గత పక్షం “కాలయంత్రం” అనే ఒక కథాశకలం ఇచ్చి అందులో మీకు ఏమైనా తప్పు కనపడిందా అని అడిగాను. ఆ కథ మళ్లీ ఇస్తున్నాను. అది చదివి దానిలో ఉన్నా లోపాలేమిటో చర్చిద్దాం.
కాలయంత్రం
“నాన్నా టీవీ ఎప్పుడు కొంటావు నాన్నా!” జానకి అడిగింది వాళ్లనాన్నని.
రేడియోలో అద్దంకి మన్నార్ చదువుతున్న వార్తలు వినే ధ్యాసలో వున్న చంద్రయ్య ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు.
“ఛీ నాన్న ఎప్పుడూ ఇంతే” అనుకుంటూ ఇంటి బయటకు నడిచింది. ఇల్లు దాటి నాలుగడులు వేస్తే పెద్ద వేప చెట్టు. అక్కడే చంద్రయ్య పెద్దబాడిస పెట్టుకోని ఊర్లో రైతులందరికీ నాగళ్లు చెక్కుతాడు. నాగలి చెక్కేటప్పుడు చెక్క కదలకుండా వుంచడానికి అడ్డంగా పాతిపెట్టిన చక్కను ధాటి అంటారు. వెళ్లి దాని మీద కూర్చుంది జానకి.
“ధాటి అంటే మనకు అన్నం పెట్టే దేవతే దాని మీద కూర్చోకు” అంటాడు చంద్రయ్య ఎప్పుడూ. ఇప్పుడు దాని మీద కూర్చోగానే ఆయన మాట ఎదిరించిన ఆనందం కలిగింది జానకికి.
అక్కడే కూర్చోని జానకి కాలేజీలో తనతో పాటు చదువుకునే శ్రీకాంత్ గురించి ఆలోచించింది. “భలే వుంటాడు” అనుకుంది. ముఖ్యంగా ఆ తెల్ల చొక్కా నీలం రంగు జీన్స్ వేసుకోని బైక్ మీద వస్తుంటే…
“జానకీ” చంద్రయ్య అరుపుకి ఉలిక్కిపడి చటుక్కున లేచి నిల్చుంది జానకి. “నీకు ఎన్నిసార్లు చెప్పాను. ధాటి మీద కూర్చోవద్దని? దిగు ముందు” ఆయన అరవడం పూర్తికాక ముందే జానకి కళ్లలో నీళ్లు తిరిగాయి. భోరుమంటూ ఏడుస్తూ లోపలికి పరుగెత్తింది.
చంద్రయ్యకి కూడా బాధేసింది. “అంత గట్టిగా అరవకుండా వుండాల్సింది. పిచ్చిపిల్ల కాలేజీకి వచ్చిందన్నమాటే కానీ ఇంకా పసిపిల్లలాగే ప్రవర్తిస్తుంది. ఎలాగైనా బాగా చదివించి ఇంజనీరుని చెయ్యాలి. ఏ అమ్రికానో ఇంకో దేశమో వెళ్లాలి నా కూతురు.” అనుకున్నాడు.
“కానీ ఎలా? పాపం అది ఒక టీవీ కొనివ్వమంటే కొనివ్వలేకపోతున్నాను. దాన్ని అంతంత చదువులు చదివించగలనా?” ఈ అనుమానం వేధిస్తుండగా వేప చెట్టు మొదట్లో కూర్చున్నాడు చంద్రయ్య.
***
ఈ కథ ఎక్కడ జరుగుతోంది? ఏదో పల్లెటూర్లో. నాగళ్లు చెక్కే చంద్రయ్య ఇంటి ముందు వేపచెట్టు నీడలో.
ఎప్పుడు జరిగింది? ఆలిండియా రేడియోలో అద్దంకి మన్నార్ వార్తలు చదువుతున్నాడు కాబట్టి ఉదయం 07:00.
ధాటి చెక్క దాపు పెట్టి నాగళ్లు తయారు చేసే కాలం. 1950-60ల మధ్య అయ్యుండాలి.
కాదు మరీ వెనకబడిన పల్లెటూరు అంటే 70ల మొదట్లో అని కూడా అనుకోవచ్చు. మరి చంద్రయ్య కూతురు టీవీ కావాలని అడుగుతుందే? భారతదేశపు మొట్టమొదటి టీవీ ఛానల్ దూరదర్శన్ మొదలైంది 1959లో.
1987లో మొదలైన రామానంద్ సాగర్ రామాయణం పాపులర్ అయిన తరువాత టీవీ ఇంటింటికి రావడం మొదలైంది. అంటే ఒక పల్లెటూరిలో దిగువ మధ్యతరగతి కుటుంబంలోకి టీవీ తొంభైల్లో వచ్చింది. మరి చంద్రయ్య కూతురు టీవీ కావాలని ఎలా అడుగుతోంది?
అదే కాదు. జానకి ఊహల్లో శ్రీకాంత్ తెల్ల చొక్క, బ్లూ జీన్స్ వేసుకున్నాడు. 1980లలో వచ్చిన జీన్స్ ఆమె ఆ కాలంలో ఎలా చూసింది? ఆమె భవిష్యత్ చూడగలిగిన యోగిని అయితే తప్ప సాధ్యం కాదు. ఇవీ ఈ కథలో సమస్యలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథ ఎప్పుడు జరుగుతోంది అనే విషయంలో రచయితకి స్పష్టత లేదు. ఇలాంటి పొరపాటే స్థలం విషయంలో కూడా చేస్తారు చాలా మంది రచయితలు. వాళ్లకి కథ ఎక్కడ జరుగుతోందో తెలియదు.
మరో మూడు పక్షాలు మనకి ఇదే టాపిక్ – స్థలకాలాలు.
కథ ఎక్కడ జరుగుతోంది? ఎప్పుడు జరుగుతోంది? ఈ రెండు విషయాలు రచయిత ఖచ్చితంగా కథలో ఎక్కడో ఒక చోట కనీసం ఒకసారి చెప్పాలి. ఎందుకు? ఏ కథ ఎక్కడ జరగాలో అక్కడే జరగాలి. ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. అంతే! అలాగైతేనే ఆ కథ నమ్మశక్యంగా వుంటుంది. బలంగానూ వుంటుంది. సరిగ్గా వాడుకుంటే స్థలము కాలము కథకి ఒక నేపథ్యంలా పనిచేస్తుంది.
ఈ నేపథ్యమే కథని స్థిరంగా నిలబెట్టగలదు. ఒక్కోసారి పాఠకులని ఆకట్టుకోగలదు. పైన ఇచ్చిన కథలో కాలం విషయంలో ఉన్న అస్పష్టత కనపడగానే కథ విలువ ఎలా పడిపోయిందో చూశారు కదా? ఇలా నేపథ్యం (స్థలకాలాలు) కూలిపోయినప్పుడు మొత్తం కథ కృతకంగా అనిపించడం మొదలౌతుంది. ఇది పాఠకులని గందరగోళానికి గురి చేస్తుంది.
పాఠకులు ఏదైనా కథ, నవలని చదువుతున్నప్పుడు ఆ కథని ఒక స్థలము, కాలములో ఉంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అవి స్థిరంగా లేకపోతే పాఠకులు ఆ కథలో లీనమవడానికి బదులు చిరాకు పడే అవకాశం ఉంటుంది. 1952లలో జరిగే కథ రాస్తూ స్మార్ట్‌ఫోన్ వాడితే ఎలా? కథ కల్పితమే కదా, అది నా ఊహ అంటారా? అది స్పష్టంగా చెప్పండి. ఆదిమానవుల కాలంలో టీవీ ఉంటే ఏం జరిగేది అనే సెటైర్ కథ రాయాలనుకుంటున్నారా? పాఠకులకి అది మీ సృజనాత్మకత అని తెలిసేలా రాయాలి తప్ప అది నిర్లక్ష్యంగా కనిపించకూడదు.
కథ ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు జరుగుతోంది అనే విషయం పైనే పాత్రలు రూపుదిద్దుకుంటాయి. మీ పాత్రలు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వాళ్లకి ఎంత జ్ఞానం ఉంది, ఎలా మాట్లాడతారు, దేనికి భయపడతారు, ఏం కోరుకుంటారు, ఎలాంటి విషయాలు నమ్ముతారు ఇవన్నీ ఆ పాత్ర ఉంటున్న స్థలము కాలము అధారంగానే రూపుదిద్దుకుంటాయి. కాబట్టి మీరు చూపిస్తున్న ప్రపంచం
స్థలకాలాల విషయంలో నమ్మశాక్యంగా లేకపోతే, పాత్రలు కూడా నమ్మదగినవి కాకుండాపోతాయి. ఇది పాత్రలను బలహీనపరుస్తుంది. రచయిత విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
“ఇలాంటి ప్రాథమిక విషయాల్లోనే రచయిత శ్రద్ధ చూపకపోతే, నేను చదవడానికి ఎందుకు శ్రద్ధ చూపాలి?” అని పాఠకులు అడుగుతారు. మీరేం సమాధానం చెప్తారు. ఒక రచయిత విశ్వసనీయతను కోల్పోతే, పాఠకులను కోల్పోయినట్లే.
కథ ఒక భవనంలా నిలబడాలంటే నేపథం పునాదిలా స్థిరంగా ఉండాలి. కథలో ఉండే వస్తువు (కథాంశం), పాత్రలు, సంభాషణ, వాతావరణం మొదలైనవన్నీ రచయిత సృష్టించిన ప్రపంచంలో నుంచే పుట్టుకొస్తాయి. ఆ ప్రపంచం అస్థిరంగా ఉన్నా, వాస్తవికమైన స్థలకాలాలను ప్రతిబింబించకపోయినా కథ అనే భవనం కదలడం ప్రారంభిస్తుంది.
చాలాసార్లు స్థలకాలాలను, కథను వేరు చేసి చూడలేము. ఇందాకే చెప్పినట్లు ఒక్కో కథ ఒక్కొచ చోట, ఒక నిర్దుష్టమైన కాలంలోనే జరుగుతాయి. 1850లో జరుగుతున్న కథలో “ఆమె ఓలా ఎక్కి ఇంటికి వెళ్లింది” అని చెప్పగలమా? “స్వయానా అక్బర్ పాదుషా నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది” అనగలరా? వ్యంగ్య, హాస్య కథలైతే తప్ప ఇలాంటివి సాధ్యం కాదు. కారణం – ఆ స్థల కాలాలు విధించే పరిమితుల్లోనే కథ నడుస్తుంది.
పెద్దిభట్ల సుబ్బరామయ్య గారి కథ “నీళ్లు” చదవండి. రాయలసీమలో కరువు ప్రాంతం నుంచి ఉద్యోగం కోసం కృష్ణా తీరానికి వస్తాడొక యువకుడు. ఇంటి దగ్గర నీటికోసం అష్టకష్టాలు పడుతున్న అమ్మని, అక్కచెళ్లెలని తలుచుకోని ఇక్కడ ఉన్న నీటి వసతులకు ఆశ్చర్యపోతూ పొదుపుగా, పొందికగా నీళ్లు వాడుకుంటుంటాడు. అతను నీళ్లు తాగే విధానం, కృష్ణానదిలో నీళ్లను చూసే విధానం – ఇవన్నీ చదివి తెలుసుకోవాలే తప్ప నేను చెప్తే బాగుండదు. వీలైతే ఆ కథ చదవండి. ఈ కథలో రాయలసీమ, కృష్ణాతీరం తీసేసి చూడండి. అసలు కథే వుండదు. అలాగే పాలగుమ్మి పద్మరాజు కథ పడవప్రయాణం గోదావరిలో జరుగుతుంది కానీ చిత్తూరు జిల్లాలో జరగదు కదా! కథాపరంగా ఆ స్థలానికి ప్రాముఖ్యత వుంది కాబట్టి ఆ కథలలో స్థలం అంత స్పష్టంగా చిత్రీకరించారు అని మీరు వాదించవచ్చు.
వంశీ కథలు చూడండి. ఏవైనా రెండు మూడు కథలు తీసుకోండి. మీరు చదవకుండానే ఇవి గోదావరి ప్రాంతానికి చెందిన కథలు అని చెప్పేస్తారు. ఆ కథ గోదావరి తీరంలో జరుగుతోంది అని మీకు తెలిసేలా రచయిత ఏం చేశాడో గమనించండి. నేరుగా వాచ్యంగా చెప్పడం మంచి పద్ధతి కాదు. “అది అమాలాపురంలో ఒక వీధి” అని రాస్తే చాలా చప్పగా వుంటుంది. “ప్రధానమంతి నివాసానికి కిలోమీటరు దూరంలోనే ఆ సంఘటన జరిగింది” అనగానే అది ఢిల్లీలో జరుగుతున్న కథని అని పాఠకుడికి తెలిసిపోతుంది.
చాలాసార్లు స్థలకాలాలు చెప్పడానికి పాత్రల పేర్లు, ఊర్లపేర్లు, ఆ ప్రాంతానికి ప్రముఖమైన స్థలం లేదా వస్తువులు కూడా ఉపకరిస్తాయి. పెంచలయ్య, అన్నవరం అంటే వాళ్ల ది ఏ ఊరు అయ్యుండచ్చో ఊహించచ్చు. ట్రాములు, రసగుల్లా గురించి మాట్లాడి కోల్కత్తా కథ అని చెప్పేయచ్చు. అదే కథలో మనిషి లాగుతున్న టాంగా గురించి రాస్తే కోలకత్తాలోనే కాలంలో వెనక్కి వెళ్లినట్లు.
పాత్రలు కూడా స్థలకాలాల పరిధిలోనే నడుస్తాయి. పాత్రల నమ్మకాలేమిటి? దేనికి భయపడతారు? దేనిని కోరుకుంటారు? ఏది సాధ్యమని భావిస్తారు? అనేదంతా ఆ కాలపు సామాజిక రాజకీయ నేపథ్యంలో నుంచే పుడతాయి.
అంతెందుకు పాత్రల వస్త్రధారణ మీద స్థల కాలాల ప్రభావం ఉండదూ? పాత్రల మధ్య సంభాషణ కూడా ఈ నేపథ్యాలపైన ఆధారపడి ఉంటుంది. వాళ్లు మాట్లాడే విధానం, యాస, ప్రత్యేకమైన పదాలు కూడా స్థలకాలాలని బట్టి నాటకీయంగా మారతాయి. కావాలంటే ఈ ఉదాహరణలు చూడండి –
ఆ కార్పొరేట్ డీల్ అయిపోయిన రెండో రోజు సీఈవో తన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అందుకు ఛైర్మెన్ ఒప్పుకోలేదు. “తాంబులాలిచ్చేశాను తన్నుకుచావండి” అన్నాడు బయటికి నడుస్తూ.
***
“మర్యాదగా నిజం చెప్పు? ఆ మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ ఎక్కడుంది?” కొట్టడం ఆపి అడిగాడు రా ఏజెంట్ విక్రమ్. “నిజం మాత్రమే చెప్పు. లేకపోతే నాకు కోపం వస్తుంది సుమా!” అని హెచ్చరించాడు. ఎదురుగా ఉన్న టెర్రరిస్ట్ బాధతో మూల్గాడు. తల అడ్డంగా ఊపి “నేనేమీ ఎరగను సార్” అన్నాడు.
***
మొదటి ఉదాహరణలో “తాంబూలాలిచ్చేశాను…”, రెండో ఉదాహరణలో “సుమా”, “ఎరుగను” లాంటి మాటలు కనపడగానే పాఠకుడు కథ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఒక మంచి కల చెదిరిన అనుభూతి కలుగుతుంది. ఆ తరువాత కథ కంచికి మనం ఇంటికి.
ఈ శీర్షిక గత భాగంలో “show, don’t tell” అని చెప్తూ ఇంద్రియానుభవలా గురించి రాయాలని చెప్పాను. అది కూడా స్థలకాలాల మీదే ఆధారపడి ఉంటుంది. మీ కథా ప్రపంచం ఎలా కనిపిస్తుంది, అక్కడ ఏం వినిపిస్తుంది, ఎలాంటి వాసనలు ఉంటయి, ఎలాంటి మానసిక అనుభూతి ఉంటుంది మొదలైనవన్నీ ఆ కథ జరిగే స్థల కాలాలలోనే ఉంటాయి. 1940ల నాటి ఒక పల్లెటూరి వీధి, 2025లో హైదరాబాద్ హైటెక్ సిటీ రోడ్డు పూర్తి భిన్నమైన ఇంద్రియానుభూతిని ఇస్తాయి కదా?
ఇవన్నీ ఒకేత్తైతే, కథకి ఆత్మ లాంటి వస్తువు (థీమ్) – ఏదైతే కథ ద్వారా చెప్పాలనుకుంటున్నారో అది – పూర్తిగా స్థల కాలాల మీదే ఆధారపడి ఉంటుంది. థీమ్ అనే సన్నటి తీగ మీదే ఏ కథైనా నడుస్తుంది. ఆ థీమ్ ఏమిటో (సూక్ష్మంగానైనా, స్పష్టంగానైనా) వ్యక్తం చెయ్యడంలో స్థలకాలాలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆ ప్రాంతపు, ఆ కాలపు విలువలు, సమస్యలు, సామాజిక స్థితిగతులు కథ నేపథ్యంలోనే ఉండి మీరు చెప్పదల్చుకున్న కథని మీరు కోరుకున్న భవోద్వేగం కలిగేలా పాఠకులకి అందిస్తాయి..
ఈ రెండు ఉదాహరణలు చూడండి –
ఖద్దరు పంచె కట్టి, భుజాన పై పంచె వేసుకోని, తలపాగా చుట్టుకుంటూ అతను బయటికి వచ్చేసరికి జనం గుంపులు గుంపులుగా ముందుకు వెళ్తున్నారు. వాళ్ల చేతుల్లో వందేమాతరం అనీ, సైమన్ గో బ్యాక్ అనీ నినాదాలు రాసిన అట్టముక్కలు వున్నాయి. వాళ్లలో కలిసిపోయాడు సీతారాముడు. “వాళ్లతో గుంటూరు చేరుకోగలిగితే గ్రాంధిని చూడచ్చు” అనుకున్నాడు,
***
మహమ్మారి రావడంతో మహానగరం ముఖాన కూడా మాస్క్ పడ్డట్లైంది. వాహనాలు లేక రోడ్లు బోసిపోతున్నాయి. అక్కడక్కడ పోలీసులు ఆపి ఇంటికి తిరిగివెళ్లమని కొడుతున్నారు. దీపక్ “సానిటైజర్ కోసం వచ్చాను” అని చెప్పినా వినలేదు. అమీర్‌పేట్ వెనకనుంచి వెళ్దామని చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇప్పుడెలా?
***
నిజం చెప్పాలంటే ఒక థీమ్‌ని కథగా మలుస్తున్నప్పుడు స్థల కాలాలను అందులో భాగం చెయ్యడం, ఆ సమయంలో అక్కడ జరుగుతున్నవి రికార్డ్ చెయ్యడం రచయిత బాధ్యత కూడా. ఇప్పటిదాకా కథాంశం, పాత్రలు, సంభాషణ, వాతావరణం మొదలైనవన్నీ స్థల కాలాలపైన ఎలా ఆధారపడి ఉంటాయో చెప్పాను.
స్థలము, కాలము ఆధారంగా వీటిని రూపొందిస్తే అది కథకి ఉపయోగపడతాయి. కానీ కథకి మాత్రమే కాకుండా రచయితకి ఉపయోగపడే మరో లక్షణం ఈ స్థల కాలాలకి ఉంది. అవి రచయిత నిశితమైన దృష్టిని, దృష్టికోణాన్ని చూపిస్తాయి. ఒక రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథంలో ఒకానొక కాలంలో జరిగిన ఒక సంఘటనని కథగా చెప్పడం ద్వారా ఆ రచయిత ఏం చెప్పదల్చుకున్నాడనేది ఆ రచయిత దృక్పథాన్ని చెప్తుంది. అందువల్ల, రచయిత స్థలకాలాలను, ఆ స్థలకాలాలలో జరుగుతున్న విషయాలను బాధ్యతగా రికార్డ్ చెయ్యాలి. దీని గురించి వివరంగా వచ్చే సంచికలో మాట్లాడుకుందాం.
మొత్తం మీద ఇప్పటిదాకా మనం కథలో స్థల కాలాల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం. అవి కథకి ఒక నేపథ్యాన్ని ఇస్తాయి కాబట్టి వాటిని సరిగ్గా ఎంచుకోకపోయినా, వాడుకోకపోయిన కథ అనే మాయాజాలం పాఠకుల మీద పని చెయ్యదు. అక్షరాలతో, మాటలతో పాఠకులని మనసులో తామే ఒక భవనాన్ని ఊహించుకోమని చెప్పి, స్థలకాలాల విషయంలో చేసే తప్పు ఆ భవనపు పునాదులు తొలగించడం లాంటిది. కథలో ఉన్న పొరలన్నీ కూలిపోతాయి, కథ డొల్లగా, నమ్మశక్యం కానిదిగా అనిపిస్తుంది. నవ్వు తెప్పిస్తుంది. నవ్వులపాలు చేస్తుంది. రచయిత తమ కథ జరిగిన ప్రపంచాన్ని అర్థం చేసుకోలేకపోయాడని పాఠకుడు ఎప్పుడూ అనుకోకూడదు. అలా జరిగిన మరుక్షణం కథ భావోద్వేగాన్ని కలిగించడంలో పూర్తిగా విఫలమౌతుంది.
నేపథ్యం విషయంలో చేసే తప్పులను నివారించడానికి చాలా చిన్న పరిష్కారం ఉంది – పరిశోధన. మీ కథ 17వ శతాబ్దపు భారతదేశంలో జరిగినా, 2025 ముంబైలో జరిగినా, భవిష్యత్తులో ఎక్కడో అంగారక గ్రహం మీద ఉండే మానవుల కాలనీలో జరిగినా, ఆ కథ రాసే ముందు ఆ ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకోని మొదలుపెట్టాలి. పరిశోధన అంటే గంటల తరబడి రీసర్చ్ పేపర్లు తిరగేయడం కాదు. మీరు రాస్తున్న టెక్నాలజీ ఆ కాలంలో ఉందా లేదా? ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న వస్తువు అప్పట్లో ఉండేదా? మనుషులు ఒకరినొకరు ఎలా సంబోధించుకునేవాళ్లు మొదలైనవి తెలుసుకోవడం. చాలా విషయాలు ఒక్క చిన్న గూగుల్ సర్చ్‌తో తెలుసుకోవచ్చు.
కాల్పనిక సాహిత్యం (fiction) రాయడం అంటే ఏదైనా కల్పించి రాయగలిగిన స్వేచ్చ ఉంటుందని అనుకోకూడదు. నిజానికి అందుకు విరుద్ధంగా కాల్పనిక సాహిత్యం, ఏదంటే అది రాయకూడని పరిథుల్ని విధిస్తుంది. ఆ పరిథుల్లో చాలావరకు నేపథ్యం (స్థలకాలాలు) వల్లే వస్తాయి. ఈ విషయం గుర్తెరిగి ఉండటం చాలా అవసరం.
చాలా కాలం క్రితం ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సీతాకల్యాణం అనే అద్భుతమైన సినిమా తీసి ఇండస్ట్రీ పెద్దలకు ప్రదర్శిస్తే అందులో చాలా పేరుగల ఒక డైరెక్టర్, “అంతా బాగానే ఉంది కానీ, ఆ కాలంలో పర్షియన్ కార్పెట్లు లేవు కదా? మరి మీ సినిమాలో ఉన్నాయేం?” అని అడిగారట. రామాయణ కాలంలో కార్పెట్లు ఉన్నాయా లేదా అనే విషయం పక్కనపెట్టండి. అలా వ్యాఖ్యానించిన దర్శకుడు సినిమాలో కథని, దర్శకత్వ ప్రతిభని, నటీనటుల నటనని వదిలేశాడు. కేవలం కార్పెట్‌ని చూసి అది ఈ కథలో సరిపోవట్లేదు అన్న ఆలోచన వచ్చి, అది అతనిని సినిమాలో మిగిలిన ఏ విభాగాన్ని ఆస్వాదించనియ్యకుండా చేసింది. కథ కూడా అంతే. ఎన్నుకున్న స్థల కాలాలకి సరిపోని ఒక్క తప్పు చేసినా అది పాఠకుల ఊహని కరిగించేస్తుంది.
అందుకే రాసే ముందు పరిశోధన చాలా అవసరం. ఈ కథ 1984 కోల్‌కతాలో జరిగిందా? ఒక వర్షాకాలపు సాయంత్రం కోస్తా కేరళలోని గ్రామంలోనా? భవిష్యత్తులో జరిగిన వాతావరణ సంక్షోభం తర్వాత ఢిల్లీ నగరంనా? ఇది నిర్ణయించుకోవాలి. ఇలా సమయము, భౌగోళిక ప్రాంతము నిర్ణయం అయిన తరువాత, ఆ ప్రపంచంపు సామాజిక-ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలి (లేదా ఊహించాలి). ఆ కాలంలో ప్రజలు ఎంత సంపాదించారు? కిలో బియ్యం ఎంత ఉండచ్చు? అసలు కిలోల్లో కొలిచారా? మానికలలో కొలిచారా? ఆ కాలానికి ఏది అవసరం? ఏది విలాసం? కుటుంబాలలో సంబంధబాధవ్యాలు ఎలా ఉండేవి? ఏ రాజకీయ లేదా సాంస్కృతిక శక్తులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేవి? ఈ వివరాలు, స్పష్టంగా కాకపోయినా కొంతైనా తెలియాలి.
ఈ తెలియటం మీ పాత్రల రూపకల్పనలో సహాయపడుతుంది. పాత్రల సంభాషణ, అందులో వాడే పదాలు, మాట్లాడే తీరు, మాట్లాడే విషయం అన్నీ విశ్వసనీయంగా మారతాయి.
చివరగా, కథ రాసిన తర్వాత చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే – కేవలం నేపథ్యన్ని పరిశీలిస్తూ రాసిన ప్రతి సన్నివేశాన్ని మళ్లీ చదవడం. ముఖ్యంగా మీరు హిస్టారికల్ ఫిక్షన్ రాసినప్పుడు, మీకు తెలియని ప్రాంతం లేదా కాలం గురించి రాసినప్పుడు, సై-ఫై (ముఖ్యంగా టైమ్ ట్రావెల్) లాంటివి రాసినప్పుడు నేపథ్యాన్ని పరిశీలించుకుంటూ మళ్లీ చదవటం చాలా అవసరం. నేను రాసిన ఈ సంఘటన ఈ కాలంలో జరిగే అవకాశం ఉందా? పాత్రల మాటలు, ప్రవర్తన నేను రాసిన సాంస్కృతిక నేపథ్యానికి సరిపోతున్నాయా? సాంకేతికత, బట్టలు, సామాజిక మనస్తత్వం మొదలైనవి నేను నిర్మించిన ప్రపంచానికి చెందినవిగానే కనిపిస్తున్నాయా? మొదలైన ప్రశ్నలు వేసుకుంటూ చూడాలి. మీరు ఈ దృష్టితో మీరు రాసినది చదివినప్పుడు మీ అంతట మీరే పట్టుకునే లోపాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు.
కొన్ని ఫాంటసీ కథలు ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ ఉంటయి. వాటికి కూడా స్థల కాలాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. నిజానికి, అలాంటి ఒక ఊహా ప్రపంచం కల్పించేటప్పుడు మామూలు కథ కన్నా ఎక్కువ నియమాలు పాటించాల్సి ఉంటుంది. మిగిలిన కథలలో authentic నేపథ్యం మాత్రమే కావాలి, ఇలాంటి కథలకి దంతోపాటు consistency కూడా ముఖ్యమౌతుంది. అందువల్ల ఇలాంటి కథలలో ఊహ, ఏదైనా స్థిరమైన పరిధులలోనే ఉండాలి. అవసరాన్ని బట్టి అస్థిరంగా మారే నేపథ్యాలు, తీసుకున్న నేపథ్యానికి ఏ మాత్రం పొసగని విషయాల వల్ల పాఠకులు మోసపోయినట్లు భావిస్తారు.
ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పాఠకులు ఎప్పుడూ perfect కథని కోరుకోరు, నమ్మదగిన (believable) కథని మాత్రమే కోరుకుంటారు. “నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న ప్రపంచం ఎలా ఉంటుందో నాకు ఖచ్చితంగా తెలుసు” అని భరోసా ఇచ్చిన రచయిత చెయ్యి పట్టుకోని పాఠకులే నడుస్తారు. కాకపోతే ఆ భరోసా నిలబడని క్షణం, కథ కూడా నిలబడదు.
“నేపథ్యం గురించి ఇంత చెప్పాలా? నేను హిస్టారికల్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ లాంటివి ఏవీ రాయటంలేదు. ఈ రోజుల్లో మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటన ఆధారంగా కథలు రాస్తాను” అని మీరు అనచ్చు. అలాగైతే ఈ స్థలకాలాదుల గురించిన అవగానే మిగిలిన వాళ్ల కన్నా మీకే ఎక్కువ అవసరం. అది అవసరం మాత్రమే కాదు.
సామాజిక సమస్యల మీద, ప్రస్తుత సందర్భాలను గమనించి వాటిని కథలు చేసే రచయితలకు స్థలకాలాలను సరిగ్గా రాయాల్సిన అవసరం కథా రచనకి సంబంధించిన “టెక్నికల్” అంశం మాత్రమే కాదు. అది ఒక బాధ్యత కూడా. ఆ బాధ్యత గురించి మళ్లీ కలిసినప్పుడు.
*








రచయితకు స్థలకాలాల విషయంలో పాఠకుడిపట్ల ఉండాల్సిన బాధ్యత బాగా గుర్తు చేశారు ఆపిరాల గారూ 🙏