1910 గురజాడ దిద్దుబాటే తొలికథ అని చెబుతున్నా ఈ అంశంపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలూ జరుగుతూనే ఉన్నాయి. ఇదే శీర్షికల్లో రాయలసీమ నుండి 1882 నుండే కథలొచ్చాయని చెప్పుకున్నాం. అయితే పుంఖాను పుంఖాల పుస్తక ప్రచురణల్లో భాగంగా 1910నే ప్రామాణికంగా తీసుకొని అప్పటి నుండి 2010 వరకు నూరేళ్ళ తెలుగుకథ పేరుతో అనేకమంది కథాసంకలనాలు తీసుకొచ్చారు. అలా ప్రత్యేకంగా తీసుకొచ్చినా, రాయలసీమ నుండి వచ్చిన గొప్పకథలకు చోటు లభించకపోవడం నిరుత్సాహమే.
నూరేళ్ళ తర్వాత కూడా సాహిత్యచరిత్రలో రాయలసీమ నుండి గొప్ప కథలు రాలేదా? అని పరిశోధించినపుడు 2010 తర్వాత కూడా గొప్ప కథలొచ్చాయి. భారతీయ సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన కథలూ వచ్చాయని తేలింది. ఈ రకంగా దాదాపు నూటా పదిహేను సంవత్సరాల కాలంలో సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్న, సాహిత్యకారులు విస్మరించిన కథలను మూల్యాంకనం చేసే ప్రయత్నం చేద్దాం. అసలు కథ గూర్చి బుచ్చిబాబు..మళ్ళీ మళ్ళీ చదివించే వచన ఖండకావ్యమన్నారు. వెనుకనుంచి సముద్రం హోరు వినిపిస్తూ, చూడ్డానికి మాత్రం కెరటంలా కనిపించేది కథ అంటారు. అటువంటి కథలు రాయలసీమ నుండి ఏమోచ్చాయని పరిశీలించనపుడు చాలా కథలు కనిపిస్తాయి.
రాయలసీమలో అనంతపురం జిల్లా నుండి సింగమనేని నారాయణ అడుసు, శాంతినారాయణ దళారి, బండినారాయణ స్వామి సావుకూడు, చిలుకూరి దేవపుత్ర మన్నుతిన్న మనిషి, రాయుడు హైనాకథ, సడ్లపల్లి చిదంబర రెడ్డి ఇసక, కొలకలూరి ఇనాక్ అస్పృశ్య గంగ కనబడతాయి. చిత్తూరు జిల్లా నుంచి మధురాంతకం రాజారాం స్వస్థానం, గోపిని కరుణాకర్ దుత్తలో చందమామ, మహేంద్ర హొగినేకల్, ఆర్‌యం ఉమామహేశ్వరరావు మొగుడు పెళ్ళాల ప్రేమలేఖ, పులికంటి కృష్ణారెడ్డి కొమ్ములు, రాసాని చీకటి, నామిని సుబ్రహ్మణ్యనాయుడు రంగ రంగ నిను నమ్మితి, మధురాంతకం నరేంద్ర నిత్యమూ నిరంతరమూ, తుమ్మల రామకృష్ణ మట్టిపొయ్యి, కడప జిల్లా నుండి కేతు విశ్వనాథ రెడ్డి కూలిన బురుజు, దాదా హయత్ మురళి ఊదే పాపడు, షేక్‌హుసేన్ సత్యాగ్ని యంత్రం, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి ఉత్తరం, సొదుం జయరాం అడివి, వేంపల్లి షరీఫ్ జుమ్మా, పాలగిరి విశ్వప్రసాద్ చుక్కపొడిచింది. కర్నూలు జిల్లా నుండి కాశీభట్ల వేణుగోపాల్ బృంద, జి.వెంకటకృష్ణ దేవరగట్టు, శ్రీనివాసమూర్తి మెడమీద వేలాడే కత్తి, నాగప్పగారి సుందర్రాజు నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద్య, జి.ఉమామహేశ్వర్ పరాయోళ్లు, గుంపుల వెంకటేశ్వర్లు బ్యాగరోళ్లు, రంగనాథ రామచంద్ర రావు దింపుడుకల్లం, డా.హరికిషన్ ఒక చల్లని మేఘం, మారుతీ పౌరోహితం నీళ్లింకని నేల, పాణి నేరేడు పిల్లవాడు, ఇనాయతుల్లా నిచ్చెన, యస్.జయ రెక్కలున్నపిల్ల కథలున్నాయి.
మధురాంతకం రాజారాం రాయలసీమ నేపథ్యంతో సామాజిక బలహీనతలు, మానవ సంబంధాలను సూక్ష్మంగా చిత్రించారు.ఏడారిలో కోయిల, ఇక్కడ మేమంతా క్షామం(కరువు నేపథ్యం)లో గొప్పకథలు రాశారు. కేతు విశ్వనాథ రెడ్డి రాయలసీమ ఫ్యాక్షన్, గ్రామీణ హింస, సామాజిక వాస్తవాలపై బలమైన కథలు రాశారు. గడ్డి, కూలిన బురుజు ఫ్యాక్షన్ హింసతో గ్రామం నాశనం అయ్యే చిత్రణ కథలో చూపించారు. వేంపల్లి గంగాధర్ (కడప) రాయలసీమ జీవిత వైవిధ్యం, కుల-భూమి వివాదాలు, సామాజిక అసమానతలపై ఆధునిక కథలు రాశారు.గరుడ పచ్చ, కాలముఖం, దేవరసీల(సంకలనం) తీసుకొచ్చారు. జి.రామకృష్ణ తొలితరం కథారచయిత. కరువు సమయంలో జీవనపోరాటం గంజి కోసరం అనే కథ అద్భుతంగా రాశారు. బండి నారాయణ స్వామి అనాథ రైతులు, కరువు, వానల ఆశపై కథలు రాశారు. నడక,నీళ్ళు,వానరాలే,సావుకూడు వీరి అత్యుత్తమ కథలు. చిలుకూరి దేవపుత్ర ఫ్యూడల్ పెత్తందారీ, దళిత జీవితాలతో కూడిన కథలు సమిధలు,ఆయుధం రాశారు. సింగమనేని నారాయణ, వై.సి.వి. రెడ్డి (దీనికంతెక్కడా..), ఎన్. దాదాహయత్ (గుక్కెడు నీళ్ళు) వంటి రచయితలు కరువు-క్షామం థీమ్‌పై బలమైన కథలు రాశారు. స్త్రీ రచయితలు పూండి చెల్లమ్మ, జి. నిర్మలా రాణి (గాజుకళ్ళు), కస్తూరి వెంకటసుబ్బమ్మ -స్త్రీలసమస్యలు, సామాజికమార్పులపై కథలు రాశారు. ఇవన్నీ చెప్పుకోదగ్గవే.
రాయలసీమ నుండి ఇంతేనా? ఇంకా చాలా గొప్పకథలొచ్చాయని పరిశోధకులు విమర్శకులు తేల్చవచ్చు. ఇవి మాత్రమే అనడానికి వీల్లేదు. ఇది ఒక పరిశీలన మాత్రమే. అయితే ఇప్పటివరకు పేర్కొన్న కథల్లో ఇతివృత్తం, ఆధునికకథలో కథన శిల్పం ప్రధాన లక్షణం అని మనం భావించాలి. ఈ క్రమంలోనే ఉత్తమకథను బేరీజువేసి సదరు కథ జీవిత శకలం లోంచి చిత్రించబడిందా లేదా అన్నది పరిశీలించాలి.
అటువంటి కథ మాత్రమే తెలుగు సాహిత్యలోకంలో పది కాలాలు పాటు నిలబడగలదు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య మంచి కథకు నాలుగు లక్షణాలు చెబుతారు. క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం ఈ లక్షణాలున్న కథలు ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటారు. కథాంశము కథాంశానికి రచయితకు మధ్య ఉన్న సంబంధం ప్రధాన అంశాలయితే సవిధానము పాత్రలు, నేపథ్యము, దృష్టికోణము, కథనము, శిల్పానికి సంబంధించిన అంశాలుగా పేర్కొన్నారు. ఉత్తమకథ అని అనుకున్నప్పుడు పై లక్షణాలు కథలో ఉంటే ఆ కథ భారతీయ సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది అనడంలో సందేహం లేదు.
*








మీ అమాయకత్వం గానీ రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో భాగమే అనుకుంటున్నారా? తొలి నుండి రాయలసీమ భాషను ఈ యాసను అవహేళన చేస్తే సాహిత్య ఆధిపత్య వర్గాలకు మన రచయితలు రచనలు కళ్ళకు కనపడతాయా? మనల్ని అన్ని రంగాలలో ఎప్పుడో వెలివేశారు తమ్ముడూ.