ఏమీ చేయలేమా అన్న ప్రశ్నలోంచి…

పురుషస్వామ్య వ్యవస్థలో స్త్రీ స్థానం ఎక్కడ? అనే వెతుకులాట!! నన్ను వెంటాడి వేధించేది,  ఎలా నాభావాలని వ్యక్తపరచాలో తెలిసేది కాదు. అటువంటి సమయంలో పుస్తకం నాకు ఆదరువు అయింది

నా  అసలు పేరు రుక్మిణి. నా కలం పేరు రూపరుక్మిణి. కె.

వ్యవసాయ ఆధారిత మధ్యతరగతి కుటుంబం మాది. పుట్టిన ఊరు, తాతగారితో అనుబంధం వున్న ఊరు గార్ల బయ్యారం, చదువు, జీవితాన్ని ఇచ్చి స్థిర పరిచింది మాత్రం ఖమ్మం.

నాన్న  బ్యాంకు మేనేజరుగా చేసి రిటైర్ అయ్యారు. నాన్న ప్రభుత్వ ఉద్యోగ రిత్యా పలు ప్రాంతాలు మారవలసి వచ్చింది. మణుగూరు సింగరేణి కాలరీస్ లో హై స్కూల్ విద్య పూర్తి చేశాను.అటు తరువాత ఖమ్మం లో స్థిర నివాసం ఏర్పాటైంది ఇంటర్, డిగ్రీ, పీజీ నా చదువు అంతా ఖమ్మంలోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘాల పరిచయం ఎస్ ఎఫ్ ఐ లో చేరిక,  సాంఘిక పరమైన ఆలోచన రూపు దిద్దుకుంది మాత్రం హైస్కూల్ లో చదువుతున్నప్పుడే మాకు ఇంగ్లిష్ చెప్పే శంకర్ సర్ విద్యార్థులందరినీ సమీకరించి అక్షరాస్యత ఉద్యమంలో భాగస్వాముల్ని చేసి, రాత్రి బడిలో పాఠాలు చెప్పడానికి తీసుకెళ్లే వారు.  అలా మొదలైంది శ్రామిక శక్తి తో పరిచయం.

సింగరేణి కార్మికుల కుటుంబాల పరిచయం, రాత్రి బడిలో పాఠాలు, పాటలు ప్రజానేపథ్యం వున్న మనుషుల పరిచయాలు నచ్చేవి, ఇంట్లో తాతగారు వొ నడిచే లైబ్రరీ. అయన దగ్గర పుస్తకాలు ఆయనకు తెలియకుండా చదివినవే ఎక్కువ. అక్కడే శరత్ సాహిత్యం తో పరిచయం, యుద్ధనపూడి సులోచనను, చలాన్ని, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ నాపై చాలా ప్రభావాన్ని చూపినవే, ఇప్పటికి శాంతినికేతన్ చూడాలన్న కోరిక తీరనే లేదు. నాకు తెలియకుండానే ఈ పుస్తకాలు అన్నీ తాతగారి నుండి తీసుకోని చదివినవే..  ఇంట్లో ఆంధ్రజ్యోతి, ఉదయం పేపర్స్ లో అనేక వ్యాసాలు, బాలజ్యోతి, బాలమిత్ర, చందమామ పుస్తకాలు నాకు ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో వుండే పుస్తకాలు.  అందులో ఎక్కువ ఫాంటసీ, ఫిక్షన్ స్టోరీస్ ఇష్టంగా చదివేదాన్ని ,ఆనాటి విఫుల, చతుర పుస్తకాలు ఇప్పటికి వున్నాయి నా దగ్గర. స్కూల్ లైబ్రరీ ఇచ్చింది పీవీ నర్సింహారావు గారి రచనలు అన్నీ మర్చిపోలేని ప్రయాణంలా నిన్నటి జ్ఞాపకాలు నన్ను వెన్నంటి  వుంటాయి.

మాది గౌడ సామాజిక వర్గం,   మా కుటుంబాల్లో వృత్తి నేపథ్యం తరాల క్రితమే దూరమైంది.  నేను పెరిగిన ఉమ్మడి  కుటుంబ వాతావరణం నాపై చాలా ప్రభావం చూపిస్తుంది. స్త్రీ వ్యక్తి గతంగా ఎంత సామర్ధ్యం తో వున్నా కుటుంబంలో సపోర్ట్ లేకుండా బైటకు రావడం అనేది అస్సలు సాధ్యం అవని పనిగా ఆగిపోయిన ఎందరో స్త్రీలను చూస్తూ పెరిగాను. నాలోని ఈ భావాలు ఇప్పటికి నన్ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తూనే వుంటాయి. నాన్న నాకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చి స్వతంత్రంగా ఆలోచించడంలో చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి అంటూ నన్ను తనతో పాటు అన్నీ పనులు చెప్పి చేపించేవారు, ఒకవేళ పొరపాటు జరిగితే ఎట్లా అనే అమ్మకు రెండోసారి తానే నేర్చుకుంటుంది.  పడితేనే లేచి నిలబడే ధైర్యం వస్తుంది అంటూ , ఆర్ధికలావాదేవీల్లో కూడా భాగస్వామ్యం చేసి నన్ను ప్రోత్సహించేవారు. ఆడపిల్లలు కో -ఎడ్యుకేషన్ లోనే చదవాలి అప్పుడే ధైర్యంగా వుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి,  సహజంగా ఆలోచించగలరు అంటూ నన్ను చెల్లిని కో ఎడ్యుకేషన్ కాలేజీల్లోనే చేర్చారు. అలా ఆయన ఇచ్చిన ధైర్యమే ఇవాళ వందమంది ముందైనా ధైర్యంగా మాట్లాడగలుగుతున్న.

ఇంటర్ లో ఉండగా తాతయ్య మరణం డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే నా వివాహం అయింది. ఏ పరిస్థితులు నా చదువుని ఆపలేక పోయాయి అమ్మ మద్దతుతో ఎమ్మే ఏకనామిక్స్  చేశాను. కానీ ఉద్యోగం అనే కలకి దూరం అయ్యాను, ఇద్దరు పిల్లలు వారితోనే ప్రపంచం అనుకుంటూ మా అమ్మాయి నేషనల్ జిమ్నాస్ట్ ప్లేయర్ తన వెనకే ప్రయాణం చేసేదాన్ని. అటువంటి ప్రయాణం ఒక్కసారిగా ఆగిపోయింది కరోనాకి సరిగ్గా సంవత్సరం ముందు వాళ్ళ గురువు మరణం, తన చదువు పేరుతో ఆటకు దూరం అవడం హాస్టల్ వెళ్లి పోవడం. కుటుంబ బాధ్యతల్లో నాకు నేను కనుమరుగయ్యననే చెప్పాలి.

కాలంతో పరిస్థితుల్లో మార్పులు రావడం చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థలో శ్రామికశక్తి పై అవగాహన పెంచింది,  చదువుతున్న కాలంలో  స్త్రీ ఆర్ధిక స్వావలంబన కోసం చేసే పోరాటం,  శారీరక, మానసిక హింస నన్ను ఆలోచనల్లో పడవేసేది. ఇవన్నీ నా రచనలకు పునాది.

అయితే రచనలవైపు దృష్టి పెట్టడానికి కారణం మాత్రం స్త్రీలు మానసికంగా పడుతున్న హింస పట్ల నాకు చాలా అసహనం ఉండేది, ఏమి చేయలేమా అన్న ప్రశ్న నన్ను తరుముతున్నట్లు ఉండేది. నా చెల్లెలు పెదనాన్న గారి అమ్మాయి అచ్చం నాలాగే ఉండేది.  తన మరణం కుటుంబ వ్యవస్థ మీద వ్యతిరేకతను, పితృస్వామ్యం పట్ల నిరసన నాలో ఇంకిపోయేలా చేసింది.

ఇలా ఎందుకు ఉంటుంది ?  పురుషస్వామ్య వ్యవస్థలో స్త్రీ స్థానం ఎక్కడ? అనే వెతుకులాట!! నన్ను వెంటాడి వేధించేది,  ఎలా నాభావాలని వ్యక్తపరచాలో తెలిసేది కాదు. అటువంటి సమయంలో పుస్తకం నాకు ఆదరువు అయింది. కొన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత నేను చదివిన పుస్తకం నీల, ఆ సంవత్సరం తానా అవార్డు పొందిన నవలలు, కొన్ని కవిత్వం పుస్తకాలు ఇల్లు చేరాయి.  అప్పుడే నా స్నేహాలు అరుణ, మైత్రి శ్రీను  వీరి ద్వారా పరిచయం అయిన రచయిత విమలక్క…తన రచనలు చదివి వొ రచయితను నేరుగా కలిసిన ఉద్వేగం ఇప్పటికి నాలో అలాగే ఉంటుంది. సామాజిక కార్యకర్త ఝాన్సీ గారు , సామాజిక వేత్త నాటక రచయిత నంది అవార్డు గ్రహీత దేవేందర్ గారి పరిచయం సాహిత్యంలో అనేక కోణాల్ని పరిచయం చేసింది.

ఆ ఆలోచనల్లో నుండే స్త్రీ నేపథ్యంలో, సామాజిక కోణంలో కవిత్వం ద్వారా నా భావాలకు అక్షర రూపం ఇచ్చాను. కవిత్వమే నన్ను సేద తీర్చింది.  నాలో దాగివున్న అనేక ఆలోచనలు కవిత్వ ప్రవాహమై పరుగుపెట్టింది. నా అక్షరాలను పంచుకునేందుకు ఫేస్ బుక్ వేదికైంది. పాఠకులను చేరింది.  కవిసంగమం ప్రచురణలో  2021 లో “అనీడ”, 2024 లో “మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని” కవిత్వ సంపుటాలు పుస్తక రూపంలో వచ్చాయి, సాహిత్య ప్రయాణం లో భాగంగా వివిధ అంశాల అధ్యయనం కోసం M. A తెలుగు పూర్తిచేశాను.   స్త్రీ దృక్పధంతో సామాజిక కోణంలో చిన్న చిన్న కథలు రాస్తూ, పుస్తక పరిచయం, సమీక్షా, వ్యాసాల ద్వారా నా అభిప్రాయాలను పంచుకుంటున్నాను.

ప్రస్తుతం నెచ్చెలి పత్రిక లో “ఈ తరం నడక” పేరు తో మహిళా రచయితల దృష్టి కోణాన్ని పరిచయం చేస్తున్నాను, ఉదయిని పేజీలో “కొత్త దారి” పేరుతో వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనా వైవిద్యాన్ని తెలుసుకుంటూ.., తెలియచేస్తున్నాను.  పాలపిట్ట, మాతృక, మానవి, నవ తెలంగాణ, భూమిక వంటి పలు మాగజైన్స్, పత్రికలలో నా రచనలు అచ్చయినాయి.

ఖమ్మం  స్వేచ్ఛ టీవీ లో సామజిక కార్యకర్తగా సాయుధపోరాట వీరుల కుటుంబాలను ఇంటర్వ్యూ చేయడం ఎప్పటికి మర్చిపోలేను. ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటూ  టీచర్ గా పనిచేస్తూ తెలంగాణ బాలోత్సవంలో భాగమయ్యాను.  సమూహలో రైటర్స్ ఫోరమ్ లో సభ్యురాలిగా ఉన్నాను.

ఓ కవిగా, రచయితగా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరాన్ని అనుక్షణం గుర్తు చేసే వారందరి మధ్యలో ఉండడమే నా కలం బలం. అక్షరం ఓ ఆయుధం అయితే పుస్తకం ఓ విజ్ఞాన వేదిక అని నమ్ముతాను.

*

రూప రుక్మిణి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు