సావాసగాళ్ళతో కూడా చెప్పుకుంటాడు. ఎప్పుడూ తన అక్కకు ఫోను చేస్తూ ”నాతో ఎందుకు ఉంటం లేదో కనుక్కోవే అక్కా నావల్ల కావట్లేదు చంపేస్తాను దాన్ని లేకపోతే ఇంకోదాన్ని చేస్కుంటాను చూసెయ్యవే ఎవత్తినన్నా చూసి పెళ్ళి చేసెయ్యి నాకు…” ఎప్పుడూ ఇవే మాటలు ఆమెతో. ఎలా బెదిరిస్తున్నాడు. కాళ్ళు చేతులు పడిపొయ్యి, ఒళ్ళంతా పుళ్ళతో గజ్జితో మనిషి ఆకారాన్నే కోల్పోయిన ఇతన్ని… భార్యని నీచాతి నీచంగా చూసే ఇతన్ని ఎవరు చేస్కుంటారు? ఉన్న తనకే ఈ క్షోభ భరించలేక పారిపోవాలనిపిస్తుంటే, ఈ మగాళ్ళకి కాళ్ళూ చేతులూ పడిపోయి, మంచానికి ఒళ్ళంతా గజ్జొచ్చి అతుక్కుపోయినా ఆ అహం తగ్గదు కదా, ఆడది పురుక్కంటే లోకువ కదా… ఏ ఆడదైనా తనను పెళ్ళి చేస్కోటానికి వచ్చేస్తుంది అనుకుంటున్నాడు.. కళావతి ఆలోచిస్తూనే నడుస్తున్నది.

ఆఖర్కి ఎంతకి తెగించాడెంత తెగించాడూ? తనకు తెలీకుండా బంధువుల్ని అక్కనీ, ఊరి పెద్దలనూ పిలిపించి పంచాయితీ పెట్టిం చేసాడు కాదూ?

”ఏం… ఏం తక్కువ రామనాధానికి ఆడదన్నాక భర్త కోరిక కాదంటే ఎట్టా…” ఊరి సర్పంచు నర్సింహారావు అంటున్నాడు. జాగ్రత్తగా బరువుగా ఉన్న బోదకాలు పక్కకి జరుపుతూ… ఏనుగు కాలంత ఉంటుంది అతని కుడికాలు. పాపం అతని భార్య రమ బక్కచిక్కి… ఆ ఏనుగు కాలికింద నలిగి చితికి పోయిన గొల్ల భామలాగా ఉంటుంది.

రోజూ ఆ బోదకాలికి నూనే రాయించుకుని మాలీసు చేయించుకుంటాట్ట… ఓపిగ్గా చేస్తుంది పాపం. సర్పంచు మాటలతో సిగ్గు చితికిపోయింది. పడకటింట్లో మొగుడు పెళ్ళాల మధ్య ఉండాల్సిన విషయం బజార్లో అదీ ఒక మగాడు… బోద రోగంతో కాలే కాదు, బుర్ర కూడా అహంకారంతో బరువెక్కిన వాడూ, తనను తన మొగుడి కోరిక తీర్చి తీరాల్సిందే అంటున్నాడు.

”చెప్పు… నా తమ్ముణ్ణెందుకు కాదంటున్నావు, వాడికేం తక్కువనీ కాలూ చెయ్యి పడిపోయినంత మాత్రాన మొగతనం పోయి ఏం లేడువాడు డాక్టరేం చెప్పాడో నాకు చెప్పాడు వాడు. నువ్వు పక్కనుండి వాడికెట్టా కావాలో అట్టా చేస్తే అంతా బాగవుతుందిట… నాతో ఫోన్‌లో మాట్టాడిచ్చాడు డాక్టరుతో” అంటూ ఇంట్లో ఉన్నంత సేపూ ”చెప్పు… ఎందుకొద్దంటున్నావు చెప్పావు కాదేం… చెప్పూ” అని పండ్లు తోమేప్పుడూ, వంట చేసేప్పుడూ బాత్రూము, వంటింటి తలుపులకు వేలాడబడ్తూ రెట్టించి రెట్టించి అడుగుతూ, నిద్రలో కూడా లేపి మరీ అడుగుతూ ”అట్టా కాదు కళావతీ… నా మాటిను కొద్దిగా చూడూ వాడెట్టా దిగాలు పడిపోతున్నాడో… నీకు మంచిదేనా… ఎంత పాపఁవో తెలుసా చెప్పు ఏం ఒప్పుకున్నట్టైనా…” అంటూ మళ్ళీ తనకీ తన మొగుడికీ శోబనం చేయించడానికి అత్తింట్లో తమ్ముడి దగ్గరా శపథం తీస్కుని వచ్చిన దాన్లా, ఆ శపథాన్ని పూర్తి చేసికానీ పోని దాన్లా పగలనకా, రాత్రినకా వెంటాడింది చాలక పంచాయితీలో తనను సర్పెంచు అన్నదానికి సమాధానం చెప్పవేం అన్నట్లు గుడ్లురుముతున్నది.

తల్లి దగ్గర తన జాకిటు బొత్తాములు విప్పి చూపిస్తూ తన మొగుడు ముండాకొడుకు ఎట్టా కరిచాడో ఏడుస్తూ చెప్పే వదిన… తనను గద్దిస్తున్నది. కళావతి వదిన వైపు తిరస్కారంగా చూసింది. అందరి మధ్యలో… తనను పారిపోకుండా ఆడ పోలీసు ఖైదీని పట్టుకున్నట్లు పట్టుకున్న నిలుచున్న ఒదిన రామలక్ష్మి… పక్కన కళావతి బిక్కసచ్చిపోయి ఛీల్చడానికి నలువైపులా ఆక్రమించిన రాబందుల మధ్య రక్తాలోడుతూ కొన ప్రాణంతో నిలబడ్డ కుందేలు పిల్లలా కళావతి మొఖంలో కళంతా పోయి నిలుచుంది. కొంగును భుజాల చుట్టూ బిగుతుగా చుట్టుకొని… ఎడం చేతి వేళ్ళతో కొంగు చివర్ల దారాలను అనవరంగా పీకుతూ… తల వంచుకుని తన జీవిత లక్ష్యం ఆ చీర కొసల దారాలను పీకి పోగులు పెట్టటవే అన్నట్లు నిలబడ్డది.

”చెప్పు… చెప్పవేం దరిద్రపు దానా” రామలక్ష్మి తన బలాన్నంతా చేతి వేళ్ళల్లోకి దించి కళావతి పై దండలోకి గుచ్చేసినంత పని చేసింది. పెద్దతనంతో ఇంట్లో సరిదిద్దే ప్రయత్నం చేసినా తనను ఓడగొట్టి విషయాన్ని వీధిలోకి తెచ్చిన మరదలుపై చచ్చేంత అక్కసుగా ఉంది రామలక్ష్మికి…

”ఇక నువ్వొచ్చావుగా రామలక్ష్మీ అన్నీ సర్దుకుంటాయిలే” అన్న పక్కింటి వెంకటేశం భార్యా… ”అక్కా నా కాపురం చక్కదిద్ది పోవాలి నువ్వు” అని దీనంగా బతిమిలాడిన తమ్ముడు రామనాధం కళ్ళముందు కదిలాడి ఇంకా కోపం ఎక్కువైపోయింది ఆమెకి. మరో పక్క రామనాధం ఉరిమి చూస్తున్నాడు అక్కకి తోడుగా…

”అక్కా… దాన్నొప్పిస్తే అప్పో సొప్పో చేసి ఐదు వేలు నీ కొంగున పోస్తా ఎలాగైనా” రామనాధం చూపించిన ఆశ. కళ్ళముందు జారిపోతున్న రొక్కం కన్పిస్తూ కోపం ఎక్కువైపోతోంది రామలక్ష్మికి.

అందరూ కళావతి వైపు ప్రాణం పోయినా సమాధానం చెప్పి మరీ చావాలన్నట్లు చూస్తున్నారు. రామలక్ష్మి తన వేళ్ళతో కళావతి భుజం మీద కొట్టినట్లుగానే వత్తేస్తూ ముందుకు తోస్తున్నది. తోస్తూ ”సమాధానం చెప్పి చావూ” అని చెవిలో శబ్దం పైకి రాకుండా గాలి అరుపులు అరుస్తున్నది. కళావతి చెవిలోకి వేడి గాలి ఆవిర్లి నింపే స్టీమరు ఇంజనులా.

”పుండ్లు…  పుండ్లు ఆయన ఒంటి నిండా కాళ్ళ మధ్య చిట్లిపోతూ, రసికారే పుండ్లు. మనిషి వాసనొస్తాడు. నాకు అసయ్యం, బయ్యం, నాకొద్దు.” అరిచేసిందా తను? అరవక…?

తన మెడమీద కత్తి పెట్టి నిజం చెప్పమంటే చెప్పక ఏం చెపుతుందీ మరీ.. హమ్మయ్య చెప్పేసింది నిజం చెప్పేసింది… భర్త ముందు చెప్పడానికి ధైర్యం చెయ్యలేనిది, ”ఏం ఎందుకూ… చెప్పూ… చెప్పు… చెప్పూ… నిజం చెప్పు, కక్కెయ్‌ కక్కెయ్‌…” అని వెంటాడి వేధించిన భర్తకి చెప్పనిది, అర్థ మొగుడైన రామలక్ష్మికి చెప్పని నిజం చెప్పేసిందీ ఇంత మంది మధ్యలో. ‘హమ్మయమ్మ య్యమ్మయ్య” కళావతి నిమ్మళంగా గాలి పీల్చి వదిలింది. అక్కడంతా ఒక్కసారి నిశ్శబ్దం కమ్ముకుంది. రావి చెట్టు మీద కాకులు ఒక్కసారి అరిచి ఎగిరిపోయాయి. గాలి, రావి కొమ్మ ఆకుల మధ్య గాభరాగా తల తల బాదుకుంది. ”ఆయమ్మకి ఇష్టం లేదంటుంది కదా… బలవంతం చేత్తారేంటీ?” చాకలి రత్తాలు కీచుగా అరిచింది. ”ఒసేయ్‌ నువ్వు నోర్మూసుకో” అంటూ రత్తాలు మీద అరిచి బాన పొట్టేసుకున్న గుడి అయ్యవారు లేచి జంధ్యం సవరించుకుంటూ ముందుకొచ్చాడు. నుదుటున మూడు నామాలు, గుండుకి పిలక, కాషాయం రంగు కండువా, పంచా జనం భక్తితో ”అయ్యవారు… అయ్యవారు” అంటున్నారు. ”అయ్యవారు తీస్తారు చూడూ దీని తాటా” సర్పంచు వెకిలిగా నవ్వాడు. ఎడం చేత్తో తన పంచ కొసలు పట్టుకొని ”ఆ మహా పతివ్రత సుమతీదేవి కుష్టురోగి అయిన భర్తని భరించి సేవలు చేస్కుని అతని కోరికలూ తీర్చింది. నువ్వూ అలాగే చేయాలి. కథలు చెప్పమాకు కళావతీ భర్త కోరిక తీర్చడఁవే భార్య కర్తవ్యం. ఆ కొద్దిసేపు ముక్కూ, కళ్ళూ మూస్కుంటే అయిపోదూ? నీకోసం… నీ కుటుంబం కోసం సంవత్సరాల తరబడి ఎడారి మంటల్లో ఊడిగం చేసొచ్చాడే? ఆ మనిషి చేసిన త్యాగాన్ని పుల్లలా తోసేస్తావా? భర్త చిన్న కోరికను తీర్చకుండా వాసన, గజ్జి అసియ్యం అంటూ ముక్కు మూసుకుంటావా నువ్వేం ఆడదానివీ, భార్యవీ… ఆ దేవుడు క్షమిస్తాడా నిన్నూ” అయ్యవారి మాటలకి మిగతా పంచాయితీ పెద్దలు అవును అయ్యవారు చెప్పిందే సరి… కళావతి, రామనాధంతో కాపురం చేయాల్సిందే అంటూ తీర్పు చెప్పేసారు. కుటుంబ పంచాయితీలో ఊరి పెద్దలు పెద్దన్న పాత్ర పోషించారు. ”ఈ మగాల్లున్నారే ఆడదాని మనసాక్షాలు పట్టిచ్చుకోరుగా ఒఠ్ఠి స్వార్థం తప్ప… ఏమున్నాది వీల్లకు బండకేసి బట్టను బాదినట్లు బాదాల వీల్లను పాపం కళావతి” అని రత్తాలు అయ్యవారి వైపుకి చూస్తా ”అయ్యోరూ ఇదే నా నువ్విచ్చే మహాగొప్ప నాయం… ఒంటినిండా గజ్జున్నోడితో ఎట్టా ఉంటదీ… నువ్వుంటావేటీ” అని అరిచేసింది. కళావతికి రత్తాలు కాళ్ళ మీద పడిపోవాలనిపించింది. ”ఫోవే ముండా ఫో ఇక్కడ్నించీ” రెచ్చిపోయిన అయ్యవారు పిచ్చెక్కిన వాడిలాగా అరిచేసాడు. బక్కచిక్కిన సర్పెంచు భార్య రమ కళావతి వైపు నీరసంగా… బాధగా చూసి కళ్ళు భారంగా నేలకి వాల్చేసింది.

”మీరెవరు నా కూతురి సంసారం విషయాల్లో తీర్పు చెప్పడానికీ… మీ కాపురాలు బాగు చేసుకోండి ముందు. నా కూతురు ఏం చెయ్యాలో దానికి బాగా తెల్సు. లెగవండి ముందు ఇక్కడ్నించి… మంగళ అందరికీ గేటువైపు వేలు చూపించింది. కసిగా మెటికలు విరుస్తూ. ఛోటు కూడా ఏమర్థం అయ్యిందో భౌభౌమని అరవసాగింది.

– – –

రాత్రి వదిన కాపలా కాసింది. తన మీదకు ఒక మనిషిలా కాదు బురదలో పాకుతున్న గొంగళి పురుగు లాగా పాకాడు. నోటినుంచి కారుతున్న చొంగతో తన పెదాలు, నోరు మొఖాన్ని తను తిరస్కరిస్తున్న కొద్దీ… తడిపేసాడు. భరించలేని వాసన.. అతని ఒంటిమీద పుండ్లు చిట్లి ఆ రసి తనకు అంటుకుంటుంటే, భయం వెన్నులోంచి జర జరా పాకి ప్రాణ భయంతో అతని డొక్కలో తన్ని లేచి ముందు గదిలో అడ్డంగా పడుకుని, సడికి లేచి తన్ని చూసి నిర్ఘాంత పోయి కాలు పట్టుకో బోయిన ఒదిననీ విదిల్చి బలంగా ఒక తాపు తన్ని, తలుపు తీసుకుని రోడ్డు మీదికి అదే పరుగు… ఒళ్ళంతా చెమటతో తడిసి, తలంతా రేగి పోయి కన్నీళ్ళతో చెంపలు తడిచి, కోపంతో హృదయం పగిలి రగిలిపోతుంటే పంజరం తలుపు తెరుచుకున్న రామచిలుక స్వేచ్ఛానందమూ, భయమూ కలగలసి రయ్యిన ఆకాశంలోకి దూసుకుపోతున్నట్లు కళావతి, తనకే తెలీని ఒక వింత ఆనందాన్ని కూడా అనుభవించింది. తల్లి ఇల్లు చేరేంత వరకు ”ఇదెవర్నో మరిగిందే అక్కా” అంటూ అరుస్తున్న భర్త రామనాధం గొంతు గాలిలో నక్క ఊళలా వెంటాడుతుంటే… ఇళ్ళు, వాకిళ్ళూ, బావులు, గుళ్ళు, కోళ్ళు, క్కులు, రోడ్లు, సందులు, పందులూ, మసీదులు, బళ్ళు, పశువులు దాటుకుంటూ, కళావతి పరుగు పరుగున పరుగు పరుగున తల్లిల్లు చేరి దబదబా తలుపు బాది, బాదిన వెంఠనే తెరుచుకోని తలుపులనే మళ్ళీ మళ్ళీ దబా దబా బాది, తలుపు తీసిన తల్లి మీద తోడేలు తరిమితే ఉరికురికి వచ్చి తల్లి ఒళ్ళో ప్రాణభయంలో దూరిపోయిన జింక పిల్లలా చెమటలో ఆయాసంతో ఒరిగి, ఒరిగి పోయింది. ”అవునే అమ్మా… నువ్వు చెప్పింది వెయ్యికి, వెయ్యీ సత్యమే ఇంక వాడితో ఉండనే అమ్మా… ఉండను గాక ఉండనూ. నావల్ల కాదు గాక కాదూ” అని లెక్కలు చెయ్యక పోతే బెత్తంతో పంతులు చావుదెబ్బలు ఎలా కొట్టాడో ఎక్కిళ్ళు పడుతూ తల్లికి చెప్పే పిల్లలా గబగబా అప్పచెప్పినట్లే చెప్పేసింది కళావతి. బిడ్డని కన్నీళ్ళతో పొదువుకొని కొంగుతో చెమటా, కన్నీళ్ళతో తడిసిపోయిన కళావతి మొఖాన్ని తుడుస్తూ ”చెప్పానా… నేనప్పుడే చెప్పానా, ఎప్పుడూ చెప్తూనే ఉన్నానా.. ఒద్దొద్దే, వాణ్ణొదిలెయ్యవే అని … చెప్తూనే ఉన్నా… నిన్నా, మొన్నా… ఇప్పుడూ సరే… సరే… సరె ఒద్దులే అన్నానన్నానా ఇంకొద్దులే ఒదిలేద్దువులే ఒద్దొద్దులే, ఇంగ పోబాకులే వాడి దగ్గరికి” అంటూ తన రెండు చేతులతో కూతుర్ని తన ఎదకు మరింత హత్తుకుని ”యాడవబాకురా సురేషూ ముంతలో నీళ్లు ముంచుకురారా అక్కకి” అంటూ సురేషుకి పురమాయించింది మంగళ. ఇది మామూలే… మళ్ళా నా పిల్లలూ… పెళ్ళిల్లూ… తండ్రి లేకపోతే ఎట్టా అని తెల్లారగానే ఎల్లిపోదూ… కసాయోడి దగ్గర గొంతు తెగ్గోసే కత్తి ఉంటదని తెలిసీ తెగ్గోయించుకోడానికి వెళ్ళిపోయే మేకపిల్లలా… ఎన్ని వందలసార్లు అయ్యిందిట్టా… అయినా బావ వంటి మీద పుండ్లు చూసి తెగ భయపడి పోతున్నది అక్క. తనే ఒక రెండు నిమిషాలు నిలబడలేడు బావ పక్కన… ఇంక ఆ పుండ్లతో మీద పడితే అక్కైనా ఎలా సహిస్తుందీ? దానికి మించి, ఎవరెవరితోనో సంబంధాలు అంటగట్టటం మనిషి మనిషికీ, పిట్టకీ, పిల్లికీ పెరట్లోని బావిలోని బొక్కెనకీ, ముంతకీ, ఆకాశంలోని చందమామకీ నా పెళ్ళాం నాతో పడుకోవట్లేదు” అని చెబుతాడు. అక్కెలా భరిస్తుంది మరీ… సురేష్‌ ముంత నిండా చల్లటి నీళ్ళు ముంచుకొచ్చి అక్కకి ఇచ్చాడు.

 

– – –

”ఆయన నా భర్త ఎంత సేవ అయినా ముక్కు మూస్కుని చేస్తాను కానీ ఆయనతో పడుకోమంటే నా వల్ల కాదు… ఎంతకీ తగ్గని పుండ్లు నేను భరించలేను. నాకే రంకు మొగుడూ లేడు నన్నలా అంటే నేను ఊర్కోను” తెగించి చెప్పేసింది.

”వాడు ఇంకోదాన్ని చేసుకుంటాట్ట చేసుకోనీయా మరీ-” వదిన రామలక్ష్మి చేతులూపుతూ సాగదీస్తూ, అంటుంటే తను నవ్వింది. ”ఒదినా నువ్వింత బాగా చూస్కుంటున్నా అన్నయ్య ఇంకొకదాన్నెందుకు మరిగాడూ… చెప్తావా కొంచెం? చేస్కోనీ… మీ తమ్ముణ్ణి రెండో పెళ్ళి చేస్కోనీ నేను మాత్రం ఆయనతో సంసారం చేయను. నావల్ల కాదు. నే వెళ్ళిపోతా బలవంతం చేస్తే పిల్లలతో బావిలో దుంకి చస్తా”… కోపంగా అంది తను. మొఖంలో నెత్తురింకిపోయి బిక్క సచ్చిపోయిన రామలక్ష్మిని పట్టించుకోకుండ.

– – –

క అప్పట్నుంచీ కళావతి రామనాధం కసాయి కత్తికి కొద్దికొద్దిగా రోజూ తెగిపోసాగింది. ముందే భర్తంటే భయ్యం. తనకంటే పన్నెండేళ్ళు పెద్ద. ఆరడుగుల పొడుగు. భారీ విగ్రహం.. ఏ మాత్రం కోపం వచ్చినా. ఆ పెద్ద పొడుగాటి చేతులు వెదురు బద్దల్లా తన శరీరం మీద పడి ఛీల్చేసేవి. ఇప్పుడు ఎడం చెయ్యి చచ్చుబడింది. అయినా కుడిచేత్తో కర్ర పట్టుకొని కొడతాడు. ఎక్కడ కొడతాడో చూస్కోడు. ఆయన కోరిక తీర్చడం లేదని తలగోడకేసి కొడతాడు. జుట్టు పట్టి ఈడుస్తాడు. తనంటే కసి ఇదంతా తను ఆయన అవసరాలు తీరుస్తున్నప్పుడు, స్నానం చేయిస్తున్నప్పుడు, బట్టలు మారుస్తున్నప్పుడు, అన్నం వడ్డిస్తున్నప్పుడు కళావతి అతని దగ్గరికి వెళ్ళే సమయంలో చేస్తాడు. కుడిచేత్తో గట్టిగా తొడల మీద గిల్లితాడు గిలగిలలాడేలాగా. మిగతా సమయాల్లో అతనికి దూరంగానే ఉంటుంది. అన్నీ అమర్చి షాపుకెళ్తుంది. పనిలోనే మనశ్శాంతి డ్యూటి నించి దిగి సాయంత్రం తల్లి దగ్గరికెళ్తుంది. ఎప్పటిలాగా కష్ట సుఖాలు చెప్పుకొని ఏడుస్తుంది. ‘ఒదిలెయ్‌వే దరిద్రుడ్ని ఎన్ని సార్లు చెప్పాలే’ అమ్మ కోపంగా అంటుంది. ‘పిల్ల, పిల్ల పెళ్ళి కావద్దూ” అంటుంది తను బలహీనంగా. ”ఏం కాదా? ఎందుక్కాదూ తండ్రి లేని ఆడపిల్లలెవ్వరికీ పెళ్ళిళ్ళు కావడం లేదా” అంటుంది అమ్మ అర్చినట్టే… ”అమ్మా నాకోసం నాక్కాబోయే పెళ్ళికోసం ఆ పెళ్ళిలో నాన్న ఉండడం కోసం… అమ్మా… అమ్మా నువ్వు రోజూ నరకం అనుభవించ మాకే… నాకిలాంటి నాన్న ఉంటేనేం లేకపోతే నేం… ఒద్దమ్మా… ఒద్దొద్దమ్మా…” సెలవులకి ఇంటికొచ్చిన మాధురి వెక్కెక్కి ఏడుస్తూ… చంద్రుడు వెన్నల చుక్కలు ఛోటు… తానెన్నో సార్లు దూకి చచ్చిపోవాలనుకున్న బావి సాక్షిగా చెప్పేసింది కూడాను.

అయినా… కళావతి ”ఉహూ వద్దే అమ్మా పిల్ల పెళ్ళి కానీ… అప్పుడు ఎడం కాలితో తన్ని మరీ వచ్చేయనా” అంటుంది. నీర్శంగా. అట్నించి అటు మెల్లగా బడిలో పంతులు బెత్తంతో కొడతాడేమో అన్న భయంతో బడికెళ్ళే పిల్లలా ఇంటికి చేరుతుంది.

”ఏం ఆలశ్యంగా తగలడ్డావూ షాపులో ఎవడ్నన్నా తగులుకున్నావా” కిరాణా కొట్టు రమణగాడు నీ అందం చూసి ఆపాడా” అని ఏదో ఒకటి వాగుతాడు. ఏదో ఒక కారణం వెతికి కొడతాడు.

మొన్న బిడ్డొచ్చినప్పుడు ఒకసారి అన్నం పలుకుగా అయ్యిందని ‘ఇట్రా’ అని పిలిచాడు. తన గుండే ఝల్లుమంది. వెళ్ళలేదు. ”నిన్నేనే లం… ఇట్రా” అని అరిస్తే భయంగా వెళ్ళి నిల్చుంది. ”దూరానెందుకు నిల్చున్నావే ఇట్రా” అంటూ చేతికర్ర వంపున్న వైపు తన వైపుకి చాపి తన మోచేతిలోకి ఆ కర్ర వంపుని జొనిపి అందుకుని తన వైపుకు గుంజుకున్నాడు ”అన్నం ములుకుల్లా తగలేసావేంటే నా బతుక్కు వంట సుఖం కూడా లేదా” అంటూ కర్రతో కొడుతుంటే మాధురి చూసి తట్టుకోలేక పోయింది. పరిగెత్తుతా వచ్చి తండ్రి చేతిలో కర్ర తీసుకొని విసిరికొట్టింది. ”అమ్మ ఇంత సేవ చేస్తుంటే ఇలా కొడతావేం మనిషివేనా” అంటూ అరిచేసింది. ”అవునే అందరూ నన్నే అనండి మీకోసం ఇలా అయిపోయాను నన్నెవరూ పట్టించుకోరు ఈ రోజు ఇలా మంచాన్న పడ్డాననే కదా… మీ అమ్మేదో సంపాయిస్తుందనే కదా… ఎలా చేసి పెట్టినా తిని చావాలన్నట్లు చేస్తుంది అసలు షాపునుంచి నేరుగా ఇంటికి రాకుండా ఏ మిండగాడి దగ్గర్కి వెళ్ళి చస్తుందో కనుక్కో ముందు” అంటూ కంచం నేలకి విసిరేసాడు రామనాధం.

ఏ మాటైనా… ఏ గొడవైనా అటు తిప్పి ఇటు తిప్పి ”నువ్వు నాతో పడుకోటం లేదు ఎవరికో మరిగావు” అంటూ తేల్సి పడేస్తాడు. అసలు ఏమన్నా ఆలోచిస్తాడా ఇతను? నిత్యం చొంగ కారే నోరు. ఒంటినిండా రసికారే పుండ్లూ… ఉంటే ఇష్టం ఎలా కలుగుతుంది? పుండ్లు రాక మునుపు కూడా వచ్చినప్పుడల్లా కొడుతూ ఉండే అతను కోరికతో ముట్టుకున్నా తనకు వెగటు తప్ప ఇష్టం అస్సలు కలిగేది కాదు. ”ఏంటే బండరాయిలా బిగుసుకు పోతున్నావు నేనంటే ఇష్టం పోయిందా” అంటూ ఆ సమయంలో కూడా కొట్టేవాడు.

”ఎలా అర్థం అవుతుంది నటిస్తున్నాడా? తనకు అలా పక్షవాతం వచ్చినందువల్ల సంపాదన లేకుండా అయిపోయాడని బలహీనం అయిపోయాడనే, తను అతనితో శారీరికంగా కలవటం ఇష్టపట్టం లేదని అంటాడు… అది కాదూ… అతని ఒంటి నిండా ఉన్న పుండ్ల వల్ల అని ఎంత చెప్పినా అర్థం కానట్లు నటిస్తాడే… పోనీ తనకు అట్లా పక్షవాతం వచ్చి, ఒంటినిండా పుండ్లొస్తే… తనతో సెక్సు కాదు కదా, అసలు ఒక్క క్షణం ఇంట్లో ఉంచుకుంటాడాని? ఆ గుడి అయ్యవారు, చెప్పినట్లు కొద్దిసేపు కళ్ళు మూస్కుని బరిద్దామంటే ఏవో పోనీ పిచ్చి మచ్చలన్నా కాదాయే, వాసనతో రసి కారే పుండ్లాయే…

చూట్టానికే రోత పుడుతా ఉన్నాయే… అవి తనకి తగిలి రసి అంటుకుంటా ఉంటే ఎట్టా ఉంటుందీ..

ఏఁవన్నా ఆలోచిస్తాడా అని? తనేమన్నా ఒదిలేసిందా? తను తనను కొట్టాడనీ హింసించాడనీ మనసు రాయిలా అయిపోయినా కాళ్లూ చేతులూ పడిపోయి దెబ్బతిన్న పక్షిలా తన ముందు పడిపోయిన మనిషిని ఎంత అక్కరతో చూస్కుందీ ఎంత అల్లాడిందీ ఏడ్చిందీ… మొక్కులు మొక్కింది? ఒంటికీ రెంటికీ బట్టల్లోనే చేస్కుంటే… అసయ్యం కలిగినా కనపడకుండా ఎత్తిపోసిందీ? ఆ పుళ్ళకీ… ఈ చేతులతోనే కాదూ ఆయింట్‌మెంట్‌ రోజూ రాసేదీ? రోజూ కళ్ళతో వాటిని చూస్తూ చేస్తుంటుంటే అన్నం సయించక ఎన్నిసార్లు వాంతులు చేస్కుందీ… ఎన్నిసార్లు తినబుద్దికాక పస్తులుందీ తెలియకనా ఇతగాడికీ? బలానికి రకరకాల పండ్లూ, బాదం పాలు, గుడ్లు, మాంసం  పిల్లలకూ తనకూ లేకపోయినా మూడు పూటలూ పెడుతూంటే ఏఁవన్నా విశ్వాసం ఉందా అసలు? మాటంటే త్యాగమంటాడు తండ్రీ, భర్తా కాబట్టి చేసాడు తప్పుతుందా? తను త్యాగం చెయ్యలేదా? తిండీ, తాగుడూ, సంసార సుఖం అన్నీ త్యాగం చేసా కాబట్టి ఇప్పుడు నువ్వు నా కోరిక తీర్చాలంటాడు. ఇతగాడేనా? తనూ కష్టపడింది రాత్రింబగళ్ళూ పని చేసింది. షాపు నుంచి వచ్చాక గంపెడు పూలు మాలలు కడ్తుంది, నాలుగ్గంటలు కూర్చుని. పూల బజారు ఆసామి రయీస్‌ వచ్చి తీస్కెళతాడు. అతను దేశాలు పట్టిపోతే తాను ఇక్కడ ఇంత పని చేస్కుంటూనే పిల్లల్ని సాకింది. తను కూడా సంసార సుఖానికి దూరంగా ఉంది. అతనిలాగే… ఇతనితో సంసార సుఖం ఎన్నడనుభవించిందనీ… కానీ అతననుకుంటున్నాడని ఈ మాట అనుకోడం గానీ… తను చెప్పుకొంటూ తిరిగిందా? ఇతగాడిలాగా? తన చక్కదనం చూసి ఊరి మోగాళ్ళు ఓఁ కుక్కల తీరే పడలా తనెంట? ఒక్కల్లనన్నా దగ్గరకు రానిచ్చిందా? ”కళావతా అమ్మో నిప్పు… నిప్పు” అంటా తప్పుకోలా వాళ్ళు? ఇతనికన్నీ తెలుసు. ఎనకమాల  అన్నీ తెలుసుకుంటాడు. తనవల్ల కాదు సచ్చినా కానీ…

అమ్మా, మాధురీ చెప్పినట్లు వేరే అయినా ఉంటుంది కానీ… ఆ రోజు, ఆ రోజు, వదిన రామలక్ష్మి కాపలా ఉన్న రాత్రి బలవంతాన ముద్దు పెట్టబోతా ఉంటే గడ్డం మీద ఉన్న పుండు చిట్లి చీమూ నెత్తురూ తన పెదాల కంటి… ఓఁ… దేవుడా తనవల్ల కాదంటే కాదంతే!!!

– – –

”ఇంకోసారి అక్కను కొట్టావంటే ఊరుకోను” సురేష్‌ కోపంగా రామనాధం చేతిలో కర్ర విసిరికొట్టాడు. ”నీకెందుకురా కొజ్జా నా కొడకా” రామనాధం గోడ పట్టుకుంటూ కళావతి దగ్గరకు రాసాగాడు. సురేష్‌ కోపంతో రామనాధంను రెండు చేతులతో గుంజుతూ మంచం వైపుకి తీసుకుపోయి కూలేసాడు మంచంలో.

”ల… కొడకా నీ అక్క రోజూ షాపు ఓనరుతో పడుకొని వస్తుంది రా…” రామనాధం సిగ్గులేకుండా అరుస్తున్నాడు.

”అక్కా ఈ మందులు కూరలో కలిపేసి రోజూ రాత్రి వెయ్యక్కా నిద్రపోతాడు… ఆ కోరికలు కూడా తగ్గుతాయని డాక్టరు చెప్పాడు” అన్నాడు సురేష్‌ మందుల పొట్లాం కళావతి చేతిలో పెడ్తూ. రవి ఆ ఊరి ఆరెంపీ డాక్టరు. కళావతి మౌనంగా మందులు తీస్కుంటూ ”ఏం కాదు కదా బావకి? ముందే బీపీ, షుగరూ… పుండ్లూ ఎక్కువ కావు కదా” భయంగా అంది కళావతి. ”ఏం కాదక్కా నేను చెబుతున్నాగా, కోపం తగ్గుద్ది… నీ వెంట పడడు. గమ్మున నిద్ర పోతాడంతే…” సురేష్‌ ధైర్యం చెబుతున్నట్లుగా అంటున్నాడు.

కళావతి ఆ మాత్రలు కూరలో కలిపి రోజూ రాత్రిపూట ఇవ్వసాగింది. రాత్రి బాగా నిద్రపోతున్నట్లు కదలడం లేదు. కళావతిని రమ్మని గొడవ చెయ్యడం లేదు. పగలు కూడా బాగా మత్తుగా నిద్రపోతున్నాడు. సమస్య ఇక్కడే వచ్చింది కళావతికి… మెలకువ వచ్చాక అన్ని రోజులు లేని మత్తు ఇప్పుడెందుకొస్తుందీ నాకేదో మందులు ఇస్తున్నారు అక్క తమ్ముడూ కల్సి” అని గోల చెయ్యడం, అన్నం విసిరికొట్టడం, పాలు ఒంపేయ్యడమో, కళావతి మీద విసిరేయడమో చేస్తున్నాడు. తెల్లారి పదకొండు దాకా లేవటం లేదు. కళావతికి షాపుకి ఆలస్యం అయిపోతోంది. షాపు ఓనరు బాధ ఎక్కువయ్యింది. ”ఈ ఉద్యోగఁవూ ఊడితే ఒక్క పూలల్లుకుని బతకలేను కదరా సురేషూ” కళావతి తమ్ముడు దగ్గర మొత్తుకుంది. ”అదికాదు సురేషూ ఇవొట్టి నిద్ర మాత్రలురా, ఆలోచనలు తగ్గించే మందులు వేరే ఉంటాయంటరా నా ఫ్రెండు చెప్పింది వాళ్ళాయనకు మందుల షాపు ఉందిలే. అవి ఆ డాక్టర్లే రాయాలంటరా ఎట్టారా మరీ” కళావతి దిగులుగా తమ్ముడి వైపు చూసింది.

”సరే అక్కా మనం బావ రిపోర్టులు తీస్కుని డాక్టరు దగ్గరకు వెళదాం” అన్నాడు సురేష్‌.

– – –

”అమ్మో… ఓర్నాయనోయ్‌” అంటూ అరుస్తూ కళ్ళు తెరిచాడు రామనాధం, చేత్తో ఒంటిని తడుముకుంటూ. ఎదురుగా కళావతి ఎర్రబడ్డ కళ్ళతో, రక్తంతో పొంగిన మొఖంలో నిలబడి ఉంది. చేతిలో తన ఊత కర్ర… ”ఏమైందే ల… ముండా నన్నే కొడ్తున్నావు” రామనాధం అంటానే ఉన్నాడు, కర్రతో ఎడాపెడా కొడతానే ఉంది కళావతి రామనాథం అరుస్తూనే ఉన్నాడు. దెబ్బలు ఆపుకోడానికి, అతని కుడిచెయ్యి సరిపోవడం లేదు. సురేష్‌ పరిగెత్తుకొచ్చి ”ఒద్దక్కా సస్తాడు” అంటూ కళావతిని ఆపే ప్రయత్న చేస్తున్నాడు. తన చేతిలో ఉండాల్సిన కర్ర, కళావతి ఒంటిమీద పడాల్సిన కర్ర తిరగబడి తన ఒంటి మీద నాట్యం చేస్తుంటే దిగ్భ్రాంతి చెందుతున్నాడు రామనాధం. ఇంత ధైర్యం ఎక్కడిది దీనికి? తన ఒక్క కంటిచూపుతో గజగజా ఒణికిపోతుందే… ‘రా’ అంటే వచ్చి పక్కన నిలబడి పారిపోయే వీలున్నా… కర్ర గుంజుకునే వీలున్నా… ఆ రెండూ చెయ్యడానికి కూడా భయపడి పోయి మూగపక్షిలా, తనే కాలూ చెయ్యీ పడిపోయిన దానిలా దెబ్బలు తింటూ నిలబడిపోతుందే ఒళ్ళప్పచెప్పేసి… అలాంటిది దీనికింత ధైర్యం ఎక్కడిదీ, రామనాథం కొయ్యబారిపోయాడు.

రెండ్రోజుల క్రితమే ”అక్కా నాకేదో పడుకోబెట్టేసే మందు పెడుతున్నారే… వచ్చి కొంచెం కనిపెట్టు” రామనాధం ఫోను చేస్తే రహస్యంగా కనిపెట్టేసి కళావతిని పట్టేద్దాం అని కంకణం కట్టుకుని రెండు రోజుల క్రితమే వచ్చిన రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి ”నా తమ్ముణ్ణి చంపుతావటే” అని అరుస్తూ కర్ర గుంజుకోబోయింది. అప్పటిదాకా కూతురి భీకారావతారం చూస్తూ దగ్గరికి కూడా రాకుండా రెండు చేతులూ కట్టుకుని నిలబడ్డ మంగళ కళావతిని ఆపకుండా అలానే నిలుచుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న దేవీ సాక్షాత్కారాన్ని చూస్తున్నట్లే కళావతిని చూడసాగింది మంగళ. ఆమె కళ్ళల్లో అంతులేని ఆనందం తెర్లిపోతున్నది.

”ఎందుకే… ఎందుకే వాణ్ణలా బాదుతున్నావూ కాలూ చెయ్యి లేనివాణ్ణి” రామలక్ష్మి వలవలా ఏడుస్తూ అడుగుతున్నది. కళావతి కర్రనలానే పట్టుకుంది. మరో చేత్తో తమ్ముడి చేతిలో ఉన్న సంచిలోని కాయితాలు తెచ్చి రామనాధం మీదకు విసిరి కొట్టింది. ”ఈ కాయితాల్లో ఏముందో తెలుసా… ఎంతసేపూ నా పెళ్ళాం నాతో పడుకోటం లేదని ఊరంతా కోడై కూస్తున్న నీ తమ్ముడు పరదేశంలో ముండలతో పడుకొని తెచ్చుకున్న అంటురోగాల చిట్టా. నీ తమ్ముడి ఒంటి మీద పుండ్లు సుఖరోగాలవి. దేశం నించి వచ్చినప్పుడల్లా నేను శీలం కాపాడుకుంటా, పవిత్రంగా ఉన్నానూ, నువ్వూ ఇక్కడ అట్లానే ఉండాలీ శీలం ముక్కెం కలావతీ అని నీతులు చెఁవుతానే… ఆడక్కడ శీలం వదిలేసి ఇక్కడ కొచ్చి నన్ను వాడితో, వీడితో పడుకున్నావు నీ రంకు మొగుడు ఎవడే అంటూ చావ చితక్కొడతాడా” కోపంతో ఊగిపోతూ కళావతి అంటూనే మరో నాలుగు దెబ్బలు కసి తీరా వేసింది. రామనాధం గావుకేకల మధ్య ఆయాసపడుతూ కొట్టడం ఆపి ”ఒంటినిండా రోగాలంటించుకు ఆ పుండ్లు రసి కార్తుంటే, వాణ్ణి సుఖపెడ్తూ వాడితో సంసారం చేయలంటాడా.. ఆ డాక్టరమ్మ నాకంతా చెప్పింది. వీడికి భయంకరమైన సుఖరోగాలున్నాయ్‌ నువ్వు దూరంగా ఉండమ్మా. నీ అదృష్టానికి వీడికి ఎయిడ్స్‌ లేదూ అని” ఆగకుండా చెబుతూ ఉన్న కళావతి ఒక్కసారిగా ఆగింది. చేతిలో కర్ర అలానే ఉంది.

”అవునే, నేను మగాణ్ణి ఎన్నాళ్ళు ఆడది లేకుండా ఉండాలి” రామనాధం నీరసంగా అయినా స్పష్టంగానే అన్న మాటల విన్న కళావతి మరోసారి కోపంతో రెచ్చిపోయింది. కర్రతో మళ్ళీ బాదసాగింది. అడ్డం తగిన రామలక్ష్మికీ కర్ర దెబ్బలు తగిలాయి. ‘వామ్మో’ అని ఏడుస్తా దూరం జరిగిందామె. శవంలా మంచంలో ముడుక్కున్నాడు మూల్గుతూ. కొట్టి కొట్టీ ఆయాశంతో ఆగిన కళావతి మోకాలు మడిచి కసిగా ‘ఉహ్హ్‌…’ అని అరుస్తూ కర్రను మడిచిన మోకాలు కింద పెట్టి రెండు చేతులతో విరిచింది. కర్ర శబ్దం చేస్తూ రెండుగా విరిగిపోయింది. రెండుగా ముక్కలైన కర్రల్ని నేలకు విసిరికొట్టింది కళావతి. నేలబడిన కర్రలు ఠన్‌ఠన్‌మని శబ్దం చేసాయి. ఆ శబ్దం కళావతి చెవులకి పసందుగా విన్పించింది. తనని విరగొట్టినందుకు లేదా రామనాధంను కొట్టినందుకు కర్రలు పరమ సంతోషంగా నవ్వినట్లుగా కూడా అన్పించింది కళావతికి.

ఎదలో మరిగిపోతున్న లావా చల్లపడ్డట్లు అన్పించింది. ”మరి వీడి రోగాలు నీకూ వస్తాయా పరీక్షలు చేయించుకొమన్నదా డాక్టరమ్మ” మంగళ కూతురి దగ్గరకు వచ్చి ఆందోళనగా అడిగింది. ”అవునమ్మా… ఒకసారి అన్ని పరీక్షలూ చేయించుకోమంది… అయినా… అంటూ కళావతి ఒక క్షణం ఆగి ఎడం చెయ్యి చూపుడు వేలితో, ఉండ చుట్టిన కాగితంలా పడి ఉన్న రామనాధం వైపు తిరస్కారంగా చూపిస్తూ, చూపిస్తూ ”వీడొచ్చినప్పట్నించీ, నేనిప్పటి దాకా వీణ్ణి నన్ను ఒక్కసారి కూడా కలవ నివ్వలేదు కదా” అంటూ కళావతి ఇంటి బయటికి వెళ్ళి అరుగు మీద నిమ్మళంగా కూర్చుంది.

– – –

రు బయట పెరట్లో నులకమంచం మీద పడుకొని ఉంది కళావతి. చందమామ, చుక్కల్నీ, ఆకాశాన్ని, భూమినీ వెలిగించుకునే పనిలో పడ్డట్టుగా ఉన్నాడు. చుక్కలు మెల్లిగా మబ్బుల చాటు నుంచి రాసాగాయి, కొత్తగా కనిపిస్తున్న కళావతిని చూడాలన్నట్లుగా.

మంగళ, సురేషూ ఇద్దరూ కళావతిని ఇంటికి తెచ్చుకున్నారు. తాంబాళం నిండా కాగిన నీళ్ళతో తలారా గంటసేపు స్నానం చేసింది కళావతి. పద్దెనిమిదేళ్ళ నుంచీ తన అణువణువులో పేరుకుపోయిన భయాన్ని, బెదురునూ సమూలంగా కడిగేసుకుంటున్నట్లు. ముగ్గురూ ఏం మాట్లాడుకోవట్లేదు. మంగళ వంటలో పడిపోయింది. కళావతికి కొసరి కొసరి తినిపించింది.

చాలా నిమ్మళంగా ప్రశాంతంగా ఉంది కళావతికి.

కళావతికి డాక్టరమ్మ గుర్తుకు వచ్చింది. ”నీ భర్తను ఇక్కడే చూసిన డాక్టర్‌తో మాట్లాడాను అతనిలో కోపం, ఉద్రేకం, సెక్స్‌ ఆలోచనలు తగ్గడానికి మందులు వాడచ్చు ఫరవాలేదన్నారు ఆయన. మందులు వాడమ్మ ఆ లక్షణాలు తగ్గుతాయి… ఒక నెల వాడు” అంది.

”తర్వాత… తర్వాతేం చేయాలి మేడం కర్రతో బాగా కొడతాడు అని చెప్పాగా.. మందులు వాడితే కొట్టటం మానేస్తాడా…”? కళావతి భయంగా అడిగింది.

”నువ్వు ముందు మీ ఆయనంటే ఉన్న భయాన్ని జయించాలి. ఏం చెయ్యాలి అంటావేంటి కళావతి… నువ్వు ముందు మీ ఆయనంటే ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి. మందులలో తగ్గనివి కొన్ని ఉంటాయి. కాలూ చేయీ పడిపోయి మూలన పడి ఉన్న మనిషంటే భయం దేనికి… ఆ మృగంలాంటి మనిషి చేతికి వస్తేనే కదా కర్రకి ప్రాణం వచ్చేది? ఆ కర్రనే నీ చేతిలోకి తీసుకో… నీలోని బలం శక్తీ కూడా కర్రకు రావా? ఒక్కసారి కొట్టి చూడు.. వాడంటే… ఆ కర్రంటే ఉన్న భయాన్ని జయించి చూడు…” తను ఆశ్చర్యంగా ”అమ్మో ఆయన్ను కొట్టటమే?” అంది భయంగా.. అప్పుడు డాక్టరమ్మ నవ్వింది ఈత కొట్టటానికి ముందు చెరువులో దూకటానికి భయపడే పిల్లను చూసి నవ్వినట్లు…

ఆ రాత్రి ఆ డాక్టరమ్మ మెత్తటి నవ్వు కళావతి పెదాల మీద వెన్నల్లా పరుచుకుంది.

ఆకాశంలో నక్షత్రాలు ఈసారి కళావతి కళ్ళలోని కాంతుల్ని పీల్చుకుని మెరుస్తున్నట్లుగా నవ్వాయి.

*

లోగో: సృజన్ రాజ్ 

Avatar

గీతాంజలి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ కథ గుండెల్ని పిండేసింది గీతాంజలి గారూ – ఇంత ఘోరంగా దుర్మార్గంగా లైంగికంగా పీల్చి పిప్పి చేసి హింసించే భర్తలు – వాళ్ళ క్రూరమైన మగ మదం కింద పడి నలిగే కళావతి లాంటి స్త్రీలు – చాలా మంచి పరిష్కారం చెప్పారు – నిజమే కదా అదే కర్రతో తిరగబడితే కానీ తెలియదు వెధవలకు –
    మీ శైలి కూడా చాలా బాగుంది – చదివించింది ఎక్కడా ఆపకుండా – చదువుతుంటే ఆగకుండా కళ్ళలో నీళ్ళు –

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు