చిన్నప్పటినుండి ఒకే చోట పెరగకపోవటం వల్లనో, ఒకే బడిలో చదవకపోవటం వల్లనో, త్వరగా స్నేహితుల్ని సంపాదించుకునే కళ తెలియకపోవటం వల్లనో ఎక్కువగా నాకు తోడున్నది ఒంటరితనమే.
అదేపనిగా రాయకపోయినా, రాసే ప్రతికథలో ఈ భావన ఏదో ఒక సందర్భంలోనో, పాత్రలోనో అంతర్లీనంగా ఉందనిపిస్తుంది నాకు. అయితే ఇలాంటి అభిప్రాయమొకటి ఏర్పడకముందు దీని గురించి ఆలోచించకుండా చెప్పాలనుకున్న కథని రాసేవాడిని.
నా మొదటి పుస్తకం గాజులసంచి రాసిన తర్వాత ఎలాంటి కథలు రాయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పటికే మూడు సంవత్సరాల నుండి నా మనసులోనే ఉన్న కథ ‘మధురానగర్ మెట్రోస్టేషన్’ గుర్తొచ్చింది. కుటుంబాన్ని బాగా చూసుకుంటూ, స్నేహితులతో బాగా ఉంటూ, ఉద్యోగంలో మంచిపేరు తెచ్చుకుంటూ మహానగరంలో మహా ఒంటరిగా బ్రతుకుతున్న ఒక యువకుడి జీవితంలోని ఎవరికీ తెలియని భాగాన్ని గురించి రాసిన కథ అది.
ఆ తర్వాత ‘నా గదిలోపల చీకటిలో’ అని క్రాఫ్ట్ పరంగా కొన్ని ప్రయోగాలు చేసిన కథా, దాని తర్వాత ‘నిద్రకి వెలియై నేనొంటరినై’ అనే గవర్నమెంట్ టీచర్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రైవేటు టీచర్ కథా రాసాను. ఈ మూడు కథలు రాసాక మూడింటినీ ఒకసారి చూసుకుంటే వీటిలో ముఖ్యంగా కనిపించిన విషయం ఒంటరితనం.
కలిసి పెరిగిన మనుషుల్లో, చిన్నప్పటినుండి చూసిన మనుషుల్లో, చదువుకున్న పుస్తకాల్లో, చూసిన సినిమాల్లో ఎంతో ఒంటరితనాన్ని చూసున్నాను. వాటిలో నాకు బాగా అర్థమైన వాటినీ, నన్ను కదిలించి నాకు కథలిచ్చిన ఒంటరితనాల గురించీ రాయాలని అనుకున్నాను.
ఒక్కొక్క కథా రాసుకుంటూ వెళ్ళాను. అన్ని కథల్లో నేనే వేర్వేరు పాత్రల్లో ఉన్నానని ఎవరైనా అంటే కాదనను. చిన్నప్పటినుండి నేను పోగు చేసుకున్న ఒంటరితనమంతా ఒక్కొక్క పాత్రకి బహుమతిచ్చి ఈ కథల్లోకి పంపేసానని చెప్పుకుంటాను.
ఒంటరితనాన్ని పలకరిస్తూ, కలిసి జీవిస్తూ ఉన్న వాళ్ళెవరైనా ఈ కథల్ని చదివి ‘ఒంటరితనం అంటే ఇలా ఉంటుందా? నాదసలు ఒంటరితనమే కాదేమోలే!’ అని తమ బ్రతుకులో పడిపోతే ఆనందపడతాను. ఈ కథలు చదివిన ఎవరూ వీటిలో తమని తాము వెతుక్కోకూడదని ఆశిస్తాను.
ఒకవేళ ఈ కథల్లో మీ జీవితపు సాయంత్రమో, రాత్రో, మనిషో, ఙ్ఞాపకమో మీకూ దొరికితే, ఒక్కసారి చిన్నగా నవ్వుకుని ‘రేపటి గీతం’ కోసం వెతకండి. అదే దారిలో ఎక్కడో ఒక చోట నేనూ కనిపిస్తాను.
*








Add comment