ఎస్ ఐ ఆర్ వార్తలు అదేపనిగా చదివీ చూసీ వున్నానేమో, నిన్న రాత్రి ఒక పీడ కల వచ్చింది . పొద్దున్నే కాఫీ చల్లారి పోతున్నా సరే పక్కన పెట్టి ఇది రాస్తున్నాను.
ఏమిటా కల ?
కల్లో నేను మా వూళ్ళో వున్నానా , నా వయసు పదహారే . పూల పూల లంగా ఓణీ లో వున్నాను.
అరె .. అది విజేవాడలో మా స౦దు చివరి శ్రీరామ నవమి పందిరే . రాత్రి తొమ్మిదింటికి వేదిక మీద ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతోంది . ప్రేక్షకుల్లో నా పక్కనే మా బామ్మ కూడా వుంది . ఇద్దరం చిరు చాప మీద కూచుని, జేబురుమాలు మూట విప్పి త౦పటి శనక్కాయలు తింటూ చూస్తున్నాం . నాటకం రసవత్తరంగా సాగుతోంది.
ద్రౌపది వేషం వేసి చీరలు వూడదీయించుకోవడానికి ఆడాళ్ళు ఎవరూ దొరకలేదట . మగాడికి వేషం వేశారు . అప్పట్లో అలాగే జరిగేది . ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఆ మగాడు ద్రౌపది మేకప్ లో భలే అందంగా వున్నాడు. చీర మీద చీర చుట్టడం వల్ల కాస్త బొద్దుగా కనిపిస్తున్నా కానీ స్వరం స్త్రీ
పాత్రకి అనుకూలంగా మార్చే ప్రతిభ వల్ల గిరాకీ వున్న కళాకారుడు . ఇక తగ్గేదేముంది . పక్క వాయిద్యాలు విషాదంగా మోగుతున్నాయి.
స్క్రిప్ట్ ప్రకారం , దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని కౌరవ సభలోకి ఈడ్చుకువచ్చాడు.
“ఓరీ క్రూరుడా ఆగు, తానోడి నన్నోడె నా, నన్నోడి తానోడె నా “ ద్రౌపది పద్యం అందుకుంది.
ప్రధాని చేసిన అప్పులు మన నెత్తిన చుట్టినప్పుడు మనం ఆడగాల్సిన ప్రశ్న ఇదే కదా.
దుర్మార్గులకి జవాబు చెప్పాల్సిన పనివుండదు . వ౦ది మాగధులు ఎలాగూ వంత పాడతారు
దుశ్శాసనుడు ద్రౌపది ని సమీపించి చీర లాగుతున్నాడు.
“హే కృష్ణా “ అంటూ చేతులు జోడించి ప్రార్ధన చేస్తోంది ద్రౌపది. కుచ్చెళ్ళు పట్టు తప్పిన నీలం రంగు చీర ఆధార౦ ఇవ్వలేని ఆధార్ కార్డు లా నేలకి జారింది.
ఎన్ని చీరలు లాగాలో జనానికి మరియు దుశ్శాసనుడికీ గుర్తు వుండటం కోసం ద్రౌపది కి నాలుగు రంగుల చీరలు చుట్టారు.
దుశ్శాసనుడు ఎర్ర చీర చీర అందుకున్నాడు. ద్రౌపది లొంగడం లేదు, పరిగెడుతోంది . శాపాలు పెడుతోంది.
“ హే కృష్ణా , అనాధ రక్షకా , ఆర్త పరాయణా “ పద్యం అందుకుంది . ప్రేక్షకుల్లో వున్న స్త్రీలందరూ ద్రౌపదు లయిపోయారు . అందరి మొహాల్లోనూ భావోద్వేగం కనిపిస్తోంది . పురుషులందరూ దుశ్శాసను లయిపోయారు. మెరిసే కళ్ళతో ఆమె వంకే చూస్తున్నారు.
రెండో చీర జారి పోయి ఎన్నికల మర్నాడు ఊడ్చి పారేయడానికి పోగు పెట్టిన ఓటరు చీటీలా గాలికి రెపరేప లాడింది.
“అయిదుగురు భర్తలు౦డి అనాధని అంటుదే మిటి బామ్మా” అని అడిగాను.
“ఇష్ మధ్యలో మాట్లాడకూడదు “ వెనకనుంచి ఎవరో కసిరారు.
దుశ్శాసనుడు మూడో చీర కొంగు పట్టుకుని గట్టిగా గుంజాడు.
నిప్పు తాకిన లక్క ఇల్లు మాదిరి నేల కూలింది చీర. అజ్ఞాత వాసం నుంచి బయట పడకుండా వుండేందుకు ఇంత ప్రపంచం వుండగా అదేదో శాపం పెట్టినట్టు కౌరవ రాజ్యాన్ని ఎందుకు ఎంచుకోవాలి ? ఎంచుకోకుండా వుండాల్సింది . అయినా తన నిర్ణయం ఏముంది ? అంతా ఆ అయిదుగురు భర్తలే చేస్తారు . తనని తనే నిందించుకుంది ద్రౌపది.
ఏదొ ఒక విధంగా అమెరికా వెళ్ళి స్థిరపడాలన్న తాపత్రయంతో దొడ్డి దారిలో దొరికిపోయి కాళ్ళకి బేడీలు వేయించుకున్న మన యువతరం దీన దృశ్యం గుర్తొచ్చింది.
ఈ పౌరాణికమేమిటి అచ్చం సాంఘికంలా ఏడ్చింది, అనుకుని విస్తుపోతూ అలాగే చూస్తూ వుండి పోయాను .
పారదర్శకంగా వుంది తెర . కృష్ణుడు తెరవెనక బీడీ తాగడం కనిపిస్తోంది . ఆఖరి చీర వూడదీసేదాకా అతనికి స్టేజీ మీద పనిలేదనుకుంటాను.
దుశ్శాసనుడు విజృంభించి ఇంకో చీర లాగాడు. ద్రౌపది తట్టుకోలేక కురుసభలో అజ్ఞాతంగా వున్న అయిదుగురు భర్తల వ౦క ఆక్రోశంగా చూసింది. వాళ్ళు ఇంకెటో చూస్తున్నారు.
సభలో పెద్దలు అచ్చంగా మన రాజకీయ వామపక్ష, ప్రతిపక్షాల్లాగానే కొందరు ఫ్యామిలీ టూరు లో వున్నారు . కొందరు తమ గత చరిత్రవైభవం గురించి మీడియాకి ఇంటర్వూలు ఇస్తున్నారు.
పాపం భీముడు ఒక్కడూ కాస్త ఆవేశ పడబోయాడు కానీ ఆడదాన్ని పంచుకున్నంత హాయి కాదు కదా అధికార పక్ష౦తో తలపడడం – అందుకుని మిన్నకుండి పోయాడు.
“భీమా, తొందరపడకు ధర్మ౦ గెలుస్తుంది” అన్నాడు ధర్మరాజు శాంతి కన్నీరు కారుస్తూ-
“అసలు ధర్మరాజు మూలంగా నే కదా ఇన్ని కష్టాలు “ అన్నాను నేను మా బామ్మతో .
“తప్పు అలా అనకూడదు ధర్మరాజు ఆడిన మాట తప్పడు . పందెంలో ఓడినది భార్య అయినా సరే వదులుకుంటాడు”
“ఓడటానికి ద్రౌపది ఏమయినా వస్తువా ? ఓ ద్రౌపదీ నిన్ను జూదంలో పెడతాను ఇష్టమేనా, అని అడగాలి దమ్ము వుంటే ” నాకు భలే కోపం వచ్చింది.
“ నువ్వసలు మాట్లాడకుండా వుండలేవా ? తగుదునమ్మా అని నిన్ను ఇక్కడి తీసుకురావడం నాదే బుద్ది తక్కువ “ అరిచింది మా బామ్మ
“ఒకే బామ్మ ఇంకేం మాట్లాడను “ ప్రామిస్ చేశాను
“ద్రౌపది పూర్వ జన్మలో అన్ని దానాలూ చే సింది కానీ వస్త్ర దానం ఒక్కటీ చేయలేదట అందకే ఈ జన్మలో ఇలా.. “ అంది లో గొంతుకతో, నన్ను కసిరినందుకు నొచ్చుకుంటూ-
“ అదేమిటి కృష్ణుడు కూడా స్నానం చేసే ఆడాళ్ళ చీరలు ఎత్తుకుపోయాడుగా , దానికి పరిహారంగా తర్వాత జన్మలో అయినా మరి శ్రీ కృష్ణ వస్త్రాపహరణం వుండదా?!”
“ ఓయ్ ముసలమ్మా నీ మనవరాల్ని తీసుకుని బయటికి పోతావా లేదా, వచ్చినప్పటి నుంచి చూస్తు న్నాను ఏమిటీ గోల ?” వెనక ప్రేక్షకురాలు మా బామ్మతో యుద్దానికి దిగింది . టక్కున నా నోరు మూతబడింది.
“ అన్నిటికీ ధర్మ సూక్ష్మం వుంటుంది తర్వాత చెబుతాలే “ నా చెవిలో గొణిగింది మా బామ్మ .
“ ఏమిటీ చీరలు వూడదీయడంలో కూడా ధర్మ సూక్ష్మ౦ వుంటుందా ?” బయిటికి వినిపించకుండా గొణుక్కున్నాను .
ఇంకో చీరకోస౦ దుశ్శాసనుడు మళ్ళీ ద్రౌపది వొంటిమీద చెయ్యి వేశాడు . వొలిచిన చీరలు మొత్తం అటుపక్క అకాల వర్షానికి వరద పాలయిన పంట దిబ్బల్లా గా పోగుపడ్డాయి.
“ఆగరా ఒరే, అదేపనిగా అలా గుంజకు , లోపల లాగూ కూడా లేదు . ఆ కృష్ణుడెక్కడికి పోయాడో పిలవరా, వాడి బీడీలు తగలబెట్ట” . దుర్యోధను డి చేతి నుంచి ఆఖరి చీరని గుంజుకుంటూ పోరబాటున పైకే అనేశాడు ద్రౌపది పాత్రధారి . జనం గొల్లుమని నవ్వారు.
వేదిక పక్కనే వున్న ప్రామిటింగ్ చేసేవాడు ద్రౌపడిని పైకి చూడమని వేలితో చూపించాడు . అక్కడ కృష్ణుడు వేదిక క౦తలొంచి చీర కిందికి జారవిడుస్తూ అది ద్రౌపది అందుకోకపోవడంతో తికమక పడుతున్నాడు . వెంటనే అటు చూసింది ద్రౌపది.
కౌరవ సభ నుంచి కురు వృద్ధులు అనేకులు చూచుచు నుండ దుర్యోధనుడు గొంతెత్తి,
“ఎందుకొచ్చిన పరితాపము నీకు బేలా , వేగమే నా కౌగిలి లోకి రమ్ము , నా వొడిలో సుఖాశీనురాలివి కమ్ము, నా రాజ్యానికి రాణిని చేయుదును గాక “ అని ఒక ఆఫర్ ఇచ్చాడు.
బలవంతంగా అప్పులు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ వసూలు చేయడానికి ఇళ్ళలో వున్న ఆడాళ్ళ మీద వీరంగం చేసిన కాల్ మనీ రౌడీలు గుర్తొచ్చారు.
ఇంతకీ ఆ దుర్యోధనుడి మొహం ఎక్కడో చూసినట్టుగా వుందేమిటి, ఎవరది ? చాలా ఆలోచించాక అప్పుడు
గుర్తొచ్చింది , ఆ వెడల్పాటి చతురస్రపు మొహం సాక్షాత్తు మన రాజుగారిది కదా.
ఏమంటు న్నాడు రాజు ?
“రండి రండి మీరు నాకు ఓటేస్తే చాలు మీ బట్టలు మీ వొంటి మీదే వుంటాయి . వూడదీసేవాళ్లేవరూ వుండరు”
రాజు అనేక స్వదేశీ విదేశీ గొంతులతో పిలిచాడు .
అత్యంత ఆకర్షణీయమైన ఈ ప్రకటన విని అందరికీ ఈల వేయాలనిపించింది.
అప్పటిదాకా ద్రౌపది పక్షం వహించి కన్నీరు కార్చిన కురుసభలో అనేకమంది తటాలున రాజు గారి వొళ్ళో కూచో వడానికి పోటీ పడ్డారు . ప్రేక్షకులలోంచి కూడా కొందరు వేదిక ఎక్కేసి క్యూ కడుతున్నారు
ద్రౌపది ఒక్కతీ ఏక వస్త్ర గా అక్కడే నిలబడి పోయింది.
ఆవిడ వొంటి మీద వున్న ఏక వస్త్రం పేరేమిటి ?
ఆత్మగౌరవమా ?
అది కూడా వదులుకోమని చేసే నిర్భంధం జరుగుతోంది.
అవతల స్టేజీకి కట్టిన తెర కిటికీ లోంచి కృష్ణ పరమాత్ముడు చీరలు అందిస్తున్నాడు . ద్రౌపది అందుకోలేదు . ఇవాళ ఇచ్చిన చీరలు రేపు వొలవకుండా వుంటాడా ? వీడు కూడా అదే తానులో ముక్క కదా ? మొన్న మొన్నటి వరకు వీడు కూడా ఆడాళ్ళ చీరలు ఎత్తుకుపోయినవాడే కదా.
ద్రౌపది ఆలోచనలో పడింది.
“ఏకవస్త్రం ఎంత అసభ్యం ?” ప్రధాన మీడియాలో విదూషీమణులు రెచ్చి పోతూ నీతులు చెబుతున్నారు .
“ఏంటి కలవరిస్తున్నావు , ఎనిమిదయింది ఇంక లే, ఎక్కడికో వెళ్లాలన్నావు కదా”
సుందరం నా భుజం తట్టి నిద్ర లేపే దాకా అది కల అనుకోలేదు .
*








Adi kadusuma kalalaadusumaa,,bhale baga raseru,,varevaa
కథనం భూత వర్తమాన మేళవింపు
బావుంది
నిజమే సుమా! ఎంత దగ్గర పోలిక కదా! ఆ ఏకవస్త్రాన్నయినా రక్షించుకోవాలని ద్రౌపదికున్న ఆరాటం మన సమాజానికి లేకుండా పోయింది.