అదొక జీవితకాల నిర్మాణం

దారుల్లో చూపుల్ని
పారేసుకుంటాం
ఏరుకోవడానికి తిరిగి వస్తామో
రామో తెలియదు
కాలం నీ సొంత ఇంటినే
అతిథి గృహంలా మార్చేస్తుంది
నీతో మాట్లాడిన మొక్కలు
చెట్లు అవుతాయి
పిట్టలు లోకాన్ని ఖాళీ చేసి పోతాయి
జ్ఞాపకాలు మిగిలిపోతాయి
ప్రపంచం రెండుగా విడిపోతుంది
పాత ప్రపంచం, కొత్త ప్రపంచం
పాత ప్రపంచంలో నువ్వు అమాయకుడివి
కొత్త ప్రపంచంలో నేరస్థుడివి
మరో ప్రపంచం ఉందేమో కనుక్కునే క్రమంలో
ఉన్న రెండు ప్రపంచాలను మరిచిపోయే మూర్ఖుడివి
దేహంలో ప్రాణం ఎక్కడ ఉందో
తెలియదు
దేహం విడిచి ప్రాణం ఎక్కడికి పోతుందో
తెలియదు
ఈ ప్రాణాలకు, ప్రాణులకు యజమాని ఎవరో
అస్సలు తెలియదు
యజమాని లేని ఉద్యోగంలో
నీ పాత్రను నువ్వే మలుచుకుంటూ
పోతున్న రోజువారీ కూలీవనే సంగతి
నీవే కనిపెట్టలేవు
అనుభూతికీ, సానుభూతికీ
మధ్య
ఆనవాయితీగా నీవు కుర్చీలోనే కూలబడి ఉంటావు
వృద్ధుల కన్నా
వృద్ధులైన మంచాల మీద
రోగాలతో పురోగమిస్తూ
మన పడుచు వృద్ధులు
వృద్ధ పడుచులు
అనుభవాల ఉపనిషత్తులు వినిపిస్తుంటారు
నీ చెవుల్ని ఏ చైనా వాడికో
అప్పగించి ఉంటావు
లేదా వాడే ఆక్రమించి ఉంటాడు
వినిపించుకోవు
విశ్వం ఎంత పెద్దదో
నీ బాధలు అంతే పెద్దవి
అనుకుంటావు
తప్పు లేదు
మనం ఎప్పుడూ పెద్ద బాధల్నే మోయాలి
మన బతుకులు ఎంత చిన్నవైనా సరే
గుమ్మాన్ని
పూలతో అందంగా అలంకరించినట్టుగా
నిన్ను నీవు ఆత్మగౌరవంతో
అందంగా అలంకరించుకో
ఆత్మగౌరవం అద్దెకు దొరకదు
అమీర్‌పేట్ అంగట్లో అమ్మరు
అదొక జీవితకాల నిర్మాణం
*

ఇంద్రపాల శ్రీనివాస్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.