అందం

రాత్రంతా అన్యమస్కంగానే గడిపా. శ్రావణి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. అసలు ఈ కాలం పిల్లలకు ఇంత మొండితనం ఏంటి ?

కాలేజంతా కోలాహలంగా ఉంది.

లంచ్  అవర్.

పిల్లలంతా చెట్ల క్రింద కూర్చుని కబుర్లతో పాటు తెచ్చుకున్న ఆహారాన్ని కలిపి తింటున్నారు.

శని ఆదివారాలు సెలవులవడంతో పాపి కొండలు ట్రిప్ ప్లాన్ చేసుకుని శుక్రవారం సాయంత్రమే బయలుదేరి వెళ్లాను. రెండు రోజులు హాయిగా గడిపి తిరిగి సిటీలోకి వచ్చేసరికే తొమ్మిదయింది. ఎలాగూ  టైంకి కాలేజికి చేరుకోలేనని అర్ధం అయి హాప్ డే లీవ్ పెట్టేసాను. ఇంట్లో ప్రయాణం చేసొచ్చిన బట్టలను ఉతుక్కుని ఆరేసి లంచ్ టైంకి కాలేజికి చేరాను. భోజనం చేసేసి రావడంతో సావకాశంగా మస్టర్ లో సైన్ చేసి స్టాప్ రూంవైపు నడిచాను.

అందరూ వరసగా కూచుని భోంచేస్తున్నారు. నేను ఎప్పుడూ కూర్చునే టేబిల్ దగ్గర విజయ కుమారీ మేడం కూర్చుని ఉన్నారు. నన్ను చూసి కుర్చీ ఇవ్వడానికి లేవబోయారు. భోజనం చేస్తున్న ఆవిడను లేపడం ఇష్టం లేక ఆమెను వారించి, ఆ కాసేపు గ్రౌండ్ లో పిల్లలను చూస్తానని చెప్పి బైటికి వచ్చాను.

భోజనం చేసున్న పిల్లలంతా నా వైపు ఇబ్బందిగా చూసారు. పాపం వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా ఉండే సమయం అది. ఆ సమయంలో అక్కడ నేను ఉండడం వాళ్లకు ఇబ్బందే మరి. గ్రౌండ్ దాటి కాస్త వెనగ్గా ఉన్న వేప చెట్టు దగ్గరకు వచ్చాను. చెట్టు చుట్టూ అరుగు ఉంటుంది. ఆ చోటు నాకు చాలా ఇష్టం. లంచ్ టైం అయిపోవడానికి ఇంకా అరగంట ఉంది. బాగ్ నుండి విష్ణు ప్రభాకర్ అర్ధనారీశ్వర్ నవల తీసి చదువుతూ కూర్చున్నాను.

కాసేపటికి వెనగ్గా ఎవరో పరిగెత్తినట్లు అనిపించింది. తల తిప్పి చూస్తే ఓ అమ్మాయి పరిగెత్తుకుంటూ  కుడి పక్కన ఉన్న క్లాస్ రూం గోడవతలకు వెళుతుంది. మా పిల్లలందరూ తమ కలల రాకుమారులను కలుసుకునే స్థలం కూడా ఇదే మరి. ఆ గోడవతల ఓ జంట స్వీట్ నథింగ్స్ కోసం కలుసుకుంటున్నారనిపించి వారి ఆనందాన్ని భగ్నం చేద్దామనే దురుద్దేశంతో మెల్లిగా ఆ అమ్మాయి వెళ్ళిన వైపుకి నడిచాను.

గోడ పక్కన ఫస్ట్ ఇయర్ శ్రావణి వాంతి చేసుకుంటుంది. కడుపు లోపలికి వెళ్లిపోయి ఛాతి బైటకు వచ్చి మొహం నిండా చెమటతో అవస్థ పడుతుంది. పక్కన నిలబడిన నన్ను చూసి బెదిరిపోయింది. శ్రావణి చెవులను మూసి ఆమె తలను క్రిందకు వంచి పట్టుకుని రెండు నిముషాలు నించున్నాను.  అప్పుడే తిన్న అన్నం మొత్తం కక్కేసింది. తలెత్తి నన్ను చూసిన ఆమె ముఖంలో భయం. భయపడవద్దంటూ భుజం తట్టి చెట్టు క్రింద అరుగు మీదకు తీసుకువచ్చాను. నా హాండ్ బాగ్ లో ఉన్న నీళ్ల బాటిల్ ఇచ్చి ముహం కడుక్కోమన్నాను. ఆ అమ్మాయికి నా ఉనికి ఇబ్బందిగా ఉంది. ఓ ఐదు నిముషాలలో తెప్పరిలి, బాటిల్ నాకు తిరిగి ఇచ్చి, థాంక్స్ మేడం అంటూ తన క్లాస్ వైపుకు వెళ్లబోయింది.

“ఏమైంది… ఫీవర్ ఏమన్నా ఉందా” అడిగాను

“లేదు మేడం’. లో గొంతుతో అంది

“పీరియడ్శ్?”

“నో మేడం జస్ట్ స్టమక్ అప్ సెట్” అంది.

“సరే క్లాస్ కు వెళ్ళి కూర్చో. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అయితే ఫ్రెండ్ ఎవరినన్నా పంపు టాబ్లెట్ ఇస్తాను’. అన్నాను.

పిల్లల కోసం బేసిక్ మెడిసన్స్ దగ్గర ఉంచుకోవడం నాకు అలవాటు. డోలో, సెట్రజిన్, డామ్స్టిల్ ఎప్పుడూ ఉంటాయి. కాని ఎంతో అవసరం అయితే తప్ప టాబ్లెట్శ్ వాడకూడదనే ఆలోచనతో అత్యవసరం అయితే తప్ప పిల్లలకు ఏ మాత్రా ఇవ్వను.

బెల్ అయి అందరూ క్లాసులకు వెళ్లడం చూసి నేనూ రూం నెంబర్ ట్వల్వ్ వైపుకు నడిచాను. ఫిఫ్త్ పీరియడ్ నా క్లాస్ అక్కడ కాబట్టి. ఇక ఆ పూటంతా హడావిడిగా గడిచిపోయింది. శ్రావణి సంగతి మర్చిపోయాను.

రెండు రోజుల తర్వాత స్పోర్ట్శ్ డే  కోసం పిల్లల మార్చ్ పాస్ట్ ప్రాక్టిస్ కి గ్రౌండ్ శుభ్రం చేయాలని పి.టి.సార్, ఆయాలిద్దరితో గ్రౌండ్ లోకి వెళుతూ, డిస్ప్లే థీం కూడా డిస్కస్ చేద్దాం రమ్మని కబురు చేసారు. లంచ్ త్వరగా ముగించి నలుగురం కాలేజీ బిల్డింగ్ వెనక ఉన్న స్థలం వైపుకు వెళ్లాం. ఆయాలకు ఎంత వార గడ్డి పీకి చదును చేయాలో చెప్పి ఇద్దరం పిరమిడ్శ్ డిస్ప్లే కోసం కొత్త ఫార్మేషన్లు డిజైన్ చేయాలని వేప చెట్టు అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాం. వెనుక నుంచి ఎవరో వాంతి చేసుకుంటున్న చప్పుడు.

తిరిగి చూసాం. శ్రావణి మళ్ళీ వాంతి చేసుకుంటూ. చేతిలో ఉన్న బాటిల్ తో నోరు, ముఖం కడుక్కుని వెనక్కు తిరిగి మా ఇద్దరినీ చూసి ఆగిపోయింది.

“ఏమైందమ్మా… వంట్లో బాలేదా” అడిగారు వెంకట్ సర్.

నన్ను చూసిన శ్రావణి కళ్ళల్లో బెదురు. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ మొహంలో

నేను తనను దగ్గరకు రమ్మని పిలిచి నుదిటిపై చేయి ఉంచి చూసాను. చల్లగా తగిలింది. “ఏమైంది టాబ్లెట్ ఏమన్నా కావాలా…” అడిగాను.

వద్దంటూ తల ఊపింది.

“సరే క్లాస్ కు వెళ్లు. లాస్ట్ అవర్ నేను వచ్చి చూస్తాను” అన్నా.

శ్రావణి సరే అంటూ క్లాస్ కు వెళ్లిపోయింది.

శ్రావణి సి. యి. సి స్టూడెంట్. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. నల్లగా, పొట్టిగా కొంచెం బొద్దుగా ఉంటుంది. పెద్దగా ఎవరితోనూ మాట్లాడదు. ఏ ఆక్టివిటీలోనూ పాల్గొనదు. నుంచోబెట్టి లెసన్ చదవమన్నా కాన్పిడెంట్ గా చదవదు. కళ్లల్లో కళ్ళు పెట్టి అస్సలు మాట్లాడదు. క్లాస్ టెస్ట్ లో ఆవరేజ్ మార్కులే వచ్చాయి. ఈ అమ్మాయి ఎవరితో స్నేహంగా ఉంటుందో కనుక్కోవాలి అనుకుంటూనే ఆ రోజూ పనిలో పడి విషయం మర్చిపోయాను.

ఆ తర్వాతి వారం అంతా స్పోర్ట్శ్ డే పనులతో సరిపోయింది. స్పోర్ట్శ్ డే అయిపోయిన మరుసటి రోజు  కాలేజ్ కి సెలవు ఇస్తారు. అలసిపోయిన స్టాఫ్, స్టూడెంట్శ్ అంతా విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఫ్రేష్ గా కాలేజీకి వచ్చాం.

సెకెండ్ అవర్ క్లాసు తీసుకోవడానికి ఫస్ట్ ఇయర్ సి. ఈ. సి. కి  వెళ్లాను. హరివంషరాయ్ బచ్చన్ పరిచయం పూర్తి చేసి ఆయన రాసిన ‘కోషిష్ కర్నె వాళ్లో కీ కభీ  హార్ నహీ హోతీ’ కవిత ఒక సారి ఎవరికి వారు చదివే ప్రయత్నం చేయమని తర్వాత నేను చదివి వినిపిస్తానని చెప్పి కూర్చున్నాను.

లాంగ్వేజ్ క్లాస్ కు వచ్చేవాళ్ళు అన్ని క్లాసులనుండి వస్తారు కాబట్టి అటెండెన్స్ తీసుకోవడం తప్పని సరి. పిల్లలకు వర్క్ ఇచ్చి అటెండెన్స్ తీసుకోవడం నా అలవాటు. అందుకే వరసగా అందరి పేర్లు పిలవడం  మొదలెట్టాను.

“శ్రావణీ” అని గట్టిగా పిలిచా. సమాధానం రాలేదు. అప్పుడు గమనించా. శ్రావణీ కూర్చునే చోట ఇవాళ రంజని కూర్చుని ఉంది. ఎప్పుడూ మౌనంగా కూర్చుని ఉండే శ్రావణిని ప్రత్యేకంగా గమనిస్తే తప్ప క్లాసులో ఉందో లేదో కనుక్కోలేం. ఆ అరవై మందిలో తను లేదని నేను ఇప్పటి దాకా తెలుసుకోలేకపోయాను.

అమ్మాయిలందరూ నా వైపు చూస్తున్నారు.

‘శ్రావణీ ఏ స్పోర్ట్ లోనూ పార్టీసిపేట్ చేయలేదు. అసలు మొన్న కాలేజీకే రాలేదనుకుంటా. మరి ఇవాళ దేనికి డుమ్మా కొట్టింది” అడిగాను.

“శ్రావణి హాస్పిటల్ లో ఉంది మేడం” అంది మూడో బెంచ్ లో కూర్చున్న రచన

రచన చాలా ఆక్టివ్ గా ఉండే స్టూడెంట్. నేను నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటుంది. నా దగ్గర తనకు కాస్త చనువు కూడా.

గోడవతల వాంతి చేసుకుంటున్న శ్రావణి గుర్తు కొచ్చింది.

‘అరే ఏమైంది’ అడిగాను… ఏదో హెల్త్ కాంప్లికేషన్ ఉండి ఉండవచ్చు. ఏదైనా కాని మామూలు సమస్య అయితే బావుండు అని మనసులో అనుకుంటూ.

“తెలీదు మేడం, రాత్రి అంబులెన్స్ లో తీసుకెళ్ళారు. మా కాలనీ లోనే ఉంటారు కదా. వాళ్ళ మమ్మీ కడుపు నొప్పి అని చెప్పింది” జవాబిచ్చింది రచన.

“అయ్యో… ఆ అమ్మాయికి ఏదన్నా హెల్త్  ప్రాబ్లం ఉందో ఏమో… మీరెవరన్నా హాస్పిటల్ కు వెళ్లారా” అడిగా ఎందుకో తను వాంతి చేసుకుంటుంటే చూసానన్న విషయం క్లాస్ లో అందరి ముందు చెప్పాలనిపించలేదు.

ఆ అమ్మాయి మొహం అదోలా పెట్టి “లేదు మేడం, శ్రావణీ ఎవరితో మాట్లాడదు. ఒక్కత్తే కూర్చుంటుంది. ఇంటి దగ్గర కూడా బైటికి అస్సలు రాదు. వాళ్ళ పేరెంట్శ్ చాలా స్ట్రిక్ట్”. అంది

“కాని ఎప్పుడూ లంచ్ టైం లో వామిటింగ్ చేసుకుంటుంది  మేడం. మేము చాలా సార్లు చూసాం.” అన్నారు వెనుక బెంచ్ లో కూర్చునే గౌతమి, విజయలు.

మగపిల్లలు నవ్వుతున్నారు. అందుకే ఇక విషయం పొడిగించదల్చలేదు..

“ఈ రోజు ఇంటికి వెళ్లాక విషయం కనుక్కుని చెప్పు రచన” అంటూ టెక్స్ట్ బుక్ చేతిలోకి తీసుకున్నా.

*

నాలుగు తర్వాత మీటింగ్ అంటూ ప్రిన్సిపల్ పిలవడంలో ఆలస్యంగా ఇల్లు చేరా. పని చేసుకుంటూ ఉంటుంటే పక్కింట్లో పని చేసే నాగేంద్ర వచ్చింది.

“అమ్మా లక్ష్మమ్మ కళ్ళు తిరిగి పడిపోతే మధ్యాహ్నం హాస్పిటల్ కు తీసుకెళ్లారు” అంది.

“అరే నిన్న బానే ఉందే. ఏం అయింది” అడిగా

“బీ. పి ఎక్కువయ్యిందంటమ్మా. సార్ రాఘవేంద్ర హాస్పిటల్ లో చేర్పించినాడు. వాళ్ల డాక్టర్ అక్కడే ఉన్నారంట” అంది.

“అవునా.. ఇప్పుడెలా ఉందని చెప్పారు”

“ఇప్పుడు మాట్లాడుతుందంట అమ్మా… కాని ఏవో టెస్టులు చేయాలంట” చెప్పింది నాగేంద్ర.

వెంటనే శర్మ గారికి ఫోన్ చేసా లక్ష్మి గారి గురించి కనుక్కుందామని.

“హలో… ఆ సుకన్య… ఆంటి బానే ఉంది. ఈ మధ్య చాలా అశ్రద్ద చేసింది కదా ఉపవాసాలు అదీ ఇదీ అని. ఎంత చెప్పినా వినదు. కళ్ళు తిరిగి పడిపోయింది. బీ. పీ. హై కాదు లో అయింది. ఎందుకయినా మంచిదని అన్ని టెస్టులు చేపిస్తున్నా. మామూలుగా అయితే మాట వినదు కదా” అన్నారాయన నవ్వుతూ.

“నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నా.. అలాగే ఉన్నపళాన వచ్చేసాం కదా. తన బట్టలు ఏవీ తీసుకురాలేదు. ఈ హాస్పిటల్ గౌన్ వేసుకోనని గోల.  బట్టలు లేవు కాబట్టి ఇంటికి వెళ్లిపోదాం అంటుంది. నాగేంద్రకు తాళం ఇచ్చి వచ్చాను. మీ ఆంటీ బట్టలు ఎక్కడుంటాయో దానికి తెలుసు. చూసి పంపించగలవా. ఇప్పుడే అక్కర్లేదు. పది లోపు ఎప్పుడయినా” అన్నారాయన.

“సరే అంకుల్. తొమ్మిదింటికి బట్టలు తీసుకుని నేనే వస్తాను. అంటీని చూసినట్లూ ఉంటుంది” అన్నా.

నాగేంద్రను తీసుకుని లక్ష్మి ఆంటి ఇంట్లోకి వెళ్ళా. క్రితం రోజు ఉతికి ఉంచిన చీరలు, రెండు తీసి ఇచ్చింది నాగేంద్ర. అవి తీసుకుని ఓ ఫ్లాస్క్ లో పాలు, ఇంట్లో ఉన్న ఆపిల్స్ బాగ్ లో వేసుకుని హాస్పిటల్ కు బైలుదేరాను.

హాస్పిటల్ లో ఆంటి దగ్గర ఓ అరగంట కూర్చుని ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పి క్రిందకు దిగడానికి లిఫ్ట్ ఎక్కాను.

స్ట్రెచర్ తీసుకెళ్లడానికి ఉపయోగించే లిఫ్ట్ కావడంతో విశాలంగా ఉంది అది. నేను బి టూ నొక్కి నిలుచున్నా.  లిప్ట్ సెకెండ్ ప్లోర్ లో ఆగింది. లోపలికి ఓ మధ్యవయసు వ్యక్తి ఓ ఇరవై ఏళ్ళ  కుర్రాడితో పాటు వచ్చాడు. నేను వెనక్కి జరిగి వాళ్ళకు చోటిచ్చాను. నన్ను చూసి ఆయనేదో అనబోయి ఊరుకున్నాడు.

బి టూ లో లిప్ట్ దిగి  కారు దగ్గరకు వెళుతున్న నా వెనుకగా అతను వచ్చి ‘మేడం’ అని మెల్లిగా పిలిచాడు.

వెనక్కు తిరిగి చూసా… ఎప్పుడూ చూసినట్లనిపించలేదు. పిలిచింది నన్నేనా…

అతను నన్నే చూస్తున్నాడు…

‘నన్నే పిలిచారా’ అడిగాను

‘అవును మేడం.. మీరు సుకన్య మేడం కదా’.. అడిగాడు

‘అవును మీరు?’ అడిగా

‘మా డాటర్ శ్రావణి మీ కాలేజీలోనే చదువుతోంది. తనను దిగబెట్టడానికి రోజూ వస్తాను కదా మీరు నాకు తెలుసు’ అన్నాడు

శ్రావణి… వెంటనే ప్రొద్దున్న క్లాస్ లో స్టూడెంట్శ్ చెప్పినది గుర్తుకువచ్చింది.

‘అరే అవును శ్రావణికి ఎలా ఉంది?  మీరు ఇక్కడ.. తను ఈ హాస్పిటల్ లోనే ఉందా’ అడిగా…

అతను మౌనంగా తల దించుకున్నాడు. పక్కన ఉన్న కుర్రాడు అసహనంగా చూస్తున్నాడు.

“ఏంటి ప్రాబ్లం, శ్రావణికి ఎలా ఉంది” అడిగా

“ఇక్కడే ఉంది మేడం సెకెండ్ ప్లోర్”

‘డాక్టర్లు ఏం అంటున్నారు’…

“మీరు వచ్చి చూస్తారా మేడం మీకేమన్నా చెప్తారేమో” అన్నాడు…

“అయ్యో, తప్పకుండా వస్తాను ఏం అంటున్నారు వాళ్లు? అసలు ప్రాబ్లం ఏంటి”  అడిగా..

“వాళ్ల అమ్మతో ఏదో గొడవ పెట్టుకుని ఫినాయిల్ తాగేసింది.  చాలా సేపటికి చూసాం. డాక్టర్లు సీరియస్ అంటున్నారు”… అన్నాడు.

నెత్తిన పిడుగు పడినట్లయింది…

“ఏమిటీ… ఏం జరిగింది…తనకు కొన్ని రోజుల నించి బాగున్నట్లు లేదు… కాలేజీలో వాంతులు  కూడా చేసుకునేది….” అంటూ ఏదో అర్ధం అయీ కానట్లనిపించి మాటలు మింగేసాను.

వాళ్లిద్దరూ ఎటో చూస్తున్నారు..

“మాకేమీ తెలియదు మేడం.  ఇంట్లో బాగానే ఉండేది, ఈ వాంతులేంటో ఈ గొడవేందో.. దాని దగ్గరే గొడవ జరిగి అమ్మతో కోట్లాడింది. తర్వాత ఇలా చేసింది. డాక్టర్లేమో పేగులు కాలిపోయినాయి అంటున్నారు” అన్నాడు.

వాళ్లిద్దరితో తిరిగి లిప్ట్ లో పైకి వెళ్లాను. రెండవ ఫ్లోర్ చేరుకున్నాం. అది ఐ.సి.యి.

బైట కుర్చీలను జరిపి పేషెంట్ల అటేండర్లు నిద్రకు ఉపక్రమించబోతున్నారు. శ్రావణి వాళ్ల నాన్న ఓ స్త్రీ దగ్గరకు నన్ను తీసుకెళ్లాడు. ఆమె తెల్లటి దేహం మీద ఎరుపు రంగు చీర మెరిసిపోతుంది.  శ్రావణి వాళ్ళ అమ్మ అన్నాడాయన ఆమెను చూపించి.

అప్పుడు గమనించాను. శ్రావణిది తండ్రి పోలిక. ఆయన రంగు, పోలికలు ఆ అమ్మాయిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

“ఈ అబ్బాయి” అడిగా… “శ్రావణి అన్న రాహుల్” అన్నాడాయన.

తెల్లగా బలంగా హాండ్సంగా ఉన్నాడు ఆ అబ్బాయి.

“ ఈ మేడం శ్రావణి లెక్చరర్’ పరిచయం చేసాడు శ్రావణి నాన్న

“ఏం జరిగింది” ఆమెను అడిగా…

“ఏం చెప్పాలి మేడం ఈ మధ్య అస్సలు మాట వినట్లేదు. మొండిగా ఉంటుంది. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడదు. తిండి తినదు. బలవంతంగా గుర్తు చేసి తినిపించాలి. మొన్న కాలేజీ లో స్పోర్ట్శ్ డే అంట కదా. కాలేజికి వెళ్ళను, చదువుకునేది ఉంది అని చెప్పింది. సరే అని ఊరుకున్నా. మధ్యాహ్నం తినమటే రాలే. తిడితే వచ్చి కొంచెం తినింది. తిన్న వెంటనే వాంతి చేసుకుంది. అదెంత మొండిదంటే మేడం నేను చూడకుండా నోట్లో వేళ్లు పెట్టుకుని వాంతి చేసుకుంటోంది. దానికి బీరకాయ ఇష్టం ఉండదు. ఆ రోజు అదే వండినా. నా ముందు తిన్నట్లే తిని చేయి పెట్టి వాంతి చేసుకుంది. నాకు కోపం వచ్చింది. మరి అంత మొండిగా చేస్తే ఎట్ల మేడం అందుకని తిట్టినా. అప్పుడు కూడా ఏం అనకుండా వెళ్లిపోయింది”.

“సాయంత్రం ఏవో నోట్శ్ కావాలని దీనితో స్కూల్ లో చదివిన సుధ ఇంటికి పోతానంది. ఆ పిల్ల మీ కాలీజేలోనే ఎం.పి.సి లో చేరింది. ఆ పిల్ల దగ్గరకు పోతే తొందరగా రాదు అని వద్దన్నా. గొడవ పెట్టుకుంది. నేను అరిచి రాహుల్ కి రొట్టెలు చేయడానికి వంటగదిలోకి పోయినా. ఇది నిద్రపోయిందేమో  అనుకున్నా. తినమని పిలిచినా రాలే. రాహుల్ తిని నిద్రపోయేటప్పుడు దీనిని వెళ్లి చూస్తే ఇది ఎట్లాగో చేస్తోంది. ఏమైంది అంటే, కడుపు పట్టుకుని ఫినాయిల్ తాగినా అని చెప్పింది. మేం ఆంబులెన్స్ లో ఏసుకొచ్చినం.”

డాక్టర్లు ఏం అంటున్నారు అడిగా

“తెచ్చిన వెంటనే బి.పి. సరిగ్గా లేదన్నరు. మధ్యాహ్నం ఎండోస్కోపి చేసారు. తిండి తినే గొట్టం, కడుపు కాలినయి అంటున్నరు.  సాయంత్రం పోలీసులు కూడా వచ్చిన్రు. హాస్పిటల్ వాళ్ళు కూడా ఏవో కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నరు” అంది.

“మీరు వెళ్లి చూస్తారా మేడం” రాహుల్ అడిగాడు.

“ఇప్పుడు వెళ్ళనిస్తారా” అడిగా.

రాహుల్ వెళ్ళి ఐ సీ యు దగ్గరున్న అమ్మయికి నన్ను చూపించి ఏదో అడుగుతున్నాడు. ఆమె తల అడ్డంగా తిప్పుతుంది. అర్దం అయింది నాకు. టైం చూస్తే పదకొండు అవుతుంది. ఇప్పుడు వెళ్లడం కూడా సరి కాదు అనిపించింది.

“రాహుల్ నేను రేపు నాలిగింటికి వస్తాను. అప్పుడు చూస్తాను ఇప్పుడు లేట్ అయింది కూడా”.  అన్నా.

నాతో ఆ తండ్రీ కొడుకులు మళ్ళీ లిప్ట్ లోకి వచ్చారు. బీ  వన్ లో  స్కూటర్ ఉంది అంటూ దిగి వెళ్ళిపోయారు.

శరీరం మనసూ రెండు అలసిపోగా నేను ఇంటికి చేరుకున్నా.

*

రాత్రంతా అన్యమస్కంగానే గడిపా. శ్రావణి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. అసలు ఈ కాలం పిల్లలకు ఇంత మొండితనం ఏంటి ? ఇష్టంలేని కూర వండితే వేళ్ళతో తోడి తిన్నది వాంతి చేసుకోవడం ఏంటీ? తల్లి స్నేహితురాలింటికి వెళ్లవద్దని  అంటే అంత కోపం దేనికి? వెంటనే ఫినాయిల్ తాగడం దేనికి? ఏంటీ ఈ వింత పోకడలు…

కాని కాలేజీలో శ్రావణీ రెండు సార్లు వాంతి చేసుకోవడం, అప్పుడు నన్ను చూసి భయ పడిన సంఘటనలు గుర్తు కొచ్చి కలవరపెడుతున్నాయి.

ఉదయం ఫస్ట్ అవర్ లో శ్రావణీ టెంత్ వరకు సుధతో చదివిందని వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తుకు వచ్చింది. సుధను కదిపితే విషయం తెలుస్తుందేమో అనుకుని ఎం.పి.సి క్లాస్ కు వెళ్లాను. సుధ బ్రైట్ స్టూడెంట్. మంచి స్పీకర్ కూడా. ఎవరితో నోరు విప్పి మాట్లాడని శ్రావణికి, సుధకి ఎలా కుదిరిందో మరి. తనతో  నాకు చిన్న పని పడిందని పిల్లలందరి ఎదుటే చెప్పి సుధను సిక్ రూం కు తీసుకు వెళ్ళాను.  అక్కడయితే ఫ్రీ గా మాట్లాడవచ్చని.

‘నువ్వు శ్రావణి కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారా’ అడిగా

అవునంటూ తల ఊపింది సుధ

“శ్రావణి  హాస్పీటల్ లో ఉంది తెలుసా” అడిగా

“తెలుసు రచన చెప్పింది” అంది.

సుధకు ఎంత వరకు తెలుసో నాకు అర్ధం కాలేదు.

“శ్రావణకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా” అడిగా

సుధ నా  వైపు చూసింది. మాటలు కూడబలుక్కుంటున్నట్లుంది

“లేదు మేడం” అంది

“సుధా, నువ్వు తనతో క్లోజ్ అని నాకు తెలిసింది. శ్రావణి తన క్లాస్ లో ఎవరితోనూ మాట్లాడదు. ఎవరికీ తన గురించి తెలియదు. పది రోజుల క్రితం తను లంచ్ అవర్ లో వామిట్ చేసుకుంటుంటే చూసా. మళ్ళీ రెండు రోజుల తర్వాత కూడా చూసా.”

సుధ మాట్లాడలేదు.

నాలో అనుమానం బలపడింది.

“శ్రావణి కి ఎవరన్న బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా. ఏదన్నా ఇబ్బందిలో పడిందా”. అడిగా

“శ్రావణి బాయ్స్ తో అస్సలు మాట్లాడదు మేడం” ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.

తల విదిలించా “సారీ సుధా. శ్రావణి పరిస్థితి బాలేదు. తను అగ్రెసివ్ గా కూడా నాకెప్పుడూ కనిపించలేదు. అసలేం జరిగిందో నీకు తెలుసా, తెలుస్తే చెప్పు. తను…” అంటూ ఆగిపోయా

“నాకు తెలుసు మేడం తను కడుపు నొప్పితో అడ్మిట్ అవలేదు” అంది సుధ..

నాకు కొంత భారం తీరింది…

“శ్రావణి అలా ఎందుకు చేసింది సుధా.. నీతో ఏమన్నా చెప్పిందా” అడిగా

“కొంచెం కొంచెం తెలుసు మేడం” అంది సుధ.

“మేడం శ్రావణి నల్లగా ఉంటుందని, లావుగా ఉంటుందని, వాళ్ల ఇంట్లో అందరూ అంటారు. వాళ్ల చుట్టాల్లో కూడా ఎవరూ శ్రావణిని సరిగ్గా చూడరు. తను అందుకే ఎవరితోనూ మాట్లాడదు.  తను అస్సలు బావుండనని క్లాస్ లో అందరూ తనను వెక్కిరిస్తారని స్కూల్ లో కూడ శ్రావణీ చాలా బాధపడేది. వాళ్ళ అమ్మలా, అన్నలా, అక్కలా తెల్లగా లేనని, తను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా బావుండనని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ల అమ్మ ఎప్పుడు బైటకుకానీ, చుట్టాలింటికికానీ వెళ్ళినా, అక్కని అన్నని తీసుకెళుతుందని, తనను ఎక్కడకూ రమ్మనదని నాతో చెప్పి చాలా ఏడ్చేది. మేడం తను చిన్నప్పుడు బాగా డాన్స్ చేసేది. కాని ఏ ప్రోగ్రాం కి తనను టీచర్లు సెలెక్ట్ చేయరు. నల్లగా లావుగా ఉంటుంది  కదా అందుకని. అసలు సెవెంత్ దాకా శ్రావణి టాపర్. లావు అయిపోయాక అందరూ ఏదో ఒక కామెంట్ చేసేవాళ్లు. ఆడపిల్లలు ఆమెపై జోక్ చేసేవాళ్లు. టీచర్లు కూడా సరిగ్గా మాట్లాడరని ఏడ్చేది. తర్వాత బి గ్రేడ్ కి పడిపోయింది. చదువు కూడా రావట్లేదని ఇంట్లో వాళ్ళ అమ్మ బాగా తిట్టేది.” అంది

“లావు తగ్గి ఎట్లాగన్నా సన్నగా అవ్వాలని చాలా ట్రై చేసింది. తిండి తినకపోతే తగ్గుతానని అనుకుంది. కాని ఆకలి వేస్తుంది కదా మేడం. అందుకని తినేసేది. వెంటనే మళ్ళీ లావు అవుతానని భయం వేసి నోట్లో చేయి పెట్టుకుని అన్నం కక్కేసేది. టెంత్ లో అప్పుడప్పుడే అలా చేసేది. కాని ఇప్పుడు రోజూ అలా  చేస్తుంది.” అంది.

“బులీమియా…” చప్పున అంతా అర్ధం అయింది నాకు.

“ఈ సంగతి నువ్వు వాళ్ల పేరెంట్శ్ కి చెప్పలేదా సుదా” బాధగా అడిగా

“చెప్పవద్దని ప్రామిస్ చేయించుకుంది మేడం. తను ఎవరితో మాట్లాడదు. నాతోనే బాగుంటుంది. నాకు సెవెంత్ దాకా తనే మాథ్స్ చెప్పేది. ఎలాగన్నా లావు తగ్గాలని కష్టపడుతుంది. లావు తగ్గితే తను బావుంటుంది  కదా అందుకని నేను ఎవరికీ ఇది చెప్పలేదు. తిండి కడుపులో తక్కువ ఉంటే సన్నగా  అవుతారు కదా మేడం” అడిగింది అమాయకంగా.

“తను ఎలాగన్నా సన్నగా అవ్వాలని లేకపోతే చచ్చిపోతానని ఏడ్చేది మేడం” అంది.

నిజానికి శ్రావణి పెద్ద లావు కాదు. ఆ అమ్మాయి వయసులో నేను ఆమెకు రెండింతలు లావుగా ఉండేదాన్ని. అస్సలు ఇప్పటి అమ్మాయిలను మా తరంతో పోల్చుకుంటే ఆశ్ఛర్యం వేస్తుంది. ఎవరూ కాస్త కండతో కనిపించరు. తిండికి కరువయిన కుటుంబాలలోంచి వచ్చినట్లు కనిపిస్తారు. పైగా ఇప్పుడు అందానికి నిర్వచనాలే మారిపోతున్నాయి. తినే తిండి, కాలరీల గురించి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు వాట్శ్ అప్ యూనివర్సిటిలో ప్రతి రోజూ వినిపిస్తునాయి, కనిపిస్తున్నాయి. పిల్లల మనసుల్లో అందం అంటే ఇది  అంటూ ముద్ర వేసుకుంటున్నవన్నీ తప్పుడు ఉదాహరణలే. కాని అది వాళ్లకు అర్ధం చేయించేది ఎలా?

“శ్రావణికి సమంతా అంటే చాలా ఇష్టం మేడం. జబ్ వీ మెట్ లో కరీనా కపూర్ పోస్టర్లను దాచుకుని పెట్టుకుంది. అంత సన్నగా అవ్వాలని ఆమె కోరిక. కాని కాలేజీలో వాంతులు చేసుకుంటుందని రచన చూసి వాళ్ళ మమ్మీకి చెప్పేసింది. ఆంటీ శ్రావణిని వాంతులు ఎందుకు చేసుకుంటున్నావని అడిగింది. ఏమన్నా చెడ్డపని చేసావా అని అరిచింది. శ్రావణి చాలా ఏడ్చింది మేడం. నాకు ఫోన్ చేసి చెప్పింది. ఈవినింగ్ ఇంటికి వస్తానంది. రాలేదు. నాకు తెలుసు చచ్చిపోవడానికి ఏదో చేసుకుంది. కాని శ్రావణి ఏ తప్పు చేయలేదు మేడం. జస్ట్ స్మార్ట్ గా అవ్వాలని ట్రై చేసింది” సుధ కంట్లో నీరు.

సమంత, ఇలియానా, కరీనా, ఆలియా, శ్రద్దా కపూర్ ఒకొకరు నా కళ్ల ముందు తిరుగుతున్నారు. వీళ్లే కదా ప్రస్తుత తరం రోల్ మోడల్స్. వాళ్లు సినిమాల కోసం జీరో సైజ్ అని కష్టపడతారు. దానికి ఓ టీం అంతా కలిసి పని చేస్తుంది. హాయిగా చదువుకుంటూ స్వేచ్చగా తిరగాల్సిన ఈ పిల్లలు వాళ్లలా తయారవ్వడానికి ఎంతగా ప్రాకులాడుతున్నారు. ఇప్పటి తరాన్ని చూస్తే, అనిమిక్ లేదా జంక్ ఫుడ్ తో ఒబిసిటి. రెంటికి కారణం మార్కెటీకరణ సంస్కృతే కదా. ఎంతలా ఈ జీరో సైజు పిచ్చి సమాజంలోకి చొచ్చుకుపోయింది.

ఇక రంగు విషయానికి వస్తే తెలుపే అందం అని ఏడు కొండలెక్కి ఆ నల్లనివాడిని చూసి పరవశించిపోయే భక్తులు కూడా నమ్ముతారే. ఆడపిల్ల నల్లగా ఉంటే అది అందవికారమా… ఈ దేశంలో రేషన్ షాపులకన్నా బ్యూటీ పార్లర్ల సంఖ్యే ఎక్కువ కదా. ప్రతిది కొలిచినట్లు ఉంటేనే అందం అనుకునే ఈ తరానికి సావిత్రి, దేవిక, జయలలిత, జయసుధల గురించి తెలియదు. వాళ్లు చూసేది సమంత, ఆలియాలనే. వృత్తి కోసం వాళ్ళేదో తిప్పలు పడతారు కాని ఈ పిల్లల జీవితాలు ఎంతలా నాశనం అవుతున్నాయి. ఆలోచనలతో తల వేడెక్కింది.

బులీమియా ఈటింగ్ డిసార్డరే కాదు ఒక మానసిక సమస్య కూడా. అరవైలలో ఇరవైలా కనిపించాలని కోరుకునే సెలబ్రటీలు బోటోక్స్ లపై ఆధారపడుతూ, ఇప్పటి తెరపై కనిపించే ప్రతి నటి బోటోక్స్ ప్లాస్టిక్  సర్జరీలతో శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ, ఎన్ని లక్షలు తగలేస్తున్నారో. ముసలివాళ్ళమై పోతున్నామని మొహం కనిపించకుండా జీవించే సెలబ్రెటీలు, వీరంతా డబ్బు ఉండి ఏవో తిప్పలు పడుతున్నారు. కాని ఇలాంటి మధ్యతరగతి పిల్లల పరిస్థితి ఏమిటి? మానసికంగా బలహీనంగా ఉండే వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి డిసార్డర్లు జెనెటిక్ కూడా కావచ్చు. కాని అవి సానుకూల వాతావరణంలో అంతర్లీనంగా ఉండిపోయే చాన్స్ ఉంటుంది.  కాని ప్రస్తుత వాతావరణం ఆరోగ్యస్తులకీ ఇలాంటి రుగ్మతలను అంటిస్తుందే.

శ్రావణి పరిస్థితికి ఎన్నో కారణాలు కనపడుతున్నాయి. అసలు ఆ అమ్మాయి బైటకు వచ్చినా లోపల  ఎంత డామేజ్ జరిగిందో, దానితో తన భావి జీవితం ఎలా ఉంటుందో ఊహించడానికి భయం వేస్తోంది. ఏదన్నా జరిగితే తల్లి మందలించిందని చనిపోయిన టీనేజర్ అని ఓ చిన్న వార్త పేపర్ లో వస్తుంది. మరుసటి రోజు అందరూ మర్చిపోతారు. సన్నటి నాజూకు అందాలను, తెల్లటి పిండిబొమ్మలను మార్కెట్ ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ చక్కెర జీవితంలో ముట్టని సెలబ్రెటీలు ఈ కూల్ డ్రింక్ తాగండి అంటూ అడ్వర్టైజ్మెంట్లలో యువతను రెచ్చగొడుతూనే ఉంటారు. ఈ అందం రాబోయే తరాలను ఎక్కడకు తీసుకెళుతుందో…

శ్రావణి భవిష్యత్  ఏంటి… తెలుసుకోవడానికి ఇవాళ హాస్పిటల్ కు వెళ్ళాలి అనుకుంటూ సుధను క్లాస్ రూంకు పంపించి భారంగా నా క్లాస్ వైపు నడిచాను.

***

 

 

 

 

 

 

 

జ్యోతి, పి.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.