కథలోపలి సమూహం ఎవరు?

ఒక ఏకాంతంలో రాయటం మరో ఏకాంతంలో చదవటం. ఎదురెదురుగా లేని రెండు అల్ప సంఖ్యాకుల మధ్య జరిగే భావ వినిమయమే నవల, కధ అయాయి.

సాంకేతికాభివృద్ధితో బాటు కథ చెప్పటంలో మార్పులు వచ్చాయి. అందులో ఒక అభివృద్ధి ఫలితం కథానిక.

  *  *  *

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం-

సౌంజ్ఞలు మొదటి భాష. శబ్దాలనూ, సౌంజ్ఞలనూ ఆంగిక వాచిక అభినయాలనూ కలిపి తమ ఉద్వేగాలను ప్రదర్శించటం అలవడ్డాక మానవుని బావవినిమయం పెరిగింది. తర్వాత మాట వచ్చింది. ఈ క్రమంలో ఇది తొలి టెక్నాలజీ.  దానితో కథ చెప్పుకోటం వచ్చింది. క్రో- మాగ్నన్ మానవుడు దాదావు 40 వేల ఏళ్లక్రితం బ్లాక్ మాంగనీస్, ఐరన్ ఆక్సైడ్ వంటి ఖనిజాలతో గుహలలో రంగులు వెయ్యొచ్చన్నది కనిపెట్టాడు. దాంతో బొమ్మలలో కూడా కథ చెప్పటం వచ్చింది. మరి కొన్నవేల సంవత్సరాలకి బొమ్మలనుంచి లిపికి బీజాలు ఏర్పడ్డాయి.

లిపి స్థిరపడింది. ఈనాడు మనం పుస్తకాలు అనేవాటికి కారణం లిపి అనే సాంకేతికత. చెప్పే విషయాలలో వర్గీకరణ(classification) క్రోడీకరణ (codification) సాధ్యమయింది. అది ఆయా అంశాలను ఒక పద్దతిలో అభివృద్ధి పరిచేందుకు మార్గం సుగమమయింది.

ఫలితంగా కథ చెప్పటం అనేది ఒక ప్రత్యేకాంశం అయింది. దాంతో పెద్దపెద్ద ఇతిహాసాలు పుట్టాయి. వాటిలో అంతకుముందు చెప్పుకున్న కథలు చేరాయి. కొత్త కల్పనలు చేరాయి. వర్ణనలు చేరాయి. వాటిని అభివృద్ధి చేసే క్రమంలో విమర్శ పుట్టింది. లక్షణ గ్రందాలు పుట్టాయి.  రాసుకునే పరికరాలలో మార్పులు అభివృద్ధి రావటంతో అనేక ప్రతులు రాసుకోటం వచ్చింది.

ఒకేమారు అనేక ప్రతులు తయారు చేయగలిగిన అచ్చుయంత్రం వచ్చింది. దాంతో కథ చెప్పటంలో చెప్పటానికి లక్ష్యంలో మార్పులు ముమ్మరించాయి.

అచ్చుయంత్రానికి ముందు పాశ్చాత్య సంస్కృతి అనేవ్యాసం పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ రాసారు. ఆసక్తి కలవారు ఆ వ్యాసం http://pustakam.net/?p=10974&cpage=1 లో చదువుకోవచ్చు.

మనకి సంబంధించి ఇతిహాసాలను తెనిగించటం ఆరంభం. తర్వాత చిన్ని చిన్ని వృత్తాంతాలను విస్తరించి ప్రబంధాలు రాసుకున్నారు. అచ్చుయంత్రానికి ముందు పరిణామాలలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కొద్దిపాటి తేడాలున్నాయి.

అధునికత అనేదాన్ని అనేకరకాలుగా నిర్వచించినా సాంకేతికాభివృద్ధి ఒక్కమారుగా వేగవంతమైన దశ అనవచ్చు. సాంకేతికాభివృద్ధి క్రమంలో  ముద్రణాయంత్రం, తర్వాత పత్రికలు, ఆ మీదట సిన్మా, టివి, ఆడియో కథ  కథలు చెప్పటంలో మార్పులు తీసుకువచ్చాయి. వాటి గురించి మరోమారు వివరంగా మాటలాడుకుందాం.

***

1440లో గుటెన్బర్గ్ ముద్రణాయంత్రం వచ్చింది. ఇది ఆధునిక ఆరంభదశలో ఒక పెద్ద అంగ. అంతవరకూ రాయగలగటం, చదవగలగటం అనేవి కొందరికే పరిమితమైన విద్యలు. అనేక నూతన అన్వేషణలు, ఆవిష్కరణలతో చదువుకొనే జీతగాళ్ల అవసరం ఏర్పడింది. ఉపాధి చదువుకి బీజాలు పడ్డాయి. తొలి మధ్యతరగతిగా వ్యాపారవర్గం గుర్తించబడింది. వీరి మానసిక అవసరాలకు జీవిత వాస్తవికతను తెలియజెప్పే రచనలు కావలసివచ్చాయి. దీనికి ముద్రణాయంత్రం అమిరింది. చదువరుల సంఖ్య పెరిగింది. అనేకప్రతుల తయారీలో సాంకేతికాభివృద్ధి త్వరితమయింది.

అనేక ఇతర సామాజికాంశాలు ఉన్నప్పటికీ, ఈ సాంకేతికాభివృద్ధి పలితంగా నవల పుట్టింది. నవల రూపంలో కథ చెప్పటం ఆరంభమయింది. నవలకి ఉండే ప్రధానమైన అవగాహన అది వచనంలో ఉండటం. పెద్దదిగా ఉండటం. ఒక పుస్తకంగా ఉండటం. ఒక వృత్తాంతం ఉండటం. ఈ లక్షణాలతో 1485లో ముద్రించబడిన  తొలి నవల Le Morte d’Arthur. దీని రచయిత Sir Thomas Malory.. దీనికిముందే Genji monogatari అనే జపాన్ రచన 11వ శతాబ్ధంలో వచ్చింది. దీని రచయిత Murasaki Shikibu. ఇది తొలి నవలగా కొందరు అంటారు. దానిని పక్కన పెడితే స్వరూప, స్వభావ లక్షణ చర్చ చేసిన విమర్శకులు చాలామంది చెప్పే నవల రాబిన్సన్ క్రూసో. స్వరూపంలో పెద్దదిగా ఉండటం, వచనంలో ఉండటం ప్రధానమైనవి. స్వభావంలో వాస్తవంగా ఉండటం, కథ స్వతంత్రంగా ఉండటం (అంటే మన ప్రబంధాలు లోగడ గ్రంధాలలో ఉండే వృత్తాంతం స్వీకరించి విస్తరించి రాసినట్టు ఉండరాదని వారి అభిప్రాయం) , కథలు కథలుగా కాక ఒకే కథ ఉండటం ప్రధానమైనవి.

నవల, పత్రిక అచ్చుయంత్ర ఫలాలు. కథానిక అనేది పత్రికల (ఒక నిర్ధిష్ట అవధిలో వెలువడేవి) ఫలం.

 ***

1605లో తొలి వార్తాపత్రిక రిలేషన్ జర్మన్ భాషలో వెలువడిందిట. 1719లో వాషింగ్టన్ ఇర్వింగ్ మనం ఈనాడు కథానికగా అంగీకరిస్తున్న రూపంలో కథ రాయటం ఆరంభించాడు. దీనికి ఆయన స్కెచ్ అని పేరుపెట్టుకున్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని కథా చరిత్రజ్ఞులు అంటారు. పోరంకి దక్షిణామూర్తి గారి కథానిక స్వరూప స్వభావాలు అనే పిహెచ్డీ సిద్ధాంత గ్రంధంలో ఇర్వింగ్ ఆరంభించిన స్కెచ్ గురించి ఇలా రాసారు. ‘ఏదైనా ఒక చిత్తవృత్తినిగాని, భావోద్రేకాన్నిగాని, తీసుకుని దానికి తగ్గ వాతావరణం కల్పించి రచన సాగించాడు.’  కథానికని ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా గుర్తించాడన్న పేరు ఇర్వింగ్ కే దక్కింది.

కథానిక పుట్టుకకి  కారణం పత్రికలు. పత్రికలు తీసుకువచ్చిన కొన్ని శాశ్వతమైన మార్పులు గమనించాలి. పద్యం కన్న వచనం వినియోగం పెరిగింది. వచనంలో వచ్చిన తొలి ప్రక్రియ వ్యాసం. ప్రపంచ తెలుగు మహాసభల సావనీర్ కోసం రాసిన వ్యాసంలో అన్నాను.

“ఆధునికత ఫలితంగా ఆవిర్భవించిన వచన ప్రక్రియ వ్యాసం. ‘ఏదేనియొక విషయమును విరివిగా వ్రాయుట వ్యాసం’ అని చెపుతుంది శబ్దరత్నాకరము. సందర్బవశాత్తు రాజనీతి, నీతి వంటి విషయాలమీద విపులంగా రాయటం కల్పనా సాహిత్యానికి చెందిన భారత, రామాయణాలలో కనిపిస్తుంది. శాంతిపర్వంలో ధర్మరాజుకి భీష్ముని బోధనలు ఒక ఉదాహరణ. నాకు తెలిసినమేరకు విడిగా రాయటం ఆధునిక దశకు ముందు లేదు. ఇలా ఏదైనా   విషయాన్ని విపులంగా, విడిగా రాయటమే వ్యాసప్రక్రియ. వచనం అవసరాన్ని పెంచింది ఆధునికత అయితే, వ్యాసం అవసరాన్ని సృష్టించినది పత్రికా ప్రచురణ.”

Essay, an analytic, interpretative, or critical literary composition usually much shorter and less systematic and formal than a dissertation or thesis and usually dealing with its subject from a limited and often personal point of view. అని నిర్వచిస్తుంది బ్రిటానికా ఎన్సైక్లోపిడయా. వ్యాసం అనే ప్రక్రియ యొక్క పాత్ర మానవ సమాజగమనంలో అపారమైనది. ఇమ్మాన్యుయల్ కాంట్ రాసిన వ్యాసం ఎన్లైటెన్మెంట్ రాజు నుంచి, దేవుడి నుంచి వ్యక్తిని స్వతంత్రుడిని చేసింది.  ధామస్ పెయిన్ రాసిన  కామన్ సెన్స్ కరపత్రాలు అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధానికి కారణమయాయి. వోల్టేర్, రూసో వంటివారి వ్యాసాలు ఫ్రెంచి విప్లవానికి దోహదపడ్డాయి.

కథానికలను కూడా వ్యాసాలుగా, తరవాత కథావ్యాసాలుగా మన తొలిపత్రికలు వ్యవహరించేవి.

***

తరచు ప్రయాణాలతో, స్థిరంగా ఉండని జనం అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాశ్చాత్య పత్రికలు కథానికలని రాయించాయని, అదే కథానిక ఆరంభమనీ ప్రాశ్చాత్య విమర్శకులు వివరిస్తారు. ప్రాశ్చాత్య విమర్శకుల పరిశీలన మేరకు కథానికకి ఆదిలో అంత గౌరవం లేదు. ప్రత్యేక అస్తిత్వం లేదు. క్రమంగా కథానిక రెండు మార్గాలుగా చీలిందనీ, కళారూపాలలో స్థానం కోసం కొందరు దారి తీస్తే, కేవలం డబ్బు కోసం కొందరు రాసారని వారు అంటారు. కళారూపంగా దానికి అవసరమైన నేర్పు నవలకి అవసరమైన నేర్పుకన్న భిన్నమైనదనీ, దాని లక్ష్యం నవల లక్ష్యం కన్న భిన్నమైనదనీ క్రమంగా విమర్శకులు తెలియజెప్పారు.

ఆదిలో ఈ కొత్త ప్రక్రియను రకరకాల  పేర్లతో గుర్తించారు. గోథే 1795లో పత్రికలలో తను రాసిన  కథానికలని entertainments (వినోదములు) అన్నాడు. హాఫ్మన్ వాటిని tales అనే అన్నాడు. కథానిక పేరే కాక, లక్ష్య, లక్షణ చర్చ విరివిగానే సాగింది. అలాగే ఎవరు తొలి కథకుడు వంటి చర్చ అన్ని భాషలలోనూ నడిచింది. లక్ష్యం (స్వభావం లేదా ఉద్దేశ్యం), లక్షణం (స్వరూపం) నిర్ధరించటానికీ తద్వారా కథానిక పుట్టుకనూ (లేదా అచ్చునూ) కథకుడినీ నిర్ధరించటానికి చర్చలు అన్ని భాషలలోనూ కనిపిస్తాయి.

పాశ్చాత్యులు ఆదిలో కథానికకి ఉపయోగించిన పేర్లలో రెండు ప్రధానమైనవి. Sketch. Tale. కథకుడు తన ఇతివృత్తంతో పరిచయమున్న చదువరికి చెప్పేది స్కెచ్. పరిచయం లేని వానికి చెప్పేది టేల్.

స్వరూప నిర్ధారణలో అనేక అంశాలు ఉన్నాయి. నిడివి, సంఘటనల సంఖ్య, కథలో ప్రస్తావించబడిన పాత్రల జీవన కాలావధి, కథా సమయపు కాలావధి, పాత్రల సంఖ్య, వస్త్వైక్యత వగైరా అనేక అంశాలు స్వరూప నిర్ధారణ చర్చలో ప్రస్తావించారు.

పోతే- స్వభావం. అంటే కథానిక లక్ష్యం. ఇది మరింత జటిలమైనది. రచనకి లేదా కల్పనా సాహిత్యానికి ఉండే సామాజిక ప్రయోజనం ఈ స్వభావ నిర్ధారణలో ఒక భాగం మాత్రమే.

‘అన్నింటికన్న కష్టసాధ్యమైనది కవిత్వం. దానిలో రాణించలేని వారు రెండవ కష్టసాధ్యప్రక్రియ కధానికలో అడుగుపెడతారు. అందులో కూడా ఉత్తీర్ణులు కాలేకపోతే నవలలో స్థిరపడతారు.’ అంటాడు విలియం ఫాక్నర్. కథానికా ప్రక్రియని నవల కంటే క్లిష్టమైన సృజన అని  చాలామంది గుర్తించారు.  ప్రత్యేకంగానూ, ప్రశంసనీయంగానూ. భావించారు.

కథానికా రచన ప్రత్యేకత, దానికి అవసరమైన నైపుణ్యం అలా వుంచి గమనించవలసిన మరో ముఖ్యాంశం ఒకటుంది.

చెప్పేదశలో ఎవరైనా కథ చెప్పగలిగే అవకాశం ఉంది. వినగల వారందరూ వినవచ్చు. లిపిలో కథ చెప్పేదశకి కథకులకి పరిమితి అరంభమయింది. మొదట్లో చెప్పిన మేధోపరమైన శక్తులతో బాటు చదవటం (reading), రాయటం అనే విద్యలు తప్పనిసరి అయాయి (విద్యలలో చదువు ఒకటి). కథ తెలుసుకోదలచినవారికి చదువుతో బాటు ప్రత్యేకాసక్తి (రసజ్ఞత అనవచ్చు) అవసరమయింది. చదివి పదిమందికి చెప్పేవారు మన పౌరాణికుల వంటివారు మన సమాజంలో ఏర్పడ్డారు.

ముద్రణాయంత్రం, పత్రికలు తెచ్చిన నవల, కథానికా రూపాలలో కథ చెప్పేవారు అశేష జనానీకంలో సంఖ్యాపరంగా మైనార్టీ అయారు. అదే సమయంలో చదివేవారు లోగడ వినేవారిలో మైనార్టీ. ఒక ఏకాంతంలో రాయటం మరో ఏకాంతంలో చదవటం. ఎదురెదురుగా లేని రెండు అల్ప సంఖ్యాకుల మధ్య జరిగే భావ వినిమయమే నవల, కధ అయాయి. రాయగలగటం, చదవగలగటం అత్యవసర అర్హతలు. రాయలన్న తహతహ చదవాలన్న తహతహ కలిగిన ఈ అల్పసంఖ్యక బృందాన్ని మనం సాహిత్య సమాజం అనవచ్చు. సాంకేతికాభివృద్ధితో ఆరంభమైనమార్పు ఆడియో కథ. ఇది రాయటం చదవటం అనే విద్యల అవసరాన్ని కొంత తగ్గించబోతోంది. దీనిలో కథ చెప్పటంలో మార్పులు వస్తాయి. దానిని గురించి మరోచోట వివరంగా మాటలాడుకుందాం.

లోగడ కథలో అసంకల్పితంగా ఉండే సామాజికహితం ఒక సంకల్పిత ఆకాంక్ష రూపం ధరించింది. ఈ సాహిత్య సమాజం మొత్తం సమాజానికి పరోక్ష ప్రతినిధులయారు. అంటే జనం కష్టసుఖాలను  చెప్పవలసి వచ్చింది. అంతర్గర్బితంగా ఉండే సామాజిక హితం కథకుడు చైతన్యపూర్వకంగా తీసుకునే ఎంపిక అయింది. చదువరి చైతన్యానికి ప్రేరణ, చింతనలోభాగస్వామ్యం కథకుడు వహించవలసివచ్చింది. .

రాసేవారికి ఉపాధి, గుర్తింపు పొందే అవకాశం లభించాయి.  సంక్లిష్టమవుతున్న జీవితం గహనం చేసుకోటానికి ఆరాటపడే వ్యక్తికి చదవటం ఒక మానసికావసరం అయింది. ఇలా ఒక ప్రత్యక్ష సామాజికావసరంతో మొదలైన కథ చెప్పటం నవల, కథానికలుగా పరిణమించేనాటికి పరోక్ష సామాజికావసరం అయింది. ఒక పరోక్షమైన వ్యక్తి అవసరం ప్రత్యక్షమైన వ్యక్తి అవసరంగా పరిణమించింది.

కథ చెప్పటంలో వినోదం ఉంది. ఆదిలో అది లక్షణంగా ఉండేది. ఉదాహరణకి సాహిత్యం అనే పదం తీసుకుందాం. దాని వ్యుత్పత్తి అర్ధం హితవుతో కూడుకున్నది. అంటే హితవు చెప్పేది అంతేకాక హితవుగా చెప్పేది అని అర్ధం. లక్ష్యం లక్షణం కూడా ఆ పదంలో ఉన్నాయి. కథా రూపంలో చెప్పటమే హితవుగా చెప్పటం కదా! ఆ చెప్పటం కూడా అలరించాలి. ఆనందింపజేయాలి. వినోదింపజేస్తూ చెప్పాలి. కథానికగా రాతలో కథ చెప్పేనాటికి వినోదం ఒక్కోమారు కేవల లక్ష్యం అయింది. ప్రత్యక్ష వ్యక్తి అవసరాలలో వినోదం ఒకటి. కొనుగోళ్లు లాభాలుతో కూడిన పత్రికలు కొనుగోలుదారుడిని(వ్యక్తిని) వినోదింపజేయటానికీ, పత్రికకి నిర్దిష్టమైన పేజీలు నింపటానికీ కథానికలు అమిరాయి. దానిలో సామాజికాంశం  ప్రకటితం కావచ్చు. పత్రికకి ఒక నిర్దిష్ట భావజాలం ఉంటే ఆ సామాజికాంశానికి పెద్దపీట కూడా వెయ్యవచ్చు. రచయితకి  సామాజిక సంవేదన ఉండవచ్చు. దానిలో విశ్వాసాలు ఎఱుకలు మిళితమై ఉండవచ్చు. అప్పుడు కూడా సామాజికాంశం అతని కథలో ప్రకటితమవుతుంది.

కథానిక పుట్టేనాటికి కథ చెప్పటంలో వచ్చిన పరిణామాలన్నింటిలోకీ ముఖ్యమైనవి రెండు.

  1. వినోదమూ(హితవుగా చెప్పటం) ఉపదేశమూ(హితవు) రెండు భిన్నలక్ష్యాలు కావటం.
  2. రాసేవారూ, చదివేవారూ అశేష జనానీకంలో అల్ప సంఖ్యాకులు కావటం. వారిదో ప్రత్యేక సమూహం, సాహిత్యం కొందరు వ్యక్తుల ప్రత్యేక అవసరం కావటం.

  ***

పాశ్చాత్య పత్రికలలో పుట్టిన కథానిక భారతదేశానికి వచ్చిననాటికి అక్కడి సామాజిక, సాహిత్య పరిస్థితులేమిటి? ఇక్కడి పరిస్థితులేమిటి? అది మన దేశానికి కొత్తది అనే విషయం అందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే వారనేది ఏమిటి? తరవాత సంచికలో మాటాడుకుందాం!

వివిన మూర్తి

తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వివినమూర్తి గారూ, ఈ సమాచారం తప్పు. మార్చవలసి వుంది…. “క్రో- మాగ్నన్ మానవుడు దాదావు 40 వేల ఏళ్లక్రితం బ్లాక్ మాంగనీస్, ఐరన్ ఆక్సైడ్ వంటి ఖనిజాలతో గుహలలో రంగులు వెయ్యొచ్చన్నది కనిపెట్టాడు.”.

    “The earliest known cave paintings are at least 64,000 years old[1]. Represented by three red non-figurative symbols found in the caves of Maltravieso, Ardales and La Pasiega, Spain, these predate the arrival of modern humans to Europe by at least 20,000 years and thus must have been made by Neanderthals. ”
    Source : https://en.wikipedia.org/wiki/Cave_painting

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు