అంగీకారం

స్త్రీ పురుషులదే పై చేయి అయిన మన సమాజంలో పురుషుల రకరకాల మనోభావాలపై వచ్చిన కథలెన్ని?? ఇక సమాజం ఒక గుర్తింపు, గౌరవం ఇవ్వలేని వారి గురించి కథ రాస్తే నిష్ఠూరాలు కాక మరేం ఆశిస్తాం?

థకు అర్థం వినోదం మాత్రమే కాదనీ…

కథంటే మానసికోల్లాసానికి చదివే నాలుగు పేజీలు కాదని….

 కథంటే వివక్షను ఎదుర్కొన్న కళ్లు సంధించే ప్రశ్నలనీ,

కథంటే అసమానతలు తట్టుకోలేని గుండె పలికే చప్పుడనీ,

కథంటే అవమానాలకు గురయ్యే మనసు ఒలికే కన్నీళ్లని చెపుతాయి మానస ఎండ్లూరి కథలు. 

అది దళిత క్రైస్తవ జీవితాలకు సంబంధించిన ఇతివృత్తమైనా, ట్రాన్స్ జెండర్ ల  జీవితమైనా, ఆడపిల్లల మనసులోని అంతులేని అంతస్సంఘర్షణైనా ….మొహమాటం లేకుండా రాయడం మానస ఎండ్లూరి శైలి.  అసమానతలనూ, వివక్షలనూ కొరడా ఝళిపించినట్లు ఎండగడుతూనే…. మరోవైపు వ్యంగ్యాన్ని,హాస్యాన్ని ఒలికిస్తారు. సీరియస్ ఇతివృత్తాన్ని చర్చిస్తూనే, సెటైర్లతో చురుక్కుమనిపిస్తారు. సూటిగా, సరళంగా రాస్తూ… కథేదైనా ఒక్కముక్కలో చదివించగలగడం మానస కథల బలం.

మానస ఎండ్లూరి రాసిన బొట్టు భోజనాల… కథలను ఒక వర్గం ప్రశంసిస్తే, మరో వర్గం తీవ్ర విమర్శలు గుప్పించింది. “అటు ప్రశంసలు, ఇటు విమర్శలు ఏవైనా నన్ను ప్రభావితం చేయవంటూ….సమాజంలోని అనేక చీకటి కోణాల్ని వెలికి తీస్తూ కథలు రాస్తూనే ఉంటాన”ని నిర్మొహమాటంగా చెపుతున్నారు. ఇటీవలే మిళింద పేరుతో తన మొదటి కథా సంకలనం వెలువరించి పాఠకుల ఆదరణ చూరగొన్న…. యువ కథా రచయిత్రి మానస ఎండ్లూరి కథ “అంగీకారం ”….. ఈ పక్షం  రేపటి కథ.

*

  అంగీకారం

రాజకుమారి వంటింట్లో అంట్లు తోముతోంది…

ఆమె భర్త నటరాజు పడగ్గదిలో మంచమ్మీద కాళ్ళు చాపుకుని టీవీలో ఏం చూడాలో తేల్చుకోలేక చానల్స్ మార్చడానికి రిమోట్ బటన్స్ ని అదే పనిగా నొక్కుతూనే ఉన్నాడు. అతనికి టీవీ చూడడం అంటే ఏ క్రికెట్ మ్యాచో, తెలుగు సినిమా కామెడీ సీన్లో లేక ‘చికెన్ తినిందని భార్యను హత్య చేసిన భర్త’ లాంటి ‘రసవత్తరమైన’ వార్తో అయ్యుండాలన్నమాట.

అలసిన కళ్ళు మూతలు పడుతుండగా ఓ నిరంతర వార్తా వాహినిలో ప్రసారమౌతున్న దృశ్యం చూసి చల్లని నీళ్ళు మొహం మీద కొట్టినట్టైంది నటరాజుకి. వీపు నిటారుగా పెట్టి బాసిమఠం వేసుక్కూర్చుని మొహం ముందుకి పెట్టి కళ్ళు విప్పార్చి టీవీ చూస్తున్నాడు.

అమెరికాలో ఇద్దరు అందమైన ఎన్నారై కుర్రాళ్ళు వివాహమాడుతున్న దృశ్యాలవి. నటరాజు చెవులు రిక్కించుకుని వింటున్నాడు. ఎవరా అబ్బాయిలు? ఎందుకు ఈ విపరీత పనులు చేస్తున్నారు యువత ఈ మధ్య? క్షణకాలంలో ఎన్నెన్నో సందేహాలూ అనుమానాలూ.

“రాజీ…” కేక పెట్టాడు.

వినబడదని అతనికి తెలుసు. గదిలో టీవీ మోగుతోంది, ఏసీ ఆన్ లో ఉంది, తలుపేసుంది. ఆమె రెండు గదులవతల వంటింట్లో ఉంది. ప్రతి సారీ గదిలో నాలుగు సార్లు అరిచి గానీ బయటకి వెళ్లి పిలవడు. ఈ సారీ అంతే.

నీళ్ళ శబ్దంలో కంచు మోగినట్టు వినిపించిన భర్త గొంతుకి విసుక్కుంటూ తడి చేతులు కొంగుకి అడ్డుకుంటూ వచ్చింది రాజీ.

“ఏంటండీ” మంచమ్మీద కూర్చుంటూ అడిగింది.

“అటు చూడవే”

ఆ వార్త పూర్తయ్యే లోపు నటరాజు కుళ్ళు జోకులు వెర్రి నవ్వులు రాజీ గంభీరమైన మౌనం నిండుకున్నాయి ఆ గదిలో.

“మొగోడు మొగోడ్ని పెళ్లి చేసుకోవడమేవిటే..ఏం చేస్కొడానికి?” వెక్కిలి నవ్వుతో అడిగాడు నటరాజు.

“అందులో అంత నవ్వాల్సిన పనేముంది? ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకునే అవకాశముంది కాబట్టి చేసుకున్నారు” టీవీ వైపు నుండీ మొహం తిప్పకుండా చెప్పింది రాజీ.

“మగవాడి మీద మగవాడికి ప్రేమేవిటే పిచ్చి మొహవా! పైగా అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు. అంత చదువుకుని ఇవేం పనులు? అసలా పెద్ద వాళ్ళననాలి! దగ్గరుండి మరీ సాంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిపిస్తున్నారు చూడు. వరూవరుళ్ళు మధ్యలో ముసి ముసి నవ్వులూ, బుగ్గలు గిల్లుకోడాలూ, ఏంటీ ఘోరం?” వ్యంగ్యంగా ఆశ్చర్యంగా అన్నాడు నటరాజ్.

“లేకపోతే మనలా ఎడ మొహం పెడ మొహం పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలంటారా? అదేదో తంతు నడుస్తూ ఉంటుంది, మన మొహాల్లో ఒక సంతోషం, ఉత్సాహం ఉండదు. ప్రేమనేది ఒకటేడిస్తే అలా నవ్వుకుంటూ ఆనందంగానే చేసుకుంటారు పెళ్ళిళ్ళు. ప్రేమకి మగేవిటి? ఆడేవిటి? రెండూ అయితే ఏవిటి? ఆ కుర్రాళ్ళిద్దరూ అదృష్టవంతులు. వాళ్ల తలిదండ్రులు అర్ధం చేసుకున్నారు, పెళ్లి చేశారు. మధ్యలో మీకేంటి దురద? మీ అమ్మా బాబు మా అమ్మా బాబుల్లా డబ్బు, రంగూ, ఎత్తూ, కులం చూసి చెయ్యాలా? ఆ అమెరికా అబ్బాయిలు కూడా కుల మతాలూ చూసే చేసుకున్నట్టున్నార్లేండి! కులం కలిస్తేనేగా కొన్ని మనసులు ఒకటైయ్యేది”

“చాల్లే ఎక్కువ్వాక్కు! వాళ్ళలో మొగుడెవడు? పెళ్ళామెవడన్నట్టు? కాళ్ళిరగ్గొట్టి ఆడపిల్లలతో పెళ్లి జరిపిస్తే వాళ్ళే దారికొస్తారు. అది మానేసి వాళ్లు తానా అంటే పెద్దాళ్ళు తందానా అనడమేంటో”

“ఇద్దరూ మొగుళ్ళే. అదేం పెద్ద సమస్యా! అయినా మీరే అన్నారుగా వరూవరుళ్ళని. ఇన్నాళ్ళు అలా ఆడపిల్లలకిచ్చి పెళ్లి చేసి, వాళ్లతో బతకలేక ఆత్మహత్యలు చేసుకోవడం, లేక ఆ అమ్మాయిలని వేధించడం లాంటి అన్యాయాలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇక చాలవంటారా? ఎవరు ఎవర్ని పెళ్ళి చేసుకున్నా ప్రేమతో బ్రతకితేనే ఆ జీవితానికి ఒక అర్ధం”

“మరి పిల్లలు? ఒంటరిగా ఎలా ఉంటారు? ఆఖరి రోజుల్లో ఏం చేస్తారు?”

“హహ్హహ్హా! మనలాగా పిల్లల్ని కనడం కోసమే ఓ ముక్కూ మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేస్కోలేదు వాళ్లు. ప్రేమించుకున్నారు, ఒకరికొకరు కట్టుబడి ఉండడానికి సమాజం ముందు ఒకటవ్వాలనుకున్నారు. శేష జీవితం కోసం పిల్లల్ని కనేంత స్వార్ధం తెలీదు పాపం వాళ్లకి. అంతగా కావాలంటే ఆడా మగా సక్రమంగా కని వదిలేసిన పిల్లల్ని పెంచుకుంటారులెండి! అసలు వాళ్లు పెళ్ళెందుకు చేసుకున్నారనేది మీ పెద్ద సందేహం. మీరెందుకు పెళ్లి చేసుకున్నారో చెప్తారా కాస్త”

నటరాజు ఆలోచనల్లో పడ్డాడు. భార్య కాస్త కొత్తగా కనబడుతోంది. ఎప్పుడూ ఏవో పనికిరాని విషయాలు మాట్లాడుకోడం తప్ప ఇలాంటి సంఘటనెప్పుడూ అతనికి ఎదురవలేదు.

“ఆలోచించకండి. అసహ్యమేస్తుంది” మొగుడి మొహంలోకి సూటిగా చూస్తూ అంది రాజీ.

“ఒక మగవాడు ఇంకో మగవాడికి ముద్దు పెట్టడంకంటేనా?”

“మీరు ఆడదాన్నేగా చేసుకున్నారు! పెళ్లై పిల్ల పుట్టి ఇన్నేళ్ళవుతున్నా నాకో ముద్దిచ్చారా? ముద్దు పేరు పెట్టి పిల్చారా? యజమాని నౌకరు పిలుపులు తప్ప మన మధ్య ఏమున్నాయి గనక?” నిష్ఠూరంగా అనింది రాజి.

“ఇదేంటే ఏదేదో మాట్లాడి ఆఖరికి నా మీద పడి ఏడుస్తావే? యజమాని నౌకరు ఎవరు మధ్యలో?”

“ఇంకెవరు? మీరూ…నేను! నేనూ సుబ్బులు మిమ్మల్ని ‘మీరూ’ అనేగా పిలుస్తాం. మీరూ మమ్మల్నిద్దరినీ ‘నువ్వూ’ అనేగా అంటారు. నా కన్నా ఆమే నయం. ఇదిగో అదుగో ఓయ్ ఒసేయ్ లాంటివి అనిపించుకోకుండా పేరు పెట్టి పిలిపించుకుంటుంది మీ చేత.

హ్! ప్రేమ లేకుండా పెళ్లి జరిగిపోతుంది…మాట లేకుండా మొదటి రాత్రి ముగుస్తుంది…కుశల ప్రశ్నలు లేకుండా కాన్పులూ జరుగుతాయి…పులకింతలు లేని గతంలోకి తొంగి చూస్తే ఒక అపరిచితుడ్ని పెళ్లి చేసుకోడం, నా అస్తిత్వం వాడి చేతుల్లో పెట్టడం, పిల్లల్ని కనే సామర్ధ్యం ఉంది కాబట్టి కనడం, వంట వార్పూ, ఇల్లు దులుపుకోడం, కారం ఆడించుకోడం తప్ప మధురానుభూతులేమున్నాయి!”

నటరాజు అహం దెబ్బతింది. అతనికి రోషం పొడుచుకొస్తోంది. ఆమె అసంతృప్తుల్ని ఒప్పుకోలేకపోవడమే కాదు, వినలేకపోతున్నాడు కూడా.

“ఏంటే! నీకంత ప్రేమించే హృదయముంటే ఎవడి వెంటన్నా పడి వాడ్నే చేస్కోవాల్సింది. పెద్దోళ్ళకి తలొంచి నన్నెందుక్కట్టుకున్నావ్? ముద్దు కావాలంట ముద్దు ఈ వయసులో”

“అదే చేతనైతే మిమ్మల్నెందుకు చేసుకునే దాన్ని! పెళ్లిలో ప్రేమ ఉంటుందనుకుని నాలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఎగబడి చేసుకుంటున్నారు గానీ జీవితం ఇంత జీవం లేకుండా చస్తుందంటే ఎవరు సాహసిస్తారు? నా బాధ ప్రేమ, ఆప్యాయత, మర్యాద, స్నేహంగా ఉండడం గురించి. కేవలం మదం పట్టిన ముద్దు గురించి కాదు. ఆ అబ్బాయిలని చూడండి. గుండెల్నిండా ప్రేమ. రెండు చేతులా సంపాదన. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడమే వాళ్ల పని. ఎంత అదృష్టం!”

“అంటే? నేను సంపాదించట్లేదా? నీకేం లోటు చేశాను? ఎంత అన్యాయంగా మాట్లడతావే. ఛీ! మొన్నేగా ప్రమోషన్ కూడా వచ్చింది”

“సంపాదిస్తారు. ప్రమోషన్లు వస్తాయి, అరియర్లు వస్తాయి. వాటి వల్ల మీ అమ్మానాన్నలకి, అక్కా చెల్లెళ్లకి మంచి జరుగుతుంది కానీ నాకూ నా కూతురికి ఏం చేశారనీ? పెళ్ళిళ్ళకీ ఫంక్షన్లకీ వెళ్ళాలంటే సిగ్గుపోతుంది. ఇంట్లో  పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లనుంచుకుని మీ అక్క కొడుక్కి గొలుసు చేయిస్తారు, చెల్లెలి కూతురికి కమ్మలు కొనిస్తారు. అదీ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా”

“అవునే! ఓ కొడుగ్గా మేనమామగా నాకు బాధ్యతలున్నాయి. నేను కాకపొతే ఎవడు చేస్తాడు?”

“మొగుడిగా, తండ్రిగా మీకేం బాధ్యతలూ లేవు. అంతేగా? పొదుపు మాకు. ఖర్చు వాళ్లకి! మీ కుటుంబం మీద మీకున్న ప్రేమ అదoతా. నన్నూ ప్రేమించుంటే నాకూ ఏదోక రోజు గ్రాము బంగారమన్నా కొనిచ్చేవారు. నోరు తెరిచి ఏదైనా అడిగితే ‘ఏంటి సందర్భం?’ అని తప్పించుకుంటారు. ఈ ఇరవైఏడేళ్ళలో ఒక్క సందర్భం కూడా దొరకలేదు కదా! అదే మీ వాళ్లకి కొనాలంటే రోజుకో సందర్భం పుట్టుకొస్తుంది నీకు. వివరాలు దాచడంలో, నన్ను కంట్రోల్ చెయ్యడంలో, పనులు చెప్పడంలో మాత్రమే నన్ను భార్యగా చూశావు గానీ మరే విషయంలోనైనా కనీసం మనిషిగా చూశావా! అదే నన్నూ  ప్రేమించుంటే అప్పుడప్పుడు చిరు గొడవలు పడ్డా మన జీవితం సుఖంగా ఉండేది. రెండ్రోజులు నేను మాట్లాడకపోతే నీ నిద్ర నీది. నీ తిండి నీది. నేనెలా పోయినా నీకు సంబంధం లేదు. ప్రతి చిన్న విషయంలో నన్ను అవమానించడం తప్ప నాతో ఏకీభవించడం చేతనవ్వదు నీకు. నీ కూతురికి కూడా నీలా ప్రేమించలేని వాడ్నే తీసుకురా! నాలాగే ఏడుస్తూ చస్తుంది బతికినంత కాలం”

రాజకుమారి అప్పుడప్పుడు ఇలాగే నటరాజు దుమ్ము దులుపుతుంటుంది కానీ ఈ సారి ఎప్పుడూ చెప్పని విషయాలు  ఒక్కసారిగా బయట పెట్టేసింది. కొంగుతో ముక్కు చీదుకుంటూ అక్కడ నుంచీ హాల్లోకెళ్ళిపోయింది.

నటరాజు నోట్లో మాట లేకుండా నిలబడిపోయాడు. మాట్లాడింది నా భార్యేనా? ‘నా’ అనడానికే సంకోచం. సిగ్గేస్తుంది.

“నిజంగానే నేనెప్పుడూ రాజీని ‘ఇంటి’ మనిషిగా చూశాను తప్ప సొంత మనిషిగా చూళ్ళేదు. పైకి ఒప్పుకోకపోయినా, అంతరాత్మ ముందు తలొంచాల్సిందే. తను చెప్పినట్టు ముందు నుంచీ ప్రేమించి ఉంటే నా జీవితం కూడా ఇంకా బావుండేది. ఒళ్లో పడుకుంటే కబుర్లు చెబుతూ నా తల్లో చేతి వేళ్ళు పోనిచ్చి చిలిపి అల్లరి చేసేదేమో. కానీ నేనెప్పుడూ తన వళ్ళో పడుకోలేదే! రోడ్డు మీద నడిచేటప్పుడు చేతిలో చేయి వేస్తే పులకించిపోయేదేమో! కానీ చేయి తగిలితే చిరాకు పడేవాడ్ని. నిజమే ముద్దూ మురిపాలు లేకుండానే యంత్రాల్లా పిల్లని కని బతికేస్తున్నాం. తనకు ప్రేమా ఇవ్వలేదు డబ్బూ ఇవ్వలేదు. నా తదనంతరం నాకున్నదంతా నా బిడ్డకే ఇస్తాను. మరి రాజీకి? అసలా ఆలోచనలే రాలేదు నాకు ఇంత వరకు. నా కోసం ఎంత చేసింది! నాకు జ్వరమొచ్చినా తనకు జ్వరమొచ్చినా తనే పనులు చేసేది. ఇదెక్కడి న్యాయం? ఇన్ని సంవత్సరాల తరువాత ఎవరో పెళ్లి గురించి తగాదా పడితే తప్ప నాకు తెలిసిరాలేదా? మొహమాటపడుతూ ఏడాదికో సారి పండక్కి చీర కొనుక్కుంటానని డబ్బులడిగితే కసురుకునేవాడ్ని. నేనే ఒక చీరెందుకు కొనివ్వలేకపోయాను? కారణం తెలియనట్టు నటిస్తావేరా నీచుడా! అడిగిందల్లా కొనిస్తే భార్య చెప్పు చేతల్లో ఉండదని. భార్యకు ప్రతి చిన్న సందర్భానికి ఏదో ఒకటి కొనివ్వడం అలవాటు చేస్తే దాని కొంగు పట్టుకు తిరుగుతున్నావని అందరూ అంటారు కాబట్టి. మరి నీ భార్య అడగకుండానే నీ కన్నీ చేసి పెడుతుంది కదరా నటరాజూ! ఎందుకు? నిన్ను భర్తగా ఒప్పుకుని, నిన్నే సర్వస్వం అనుకుని ప్రేమిస్తుంది కనుక. ప్రేమించని వాడ్ని కూడా ప్రేమించేంత గొప్పు మనసు గలది రాజీ. అందుకే ఆ కుర్రాళ్ళ ప్రేమని అర్ధం చేసుకుంది. ముందు రాజీకి ఏదైనా చెయ్యాలి” అనుకుంటూ అప్రయత్నంగా నటరాజు కళ్ళలోంచి కన్నీటి బిందువు రాలింది.

నటరాజు మనసులో సాలిగూడులా ఆలోచనలు ఒకదాని లోంచి మరొకటి  అల్లుకుంటున్నాయి. గతం, భవిష్యత్తు అతనికి ఏవేవో చెప్తున్నాయి…

ఇంతలో పక్షులు కిచ కిచా అరుస్తున్న కాలింగ్ బెల్ మోగింది. కూతురు అమృత ఆఫిస్ నుండి వచ్చుంటుంది అనుకున్నాడు.

“హాయ్ మమ్మీ! వేడి నీళ్ళు కాయవా. చాలా అలసిపోయాను.” తలుపు తీసిన రాజీతో చెప్పులిప్పుతూ అంది అమృత.

రాజీ మాట్లాడే మూడ్ లో లేదు. నిశ్సబ్దంగా వెళ్లి పొయ్యి మీద నీళ్ళు పెట్టింది.

‘బాత్రూంలో వాటర్ హీటర్ పెట్టించమని ఎన్ని సార్లు చెప్పినా ఈ మనిషికి చెవికెక్కదు. ఆవేశంలో ‘నువ్వు’ అని కూడా అన్నాను. అక్షింతలూ బానే పడ్డాయి. నా మాటలకి బాధ కలిగిందో ఏమో’ మనసులో అనుకుంటూ కూతుర్నే చూస్తోంది తదేకంగా.

‘దీని వయసుకి నాకు పెళ్లై బిడ్డ కూడా పుట్టేసింది. ఎంత కష్ట పడుతుందో పాపం’ అనుకుంటూ కూతురికి పళ్ళ రసం ఇచ్చింది రాజీ.

“అమ్మా! నీకో విషయం చెప్పాలి. నాన్నతో కూడా అనుకో. ముందు నీకు చెప్తా. నువ్వు నాన్నకి చెప్పాలి. ఓకే నా?” పళ్ళ రసం అందుకుంటూ చెప్పింది అమృత.

“ఏం చెప్తావో వెళ్లి మీయబ్బతోటే చెప్పుకో పో” విసుగ్గా అంది రాజీ.

అమృతకి ఒళ్ళు మండిపోయింది. “చెప్తా నాకేమన్నా భయమా! నా దగ్గరేగా నీ ప్రతాపం. నాన్న ముందు ‘ఏవండి ఏంటండి’ అని ఊడిగం చేసిపెడతావ్” ఎగతాళి చేస్తూ పడగ్గదిలోకి వెళ్ళింది అమృత.

“నాన్నా” నటరాజు మొహంలోకి చూస్తూ మెల్లగా పిలిచింది.

ఆలోచనల్లోంచి నూతన నటరాజు బయటకు వచ్చాడు.

“ఏంటమ్మా! పని ఎక్కువైందా? కళ్ళు లోపలికి పోయి మొహం పీక్కు పోయింది”

“అవును నాన్నా. అదీ…మీతో ఒక విషయం చెప్పాలి…” నసిగింది అమృత.

“చెప్పమ్మా”

“నేనూ…ఒకర్ని ప్రేమించాను…మా ఆఫీస్ లోనే…”

నటరాజు పెద్దగా అరిచి గోల చేస్తాడనీ, ముందు కోపంతో ముఖం ఎర్ర బడుతుందని అనుకుంది అమృత. కానీ అదంతా జరక్కపోగా ప్రశాంతంగా ఉన్నాడు. అతనికి వెంటనే అమెరికా కుర్రాళ్ళ పెళ్ళీ, రాజీ మాటలు మళ్ళీ చెవుల్లో మారుమోగుతున్నాయి.

‘మాలా కాకుండా తన కూతురు ఆనందంగా పెళ్లి చేసుకోవాలి, ప్రేమతో జీవితాన్ని ఆస్వాదించాలి. అమృత ప్రేమించింది అబ్బాయినైనా అమ్మాయినైనా నా అంగీకారం పూర్తిగా ఉంటుంది’ మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు నటరాజు.

రాజీ వేడి నీళ్ళు బకెట్ లో తెచ్చి పడగ్గదిలో ఉన్న ఎటాచ్డ్ బాత్రూంలో పెట్టడానికొచ్చిoది.

“తప్పకుండా నీ ప్రేమని గౌరవిస్తానమ్మా! మీయమ్మ కూడా ఒప్పుకొవాలిగా. ఇంతకీ నువ్వు ప్రేమించింది అమ్మాయినా? అబ్బాయినా?”

ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గదిలోంచి బయటకు నడిచింది రాజకుమారి.

 

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

 

                  *

                 కథల్లో నా జీవితం కనపడక ….నేను కథలు రాస్తున్నాను.

 

1-మానస గారు. ఇటీవలే మీ మొదటి కథా సంకలనం “మిళింద” ఆవిష్కరణ ప్రముఖుల మధ్య జరిగింది కదా.  సారంగ టీం, ఇంకా సారంగ పాఠకుల తరపున మీకు అభినందనలు. మిళిందకు స్పందన ఎలా ఉంది..?

ధన్యవాదాలండీ. నా కథలన్నీ పుస్తకంగా తీసుకురావాలని మిత్రులు, రచయితలు ఇచ్చిన ప్రేరణే మిళింద. పాఠకులు ఎప్పటినుంచో ఎదురు చూశారు ఈ కథా సంకలనం కోసం. ఈ సంకలనం ద్వారా వారికి మరింత దగ్గరయ్యాననే అనుకుంటున్నాను. ఎవరైనా ముందుగా చెప్పేది కథలన్నీ ఒక్క రాత్రిలోనే చదివాం అని. వింటుంటే సంతోషంగా అనిపిస్తుంది. నా వరకూ కథలంటే చదివించాలి. ఆ తర్వాతే “అది బావుందా, మంచి కథా , కాదా” అనే చర్చ మొదలవుతుంది.

2-మీ అమ్మానాన్నలిద్దరూ సాహిత్య కారులు. నాన్నగారు ప్రముఖ కవి. మరి మీకెప్పుడూ కవిత్వం రాయాలనిపించలేదా..?

ఈ ప్రశ్న వింటే నవ్వొస్తుంది. మనకు దేనిమీద ఎప్పుడు ప్రేమ కలుగుతుందో చెప్పలేనట్టే,  ఎవరు ఎప్పుడు రచయితగా మారుతారో చెప్పలేం.  రచనలో ఏ ప్రక్రియను ఎంచుకుంటారో వారి అభిరుచిని బట్టి, చదివిన దాన్ని బట్టి ఉంటుంది. అందుకు  కుటుంబంలోని రచయితల వారసత్వాన్ని అంటగట్టడం హాస్యాస్పదం. నా వరకూ నా తల్లిదండ్రుల వల్ల చిన్నతనం నుంచే చదవడం అబ్బింది. నాన్న చలం గారి మైదానం.. నా చేత ఏడో క్లాసులోనే చదివించారు. యండమూరి రచనలు స్కూలింగ్ లోనే చదివాను. కవిత్వం చదివింది, దాన్ని ప్రేమించింది తక్కువ.  చిన్నతనంలో ఏవో హైకూలు, కవితలు రాసిన జ్ఞాపకం అంతవరకే. కవితలు ఎందుకు రాయలేదంటే “మా నాన్న ఎందుకు కథలు ఎందుకు రాయలేదూ” అని అడగాలనుంది. నేను రాయలేనివి ఏవో నాలుగు పంక్తులు రాసి దానిని కవిత్వం అని పేరు పెట్టడం ఇష్టం లేక కవితలు రాయలేదు.

 1. ఐతే మీరు కథలు ఎందుకు రాస్తున్నారు…?   

నన్ను నేను చూసుకోడానికే కథలు రాస్తున్నాను! నాకు చిన్నప్పటినుండి నవలలు కథలు చదివే అలవాటుంది. కాకపోతే గత రెండేళ్ళ నుంచే రాయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి పత్రికల్లో వచ్చే ప్రతి కథా చదివాను, చదువుతున్నాను. నేను చదివిన కనీసం వంద కథల్లో ఎక్కడా నేనా పాత్రల్లో, ప్రదేశాల్లో, సంఘటనల్లో కనిపించలేదు. ఏ కథనూ వాటి పాత్రల్లో నన్ను నేను చూసుకుని చదవలేకపోయాను, కథల్లో ఇమడలేకపోయాను. ఒకటీ రెండు కథలు తప్ప అన్ని కథలూ బయటి మనిషిగానే చదివాను. కొన్ని కథలైనా ఏదోక పాత్రలో నన్ను చూపిస్తాయని ఆశించి చదువుతూనే ఉన్నాను. ఇక్కడ ‘నేను’ అంటే ఏకవచనం కాదు. ఒక సమూహం, ఒక వర్గం, ఒక జాతి. అమ్మానాన్నల వల్ల నాకు సాహిత్యo పరిచయముంది కాబట్టి చిన్నప్పడు హైకులు, చిన్న చిన్న కవితలు, కథలు నా డైరీలో రాసుకునేదాన్ని. అదే ఈ రోజు కథలు రాయడానికి సాయపడింది.

 1. కథ సమాజం పై…ప్రభావం చూపుతుందని నమ్ముతారా..?

కచ్చితంగా నమ్ముతాను! కానీ అది విస్తృతంగా జరగదన్నది తెలిసిన విషయమే! సమాజంలో మార్పు రావడానికి సాహిత్యం కూడా అవసరమవుతుంది తప్ప సాహిత్యం మాత్రమే సరిపోదు. పెద్దల కవితలు, కథలు చదివి మారిన వారిని నేను ప్రత్యక్షంగా చూశాను.

 1. ఐతే మీరు రచయితకు సామాజిక బాధ్యత ఉంటుందని నమ్ముతారా. ?

ఉండొచ్చు. కానీ ‘సామాజిక బాధ్యత’ అని దాన్నొక ఆంక్షగా తీసుకోవాలిసిన అవసరం లేదని నేను భావిస్తాను. బాధ్యతని ఒక పరిమాణంగా తీసుకుని సమాజంలోని చీకటి కోణాలని చూపకపోవడం, భిన్న వాస్తవాలకు దూరంగా ఉండడాన్ని నేను ఒప్పుకోను. సామాజిక బాధ్యతను ఒక స్థాయికి మించి కొలమానంగా తీసుకోడం వల్ల కొన్ని సార్లు పాఠకులను బాధ పెట్టకూడదని పనిగట్టుకుని కథను సుఖాంతం చేయడం, వాస్తవాలను దాచడం చేయాల్సివస్తుంది! అప్పుడే కథలు కృత్రిమంగా కనబడుతాయి.

 1. మొదటి కథ తాలూకు అనుభవాలు, నేపథ్యo వివరిస్తారా..?

నా మొదటి కథ ‘గౌతమి’ 2014లో ‘విహంగ’ అంతర్జాల పత్రికలో వచ్చింది. అప్పట్లో నేను తెలంగాణా రావాలని కోరుకుంటున్నా మరో పక్క రాష్ట్రం నెత్తుటి గుర్తులతో విడిపోవడం నన్ను బాగా బాధపెట్టింది. మనం శాంతంగా విడిపోలేదు. దాడులు, బలవన్మరణాలు, ద్వేషాలతో రెండు గుండెలూ రగిలిపోయాయి! ప్రాంతాలు విడిపోయినా భూమి కలిసే ఉన్నట్టు రాష్ట్రాలుగా విడిపోయినా మన మనసులు కలిసే ఉంటాయన్నది కథా వస్తువు. అది నిజంగా రాజమండ్రిలో ఉంటున్న నాకూ హైదరాబాద్ లో ఉంటున్న మా రక్త సంబంధీకుల మధ్య జరిగిన కథే!

 1. మీకు నచ్చిన కథా రచయిత, కథ?

ఇది కాస్త కష్టమైన ప్రశ్నే! నచ్చిన రచయితలు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో నన్ను ఉద్వేగానికి గురిచేసిన కథ పివి సునీల్ కుమార్ గారు రాసిన ‘పరిశుద్ధ వివాహం: మూడవ ప్రకటన’. ఆ కథ చదివే నాటికే నేనూ అదే శీర్షిక, అలాంటి కథా వాతావరణంతో, కాకపోతే పూర్తిగా భిన్న వస్తువుతో ఓ కథ రాశాను. అది నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది! ఆ కథ ‘మెర్సీ పరిశుద్ధ పరిణయం’ అనే శీర్షికతో ఇటీవలే ‘నమస్తే తెలంగాణా’లో ప్రచురితమైoది. నన్ను నాకు కళ్ళకు కట్టినట్టు చూపించిన సునీల్ కుమార్ గారి కథని ఎన్ని సార్లు చదువుకుని మురిసిపోయానో చెప్పలేను! దక్షిణామూర్తి, శేఖరం, కాంతం, శాంతం లాంటి మూస పాత్రల నుంచి గొప్ప ఉపశమనాన్ని అందించిన కథ అది. నన్నూ నా బంధుమిత్రులను ప్రత్యక్షంగా చూస్తున్నట్టే ఉంటుందా కథ. ఆ కథ నాలో ఉత్సాహాన్ని నింపింది. వనజ తాతినేని గారు రాసిన ‘మర్మమేమి?’, అద్దేపల్లి ప్రభుగారు రాసిన ‘ఇస్సాకు చిలక’, వినోదిని గారు రాసిన ‘బ్లాక్ ఇంక్’ కథలు అత్యద్భుతం!

 1. మీ రచనల మీద మీ పేరెంట్స్ ప్రభావం ఉంటుందా..?

ఉండదు! వాస్తవంలోంచి, జీవితాల్లోంచి రచన పుట్టినప్పుడు ఎవరి ప్రభావం ఉండదని నమ్ముతాను. నాకు సాహిత్యాన్ని పరిచయం చేసింది అమ్మా, నాన్న. ముఖ్యంగా నాన్న కథా రచనకు సంబంధించి ఎన్నో విషయాలు చెబుతారు. గొప్ప కథా రచయితల రచనలు నాకు పరిచయం చేస్తారు. ‘ఎలా రాయాలి’ కంటే ‘ఎందుకు చదవాలి’ అన్న విషయం మీద ఎక్కువ అవగాన కల్పిస్తారు. కథా రచన పై నాకు జ్ఞానం అందిస్తూ ప్రోత్సహిస్తున్న ఎంతోమంది ప్రముఖులలో ముప్పిడి ప్రభాకర్ రావు, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, చిలుకూరి దేవపుత్ర, శిలాలోలిత, కందుకూరి రమేష్ బాబు, ఖదీర్ బాబు, విల్సన్ సుధాకర్, అత్తలూరి విజయలక్ష్మి, పసునూరి రవీందర్, కల్పనా రెంటాల, అఫ్సర్ గార్లకు ఎప్పుడూ కృతజ్ఞురాలిని!

9-వయసు చిన్నదైనా,  ధైర్యంగా BOLD టాపిక్స్ రాస్తున్నారు.. ‘అదే ప్రేమ’, ఉల్పత్  లాంటి కథల నేపథ్యం ఏమిటి..?

వయసుకీ , బోల్డ్ టాపిక్స్ కీ సంబంధం లేదు. మన ముందుతరం వాళ్లు కూడా రాశారు. రచయితలు రకరకాల కారణాల చేత వెనకాడడం వల్లనే వారనుకున్నది రాయలేకపోతున్నారు. ఇప్పటితరం వాళ్లందరూ బోల్డ్ టాపిక్సే రాస్తున్నారు. నిజానికి అవి బోల్డ్ టాపిక్స్ కాదు. చేదు వాస్తవాలు. ఉల్ఫత్ కథ ఒక ట్రాన్స్ జెండర్ కథ. కొందరు ఆ పాత్ర కేవలం ఒక వేశ్య పాత్రగానే అర్థం చేసుకున్నారు. మంచిదే వారి పట్ల నాకు సానుభూతి, అత్యుత్యాహం కంటే సమాన భావన ఎక్కువ. మనతో పాటూ మన చుట్టూ జీవించే వారిని విస్మరించడం నేను భరించలేను. ఇప్పటి వరకూ వచ్చిన ట్రాన్స్ జెండర్ కథల్లో వారు పట్ట కష్టాలు వారి  సర్జరీలను, వివక్షలను చూపించారు. కానీ వారి ప్రేమ వ్యవహారాలను, ఆకర్షణ, సున్నితత్వం గురించి రాసిన కథే ఉల్ఫత్.

10. అదే ప్రేమ, బొట్టు భోజనాలు.. కథల మీద విమర్శలు కూడా వినిపించాయి. ?

విమర్శలు చాలా వచ్చాయి.  నా చాలా కథల మీద వచ్చాయి. అందరికీ నచ్చేట్టు, అందరూ కోరుకున్నట్టు ఓ రచయితా రాయలేరు. ఐతే ఈ విమర్శలన్నీ కూడా వస్తువుపైనే . ఏం రాయాలో కూడా వీళ్లే నిర్ణయిస్తారా అన్న అసహనం కలుగుతుంది. కానీ అవి నాపై ఏ ప్రభావాన్ని చూపవు. దాని తరువాత కూడా బలమైన కథలే రాశాను. ఆ విమర్శల్లో అర్థం, న్యాయం కనబడితే ఆలోచించేదాన్నేమో.

స్త్రీ పురుషులదే పై చేయి అయిన మన సమాజంలో పురుషుల రకరకాల మనోభావాలపై వచ్చిన కథలెన్ని?? ఇక సమాజం ఒక గుర్తింపు, గౌరవం ఇవ్వలేని వారి గురించి కథ రాస్తే నిష్ఠూరాలు కాక మరేం ఆశిస్తాం? నా రెండవ కథ ‘బొట్టు’ బహిరంగంగా కనబడని కుల వివక్ష మీద రాశాను. ఆ కథకు కూడా ప్రసంశల కన్నా శాపనార్ధలే ఎక్కువ వచ్చాయి. మనం నిజాలను ఇష్టపడలేం, ఒప్పుకోలేo. మరీ ముఖ్యంగా చదవలేం. చదివినా భరించలేం!

‘అదే ప్రేమ’ నాకు తెలిసిన ‘గే’ ల ప్రేమ కథ. కల్పిత కథ కాదు. ఎంతో మంది స్వలింగ సంపర్కులు అజ్ఞాతంగా నాకు అభినందనలు తెలిపారు. వారి జీవితాల గురించి వారే బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితికి చింతించారు. ఇక విమర్శలు ఎందుకు వస్తాయో ముందుగానే తెలుసు కాబట్టి పెద్దగా స్పందించనవసరం లేదని నా ఉద్దేశం. ఆ కథను కొన్ని పత్రికలు తృణీకరించాయి. ‘సారంగ’ ఆ కథను తీసుకురావడం గర్వించాల్సిన అంశం! కించపరిచే విమర్శలు చేసే వారిని ఒక రోజులో మార్చలేము. అర్ధం చేసుకోకపోయినా కనీసం వాళ్లు స్వలింగ సంపర్కుల్ని అవమానిoచకుండా, అవహేళన చేయకుండా ఉంటే చాలు!

 1. ఒక పాఠకురాలిగా…ఇప్పుడొస్తున్న కథలు ఎలా ఉంటున్నాయి….?

ప్రచురణకు నోచుకున్న ప్రతీ కథా బాగుందని చెప్పలేను. ఒకే కథను రకరకాలుగా చదువుతున్నట్టు ఉంటున్నాయి ఇప్పుడొచ్చే కొన్ని కథలు! అడపాదడపా తప్ప పెద్దగా భిన్నమైన వస్తువులు కనబడడం లేదు. ప్రముఖ పత్రికలన్నీ వ్యాపారం కోసమే అన్నట్టు ఎంతసేపూ రసహీన శృంగార కథలు, వాస్తవానికి అతీతమైన ఊహాత్మక కుటుంబ కథలే ప్రచురించడం వాళ్ళకి ఆనందంగానే ఉన్నా ఆ కథల్లో ఏదో ఒక అంశం బాగోక పోతుందా అని ఆశగా చదవడం పాఠకులకి ఒక హింస! ఎన్నో ఏళ్ళ నుంచీ స్త్రీల సాహిత్యం వస్తున్నా, స్త్రీ చీకటి కోణం నుంచీ రావాల్సిన కథలు ఇంకా ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో పురుషుల మనోభావాల పై, స్వలింగ సంపర్కుల పై రచనలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అవి రాసినా ప్రచురించే విజ్ఞత విశాల హృదయంగల సాహస సంపాదకులూ ఉండాలిగా!

ఇప్పుడు రాస్తున్న వారిలో మల్లికార్జున్, మహి బెజవాడ, కాశీ నాగేంద్ర, చైతన్య పింగళి కథలు మర్చిపోలేనివి. వస్తువు పరంగానే కాదు. శిల్ప పరంగా కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేవి.

12- చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ కథలు రాసినట్టున్నారు కదా. అంత శక్తి, ఉత్సాహం ఎలా..?

అవును. మూడేళ్లలో 23 కథలు రాశాను. 2016 మార్చిలోనే ఎనిమిది కథలు ప్రచురితమైనాయి. ఎప్పటి నుంచే పంచుకోవాలన్న తాపత్రయమే విరివిగా రాసేలా చేశాయి. అందులో దూకుడైన కథలూ ఉన్నాయి. తెలిసే రాశాను. కథలు రాయడానికి శక్తి, ఉత్సాహం, కలం-కాగితం కాదు. చెప్పగలిగే మనసుంటే చాలు.

 • మీ కథల్లో “మైదానం నేను..” మిగిలిన కథలకు భిన్నంగా ఉంటుంది కదా..?

మీకు మైదానం…..కథ భిన్నంగా ఉంటే మరొకరికి అర్థజీవి కంటే గొప్ప కథ లేదు (నేను రాసిన కథల్లో) అన్నారు. ఇంకొకరికి అమ్మకోలేఖ… వేరొకరికి నటీనటులు. అసలు భిన్నం అంటే ఏంటో నా కర్థం కాదు. వాస్తవానికి దగ్గరగా ఉండడం భిన్నం అంటున్నామంటే వెనుకపడ్డామనే అనుకుంటా.

మైదానంలో కథ చలం మైదానాన్ని ఉటంకిస్తూ రాశాను.  సినిమాల్లో, కథల్లో ఆడపిల్లలకు ఎంతో స్వేచ్ఛ, ప్రేమ దొరుకుతుందన్నట్టు చూపించి తీరా నిజజీవితంలో అవేవి దొరకని ఆడపి ల్లల మనోగతం ఈ కథ. ఎన్నో సినిమాల్లో మగవాడి జీవితాన్ని నాలుగు భాగాలుగా చేసి నలుగురు హీరోయిన్లను చూపిస్తారు. అదే పద్ధతి అమ్మాయిలకూ ఉంటుందన్న విషయాన్ని తెలిసినా జీర్ణించుకునే స్థితిలో ఉన్నామా. అనే ప్రశ్నకు సమాధానంగా రాసిన కథ ఇది.

*

మానస ఎండ్లూరి

మానస ఎండ్లూరి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మారుతున్న కాలానికి అనుగుణంగా చర్చించాల్సిన విషయాలు కొత్తగా ఉత్పన్నం అవుతుంటాయి ..పాతబడి ఒక ఫ్రేం లో ఇరుక్కపోయిన రచయితలు కొత్త విషయాలు చర్చించలేరు …చర్చించకుండా వదిలిన దానికోసం కొత్త కలం పుడుతూనే ఉంటుంది … ఇది నిరంతర ప్రక్రియ ..
  కథ బాగా వచ్చింది.. అభినందనలు మానస

  • నిజం సత్యా. కొత్త కథలు …కొత్త తరమే రాయాలి

 • Superb narration.ఆడపిల్ల గురించి ఇప్పటి తల్లి తండ్రుల్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా కూడా మారని వాళ్ళూ ఉన్నారు.ఇది తప్పనిసరిగా ప్రతీ భర్తా, తండ్రీ చదవాల్సిన కథ. అభినందనలు.

  • మారాలి నిత్య గారూ.మార్పును అంగీకరించాలి.
   స్పందనకు ధన్యవాదాలు

 • చాలా ఇళ్ళల్లో భార్యల అసంతృప్తి ఇలా ఏదో ఒక వంకతోనే బయట పెట్టగలుగుతారు.. ముఖాముఖి అడగలేక!! ఇక్కడ రాజీ కూడా మనస్సు లోని అసంతృప్తిని ఇలా కడిగి పారేసి..అతనిలోని మార్పు కు కారణమైంది..చాలా బావుంది కథ..అభినందనలు మానస గారూ????????

 • మంచి కాన్సెప్ట్.. బాగుంది. ముగింపులో కూతురు ప్రేమించింది అమ్మాయినా అబ్బాయినా అన్నది చెప్పకుండా మంచి పని చేశారు. అయితే, కథ ఇంకాస్త రియాలిస్టిక్ గా వచ్చి ఉంటే బాగుండుననిపిస్తోంది. దాదాపు ప్రతీవాక్యం సహజ సంభాషణలో భాగంలా కాకుండా కథకోసమే పుట్టినట్టుగా అనిపిస్తోంది. పైగా, అన్నేళ్ల సంసార జీవితంలో ఆమె మొదటిసారి burst అవడం దానిమూలంగా ఒకే సంఘటనలో అతనిలో మార్పు రావడం నమ్మబుల్ గా లేవు. ఇంతటి sensitive and serious విషయాల పట్ల అంత కరుకైన వ్యక్తుల కఠిన అభిప్రాయాలు అలా మారిపోవేమో అనిపిస్తోంది. It definitely takes time.
  మీ ఇంటర్వ్యూ చాలా నచ్చింది.. especially మీరు కథలెందుకు రాస్తున్నారన్న దానికి మీ సమాధానం బాగుంది. Keep writing and I wish you all success

 • కొత్త కథకుల్లో పూర్తీగా భిన్న వస్తువులను కథలో చర్చిస్తున్న మానస గారి కథలు నాకు చాలా ఇష్టం. కథే కాకుండా పాత్రల సున్నితత్వం, సూటిదనం, సంభాషణలు మరింత మెప్పిస్తాయి.

 • అంగీకారం :కథ చాల చాల బాగుంది మానస ఎండ్లూరి యువ కవిగా దూసుక పోతున్నందుకు అందంగా ఉన్నది నేను సారంగం ఛానెల్ ద్వారా ఈ కథ ను చదువగలిగినాను . నాకు చాల నచ్చింది నాకు చాల దగ్గరగా ఉన్న కథ గా అనిపిచ్చింది.
  సమాజంలో ఒక గుర్తింపు గౌరవం ఇవ్వలేని వారి గురించి రాస్తే నేను నిష్ఠురలాలిని ఒక వర్గానికి అయినా పర్వాలేదు అనే నే ద్యేర్యాన్ని మెచ్చుకుంటున్నాను.
  కథ అంటే
  వివక్షలని ఎదుర్కొన్న కళ్ళు సంధించే ప్రశ్నలని ,కథ అంటే అసమానతలను తట్టుకోలేని గుండె పలికే చెప్పుడని.
  ట్రాన్స్ జెండర్,దళిత క్రిస్తవుల బాధల్ని,ఒక సగటు మహిళా పురుషుడితో కనబడకుండ ఎదుర్కునే వివక్ష ..ను కనిపెట్టి రాసె విధానం బాగా నచ్చింది
  బయట హక్కుల గురించి పోరాడి అలసిన వృదాయాలకు ఇల్లే ఒక ప్రశాంతం అనుకుంటే ఆ ఇంట్లో జరిగే అసమానతల్ని ఎండగట్టడం లో ఎనుకకవుతున్న నాలాంటి ఎంతో మందికి ఈ కథ ఒక స్ఫూర్తి కలిగేలా ఉన్నది
  ఇంకొక్క ముచ్చట చెప్పాలి అమ్మ నాన్న ద్వారా సాహిత్యం చదవగలిగాను.నా ఇష్టంగా కథలను రాయడము ఎంచుకున్నాను అని మంచి స్పష్టత ఇచ్చావు …మిళింద … మరిన్ని మిగిలిన కథల్ని చదవకాలి కానీ నాకు అందుబాటులో లేక పోవడం తో చదవలేక పోయాను సారంగ ఛానల్ ద్వారా చదవగలుగుతున్నాను ఈ చానల్ని పెట్టిన వారికీ నా తరపున ధన్యవాదములు.మానస ఎండ్లూరి నీవు ఇంకా అనేక అంశాలమీద రాస్తూ మరింత ముందుకెళ్లాలని ఆశిర్వదిస్తు అల్ ది బెస్ట్ చెప్పుతూ …నీ కథలోని కన్నీటి బిందువుని నేను …మీకు తెలిసిన మేరీ మాదిగను . .తార్నాక హైద్రాబాద్

 • మన్నించండి చిన్న సవరణ
  నా కామెంట్ లో ఆనందంగా ఉన్నది
  అనే పదం బదులు అందంగా ఉన్నది అని రాసాను
  పాఠకులు సరిచేసుకొని చదవగలరని మనవి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు