అక్షర హాలికులకు సాక్షర సత్కారం

ట్టి – మౌలిక పదార్థం. మట్టి లేకుంటే జీవం లేదు. జీవం లేకుంటే మనిషి లేడు.

మట్టి విలువను పసిగట్టిన మనిషి ‘రైతు’గా రూపెత్తాడు. మట్టితోనే స్నేహం కట్టాడు. మట్టిమీదే పెట్టుబడి పెట్టాడు. మట్టిలోంచే సంపద సృష్టించాడు. ఇదంత తేలిగ్గా పట్టుబడలేదు. ఇందుకోసం నిరంతరం ప్రకృతితో యుద్ధం చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు. అదో ముగింపులేని సజీవ జీవన పోరాటం. పరిసమాప్తి కాని ప్రహసనం.

ఆ ప్రహసనాల సారాన్ని రచయిత- కథలుగా గంపలకెత్తాడు. కవి- గేయాల రూపంలో కీర్తించాడు. విమర్శకుడు- వ్యాసాలతో వ్యాసార్థాలు గీశాడు.

‘కలం’కారులు, ‘గళం’కంఠులు, ‘దృశ్య’మానుల గురించి; వారి అమూల్యమైన భాగస్వామ్యం గురించి పట్టించుకున్న వారు ఎంతమంది ఉన్నారు? అసలున్నారా?

గభాల్న సమాధానం చెప్పటం కష్టమే.

అరుదైన ఆ బృహత్కార్యాన్ని భుజాలకెత్తుకొని, ‘ఇదిగో, నేనున్నా’నంటూ ముందుకొచ్చారు… వలేటి గోపీచంద్. కొంతకాలం హైదరాబాదు దూరదర్శన్ వ్యవసాయ విభాగంలో పనిచేసి, ఆ తర్వాత మూడు దశాబ్దాలకుపైగా ఆకాశవాణిలో విధులు నిర్వహించిన గోపీచంద్ గారికి మట్టిపై మాత్రమే కాదు; ఆ మట్టిని ప్రేమించే రైతులపైనా, ఆ రైతుల్ని గౌరవించే పాత్రికేయులపైనా అమితమైన గౌరవం.

తాను చదువుకున్న బాపట్ల వ్యవసాయ కళాశాల ప్లాటినమ్ జూబ్లీ నేపథ్యంలో ఆయన సంపాదకుడిగా వెలువరించిన ‘‘ఒక నేల అనేక ఆకాశాలు’’ సంకలనానికి పాఠకాదరణ లభించింది. ఆ శీర్షికే వర్తమాన పుస్తక ప్రపంచంలో ఓ సంచలనం. ఆ బాటలోనే ‘వెలుతురు తోవలు’, ‘వెలుగుపూలు’, ‘వెలుగు దివ్వెలు’ శీర్షికలతో మరో మూడు సంకలనాలు వెలువడటమే అందుకు నిదర్శనం. ‘‘మన నేలలే మన భవిత’’, ‘‘కలుపు యాజమాన్యం’’ పుస్తకాలు కూడా గోపీచంద్ గారి సంపాదకత్వంలోనే రూపు దిద్దుకొని వ్యవసాయ పరిజ్ఞానానికి చేర్పుగా నిలిచాయి.

ఆ ఉత్సాహంతో వెలువరించిన మరో సంకలనం ‘‘రైతన్నకు వెన్నుదన్ను’’. అన్నదాతకు అక్షరసైన్యంతోనూ, గాత్రసౌరభంతోనూ, దృశ్యమాధ్యమంతోనూ అండగా నిలిచిన వ్యక్తుల జీవనరేఖలనూ; వారి కృషి తీరుతెన్నులనూ ఆవిష్కరించటమే ఈ పుస్తకం ప్రధానోద్దేశం.

ఆకాశవాణి వ్యవసాయ ప్రసారాలకు నాందీ ప్రవచనం చేసిన గుమ్మలూరి సత్యనారాయణ దగ్గర్నుంచి దశాబ్ద కాలంగా కర్నూలు ఆకాశవాణి కేంద్రం ద్వారా రైతులకు చేయూతనందిస్తున్న గుర్రం చంద్రశేఖరా దాకా వరికంకుల్లా తలలూపుతూ మనతో సంభాషిస్తారు. అరుదైన వ్యక్తుల గురించిన విశేషాలు, ప్రముఖుల జననమరణాలు, పత్రికల ప్రత్యేక కథనాలు, వ్యవసాయ పత్రికల ముఖచిత్రాలు ఈ సంకలనంలో సందర్భానుసారంగా ప్రచురించటం చాలా బాగుంది.

ఆయా రచయితల ఛాయాచిత్రాలు, వ్యాసాలతోపాటు ప్రచురించిన తైలవర్ణ చిత్రాలు, ఫొటోలు కనువిందు చేస్తాయి. సాహితీవేత్త మందలపర్తి కిషోర్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులు ఘంటా విజయ్ కుమార్‌ల ముందుమాటలు గోపీచంద్ కృషిని తూకం వేయటానికి ఉపకరిస్తాయి.

పుస్తకం చివర్లో ‘‘చరిత్రలోకి’’ విభాగంలో తొలి తెలుగు వ్యవసాయ పత్రికల్లోని కొన్ని వ్యాసాలను చేర్చటం అభినందనీయం.

*****

‘‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు’’ అని చెప్పిన వేమన పద్యాన్ని ప్రస్తావించటంలోనే గోపీచంద్ ఉద్దేశం నిబిడీకృతమై ఉంది.

జీవించిన 93 ఏళ్లలో ఏకంగా 63 ఏళ్లపాటు వ్యవసాయ పాత్రికేయుడిగా పని చేసిన వాసిరెడ్డి నారాయణరావు; రైతే శ్వాసగా, ధ్యాసగా వ్యవసాయ విభాగం ప్రణాళికలు సిద్ధం చేసి, వ్యూహాలు రూపొందించిన కోనేరు వెంకట సుబ్బారావు; ప్రపంచంలోని ప్రతి రైతూ తలెత్తుకుని తిరగాలనీ, అదే తన జీవిత పరమార్థమనీ భావించిన యలమంచిలి హనుమంతరావు; పశువైద్య విద్యాబోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో అకుంఠిత దీక్షతో పని చేసిన ప్రొఫెసర్ జి.ఎన్.రావు; వ్యవసాయ రంగానికి ఊతంగా నిలిచిన ఈశ్వర వరప్రసాదరెడ్డి; పంటపొలాల్లో తన కెమేరాను పరుగులు తీయించిన దూరదర్శన్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ బొగ్గవరపు వెంకట్రావు; ఆకాశవాణి వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం సహాయ సంచాలకులుగా రైతన్నకు పెద్దపీట వేసిన డాక్టర్ కె.విజయ; ‘ఈనాడు’లో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించింది మొదలు ఈనాటికీ వ్యవసాయ, దాని అనుబంధ కార్యక్రమాల రూపకల్పనకే అంకితమైన అమిర్నేని హరికృష్ణ; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్న ‘పాడిపంటలు’ మాసపత్రిక సారథిగా గుర్తింపు పొందిన హరగోపాలరాజు; సాగుబడే సర్వస్వంగా తన రాతల్నీ దృశ్యాల్నీ సృజించిన పంతంగి రాంబాబు; ‘రైతునేస్తం’, ‘పశునేస్తం’, ‘ప్రకృతినేస్తం’ పత్రికలను త్రికరణశుద్ధితో నిర్వహిస్తూ పద్మశ్రీ పురస్కారం అందుకున్న యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు ఈ పుస్తకం వేదికగా మనతో హాయిగా మాట్లాడతారు. వారి కృషిని తెలుసుకున్న తర్వాత మన మనసుల్లో కరతాళధ్వనులు మోగుతుంటాయి.

నాణ్యమైన పేజీలు, కళ్లకు ఆహ్లాదం కలిగించే వర్ణచిత్రాలు, అలసటకు తావులేని ఫాంట్లు, పేజీల పొడవునా ఆసక్తిని కలిగించే అంశాలు, చటుక్కున ఆకట్టుకునే శీర్షికలు పుస్తకం విలువను పెంచటానికి ఆలంబనగా నిలుస్తాయి.

డాక్టర్ ఐవీ సుబ్బారావు స్మారక కమిటీ, రైతునేస్తం పబ్లికేషన్స్ సంయుక్తంగా ప్రచురించిన 184 పేజీల ఈ పుస్తకానికి డాక్టర్ టి.ఎల్.ఎన్. స్వామి గారి ముఖపత్రం అదనపు అందాన్ని చేకూర్చింది.

వలేటి గోపీచంద్ (9441276770) గారి కృషి అభినందనీయం. ముఖ్యంగా ఈ పుస్తకం చివరి అట్టపై కళ్లు చెదిరే ఫొటోల సమాహారంతోపాటు ప్రచురించిన కాళోజీ కవిత గోపీచంద్ సాహితీ పరిజ్ఞానానికి ప్రబల నిదర్శనం. ఆ కవిత మీకోసం…

‘‘నర్తకుని నాట్యాలు

గాయకుని గానాలు

వాదకుని వాద్యాలు

శిల్పకుని శిల్పాలు

అంగనల అందాలు

కందర్పు కయ్యాలు

కవిరాజు కావ్యాలు

కర్షకా… నీ కర్రు కదిలినన్నాళ్లే!’’

(‘రైతన్నకు వెన్నుదన్ను’ ప్రతులకు @ 9441276770)

*

ఎమ్వీ రామిరెడ్డి

పూర్తి పేరు మువ్వా వెంకటరామిరెడ్డి. పుట్టిందీ పెరిగిందీ గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామం (ప్రస్తుతం అమరావతిలో భాగం). రామ్‌కీ ఫౌండేషన్ అధ్యక్షుడిగా విధి నిర్వహణ. బిందువు, మనిషి జాడ, అజరామరం, అనిర్వచనం కవితాసంపుటాలు; వెన్నలో లావా, వెంట వచ్చునది, స్పర్శవేది కథాసంపుటాలు; విస్తార, ప్రస్తార వ్యాససంపుటాల ప్రచురణ. ఈ పుస్తకాలకు వివిధ సంస్థల నుంచి పాతికపైగా అవార్డులు.
తండ్రి స్మారకార్థం ‘మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్’ స్థాపించి; పెద్దల కోసం వృద్ధాలయం, నిరుద్యోగ యువతకోసం స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. పెద్దలు, పిల్లల సౌకర్యార్థం ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు. అడపాదడపా సాహిత్య కార్యక్రమాల నిర్వహణ. ట్రస్టు తరఫున ఇప్పటిదాకా 16 పుస్తకాల ప్రచురణ.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.