అమర్ షోప్న్ దేఖా రాజ్ఖొన్నా థాకే

నిజమే..! తనని ఆపేహక్కు నాకేముందని? తను వెళ్ళటమా ఉండటమా తన ఇష్టం కదా!

“జస్ట్ షటప్ అండ్ ఫకాఫ్ …..”
సైలెంట్‌గా ఉన్న ప్లేస్ లో స్వరం గట్టిగా వచ్చినందుకు కొందరు, అది పబ్లిక్ ప్లేస్ లో అరుదుగా వినిపించే మాట అయినందుకు ఇంకొందరు.. అన్నది లేడీ వాయిస్ కావటం వల్ల దాదాపు అందరు మా వైపు తిరిగారు. వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నట్టు నటిస్తూ నేనూ, వాళ్ళతో సహా నన్నుకూడా ఇగ్నోర్ చేస్తూ తానూ కాసేపు సైలెంట్ అయిపోయాం. తన చేతివేళ్ళమధ్య కాలుతున్న సిగరెట్  ట్యాన్క్ బండ్ రెయిలింగ్ కి నిర్దాక్షిన్యంగా నలపబడి పక్కనే ఉన్న డస్ట్ బిన్‌లోకి జంప్ చేసింది.
“చలో…! చాయ్ హోనా అబ్ మేకూ” గాలికి ఎగిరే జుట్టుని వెనక్కి తోసుకుంటూ..
“నో, ఇప్పుడు చాయ్ వద్దు నాకు” ఓడిపోతానని తెలిసినా వచ్చే ఉక్రోషం నా గొంతులో పలికిస్తూ.
“చల్ రే….!” భుజంమీద చెయ్యి వేసి. చెయ్యి తీసేసాను.
ఇలాంటప్పుడు తనేం చేస్తుందో నాకు తెలుసు అందుకే సీరియస్‌గా బుద్ధున్ని చూస్తున్నా, అక్కడే, వినాయక నిమజ్జన విసర్జనలని తొలగించే మనుషుల్ని కూడా. సాయంత్రం కదా చుట్టు ఒక రకమైన గబ్బుపరిమళం.. గాలి మోసుకొచ్చి బలవంతంగా నాసికా రంద్రాలలో కుక్కిన హైదరాబాద్ వాసుల విసర్జనల గబ్బుకి ఉక్కిరిబిక్కిరై అప్రయత్నంగా తనమోహం చూసీ.
“నో..నో..నో డోంట్ లుకెట్ హర్, ఓడిపోతవ్రా సాలే” చెప్తూనే ఉంది మెదడు. అప్పటికే ఆలస్యమయ్యింది. కళ్ళు తనవైపు తిరిగి ఆ మొహాన్ని చూసి
“న..వ్వు..తోం..ది…” ఇంకా చేసేదేముంది
“ఔట్..!”
      **        **                        **                  **
సరిగ్గా 25 నిమిషాల తర్వాత
మెహదీ పట్నం లో కేఫ్‌లో పొగలు చిమ్ముతూ చాయ్, మార్ల్బెరో పొగల్ని వదులుతూ తాను.. ఇద్దర్నీ చూస్తూ “ఒక చుతియా”. ఎలా వచ్చింది తను నా జీవితంలోకి, ఇప్పుడు ఎందుకని వెళ్తోంది? తననే తదేకంగా చూస్తూ కూచున్నా. పక్కనే ఉన్న టేబుల్ మీద సీరియస్ గా ఏదో చర్చ నడుస్తోంది. వెనుకగా ఎవరో గజల్ పాడుతున్నారు. . నా కాళ్ళ ఫ్లోర్ మీదా అంతా కాలిన సిగరెట్ పీకలు. రెండు మూడు ఈగలు మా చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్కసారెందుకో నవ్వొచ్చింది తను వెళ్ళిపోతుందన్న బాధలో కూడా ఇన్ని విషయాలని గమనిస్తూనే ఉన్నాను నేను. నా నవ్వుని చూసి తానూ చిన్నగా నవ్వి “ఏమిటి?”అన్నట్టుగా కల్లెగరేసింది. కొన్నిసార్లే కనిపించే అద్బుతమది. ఈ బెంగాలీల కళ్ళు ఎంత అందంగా ఉంటాయో? అనిపించింది. ఒకసారి ఇదే మాట తనతో అంటే “అంటే..! మళయాళీల కళ్ళు బావుండవా?  మీ హైదరబాదీల కళ్ళకు మాత్రం ఏమయ్యిందిరా ఇవీ అందంగానే ఉన్నాయ్ కదా” అంటూ నా రెండు కళ్ళమీదా ముద్దు పెట్టుకుంది.. అప్పుడు కూడా ఆ బెంగాలీ ముద్దు మిగతా ముద్దులకన్నా బావుందనిపించింది. ఆ ఆలోచనలని బలవంతంగా పక్కకి నెడుతూ మళ్ళీ అడిగాను “ఉండిపోకూడదా”
మళ్ళీ “షటపండ్ఫకాఫ్” అంటుందేమో అనుకున్నా, సైలెంట్ గా కళ్ళలోకి చూసింది. బుగ్గమీద చెయ్యి ఉంచుకొని అలా దాదాపు పదిసెకెన్లు…. ఇరవై సెకెన్లు… ముప్పై…
“ఎందుకలా చూస్తున్నావ్?”
“చూస్తే ఏం?”
“ఏదో ఇబ్బందిగా ఉంది సూటిగా కళ్ళలోకి చూస్తూంటే”
“కదా…! నన్ను ముప్పైసెకెన్లు భరించటమే నీవల్ల కాలేదు ఎలారా జీవితాంతం భరిద్దాం అనుకుంటున్నవ్?”
…….
ఏ సమాధానమూ తోచక సైలెంట్ గా ఉండిపోయాను.
“చలో…! వెళ్దాం అసలే టైం తక్కువుంది మళ్ళీ ట్రైన్ ఎక్కేముందు ఏడుస్తావ్, నా వల్ల కాదు కాదు నీ స్టుపిడ్ ఎమోషన్స్ ని భరించటం”  ఉస్మానియా బిస్కెట్ పొడి తన పెదాల చుట్టూ, నా చేత్తో తుడవ బోయి ఆగిపోయాను, గమనించి తనే తుడుచుకోబోయి ఆగిపోయింది, కాస్త ముందుకు జరిగి నా చేతిని పట్టుకొని పెదాలని తుడుచుకుంది. స్పర్ష…. అనాచ్చాద చర్మాన్ని తాకి మోహాన్ని మరచిపోయే స్పర్శ .. తనని తాకటం వెనుక నిజంగా సెక్సువల్ లిబిడో పనిచేస్తోందా? ఫ్రాయిడ్ ఇప్పుడు ఇక్కడ ఉండి ఆమె పెదాలని తాకినా కారణం  ఏం చెప్తాడు? ఆన్సర్ ఆలోచించే లోపే ఇద్దరమూ బైక్ మీద ఉన్నాం.
రోడ్డుమీద ఏవ్వరూ లేరేమో అన్నట్టు అంతటి ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టటం లేదు. బుర్రలో అంతకన్నా పెద్ద ట్రాఫిక్ తిరుగుతోంది. నిజమే..! తనని ఆపేహక్కు నాకేముందని? తను వెళ్ళటమా ఉండటమా తన ఇష్టం కదా!, నేను కోరుకున్నంత తను నన్ను కోరుకోవటం లేదా? నాకున్నత ప్రేమ తనకు నా మీద లేదా?? అవునూ ఇంతకీ ఈ ప్రేమ ఎప్పుడు వచ్చింది? అసలు మేం ప్రేమించుకుంటున్నామా? ఏదీ అర్థం కాక మరేదీ ఆలోచించలేక అలా. “కానీ నాకో నిజం తెలుసు, తెలిసీ తెలియట్టుగా, తనూ నేనూ నిజంగా తెలియనే తెలియదన్నట్టు నటించే నిజం. అవునూ తనారోజు అన్న “మాట” నా చెవిన పడినంత నిజం. తనమీద కోపం కూడా రానంతగా నేనే నిజమని నమ్మినంత నిజం. నేను.. నేనూ..ఆ నేను???
        ***           ****              ****             ****
  ఆరు నెలలకి ముందు కదా  
           నాన్ స్టాప్‌గా మోగుతూనే ఉంది కాలింగ్ బెల్., డోర్ దగ్గరికి నడుస్తూనే వాచ్ వంక చూసాను 12:45 ఏయం. మామూలుగా అతిథులెవరూ వచ్చే సమయం కాదది. నార్మల్‌గా రెండునెలల ముందు వరకూ అప్పుడప్పుడూ సంధ్య వస్తే తప్ప ఇంత నాన్‌స్టాప్ గా బెల్ మోగేది కాదు. మళ్ళీ ఇన్నాళ్ళకి. డోర్ ఓపెన్ చేయగానే నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చేసింది రాధిక ఉరఫ్ రాధికా చక్రబోర్త్తి. మనకైతే చక్రవర్తి, వంగభాషలో చక్రొబొర్తీ. “వ” అక్షరం పలకలేని వంగభాష. “బై ఆర్యూ బాండరింగ్ ఇన్ ద బరండా?” అని గేలి చేసి, బెంగాళీ అన్న పదాన్ని సైతం తెలుగులో మరోరకంగా మార్చి ఆ బూతుకి వంకరగా నవ్వుకొన్న రోజుల్గుర్తొచ్చి, చ! అప్పుడు తెలీదుకదా ఇలా ఈ రాధిక ఆ బెంగాల్ లోనే పుట్టిందీ అని. అలాగే నిల్చున్న నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చేసింది, తను నన్ను దాటుతుండగానే గుప్పున వచ్చిన విస్కీవాసన. డోర్ వేసి తనవంకే చూస్తూ ఉన్నా.  తూలుతూ వెళ్ళి హాల్లో ఉన్న బీన్ బ్యాగ్ మీద విసిరేసినట్టుగా కూలబడి.
“రాబిన్ కెన్ ఐ హావ్ ఎ పెగ్ ఆఫ్ విస్కీ మాన్?” ముద్దముద్దగా మాట,  పక్కనే నేలమీద ఉన్న పుస్తకాలని జరిపి అక్కడే ఉన్న యాష్ ట్రే దగ్గరికి తీసుకొని తన కోట్ పాకెట్లోనుంచి సిగరెట్ ప్యాకెట్ చేతిలోకి తీసుకుంది. వెలిగించబోతూ నావైపు చూసి.
“గెట్ ఇట్ ఫాస్ట్ రే, ఎక్కువ సేపు ఆశ్చర్యపోకు, గో..గో అండ్ గెట్ సమ్ స్టఫ్” ఎర్రబడ్డ కళ్ళతో నన్నే చూస్తూ, “ఏడవలేదులే మందెక్కువై ఎర్రబడ్డాయంతే” చెప్తూ సిగరెట్ వెలిగించింది.
“హ్మ్మ్..! ఇట్సోకే”
గదిలోకి వెళ్ళి నిన్నరాత్రి  మిగిలిన “ఓల్డ్ మాంక్” హాఫ్ బాటిల్ తెచ్చి తనముందు పెట్టి, కిచెన్‌లోకి వెళ్ళి గ్లాసులు కూడా తెచ్చిచ్చాను. కదలకుండా అలాగే ఉన్న తనకళ్ళలోకే చూస్తూ కూచున్నా. ఎప్పుడు వచ్చినా రాజేష్ తనూ ఇద్దరూ వచ్చే వాళ్ళు కానీ ఇవాళ ఒక్కతే ఇలా.  నిజానికి సాయంత్రమే చెప్పాడు ఇద్దరి బ్రేకప్ సంగతి. కానీ రాధిక రాకని మాత్రం ఊహించలేదు నేను.
గ్లాసులో మందు పోయబోతూంటే గట్టిగా అరుస్తున్నట్టు అంది
“నువ్వు తాగటం లేదు నేను.. ఇవాళ నేను మాత్రమే తాగుతాను”
“సరే!” నా గ్లాసు పక్కన పెట్టి తన గ్లాసులొ ఉన్న ద్రవానికి నీళ్ళుకలిపి పక్కనే ఉన్న బీడీకట్ట చేతిలోకి తీసుకున్నా. తీసుకున్న గ్లాసు గటగటా తాగేసింది. వెంట వెంటనే మరో మూడు పెగ్గులు అదే వరుసలో వెళ్ళిపోయాయి. చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించుకుని పొగవదులుతూ.
“ఏంటీ మళ్ళీ డబ్బుల్లేవా?” సిగరెట్ ప్యాకెట్ నావైపు విసిరేసి.
“బ్లడీ ఎస్కేపిస్ట్  థూ!,  నటిస్తున్నార్రా మీరంతా బ్లడీ ఫకింగ్ యాక్టర్స్. వాడికంటే నువ్వేమి తక్కువకాదు” స్వరం మరింతగా పెరిగింది.
నేనేమీ మాట్లాడలేదు “తప్ప్” మంటూ నేలమీద పడ్డ బల్లి తోక మా ఇదరి అటెన్షన్ నీ తన వైపు తిప్పుకుంది. పైకి చూస్తే సీలింగ్ మీద నుంచి గోడ మూలల్లోకి పరుగు తీస్తున్న బల్లులు. ఒకదాని తోక పూర్తిగా తెగిపోయి. కిందపడ్డ నిర్జీవావశేషం కొట్టుకుంటూ అచ్చం నాలాగే…
“రాబిన్!”
“హ” తనవైపు చూస్తే నవ్వుతోంది. “రాధికా అసలేమైంది, థీస్ ఆల్ ఆర్…”
“షటప్!” నా మాటని మధ్యలోనే ఆపేస్తూ. “ఐ డోంట్ నీడ్ యువర్ ఓదార్పు యాత్ర, నిద్రొస్తోంది, ఆకలేస్తోంది. తెలుసు తినటానికేమి లేదు తేవటానికి నీదగ్గర డబ్బుల్లేవు” చెప్తూనే కిందకి వచ్చి నా ఒళ్ళో తల పెట్టుకొని. తెల్సురా ! నాకు మొత్తం తెలుసు. మీరంతా…అంతా..ఇంక్లూడింగ్ యూ.. ఆల్ ఆర్ ఎంసీపీస్, సుందర్రావులేరా మీరంతా” పలవరిస్తున్నట్టు కళ్ళు మాత్రం మూసుకొని. “ఆడదానిలా ఉండాలట..ఆడదానిలా,  ఇవెన్ ఐ హావె ఫకింగ్ సెక్సీ బ్రెస్ట్ అండ్ ఎ హోల్. ఇంకేలా ఉండాలి ఆడదంటే ఇంకా ఏం కావాలి మీకు”?
“ఈజీ రాధికా ఈజీ.. ఎవరన్నారలా? రాజేష్!?”
“ఏ ! వాడొక్కన్నే దోషిని చేస్తున్నావా? నువ్వు మాత్రం తక్కువా? బొట్టులేకున్నా వొళ్ళంతా కప్పే బట్టలుండాలి, మోడ్రన్ మాటలు పైకి మాట్లాడినా ఇంట్లో నైటీ వేసుకొని మీకు కాఫీ అందించాలి. మీకు “పెళ్ళాలు మాత్రమే కావాలి. పూర్తి ఆడదాన్ని ఇప్పటివరకూ చూసార్రా ఎప్పుడైనా. మీకందరికి ఒక్కటే కావాలి మీ బుర్రల్లో ఉండే ఆడది, సెక్స్ మాత్రమే ఇచ్చే ఆడది. చుతియా సుందర్రావ్” పలవరిస్తూనే, కలవరిస్తూనే అలా తను నిద్దర్లోకి జారిపోతే, తననే చూస్తూ నేను. “అమర్ షొప్న్ దేఖా రాజ్ ఖొన్నా థాకే…” తన మొబైల్ రింగ్ అవుతూంటే చూసాను “రాజేష్” కాల్ కట్ చేసి, మొబైల్ స్విచాఫ్ చేసి పక్కన పడేసాను. ఉదయమే కళ్ళు తెరిస్తే తను లేదు, బాత్రూం తలుపు తెరిచే ఉంది, లైట్ వెలుగుతోంది మెయిన్ డోర్ దగ్గర వేసి ఉంది. డోర్ లాక్ చేసి వచ్చి మళ్ళీ పడుకున్నా. మధ్యాహ్నం ఎప్పుడో లేచి చూస్తే అర్థమైంది నిన్న రాత్రి తను వచ్చే ముందు వరకూ రాసుకున్న కాగితాలన్నీ నేలమీద మందుతో తడిసిపోయి.. చుట్టూ కాలిపోయిన సిగరెట్, బీడీ ముక్కలు, దానికి పక్కనే తను మర్చిపోయి వెళ్ళిన తన చున్నీ కుప్పగా పడి. ఆ చున్నీ తీసుకొని మొహానిక్కప్పుకున్నా. ఇలా తనేఉంటే? ఆ ఆలోచన పూర్తీ కాకుండానే “రేయ్ సుందర్రావ్!” చెవిలో ఎవడో గుసగుసగా అన్నట్టు. నిద్రమత్తు మొత్తం వదిలిపోయి, కలల్చెదిరిపోయి, నాకు నేను మగాన్నని అర్థమైపోయి…
    ****        ****          ****             ****         ****
  వెళ్ళాల్సిన దానికన్నా రెండు గంటలు ఆలస్యంగా అడుగు పెట్టానాఫీస్లో.
పర్లేదు ఇంకా ఎడిటర్ గాడ్రాలేదు. ఇంకో పదినిమిషాల్ని స్మోకింగ్ జోన్ లో తగలేసి సీట్లో కూచున్నా. నా వైపు అదోలా చూస్తూ, మూడు నిమిషాల పాటు ముక్కుకి వేళ్ళడ్డు పెట్టుకొని ప్రాణాయామం చేసి. తన వాటర్ బాటిల్ ఖాళీ చేసింది సుమిత. నాతో సిగరెట్ మాన్పించాలి లేదా తాను ఆ సీట్ ఖాళీ చేయాలి అని తీవ్రంగా ప్రయత్నించి. పాపం రెండూ కుదరక ఇలా నేను స్మోకింగ్ జోన్ యాత్ర చేసినప్పుడల్లా కాసేపు ముక్కు మూసుకోవటం అలవాటు చేసుకుంది. కానీ తను నా ఫ్లాట్ కి వచ్చినప్పుడు మాత్రం బట్టలు వేసుకుంటూ “ప్లీజ్ బయటకి వెళ్ళి వెలిగించుకో” అని మాత్రం అనేది. అప్పటివరకూ సిగరెట్ తాగకూడదు మరి.  తను రావటానికి ముందుగానే రూమ్ ఫ్రెష్నర్ తో గది నిండిపోవాలి అన్న రూల్ కూడా తప్పని సరి. ఆలోచిస్తూండగానే
 “రాబిన్ కాఫీ!” వస్తావా అని అడిగిందో, రమ్మని చెప్పిందో అర్థం అయ్యేలోపే తాను కిచెన్ వైపు నడుస్తోంది. ఎందుకో కాఫీ తాగాలని అనిపించలేదు అలాగే కూచుండి పోయా మనసులో మాత్రం నాకు తెలియకుండానే “అమర్ షొప్న్ దేఖా రాజ్ఖొన్నా” పాట మాత్రం పదే పదే హమ్ చేయబడుతోంది. రెండు నిమిషాల తర్వాత రెండు కాఫీ కప్స్ తో తానే వచ్చింది. నా టేబుల్ పక్కనే పెడుతూ మళ్ళీ అడిగింది “సిగరెట్ కాలుచుకుంటావా? పద నేనూ వస్తాను”  సీట్లోంచి లేవగానే కొన్ని జతల కళ్ళు మావైపు ఇంట్రస్టింగ్ గా తిరిగి మళ్ళీ చూపు తిప్పుకున్నాయి.
తననే చూస్తూ ఓ సిగరెట్ కాల్చ బడింది.. వెంటనే మరొక్కటి.. తర్వాత ఇంకొక్కటీ..
“రాధిక వెళ్లిపోయిందా?”
“హ..” నాలుగో సిగరెట్ చేతిలో పట్టుకొని ఖాళీ పాకెట్ డస్ట్‌బిన్‌లోకి విసిరేసాను.
“రాబిన్! తనని ప్రేమించావా?”
“తెలీదు…”
“నాకు తెలుసు. కానీ.. కనీసం తనకు నీ ప్రేమని చెప్పి ఉండాల్సింది.”
“సుమితా! ప్రేమనీ కోపాన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అర్థమైపోతుంది. తనకు తెలుసు”
“మరి తనేమి అనలేదా? నువ్వంటే అంత ఇష్టంగానే కదా ఉంది. ఏమిటి సమస్య?” కాస్త దగ్గరికి వచ్చి ఫ్రెండ్లీగా భుజమ్మీద చెయ్యేసి. గుప్పున తాకిన హెయిర్‌స్ప్రే పరిమళం. కొద్దిగా మనసు ప్రశాంతంగా మారుతున్నట్టు అనిపించి సిగరెట్ వెలిగించటాన్ని వాయిద వేసి..
“మనవిషయం లో తనేమైనా?? “వాక్యం పూర్తి చేయకుండానే మిగతా సగాన్ని కళ్ళతోనే మట్లాడించి, అంతలోనే చూపులని పక్కకి తిప్పుకొని. ముప్పయెనిమిదేళ్ళక్రితం సుమితా మహాపాత్రో, ఎనిమిదేళ్ళకింద సుమితా రాజగోపాలన్.., ఆరేళ్లకిందట యంగ్విడో., ఇప్పుడు అప్పుడప్పుడూ నా ఫ్లాట్‌లో నాలో,నాతొ కలిసిపోయే సుమిత.
“సమస్య..ఇంతకీ ఏమిటి సమస్య? సమానత్వ సమస్య కదూ.. లోలోపలి ప్రేమలని దాటి, నాగరీక ముసుక్కప్పుకున్నా ఇంకా పచ్చి పచ్చిగా శరీరాలకు తాకే మాలిన్య సమస్య, ప్రపంచ రోదనలనీ, సమానత్వ భావనలనీ అంటుకోని, అంటరాని సమస్య. చెప్పు! చెప్పు! చెప్పుకోరా నాకొడకా!!” లోపల ఎవడో వికృతంగా నవ్వుతూ, మరింతగా మెదడంతా చిందులు తొక్కుతూ విపరీతమైన వేగంతో తాండవమాడుతూ అరుస్తున్నట్టు.
ఆరోజు., తను నాగదినుంచి వెళ్ళిన రెండో లేదా మూడో రోజు, యూనివర్సిటీ క్యాంపస్‌లో తనని కలిసి చాయ్ తేవటానికి వెళ్ళి కప్పులు పట్టుకుని వచ్చిన రోజు, వెనక నేను లేననుకొని ఆ మాట  మాట్లాడిన రోజు గుర్తొచ్చి. తనేమందీ.!? అవును ఇప్పటికీ అక్షరం అక్షరం చెవుల్లోనే ఉండిపోయి.. “యా హి ఐ లైక్ హిం, బట్ వాళ్ళ క్యాస్ట్.. నిజానికి రాబిన్ అలా ఉండడనుకో కానీ ఎంతైనా వాళ్ళతో మనం కష్టం కదా, ఎంత క్లోజ్ గా ఉన్నా, మనం ఆ క్యాస్ట్ ఫీలిన్గ్ చూపించమనుకో. కానీ….” నేను వినలేదనుకొని, తన వెనుక నేను లేననుకొని తను శ్రావ్యతో అన్న మాట. “రాబిన్ అలా ఉండడనుకో”. అలా అంటే ఎలా?? అవును అలానే. డప్పుకొట్టుకునే వాడిలా, గొడ్డుమాంసం తినేవాడిలా, చెప్పులుకుట్టిన తాతకు మనవడిలా, చుట్టవాసనేసే అయ్యకు కొడుకులా, అమ్మ మురికి చీరల ఉయ్యాల ఊగిన వాడిలా ఉండననా? అంటే, నేను నాలా ఉండకపోవటమే నాకు గౌరవమా? నేనొకప్పుడు నాలా ఉన్నానని అసహ్యమా? రాధిక.. ప్రపంచ పీడితులపక్షాన అనర్ఘళంగా మాట్లాడే రాధిక, మొదటి బానిస “స్త్రీ” అని చెప్పే రాధిక, ఎక్కడో ఆఫ్రికాలో, అమెరికాలో ఉన్న వర్ణవివక్షని తలుచుకొని కన్నీళ్ళు పెట్టే రాధిక, అంతరించిపోతున్న ఆదివాసీలని మళ్ళీ మళ్ళీ చెప్పి రోధించే రాధిక నా బెంగాలీ రాధిక. అనుకోకుండా వెనక్కి చూసి “హే రాబిన్ నువ్వు ఇక్కడే ఉన్నావా?” అంటూ తడబడినంత పనిచేసి. నేను “ఇప్పుడే వస్తున్నా అనగానే” మళ్ళీ అంతలోనే చిర్నవ్వుతూ హిపోక్రాట్ గా మారిపోయిన “రాధికా చక్రబొర్తి”. తనమీద కోపం రాకపోవటం, ప్రేమతగ్గకపోవటం ఎందోకో ఇప్పటికీ అర్థం కాలేదు. అర్థమైందొక్కటే. తనని నేను ప్రేమిస్తున్నా..తను నన్ను ఇష్టపడుతోంది. అంతే అంతకంటే ఇంకేమీ ఉండదు అని..
“రాబిన్ ఏమైంది సైలెంట్‌గా ఉండిపోయావ్.? అంటే సమస్య నేనేనా?” అనుభవం ఇద్దరిదీ అయినా తనను మాత్రమే సమస్యగా మార్చుకొని నా కళ్ళలోకే చూస్తున్న సుమిత.
“సమస్య నువ్వు కాదు సుమితా “నా పేరు”
“అంటే!!?”
తను బెంగాలీ బ్రాహ్మ్మిణ్,  నేను డీ.రాబిన్.. డప్పుల రాబిన్..  (సన్నాఫ్ డప్పుల బక్కయ్య ఉరఫ్ కర్రె బక్కయ్య అలియాస్ మాదిగ బక్కులుగాడు అన్న పదాలని బయటికి పలకలేక)
పెదాలమధ్య సిగరెట్ పెట్టుకోగానే. నవ్వుతూ లైటర్ వెలిగించిన.. సుమిత “సో! నేను నీ ఫ్లాట్ కి మారిపోవచ్చా.. విత్ లగేజ్?”
“ఉఫ్ఫ్”… అమర్ షొప్న్ దేఖా రాజ్ఖొన్నా థాకే” హమ్ చేస్తూ…
*
నరేష్కుమార్ సూఫీ

నరేష్కుమార్ సూఫీ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు