ఈ దృశ్య కావ్యం ఒక అనుభవమే!

వ్యక్తిత్వంలోని చీలికలు ,అస్థిరమైన జ్ఞాపకాలు,సత్యం యొక్క విభిన్న  రూపాలు-ఈ మూడు తాత్విక ప్రవాహాలు “అనంతరం“లో అంతర్లీనమైపోతాయి. ఈ మూడు అంశాలను  మూర్తీభవింపజేసుకున్న  మానసిక విశ్లేషణాత్మక దృక్పధం కధాంశంగా ఆదూర్  గోపాలకృష్ణన్ 1987 లో నిర్మించిన  సినిమా “అనంతరం”.

నండూరి సుబ్బారావు ఎంకి ని ఉద్దేశించి “ఒక్క నేనే నీకు , పెక్కు నీవులు నాకు” అంటాడు . బుద్ధుడి “అనత్త” భావం దీనిని మరోవైపు నుండి విశ్లేషిస్తుంది. పాళీ గ్రంధాలలో రాసిన విధంగా మిళిందుడు అనే గ్రీకు రాజు నాగసేనుడు అనే బౌద్ధభిక్షువును ఉద్దేశించి ” నిన్ను అందరూ నాగసేనుడు అని పిలుస్తున్నారు, అసలు నిజంగా నాగసేనుడు ఎవరు ? నీ దేహమా ? నీ మనసా ? నీ ఆలోచనలా ?” అని ప్రశ్నిస్తాడు.  నాగసేనుడు “మహారాజా, మీరు ఇక్కడికి రథంపై వచ్చారు కదా! రథం అంటే ఏమిటో చెప్పండి? చక్రాలా, అక్షమా, పగ్గాలా? ఇవన్నీ కాకుండా రథం అనే వేరే వస్తువు ఏదైనా వుందా?” అని బదులు ప్రశ్న వేస్తాడు.

“అన్ని భాగాలు కలిసి వున్న సమాహారమే రథం” అని చెబుతాడు మిళిందుడు.అప్పుడు నాగసేనుడు “రాజా!’ నేను’ అనే శాశ్వతమైన,మార్పులేని ఆత్మ అనేది లేదు.మనిషి అంటే శరీరం, జ్ఞాపకం , వాంఛలు ,భావం, చైతన్యం కలిసిన ఒక ప్రవాహం. ‘నేను’ కూడా అంతే అని నాగసేనుడు వివరిస్తాడు.

ఆధునిక మానసిక సాహిత్యానికి దర్పణంగా భావించే Dostoevsky, 1846 లో రాసిన The Double: A Petersburg Poem అనే నవలికలో కాఫ్కా, ఫ్రాయిడ్ రచనల్లో కనిపించే అస్తిత్వ సంక్షోభాన్ని , వారి కంటే ముందే శక్తివంతంగా విశ్లేషించాడు.

ఒక రోజు సెయింట్ పీటర్స్ బర్గ్  నగరం లోని చిరుద్యోగి అయిన యాకోవ్ పెట్రోవిచ్ గోల్యాడ్కిన్ కి తన లాగే కనిపించే మరో మనిషి ఎదురవుతాడు. అదే ముఖం, అదే పేరు , అదే రూపం, వ్యక్తిత్వం మాత్రం పూర్తిగా భిన్నం.మనిషిలో సహవసించే  రెండు మానసిక కోణాలను ప్రతిబింబించే ద్వందస్థితి ఈ రచన యొక్క అంతరార్ధం.అతను నిజమైన మరో మనిషా లేక గోల్యాడ్కిన్ కల్పించుకున్న భ్రమా? అనేది Dostoevsky ఎక్కడా చెప్పడు.

1950 లో విడుదల అయిన ‘అకిరా  కురసోవా’ మాస్టర్ పీస్ “రషోమోన్” కేవలం ఒక మర్డర్ మిస్టరీ కాదు.”నిజం, జ్ఞాపకం, స్వార్ధం,ఆత్మ నివేదన గురించి ఒక గాఢ తాత్వికాన్వేషణ”. ఒక వర్షపు రోజున ఒక కట్టెలు కొట్టేవాడు , ఒక భిక్షువు, మరో సాధారణ వ్యక్తి జపాన్ లోని శిధిలమైన రషోమోన్ గేటు దగ్గర కలుస్తారు. అడవిలో చంపబడిన ఒక సమురాయ అతని భార్య గురించి నలుగురు వ్యక్తులు, చనిపోయిన సమురాయి ఆత్మ,అతని భార్య,వారిని అడ్డగించి దాడిచేసిన బందిపోటు దొంగ,ఈ ఘటన ని చాటుగా గమనించిన ప్రత్యక్ష సాక్షి అయిన కట్టెలు కొట్టే వ్యక్తి -వారి వారి కోణాల నుంచి వేర్వేరు కథనాలు చెబుతారు. మనిషిలోని స్వార్ధం, భయం, అపరాధ  భావన నిజాన్ని ఎలా మార్చి వేస్తాయి అనేది ఈ సినిమా అంతరాత్మ . అసలు వాస్తవం ఏంటి అనేది “రషోమోన్ ఎఫెక్ట్” గా మిగిలిపోతుంది .

వ్యక్తిత్వంలోని చీలికలు ,అస్థిరమైన జ్ఞాపకాలు,సత్యం యొక్క విభిన్న  రూపాలు-ఈ మూడు తాత్విక ప్రవాహాలు “అనంతరం“లో అంతర్లీనమైపోతాయి. ఈ మూడు అంశాలను  మూర్తీభవింపజేసుకున్న  మానసిక విశ్లేషణాత్మక దృక్పధం కధాంశంగా ఆదూర్  గోపాలకృష్ణన్ 1987 లో నిర్మించిన  సినిమా “అనంతరం”.

​ప్రపంచ సినిమా యవనికపై మలయాళీ సినిమా కేతనాన్ని ఎగురవేసిన దర్శకుడు ఆదూర్ గోపాలక్రిష్ణన్. తన కెరీర్ లో 16 జాతీయ అవార్డులు ,17 కేరళ స్టేట్ అవార్డులతో పాటు , పద్మశ్రీ , పద్మవిభూషణ్,దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలను  అందుకున్నారు.కేరళలోని ఆదూర్ అనే గ్రామం లో పుట్టి కథకళి సంప్రదాయ కుటుంబంలో పెరిగి 8వ ఏట నుండే కళాప్రదర్శనల పట్ల మక్కువ పెంచుకుని 1965 లో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో దర్శకత్వం , స్క్రీన్ ప్లే శాఖలలో డిప్లోమా చేశారు. అక్కడ ఉన్నప్పుడు అకిరా  కురసోవా , ఇంగ్మార్ బెర్గ్మన్,సత్యజిత్ రాయ్ సినిమాలను అధ్యయనం చేశారు.ఆయన 46 సంవత్సరాల సినీజీవితంలో రూపొందించిన12 చలనచిత్రాల్లో ‘అనంతరం’ ఒక విలక్షణమైన కళాఖండం.

The world speaks to me in colours; my soul answers in musicRabindranath Tagore, Fireflies.

 వినూత్న కథనం: రెండు కోణాల సత్యం

​ఈ సినిమా నిర్మాణంలోనే ఒక ప్రయోగాత్మకత కనిపిస్తుంది. కథానాయకుడు అజయన్ తన జీవితాన్ని రెండు వేర్వేరు వెర్షన్లలో స్వగత విధానంలో మనకు వివరిస్తాడు. సినిమా ప్రారంభం లోనే తన పేరు అజయన్ , అజయ్ కుమార్ అని చెబుతాడు. మొదటి భాగం అజయన్ బాల్యం, చదువు, క్రీడల్లో ప్రతిభను వివరిస్తూ అతని సామాజిక ఎదుగుదలను చూపిస్తుంది. మొదటి భాగంలోని సంఘటనల వెనుక ఉన్న మానసిక సంఘర్షణను, నిగూఢ వాంఛలను మరియు అతని ఊహాలోకాన్ని రెండవ భాగం ఆవిష్కరిస్తుంది.

అజయన్  అంతర్మధనాన్ని  పరిశీలిస్తే  ఫ్రాయిడ్ చెప్పిన ఈ మాటలు గుర్తుకువస్తాయి.

“Unexpressed emotions will never die. They are buried alive and will come forth later in uglier ways“- Sigmund Freud

‘అనంతరం’ సినిమా “ఆత్మాశ్రయ దృక్పధం, నిర్ధారించగల  వాస్తవం మధ్య జరిగే సున్నిత మైన సంఘర్షణ ” అనే అంశంపై నడుస్తుంది. జీవితం అంటే మనం  చేసిన పనులు మాత్రమే కాదు, మనం ఏం అనుభవిస్తున్నాం అనేదే అసలైన జీవితమని ఈ చిత్రం చెప్తుంది. అజయన్ అనాథ. మానసికంగా మామూలు సమాజం నుండి వేరుపడిన మనిషి. ఈ ఒంటరితనం అతనిలో ఒక రకమైన “ద్వంద మానసికస్థితి” ని సృష్టిస్తుంది. సినిమాలో ‘సుమ’ పాత్ర అజయన్‌కు ఉన్న ఆకర్షణకు, అభద్రతా భావానికి ప్రతిరూపం. ఆమె అతని అన్న ‘బాలు’ భార్యగా ఉన్నా, అజయన్ సృష్టించుకున్న ఊహాలోకంలో ఆమె ‘నళిని’ పేరుతో ఒక నెరవేరని కాంక్షగా మిగిలిపోతుంది.

​ఆదూర్ గోపాలక్రిష్ణన్ ప్రతి ఫ్రేమ్‌ను దృశ్యకవితలా  మలిచారు.సంభాషణల కంటే నిశ్శబ్దానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.మమ్ముట్టి, అశోకన్ మరియు శోభన తమ నటనతో పాత్రల అంతర్మథనాన్ని స్పష్టంగా ఆవిష్కరించారు.ముఖ్యంగా అశోకన్ అజయన్ పాత్రలో పండించిన హావభావాలు ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోతాయి .ఈ సినిమాలో నేపధ్యశబ్దాలు ఒక పాత్రలా వ్యవహరిస్తాయి. ప్రకృతిలోని చెట్లఆకుల కదలిక,పిట్టల అరుపులు, కీటకాల కిచకిచలు,ఈ సినిమాకి అంతర్గత సంగీత స్వరాలుగా వినిపిస్తాయి . టిక్ టిక్ మనే గడియారపు శబ్దం , చిటపట మనే చినుకుల చప్పుడు అజయన్ మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి. ఈ చిత్రం మలయాళంలో ఉత్తమచిత్రం,ఉత్తమ దర్శకుడు , ఉత్తమ స్క్రీన్ ప్లే , ఉత్తమ  ఆడియోగ్రఫీ విభాగాల్లో జాతీయ పురస్కారాలు అందుకుంది . అలాగే, కార్లోవి వెరీ  అంతర్జాతీయ చిత్రోత్సవంలో “అంతర్జాతీయ సినిమా విమర్శకుల “ అవార్డ్  గెలుచుకుంది

‘అనంతరం’ అంటే “ఆ తర్వాత” అని అర్థం. ఒక కథ ముగిసిన తర్వాత కూడా మిగిలిపోయేది ఏమిటి? నిజం అంటే మనం చూసేదా? లేక మనం నమ్మేదా? అనే ప్రశ్నలను ఈ సినిమా మన ముందు ఉంచుతుంది.కురసోవా రషోమన్ ప్రభావం లాగా అనంతరం  ముగింపు కూడా ప్రేక్షకుడి ఊహశక్తికి , మేధోమథనానికి పరీక్ష పెడుతుంది . ఏది ఊహ, ఏది వాస్తవం అనేది స్పష్టపరచకుండా  ప్రేక్షకులనే నిర్ణేతలుగా నిలబెడుతుంది .

“It is about the very process of creation: in three levels – experiences, recollection and the arrangement of fantasy “ – Adoor Gopalakrishnan

​’అనంతరం’ కేవలం చూడవలసిన సినిమా కాదు, అనుభవించవలసిన దృశ్య కావ్యం.సగటు వాణిజ్య సూత్రాలకు అతీతమైన ఒక అద్భుత సృష్టి, “ మనిషి, ఆత్మ యొక్క ప్రతిబింబం” అని నిరూపించిన చిత్రం.

అజయన్ కథ ముగిసిన అనంతరం కూడా, అతని అంతర్యానం  ప్రేక్షకుడి అంతరంగంలో కొనసాగుతూనే ఉంటుంది.

*

శ్రీ నివాస్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ వ్యాసం ఎత్తుగడకి మిగతా వ్యాసానికి సంబంధం ఏమిటో తెలియలేదు. ఇందులో చర్చించిన ఆస్తిత్వ భావనల వివిధ దృక్కోణాలని విశ్లేషంచటానికి నండూరి వారొక్కరే కాకా అనేకకేకులు సాహిత్యములో ప్రయాస చేసారు. మీరు చెప్పిన వాదనకి నండూరి వారి ఇక్కడ ఉటంకించిన కవితా భావనకి పొందిక కుదరలేదనిపించింది

  • “అనంతరం” సినిమా పై శ్రీ శ్రీనివాస్ గారు వ్రాసిన సమీక్ష మనసును ఆకట్టుకునేలా, అద్భుతమైన తాత్విక విశ్లేషణ తో, ఉన్నతమైన శైలిలో వుంది.

    శ్రీ శ్రీనివాస్ గారి విశ్లేషణ కేవలం ఒక సినిమా సమీక్షలా లేదు… అస్తిత్వవేదన వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసే ఒక తాత్విక ప్రయాణంలా ఉంది! ఒక అనుభూతి గా వుంది.

    బుద్ధుడి ‘అనత్త’ భావనను, దస్తొయెవ్స్కీ (Dostoevsky) ‘ద డబుల్’ నవలను, కురసోవా ‘రషోమోన్’ ఎఫెక్ట్‌ను అదూర్ గోపాలకృష్ణన్ *అనంతరం* చిత్రంతో ముడిపెట్టిన విధానం శ్రీ శ్రీనివాస్ మేధోశక్తికి నిదర్శనం. అజయన్ అంతర్మథనాన్ని, అతని ఊహాలోకాన్ని ఫ్రాయిడ్ సిద్ధాంతాల వెలుగులో శ్రీ శ్రీనివాస్ ఆవిష్కరించిన తీరు అద్భుతం. సినిమా ముగిసినా అజయన్ కథ ప్రేక్షకుల అంతరంగంలో కొనసాగుతుందన్న శ్రీనివాస్ గారి మాట ఎంత నిజం! నిజంగా ఇదొక ఉన్నత ప్రమాణాలు కలిగిన అద్భుతమైన వ్యాసం. హాట్స్ ఆఫ్ టు యు!

    ‘అనంతరం’ ఒక దృశ్యకావ్యమైతే, దానికి రాసిన ఈ విమర్శ ఒక ‘అక్షర కావ్యం’!**

    నండూరి వారి కవిత్వాన్ని గుర్తుచేస్తూనే, మనిషి మనసులోని నిశ్శబ్దాన్ని, ఒంటరితనాన్ని, అభద్రతా భావాన్ని పదాలతో ఎంతో సున్నితంగా స్పృశించారు. సినిమాలో నేపథ్య శబ్దాల ప్రాధాన్యతను వర్ణించిన తీరు చదువుతుంటే, ఆ శబ్దాలు నాకు కూడా వినబడుతున్న అనుభూతి కలిగింది. ఒక సినిమాను కేవలం చూడటమే కాదు, ఎలా అనుభవించాలో శ్రీనివాస్ గారి అక్షరాలు నేర్పించాయి. చాలా రోజులకు ఒక మంచి సాహిత్య-సినిమా విశ్లేషణ చదివిన తృప్తి వచ్చింది. అభినందనలు!

    “నిజం అంటే మనం చూసేదా? లేక మనం నమ్మేదా?” అంటూ శ్రీనివాస్ గారు లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచింపజేశాయి. సాధారణ సినిమా రివ్యూలకు భిన్నంగా, మానసిక విశ్లేషణను జోడించి రాసిన ఈ వ్యాసం శ్రీనివాస్ గారి లోతైన అవగాహనను తెలియజేస్తోంది. ‘అనంతరం’ సినిమాకు చేకూర్చిన అక్షర గౌరవం ఇది.

    ఒక సినిమాను ఇంత మనోహరంగా వివరించడం సామాన్యం కాదు.

    ఫణి రాజ కుమార్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు