విజయనగరంలో జరిగిన ఒక సంగీత కచేరీలో ఒక కొత్త గొంతుక, తెనాలి రామకృష్ణ చిత్రంలోని “చందన చర్చిత నీల కళేబర…” అనే పాటను ఆలపించింది. ఆ గొంతులోని మాధుర్యానికి పరవశించిన ప్రేక్షకుల్లోంచి ఒక పెద్దాయన లేచి వచ్చి, “నువ్వు రాబోయే రోజుల్లో గొప్ప గాయనివి అవుతావు” అని ప్రశంసించారు.ఆ వ్యక్తి మరెవరో కాదు,ప్రముఖ గాయని పి. సుశీల గారి తండ్రి పులపాక ముకుందరావు. ఆ రోజు అక్కడ పాడిన ఆ కొత్త గొంతుక – ఎస్. జానకి.
గుంటూరు జిల్లా, బాపట్ల సమీపంలోని పల్లపట్ల అనే గ్రామంలో 1938లో ఆయుర్వేద వైద్యులైన శిష్ట్లా శ్రీరామమూర్తి గారి తొమ్మిది మంది సంతానంలో ఒకరిగా జానకి జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆమెకు పాటంటే ప్రాణం. కేవలం నాలుగో తరగతి వరకే చదువుకున్నా, మూడో ఏట నుంచే వినికిడి జ్ఞానంతో పాటలు పాడే ప్రకృతి వరం ఆమెకు లభించింది. శాస్త్రీయ సంగీతాన్ని పెద్దగా అభ్యసించకపోయినా, పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి దగ్గర కొద్దికాలం నేర్చుకున్న శిక్షణే ఆమెకు పునాది అయింది. ఆ అనురక్తే ఆరు దశాబ్దాల పాటు దక్షిణభారత సినిమా పాటకు ఆయువుగా నిలిచింది.
సినీ రంగ ప్రవేశం– అప్రతిహత ప్రయాణం
1957లో దర్శకుడు కె.బి. తిలక్ ‘ఎమ్మెల్యే’ సినిమా కోసం ఒక సరికొత్త గొంతు కావాలని సంగీత దర్శకుడు టి. చలపతిరావును అడిగారు. అప్పటికే జానకి ప్రతిభను గమనించిన ఏవీఎమ్ ఆస్థాన సంగీత విద్వాంసులు, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ రూపకర్త ఆర్. సుదర్శనం ఆమె పేరును సూచించారు. అలా పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల గారితో కలిసి “నీ ఆశ అడియాశే లంబాడొళ్ళ రామ్దాసా!” అనే పాటను మొట్ట మొదటి తెలుగు సినిమా పాటగా ఆమె రికార్డు చేశారు. అంతకు ముందే టి. చలపతిరావు సంగీతంలో “విధియిన్ విలయాట్టు” అనే తమిళ సినిమాతో నేపథ్య గాన జగత్తులోకి ఆమె అడుగుపెట్టారు.
ఆ తర్వాత ఆమె ప్రయాణం ఆరు దశాబ్దాల పాటు అప్రతిహతంగా కొనసాగింది.నీలి మేఘాలలో, పగలే వెన్నెల, గున్నమావిడి కొమ్మమీద, గాలి కదుపు లేదు కడలి కంతు లేదు, పదహారేళ్లకు నీలో నాలో, మౌనమేలనోయి, సామజవరగమన,వెన్నెల్లో గోదారి అందం, గోవుల్లు తెల్లన,తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, సిగ్గు పూబంతి,మేఘమా దేహమా, మనసు పలికే మౌనగీతం, పట్టి తెచ్చానులే పండువెన్నెల్ని నేనే, సిరిమల్లె పువ్వల్లే నవ్వు ,నవ్వింది మల్లెచెండు, ఏనాడు విడిపోని ముడివేసెను, సుందరమూ సుమధురమూ, చిన్ని చిన్ని కోయిలల్లె, ఏవేవో కలలు కన్నాను..ఇలా పేజీలకొద్దీ రాసుకోదగ్గ వేలాది మధుర గీతాలను ఆలపించారు.
ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, హిందీ, బెంగాలీ, సంస్కృతం, తుళు, కొంకణి, ఉర్దూ వంటి దేశీయ భాషల్లో కలిపి దాదాపు 48,000 పాటలు పాడి భారతీయ చలనచిత్ర సీమలో చెరపలేని స్థానాన్ని స్థిరపరుచుకున్నారు. సాలూరు రాజేశ్వరరావు, కె.వి. మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్, రమేష్ నాయుడు, రాజన్-నాగేంద్ర, ఇళయరాజా, ఎ.ఆర్. రెహమాన్ వంటి దాదాపు 200 మంది ప్రతిభావంతులైన సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు. 2018 లో వచ్చిన ‘పన్నాడి’ అనే తమిళ చిత్రంలోని ‘ఉన్ ఉసిరు కాత్తిలా’ ఆమె పాడిన చివరి పాట.
ప్రతిభను గుర్తించే గుణం– అవార్డుల పరంపర
గూడూరులో జరిగిన ఒక పాటల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జానకి గారు, నెల్లూరు కుర్రాడైన పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్.పి.బి) పాట విని, అతనిలోని అసమాన సామర్ధ్యాన్ని గుర్తించి వెన్నుతట్టారు. మన్నులో కలిసి పోయేంతవరకు వందలాది మధురమైన యుగళ గీతాలలో గొంతు కలిపారు.
1976 లో ఇళయరాజా తన మొదటి సినిమా “అన్నక్కిళి”లో జానకి చేత “అన్నక్కిళి ఉన్నై తేడుదే” అనే పాటను పాడించారు. ఆమె గొంతులోని సహజ జానపద సౌందర్యానికి యావత్ సంగీత ప్రపంచం దాసోహం అయింది. ఆ తర్వాత భారతిరాజా “పదునారు వయతినిలే” సినిమాలో ఇళయరాజా స్వరపరిచిన “సెంధూర పూవే” పాటకు 1977 లో జానకి గారికి మొదటి జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది.
ఆ తర్వాత:
1981 లో మలయాళ చిత్రం ‘ఒప్పోల్’ లోని “ఎట్టుమనూరమ్బలత్తిలే” ,
1984 లో తెలుగు చిత్రం ‘సితార’ లోని “వెన్నెల్లో గోదారి అందం” ,
1992 లో తమిళ చిత్రం ‘దేవర్ మగన్’ లోని “ఇంజి ఇడుప్పళగా” పాటల కు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
విశేషమేమిటంటే, ఆమె సాధించిన నాలుగు జాతీయ పురస్కారాలలో మూడు పాటలు ఇళయరాజా కంపోజ్ చేసినవే! ఒక సందర్భంలో ఇళయరాజా గారు చమత్కరిస్తూ – “జానకమ్మ గారికి తేనె ఖర్చు ఎక్కువ, ఎందుకంటే ఆమె రోజూ తేనె తాగుతారు, అందుకే ఆమె గొంతులో అంత మాధుర్యం” అన్నారు.
తిరస్కరణలు-పురస్కారాలు
కన్నడంలో ఆమె అత్యధిక పాటలు పాడినప్పటికీ, ఒకే ఒక్క పాటకు అక్కడ రాష్ట్ర స్థాయి ఉత్తమ నేపథ్య గాయని అవార్డు లభించింది. 1977 కన్నడ చిత్రం ‘హేమావతి’ లోని “శివ శివ ఎన్నడ నాలిగెగె” (తోడి, భైరవి రాగమాలికలో ఎల్. వైద్యనాథన్ కంపోజ్ చేసిన పాట) పాడటానికి తాను చాలా కష్టపడ్డానని ఆమె చెబుతారు. ఇందులోని కఠినమైన త్వరిత స్వరాలను లలితంగా ఉచ్చరించడం ఒక్క జానకమ్మకే సాధ్యమైంది.
మలయాళంలో 11, తెలుగులో 10, తమిళంలో 6, ఒడిశాలో 1 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను ఆమె అందుకున్నారు. కళైమామణి, రాజ్యోత్సవ ప్రశస్తి, ‘గానకోకిల’ వంటి ఎన్నో బిరుదులు ఆమె కీర్తి కిరీటంలో చేరాయి. అయితే 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ ప్రకటించినప్పుడు, అర్హతకు తగ్గ గుర్తింపు ఇవ్వలేదని , ఇచ్చిందికూడా చాలా ఆలస్యంగా ఇచ్చారంటూ ఆ పురస్కారాన్ని ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ప్రభుత్వ అవార్డుల కన్నా ప్రజలు ఇచ్చే నీరాజనాలే తనకు మిన్న అని చాటారు.
వ్యక్తిగత జీవితం– ముగింపు
”ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది” అంటారు, కానీ జానకి గారు తన విజయ సోపానంలో ప్రతి మెట్టు భర్త రామ్‌ప్రసాద్ చేయి పట్టుకుని అధిరోహించిందేనని సగర్వంగా చెబుతారు. ఆ రాముడితో ఈ జానకి బంధం ఏనాడూ విడిపోనిది. అయితే 1997 లో రామ్‌ప్రసాద్ గారు భౌతికంగా దూరమయ్యాక ఆమె మానసికంగా ఏకాంత జీవి అయ్యారు. 2026 జనవరిలో ఆమె కుమారుడు మురళి మరణం ఆమెను మరింత కుంగదీసింది.
తన పాటకు విరమణ ప్రకటించిన మైసూరులోనే, ఏ గాంధర్వ లోకంలోని దేవతల సంగీత కచేరీ పిలుపు విన్నారో కానీ, జానకమ్మ ఈ లోకానికి సెలవు ప్రకటించారు. ఆమె భౌతికంగా దూరమైనా, మనసుకు స్వాంతన కావాల్సిన ప్రతి క్షణంలోనూ ఆమె గళం మనకు తోడుగానే ఉంటుంది.
“ఆమె పాట ఏదో ఒక చోట ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.”
– కమల్ హాసన్
“సంగీతం రెండు ఆత్మల మధ్య అనంతాన్ని నింపుతుంది.”
– రవీంద్రనాథ్ ఠాగూర్








Excellent
వెళ్ళిపోయింది ఆమె మనల్ని దుఃఖసాగరంలో ముంచి
ఇళయరాజా అన్నట్లు ‘తేనెలూరు’ ఆమె గళం నుంచి
అమరురాలయింది జానకి తన గళమాధుర్యాన్ని మనకు పంచి
ఎంతచెప్పినా తక్కువే అయినా
మిన్నగా చెప్పి మెప్పించారు శ్రీనివాస్
ఆమె గళ సౌందర్యాన్ని ఉన్నతంగా తరించి,స్మరించి
ఏ కవి వర్ణనలకీ అందని జానకి గళమాధుర్యం గురించి.
ఇక స్వర్గలోకంలో ఆమె పాటలు విని
ఉల్లాసంగా ఉరకలేయకుండా ఉంటాడా ఆ విరించి ?
జానకి గారి గురించి చక్కని నివాళి రాసిన శ్రీనివాస్ గారికి అభినందనలు
Thank you Sir
శ్రీ నివాస్ గారు.. అక్షరాలతో ఆత్మను, జ్ఞాపకాలతో జీవాన్ని పోసిన అద్భుత రచన ఇది…
జానకమ్మ గారి గానమాధుర్యాన్ని, జీవిత వైశిష్ట్యాన్ని హృద్యంగా ఆవిష్కరించిన మీ శైలి నిజంగా ప్రశంసనీయం.
వాస్తవాలు, భావోద్వేగాలు, భాషా లాలిత్యం సమపాళ్లలో మేళవించి చదువరిని చివరి వరకూ కట్టిపడేశారు.
ఇలాంటి విలువైన సాహిత్య సమర్పణలు మరెన్నో మీ కలం నుంచి వెలువడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను
Thankyou Sir
శ్రీ శ్రీనివాస్ గారు వ్రాసిన జానకి గారి వ్యాసానికి అభినందన.
సారంగ పత్రికలో శ్రీమతి ఎస్. జానకి గారి పై శ్రీ శ్రీనివాస్ గారు వ్రాసిన వ్యాసం ఎంతో అద్భుతంగా ఉంది. ఆమె జీవన ప్రయాణం, సినీరంగ ప్రవేశం, ఆలపించిన మధుర గీతాలు, గాత్ర మహిమ, భావవ్యక్తీకరణ, సంగీత ప్రపంచంపై ఆమె చూపిన అపార ప్రభావాన్ని ఎంతో సున్నితంగా, లోతుగా చిత్రించారు. ప్రతి పంక్తిలోనూ వారి సంగీతాభిమానం, పరిశోధన, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా గా ప్రశంసలు అందుకున్న శ్రీమతి జానకి గారిపై ఉన్న గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది.
శ్రీమతి జానకి గారి బహుముఖ ప్రతిభ, ఏ భావాన్నైనా స్వరంలో ఒదిగించే ఆమె అసాధారణ సామర్థ్యం, ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ఆమె గాన మాధుర్యం — ఇవన్నీ శ్రీ శ్రీనివాస్ ఎంతో అందంగా వివరించారు. వారి రచన ఆమె ప్రత్యేకతను వివరించడమే కాక, కొత్త తరానికి, మరచిపోయిన తరానికి కూడా ఆమె గొప్పతనాన్ని తిరిగి పరిచయం చేసేలా ఉంది.
శ్రీ శ్రీనివాస్ గారు తెలియచేసిన శ్రీమతి జానకి గారి పాటల జాబితా చదువుతుంటే ఆమె గానం శ్రావ్యంగా చెవులకు వినిపించింది. పాటల రాగపు తన్మయత్వం లో మనసు ఊగిసలాడింది.
శ్రీ శ్రీనివాస్ గారి రచన లో వాక్య నిర్మాణం, భావ ప్రవాహం, శైలి ఎంతో శుభ్రంగా, శ్రావ్యంగా, హృద్యంగా ఉన్నాయి. ఒక గొప్ప గాయని గురించి రాసిన ఈ వ్యాసం, వారి సాహిత్య నైపుణ్యానికి, సంగీతంపై వున్న మక్కువను, లోతైన అవగాహనకు, కళను గౌరవించే మనసుకు అద్దం పడుతుంది.
ఈ అద్భుతమైన వ్యాసానికి హృదయపూర్వక అభినందనలు. ఇది పాఠకుడిని మధురమైన గానం లో విహరింప చేస్తుంది. శ్రావ్యమైన పాటల కోకిలను గౌరవిస్తుంది. సారంగ పత్రికకు ఒక విలువైన రచనగా నిలుస్తుంది.
ఫణి రాజ కుమార్