ఆకలి మెతుకులు గెలిచిన ఒక సందర్భం

ఇది ఫిబ్రవరి 19, 2014 నాడు రాసిన సంపాదకీయం! ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంగతులు కొన్ని వున్నాయి! ముఖ్యంగా అమెరికా తెలంగాణ సందర్భం తెలియని మిత్రుల కోసం ఇది!

 

వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం

క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్.

ఆకలి  మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది.

అయినా సరే,

పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది.

చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.

ఆకలి మెతుకు

వొక తల్వార్ లాగా మెరిసి వొక నెత్తుటి చార కసిగా ఆక్రోశిస్తుంది.

నీకు అసందర్భంగా కనిపిస్తుందా, కవీ?!

–          ‘రోజ్ రోటీ’ కవిత నించి.. 2010.

తెలంగాణా ఉద్యమం బాగా వేడెక్కిన సందర్భంలో 2010లో టెక్సాస్ తో పాటు అమెరికాలోని  అనేక ఊళ్ళల్లో తెలంగాణా సభలు జరిగాయి.  కొన్ని సభల్లో  నేనున్నాను. మాట్లాడాను. ఆ సభల్లో కొన్ని చోట్ల  ప్రధాన వక్తల ప్రసంగాలు అయ్యాక తెలంగాణా పల్లెల నించి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవిత కథలు/ ఇప్పటి పల్లెల పరిస్థితి గురించీ వ్యక్తిగత కథనాలుగా వినిపించే వాళ్ళు. అవి విన్న ప్రతిసారీ ‘ఇది కదా జీవితం’ అని కళ్ళు చెమర్చేవి. మొసళ్ళు కన్నీళ్లు కార్చే ఈ లోకంలో వొక మనిషి కన్నీరు ఇలా కదా వుండాలి అనిపించేది.

ప్రతిసారీ ఆ సభలనించి వెనక్కి వచ్చేటప్పుడు వొక తీవ్రమైన ఉద్వేగం నన్ను ఉప్పెనలా చుట్టుముట్టేది. అనేక రకాల ఆలోచనల మధ్య నిశ్శబ్దంలో కూరుకుపోయే వాణ్ని. అది నిశ్శబ్దంగా వుండాల్సిన సమయం కాదు. నిట్టూర్పులు విడుస్తూ కవిత్వ వాక్యాల మధ్య దాక్కోవాల్సిన సందర్భం అసలే కాదు. నిస్పృహ లేదనీ కాదు.

కాని, అంతకంటే బలమైన స్పృహ నన్ను ఆవరించి వుండేది.  ఈ సభలు నిర్వహిస్తున్న వాళ్ళంతా తెలంగాణాలోని మారుమూల పల్లెల నించి వచ్చి, సొంత పులుగు మీద జీవితాల్ని అమర్చుకుంటున్న వాళ్ళు. వొక పూట తిని ఇంకో పూట పస్తులుంటూ చదువుకున్న వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళలో కొంత మంది తల్లిదండ్రులు ఆ పాతకాలపు ఎప్పటికైనా కుప్పకూలిపోయే ఇండ్లల్లో బతుకు వెళ్లమారుస్తున్న వాళ్ళే! కాసింత నేలని నమ్ముకొని ఆ నేల చుట్టే జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు.

చాలా ఆశ్చర్యంగా వుంటుంది కొన్ని సార్లు! దిగులు దిగులుగానూ వుంటుంది. ఎక్కడ మొదలయ్యామో వెతుక్కుంటూ వెళ్తే…కొంత మంది పూరిగుడిసెల్లో పుట్టీ పెరిగీ చూస్తూ చూస్తూ వుండగానే మిద్దె మీద మిద్దెలు కట్టుకుంటూ విలాసాలకి చేరువ అవుతారు. ఇంకా కొంత మంది ఇంత దూరం వచ్చి కూడా “అదనపు లాభాలు” సంపాదించే తెలివి తేటలు లేక వున్న చోటే బిక్కుబిక్కుమంటూ వుంటారు. ప్రవాస తెలంగాణా సభల్లో నేను చూసిన చాలా మంది యువకులు అలా బిక్కుబిక్కుమంటూనే కనిపించారు. వీళ్ళు ఇంటికి వెళ్లి ఇంకా ఆ జొన్న అంబలి ఆకలి ఆకలిగా  ఆబగా తాగే వాళ్ళుగానే అనిపించారు. వాళ్ళ ముఖాలు ఇంకా ఆ పచ్చడి మెతుకుల్లాగానే అనిపించాయి.

Untitled

వాళ్ళ అడుగుల్లో  “దూసుకెల్తా…!” అనే పిచ్చి పరుగు  కనిపించలేదు. వాళ్ళ మొహాల్లో ఇతరుల్ని వెర్రినాగన్నలానో, నాగమ్మలానో చూడాలన్న మితిమీరిన తెలివి కళ లేదు. విపరీత వస్తువ్యామోహంలో పరోక్ష ప్రశ్నలతో అవతలి వాడింటి వాసాలు – రాజభవనాల్ని తలపించే మేడలూ, ఆ మేడల్లో ప్లాస్మా స్మార్ట్ టీవీలూ వగైరా వగైరాల ఆరా  తీయాలన్న ఆరాటం లేదు. అన్నిటికీ మించి లేని మేధావితనాన్ని తెచ్చిపెట్టుకున్న సరికొత్త upstart crow వేషాలూ లేవు. అప్పుడే పుట్టుకొచ్చిన ‘అదనపు లాభాల’ పొగరులోంచి అరువు తెచ్చుకున్న నడమంత్రపు నయగారాలూ లేవు!

అవును, ఇది ‘అమాయకత్వం’ అనుకుంటే, తెలంగాణా అలాంటి అమాయకత్వంలోనే కొన్ని దశాబ్దాలుగా బతుకుతోంది. మాయవన్నెలు తెలియక మోసపోతూనే వుంది. గదమయించే నోరు లేక, దబాయించే నీతిమాలిన తనం లేక, చరిత్రని వ్యాపారం చేయలేక, వ్యాపారాన్ని చరిత్ర చేయలేక వున్న చోటనే పడి, పడిగాపులు పడుతోంది.

కాని. ఈ పొద్దున్న తెలంగాణాలో నిజంగా పొద్దు పొడిచింది.

ఆ అమాయక ముఖాల్లో వొక సూర్య కాంతి మెరిసింది. ఈ పొద్దుని  కూడా నకిలీ సూర్యుళ్ళు కిడ్నాప్ చేస్తారన్న భయం కడుపులో లేకపోలేదు. ఈ కాసిని కిరణాల్ని కూడా వాళ్ళు దోచుకుపోయి అదనపు ఆదాయం కింద దాచి వుంచేసుకుంటారన్న దిగులు ఉండనే వుంది. కాని, సూర్యుడు చాలా స్పృహతో తెలంగాణా పంట చేల మీద పొడిచాడు! ఇవాళ ఆకలి మెతుకు గెలిచింది! తెలంగాణా నిరుపేదల చెంపల మీద కొన్ని దశాబ్దాలుగా చారికలు కట్టి వున్న కన్నీటి చుక్క గెలిచింది!

Hyderabad_CITY_Page_758745e

2

ఈ రాజకీయాలతో వొక రచయితకేమిటి? అని అనుకున్న సందర్భం లేదా అంటే వుంది.

ఈ ప్రశ్న మన తెలుగుదేశంలోని సో కాల్డ్ అమాయకమైన (?) సాహిత్య వేత్తలు మాత్రమే వేసుకోగలరని వొక పొగరుమోతు సమాధానం కూడా నా దగ్గిర వుంది. లేదూ, రాజకీయాలు చేస్తున్న సాహిత్యవేత్తలే ఇలాంటి ‘స్వచ్చమైన’ ‘నిర్మలమైన’ సాహిత్య  ప్రశ్న వేయగలరు అన్న కుటిలమైన సమాధానమూ వుంది. కాని, పోరాటాల పురిట్లో పుట్టిన తెలంగాణా రచయిత రాజకీయాలు వద్దని శుష్కమైన కలలో కూడా అనుకోలేడు. అలా అనుకుంటే, అతని మౌనం తెలివైన రాజకీయమే అవుతుంది. అతని కవిలె కట్ట అందమైన పాకేజీలో కట్టబెట్టిన మోసమే అవుతుంది.

రాజకీయాలు అనే మాటని నేను ఇక్కడ సంకుచితమైన అర్థంలో వాడడం లేదు. నేను చెప్పాలనుకున్న నిర్వచనం ఇదిగో చూడండి ఇతనెవరో నా కోసమే చెప్పినట్టుగా వుంది:

Politics is commonly viewed as the practice of power or the embodiment of collective wills and interests and the enactment of collective ideas. Now, such enactments or embodiments imply that you are taken into account as subjects sharing in a common world, making statements and not simply noise, discussing things located in a common world and not in your own fantasy. What really deserves the name of politics is the cluster of perceptions and practices that shape this common world. Politics is first of all a way of framing, among sensory data, a specific sphere of experience. It is a partition of the sensible, of the visible and the sayable, which allows (or does not allow) some specific data to appear; which allows or does not allow some specific subjects to designate them and speak about them. It is a specific intertwining of ways of being, ways of doing and ways of speaking. (Jacques Ranciere, 2004).

ఈ సాహిత్య తాత్వికుడు నా మాదిరిగానే literature as literature అనే ధోరణికి శత్రువు. ఎవరూ నేరుగా రాజకీయ ప్రకటనలు చేయకపోవచ్చు. కాని, వాళ్ళ సాహిత్య శరీర కదలికలు, పెదవి విరుపులు కనిపించని పెప్పర్ స్ప్రే చల్లుతాయి. సోకు చేసుకున్న వాక్యాలు  వెటకారాలూ మిరియాలూ నూరుతుంటాయి. తెలుగు సాహిత్య చరిత్రలో ఇలాంటి పెప్పర్ స్ప్రే విమర్శల్ని ప్రతి  తెలంగాణా రచయిత (నిజమైన తెలంగాణా రచయిత) ఎదుర్కొన్నవాడే!

బాగా గుర్తొస్తుంది ఎప్పుడూ! వొక సారి మాటల సందర్భంలో సి.నారాయణ రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు. “ఇప్పుడు కాదు కాని, నేనూ దాశరథి కొత్తగా రాస్తున్న కాలంలో ఆంధ్రా వాళ్లలా రాయాలనీ, మాట్లాడాలనీ మా మీద  తెలియని వొత్తిడి వుండేది. అంటే ఊహించు! మేం కలం పట్టి రాసేనాటికి మా కలాల మీద, మా తలల మీద మాది కాని చరిత్ర భారాన్ని మేం మోయాల్సి వచ్చిందన్న మాట!”

తెలంగాణా రచయితలు వాళ్ళ వాళ్ళ యాసల్లో మాట్లాడినప్పుడు/ రాసినప్పుడు  వినిపించిన వెక్కిరింతలు ఆ తరానికే పరిమితం కాదు. ప్రతి తరం అదే సమస్యని ఇంకో రూపంలో తలకెత్తుకుని భరించక తప్పలేదు. భాషని శుభ్రపరిచే పేరుతొ తల్లి భాష వస్త్రాలని నిలువునా అపహరిస్తున్నా తెలంగాణా రచయిత పడ్డాడు. అదనపు లాభాల సంస్కృతీ వోనమాలు కష్టంగా అయినా నేర్చుకున్నాడు. కొందరికే పరిమితమైన కోస్తా తెలుగుని అందరి నెత్తి మీదా మోపేందుకు వొక సాంస్కృతిక రాజ్యాన్ని (colonizing the mind) సాహిత్య రూపంలోనే కాదు, అలాంటి సామ్రాజ్యవాద సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నిర్మించిన పత్రికలూ, సినిమాలూ, భాషా తన గొంతు నులిమేస్తున్నపుడు తెలంగాణా రచయిత వొంటరి వాడయ్యాడు. తెలంగాణా ఆ చీకటి కొట్టంలో మగ్గిపోయింది. వ్యాపార చరిత్ర ముందు సాహిత్య చరిత్ర సిగ్గుపడి ఎటో పారిపోయింది.

నిజమైన తెలంగాణా ఇవాళ కాదు గెలిచింది! ఆ బానిస చరిత్రని ధిక్కరించిన ఇరవయ్యేళ్ళ కిందనే గెలిచింది. యాసని సాహంకారంగా తన అసలైన భాషగా ప్రకటించుకున్న రోజునే తెలంగాణా సాంస్కృతిక విజయం సాధించింది.  ఎడారులుగా మారిపోతున్న/ తమ గడ్డ మీద తామే వలస బతుకీడుస్తున్న తల్లిదండ్రుల శోకాన్ని అక్షరాలకెక్కించిన ప్రతి క్షణమూ తెలంగాణా గెలిచింది. తన వాక్యాల మీద ఇతరులిచ్చే పరిశుద్ధ తీర్పుల్ని ఆకుముక్కల కింద తీసిపడేసిన ప్రతి క్షణమూ తెలంగాణా అక్షరం గెలిచింది.

3

ఎప్పుడైనా ఎక్కడైనా పీడితులే గెలవాలి. పీడితులే చరిత్ర రాయాలి. పీడితులే వుద్యమాలు నడపాలి. పీడితుల అక్షరాలే నిజమైన సాహిత్యంగా నిలబడాలి.

ఇది ఇవాళ తెలంగాణా అనే ఈ ఆకలి మెతుకు నేర్పిన పాఠం!

నా ‘రోజ్ రోటీ’ కవితలోంచి కొన్ని వాక్యాలతోనే చివరి మాటలు ఇదిగో ఇక్కడ:

నువ్వు చెప్పు, నేను వింటా, నీ బాంచ!

వినీ వినీ నా చెవుల్లో పుట్టలు మొలిచినయిలే!

నువ్వు గొంతు సవరించుకునే లోగా నా వొళ్ళు వొంగి దండమయిపోయిందిలే!

ఇన్నాళ్ళూ. నిన్ను పీరీలాగా మోశానా, ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే!

చరిత్ర చొక్కాని తిరగేసి తొడుక్కుంటున్నా,

నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.

కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!

 

రోజ్ రోటీ నా అద్దం.

దాంట్లోంచి రాస్తున్నా కొత్త చరిత్ర.

చిత్రాలు: అన్నవరం శ్రీనివాస్, ఏలే లక్ష్మణ్, యాసాల బాలయ్య

అఫ్సర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు