అభద్రతలోంచి పీడకలలా..

బాషా …
ఇంత గొప్ప కథ రాసిన నీకు ఏమివ్వగలను? చెమ్మగిల్లిన అశ్రునయనాలతో  ఆత్మీయాలింగనం తప్ప!

థ రాస్తే ప్రయోజనం ఉండాలని ఏకరుపెట్టేవారు! మొదట్లో అర్థమయ్యేది కాదు. మనసుకు ఏది తోస్తే అది కథ రూపంలో బహిర్గతం చేస్తాం తప్పించి.. మళ్లీ ఈ ప్రయోజనం గొడవేంటబ్బా అనుకునేవాడ్ని. పన్నెండేళ్ల క్రితం బాషా. జి. ఎస్. రాసిన “బైపాస్‌ రైడర్స్‌” కథ చదివిన తర్వాత తెలిసింది ఆ “ప్రయోజనం” గొప్పేంటో !

మనిషిని మనిషిగా ప్రేమించడం ఎలాగో నేర్పితే – కథకు అంతకు మించి గొప్ప ప్రయోజనం ఏముంటుంది? అప్పటివరకూ శత్రువుల్లా సూటీపోటీ మాటలనుకుని, ద్వంద్వ యుద్ధానికి సమాయత్తమైన మనుషుల్లో- క్రౌర్యాన్ని కాలరాచి, ఆ స్థానంలో మానవత్వాన్ని నింపితే.. కథ చదివిన పాషాణ హృదయాలు సైతం కరగవూ!
సరిగ్గా అలాంటి కథే “బైపాస్‌ రైడర్స్‌”.

2001లో అనుకుంటా, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. వేలమంది చనిపోగా, లక్షలాదిమంది క్షతగాత్రులయ్యారు. మానవత్వంతో ఎన్నో దేశాలు తమవంతు సహకారం అందించాయి. అయినా నా మనసు స్పందించలేదు. ఒకరోజు న్యూస్‌ పేపర్లో పాకిస్తాన్‌ నుంచి కచ్‌ ప్రాంతానికి భారీ సహాయంగా బియ్యం వగైరాలు వచ్చాయని తెలిసింది. తెలియకుండానే నా చెంపలు తడిసిపోయాయి!

రజాకార్ల  సమయంలో  దాశరథి రంగాచార్యగారు  నిజాం  నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం లో పాల్గొన్నందుకు  పోలీసులు బంధించారట! పాకిస్తాన్ నుండి వచ్చిన ఖాసిం అనే అధికారి బాగా కొట్టి చంపేయాలనుకున్నాడట. వాడు అటుపోగానే అఫ్జల్ అనే పోలీసు వచ్చి దాశరథి గారు ఇంకా  బతికే  ఉన్నందుకు సంతోషంగా ఫలహారం పెట్టాడట . అధికారి  కొట్టినప్పుడు ఏమాత్రం చలించని ఆయన ఆ పోలీసు చూపిన ప్రేమకు మాత్రం గుండెలవిసేలా వెక్కివెక్కి ఏడ్చాడట! శత్రుత్వం కంటే ప్రేమను తట్టుకోవడం ఎంత కష్టమో కదా!

ఇక అసలు కథ లోకి వద్దాం –

అప్పటికే బాబ్రీ విధ్వంసం, గుజరాత్‌ అల్లర్లతో ఒకరకమైన అభద్రతకు లోనైన ఒక ముస్లిం యువకుడి వైపునుంచి ఉత్తమ పురుషలో చెప్పబడిన కథ “బైపాస్ రైడర్స్ “.
ప్రారంభమే  –

“పరిగెత్తండి .. గోడలు కూలుతున్నాయి .. పునాదులు కదులుతున్నాయి .. దుమ్ము తెరలు లేస్తున్నాయి .. శతాబ్దాల క్రిందటి రాళ్ళెత్తిన కూలీల చెమట వాసన ..కుంకుమలు .. చేతిలో బల్లాలు .. త్రిశూలాలు .. వాటి చివర తెగేసిన మనుషుల తలలు ..”

అభద్రతలోంచి పుట్టిన ఒక భయంకర స్వప్నం !

ఒక మునిమాపు వేళ అతడు “బైపాస్‌ రైడర్స్‌” బస్సులో ప్రయాణిస్తూ తన కళ్లముందు జరిగిన సంఘటనల్ని దృశ్యమానం చేసి, చలనచిత్రం రూపంలో మనకు పరిచయం చేస్తాడు. రచయిత ఆ ప్రయాణికుడిలో పరకాయ ప్రవేశం చేశాడనేది నేను  మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను.

ఇందులో సమస్య సార్వజనీనం. రెండు వర్గాల మధ్య .. రగిలిన దావానలం.
అది వర్ణం కావచ్చు, జాతి కావచ్చు .. కులం కావచ్చు .. తెగ కావచ్చు .. చివరకి గోత్రం కూడా కావచ్చు !
ఈ కథ కూడా అందుకు అతీతం కాదు.
ఒక పేద ముస్లిం కుటుంబం , ఒక ఉన్నత రెడ్డి కుటుంబం – వీరి మధ్య చిన్న “మిష”పై బస్సులో రాజుకున్న వైరం చిలికి చిలికి గాలివానగా మారిన వైనం. చివరకు చిగురించిన “మనిషి తనం”తో అది ఎలా చల్లబడిందో, అలా చల్లబడటానికి ఏ రకమైన సంఘటనలు దోహదం చేశాయో రచయిత ఉత్కంఠ రేపేలా చెబుతాడు. సందర్భోచితంగా వాఖ్య నిర్మాణం కథను మరింత పరిపుష్టం చేసింది.

రెడ్డి దాష్టీకానికి ఎదురు తిరిగిన బూబమ్మ ” ఏమన్నా అట్లా మాట్లాడ్తాండావు ? నువ్వు ఎట్టిండే సీట్లల్లో ఏమన్నా కూచోనిండామా .. వూరికే ఉండేకొద్దీ గెట్టి గెట్టిగా మాట్లాడతాండాడీయప్ప ” అనడంలో ఈ మట్టిలో నువ్వూ నేనూ సమానం అని చెప్పకనే చెప్పినట్టు!

ఇంకా …

– “ముఖంపై పడ్డ ముడుతలు కన్నీళ్లను అడ్డుకుంటున్నాయి ”
–  “గాలికి అల్లాడే ముంగురులు ఇప్పుడు ఆమె నుదిటిని నాగులై కాట్టేస్తున్నాయి ..”

– “రాళ్ళ సీమలోకి రాబోయే పాపాయికి రత్న ధారలతో ఆహ్వానిస్తూ వర్షం ..”

– ” కొమ్మ మీద నిద్రపోయిన  చిన్న పక్షి అడవి అంటుకుంటుంటె బిత్తరపోయి మేల్కొన్నట్టు ..”

– ” మొగ్గ విచ్చుకునేటప్పటి నిశ్శబ్ద విస్ఫోటనం ..”

ఇలాంటి గుండె తడిపే తడి వాక్యాలు కథ నిండా ఎన్నో !

“వాన మబ్బులు విడిపోయినాయి” అంటూ కథ ముగిస్తాడు రచయిత.

నిజంగా మబ్బులు విడిపోయాయా ? మళ్ళీ ముసురుకోవా .. చదువరిలో అంకురించే ప్రశ్న !
మనిషిలో వివక్షత అనే వైరస్ పూర్తిగా అంతమయ్యే వరకూ – ఇది రావణ కాష్ఠమే !!

ఆ వైరస్ ను నాశనం చేయడానికే – ఇదిగో “బాషా” లాంటి సైంటిస్టు రచయితలు  కథల రూపంలో “డ్రగ్ ” తయారుచేసి లోకానికి అందించాలి.
రంగు, రుచి, వాసన లేని కథలు పుంజీల కొద్దీ ఎన్ని రాస్తే ఏం ప్రయోజనం? ఇలాంటి కథ ఒక్కటి చాలదా! మనిషిని మనిషిగా ప్రేమించే ఎవరైనా సరే ఈ కథ చదివి నాలుగు కన్నీటి చుక్కలు రాల్చకపోతే..  ఒహ్‌, దేవుడు మనుషులతోపాటు రాతిమనుషుల్ని కూడా సృష్టించాడనుకోవడం తప్పించి చేసేదేం లేదు!
రచయిత కథను ఎంత బిగితో అల్లాడో, రాయలసీమ మాండలికం సొబగుల పుప్పొడిని ఎలా వెదజల్లాడో, అభద్రతలో పుట్టిన అంతర్మథనం ఎలా రగిలించాడో… కథ పూర్తిగా  చదివితే మీకే అర్థమవుతుంది.

బాషా …
ఇంత గొప్ప కథ రాసిన నీకు ఏమివ్వగలను?
చెమ్మగిల్లిన అశ్రునయనాలతో  ఆత్మీయాలింగనం తప్ప!

(ఈ కథ మొదట ఆదివారం ఆంధ్రజ్యోతి 2005 ఏప్రిల్‌ 17వ తేదీ సంచికలో ప్రచురించబడింది. తర్వాత కథాసాహితి వారి “కథ- 2005” సంకలనంలో చోటుచేసుకుంది. సమయానికి ఈ  కథ స్క్రిప్ట్ అందచేసిన అక్షర సీత గారికి కృతజ్ఞతలతో .. ) 

 

*

బైపాస్‌ రైడర్స్‌

బాషా, జి.ఎస్‌.

 

 ‘‘పరిగెత్తండి. పారిపోండి. రాళ్లు మీదబడ్తున్నాయి. గోడలు కూలిపోతున్నాయి. పునాదులు కదుల్తున్నాయి. అరెరే… భూకంపం వొచ్చిందా, కొండ చరియలు విరిగి పడ్తున్నాయా. పరిగెత్తండి… మీద పడితే ఛస్తారు…

‘‘ఎవరూ వినడం లేదే. యుద్ధానికా వెళ్తున్నారు. శత్రువెవరు? ఒక పురాతన కట్టడమా? దుమ్ముతెరల్లేస్తు న్నాయి. గోడలు కూలుతున్నాయి. వాటి కిందపడి కూరుకుపోతున్నారు… చావుకేకలు… పొలికేకలా? ఆనం దమో, భయోత్పాతమో, రంగులు చల్లుకుంటున్నారు. దుమ్ముతెర తగ్గింది. శిది¸లాల్లోంచి, పునాదుల్లోంచి పురాతన వాసన. అయిదారు శతాబ్దాల కిందట రాళ్లత్తిన కూలీల చెమట వాసన. రక్తం ఎగజిమ్మిన వాసనొ స్తూందే. రంగులు. బండారు, కుంకుమలు. విజయ విహారం చేస్తున్నారు. చేతుల్లో బల్లాలు, త్రిశూలాలు. వాటి చివర తెగేసిన మనుషుల తలలు. ఛఛ… ఛ… బొళాక్‌… వ్యా…క్‌.’’

థడేల్మనే శబ్దం. మెలకువ. బస్సు, కడప-అనంతపురం బైపాస్‌ రైడర్‌. ఊరు దాటుతా ఉంది.

‘‘ఆయమ్మ కక్కుంటా ఉంటే కిటికీ ఏసినా సార్‌,’’ పక్కవాడి సంజాయిషీ. నాకూ డోకొస్తుందేమో. కల అనుకున్నా సాంత్వన లేదు. నిన్ననే జరిగినట్లు, గాయాల్లోంచి ఇంకా రక్తం కారుతున్నట్లు, పచ్చి పచ్చిగా… మళ్లీ మళ్లీ రివీల్‌ అవుతుంటుంది యవనిక పైన.

కిటికీ తలుపులు తీశాను. ముందు సీట్లో కక్కున్న ఆ అమ్మాయి నిమ్మకాయ వాసన్జూస్తాంది. మిగతా కిటికీలూ తెర్చుకున్నాయి మెలమెల్లగా. కడప ఉక్క బోత. ఈరోజు మరీ ఎండగా ఉంది. వానొస్తాదేమో. వానెందుకొస్తాదీ రాయలసీమలో. ఎందుకు రాదూ, వొస్తాది. ఎక్కువా… తక్కువా అంతే. పేపర్లల్లో వాన ల్రాలేదని, చేన్లెండిపోయాయని, ఆత్మహత్యలు చేసు కుంటున్నారని, ఎడారైపోతుందని వార్తలొస్తుంటే, భయాన్నీ, అపనమ్మకాల్నీ ప్రమోట్‌ చేస్తుంటే… నిజ్జంగా ఎడారైపోతుందని ఉన్న ధైర్యం ఇంకొంత దిగజార్తుంది. సహనం నశించి, అసహనం మొదలై… ఎదుటివాడి పైనో, వీకర్‌ సెక్షన్‌ పైనో, మైనార్టీల మీదనో ల్యాండ్‌ స్లయిడ్‌ దిగజార్తుంది.

పక్కవాడి చూపులిపుడు నా ఒళ్లోని పుస్తకం మీద… ఆకుపచ్చని పుస్తకం. వతన్‌, ముస్లింల కథలు. తెరిస్తే అక్షరాలు సరిగా లేవు. అలుక్కుపోయి తడిసి పోయి ప్రతి అక్షరం, వాక్యం కన్నీళ్లనే అద్దుకోనుంది. కళ్లు మూసుకుంటే నిద్ర… ఊహలు.

పక్క సీట్లోంచి ఒక రకమైన స్వరంలో మాటలు, ఉర్దూలో. మామూలుగా లేవవి. పొడిపొడిగా… తడితడి గా… వతన్‌లోని వాక్యాల్లా… ఆపి… ఆపి… మనసును  పిండేసే  విషయాలని  మోసుకొచ్చిన  ఉత్తరాన్ని చదివి చించేశాక, ఆ ముక్కల్ని మళ్లీ ఏరుకుని చదువుకుంటు న్నట్లు… దీనికి తోడు గువ్‌ు…మ్మనే బస్సు శబ్దం… బాధా మయరాగానికి తంబురనాదంలా!

ఎటు చూసినా బాధలే కురుస్తుంటాయి. వ్యథల మేఫూలే కమ్ముకుంటాయి కాబోలు. తెల్లటి మేఫూలు. మేఫూలు ఆడవా… మగవా. మేఫూలు ప్యాంట్లు తొడు క్కుంటే… ఐ యావ్‌ు క్లాడ్‌ యిన్‌ ప్యాంట్స్‌…

తెల్లమేఫూలు అందంగా ఉంటాయి. కానీ కురవవవి. చిత్రకారులెవరైనా వాటికి నల్లరంగేస్తే… నల్లబడితే కురుస్తాయి. పంటలు, పండగలు… రంజాన్‌ పండగ దగ్గరుంది. నయా రంజాన్‌కి ఏ కోరికలు కోరి నారో వాళ్లమ్మాయి ససురాల్‌వాళ్లు. ప్రక్కనున్న ముస్లిం దంపతుల ముఖాల్లో బాధలు గూడు కట్టుకో ను న్నాయి. తల మీద టోపీ, నెరసిన గడ్డం, తెల్లటి కుర్తా పైజామాలో  త్రీ సీటర్‌లో అతను. అతన్నానుకుని ఏదో చెబుతూ, తెల్లటి చద్దర్‌ నిండుగా కప్పుకుని… అతని భార్య అనుకుంటా. ఆ చివర కిటికీ అద్దానికానుకుని నల్ల బురఖా వేసుకుని వాళ్లమ్మాయి. నల్లటి బురఖాలో మరింత అందంగా కళ్లు మూసుకుని వుంది. నిద్ర బోతూందా లోపలి బాధల్ని కళ్ల ద్వారా బయటివాళ్లకి కనబడకుండా దాస్తోందా తెలియదు. వీళ్లిద్దరూ మాత్రం ఒకరి బాధలు మరొకరికి చెప్పుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎవరితో చెప్పుకుంటంది?

మనుషులకెందుకిన్ని బాధలు. స్వయంకృతా లేనా యివన్నీ. గట్టిగా కళ్లు మూసుకున్నా కనిపిస్తూనే ఉన్నాయి ఆ దృశ్యాలు. చూపు ఆనని కళ్లతో, నవ్వుతో సంగమించని పెదాలతో, సగం కాలిన శరీరాలతో, పూర్తిగా కాలిపోతున్న గుండెలతో… కరువూ, బీదరికమూ కప్పుకుని…

జీవితం మొదలుబెట్టిన ఏ నాల్రోజులుంటాయో సంబరాలూ, సంతోషాలూ…

యివేమీ పట్టనట్లు బైపాస్‌ రైడర్‌…!

ఎర్రగుంట్ల వచ్చింది.

అంతవరకూ బస్సు లోపల కమ్మీకి ఉరేసుకు న్నిలబడిన శాల్తీలన్నీ దిగిపోయాయి. ఉరిశిక్ష రద్దయిం దేమో.

నా ముందరి సీట్లోంచి ఒకాయన దిగిపోతే అంత దాకా అంటీ అంటనట్లు కూచోనుండిన ఆంటీ వెనక్కి తిరిగి తొండాబిక్కి పిలిచినట్లు ఎవర్నో పిలిచింది. ఖద్దరు బట్టలాయనొచ్చి బరువుగా, జంభంగా కూచున్నాడు. ఆ బరువుకి నా ముందరి సీటు మూలిగింది. ఆమె ఏదో అంటోందాయనతో. తలొంచి విని పక్కనున్న సాయిబు వైపు ఒక రకంగా చూస్తున్నాడు. ఆమె ఇంకా ఏదో అంటూంది. మళ్లీ చూశాడు. మీసాలు కోపంతో మెలి దిరిగినాయి. యిది గమనించిన నా పక్కలో బల్లెం గాడు, ‘‘ఏం రెడ్డీ… శానా కోపంగుండావు…’’

పరామర్శా… ఎగదోస్తున్నాడా…

‘‘ఎనక సీటుంది పోయి కూచ్చో నేనిక్కడాడోళ్ల దగ్గిర కూచుంటానంటే లెయ్యలేదంటాయప్ప.’’

‘‘ఆ యప్ప లేస్తా వుంటే లెయ్‌నీ లేదన్నా ఆయమ్మ…’’ ముక్కెగబీలుస్తా కసినంతా, దాచుకున్న కోపమంతా కళ్ల నుంచి బయటికొస్తుంటే, పై పెదవి మీది చెమట దాన్ని దఖలు పరుస్తోంది.

మిర్రి మిర్రి చూస్తున్న రెడ్డి… వీళ్లనే గమనిస్తూ చుట్టూ నిలబడిన వాళ్లు… ఏదో అంటూంది బూఅమ్మ. సాయిబూ ఏదో అంటున్నాడు. తలమీది టోపీని సర్దు కుంటూ, గెడ్డంలో వేళ్లు జొనిపి గీరుకుంటూ.

‘‘లేచింటే నీ గంటేమన్నా పోతాన్యా…’’

జోగుతున్న వాళ్లందరూ యిటు తిరిగినారు అటెన్షన్లోకొచ్చి!

బూఅమ్మ ఏదో చెప్పబోయింది. సాయిబు ఏదో అంటున్నాడు. వొద్దంటున్నాడా… వాదిస్తున్నాడా… అణగి వుండాలనా…

ఆ అమ్మాయి నిటారుగా అయ్యింది. బురఖాని మొగమ్మీదికి నిండుగా లాక్కుంది, భయం భయంగా చూస్తూ. కొమ్మ మీద నిద్రబోయిన చిన్ని పక్షి అడివంటు కుంటాంటే బిత్తరపోయి మేల్కొన్నట్లు. అంతలోనే… ముడుచుకుపోయింది… దగ్గర సీట్ల వాళ్లు, నిలబడిన వాళ్లు తమనే చూస్తున్నారనేమో.

వొద్దు… వొద్దొద్దు… అలా కుంచించుకుపోవద్దు… ముష్కర మూకలు నీ అంగాంగాల్లో శూలాలు గుచ్చు తారు… మీ పిల్లల్ని గర్భాల్లో ఉన్నా సరే… తెగ నరికి చువ్వలగ్గుచ్చుకుని కరాళనృత్యం చేస్తారు… తరిమి తరిమి చంపి శవాల ఆనవాలు కూడా లేకుండా చేస్తారు… బల్కిస్‌… నీ కళ్ల ముందరే పన్నెండుమందిని, నీ వాళ్లని చంపి పాతరేస్తే… ఆ శవాలు నీ వాళ్లవంటే నమ్మే నల్లకోట్లున్నాయంటావా…?

నా పక్కనున్న వాడెందుకో అసహనంగా కదుల్తు న్నాడు. వాడికే ఆలోచనలొచ్చాయో, లేక వాడి యిగో శాటిస్‌ఫై కాలేదేమో ఏమీ జరగలేదని.

చద్దర్‌ కప్పుకుని, తలొంచుకుని బూఅమ్మ కోపంగ చూస్తా వుండే రెడ్డి కళ్లల్లోకి. మాటిమాటికీ భయంగా తొంగి చూస్తా సాయిబు. లోతు నీళ్లల్లో తళుకుమని  మెరిసే  చేపపిల్లల్లా బురఖా లోంచి ఆ  పాప కళ్లు.

‘‘ఆయమ్మ నిబ్బంది పెట్టిందిగాక యింగా ఏమట్లా సూచ్చాండావు ఎవురనుకొనిండావు రెడ్డిని,’’ వాడి మాటల కంటే ముందు వురికింది రవ్‌ు వాసన.

‘‘ఎవురయితేనేమన్నా. నేనేమన్నా తప్పుడు పన్జేసి నానా యిపుడు.’’

‘‘నోర్మూస్కోని కూచో తురక నా కొడకా. ఆడ మనిషి నాడ కూచోబెట్టింటే మీయమ్మ గంటేమన్నా పోతాన్యా. కర్సుకోని కూచోకుంటే,’’ లేవబోతూ రెడ్డి… శాలువా సర్జేసుకుంటా… నిజ్జంగా లేసింటే తన్నిండే వాడేమో. కళ్లల్లో అట్లాంటి కోరికే సుళ్లు తిరుగుతూ న్నట్లుంది.

‘‘ఏమన్నా అట్లా మాట్లాడ్తాండావు? బస్సొస్తానే సీట్లు పట్టుకుని కూచోనిండాము. నువు ఎట్టిండే సీట్లల్లో ఏమన్నా కూచోనిండామా, కర్సుకోని కర్సుకోని అంటాం డావు. ఇపుడు నువు కూచోనిండ్ల్యా నీ పెండ్లాం పక్కన. అట్లే మేమూ. వూరికే వుండేకొద్దీ గెట్టిగెట్టిగ మాట్లా డ్తాండాడీయప్ప,’’ లేచి నిలబడింది బూఅమ్మ.

అమ్మా! పర్లేదే!!

‘‘ఏయ్‌, కూచో సాలుగాని. బలె మాట్లాడ్తాండావు. నీ పెండ్లాన్ని నోర్మూస్కోమను. పోనీలే అని ఊర్కో నుంటే…’’ లేచి నిలబడ్డాడు రెడ్డి. కొంచెం తలొంచుకు న్నిలబడినాడు, సరింగ నిలబడితే బస్సు టాపు తగు ల్తుందనేమో.

‘‘ఏం చేస్తావురా నువ్వు. రెడ్డివైతే నీ వూరికి రెడ్డివి.’’

‘‘కూచోబెట్టువాయ్‌ నీ పెండ్లాన్ని. లేదంటే నిన్ను దంతాను సూడు ముందుగాల. ఇంగో మాట మాట్లా డితే మీ శవాలు తాడిపత్రిగ్గూడా సేరవు. ఏమనుకోనిం డారో… మీయమ్మ…’’

‘‘కూచోమ్మా కూచో. సాలుగాని, యింగా యాల నిలబడిండావు.’’

చుట్టుపక్కల సీట్లల్లోని సానుభూతిపరులు!

తేరుకున్న సాయిబు గబుక్కున్లేచి బూఅమ్మని సీట్లోకి దొబ్బి ఆయమ్మ మెడ వంచి దభేలుమని గుద్ది నాడొక గుద్దు వీప్మింద.

‘‘యా అల్లా,’’ అరిచిందో… పిలిచిందో… మొర పెట్టుకునిందో…

‘‘బాబా…’’ ఆ పాప బూఅమ్మని లాక్కుని, పొదువుకొని, భయంగా వాళ్ల నాన్ననే చూస్తా… కొట్టొద్దని పల్కకుండా పల్కుతా.

బస్సు సడన్‌ బ్రేకుతో ఆగిపోయింది. లైట్లన్నీ వెలిగినాయి. ఇంటి నాలుగ్గోడలి మధ్య విషయం బట్ట బయలైనట్లు.

‘‘రైట్‌! రైట్‌…’’ కండక్టరు అరుపు.

మళ్లీ పరుగందుకున్న బైపాస్‌ రైడర్‌.

అంతా రైట్‌గానే ఉందా? నిజ్జంగా… అంతవరకూ కప్పుకున్న పల్చటి తెల్ల చద్దర్‌ కిందికి జారిపోయింది. బట్టబయలైంది పేదరికం. ఖర్చయిపోయిన అమ్మ తనం.

పల్చటి, తెల్లని శరీరం. రక్తమంతా ఖర్చయి పోయిన తెలుపా అది. భుజాల క్రుంగిపోయి వొదులై పోయిన జాకెట్టు. నగలెయ్యలేదని అలిగిన మెడ, పైకి తేలిన కాలర్‌ బోన్స్‌. చెవులకున్న కమ్మలు మిగిల్చిన రంధ్రాలు. ఏం మిగిలున్నాయమ్మ దగ్గిర, కన్నీళ్లు తప్ప! కన్నీళ్లని కూడా అడ్డుకుంటున్నాయి ముఖంపై పడ్డ ముడుతలు. సాఫీగా జారనీకుండా, హర్డిల్స్‌. ఎన్ని హర్డిల్స్‌ని దాటాలో ఇంకా.

‘‘అప్పుడే ఈనా కొడుకుల్ని పాకిస్తాన్‌కి తరిమే సింటే బాగుండు…’’ రెడ్డి ముక్తాయింపు. ముగింపా… వందన సమర్పణా… తొలిపలుకులా… ఉలిక్కిపడి నాను.

బిచ్చగాడి బొచ్చెలో చిల్లరలా.

‘ఎంత మాటన్నాడు. తెరతీద్దామా? లేద్దామా? కలుపుదామా మాటకు మాట. గెలుపోటములు? అంతర్మథనం ఏమీ మొదలుపెట్టకనే రిజల్టు గురించి ఇంత ఆలోచనా, విచక్షణా? చాతగానితనమా. నాక్కాదు జరిగిందనే భావనా… సహనమా… థూ.’

బస్సులోని వాళ్లని, వాళ్లమ్మా నాన్నల్ని మార్చి మార్చి చూస్తోందా అమ్మాయి. అందరూ తమ లోపలి చాతగానితనాన్నే, పరాయితనాన్నే చూస్తున్న భావన.

బీదరికమూ, సర్దుబాట్లూ, అత్తింటి కొత్త పోరు తప్ప జీవితంలో ఇంకేమీ తెలియని ఆ పాపకి పుట్టిన గడ్డ మీద తామెట్లా పరాయివాళ్లయినారో అర్థం కావడం లేదేమో.

గాలికి అల్లాడే ముంగురులిపుడు ఆమె నుదిటిని నాగులై కాటేస్తున్నాయి.

నిశ్శబ్దమావరించుకుంది. టకటకమని శబ్దం చేసే కిటికీ అద్దాలు కూడా ఊరకుండి పోయినాయి. గుమ్మటాలు కూలే ముందరి నిశ్శబ్దం. శబ్దమెక్కువై ఏమీ వినపడని స్థితి… గాలి వీస్తోంది. పాపకార్యం నిర్వి ఘ్నంగా జరిగినందుకు ఊళ వేస్తున్న దెయ్యంలా.

ఊరకుండాలి నేను. ఊరకుంటే మంచిది. ఊర గాయ… ఆవకాయలోని కారం నషాళానికంటినా గొంతు పెగలకూడదు మందిలో. బంతిలో రిలాక్సయి… నేనా రిలాక్సయింది. ఇంతవరకూ బిగుసుకున్న చేతి వేళ్లు, పంటిగాటు బద్ద కింది పెదవి…! ఇంకో వూరు ఏదో ఇంకుతోంది దృష్టిలో. కొంతమంది దిగేసినారు. మళ్లీ కొంతమంది ఎక్కినారు  బస్సులోకి.  ఆ ఎక్కి నోళ్లు హిందువులో, ముస్లిములో. హిందువులు మాత్రమే ఎక్కండి అని కండక్టరు అంటే… కల్లోలమైన మనసు. చీకటావరించి, చంద్రునిపై ముసురుకుం టున్న మేఫూలు.

సాగిపోతూ బైపాస్‌ రైడర్‌.

తెల్ల చద్దర్‌ కప్పుకుని కూచున్న శవంలాగుంది బూఅమ్మ. తలొంచుకుని సాయిబు. తల్లి వేషమేసిన చిన్నమ్మాయిలా ఆ పాప. వాళ్లమ్మని దగ్గర్తీస్కుని.

బస్సు మంగంపేట లెవెల్‌ క్రాసింగ్‌ దాటింది. స్పీడ్‌ బ్రేకర్ల ధాటికి ఆలోచిస్తున్న వాళ్లు,  కలలుగనే వాళ్లు, నిద్రబోతున్న వాళ్లు బస్సులో ఉన్నామన్న స్పృహలోకొచ్చారు.

‘అమ్మా,’ అన్న కేక! ఎక్కడో దూరాన్నుంచి కాదు, బస్సులోంచే. ముందరి భాగంలోంచే. బోరుబావిలో పడ్డ బిడ్డ కేకలా… ‘అవ్మ్‌ు…మా…’

బస్సు ముందరి భాగంలో గలాటా. కండక్టరు వెళ్లి ఏదో మాట్లాడ్తా వెనక్కి ఎవరి కోసమో చూశాడు. రెడ్డి, రెడ్డి పెండ్లాము గాభరాగా లేచి వెళ్తున్నారు. సీట్ల కమ్మీలు పట్టుకుని వంగి నడుస్తా రెడ్డి… గూని వచ్చిన వాడిలాగా రెడ్డి… బస్సు ఆగుతోంది. సీట్లల్లోని వాళ్లు లేచి చూస్తున్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏదో జరుగబోతోంది. సంది¸ంగ్‌ రాంగ్‌. బస్సు ఆగింది. డ్రైవరు లేచి ఇటు చూస్తా… మళ్లీ డ్రైవింగ్‌ సీట్లో కూచుని స్పీడుగా పోనిస్తున్నాడు.

రెడ్డి కూతురేమో ఆ అమ్మాయి. రెడ్డెమ్మ ఆ అమ్మాయి తల నిముర్తుంటే ఏడుస్తుందా అమ్మాయి. విపరీతమైన బాధ పెదాల్లోనే దాగుందన్నట్టుగా బిగ బట్టింది. కళ్ల నుంచి జారిన కన్నీళ్లు పెదాలకు చేరి వాటి పట్టు సడలిస్తున్నాయేమో. విడివడి మళ్లీ బిగుసు కుంటున్నాయి. నిలబడ్డానికి ప్రయత్నిస్తా. నిలబడలేక కూచుంటా.

నేనూ లేచి నిలబడ్డా నుండబట్టలేక. నాతోపాటు మరికొందరు. అయ్యో ప్రెగ్నెంటా అమ్మాయి!  కుదుపు లకి పెయిన్సొచ్చాయేమో. ‘అమ్మా,’ అంటూ వాళ్లమ్మని కావలించుకుంటోంది. తనను గన్న ఆ యమ్మ గుండె ల్లోంచి కొంతైనా ధైర్యం ఆ అమ్మాయికి పాస్‌ అయుం టుంది. తొందరగా తాడిపత్రికి చేరుకుందామని చాలా వేగంగా సాగిన బస్సు స్పీడు తగ్గి ఓ చోట ఆగిపోయింది. లైట్లన్నీ వెలిగినాయి బయటి చీకటినెక్కువ చేస్తూ.

బస్సు ముందరి సీట్లల్లోని వాళ్లు వెనకకొస్తు న్నారు. కొంతమంది బస్సు దిగబోయి, ‘చినుకులు పడ్తుండా,’యని మళ్లీ లోనికొచ్చినారు.

‘‘పాపం… ఎట్లాంటి పరిస్థితొచ్చింది ఆడ కూతురికి. నొప్పులొచ్చినాయి. అంత ఇదిగా బస్సుల్లో ఎట్లా పిలుచుకోనొస్తారు. ఎట్లా ఏమైతాదో ఏమో,’’ వెనక్కొస్తున్న పెద్దాయన, బూఅమ్మ దిక్కు చూస్తా అన్నాడు.

‘‘వ్యాక్‌… వ్యాక్‌…’’ కక్కుంటుందా అమ్మాయి. కొంచెం తెరచిన కిటికీలోంచి తలబైట పెట్టి లోపల బాధనంతా కక్కేయగలిగితే బాగుండు. చేతులు నులుముకుంటూ రెడ్డి, ఏడ్పుకు ఇంచి దూరంలో రెడ్డెమ్మ! చినుకులెక్కువైనాయి. మట్టివాసనొస్తోంది. కిటికీల అద్దాలన్నీ మూసేస్తున్నారు. మట్టివాసన్తో కలిసి మరింకేదో వాసన. ఉక్కపోత.

బూఅమ్మలో కదలిక. ఆ వైపుకు అడుగులేసింది. తడబడ్తూ కాదు. దారిలో నిలబడ్డ వాళ్లు ఎందుకో అడ క్కుండానే తొలగిపోయి దారిస్తున్నారు. ఆ పాప దగ్గరికి చేరుకుంది తెల్ల ముసుగేసుకుని. నా పక్క కూచోనుండే వాడు బూఅమ్మ కూతుర్ని చూస్తున్నాడు. ఫూటుగా వాడి చూపులు. వీడికే అవకాశం దొరికితే ఇక్కడే జరిగి పోతాయన్నీ…

గుజరాత్‌కే వెళ్లాల్సిన పన్లేదు.

వెనక సీట్లో ఎవడో కిటికీ కొద్దిగా తెరిచి సిగరెట్టు వెలిగించినాడు. నలుగురైదుగురి కసుర్లు… తుఫుక్కు నూసేశాడు. బస్సంతా రొద. చెమట కంపు. మరేదో వాసన. బయట ఎక్కువైన వాన. చాలా అసహనంగా, అసహ్యంగా, కంగారుగా, ఏవేవో కలగలుపుకుని.

దిగుదామంటే వానొస్తోంది. దిగేసి బస్సు చాటు న్నిలబడినా బాగుంటుంది. బూఅమ్మ కూతురివైపు చూసి ఏదో తెమ్మంటూంది. ఆ పాప ఒక బ్యాగు తీసు కుని అక్కడికి చేరుకుని కొన్ని చీరలు తీసింది. డ్రైవర్‌ వెనక సీటు నుండి నాలుగైదు సీట్లను కలుపుతూ ఒక క్యాబిన్‌ తయారుచేసింది. నా చిన్నప్పటి దృశ్యం. సాయిబులాడోల్లు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురెదురు సీట్లను కలిపి ఇలా క్యాబిన్‌ తయారు చేసేవాళ్లు పరదాలతో.

క్యాబిన్‌లో సీటు మీద పడుకుని రెడ్డి కూతురు బూఅమ్మ చద్దర్‌ని తలమీంచి భుజాల దాకా చుట్టుకుని ట్రెయిన్డ్‌ నర్స్‌లా. డ్రైవరు, కండక్టరు బస్సు దిగేయ మంటున్నారు అందర్నీ. అయిష్టంగానైనా దిగేశారం దరూ. ఓ చిన్నమ్మాయి, ఆ పాప తమ్ముడు బస్సులోనే ఉండిపోయినారు బితుకు బితుకుమంటూ.

సిగ్గుపడ్తోందో ఇంతమందిని ఇబ్బంది పెట్టినా ననే భావనో, తన స్థితిపై తనకే అసహ్యమో తల విదిలిం చేసింది ఆ అమ్మాయి.

బూఅమ్మ మావైపు చూసింది. పదండి పదండి అంటూ రెడ్డి, నేను, డ్రైవరు, కండక్టరు దిగేశాము వానలోకి.

బస్సు లోపల బూఅమ్మ వాళ్లు. ఆ అమ్మాయి కడుపులో పాపాయి… ఎంతమంది ఉన్నట్లు బస్సు లోపల?

వర్షం!

రాళ్లసీమలోకి రాబోయే పాపాయికి రత్నధారల్తో ఆహ్వానిస్తూ వర్షం! మెరుపుల వెలుగుల్లో మనోహర దృశ్యం!

చెట్ల, కొండల చుట్టూ వర్షపుధారల దారాల్తో తయారుకాబడ్డ మరో పెద్ద క్యాబిన్‌. అక్కడ ప్రకృతి కాంత ప్రసవిస్తోందో. ఏ అద్భుత జలనిధి ప్రభవిస్తోందో.

బొట్లుబొట్లుగా కలుపుకొని, పాయలై, వంకై, ఏరై ఎదిగి ప్రవహిస్తోందో!

చెంపక్కొట్టినట్లు కొడ్తోంది వర్షపు తెర ఉన్న ట్టుండి. కుండల్తో కుమ్మరిస్తున్నట్టుగా ఉంది. చుట్టూ దగ్గిర్లో ఒక్క చెట్టయినా లేదు. అయినా చెట్టేం ఆసరా యిస్తుందీ వానలో. వాన పుటుకు మాను పుటుకు. పుటుకు పుటుకు. పుట్టుక కోసం తన్నుకుంటున్న శిశువు. పాపం ఆ అమ్మాయెంత బాధపడుతోందో. బూఅమ్మ చాతనౌతుందా ఏమో… స్త్రీత్వంపై విరక్తి కలిగే క్షణాలేమో అవి!

వానలో తడుస్తూ పాసింజర్లు, బస్సు కింద దూరి కొందరు. సిగరెట్లు తాగుతూ… కొందరు…

ఓ ముసిలాయన బస్సుని చుట్టొచ్చి వొణు కుతూ, నా దగ్గరికొచ్చి ఏదో అంటున్నాడు. నేను ముస్లిం నని వాడికి తెలీనట్లుంది… ఛ… ఛ… అన్నీ మరిచి, అంతా ఒక్కటై ప్రకృతిలో తడుస్తూ కూడా ఇంకా ఈ పాడు ఆలోచనలు. సగటున వెయ్యి తలపులొస్తా యంట మనిషికి రోజుకి. మంచివెన్నో, చెడువెన్నో, జంతువులకెన్నో…!

దూరంగా మినుకు మినుకుంటూ ఓ పల్లె. అక్కడికెగిరిపోతే… ఆశ… ముందూ వెనకా బస్సు లారీ ఏదీ రావడంలేదు. వాన జోరుకి ఆపేస్కోనింటారేమో.

ఏదో టెన్షన్‌. అనీజీ… గజిబిజి… పరిస్థితి కొంచెం మారితే… ‘అమ్మా,’ కేక బస్సులోంచి. వెంటనే కసికందు గొంతు. సంతోషానికి సంకేతమన్నట్లు బస్సు లోప ల్నుంచి గాజుల గలగలలు. నిముషం తర్వాత కొంచెం తెరచి వున్న డోర్‌ తోసి తలబైటపెట్టి బూఅమ్మ గబుక్కున వెనక్కి తీస్కుంది. మళ్లా కొంచెం దగ్గరికొచ్చి, ‘‘మొగపిల్లోడప్పా… మొగపిల్లోడు…!’’ చిట్లించిన మొగంలో కూడా సంతోషం కనిపిస్తోంది.

‘మొగపిల్లోడు… వాడు పెద్దోడై… ముస్లిములపైకి ఇంకో అస్త్రం…’ ఈ వాన్నీళ్లతో నా మెదడ్ని కడుక్కుంటే…

చెల్లాచెదరై, గుండ్రాల్లా నిలబడిపోయున్న జనాలు గునగునమని దగ్గరైనారు. చలికి పళ్లు బిగించి, పెదాలు మాత్రం కదిలిస్తూ గుసగుసలు.

‘‘రెడ్డెన్నా…’’ మరో పిలుపు.

ముఖంపైకి కురుస్తున్న సూదుల్లాంటి చినుకుల్ని చేత్తో లాగేసుకుంటూ, కళ్లు చికిలించి ఇటు తిరిగినాడు రెడ్డి. బస్సులోంచి పడే వెల్తుర్లో సగం మొగమే కనబ డ్తుంది. ఆ సగంలోనే అలజడి కొంత…

‘‘బ్లేడ్లు, చాకులు యాడ దొర్కుతాయప్పా యిపుడీ యడివిలో…’’

‘నా దగ్గరుంది కదా… షేవింకిట్లో…’

బస్సెక్కినాను. వెచ్చగా అయ్యింది, అమ్మ గర్భం లోకి మళ్లీ ప్రవేశించినట్లు. ఏదో వాసన. చిలుము వాసన. కోడిగుడ్డు వాసన. జీవం మొదటిసారి వెదజల్లే వాసన. దుర్భరంగా, అసహ్యంగా, చిత్తడిగా, బురదగా. బురదలోంచే గదా తామర పుడుతుంది?

వానచినుకులు బస్సు మీద పడి చిట్లిపోయే శబ్దం. బూఅమ్మ చేతుల గాజుల శబ్దం. హోరుమనే గాలి శబ్దం, ఇన్ని శబ్దాలున్నా ఆవరించుకున్న నిశ్శబ్దం!

దాన్ని చీలుస్తూ కేరుమనే శబ్దం. మొగ్గ విచ్చుకొనే టప్పటి నిశ్శబ్ద విస్పోÛటనం. ట్రిమ్మింగ్‌ సిసర్స్‌ని ఉడుకు లోన్‌తో కడిగి రెడ్డమ్మ చేతికిచ్చి మళ్లీ వానలోకి.

‘‘సర్లేండప్పా… పోదాంలెండి. కొండాపురమెంత దూరముంది. ఊర్లోకే ఇడిసొస్తాము. లేటయిపోతాదని మీరెవురూ అనకపోతే. అయిదారు మైళ్లే గదా…’’ డ్రైవరు అంటున్నాడు, కండక్టరు పక్క చూస్తూ. ఒంటినంటు కున్న బస్సు లోపలి వాసనని, చేతులకంటిన ఉడుకు లోన్‌ని చినుకుల్లో కలిపేస్తూ, చిత్రమైన అనుభూతిలో నేను. ఇంకొంచెం ఎక్కువైన వాన పుటుకు.

‘‘ఇంగ లోపల్కి రాండప్పా…’’ బూఅమ్మ పిలుపు.

గబగబా ఎక్కిపోతున్నారందరూ. నిండా మునిగీ…

బయటే బాగుంది. లోపలంతా వాసన. కిటికీలు తెరిచేకి లేదు. డ్రైవరు టవాల్తో తన మొగాన్ని, బస్సు అద్దాల్నీ తుడిచి సీట్లో కూచున్నాడు తడిసిన, బిగుసు కున్న చేతుల్ని తొడల మధ్య పెట్టుకుని. కండక్టరేదో కెలుక్కుంటున్నాడు.

తడిసిపోయిన క్యాష్‌బ్యాగ్‌లో కాయిన్ల గల గలలు!

బందీలైయున్న ఎన్నో ముఖాల, తోకల గుస గుసలు!

నా ముందర రెడ్డి!

బూఅమ్మ తన మెత్తటి చద్దర్‌ని బిడ్డ చుట్టూ ఒత్తుగా చుట్టి, మురిపెంగా చూస్తూ…

‘‘ఇదిగో రెడ్డీ… నీ మనవడు… నీ  మాదిరిగనే ఉండాడు సూడు… తీస్కోన్నా… జాగర్త. జారిడిసేవు. వొనుకుతుండావు వాన్లో తడిసి…’’

రెడ్డి చాలా జాగర్తగా పిల్లోన్ని తీస్కోని, ఓసారి బూఅమ్మ దిక్కు చూసినాడు. ఏదో అనబోయినాడు. మాటల్రాలా. పెదాలదుర్తున్నాయి. చలికో… మరి దేనికో…

బూఅమ్మ డోర్‌ తెర్చుకుని కిందకి దిగింది.

‘‘అందరూ బస్సెక్కింటే ఈ యమ్మేల కిందికి దిగతాంది వాన్లో…’’

అందరి దృష్టీ ఆయమ్మిందే…

ఏట్లోకి నడిచినటుల నడిచిపోయింది బస్సొదిలి. పైకోసారి చూసి ఏదో పలుకుతూ దోసిలి పట్టి మొగం కడుక్కుంది. బోసి మెడా, చేతులు, భుజాల్నీంచి చేతు ల్కదిలిస్తూ, ‘వజూ’ చేసింది. నిమిషాల్లో తలమీంచి కాలివేళ్ల దాకా తడిసింది. కాదు స్నానం చేసింది. గుసుల్‌ స్నానం! ఏదో పలుకుతూ కళ్ల మీంచి పెదాల వరకూ చేతి వేళ్లని తాకిస్తూ చలికి బెదరకుండా నిబ్బరంగా బస్సెక్కి వచ్చి తన సీట్లో కూచుంది. అందరూ ఆ యమ్మినే చూస్తున్నారు.

మరింత తెల్లగా బూఅమ్మ. వాన్నీళ్లు కళ్లకున్న సుర్మాని కడిగెయ్యలేదు.

చిన్నగా వొణుకుతోంది బూఅమ్మ.

రెడ్డొచ్చి భుజమ్మింది శాలువా తీసి బూఅమ్మకి కప్పినాడు నిండుగా. బూఅమ్మ పెదాలు చిన్నగా కదిలినాయి.

‘యా అల్లా,’ అనిందా… ‘అన్నా,’ అని షుక్రియా తెలిపిందా… రెడ్డినోసారి చూసింది బూఅమ్మ శాలువాని మరింత దగ్గరగా లాక్కుంటూ- నుదుటి మీద అంటు కున్న ముంగురుల్ని సవరిస్తూ సాయిబు. తలపై కప్పుకునే బురఖా చున్నీతో వాళ్లమ్మ మొహమ్మీది తడిని తుడుస్తూ వాళ్లమ్మాయి.

రెడ్డి బూఅమ్మకి శాలువా కప్పుతోంటే అందరి గుండెలూ వెచ్చనైనాయి! సాక్ష్యంగా ప్రతివాడి కంటా కొంత తడి! బస్సు రివర్సయి కొండాపురం వైపు కదిలి పోతూ… ఎన్నడూ వూళ్లోకి రాని బస్సు. లోపలికి… పల్లె లోపలకి… మూలాల్లోకి… గుండెల వెచ్చదనంలోకి!

వాన మబ్బులు విడిపోయినాయి.

చంద్రుడు తనలోని మచ్చల్ని కడుక్కుందా మనేమో… మేఘపు తునకల్లో స్నానిస్తున్నాడు దూరి దూరి.

పరుగెత్తే అడుగుల చప్పుళ్లు, దుమ్ము తెరలూ లేవిప్పుడు!

వానొచ్చింది గదా!

 

ఆదివారం ఆంధ్రజ్యోతి, 17 ఏప్రిల్‌ 2005

గొరుసు

గొరుసు

కథల ఆనుపానులన్నీ తెలిసి, కలం మాత్రం విప్పని పిసినిగొట్టు గొరుసు. తెలుగు కథా సాహిత్యానికి walking encyclopedia.

28 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత్వం మాటున అభద్రతా భయం పొంచి ఉంది మేడం. అందులోంచి లావాలా పెటిల్లున ఎగజిమ్మిన అక్షర తూటాలివి. స్పందించినందుకు ధన్యవాదాలు.

 • మానవత్వాన్ని మించిన మతం మరొకటి లేదని మరోసారి ఎలుగెత్తి చెప్పిన ‘బాషా’ గారికి నెనర్లు. స్వార్థపరులు, ఛాందసులు ఎగదోసే ఈ మత వైషమ్యాల జ్వాలలను ఆర్పడానికి ఇలాంటి కన్నీటి సంద్రాల కథలు మరిన్ని అవసరం ఈ సమాజానికి. ఇంత మంచి కథను పరిచయం చేసినందుకు ‘గొరుసు’ గారికి ధన్యవాదాలు.

  • థ్యాంకూ మురళీ .. మతం మత్తుమందు అన్నాడు మార్క్స్ . ఆ మత్తు దిగే వరకు ఇలాంటి కథల అవసరం ఉంటూనే ఉంటుంది.

 • అమ్మతనం ఖర్చయిపోయిన బూఅమ్మ, సొంత గొంతుకను కోల్పోయిన సాయిబు, తమ లోపలి చాతగానితనాన్నీ పరాయితనాన్నీ చూస్తున్న మనుషుల వంక చూపులు మరల్చలేని పాప, నిలువెత్తు దర్పాన్ని మీసాల మాటున దాచుకుని మిర్రి మిర్రి చూపులతో రాజ్యం చలాయించాలని చూసే రెడ్డి… ఇంకా సమస్త లోకాన్ని ప్రతిఫలించే విభిన్న శరీరాలను లాక్కెళ్ళే ఒక బస్సులో… ఎంత అద్భుతాన్ని ఆవిష్కరించారు! ఏ మజిలీలో ఏ తరహా వాక్యాల్ని పొదగాలో, సంక్లిష్ట భావనల నేపధ్యాన్ని ఏ మేరకు చైతన్య స్రవంతిలో నడపాలో రచయితకు చాలా స్పష్టత ఉంది. మకిలి పట్టిన మనసుల్ని కాసేపైనా వర్షంలో ఉతికి ఆరేయడం ద్వారా రచయిత నిజమైన ప్రయోజనం దిశగా విలువైన అడుగులు వేశారు. కథ పూర్తయ్యేసరికి మన కన్నీటిని వాన నీటితో మమేకం చేసిన బాషా గారికి అభినందనలు. ఇంత మంచి కథను పరిచయం చేసిన గొరుసు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు- ఎంవీ రామిరెడ్డి

  • కథను సూక్ష్మంగా అర్థం చేసుకుని స్పందించినందుకు ధన్యవాదాలు ఎంవీ రామిరెడ్డి గారూ. మర్రి వేళ్ళలా వ్యవస్థలో పాతుకుపోయిన మతం, కులం, మూఢ నమ్మకాలవంటివి సమసిపోయేవరకు పోరాటం తప్పదు మరి.

 • చాలా గొప్ప కథ. మంచి కథలు పట్టడంలో, భుజాన మోయడంలో ఎప్పుడూ ముందుండే గొరుసు గారు
  పరిచయం చేసిన ఈ కథ నిజంగా గొప్ప కథ. చిత్రం గా తెలుగు కథకూ వానకూ విడదీయరాని బంధం ఉంది. కథ ఎంత గొప్ప గా ఉందో ….కథనం అంతకన్నా గొప్పగా ఉంది. గొరుసు గారి పరిచయమూ అంతే గొప్పగా ఉంది. గొరుసు గారు మరిన్ని మంచి కథలు అందించాలని … డిమాండ్ చేస్తున్నాము.

  • “డిమాండ్ చేస్తున్నాము ”
   తమరితో పాటు ఇంకా ఎందరున్నారో 🙂
   ఒకరే పరిచయం చేస్తే మూస వస్తువులే వస్తాయి. మీలాంటి వారు సైతం ఒక చెయ్యి వేస్తే మరిన్ని మంచి కథా పరిచయాలు వెలుగు చూస్తాయి. చించండి .. ఆలోచించండి !

 • మనసుకు ఏది తోస్తే అది కథ రూపంలో బహిర్గతం చేస్తాం … !
  అదే చేసాడీ కధకుడు. దాదాపు పదిహేనేళ్ల క్రితం కథ, గుర్తుండిపోయే కథ! అదే ప్రయోజనం.
  కథకుడు భాషా కి అభినందనలు
  చక్కని కథని పరిచయం చేసినందుకు గొరుసు కి థాంక్‍లు.

  • స్పందించినందుకు మీకు కూడా థాంక్స్ లు అనిల్ గారూ 🙂

 • రాతకు సార్థకత ఇలాంటి కథ చదివినప్పుడు గానీ అర్థం కాదు.
  మనల్ని మనం చంపుకుని ఇదే శరీరంలో మోసం ద్వేషం ఎరుగని పాపాయిలా కొత్త మనిషిని పుట్టించుకోవడానికి ఇలాంటి కథ చదవాలి! ఐ షేర్డ్ ది లింక్ ఆన్ మై ఫెస్బుక్ పేజ్!

  • థాంక్యూ సుభాష్ గారూ . స్పందించి, మీ ఫేస్ బుక్ లో షేర్ చేయడం మరింత సంతోషం.

 • గొరుసు ఇంట్రో చదివాక కథలోకి మరోసారి ప్రవేశించాను. గొప్ప అనుభూతి కలిగింది. విస్తృతి మరింతగా బోధపడింది. ఈ శీర్షికకి పరమార్ధం ఇదే అనుకుంటున్నాను. గొరుసు ఖజానా లోంచి మరిన్ని నజరానాలు పాఠకులకు అందించాలి.

 • బూఅమ్మకు,రెడ్డికప్పిన శాలువా,వేదికలపై చేయించుకునే వందసన్మానలకు సమానం.రెడ్డి గర్వం అంతా గాలివానలో కొట్టుకు పోయింది.బూఅమ్మ బయటకు వెళ్ళి చేసే వాన స్నానం చదువుతుంటే కళ్ళు చెమర్చాయి.ఇలాంటి కధలు కుల,మతాలను కాళ్ళకింద తొక్కేస్తాయి.మతోన్మాదులు ఇలాంటి కధలు చదువుతారో?లేదో?ఈకధ పరిచయం చేసిన తర్వాత గొరుసు “నన్ను రెడ్డి గారూ అని సంభోదించవద్దు “అన్నారు.మరెలా పిలవాలో నాకు అర్దం కావడం లేదు.*రచయతతో పాటు,గొరుసుకి కూడా గొరుసు మాటల్లోనే అశ్రునయనాలు.

  • “మతోన్మాదులు ఇలాంటి కధలు చదువుతారో? లేదో?” – అనేది మీ అనుమానం 🙂
   డౌటా వెంకట్రావు గారూ – చదవరు!
   చదివితే తమలోని ఉన్మాదం అంతరించి, ఆ స్థానంలో మానవత్వం పేరుకు పోదూ!
   తాగుబోతులు “మందు ఆరోగ్యానికి హానికరం ” అన్న వ్యాసం చదువుతారటండీ ? ఇదీ అంతే మరి.
   మీ స్పందనకు ధన్యవాదాలు.

 • మనుస్యుల్లో –మానవత్వము దానవత్వము రెండు పరిస్తుతులకు తలవంచే వస్తాయి— ఆ కాస్సేపు—- రెడ్డి నిజంగా– మంచితనాన్ని-మనిషి తనాన్ని చూపించ వచ్చు– కాని పరిస్తితులు మారినప్పుడు– మళ్ళీ యధా ప్రకారము— కక్ష్యలు కావేషాలే కదా–

  • అవును ఉదయ రాణి గారూ .. మీరన్నట్టు పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ యధా ప్రకారమే.
   అందుకే నా ఇంట్రో లో ఇదే మాట ఉటంకించాను. మనిషిలో వివక్షత అనే వైరస్ పూర్తిగా అంతమయ్యే వరకూ – ఇది రావణ కాష్ఠమే ! స్పందించినందుకు కృతజ్ఞతలు .

 • ఏడాది క్రితం గొరుసు గారు నాతో చదివించిన కథ ~ కథకి మరోసారి దండం పెట్టుకున్న కథ~

 • ఏడాది క్రితం గొరుసు గారు నాతో చదివించిన కథ~ కథకి మరోసారి దండం పెట్టుకున్న కథ~

  కథకుణ్ణి కలవాలి అనిపించే కథ..

  సార్.. గొరుసు గారూ…

  • కథలు మాత్రమే చదివి అనుభవించి తరించు మౌళీ .. రచయితల్ని కలవాలనుకోవద్దు సుమీ .. సాహిత్యంపై విరక్తి పుట్టినా పుట్టగలదు. రాతలూ, చేతలూ ఒకటిగా జీవించడానికి చలం గారి వారసులున్నారనుకున్నావా ఇప్పుడు ?
   రచయితలున్నారు. తస్మాత్ జాగ్రత్త 🙂

 • బైపాస్ రైడర్స్ కథ కాదు మత ఛాందసులపై ఝళిపించిన కొరడా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు