Its Such A Beautiful Day

సినిమా కధలో పుట్టుకలు, చావులు, ప్రేమలు, విరహాలు, సామాజిక విప్లవాలు, యుద్ధాలు, ఇలాంటి big scale events ని తీసుకోవడానికి కారణం జీవితపు విస్తీర్ణాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఒడిసిపట్టుకోవాలనే. మన జీవితానికి మార్కర్స్ గా పనిచేసే (చేస్తాయని మనం నిర్ణయించుకునే) ఈ అంశాల ఆసరాతో జీవితాన్ని వ్యాఖ్యానిస్తుంది సినిమా. Its Such A Beautiful Day ఇందుకు భిన్నం. దీని దృష్టి అంతా సూక్ష్మం మీదే. Bill అనే ఓ పాత్ర జీవితంలో చాలా సాధారణంగా జరిగే విషయాల్ని తన ప్రత్యేకమైన animation తో మనకు చూపిస్తాడు దర్శకుడు. ఈ అతి సాధారణ జీవిత చిత్రణకి మనల్ని కట్టిపడేసే శక్తి ఎంతగా ఉందో సినిమా చూస్తే తెలుస్తుంది.

“There was a bush infront of her building in the shape of a heart and it made her cry every time she looked at it” అంటూ వస్తుంది voiceover ఒక చోట ఓ పాత్ర గురించి వివరించే క్రమంలో. ఈ trivial detail లో ఎంత జీవితం ఒదిగి ఉందో గమనిస్తే ఈ సినిమా చేసే విన్యాసం మనకు అర్ధమవుతుంది. మన జీవితంలో మన నియంత్రణ పెద్దగా లేని కలయికలు, బంధాలు, పరిస్థితులు, మన నియంత్రణ బొత్తిగా లేని ప్రాపంచిక పరిణామాలు human condition ని వివరించడానికి మంచి పనిముట్లే. ఐతే వాటన్నిటికంటే మన మనసు మూలల్లో, దాదాపు మన subconscious ముఖాద్వారాల వద్ద పోగైన వ్యక్తిగత వివరాలు ఇంకా నేర్పుగా మన గురించి మాట్లాడగలవని నిరూపిస్తుంది ఈ animated చిత్రం. అప్పుడప్పుడూ ఈ సినిమా చేసే surreal detours అందుకే చాలా సందర్భోచితంగా అనిపిస్తాయి. పైగా జీవితపు సారాన్ని చిలకాలనుకున్నప్పుడు భౌతిక శాస్త్రపు గోడల్లోంచి తప్పించుకెళ్లి నక్షత్రాల్లో తప్పిపోయి, అక్కణ్ణుంచి ఎండుటాకు గీతల్లోకి జూమ్ చేయకపోతే ఎలా?

ఓ నాలుగు గీతలతో పుల్ల చేతులు, కాళ్ళు గీసి, పైన ఓ సున్నా చుట్టి ఇదే protagonist అని ఇతని పేరు Bill అనీ మనకు పరిచయం చేస్తాడు దర్శకుడు Don Hertzfeldt. ఈ animation లోని సింప్లిసిటీకీ, ఈ పుల్ల బొమ్మలు తవ్వే లోతులకీ ఉండే వైరుధ్యం జీవితపు irony ని చక్కగా ఒడిసిపడుతుంది. Bill అనుదిన జీవితంలో అతను రొటీన్ గా చేసే పనుల్ని నొక్కి వక్కాణిస్తుంటాడు దర్శకుడు. ఇందాక అనుకున్నట్టు మన జీవిత భాగస్వాములు, మన ఉద్యోగాలు, మన ఇళ్ళు లాంటి పెద్ద పెద్ద విషయాల కన్నా మనం టీ లో కలుపుకునే చక్కర మోతాదు, ఎక్కువగా ఎంచుకునే దుస్తుల రంగు, ఏమీ తోచనప్పుడు ఆలోచించే పనికిరాని విషయాలు, పెన్నుతో సగం గీసి వదిలేసిన బొమ్మలు, ఇవే మన గురించి ఎక్కువ చెప్పగలవు.

Bill కి వచ్చే కలలను వివరిస్తూ అతనికి మొదటి దశల్లో ఉన్న dementia గురించి హింట్ ఇస్తాడు దర్శకుడు. Bill యొక్క విభిన్న జీవితానుభావాలు అన్నీ ఈ మానసిక రగ్మత లెన్స్ లోనుంచే కనిపిస్తాయి మనకి. అందుకని ఇది జీవితానికి ఒక సవ్యమైన portrayal కాదని కొట్టేయగలమా? అప్పుడు సవ్యమైన జీవితం అంటే ఏమిటన్న అతి చిక్కు ప్రశ్నలో ఇరుక్కుంటాం. చిత్రం మొదట్లో అంటాడు మనందరం ఈ తోలు కవచం తొడుక్కున్న మెదళ్ళం మాత్రమే అని. ప్రతీ మెదడూ పైకి ఎన్ని ఫోజులు కొట్టినా లోలోపల అవే భయాలు, సంకోచాలు, ఆశలు కలిగి ఉంటుందని. అంటే దాని రసాయన చర్యల్నే మనం జీవితంగా అనువదించుకుని అనుభవిస్తున్నాం. దాని నియంత్రణ, నియంతృత్వంలో జీవిస్తున్నాం. We are doomed to feel whatever it wants us to feel. మన మెదడు మనకు చెప్పేది నిజమైనా అబద్దమైనా దానికి మన స్పందన నిజమే కదా. అదే కదా జీవితం.

ఈ లోతుల్లోకి దిగి Bill అనే ఈ వ్యక్తి  వ్యక్తిగత వివరాల్లోంచి మనందరి జీవితాలపై వల విసురుతుందీ చిత్రం. చాలా విగత జీవితాల కధల్ని dark humor తో చెబుతాడు దర్శకుడు. Bill  బంధువొకాయన పిచ్చి పట్టి అడవులు పట్టి పోయిన వైనాన్ని వివరించి అతని మరణాన్ని ఇలా చూపిస్తాడు. “He slept in a field dreaming of the moon and died there. Two weeks later, a sunflower grew out of his head”. ఇలాంటి bluntness హృద్యమైన కధల్ని ఇంత బాగా చెబుతుందని నేను అనుకోలేదు ఇప్పటివరకూ.

తన మానసిక శారీరిక సమస్యలతో భారమైన జీవితాన్ని గడిపిన ఈ Bill కథ మనల్ని డిప్రెషన్ లోకి లాక్కెళ్లదు. పైపెచ్చు జీవితంపై మనకు మరింత మొహాన్ని రగిలిస్తుంది. Its Such A Beautiful Day అనే టైటిల్ dark humor స్పిరిట్ లో మన జీవితాల్లో absurdity పట్ల వ్యంగ్యాన్ని సూచించాడానికే కాదు, నేరుగా నిజాయితీగా కూడా ఆ మాట అంటున్నట్టు మనకు తెలుస్తుంది. ఎన్నో ఒడిదుకులు ఉన్న ఈ జీవితాన్ని ఎంత తిట్టుకున్నా ఎందుకు ఎన్నో రెట్లు ఇష్టపడుతూనే ఉంటాం. మనం అసలు అర్ధం చేసుకోలేని చావును దృష్టిలో పెట్టుకునే జీవితం అంతా ప్లాన్ చేసుకుంటాం. పక్కనే ఉన్నారు కదా అని ఇష్టమైన వాళ్ళను పట్టించుకోకుండా వదిలేస్తాం. ఈ విషయం స్ఫురించ్చినప్పుడల్లా రేపటి నుండి మారాలనుకుని మళ్ళీ మర్చిపోతాం. అందమైన విషయాలంటే పేరుపొందిన ఫోటోగ్రాఫర్లు పరిచయం చేసే ప్రపంచ వింతలే అన్నట్టు కరెంటు తీగ మీద పచ్చగా పాకుతున్న పిచ్చి పాదుకి ఇవ్వాల్సిన మెప్పు ఇవ్వం. ఏ విషయం గురించి నిలకడగా ఆలోచించినా అందులో మనం నివ్వెరపోయేంత లోతు ఉందనే విషయం ఎక్కడో మెదడు వెనక గదిలో పడేసి బస్సు టైం అయిపోయిందని పరుగు పెడుతుంటాం. ఇవన్నీ ఉండజుట్టుకుని మన తీరిక వేళల్లో ఆలోచించినప్పుడు పెద్ద సముద్రపు కెరటాంలా వచ్చి మనల్ని నిలువెల్లా తడిపి పోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ సినిమా చూడటం అలాంటి అనుభవమే.

*

స్వరూప్ తోటాడ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • ఈ బిల్ కథ మనల్ని డిప్రెషన్ లోకి లాక్కెళ్లదు. పైపెచ్చు జీవితం మీద మోహాన్ని రగిలిస్తుంది…

    ప్రత్యేకించి ఈ రైటప్ గురించని కాదు , abstract painting లాగ చదువుతున్న కొద్దీ కొత్త ఆలోచనలు స్ఫురింప జేస్తూ. కొత్త కోణాలు ఆవిష్కరించే మీ వాక్యం మాజిక్ లో పడని వారెవరు??

    Wonderful, as always

    • Thanks a lot for the very kind words సుజాత గారూ. మీకు అంతగా నచ్చిన నా వాక్యం కూడా ఇంకా ఈ సినిమాకి న్యాయం చేయలేకపోయింది అని అనిపించేంత నచ్చిన సినిమా ఇది.

  • తెలుగు సాహిత్యం ఇహ ఊపిరి పీల్చుకోవడం షురూ మీ వాక్యం లో . వాక్య నిర్మాణం లో మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు మళ్ళీ ఇంకో decade దాకా రాకపోవచ్చు అయితే Isolated introvert ఆలోచనలు గానే వాటిని ఉంచాలా లేదా సామాజిక స్పృహ ఆత్మ ఆ రచనకి అందించాలా అన్నది పూర్తిగా మీ discretion , Anyways subject కన్నా మీ వాక్యం ఎంజాయ్ చేయడం కో మస్తు మజా ఉంది . కుడోస్ .

  • ఒక spell లో చదవకుండా save చేసుకుని ఆగి ఆగి morning coffee లా చదవాలి స్వరూప్ వాక్యాలను. జాగ్రత్త గా చెక్కినట్లు… ఎంత poetic expression ❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు