మంటో  కథ – రెండో భాగం

తండ్రి కఠోరత్వం, తల్లి కారుణ్యం రెండూ అతడికి వచ్చాయి.  ఈ ద్వంద ప్రవృత్తి అతనిలోని గందర గోళానికి కారణ మయ్యింది.    ఆప్పుడప్పుడు కఠోరంగానూ ప్రవర్తించేవాడు, అప్పుడప్పుడు కారుణ్య మూర్తి గానూ ప్రవర్తించేవాడు. 

1

“నేనూ కాశ్మీరీ వాడనే!”

మంటో అంతరంగం లో కాశ్మీరీ, హాతూ, పంజాబీ అన్న మాటలు కొంత అలజడిని సృష్టిస్తూ ఉండేవి.   ఒక ధ్వని వినిపిస్తుంది – “ నీవు సమరాలో పుట్టావు, పెరిగావు. అందువలన నీవు పంజాబీ వాడివి  మాత్రమే. అసలు హాతూ ఎట్లా అవుతావు?”  మరో కంఠం అతనిని సవాలు చేస్తూ, అతడి ఎదురుకుండా సాక్షాత్కరిస్తుంది.  “మీ తాతముత్తాతలు కాశ్మీరీ వాళ్ళే.  అందుకే నువ్వు ఖచ్చితంగా కాశ్మీరీ వాడివే.”

కాశ్మీరీ – పంజాబీ…… పంజాబీ – కాశ్మీరీ ఈ మాటలు అతనిలో అలజడి, ఆందోళనా కలిగిస్తూనే ఉంటాయి.  అందుకే అతడు యిట్లా ఆలోచిస్తూనే ఉండేవాడు.  “అసలు తనెవరూ?   ఎక్కడ పుట్టాడు?  తన వంశ వృక్షం ఎక్కడిది? అసలు తన మజిలీలో ఎక్కడుంది?” ఎండా – నీడల రంగులలో నిండిన గాఢమైన చీకటి లోకి అతని మనస్సు వెళ్లిపోయింది.  అంతరంగం లోని పొరలలో అతని ప్రయాణం….  భూతకాలం లోకి …. ఒకటి రెండు శతాబ్దాల పూర్వ కాలం లోకి….. మొట్ట మొదట ఏమీ కనిపించలేదు.  అంతా చీకటి మయం.  కొన్ని క్షణాల తర్వాత చీకటి వెలుగుగా మారి పోయింది.  తను ఒక బైస్కోప్ కి ఎదురు కుండా కూర్చున్నట్లుగా ఒక దాని తర్వాత ఒకటి బొమ్మలు మాట్లాడుతున్నట్లుగా అనిపించింది.  ఎన్నో అస్పష్టమైన ముఖాలు కనిపిస్తున్నాయి.  వాటితో మమైకమైన అతని అంతరాత్మ ధ్వని వినిపించసాగింది – “నీవు కాశ్మీరీ వాడివే కావు, కాశ్మీరీ పండిట్ వి.” కాశ్మీరీ పండిట్ – వినగానే తడబడ్డాడు.

మళ్ళీ ప్రతిధ్వని …. “ఈ ముఖాలని సరిగా చూడు.  కాశ్మీరీ పండిట్ లలో సారస్వత బ్రాహ్మణుల శాఖకి చెందిన వాడవు నువ్వు.  ఆ కాలంలో బ్రాహ్మణులు సరస్వతీ నదీ తీరంలో నివసించేవారు.  అందువలననే సారస్వత్ లని పిలవబడ్డారు. నీకు తెలియదు గాని యిప్పుడు తెల్సుకో. మంటో, మనవటీలు కిస్తీ భాషా పండితులకు చెందిన శాఖలు.  ఈ కిస్తీ భాషా  పండితులు ప్రాచీన కాలంలో కాశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేవారు. వీరు చేతిపనులు చేసే వారి దగ్గర పన్నులు వసూలు చేసేవారు.  కిస్తీ భాషలో ఇస్లాం మతం తీసుకున్న వాళ్ళు మంటో లయ్యారు.  హిందువులు గా ఉండి పోయిన వాళ్ళు మనవటీ లయ్యారు.”  సాదత్ హసన్ కి నమ్మ సఖ్యంగా లేదు.  ఆలోచనలో పడ్డాడు.  అసలు తను ఎక్కడున్నాడు? ఏ శతాబ్దంలో ఉన్నాడు? మళ్ళీ ధ్వని వినిపించింది – “కళ్ళు తెరిచి చూడు.  నీవు పూర్వజులైన ఆ  పండితుల సంతానమే.  మంటో, మనవటీ జాతుల వాళ్ళు ఈనాటికీ కాశ్మీర్ లో ఉన్నారు.

శ్రీనగర్ లోయలలో ఎన్నో చోట్ల రెండు జాతుల వాళ్ళూ ఉన్నారు.  హిందువులలో కూడా మంటో జాతి వాళ్ళున్నారు.”  దృశ్యం, శ్రవ్యం, భూతకాలం, వర్తమానాలని కలుపుతున్న గారడీకి వశీభూతుడైనాడు సాదత్ హసన్.  మనస్సుల్లోని అట్టడుగు పొరలో నుండి బయటికి వస్తున్న ధ్వని విన్నాడు – “నీ జన్మస్థానం పంజాబ్ కాబట్టి నువ్వు నిస్సందేహంగా పంజాబీవే.  కానీ నీ పూర్వజుల వారసత్వం వలన నీవు కాశ్మీరీ పండిట్ వే.  అందుకే నీవు ఏ కాశ్మీరీ వాడైనా కనిపిస్తే గర్వంగా చెప్పుకుంటావు” – “నేను కాశ్మీరీ వాడినే.  కానీ అమృత్సర్ కి చెందినవాడిని.  భావుకత్వంతో, తన్మయత్వంతో అతనున్నాడు.”  ఇంతలో చీకట్లో ఎన్నో ముఖాలు కనిపించ సాగాయి.  ఒక ముఖాన్ని చూడగానే సాదత్ హసన్ ఒక్క సారిగా పెద్దగా కేక వేశాడు – “ఈయనెవడు? నాకు, ఇతనికి ఎందుకు పోలికలు కనిపిస్తున్నాయి?”  ధ్వని వినిపిస్తోంది – “పోలిక లెందుకుండవు? ఖాజా రెహమతుల్లా – 19 వ శతాబ్దంలో కాశ్మీర్ మహారాజా రంజిత్ సింగ్  ఆధిపత్యంలో ఉండేది.  కానీ అతనికి ముందే ఆఫ్గన్ పాలకుల అత్యాచారాలను, అన్యాయాలను సహించలేక కాశ్మీర్ నుండి పంజాబ్ (లాహోర్) కి వచ్చేశారు.  కాశ్మీర్ శాలువాలు ఇంతకు ముందు వాళ్ళ వాళ్ళు తయారు చేసేవారు.  ఆ వ్యాపారం వాళ్ళ కి వారసత్వంగా లభించింది.  దాన్ని వాళ్ళు బాగా అభివృద్ధిలోకి తెచ్చుకున్నారు.”

ఇంతలో ఆ ధ్వని తగ్గి పోయింది…. రెహ్మతుల్లా ముఖాన్ని తోసేసీ మరో ముఖం కనిపించింది సాదత్ హసన్ కి.  చీకటిలోనుంచి వెలుగు ప్రసరించింది.  ఆ ముఖాన్ని చూడగానే ఒళ్ళు పులకరించింది.  భావుకుడైపోయాడు.  ఆ వ్యక్తి లో తన తండ్రి పోలికలు ఎందుకు కనిపిస్తున్నాయి? మళ్ళీ ధ్వని వినిపించింది – “ఈయన రెహ్మతుల్లా మనవడు.  ఖాజా జమాలుద్దీన్ ఆయనే.  తన తాత వ్యాపారాన్ని అమృత్సర్ నుండి లాహోర్, బొంబాయి దాకా వృద్ధి పరిచాడు.  కానీ ఆప్పటికే మహారాజా రంజిత్ సింగ్ (1801 – 1839) సింహాసనం నుంచి దిగి పోయాడు.  ఇక ఆంగ్లేయులు విజృంభించారు.   హిందూస్తానీ చేతి పనుల వాళ్ళకి, ముఖ్యంగా పష్మీ వ్యాపారస్తులకి ఒక్కసారిగా దెబ్బ తగిలింది.  ఈ దెబ్బను సహించడం, వారసత్వ వ్యాపారాన్ని మానేయడం మంటో వంశస్థులపై పిడుగు పడ్డట్టయింది.  బతుకు తెరువు కోసం ఏ వ్యాపారం చేయాలీ, పెద్ద సమస్య ఎదురైంది.  అన్ని దారుల కంటే వకీలు గా బతకడమే నయం అనిపించింది.

2

నీళ్ళు – నిప్పు

రండి మిమ్మల్ని సమరాల, లూధియానా జిల్లా, పంజాబ్ తీసుకెళ్తాను.  1912 మే 11 న సాదత్ హసన్ మంటో జన్మించాడు.  సమరాల చిన్న పల్లెటూరు.  పంజాబ్ లోని పల్లె ప్రజల జీవితం, జానపద గీతాలు, సామెతలు బహుశ ఆయనకి ఇక్కడే వంట బట్టి ఉంటాయి.  ఆయన రచనలలో వీటి ప్రతిబింబం స్పష్టం గా కనిపిస్తుంది.  కొంత కాలానికి మంటో తండ్రి గులామ్ హసన్ కి జడ్జి గా అమృత్సర్ ట్రాన్స్ఫర్ అయ్యింది.

గులామ్ హసన్ ముఖంలో పోలికలే కాదు, వస్త్రధారణ, జీవన విధానం అంతా కాశ్మీరీలలాగానే ఉండేది.  ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.  మొదటి భార్య జాన్ బీబీ. ఆమె బడీ బేగమ్.  ఆవిడకి తొమ్మిది  మంది సంతానం.  అందులో ముగ్గురు మగ పిల్లలు.  గులామ్ హసన్ రెండో భార్య సర్దార్ బేగమ్.  ఇంటి వాళ్ళు కాబూల్ కి చెందిన వాళ్ళు.  తర్వాత లాహోర్ లో స్థిరపడ్డారు.  బాల్యం లోనే సర్దార్ బేగమ్ తల్లిదండ్రులు చనిపోయారు.  మొదటి పెళ్లి విఫలం కావడం తో  గులామ్ హసన్ తో నిఖా అయ్యింది.  ఈవిడకి ముగ్గురు పిల్లలు.  వాళ్ళల్లో సాదత్ హసన్ చిన్న వాడు.  అక్కయ్య నాసిర ఇక్బాల్ అతనికన్నా వయసులో చాలా పెద్దది.  సాదత్ హసన్ కి తల్లి అంటే అమితమైన ప్రేమ. ఎంతో గౌరవం.  తల్లికీ కొడుకంటే అంతే ప్రాణం.  తండ్రితో సాదత్ హసన్ దూరం దూరంగా ఉండేవాడు.  తన పెద్దక్కయ్య నాసిర అంటే భయంతో పాటు గౌరవం కూడా  ఉండేది.

ఆ కుటుంబం మధ్య వర్గానికి చెందింది.  తిండికీ, బట్టలకీ ఏ లోటూ లేదు.  కానీ, గులామ్ హసన్ రిటైర్ అవ్వడంతో ఆదాయం తగ్గడం వల్ల  ఆర్ధిక సమస్యలు ఎదురయ్యాయి.  అప్పటికి సాదత్ హసన్ అక్కయ్య నాసిర గడప దాట లేదు.  ఇద్దరికీ ఆలనా పాలనా లో కొంత బేధం వచ్చింది.  చదువులో కూడా కొంత వెనక బడ్డారు.  అతడి పసి మనస్సు పై రకరకాల ప్రభావాలు పడ్డాయి. తండ్రి కోపిష్టి స్వభావం కలవాడు.  కొడుకు పై అన్నీ ఆంక్షలే.  ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఒక చట్రం లో బంధించాలన్న స్వభావం తండ్రిది.  ఈ చట్రాన్ని విరక్కొట్టాలన్న స్వభావం కొడుకుది.

తండ్రి కఠోరత్వం, తల్లి కారుణ్యం రెండూ అతడికి వచ్చాయి.  ఈ ద్వంద ప్రవృత్తి అతనిలోని గందర గోళానికి కారణ మయ్యింది.    ఆప్పుడప్పుడు కఠోరంగానూ ప్రవర్తించేవాడు, అప్పుడప్పుడు కారుణ్య మూర్తి గానూ ప్రవర్తించేవాడు.  నాటకాలు, రంగస్థలం అంటే మంటో కి మొదటి నుంచీ యిష్టం.  అలాగే మంటో కి గాలి పటాలు ఎగరేయడం అంటే కూడా యిష్టం.  తండ్రికి పతంగ్ బాజీ అంటే చచ్చే డంత కోపం.  అందుకే తండ్రి ఇంట్లోనుంచి ఎప్పుడు వెళ్లిపోతాడా అని ఎదురు చూసేవాడు.

తల్లిని ఆయన బీబీ జాన్ అని పిలిచేవాడు.  తల్లికి కొడుకంటే అమితమైన ప్రేమ.  కానీ తండ్రి ప్రేమ కించిత్ అయినా దొరకలేదు.  తండ్రీ కొడుకులకు పడేది కాదు.  సవతి అన్నయ్యలు మంటో కన్నా వయసులో చాలా పెద్ద వాళ్ళు.  మంటో స్వేఛ్చా ప్రియత్వాన్ని, జీవన పద్ధతులని  వాళ్ళు సహించే వాళ్ళు కాదు. సవతి తల్లి, అన్నయ్యలు తనకి ఏ సహాయం చేసినా, తనని ఉద్ధరిస్తున్నట్లు అనుకొనేవారు.  లాయర్ల వంశం లో ఇటువంటి వాడు పుట్టడం చూసిని వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలిగించేది.  అయితే మంటో అందరి లా కాకుండా వివిధ రచనలు చేస్తూ తనదైన ఒక ముద్రను సంపాదించుకున్నాడు.  తన కొత్త దృష్టి తో దానికి పదును పెట్టుకున్నాడు.

మంటో అల్లరి, ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడం అంతా తండ్రికి తెల్సు.  అయినా తల్లి, అక్కయ్యా మంటో ని వెనకేసు కొచ్చేవారు.  తను అనుకుంటున్నట్లుగా చేయడం లేదని తండ్రి కోప్పడితే, మంటో భయపడి పోయి తండ్రి చెప్పిన పనులకి వ్యతిరేకమైన పనులను చేసేవాడు.  తండ్రి, సవితన్నలూ మంటో ఎందుకూ పనికిరానివాడిగా లెక్క కట్టేవాళ్లు. మంటో ని తండ్రి ఎన్నో సార్లు  తిట్టేవాడు,   కొట్టేవాడు.  ఇక ఇంట్లో ఉండలేనని మంటోకి అనిపించింది.  బొంబాయికి పారిపోయాడు. తల్లి చాలా బాధ పడింది.

                                                                    (ఇంకా వుంది)

డాక్టర్ వసంత

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి విషయాలను తెలియజేసారు. ధన్యవాదాలు

  • చాలా ఆసక్తికరంగా రాశారు. ఇంకా తెలుసుకోవాలని ఎదురుచూపు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు