ఇంకెంతసేపు?

తలుపు తీస్తావు కానీ తీసినట్టుండదు. పలకరిస్తావు కానీ నన్నే అనిపించదు.

దురు చూస్తుంటావు.

తొందరపడి ముందే ఏం నిద్రలేవకుండా, ఊరికూరికే వీధిమొగలో తచ్చాడకుండా, అసలు అదొక ప్రత్యేకమైన పనిలా కాకుండా, ఎలాగూ వచ్చేస్తాననే భరోసాతో నిమ్మళంగా ఉంటావు. రోజుట్లానే జాగింగ్ నుంచి వెనక్కొచ్చి, జెర్కిన్ జిప్ తీసి కొక్కానికి తగిలించి, ఇనపగొలుసుకి వేలాడదీసిన కేన్ ఉయ్యాల లో అర్ధవృత్తాల్లో తిరుగుతావు కాసేపు. గోరువెచ్చని నీళ్ళలో తేనెచుక్కలు కలుపబోయి, జారిపడ్డ చెంచా శబ్దానికి తేరుకుని, బయటికొచ్చి బాల్కనీ రెయిలింగ్ మీద చేతులు మోపి, వీధుల్లో తోటకూర అమ్మేవాళ్లని, పాలు కొనడానికొచ్చేవాళ్లని, ఒక చివర్న ఆడుకునే కుక్కపిల్లల్ని ఎప్పట్లానే చూస్తూ..

నీ ప్రమేయం లేకుండానే, నీకసలు తెలీకుండానే ఎదురు చూస్తుంటావు.

ఎడతెగని ప్రయాణంలో ఉంటాన్నేను-

రైలు కిటికీ ఎలక్ట్రానిక్ తెరలాగా, బయటి ప్రపంచమంతా ఉపాధేయ వస్తువులాగా మారిపోయి, కొత్త కవిత్వపు పంక్తులేవో రైలు పట్టాలవెంటపడి నాతో పాటుగా వస్తుంటాయి. రైలు ఊళ్లని దాటేటప్పుడు గేటు పడి మనుషులు ఆగిపోయిన దగ్గర, కూ మన్న చప్పుడుకి ఉమ్మెత్తపూల గాలి, కాగితప్పూల రంగు ఒక్కసారి ఉలిక్కిపడి మళ్ళీ సర్దుకుంటాయి. పైబెర్తు మీద పడుకున్న ఆర్టిస్టుని నిద్రలేపి తన బొమ్మ వెయ్యమని పేచీ పెడుతుంది పాప. ఎదురు సీట్లో పెద్దాయన తరళ సలిలము అన్న పదానికి విగ్రహవాక్యం కోసం ఆ ఉదయమంతా వెతుకుతూనే ఉన్నాడు.

—-

ఒక్కోచోటులో కలిసేముందు ఒక్కోలా ఎదురుచూస్తావు నువ్వు.

కాఫీ షాప్ లో ఇయర్ ఫోన్స్ లో గజళ్ళు వింటూ; ఫ్రూట్ జూస్ సెంటర్ లో  వలసపక్షిలాంటి ఆ తెల్లటి పిల్లాడితో రోజువారి అమ్మకాల గురించి మాట్లాడుతూ, అతను వదిలేసి వచ్చిన ఆ వూరిలో అమ్మానాన్నల వివరాలు కనుక్కుంటూ; లైబ్రరీల్లో, పబ్లిషింగ్ హౌసుల్లో పుస్తకాల మధ్య చెదపురుగువై అసలు నేనొచ్చేసంగతి గుర్తులేనట్టు ఉంటావు.

ఒక్కోసారి అవతల పక్క సిగ్నల్లో నిల్చుని ఉంటావు. బస్సుల్నీ, ఆటోల్నీ తప్పించుకుని  నేనటువైపుకి చేరగానే “రోడ్డు దాటేటప్పుడు నువ్వు సిగ్గుపడ్డావు తెలుసా?” అంటావు. ఆ తర్వాత నగరం మనని ఆవరించుకుంటుంది. అంతరొద మధ్యలోనూ రోడ్లన్నీ మన మాటలకోసం చెవులు రిక్కిస్తాయి.

—–

సముద్రం మీదకి ఎగిరి ఎక్కడ వాలాలో తెలీక అక్కడక్కడే చక్కర్లు కొట్టే పక్షివై, దట్టమైన అడవిలోకి దారి దొరక్క చెట్ల తలలమీదే ఆగిపోయిన జడివానవై గ్రహగోళాల గమనంలా స్థిమితంగా కాంతి యుగాలకి అవతలి నక్షత్రాలంత సహనంగా…

ఎదురు చూస్తూనే ఉంటావు నువ్వు.

రైలు దిగేశాక కొత్త దారుల్లో పాత గుర్తులతో నడుస్తూ ఉంటాను. బస్ స్టాపుల్లో ఎర్ర రిబ్బన్ జడల్లో డిసెంబరాల పూలతో ఆడపిల్లలు అరచేతుల చాటున నవ్వుతుంటారు. కారు అద్దాలకి దగ్గరగా వచ్చి ఎగిరిపోతుంటాయి పిట్టలు. సగం వొళ్ళంతా బురద పూసుకున్న పందుల్ని తోలుకుంటూ పల్లెపాటేదో పాడుకుంటూ వెళ్తాడొక కొత్తమీసాల కుర్రవాడు. వాళ్లందరితో మాటలు కలపకుండా రాలేకపోతాను. మంచీ చెడులు చెప్పుకోకుండా కదల్లేకపోతాను. ఈలోపు ఆకాశం రంగులు మారిన సంగతి బొత్తిగా మర్చిపోతాను.

తలుపు తీస్తావు కానీ తీసినట్టుండదు. పలకరిస్తావు కానీ నన్నే అనిపించదు. రెండు కొత్త గాజు గ్లాసులు తుడిచి అక్కడ పెడతావు కానీ వాటిలో నీళ్ళుండవు. నిన్ను తాకనివ్వవు, తప్పయిందని చెప్పనివ్వవు. గదిలోపలి కర్టెన్లు ఆర్టిస్టిగ్గా ఊగడం మానేస్తాయి. కారిడార్నుంచి పైకి కిందకీ పచార్లు చెసే లిఫ్ట్ శబ్దం తప్ప ఇంకేం వినిపించదు. పాపం, ఉన్నట్టుండి లోకమంతా ఒంటరిదైపోతుంది. ఇంటిగోడలన్నీ బావురుమని ఏడవడానికి సిద్ధంగా ఉంటాయి.

చూసి చూసి “పోనీ వెళ్ళిపోతాలే” అని నేను లేవగానే మణికట్టు పట్టుకు ఆపేస్తావు. అంతసేపటి తర్వాత నొప్పితో మూలిగినట్టు ఏదో మాట్లాడతావు- “చాలా ఎదురు చూసాను, రావేమో అనుకున్నాను, రావొద్దనాలనీ అనుకున్నాను. వచ్చేసరికి తలుపేసి ఎటన్నా వెళ్ళిపోవాలని చూశాను. కోపమొచ్చింది- నిన్ను ఆపేసిన పూల మీద, పిట్టలు, మనుషులు, కవిత్వం అన్నిటిమీదా..” ఎప్పుడూ విండ్ చైమ్స్ లా మోగే నీగొంతు రుద్దమౌతుంది. కోపమో, ఇష్టమో తేలనంత గట్టిగా చేతిలో చేతిని బిగిస్తావు.

—-

చెయ్యి విడిపించుకుని, నీ మోకాలి మీద గోటితో గీరుతూ చెప్తాను-

“నీకంటే ఎక్కువని కాదు, అసలు నువ్వంటూ లేకపోతే వాటిల్లో నాకే అందమూ కనపడదు. ఆ పిట్టలా ఎగరగలననేగా ఇంత మోహిస్తావు. ఆ పూలలా ముద్దు పెట్టినప్పుడేగా అంతలా ఒళ్లు మరిచిపోతావు. ఆ ఊళ్ల గురించి, మనుషుల గురించి ఇన్ని మాటలు చెప్పి, వాళ్ల పాటలు నీ దగ్గర పాడబట్టేగా నన్ను చూసి ఇంత ముచ్చట పడతావు. ఈలోకమేగా ఇన్ని రంగులు పూసి, రెండు రెక్కలు అతికించి, నన్నిలా నీకోసం తయారుచేసింది?

నీకోసం కాదా ఈ ఆలస్యమంతా?”

వింటావో, ఇంకాసేపు కోపం నటించాలన్న సంగతి మర్చిపోతావో.. నా పొట్టలో మొహం దాచుకుని నిద్రపోతావు. మనచుట్టూ ఉమ్మెత్తగాలి, పరాయిదేశపు పాట, ఆడపిల్లల నవ్వులు, పాత పుస్తకాల వాసనా కలిసి నువ్వు తుడిచిపెట్టిన ఖాళీ గ్లాసుల్లో వైన్ లాగా నిండి పొర్లిపోతాయి.

—-

స్వాతి కుమారి

స్వాతి కుమారి

నా పేరు స్వాతి, రిషివాలీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. మనుషులంటే ఆసక్తి. మనుషుల ఆలోచనలు, మాటతీరు, రకరకాల వ్యక్తిత్వాలు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. వాటిని గమనించడం ఒక వ్యాపకం. చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనించడం, పదాల్లో పెట్టడం ఒక ఇష్టమైన ఆట. అరుదుగానే రాసినా కథలు రాయడం వెనకున్న కారణాలు ఇవే. రాసే వాక్యం చదవడానికి అందంగా ఉండాలనేది ఒక పట్టుదల. కథ చెప్పే పద్ధతి రొటీన్ గా ఉండకూడదని ప్రయత్నం.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నీ ప్రమేయం లేకుండానే, నీకసలు తెలీకుండానే ఎదురు చూస్తుంటావు.

    ఎడతెగని ప్రయాణంలో ఉంటాన్నేను..

    బలే రాస్తారండి స్వాతి గారు మీరు.మంచి కవిత్వాన్ని వెదికే కాలంలో ఇంతటి చిక్కటి కవిత్వాన్ని మాకిచ్చినందుకు త్యాంక్యూ

  • అన్నీ మీ మాటల్లో నేను అనుకున్నట్టే అనిపిస్తూ..భలే ఉంది….I am really enjoying your writeups. Keep writing more.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు